Wednesday, August 5, 2026

Gayatri Hridayam - గాయత్రీ హృదయం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ హృదయం

శ్రీ గాయత్రీ హృదయం
బ్రహ్మనందనా! ఇక ఇప్పుడు అత్యంత ప్రధానమైన గాయత్రీహృదయం చెబుతాను తెలుసుకో. సాధుకుడెవరైనాగానీ ఇష్టదేవతతో అభిన్నుడయ్యే అర్చించాలి. నాదేవో దేవమర్చయేత్‌ అని వేదం చెబుతోంది. కనక పిండబ్రహ్మాండాల సమైక్యాన్ని(అభిన్నతను) భావన చేస్తూ తన శరీరంలో దేవీరూపాన్ని ప్రతిష్టించుకోవాలి. గాయత్రీదేవి అంటే విరాడ్రూపిణి. మహాదేవి. వేదజనని. ఆ మూర్తిని సాధకుడు స్వశరీరంలో భావనామయంగా ప్రతిష్ఠించుకోవడమే గాయత్రీ హృదయమంటే.

పిండబ్రహ్మాండయోరైక్యాద్బావయేత్‌ స్వతనౌ తథా ।
దేవీరూపం నిజే దేహే తన్మయత్వాయ సాధకః ॥

నా
దేవోభ్యర్చయేద్దేవమితి వేదవిదో విదుః
తతో
భేదాయ కాయే స్వే భావయేద్దేవతా ఇమాః ॥

ఈ గాయత్రీహృదయానికి నారాయణుడు(అహమేవ) ఋషి. ఛందస్సు గాయత్రి. దేవత - పరమేశ్వరి. అంగషట్కం పూర్వోక్తమే. ఏకాంతంలో ఆసనబద్ధుడై ముందుగా ఏకాగ్రచిత్తంతో గాయత్రీదేవిని ధ్యానించాలి. అటుపైని అర్థన్యాసం - నా శిరస్సున ద్యులోకం, దంతపంక్తిలో అశ్వినులు, పెదవులలో ప్రాతస్సాయంసంధ్యలు, ముఖంలో ఆగ్ని, జిహ్వలో సరస్వతి, కంఠప్రదేశంలో బృహస్పతి, స్తనభాగంలో అష్టవసువులు, బాహువులలో మరుత్తులు(వాయువులు), హృదయంలో పర్జన్యుడు, ఉదరంలో ఆకాశం, నాభిలో అంతరిక్షం, కటిప్రదేశంలో ఇంద్రాగ్నులు, జఘనంలో విజ్ఞానఘనుడైన ప్రజాపతి, ఊరువులలో కైలాసమలయపర్వతాలు, జానువులలో విశ్వేదేవులు, జంఘలలో కౌశికుడు, గుహ్యంలో ఆయనాలు, ఊరువులలో పితృదేవతలు, పాదాలలో పృథివి, అంగుళులలో వనస్పతులు, రోమాలలో ఋషులు, గోళ్ళలో ముహూర్తాలు, ఎముకలలో గ్రహాలు, రక్తమాంసాలలో ఋతువులు, రెప్ప(పాటు)లలో సంవత్సరాహోరాత్రసూర్యచంద్రులు ప్రతిష్ఠింపబడుగాక - అని భావించాలి. సహస్రనేత్ర గాయత్రిని శరణువేడాలి.

ఓం తత్సవితుర్వరేణ్యాయ నమః, ఓం తత్పూర్వా జయాయ నమః, ఓం తత్ప్రాతరాదిత్యాయ నమః, ఓం తత్ప్రాతరాదిత్యప్రతిష్ఠాయ నమః - ఇలాగ నమస్కరించాలి. ప్రాతస్సంధ్యతో రాత్రిపాపమూ, సాయంసంధ్యతో పగటి పాపమూ నశించి సాయంప్రాతస్సంధ్యావందనాలు చేసినవాడు పాపరహితుడవుతాడు. సర్వతీర్థాలలోనూ స్నానంచేసిన పుణ్యాత్ముడవుతాడు. 

సకలదేవతలకూ పరిచితుడవుతాడు. అవాచ్యవచన ఆభక్ష్యభక్షణ అభోజ్యభోజన ఆచోష్యచోషణ అసాధ్యసాధన అగ్రాహ్యగ్రహణాది మహాపాపాలనుంచి విముక్తుడవుతాడు. దానప్రతిగ్రహదోషాలు తొలగిపోతాయి. పంక్తిదూషణ దోషం ఆంటదు. అనృతవచన దోషమూ అంతరిస్తుంది. అబ్రహ్మచారి బ్రహ్మచారి అవుతాడు. (అంతటి పవిత్రుడవుతాడని).

ఈ గాయత్రీ హృదయాన్ని అనుష్ఠించినవారేకాదు అధ్యయనం చేసినవారూ వెయ్యి యజ్ఞాలు చేసిన ఫలాన్నీ అరవైవేల మంత్రజపం చేసినపుణ్యాన్నీ చిటికెలో అనాయాసంగా పొందుతారు. ఎనమండుగురు బ్రాహ్మణులను చక్కగా పోషించిన ఫలం దక్కుతుంది. దీన్ని నిత్యమూ అధ్యయనం చేసిన బ్రాహ్మణుడు, బ్రహ్మలోకం చేరుకుంటాడు.

గాయత్రీ స్తోత్రం





No comments:

Post a Comment

Gayatri Ashtottara Sahasram - గాయత్రీ అష్టోత్తర సహస్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ అష్టోత్తర సహస్రం గాయత్రీ సహస్ర నామావళి నారదా! మహర్షీ! సాధు సాధు. అడగవలసింది అడిగావు. నువ్వు మహాప్ర...