జానకి మాటలు విన్న హనుమంతుడు:
అమ్మా! పరమసాధ్వీమణీ నీ మాటలు నీ పాతివ్రత్యానికి నిదర్శనంగా ఉన్నాయి. నూరు యోజనాల సముద్రం దాటే నా వీపు మీద కూర్చోవడం నీకు భయంగానే ఉంటుంది, నువ్వు స్త్రీవి కనక,
మహాత్ముడయిన రామచంద్రుని ధర్మపత్నిగా నువ్వాడిన మాట ఉన్నదే!
పరపురుషస్సర్శ సహించనని-
అది నువ్వు మాత్రమే అనగల మాట. మరొక స్త్రీ ఆ పలుకుపలక లేదు.
నీ స్థితి, నువ్వు పలికిన ప్రతి అక్షరం అన్నీ యథాతథం ఆయనకు వినిపిస్తాను.
రామచంద్రునికి సాధ్యమయినంత త్వరలో సంతోషం కలిగించాలనే నా తాపత్రయం; అందుకే నిన్ను తీసుకువెడతానన్నాను. పయిగా ఆ సముద్రందాటి ఈ లంకలో అడుగుపెట్టడం ఎంత క్లేశమో తెలిసి మాట్లాడాను.
రాముని మీద నాకున్న స్నేహగౌరవాలు నన్ను అలా మాట్లాడించాయి తప్ప మరొక భావన నాకు లేదు.
ఇప్పుడింక నువ్వు రావు కనక ఆయనకు ఆనవాలు ఏదయినా యిస్తావా అని అడిగాడు.
సీతాదేవి బాష్పావృతనయనాలతో నెమ్మదిగా పలుకుతున్నది:
ఆయనకు ఒక కథ చెపుతాను గుర్తుగా; అది చెప్పు:
అప్పుడు మేము చిత్రకూట పర్వతం దగ్గర ఆశ్రమం నిర్మించుకుని వున్నాము. మా ఆశ్రమ పరిసరాలలో ఎందరో సిద్ధులు తపోదీక్షలో ఉండే వారు. ఆ కొండకు తూర్పునా, ఉత్తరంలోనూ స్వాదుజలాలూ, ఫలభరిత వృక్షాలూ ఉండేవి.
దగ్గరలోనే మందాకినీ నది.
ఆ ఏటిఒడ్గున సువాసనలీనే లతా, తరువులతో వనాలు.
ఒకనాడు ఆ వనంలో విహరించి, తరంగశీకరాలలో తడిసి ఆయన ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నాను.
అప్పుడొక కాకి మాంస ప్రీతితో నన్ను పొడువ రాగా, దాన్ని చిన్న బెడ్డలతో తరుముతున్నాను. ఎంత వారిస్తున్నా అది నన్ను పొడవడానికి వస్తూనే ఉంది. ఒకసారి అది వచ్చి నా మొలనూలు పట్టి లాగినప్పుడు నా చీరకొంగు జారింది.
అదిచూసి ఆయన చిరునవ్వు నవ్వగా నాకు కోపం వచ్చి దూరంగా వెళ్ళాను. అయినా ఆ కాకి తన పట్టు విడక నన్ను హింసించగా నేను తిరిగివచ్చి అయన ఒడిలో వాలాను. ఆయన నన్ను ఓదార్చారు.
అలసటలో వున్న నేను నిద్రపోయాను. కొంతసేపటికి ఆయన కూడా నిద్రించారు. మరికొంత సేపటికి నేను నిద్రలేచాను.
ఆ కాకి మళ్ళీ వచ్చి నన్ను తన ముక్కుతో పొడిచింది. అప్పుడు నా శరీరం నుంచి రక్తం కారింది. నేను రాముని లేపాను. లేస్తూనే ఆయన నా స్థితి చూసి:
నిన్ను హింసించడానికి సాహసిందిన వాడెవడు?
అయిదు పడగల పాముతో చెరలాటమాడే సాహసం ఎవడికి వచ్చింది.
అంటూ ఎరుపెక్కిన కన్నులతో ఎదురుగా వున్న కాకిని చూశాడు.
అ కాకి ఇంద్రుని తనయుడట!
రాముడు తాను కూర్చున్న ఆసనం నుండి ఒక దర్భపుల్ల తీసి అభిమంత్రించి విడిచాడు.
అది బ్రహ్మాస్త్రం!
ప్రళయాగ్నిలా అది కాకిని వెన్నాడింది.
భయంతో అది లోకాలన్నీ తిరిగింది. ఎవరూ దానికి అభయం యివ్వలేకపోయారు.
దేవతలు, ఋషులు కూడా శరణు ఇవ్వలేమన్నారు.
శరణాగతరక్షకుడయిన రాముడే దానికి అభయం ఇచ్చి,
ఓ వాయసమా! బ్రహ్మాస్త్రం వ్యర్థం కాకూడదు.
