Monday, April 13, 2026

Chapter 79 Doubts of the Janamejaya - అధ్యాయము 79 జనమేజయునకు గల్గిన సందేహములు

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 79

జనమేజయునకు గల్గిన సందేహములు

జనమేజయుడి
ట్లనెను: ఆ దేవకన్యకలు నరనారాయణాశ్రమమున కేతెంచి మన్మథ పరవశలైరనియును శాంతుడైన నారాయణుని కామించిరనియు నంటివి. ఆ ధర్మపరాయణు డగు నారాయణుడు వారిని శపింప దలంపగ ధర్మవిదుడగు నరుడు నారాయణుని వారించెను. 

ఇంద్రునిచేత పంపబడిన దేవకాంతలు అర్థకామముల నర్థించువారై నారాయణుని ప్రార్థింపగ ఆ ధర్మసంకటమున నతడేమి చేసెను? ఆ దేవకన్యలు తమ్ము వివాహము గమ్మని మునిని పెక్కుసార్లు యాచించిరి. తుద కాముని యేమి చేసెను? శ్రీ నారాయణ మహర్షి చరితము మోక్షప్రదము. దానిని వినగోరుదును. సవివరముగ వినిపింపుము అన 

వ్యాసుడిట్లనెను: రాజా! నారాయణుడు ధర్మపుత్త్రుడు - ధర్మజ్ఞుడు - మహనీయుడు. అతనిని గుఱించి విపులముగ వచింతును - ఆలకింపుము. అట్లు నారాయణుడు దేవకన్యలకు శాపమీయ దలంపగ నరుడతని కడ్డుపడి నివారించెను దాన నారాయణుని కోపము శాంతించెను. 

ఆ మహా తపస్వియగు ధర్మనందనుడు చిరునగవుతో తీయని పలుకులతో వారి కిట్లనియెను : 

'ఓ వామాక్షులారా! నేనీ జన్మమున తపము చేయదలచితిని. ఇట్టి స్థితిలో మిమ్ము భార్యలుగ చేపట్టుట మా కెంతమాత్రమును తగనిపని. కనుక నాయందు దయయుంచి మీరిపుడు స్వర్గమునకు వెడలుడు. ధర్మజ్ఞు లితరులకు వ్రతభంగ మొనర్పరుగదా! 

ఓ సులోచనలారా! రసరాజమైన శృంగార రసమునకు స్థాయిభావము రతియగును. అది యిపుడు మాలో లోపించినది. ఇంక మాకు మీతోడి రాగ సంబంధ మెట్లు కుదురును? కారణము లేక కార్యమెన్నడును జరుగదు. కవులు శాస్త్రములందు స్థాయిభావమే రసమని నుడివిరి; మీ సహజమైన యనురాగమునకు పాత్రమనైతిని. 

కనుక నేనెంతయో ధన్యుడను. భాగ్యవంతుడను.

ఓ మహాభాగలారా! మీరలు దయచూసి నా వ్రతమును కాపాడుడు. నేను మరొక జన్మమున మీ కెల్లరకు పతిని గాగలను. 

ఓ విశాలాక్షులారా! నేను రాబోవు నిరువది యెనిమిదవ ద్వాపరమందు దేవకార్యమునకు భూమిపై నవతరింప గలను. అపుడు మీరు వేరు వేరు రాజులకు వేరు వేరుగ కొమరితలై పుట్టి నాకు భార్యలుగాగలరు. 

అపుడు నేను మిమ్ము తప్పక పరిగ్రహింతును'. అని యోదార్చి నారాయణుడు దేవకన్యలను వీడ్కొలిపెను. వారును సంతాప రహితలై వెడలిపోయిరి. 

