Tuesday, March 3, 2026

Priyavrata Story - ప్రియవ్రతుని చరిత్రము

ప్రియవ్రతుని చరిత్రము

పరీక్షిత్తు హస్తినకు అధీశుడు. ఉత్తరాభిమన్యుల కుమారుడు. విష్ణుకథాశ్రవణానందానుభూతి కలవాడు. అట్టి పరీక్షిత్తు మహాజ్ఞాని అయిన శుకమహర్షిని చూచి సరసంగా ప్రశ్నించాడు.

మునీంద్రా! ప్రియవ్రతుడు పరమ భాగవతుడు, పైగా, ఆత్మారాముడు. అటువంటివాడు ఇంట్లో ఉంటూ సుఖభోగాదుల్ని ఎలా అనుభవించాడు? గృహస్థ ధర్మం పాటించేవారికి కర్మబంధాలూ, వాటివల్ల కలిగే అవమానాదులు తప్పవుకదా. బంధాలను తెంచుకొనేవారు గృహాలలో సంతోషంగా ఎలా ఉంటారు? విష్ణు భగవానుని నిరంతరం కీర్తిస్తూ ఆ స్వామి అడుగుజాడల్లో పయనిస్తూ చిత్తశాంతిని పొందినవారు కుటుంబజీవితం పట్ల అనాసక్తులుగా ఉంటారు. ఇల్లు, ఇల్లాలు, పిల్లలంటే మమకారం పెంచుకొన్నవాడికి మోక్షసిద్ధి ఎలా కలుగుతుంది? శ్రీహరిమీద నిశ్చయబుద్ధి ఎలా నిలుస్తుంది? నా యీ సందేహాలన్నిటిని తీర్చు స్వామీ! అని పరీక్షిత్తు అడుగగా శుకయోగి ఈ విధంగా వివరించాడు.

రాజా! విను. శ్రీహరి పాదపద్మాలలోని మకరంద రసపానంలో లీనమై పరవశించిన మనసుగల మంచి మానవుడు, ఒకవేళ ఆటంకాలు కలిగినా పూర్వమార్గాన్ని వదలిపెట్టడు.

ఓ రాజా! విను. ప్రియవ్రతుడు నరవరుడు. అతడు నారద మహర్షి పాదసేవ చేసుకుంటున్నవాడు. అతడొకసారి అధ్యాత్మ సత్త్రయాగం చేపట్టాడు.

రాజ్యపాలన చేపట్టవలసిందిగా తండ్రి ఆజ్ఞాపించినా అటువంటి లౌకిక వ్యవహారాలు తన జ్ఞానానికి ఆటంకాలని ప్రియవ్రతుడు భావించుకొని రాజ్యపాలనకు అంగీకరించలేదు. ఇవన్నీ తెలుసుకొన్న బ్రహ్మదేవుడు ప్రియవ్రతునికి రాజ్యపాలనంపట్ల ఆసక్తి కలిగించడానికి సంకల్పించాడు. ఇంద్రాదులు తన్ను సేవిస్తుండగా చుక్కలతోకూడిన సుధాకరునిలాగా, వేదాలతోకూడి వెలిగిపోతూ బ్రహ్మదేవుడు హంసవాహన మెక్కినవాడై సత్యలోకం నుండి మెల్లమెల్లగా తారాపథంలో బయలుదేరాడు.

చతుర్ముఖుడు మానవలోకంవైపు వస్తున్నప్పుడు ఆయా మార్గాలలో అటూ ఇటూ నిలుచుండిన సిద్దులూ, సాధ్యులూ, గంధర్వులూ, చారణులూ, గరుడులూ, కింపురుషులూ స్తుతించడం మొదలు పెట్టారు. గంధమాదన పర్వతపు లోయలు కాంతు లీనేటట్లు చేస్తూ బ్రహ్మదేవుడు వస్తుండగా నారదుడు స్వాయంభువ ప్రియవ్రతులతోపాటు చేతులు జోడిస్తూ ఎదురేగాడు. వారు ముగ్గురూ స్తుతులు అనే పూలగుత్తులతో చతుర్ముఖుణ్ణి పూజించారు. బ్రహ్మ సంతోషించి ప్రియవ్రతుని వీక్షించి నవ్వుతూ ఇలా అన్నాడు.