దానికి లక్ష౦ చూపించు, అనగా అది తన కుడికన్ను చూపింది. అలా దానికి చావు తప్పి కన్ను లొట్ట అయింది. అప్పుడది తన ప్రాణ రక్షణ చేసిన రామునీ, వారి తండ్రి దశరథులవారినీ అభినందించి వెళ్ళింది.
అలా కాకిమీద బ్రహ్మాస్త్రం విడిచిన ఆయన నా కోసం ఈనాడు ఈ రాక్షస రావణుని విషయమై ఏం చెయ్యకుండా ఎందుకూరుకున్నాడు?
అంతటి శక్తిశాలి అయిన నాథుడుండి కూడా నేను అనాథలా వున్నాను.
దయను మించిన ధర్మంలేదని ఆయనే అనేవారు. ఉత్సాహబల, పరాక్రమ సంపన్నుడు.
శత్రుసంహారసమర్థుడు.
సాగర గంభీరుడు.
ఇంద్ర సదృశుడు.
సముద్ర పరీవృత భూమండలాధీశుడు.
వివిధాస్త్రకోవిదుడు.
దేవ, దానవ, నాగ, గంధర్వజాతులను నిర్జింగల శూరుడు. ఇంతటివాడై ఎందుకీ ఉపేక్ష చేస్తున్నాడాయన.
లక్ష్మణుడయినా అన్నగారి ఆజ్ఞతో ఎందుకు ముందుకురాడు.
అగ్ని, వాయుదేవులతో సమానులయిన ఆ అన్నదమ్ములింత ఉదాసీనంగా ఉన్నారంటే నా పాపకర్మ ఫలాలింకా పరిసమాప్తం కాలేదేమో. అంతే! వారు రాకపోవడానికి అదే కారణం, అని దుఃఖిస్తున్నది సీత.
హనుమ : అమ్మా! నీ వియోగదుఃఖంతో ఆయన ఏ పనీ చెయ్యలేక దుఃఖంతో ఉంటున్నాడు. ఆయన శోకం చూడలేక లక్ష్మణుడు పరితాపం చెందుతున్నాడు.
ఈ క్షణం వరకూ నీ జాడ తెలియదాయనకు. ఇప్పుడు నేను నిన్ను చూశాను. ఇంక నీ దుఃఖం సమాప్తమయింది. ఆ రాకుమారు లిద్దరూ నీ వార్త వింటూనే వచ్చి లంకను భస్మంచేసి నిన్ను చేరగలరు. ఈ క్రూరరాక్షసుని బంధుసమేతం సంహరించి రాముడు నిన్ను తీసుకువెడతాడు.
నేను తిరిగి వెళ్ళి రామచంద్రునికి చెప్పవలసిన మాటలేమిటి? అలానే లక్ష్మణునికీ, సుగ్రీవునికీ ఏం వివరించాలి, అని అడిగాడు.
జానకి: హనుమా! లోకనాథుడుగా కౌసల్యాదేవికి ప్రభవించిన రామచ౦ద్రునికి శిరసా నమస్కరించి ఆయన కుశలం అడుగుతున్నానని చెప్పు,
తల్లిదండ్రులయందు అమితమయిన గౌరవం చూపుతూ, వారిని ఆరాధించుకునే మా లక్ష్మణస్వామి సుఖంగా సర్వభోగాలతో అలరారే రాజధానిని విడిచి మాతో వనవాసక్లేశం అనుభవించడానికి వచ్చాడు. అటువంటి బిడ్డను కని సుమిత్రాదేవి ధన్యురాలయింది. ఆ మహావీరుడు మాకు రక్షకుడుగా వచ్చాడు. ఆ మహాబాహుడు, సింహస్కంధుడు, ప్రీయవాది నన్ను తల్లిగా, అన్నగారిని తండ్రిగా భావించి సేవించుకున్నా డింతవరకూ.
ఆనాడు, రాక్షసుడపహరించిన నాడు మా లక్ష్మణుడు ఆశ్రమంలో లేడు, ఉంటే యింత జరిగేది కాదు, మా లక్ష్మణుడు సర్వకార్య నిర్వహణదక్షుడు. అయనకు తమ్మునిమిదనే ప్రేమ ఎక్కువ.
ఆ తమ్ముని తోడు చూసుకుని రాముడు పితృ మరణబాధ మరచి పోగలిగాడు.
అటువంటి మరది క్లేమంగా ఉన్నాడని నమ్ముతున్నానని చెప్పు - ఇంక నా భర్తతో యీ మాట చెప్పు.
నే నింక ఒక నెలకంటె జీవించను. ఈ పాపి నుండి నన్ను యీ లోపునే రక్షించుకోవాలి, ఈ చూడామణి ఆయనకు అనవాలుగా యిచ్చానని చెప్పు, అంటూ కొంగుముడి నున్న చూడామణి
హనుమంతునికి అందించింది. ఆ అభరణాన్ని ఉంగరంలా వ్రేలికి తొడుగుదామనుకున్నాడు కాని అది కుదరలేదు. దానిని చేతబట్టి సీతాదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, వినయంగా నిలబడ్డాడు.