అట్లు సురకన్యలు నారాయణుని వీడ్కొని స్వర్గముచేరి వారింద్రునకు జరిగిన దంతయు విన్నవించిరి. ఇంద్రుడా వృత్తాంత మంతయు విస్తరముగ నాలకించి యూర్వశి మున్నగు రమణులను గని నారాయణుని వేనోళ్ళ నిట్టులుగ్గడించెను: 

'ఔరౌర! ఆ ముని ధైర్యమే ధైర్యము. అతని తపోబలమే బలము. అతని తపో మహిమ వలన నూర్వశి మొదలగు సాటిలేని మేటి యందకత్తెలు సృజింపబడిరి. ఇట్లు సంస్తుతించి సురరాజు ప్రసన్నుడయ్యెను. ఇట ధర్మాత్ముడైన నారాయణుడును ధ్యానమున మునింగెను. 

రాజా! ఈ విధముగ నీ కత్యద్భుతము గొలుపునట్టి నరనారాయణుల చరిత్ర మంతయు వినిపించితిని. అట్లు భృగుమహర్షి శాపమున నరనారాయణులు భూభారహరణమునకై కృష్ణార్జునులుగ నవతరించిరి అనవిని 

రాజిట్లనియెను: ఓ మునివరేణ్యా! నాకు శ్రీకృష్ణుని యతిలోక చరిత్రము సవిస్తరముగ తేటపఱచి నా మదిలోని సందియము బాపుము. ఆ బలరామ కృష్ణులను పుత్త్రులుగ గన్న దేవకీ వసుదేవులేల వెతల పాలయితిరి. వారి తపమునకు మెచ్చి శ్రీహరి సాక్షాత్తుగ వారికి పుత్త్రుడయ్యెను గదా! ఇంక వారేల యినుప సంకెళ్ళలో బద్ధులై పెక్కుదినములు కంసునిచేత పీడింపబడిరి. 

మధురలో జన్మించిన శ్రీకృష్ణుడు గొల్లపల్లె కేల యరిగెను? అతడు కంసుని దెగటార్చి ద్వారావతి యందేల వసించెను?

పవిత్రమైన స్వదేశము తల్లిదండ్రుల ప్రేమామృతముతో నిండి స్వర్గమును తలదన్నును. అట్టి జన్మభూమిని విడనాడి కృష్ణుడు నింద్యమైన దేశాంతర మేల యేగెను? ఒక విప్రశాపమునకు గురియై యదువంశ మేల నశించెను? సనాతనుడగు వాసుదేవుడు భూభార మెట్లు పాపెను? హరి తన తనువు చాలించి దివి కేగెను గదా! అపుడు భూదేవి మోయరాని పాపాత్ముల బరువుచేత మరల కలత చెందెను. 

కొందఱు దుర్మార్గు లమిత బలవీర్యులైన కృష్ణార్జునులచే మడిసిరి. కాని, కృష్ణుని భార్యలను బాధించిన పాపులేల చంపబడలేదు? భీష్మద్రోణులు - కర్ణబాహ్లీకులు - వైరాటి - వికర్ణుడు - ధృష్టద్యుమ్నుడు - సోమదత్తుడు మున్నగు దుష్టు లెల్లరు నాలమున నంతమొందిరి. మఱి కృష్ణుడు చోరులనెల్ల చంపి పుడమి బరువేల దింపలేదు? 

తుదకు పతివ్రతలైన కృష్ణుని భార్యలును దుఃఖముల పాలైరి. ఇదంతయు చూడగ నా చిత్తమున నేదో సందేహము గలుగుచున్నది. ధర్మాత్ముడగు వసుదేవుడు పుత్త్ర దుఃఖమున పీడితుడై ప్రాణములు పాసి యపమృత్యువు నోట నేల పడెను? పాండవులు ధర్మయుక్తులును కృష్ణసక్తులును గదా! అట్టి వారు సైత మేల శోకము లనుభవించిరి? 