ఓ రాజా! విష్ణుమూర్తి నీకు చెప్పుమన్న విషయాన్ని చెబుతున్నాను. అందుచేత, నా మాటలు శ్రీహరి పలుకులుగానే భావించి నిశ్చలమైన మనస్సుతో ఆలకించు.

నీవుగానీ, నారదుడుగానీ, నేను గానీ అందరం ఆ నారాయణుని ఆనతి మేరకు నడిచేవాళ్ళమే. అందువల్ల, ఆయన ఆదేశాన్ని కాదని స్వతంత్రంగా ప్రవర్తించడం మనకు సాధ్యం కాని పని.

శ్రీహరి ఆజ్ఞానుసారం జీవుడు తపస్సు చేయడం, విద్యలు నేర్చుకోవడం, యోగాన్ని అభ్యసించడం, శౌర్యాన్ని ప్రదర్శించడం, జ్ఞానాన్ని ఆర్జించడం, ఆర్థిక వసతులను సమకూర్చుకోవడం, ధర్మం పాటించడం వంటి కర్మలు చేస్తాడు. అలాంటప్పుడు వీటినుండి ఎవడయినా తప్పుకోవడంగానీ మరొకరిని తప్పించడం గానీ శక్యం కాని పని. పుట్టడానికిగానీ, చావడానికి గానీ, మోహానికి గానీ, భయానికి గానీ, సుఖానికి గానీ, దుఃఖానికి గానీ, ఈశ్వరుడు కర్తగాని జీవుడు కానే కాదు.

శ్రీహరి వాక్కులే వేదాలు. మనమందరం సత్త్వరజ స్తమోగుణాలనే ముప్పేటల తాటితో కట్టబడినవాళ్ళం. ముకుతాడు వేసిన పశువులు యజమాని చెప్పుచేతల్లో ఎలా ఉంటాయో, అలాగే మన మందరమూ ఈశ్వరాజ్ఞకు లోబడి ఉంటాము. మనిషి సుఖదుఃఖాలకు ఈశ్వరుడే కర్త. కళ్ళున్నవాడు గుడ్డివాణ్ణి ఎలా నడిపిస్తాడో, అలాగే ఈశ్వరుడు మనల్ని నడిపిస్తాడు. ఆయనకు లోబడి, ఆయన ప్రసాదించిన సుఖదుఃఖాలను అనుభవిస్తున్నాము. కలలో చూచిన పదార్థాలను నిద్ర మేల్కొన్న తర్వాత అంతా అబద్ధమని అనుకున్నట్టు, ముక్తికోసం ప్రయత్నించే జ్ఞాని తాను పొందవలసిన సుఖదుఃఖాలను అనుభవిస్తూ ఇక రాబోయే కర్మఫలాలకు దూరంగా ఉంటాడు. అడవికి పోయినా ఇంద్రియ వ్యాపారాలను జయించలేక కామాదులకు లోనయిన వాడికి సంసారబంధాలే మిగులుతాయి. గృహస్థాశ్రమంలో ఉన్నా ఇంద్రియాలను జయించి ఆత్మజ్ఞానం కలిగిన పురుషునికి మోక్షం తప్పక సిద్ధిస్తుంది.

విరోధులను గెలవడానికి సిద్దమయిన మేటి కోటలోనే ఉండి శత్రువులను జయించినట్టుగా మోక్షం కోరే పురుషుడు గృహస్థాశ్రమంలో ఉంటూ శ్రీమన్నారాయణుని చరణారవిందాలనే కోటను ఆశ్రయించి కామక్రోధాదులనే అరిషడ్వర్గాన్ని జయిస్తాడు. అలాగే నీవు కూడా ఈశ్వర కల్పితాలయిన భోగాదులను అనుభవిస్తూ ముక్తసంగుడవై ముక్తి దక్కించుకోవయ్యా అన్నాడు. అపుడు ప్రియవ్రతుడు ముల్లోకాలకూ గురువయిన బ్రహ్మాదేవుడి వాక్యాలను తలవంచి గౌరవపూర్వకంగా అంగీకరించాడు.

చతుర్ముఖుడు స్వాయంభువ మనువు శ్రద్ధాభక్తులతో చేసిన పూజలందుకొన్నాడు. అనంతరం ప్రియవ్రతుడూ, నారదుడూ చూస్తుండగా బ్రహ్మదేవుడు తన సత్యలోకానికి బయలుదేరాడు.

