Friday, March 20, 2026

Narmada Mahatmyam - నర్మదా మాహాత్మ్యం

నర్మదా మాహాత్మ్యం

పూర్వం మార్కండేయమహర్షి ధర్మరాజుకి ఈ నర్మదానది మహాత్మ్యం గురించి ఇలా వివరించి చెప్పాడు ధర్మరాజా! ఖణకల క్షేత్రంలో గంగానది, కురుక్షేత్రం లో సరస్వతీ నది ఇతర ప్రదేశాలలో కంటే ఎంతో పుణ్యప్రదమైనవని చెబుతారు. అయితే నర్మదానది మాత్రం గ్రామాల్లో, అరణ్యాల్లో క్షేత్రాల్లో ఎక్కడ ప్రవహించినా అది పుణ్యప్రదమైనదే. మూడు రోజుల స్నానంతో సరస్వతీనది, ఏడురోజుల స్నానంతో యమునానది, ఒక్కరోజు స్నానంతో గంగానది మానవుల్ని పవిత్రం చేస్తాయి. నర్మదానది కేవలం దర్శనమాత్రం చేతనే మానవులకి పవిత్రతని కలిగిస్తుంది.


ధర్మజా! ఈ నర్మదానది కలింగదేశం సరిహద్దులోవున్న అమరకంటకం అనే ప్రాంతం నుంచి ప్రాదుద్భవించింది. ఈ ప్రాంతంలోనే ఎందరో సిద్దులు మహర్షులు, దేవతలు, దానవులు తపస్సుచేసి, సిద్దులు పొందారు. ఇక్కడ నర్మదా నదిలో స్నానం చేసి జితేంద్రియుడై ఒక్కరాత్రి ఉపవాసదీక్షతో గడిపితే గడిపినవాడి వంద తరాలవారూ తరిస్తారు. ఈ అమరకంటకంలో జలేశ్వరం అనే తీర్ధం వుంది. అందులో స్నానం చేసి పిండప్రదానాలు చేస్తే వారి పితరులకి ప్రళయకాలం దాకా తృప్తి కలుగుతుంది. ఈ అమరకంటక పర్వతం మీద మొత్తం కోటి మంది రుద్రులు ప్రతిష్టించబడివున్నారు. కనుక ఇక్కడ స్నానం ఆచరిస్తే కోటిరుద్రుల అనుగ్రహం మానవులకి కలుగుతుంది.

నర్మదానది మొత్తం వందయోజనాల పొడవు రెండు యోజనాల వెడల్పుతో వుంటుంది. అమరకంటక పర్వతమంతటా ప్రవహించే ఈ దివ్యనదికి మొత్తం అరవైకోట్ల అరవైవేల తీర్జాలున్నాయి. నర్శదానదీతీరంలో బ్రహ్మచారిగా శుచిగా వుంటూ క్రోధాన్ని జయించి, ఇంద్రియ నిగ్రహంతో సర్వభూతహితుడై నిత్యం శివారాధన చేస్తూ జీవించేవాడు ఇదే ప్రాంతంలో ప్రాణాలు విడిచిపెడితే అతడికి అనంతమైన పుణ్యం లభిస్తుంది. అమరకంటకానికి తూర్పు అంచులో మహేశ్వరుడు స్వయంగా కొలువున్నాడు. ఆ ప్రాంతంలో శుచిగా, నియమబద్ధంగా పిండప్రదానం చేసి నర్మదా నదిలో తిలోదకాలు వదిలితే ఏడుతరాల వారు తరిస్తారు.

అమరకంటకానికి పడమటి అంచులో జలేశ్వరం అనే సరోవరం వుంది. ఆ సరోవరతీరంలో పిండప్రదానం చేసినా, సంధ్యోపాసన చేసినా వారి పితరులు పది తరాల వరకూ తృప్తి చెందుతారు.