అప్పుడే ఆ వాయునందనుని మనస్సు రామమయం అయింది, తిరుగు ప్రయాణానికి సన్నద్దుడవుతున్నాడు.
జానకి: హనుమా! ఈ చూడామణి చూడగానే ఆయనకు వారి తల్లి కౌసల్య మా మామగారు దశరథులు, నేను, ముగ్గురం మనసులో కనిపిస్తాం, అంది,
హనుమంతుడు తలవంచి నమస్కరించాడు,
ఆవిడ దుఃఖంతో కన్నీరు విడుస్తూ;
హనుమా! నువ్వు వెళ్ళగానే రామ లక్ష్మణ సుగ్రీవుల క్షేమం అడిగానని చెప్పు. ఇంకా మీ వానర వృద్దులందరి కుశలం అడుగుతున్నానని చెప్పు.
అనుదినం నువ్వు రామునికి ఉత్సాహం కలిగిస్తూ నన్ను ఉద్ధరించే ప్రయత్నంలో ఉండేటట్లు చెయ్యి. నా మాట వినగానే ఆయన కార్యరంగంలో ప్రవేశిస్తాడని ఎరుగుదును.
హనుమ : రాముడు సర్వవానర, భల్లూక సేనా సమేతం యిక్కడకు హుటాహుటిన వస్తాడు. ఆయన నారి సారించి బాణవర్షం కురిపిస్తుంటే ఎదురు నిలిచే వారుండరు, ఇంద్ర, యమ, సూర్యులే ఆయన ముందు నిలబడలేరు. నీవల్ల ఆయన విజయం సాధించగలడు. మరి నేను వెడతాను, అన్నాడు.
జానకి: నాయనా! ఈ రోజుకి ఎక్కడయినా రహస్యంగా విశ్రాంతి తీసుకుని రేపు బయలుదేరవచ్చు కదా! మరికొంత సేపు నువ్వుంటే నాకు ఆశ్వాసన. ఇంతకూ మీరందరూ వచ్చేవరకూ నా ప్రాణాలు
ఉంటాయో ఉండవో!
ఒకవేళ మీరు రాదలచినా వానర భల్లూక సేనలు ఈ మహాసాగరాన్ని ఎలా దాటగలవు?
వాయుదేవుడూ, గరుత్మంతుడూ, నువ్వూ తప్ప ఇంత సముద్రం దాటగల ప్రాణి మరొకటి ఉండదు,
అయినా రాముడు స్వయంగా వచ్చి లంకా నగరాన్ని జయించి నన్ను తీసుకువెడితేనే మాకు కీర్తి ఆ మహాకార్యం ఎలా సాధ్యం, అని ప్రశ్నించింది.
హనుమ : అమ్మా! ఈ సందేహం నీ కనవసరం. మా ప్రభువు సుగ్రీవుడు ఈ విషయమై ఎప్పుడో నిశ్చయించాడు, మా వానర భల్లూక వీరులందరూ ఆయన అజ్ఞానుసారం నడుచుకుంటారు. వారికి
భూమ్యాకాశాలలో అడ్డంకిలేదు. వారు మహాతేజస్వులు. నదీ నద పర్వత కానన సాగర పరివృత భూమండలం అంతా వారికి కొట్టిన పిండి. మా వారిలో నన్ను మించిన వారూ, నా అంతటివారే
అందరూ. నా కన్న తక్కువవాడు లేడక్కడ. దూతగా మహామహులను పంపరు కదా! నా వంటి సామాన్యులను తప్ప; అంటే ఆలోచించవచ్చు మా వారి బల శక్తులు.
మా వానర బలాధిపులు ఒక్క అంగలో సముద్రం దాటి రాగలరు, రామ లక్ష్మణులంటావా! ఇద్దరినీ చెరొక భుజంమీద ఎక్కించుకుని నేను వస్తాను. వారు తమ బాణపరంపరతో ఈ లంకను ముంచుతారు. రావణుని సంహరించి నిన్ను తీసుకువెడతారు. ప్రజ్వలిగాగ్ని వదనుడయిన రామభద్రుడు అచిరకాలంలో యిక్కడ నీకు కనిపిస్తాడు. నిశ్చింతగా వుండు. నీకు శుభం కలుగుతుంది. ఈ రాక్షస వంశం నేలకూలిన నాడు నువ్వు రోహిణివై రామచంద్రుని చేరుతావు. మలయ పర్వత గుహలలో చరించే సింహ శార్దూల సమ పరాక్రమ సంపన్నులయిన వానర
భల్లూక పతులందరూ నీ కోసం ఈ రాక్షస సంహారానికి వస్తారు.
నువ్వు విచారించకు. వాయువూ, అగ్నీవలె రామ లక్ష్మణులు విజృంభించి నీ రక్షణభార చూసుకుంటారు. నేను వెళ్ళి చెప్పిన క్షణంలో వారు వచ్చి తీరుతారు, అని ఓదార్పు పలికాడు,
No comments:
Post a Comment