బ్రహ్మ సంకల్పంతో నారదుని అనుమతితో సత్యసంధుడైన స్వాయంభువ మనువు తన కుమారుడైన ప్రియవ్రతునికి రాజ్యభారాన్ని అప్పగించాడు. 

ఇట్లు స్వాయంభువ మనువు భూపరిపాలనకోసం ప్రియవ్రతునికి పట్టాభిషేకం చేసి జంజాటాలనుండి బయటపడి తాను అరణ్యాలకు వెళ్ళిపోయాడు.

ధరణీ వల్లభుడైన ప్రియవ్రతుడు భగవంతుని ఆదేశంతో కర్మతంత్రపరుడయినా, శ్రీహరి పాదపద్మాలను స్మరిస్తూ, రాగద్వేషాలను వదలిపెట్టి అనుదినమూ అనిర్వచనీయమయిన ఆనందం అనుభవిస్తూ ప్రజలను చాల చక్కగా పరిపాలించాడు.

ప్రియవ్రతుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె 'బర్హిష్మతి' అనే యువతిని పెళ్లాడినాడు. ఆమెవల్ల గుణశీలరూప పరాక్రమాలలో తనతో సమానులైన పదిమంది కొడుకులనూ, ఒక కుమార్తెనూ కన్నాడు. వారు ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్టుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనేవారు. కుమార్తె పేరు ఊర్జస్వతి. వారిలో కవి, మహావీరుడు, సవనుడు అనేవారు ముగ్గురూ చిన్నవారయినా బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మ విద్యానిష్ణాతులైనారు. వారు శాంతమే తమ స్వభావంగా కలిగి 'పరమహంస యోగం' నవలంబించి సన్న్యాసాశ్రమం స్వీకరించారు. వారు సమస్త జీవులకూ, ఆవాసమయిన వాడూ, సంసారభయభ్రాంతులకు శరణ్యమైనవాడూ, సర్వాంతర్యామీ భగవంతుడయిన వాసుదేవుని పద్మాలవంటి పాదాలను సర్వదా సంస్మరిస్తూ అందువల్ల ప్రాప్తించిన భక్తియోగప్రభావంతో అంతఃకరణం మరింత పరిశుద్ధం కాగా, ఈశ్వర తాదాత్మ్యం పొందారు.

అనంతరం ప్రియవ్రతుడు ఇంకొక భార్యవల్ల ముగ్గురు కుమారులను కన్నాడు. వారలే ఉత్తముడు, తామసుడు, రైవతుడు. వారందరూ చాలా గొప్పవారు. వారు మనువులై మన్వంతరాలకు అధిపతులయ్యారు. ముందుపుట్టిన కవి, మహావీర, సవనులు అక్షయమైన మోక్షపదాన్ని అందుకున్నారు. అనంతరం ప్రియవ్రతుడు తన బాహుబలంతో శత్రుసమూహాన్ని జయించాడు. బర్హిష్మతి మీద అతిశయించిన అనురాగంతో యౌవనవికాసాలైన హాసలీలావిలాసాలలో మనస్సు లగ్నంచేసి వివేకం గోల్పోయిన వానిలాగా సుఖాలు అనుభవించసాగాడు.

ఈ విధంగా ప్రియవ్రతుడు పదుకొండు వేల కోట్ల సంవత్సరాలు రాజ్యం పాలించాడు. ఒకనాడు మేరుపర్వతానికి ప్రదక్షిణం చేస్తున్న సూర్యుని రథంతో సమానమై తేజో మయమయిన రథాన్నెక్కాడు. సూర్యునికి పడమటివైపు వ్యాపించిన చీకటిని తొలగించబూనాడు. అతనికి ఆ శక్తి భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించడం వల్లనే కలిగింది. రాత్రులను పగళ్ళుగా మారుస్తానని ప్రియవ్రతుడు రథారూఢుడై రెండవ సూర్యునిలాగా వెలిగిపోతూ ఏడుమార్లు సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఆయనను వారించాడు. ప్రియవ్రతుని రథచక్రాల గాళ్లు పడ్డదారులు సప్తసముద్రాలు అయ్యాయి. ఆ గాళ్ళకు నడుమనున్న భూమి, సప్తద్వీపాలయ్యాయి.