నర్మదానదికి దక్షిణ తీరంలో కపిలా అనే నది వచ్చి కలుస్తుంది. ఆ కపిలానది కూడా ఎంతో పవిత్రమైనది. ఈ రెండూ కలిసిన ప్రాంతం ఎంతో విశిష్టమైనది. అక్కడ వందకోట్ల తీర్థాలు వచ్చి నర్మదాకపిలా సంగమంలో కలుస్తాయి. ఆ ప్రాంతంలో వున్న మక్షాలకి కూడా ఆ నదీజల స్పర్శవల్ల ఉత్తమగతులు కలుగుతాయి. అక్కడికి సమీపంలో 'విశల్యకరణి' అనేనది ప్రవహిస్తుంది. అందులో స్నానం చేసినవాడు తక్షణమే విశల్యుడు అనగా బాధలులేని వాడవుతాడు.

ధర్మరాజా! అమరకంటకం మీద నర్మదా నదితోపాటు ప్రవహించే 'కపిలా' 'విశల్యా' నదులు కూడా పరమపవిత్రమైనవి. సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు కనుక ఆ నదుల్లో స్నానం ఆచరిస్తే అశ్వమేధయాగఫలం లభిస్తుంది. నర్మదానది ఉత్తరతీరంలో నివసించేవారు అంత్యకాలంలో రుద్రలోకానికి చేరుకుంటారు. సరస్వతీ, గంగా, నర్మదా, యమునా నదులలో స్నానదానాలు మోక్షప్రదాలని పరమేశ్వరుడు చెప్పాడు. న
ర్మదానదికి భక్తిగా నమస్కరించేవాడు సకలపాపాలనుంచీ విముక్తుడౌతాడు. నర్మదానది పుణ్యప్రదం. అక్కడ ఒకరాత్రి పగలు నివసించినవాడికి బ్రహ్మహత్యాదోషం కూడా తొలగిపోతుంది. గయాక్షేత్రంలో, హరిద్వారంలో గంగానది దగ్గర పుణ్యకర్మలు ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో నర్మదా సాగర సంగమం ప్రాంతంలో స్నానం, జపం, దానం చేసినవారికి అంతకు పదిరెట్లు పుణ్యఫలం లభిస్తుంది.

కావేరీ సంగమ మాహాత్మ్యం
ధర్మరాజు ఒకనాడు మార్మండేయమహర్షిని ఇలా అడిగాడు “తపోనిధీ! మాకు శుభం కలగటానికి, లోకాలకి హితం కలగటానికి, నిత్యం పాపాలు ఆచరించేవారు ఆపాపాల నుంచి విముక్తి పొందటానికి తగిన స్థానం కావేరీ సంగమ తీర్ధం అని పెద్దలు చెప్పారు. దయ చేసి ఆ కావేరీ సంగమ మాహాత్మ్యం గురించి చెప్పమని ప్రార్థిస్తున్నాను అని అడిగాడు. మార్మండేయమహార్షి ఇలా చెప్పటం ప్రారంభించాడు.

ధర్మరాజా! మహాపరాక్రమ వంతుడైన యక్షరాజు కుబేరుడు నీకు తెలుసు కదా! అతడు ఈ కావేరీ తీర్ధంలో స్నానం చేసినందువల్లే యక్షలోకానికి అధిపతి అయ్యాడు. ఈ కావేరినే కౌబేరి అనికూడా అంటారు.

లోకప్రసిద్ధమైన ఈ కావేరీ-నర్మదా నదీ సంగమం జరిగిన ప్రదేశంలో పూర్వం సత్యవిక్రముడైన కుబేరుడు స్నానంచేసి శుచిగా వంద దివ్య సంవత్సరాల పాటు తపస్సు చేసాడు. కుబేరుడు చేసిన తపస్సుకి సంతోషించిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై కుబేరా! ఏ వరం ఆశించి ఈ తపస్సు ఆచరిస్తున్నావు? దాన్ని కోరుకో ప్రసాదిస్తానన్నాడు. కుబేరుడు ఆయనతో "స్వామీ! నేటినుంచీ సమస్త యక్షలోకానికీ అధిపతిని కావాలి" ఇదే నా కోరిక అన్నాడు. తథాస్తు! అని ఆశీర్వదించి శివుడు అదృశ్యమయ్యాడు. ఆనాటి నుంచి కుబేరుడు పరమేశ్వరుడి అనుగ్రహంతో సమస్త యక్షలోకానికి అధిపతిగా మారి వారందరి చేతా పూజలందుకున్నాడు.