ద్రౌపది రమాంశ సంజాత - యజ్ఞవేదికాసంభూత - అదృష్టవంతురాలు గదా! ఆమెయు నేల దుఃఖములకు గురి యయ్యెను? ఆమె రజోవతిగా నండుగా దుశ్శాసను డామె నేల బాధించి యవమానించెను? ఆమె యైదుగురు చిన్ని కొమరు లింటనుండగా నశ్వత్థామ వారి నేల మట్టు పెట్టెను? వీరాభిమన్యుడు రణమున నేల నేలగూలెను? కంసుడు దేవకియొక్క యార్గురు కుమారుల నేల పొట్టపెట్టుకొనెను 

హరి సర్వసమర్థుడు కదా! అతడు విధి నేల మార్చలేకపోయెను?

యాదవులకున్న శాపములు - ప్రభాస తీర్థమున వారి దుర్మరణము - యదుకుల క్షయము - వారి భార్యలను కొల్లగొట్టుట - సాక్షాత్తుగ విష్ణువే యుగ్రసేనునకు దాసునివలె సేవ లొనర్చుట మున్నగు వింతలెల్ల యేల సంభవించకెను? 

ఇవన్నియును చూడగా శ్రీమన్నారాయణుడు సైతము సామాన్య ప్రాణుల పగిది వ్యవహరించెనను నభిప్రాయము నాకు గలుగుచున్నది. హరికిని సామాన్యులకు గలుగునట్లు హర్షకోశము లేల గలిగెను? ఈశ్వరుడైన శ్రీహరి సాధారణ మానవునివలె నేల ప్రవర్తించెను? లోకాతీతుడైన శ్రీకృష్ణుని మహామహిమలు నతని కర్మ విశేషములు నీ లోకమందెట్లు జరిగెను? నాకు వివరింపుము. 

మునిసత్తమా! ఆయువు మూడిన పిదప దానవు లెల్ల రెట్లును చత్తురు. కాని, యంత మహాశక్తిగల హరియును వారిని చంపుట కేల బాధపడెను? శ్రీ కృష్ణుడు రుక్మిణీహరణమున నామెను గొని పరుగెత్తెను గదా! ఇందు వాసుదేవుడొక్క దొంగవలె నేల ప్రవర్తించెను? లీలామానుష విగ్రహుడైన కృష్ణుడు జరాసంధునకు జంకి సకల సంపన్నమైన మథురానగరము వదలి ద్వారకేల యరిగెను? 

ఈ పనులన్నిట వలన కృష్ణుడు భగవానుడును ఈశ్వరుడునని యతని నెవరు నమ్ముదురు. అతడు గొల్లపల్లెలో నేల దాగెనో కొంచెము చెప్పుము. నా కిట్టి సందియములు పెక్కులు గల్గుచున్నవి. వాని నన్నిటిని నీవే తొలగింపవలయును. 

నాలో మరొక్క సందేహము చోటు చేసికొని నన్ను పీడించుచున్నది. అదేమన, పాంచాలి కైదుగురు భర్తలగుట లోకనింద్యము గదా! ధర్మమునకు సదాచారము ప్రమాణమని మనీషులు పేర్కొందురు గద! మఱి వారు సమర్థులయ్యు పశుధర్మము నెందుల కవలంబించిరి? 

భీష్ముడు దేవరూపుడు గదా! అతడు మాత్రమేమి చేయగల్గెను? అతడు గోళకులను సృజింపజేసి వంశమును గాపాడెను గదా! ఏ విధముగ నైనను సరే - పుత్త్రుని బడసి తీరవలయుననెడు మునుల ధర్మ నిర్ణయ మర్థము లేనిది గదా!

అధ్యాయము 80 శ్రీభూదేవి తన భారముబాప దేవతలను వేడుట

No comments:

Post a Comment

Bharatha Varsham - భారత వర్షం

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము -  భారత వర్షం శ్రీనారాయణు డిట్లనెను : ఇంక నాల్గు వేదములు పుట్టిన జీవధాత్రి కర్మభూమియగు పావన భారతవర్షమునందు న...