జంబూ, ఫ్లక్ష, కుశ, క్రౌంచ, శాక, శాల్మలీ, పుష్కరాలనేవి సప్తద్వీపాలు. వీటిలో మొదటిదయిన జంబూద్వీపం ఒక లక్ష యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఈలాగే ఒకదానికొకటి రెట్టింపు వైశాల్యం కలిగి వరుసగా ఏడుద్వీపాలున్నాయి. వాటి నడుమ ఉప్పు కడలి, చెరుకు రససముద్రం, మద్యసాగరం, ఘృత సముద్రం, పాలకడలి, పెరుగు కడలి, మంచినీటి కడలి అనే ఏడు సముద్రాలున్నాయి. ఒక ద్వీపంతో ఇంకొక ద్వీపం కలిసిపోకుండా ఉండడానికి సముద్రాలు ఏర్పడ్డాయి. అవి ద్వీపాలచుట్టూ అగడ్తలలాగా ఉన్నాయి. ఈ ద్వీపసముద్ర నిర్మాణాలు సకలజీవులకూ ఆశ్చర్యం గొలిపే అద్భుత దృశ్యాలు.

(యోజనం- ఆమడ- నాలుగు క్రోసుల దూరం-16 కిలోమీటర్లు.)

ప్రియవ్రతుడు తనంతటివారైన తన కుమారులను, ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్టుడు, మేధాతిథి, వీతిహోత్రుడు అనేవారిని ఒక్కొక్క ద్వీపానికి ఒక్కొక్కరిని పట్టం కట్టించాడు. ఊర్జస్వతి అనే కన్యను భార్గవునకిచ్చి పెళ్లి చేశాడు. ఆ దంపతులకు 'దేవయాని' అనే కన్యారత్నం పుట్టింది. ఆ తరువాత మహాపరాక్రమవంతుడయిన ప్రియవ్రతుడు విరక్తుడై, నారదుని పాదసేవనంవల్ల ప్రాప్తించిన రాజ్యసంపదలనూ, సంసార బంధాలనూ తలచుకొని ఇలా విచారించాడు.

అయ్యో! నేను పంచేంద్రియాలకు బందీనై ఆ బంధనాలనుండి తప్పించుకోలేక అజ్ఞానంతో నిండిన విషయసుఖాలనే చీకటినూతిలో పడిపోయాను. విలాసవతులైన యువతులకు నేనొక వినోదమృగంలా అయినాను. ఇక, ఇటువంటి సుఖాలకు నేనేమాత్రం ఇష్టపడను అని నిశ్చయించుకున్నాడు. శ్రీహరి అనుగ్రహంవల్ల అబ్బిన ఆత్మవిద్యను అందుకున్నాడు. నా వెంటవచ్చిన కుమారులందరినీ రాజ్యంలో కుదురుకొనునట్లు పదిలపరిచాడు. భార్యలను పరిత్యజించాడు. ధనాన్ని వదులుకొన్నాడు. చిత్తంలో శ్రీహరిని నిలుపుకొన్నాడు. నారదుని అడుగుల జాడలలో బయలుదేరాడు.

ఈ విధంగా ప్రియవ్రతుడు తన రథమార్గాలను ఏడుద్వీపాలుగా, ఏడు సముద్రాలుగా ఏర్పరచాడు. సూర్యునికి ప్రతిసూర్యుడుగా ప్రకాశించాడు. నదులను, కొండలను, వనాలను సరిహద్దులుగా నిర్ణయించి, జీవరాసులకు తృప్తి కలిగించాడు. ద్వీపాలలో దేశవిభాగం కల్పించాడు. భూలోక, స్వర్గలోక, నాగలోక సుఖాలను నరకసమానంగా భావించాడు. విరక్తి పొందాడు. నిరంతరం భగవంతుని ధ్యానించడంతో, నిర్మలమయిన ఆశయాలు కలిగినవాడయ్యాడు. అలాంటి హరిభక్తి పరాయణుండయిన ప్రియవ్రతుని పవిత్ర చరిత్ర తెలుసుకోవడం ఈశ్వరునికి తప్ప మరెవ్వరికీ శక్యంకాదు. ఆ ప్రియవ్రతుని మహిమలను జనులు నేటికీ కొనియాడుతున్నారు అని చెప్పి శుకమహర్షి ఇంకా ఇలా అన్నాడు.

