Saturday, August 8, 2026

Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం

గాయత్రీస్తోత్రం
నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను. ఆదిశక్తీ! జగన్మాతా! భక్తానుగ్రహకారిణీ! సర్వవ్యాపికా! అనంతా! శ్రీసంధ్యా! నమోనమః. నువ్వే సంధ్యవు, గాయత్రివి, సావిత్రివి, సరస్వతివి, వైష్ణవివి, రౌద్రివి, రక్తవు, శ్వేతవు, కాళికవు. 

ప్రాతఃకాలంలో బాలాస్వరూపిణివి, మధ్యాహ్నంలో యువతివి, సాయంకాలంలో వృద్దవు. మునిపూజితవు, హంసవాహనవు, గరుడారూఢవు, వృషభవాహినివి, ఋగ్వేదం పఠిస్తూ తపస్వులకు దర్శనమిస్తావు. యజుర్వేదం పఠిస్తూ అంతరిక్షంలో విరాజిల్లుతావు. సామగానం చేస్తూ భూమండలమంతటా సంచరిస్తుంటావు. రుద్రలోక విష్ణులోక బ్రహ్మలోకాలు నీ నివాసభూములు. 

మానవులను అనుగ్రహించడమే నీ శీలం, నీ స్వభావం. ఓ మాయాదేవీ! సప్తర్షిప్రీతికారిణీ! బహువరప్రదా! పార్వతీపరమేశ్వరులకు నువ్వు చేతుల్లో కన్నుల్లో అశ్రుబిందువుల్లో స్వేదంలో జన్మించావు, నువ్వు ఆనందజననివి, దుర్గవు. 

ఓ వరేణ్యా! వరదా! వరిష్ఠా! వరవర్ణినీ! గరిష్ఠా! వరార్హా! వరారోహా! సప్తమీ! నీలగంగా! సంధ్యా! సర్వదా! భోగమోక్షప్రదా! స్వర్గంలో మందాకినివి, భూలోకంలో భాగీరధివి, పాతాళంలో భోగవతివి, నువ్వు త్రిలోకవాహినివి, త్రిలోకనివాసినివి, భూలోకంలో ధరిత్రివి - శోకధారిణివి. భువర్గోకంలో వాయుశక్తివి, స్వర్లోకంలో తేజోనిధివి, మహర్లోకంలో మహాసిద్ధివి, జనలోకంలో జననివి, తపోలోకంలో తపస్వినివి, సత్యలోకంలో సత్యవాక్కువు, విష్ణులోకంలో లక్ష్మీదేవివి, బ్రహ్మలోకంలో గాయత్రివి, రుద్రలోకంలో గౌరివి, హరుడికి అర్థాంగనివాసినివి.

తల్లీ! మహదహంకారాలకు(సంధాన) ప్రకృతివి నువ్వు. సామ్యావస్థారూపిణివి, శబల బ్రహ్మరూపిణివి, పరా - పరమా - పరాశక్తులు నువ్వే, ఇచ్చాక్రియా జ్ఞానశక్తులను ఇచ్చేదానవు నువ్వే, గంగా యమునా విపాశా సరస్వతీ సింధు నర్మదా గోదావరీ కావేరీ కౌశికీ చంద్రభాగా గండకీ గోమతీ వేత్రవతీ శతద్రూ సరయూ దేవికా ఇరావతీ వితస్తా తాపినీ ప్రముఖనదీనదాలన్నీ నువ్వే.

మానవశరీరంలో ఉండే ఇడా పింగళా సుషుమ్నా గాంధారీ హస్తిజిహ్వా పూషా అలంబుసా కుహూ శంఖినీ ప్రాణవాహినీ ప్రభృతి నాడీమండలం నువ్వే, హృదయపద్మంలో ప్రాణశక్తివి, కంఠంలో స్వప్ననాయికవు, తాలువులలో సదాధారవు, బిందుప్రదేశంలో బిందుమాలినివి, మూలాధారంలో కుండలినివి, కేశమూలాల్లో వ్యాపినివి, శిఖామధ్యాసనవు, శిఖాగ్రభాగంలో మనోన్మనివి. 

అమ్మా! వెయ్యేల. ఈ జగత్రయంలో సమస్తమూ నువ్వే. మహాదేవీ! శ్రీదేవీ! సంధ్యాదేవి! నమో నమః నమో నమః.

నారదా! ఈ గాయత్రి స్తోత్రాన్ని సంజవేళల్లో పఠిస్తే సమస్తశక్తులూ సిద్ధిస్తాయి. అపుత్రకులు పుత్రవంతులూ దరిద్రులు ధనవంతులూ అవుతారు. సర్వతీర్థ తపోదాన యజ్ఞఫలం లభిస్తుంది. భూలోకంలో శతాయుష్కుడై భోగాలు అనుభవించి ఆరోగ్యవంతుడుగా జీవించి కట్టకడపట అపునర్భవంగా ముక్తిపాందుతాడు. ఏ సమయంలో ఎక్కడ పఠించినా పుణ్యప్రదమే. ఎవరైనా పఠిస్తుండగా విన్నా పుణ్యమే. పీయూషధారవంటి స్తోత్రమిది.

నారాయణమహర్షీ! సర్వధర్మజ్ఞా! సర్వశాస్త్ర విశారదా! శ్రుతి స్మృతి పురాణ రహస్యాలెన్నెన్నో నీనోటినుంచి విన్నాను. అయినా ఇంకా తృప్తి కలగడంలేదు. అవిద్యను తొలగించి విద్యను కలిగించేది ఏది? బ్రహ్మజ్ఞానం పొందాలంటే ఏది దారి? ఐహికాముష్మిక సుఖాలతోపాటు మోక్షం కూడా కావాలంటోంది అంతరంగం. దీనికి సాధనమేమిటి? సారాంశంగా తెలియజేస్తివా నీ పుణ్యమా అని తరిస్తాను.

గాయత్రీ అష్టోత్తర సహస్రం





No comments:

Post a Comment

Gayatri Ashtottara Sahasram - గాయత్రీ అష్టోత్తర సహస్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ అష్టోత్తర సహస్రం గాయత్రీ సహస్ర నామావళి నారదా! మహర్షీ! సాధు సాధు. అడగవలసింది అడిగావు. నువ్వు మహాప్ర...