నారదా! ఇదీ భస్మత్రిపుండ్రాల మహిమ. ఇప్పటికి సమగ్రంగా చెప్పడమయ్యింది. ఇక వైష్ణవాగమాలు చెప్పే ఊర్థ్వత్రిపుండ్రాల గురించి చెబుతాను. ఆలకించు. దాని వర్ణాలూ మంత్రాలూ దేవతలూ ఫలాలూ ఆనీ సమగ్రంగా చెబుతాను. తెలుసుకో.
పర్వతాగ్రం నదీతీరం విశేషించి శివక్షేత్రం సముద్రతీరం పుట్ట తులసికోట - వీటిలో ఎక్కడినుంచైనా మృత్తికను స్వీకరించవచ్చు. మరింక ఏ మృత్తికగానీ పనికిరాదు. నల్లమట్టి శాంతికరం, ఎర్రమట్టి వశ్యకరం, పసుపుమట్టి శ్రీకరం, తెల్లమన్ను ధర్మప్రదం. ఈ మట్టిని బొటనవేలుతో ఊర్ధ్వపుండ్రంగా పెట్టుకుంటే పుష్టికరం. నడిమివేలుతో ఆయుష్కరం. అనామికతో భుక్తిదాయకం. చూపుడువేలుతో పెట్టుకుంటే ముక్తిదాయకం. ఈ నాలుగువేళ్ళే ఉపయోగించాలి. గోళ్ళు తాకనివ్వకూడదు.
ఈ నిలువుబొట్టు దీపం వొత్తిలాగానీ వేణుపత్రంలాగానీ(వెదురు ఆకు) తామరమొగ్గలాగానీ తీర్చిదిద్దుకోవాలి. మత్స్య కూర్మ శంఖాకారాల్లోనైనా పెట్టుకోవచ్చు. పది అంగుళాల పొడవుంటే ఉత్తమోత్తమం. తొమ్మిదంగుళాలుంటే మధ్యమం. అయిదు అంగుళాలవరకూ మధ్యమంగానే పరిగణన. నాలుగునుంచి రెండంగుళాలవరకూ కనిష్టం.
నొసట ఈ బొట్టు పెట్టుకునేటప్పుడు కేశవనామాన్నీ, పొట్టమీద నారాయణనామాన్నీ, గుండెలమీద మాధవనామాన్ని, గొంతుముడిక్రింద పెట్టుకునేటప్పుడు(కంఠకూపం) గోవిందనామాన్నీ, పొట్టకి కుడివైపున విష్ణునామాన్నీ, కుడి బాహువుమీద మధుసూదన నామాన్నీ, కుడిచెవికి పెట్టుకునేటప్పుడు త్రివిక్రమనామాన్నీ, పొట్ట ఎడమవైవున వామననామాన్నీ, ఎడమ బాహువుమీద శ్రీధరనామాన్నీ, ఎడమ చెవిమీద హృషీకేశనామాన్నీ, వీపుమీద పెట్టుకునేటప్పుడు పద్మనాభనామాన్నీ మూపుమీద పెట్టుకునేటప్పుడు దామోదరనామాన్ని స్మరించాలి. ఇలా పన్నెండు నామాలూ స్మరిస్తూ ఇదే క్రమంలో బొట్టులు పెట్టుకోవాలి. పూజాకాలంలో హోమసమయంలో సాయంప్రాతః సంధ్యాసమయాల్లో ఏకాగ్రచిత్తంతో కేశవాదినామాలు పలుకుతూ బొట్టులు ధరించాలి. శుచిత్వం సిద్ధిస్తుంది. వీటిని ధరిస్తే చాలు అతడు శ్వమాంసభక్షకుడైనా సరే మరణానంతరం దివ్యవిమానంలో విష్ణులోకం చేరుకుంటాడు.