ప్రియవ్రతుడు హరిసేవాప్రభావంవల్ల ముక్తి పొందినాడనడంలో ఆశ్చర్యం ఏముంది? చండాలుడయినా సరే, హరిచరణ స్మరణం వల్ల అక్షరమైన మోక్షాన్ని పొందగలడు.

హరినామస్మరణ కైవల్యదాయకం. ఈ స్మరణ చేసేవా రెవరైనా ముక్తి పొందుతారని శుకుడు విశదీకరించి ఆపై పరీక్షిత్తుతో ఇలా అన్నాడు.

రాజా! ఆ తరువాతి వృత్తాంతం విను. తండ్రి అయిన ప్రియవ్రతుడు విరక్తుడు కాగా, ఆతని ఆజ్ఞప్రకారం అతని కుమారుడు ఆగ్నీధ్రుడు జంబూద్వీపాన్ని ధర్మమార్గంలో పరిపాలించాడు. అతడు ప్రజలందరినీ కన్న కొడుకులలాగా లాలిస్తూ చాలాకాలం రాజ్యం చేశాడు. ఎనలేని ప్రఖ్యాతి గడించాడు.

ఈ విధంగా ఆగ్నీధ్రుడు జంబూద్వీపాన్ని పరిపాలిస్తూ ఒకనాడు సంతానంకోసం మందరపర్వత సమీపానికి వెళ్ళి అక్కడ అచంచలమైన మనస్సుతో అఖిలోపచారాలతో బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాడు. ఆగ్నీధ్రుని భక్తిప్రపత్తులకు బ్రహ్మదేవుడు పరమానందభరితుడై సత్యలోకంలో తన సమక్షంలో సంగీతం ఆలపించే 'పూర్వచిత్తి' అనే అప్సరసను ఆయన దగ్గరకు పంపాడు. ఆ అమరకాంత ఆగ్నీధ్రుడు ఉన్న ఆశ్రమవాటికకు వచ్చింది. అక్కడ వివిధ పుష్పజాతుల రంగురంగుల పూలతీగెలు దట్టమైన చెట్లకొమ్మలను గట్టిగా పెనవేసుకొని ఉన్నాయి. ఆ తీగెలమీద ఊగే నెమళ్ళు మొదలైన పక్షుల జంటలు షడ్జాది స్వరాలతో సందడి చేస్తున్నాయి. ఆ ధ్వనులకు మేల్కొన్న నీటికోళ్ళూ, బాతులూ, కొంగలూ కలకల ధ్వనులు చేస్తున్నాయి. అటువంటి విహంగాలతో నిర్మలజలాలతోనూ నిండిన సరస్సులు కన్నులవిందు చేస్తున్నాయి. ఆశ్రమవాటికను ఆనుకొని ఉన్న ఉపవనంలో ఆ అప్సరస విహరించడం మొదలుపెట్టింది. వంపు సొంపులతో ఒయ్యారంగా నడిచే ఆ సురసుందరి నడకలకు తగినట్టుగా కదలుతున్న ఆమె బంగారు అందియల రవళిని ఆగ్నీధ్రుడు ఆలకించాడు. యోగసమాధిలో కన్నులు మోడ్చి ఉన్న అతడు మెల్లగా కన్నులు విప్పి ఆ వన్నెలాడిని చూచాడు. ఆ సమయంలో ఆడుతుమ్మెదవలె 'పూర్వచిత్తి' పూలసౌరభాన్ని ఆఘ్రాణిస్తున్నది. ఆమె అందచందాలు దేవతలకూ, మానవులకూ కనువిందై మనస్సులను పరవశింప చేస్తున్నాయి. పూర్వచిత్తి ఒయ్యారపు నడకలూ, విభ్రమ విహారాలూ, వాలుచూపులూ కంఠమాధుర్యమూ, అంగసౌష్ఠవమూ మన్మథుని శరపరంపరలను కురిపించసాగాయి. ఆమె ముఖపద్మంనుండి మకరందంవంటి మందహాసం చిందుతున్నది. ఆమె పలుకులు పరిమళాలు విరజిమ్ముతున్నాయి. ఆ సుగంధాలకు ముసురుకొని మైమరచిన తుమ్మెద జంటలను తప్పించుకొని ఆ సురసుందరి చరచరా నడుస్తుంటే ఆ గమన వేగానికి ఆమె చనుగవ, జుట్టుముడి, మొలనూలు చలిస్తున్నాయి. అటువంటి పూర్వచిత్తిని చూచి ఆగ్నీధ్రుడు కామపరవశుడై చలించిన చిత్తంతో మూర్ఖునిలాగా ఆవిడతో ఈ విధంగా సంభాషణ మొదలెట్టాడు.