సకల పాపాల్నీ పోగొట్టె కౌబేరీ (కావేరీ) నర్మదా సంగమ స్నానం ఫలితం గురించి తెలియనివాడు దురదృష్టవంతుడే. తెలిసి కూడా అక్కడ స్నానం చేయనివాడు మరీ దురదృష్ట వంతుడు. కనుక ప్రయత్నించి మరీ ఆ సంగమంలో స్నానం చేసి అక్కడవున్న పరమేశ్వరుణ్ణి అర్చిస్తే అశ్వమేధ ఫలం లభిస్తుంది. అక్కడ గనుక ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారికి పునరావృత్తి రహితమైన కైవల్యం లభిస్తుంది. ఆ సంగమంలో స్నానమాచరించినవారికి గంగా, యమునా నదులలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. ధర్మజా! ఎంతో పుణ్యప్రదమైనదిగా కీర్తించబడ్డ ఈ కావేరీనది దక్షిణ దేశంలో వున్న కావేరీనది కాదు. నర్మదానదికి ఉపనది అయిన కౌబేరి. దీన్నే కొందరు కావేరీ అనికూడా వ్యవహరిస్తారు.

కావేరీ తీరంలో వున్న దివ్యతీర్ణాలు

1. మంత్రేశ్వర తీర్ధం : నర్మదానది ఉత్తరం ఒడ్డున ఒక యోజనం విస్తీర్ణంలో సర్వపాపహరమైన 'మంత్రేశ్వరం' అనే దివ్యతీర్ధం వుంది. ఆ తీర్థంలో స్నానం చేసిన వారు అయిదువేల సంవత్సరాలు కామరూపధారులై దేవతలతో చేరి సుఖభోగాలు అనుభవిస్తారు.

ఈ మంత్రేశ్వర తీర్థం వరిసర ప్రాంతాల్లో 1.గర్జనతీర్థం 2. అఘ్రాతకేశ్వరతీర్థం 3. బ్రహ్మావర్తతీర్ధం 4. గాణేశ్వరతీర్ధం 5. కపిలాతీర్థం 6. కరంజతీర్థం7. కుండలేశ తీర్ధం 7. పిప్పలేశతీర్థం 9. విమలేశ్వర తీర్ధం 10. పుష్కరతీర్థం ఉన్నాయి.

2. శూలభేదాది తీర్ధం : నర్మదా తీరంలో వున్న తీర్థాలలో శూల భేదన తీర్ధం విశిష్టమైనది. ఇక్కడ స్నానం చేసి త్రిరాత్ర దీక్షతో శివుణ్ణి అర్చిస్తే పునర్జన్మ వుండదు. వేయిగోవుల్ని దానం చేసిన ఫలితం లభిస్తుంది.

ఈ శూలభేద తీ
ర్థ పరిసరాలలో 1.భీమేశ్వర 2.నారదేశ్వర 3. ఆదిత్యేశ్వర 4. నందికేశ్వర 5.వారుణేశ్వర 6. స్వతంత్రేశ్వర 7.కోటితీర్ధం 8. రాజేంద్రతీర్థం 9. బలాకేశ్వర తీర్థం 10. శుక్రతీర్థం 11.ఋషితీర్ధం 12.రావణేశ్వర తీర్ధం 13.నదీసంగమతీర్థం 14.సోమతీర్థం 15. పింగళేశ్వర తీర్ధం 16.సురేశ్వర తీర్ధం 17. కర్కోటకేశ్వర తీర్ధం 18. నందితీర్థం 19. దీపేశ్వర తీర్ధం 20. వ్యాసతీర్ధం వంటి ఎన్నో దివ్యతీర్థాలు మహిమాన్వితమైనవి వున్నాయి.