కొందరు ఐకాంతిక వైష్ణవులు ఈ బొట్టును విష్ణుపాదాకారంలో సాంతరాళంగా (మధ్యన ఖాళీగా) ధరిస్తే మరికొందరు పరమైకాంతిక వైష్ణవులు మధ్యలో తిరుచూర్ణంతోగానీ పసుపుతోగానీ నిలువుబొట్టు కలపి(నిరంతరాళంగా) త్రిశూలాకారంలో ధరిస్తున్నారు. మరికొందరు వైష్ణవులు అచ్చిద్రంగా దీపశిఖా - పద్మముకుళ - వేణుపత్రాకృతుల్లో ధరిస్తున్నారు. ఇంకొందరు కేవల వైష్ణవులు అచ్చిద్రమో సచ్చిద్రమో - ఎలాగైనా ఏ ప్రత్యవాయవమూ లేదనీ, ఏదో ఒక బొట్టు వైష్ణవుడు పెట్టుకోవడం ముఖ్యమనీ అంటున్నారు, ఏ బొట్టూ పెట్టుకోకపోతే ఏకాంతులకైనా ప్రసన్నులకైనా పరమైకాంతికులకైనా ప్రత్యవాయం తప్పదు. కేశవాయ నమః ఇత్యాదిగా ద్వాదశనామాలనూ జపిస్తూ దండాకారంగా అచ్చిద్రంగా ఊర్ధ్వపుండ్రాలను ధరిస్తే చాలా శోభాయమానంగా ఉంటుంది. సాంతరాళంగా పెట్టుకుంటే ఆ మధ్యఖాళీలో రమాసహితుడై విష్ణుమూర్తి క్రీడిస్తాడు. నిరంతరాళంగా పెట్టుకుంటే లక్ష్మీశ్రీహరులను అక్కడినుంచి తరిమివేసినట్టే.
కొందరేమో - అచ్చిద్రంగా ఊర్వపుండ్రాలను పెట్టుకోవడంకూడా అంత ప్రశస్తంకాదు, ఏకవింశతి నరకాలకి పోతాడంటున్నారు. అంచేత ఊర్థ్వపుండ్రాలను సాంతరాళంగా ధరించడమే ఉత్తమం. దండాకార - దీపశిఖాకార - పద్మముకుళాకార - మత్స్యాకారాల్లో ధరించడమూ ప్రశస్తమే. శిఖలాగా యజ్ఞోపవీతంలాగా వైష్ణవుడికి ఈ ఊర్ధ్వపుండ్ర ధారణం నిరంతరంగా అనివార్యంగా ఉండవలసిందే. లేనిపక్షంలో ఏ సత్కర్మలూ ఫలించవు. నైష్ఠికులైన వైష్ణవులు త్రిశూల - వర్తుల - చతురస్రక - అర్ధచంద్ర - శివలింగాకారాల్లో ధరించరుగాక ధరించరు. జన్మతః వైష్ణవుడై వేదమార్గాన్ని అనుసరించేవాడు మరింక ఏ ఇతరాకారాల్లోనూ పుండ్రధారణ చెయ్యడు. చెయ్యకూడదు. ఒకవేళ వైష్ణవాగమాలలో ఖ్యాతికోసమో కాంతికోసమో కామ్యసిద్ధికోసమో ఇంకేవైనా ఆకారభేదాలు ప్రసక్తమైనా వాటిని వైదికవైష్ణవులు ధరించరాదు.
వీటిలో వైదిక శ్రౌత స్మార్తాదిభేదాలు చాలా ఉన్నాయి. దేని ఆకృతి దానిదే. కనక ఏ మార్గానికి చెందినవారు ఆ మార్గానికి చిహ్నంగా నిర్దిష్టమైన ఆకృతిలో ఉన్న బొట్టునే ధరించాలి. వేరే ఆకృతుల్లో ధరించకూడదు. ఏదియేమైనా - వైదిక మార్గానుయాయులు భస్మంతో తిర్యక్‌త్రిపుండ్రాలను, నారాయణ ప్రపన్నులు గంధజలంతోనో మృత్తికతోనో శూలాకారంలో ఊర్థ్వపుండ్రాలను ధరించి తీరవలసిందే. ఏ బొట్టూలేని శూన్యలలాటం ఎవరికీ ఎప్పుడూ తగదుగాక తగదు.
No comments:
Post a Comment