నెచ్చెలీ! ఎవరు నీవు? ఈ కొండదగ్గరకు ఏ పనిమీద వచ్చావు? నీవు వనదేవతవా? సరస్వతీదేవివా? లేకపోతే మన్మథుడు పంపిన మాయామూర్తివా? కాకపోతే ఫలించిన నా తపస్సంపదవా?

ఓ మగువా! మదనుడు ఎక్కుపెట్టిన విల్లును నీవు చేతబట్టుకొని మన్మథ క్రీడకై ఈ అడవిలోని నరమృగాలను (మానవ మృగాలను) వేటాడుతున్నావా? నీ అసలు స్వరూపం నాకు స్పష్టంగా తెలిసేలాగా చెప్పు. నిన్ను చూస్తుంటే మదనుడు నాలో కోలాహాలం చేస్తున్నాడు.

ఓ కోమలాంగీ! నీ కులుకులతో, తళుకుబెళుకులతో మన్మథుని వాడి తూపులవంటి కడగంటి చూపులతో ఎవరి మనసును చీకాకు పరుస్తున్నావు?

మన్మథ సామగానాలు ఆలపించే శిష్యులేమో అన్నట్లు తుమ్మెదల గుంపు నీకు వంత పాడుతున్నాయి. వేదాలు చదివే శిష్యుల పైన విరులవాన కురిసే విధంగా ఆ తుమ్మెదల మీద నీ వాలు జడనుండి పూలు జలజల రాలుతున్నాయి.

ఓ తరుణీ! నీవు వడివడిగా అడుగులు పెడుతూ నడుస్తూంటే నీ కాలి అందియలు ఘల్లుఘల్లుమని మ్రోగుతున్నాయి. ఆ చిరుమువ్వల సవ్వడులు, ఆ అందెల రవళులు నా మనస్సును తాకి ప్రతిధ్వనిస్తూ సందడి చేస్తున్నాయి.

ఓ తన్వీ! కడిమి పువ్వుల కాంతులను పుణికి పుచ్చుకొనే నీ చీర నిగనిగలను ఎడతెగకుండా బయటకు ప్రసరించే నీ కటికాంతులు కప్పి వేస్తున్నవి గదా!

ఓ లతాంగీ! చూద్దామన్నా నీ నడుము కనబడదు. అలాంటప్పుడు ఏనుగు కుంభస్థలం లాంటి స్తనద్వయాన్ని ఎలా మోస్తున్నావు?

ఓ పూబోణీ! పొంకమైన నీ స్తనాలమీద కుంకుమ లేపనం పూసుకొన్నావు. పరిమళాలు వెదచల్లే బింకమైన నీ చందోయి పెంపునూ, సొంపునూ వర్ణించడం నాకు చేతనౌతుందా?

కామినీ! ఏ లోకంనుండి ఇక్కడికి వచ్చావు? నీలాంటి అందగత్తెను గురించి ఎవరూ ఎక్కడా చెప్పుకోవడం నేను వినలేదు. లోకంలో ఎవరూ నీలాంటి సుందరిని చూపలేదు. అందమైన నీ ఆకారమూ, నీ లావణ్యమూ, నీ లీలావిలాసమూ ఎంత గొప్పగా ఉన్నాయో వర్ణించలేను. నేను చేసుకొన్న అంతులేని పుణ్యం ఫలించినట్లు ఈ భూలోకానికి ఎలా దిగి వచ్చావు?

కమలదళాలవంటి కన్నులు కలదానా! చిరునవ్వుతోకూడిన వాల్చూపులతో శోభిల్లే నీ సుందరవదనాన్ని చూస్తున్నకొద్దీ నాలో ఎన్నో కోరికలు చివురించుతున్నాయి. నీ పొందుకోసం నేను ఆశపడుతున్నాను.

నళిననయనా! మచ్చలేని చంద్రకళ చందాన నీ ముద్దుల మొగం వెలుగులు వెదజల్లుతున్నది. ఆహా! అందుకనే కాబోలు అది నిజంగా 'విష్ణుకళ' అని మనస్సులో భావిస్తున్నాను.

ఓ ముద్దుగుమ్మా! నీ చెవుల దుద్దులు రెండూ చక్రవాకాలయితే, నీ కన్నులు వాటిని చూసి భయపడుతున్న చేపల్లాగ కదలుతుంటే, నీ నల్లని ముంగురులు కమ్ముకొన్న తుమ్మెదల గుంపులయితే, దంతాల వరుసలు హంసలయితే వీటితో తేజరిల్లుతున్న నీ ముద్దు మొగం చక్కని సరోవరంలాగా ఉంది.

ఓ యువతీ! నవరత్నాల బంతితో ఆడుకొనే సంబరంలో నీవు కట్టుకున్న చీర గాలికి తొలగినా సవరించి కట్టుకోవడం లేదు. దిక్కులు పరికిస్తూ తుమ్మెదలవంటి శిరోజాల ముడి విడిపోయి మెడపై పడుతున్నా నీవు చక్కదిద్దుకోవడం లేదు. ఎంత సంభ్రమమో!

ఆగ్నీధ్రుడు ఆ అప్సరసతో ఇంకా ఇలా అన్నాడు. 'తలోదరీ! తపస్సు చేస్తున్న తపోధనుల తపస్సునంతా నీవు నీ అందచందాలతో కప్పి పుచ్చుతున్నట్టున్నది. ఈ చక్కదనమంతా ఏ తపస్సువల్ల దక్కించుకున్నావు? నాతోపాటు నీవుకూడ తపస్సు సాగించు. నా సంతానాన్ని పెంచు, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నిన్ను నాకు ప్రసాదించాడు. అందుచేత నిన్ను వదలిపెట్టను. నీ చెలికత్తెలు నేను చెప్పే మాటలను తప్పక అంగీకరిస్తారు. నీవు వెళ్ళేచోటికి నన్నుకూడా పిలుచుకొని పో అంటూ స్త్రీల మనస్తత్వానికి అనుగుణంగా పలుకనేర్చిన ఆగ్నీధ్రుడు పరిపరివిధాల తన భావాన్ని ప్రకటించాడు. పూర్వచిత్తి కూడా అతని అనునయవాక్యాలకు సమ్మతించింది. వీరశ్రేష్ఠుడయిన ఆ రాజేంద్రుని బుద్ధికీ, రూపానికీ, శీలానికీ, ఔదార్యానికీ, విద్యకూ, వయస్సుకూ, సంపదకూ లొంగిపోయింది. జంబూద్వీపాధిపతియైన ఆ ఆగ్నీధ్రునితోగూడి నూరువేల సంవత్సరాలు భూలోకంలో స్వర్గసౌఖ్యాలు అనుభవించింది.

ఆగ్నీధ్రుడు పూర్వచిత్తివలన వరుసగా నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్యక, హిరణ్మయ, కురు, భద్రాశ్వ, కేతుమాల అనే నామధేయం గల తొమ్మండుగురు కుమారులను కన్నాడు. ఆ తరువాత పూర్వచిత్తి పిల్లలను ఇంట్లో వదలిపెట్టి ఆగ్నీధ్రుణ్ణి విడిచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. ఆగ్నీధ్రుని కుమారులు తల్లి సామర్థ్యంవల్ల స్వభావసిద్ధంగానే గొప్ప బలిష్టులయ్యారు. తండ్రి అనుమతితో జంబూద్వీపాదులకు వర్షాలను విభజించుకొని పరిపాలించారు. వారు పరిపాలించిన ప్రదేశాలు వారి వారి నామాలతోనే ప్రసిద్ధమయినాయి.

పూర్వచిత్తితో ఆగ్నీధ్రుడు ఎంతోకాలం కామోపభోగాలు అనుభవించినా అతనికి తృప్తి కలుగలేదు. ఆ తరువాత ఆగ్నీధ్రుడు భార్యను తలచుకొంటూ వేదోక్తకర్మలు ఆచరిస్తూ చివరకు భార్య ఉన్న లోకానికి చేరుకున్నాడు. ఈ విధంగా తండ్రి పరలోకగతుడు కాగా నాభి మొదలైన ఆగ్నీధ్రుని కుమారులు మేరుకుమార్తెలయిన మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంష్ట్ర, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవి అనువారిని వరుసగా వివాహమాడారు.


No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...