3. శుక్ల తీర్ధం : వివిధరకాల గైరికాదిధాతువులతో బాలసూర్యుడిలా ప్రకాశించేది, బంగారు రంగుతో మెరిసిపోయేది. వజ్ర స్ఫటిక మణుల సోపానాలతో కూడుకున్నది అయిన హిమవత్పర్వతం మీద కొలువున్న శంకరుణ్ణి స్తుతించి "దేవా లోకంలో పరమ పవిత్రమైన దివ్యతీ
ర్థం ఏది? అని మార్కండేయమహర్షి అడిగాడు. అప్పుడు శివుడు మార్కండేయా! సకల ఋషులు, మునులు, సిద్దులు నిత్యం సేవించేది నర్మదానదీతీరంలో వున్న శుక్ల తీర్ధం. ఆ దివ్యతీర్థం గంగా, యమునా, పుష్కర, గయా క్షేత్రాలలాగా పరమపవిత్రమైనది” అని చెప్పాడు.

ఈ శుక్ల తీర్ధం ఒక యోజనం విస్తీర్ణంలో గుండ్రంగా వుంటుంది. వైశాఖ, మాఘమాస కృష్ణ చతుర్ధశీ తిథుల్లో పరమేశ్వరుడు కైలాసం నుంచి వచ్చి ఈ తీర్ధంలో స్నానం చేస్తాడు. ఈ తీర్ధంలో ఆ సమయంలో స్నానం చేసినవారికి ఆ జన్మకృత పాపాలు నశిస్తాయి. కార్తీక కృష్ణ చతుర్ధశినాడు ఆ తీర్థంలో స్నానంచేసి శివుడికి నేతితో అభిషేకంచేస్తే ఇరవైఒక్క తరాలవారు తరిస్తారు.

ఈ శుక్ల తీర్థానికి సమీపంలో మరి కొన్ని మహిమాన్వితమైన దివ్య తీ
ర్థాలున్నాయి. 1. నరకతీర్ధం 2.గణేశ్వరతీర్థం 3.ఋషితీర్ధం 4.గంగావదన తీర్ధం 5. దశాశ్వమేధతీర్థం 6. భృగుతీర్థం 7.గౌతమేశ్వరతీర్థం 8. ధౌతుపాపతీర్ధం 9. బదండీతీర్థం 10. హిరణ్యద్వీప తీర్ధం 11.కనఖలతీర్ధం 12.హంసతీర్థం 13.చంద్రతీర్థం 14.కన్యాతీర్థం 15. ద్వీపేశ్వరతీర్థం 16.రుద్రకన్యాసంగమ తీర్ధం 17.అంకుశేశ్వర తీర్ధం 18. నర్మదేశ్వరతీర్థం 19. అశ్వతీర్ధం 20. పైతామహతీర్థం 21.కురుతీర్థం 22.త్రిదశజ్యోతి తీర్థం 23. స్వర్ణబిందు తీర్థం 24. ఆషాఢీతీర్థం 25.కౌశికీ తీర్థం

నర్మదా తీర్ధ మాహాత్మ్య ఫలశ్రుతి
ఈవిధంగా పరమపావనమైన నదిగా, దర్శన మాత్రం చేతనే సకల జీవుల పాపాలనీ పోగొట్టేదిగా ప్రసిద్ధమైన నది నర్మదానది. ఈ నది జన్మస్థానమైన అమరకంటకం నుంచి సాగరసంగమందాకా మధ్యలో పదికోట్ల తీర్జాలున్నాయి. వీటిలో ప్రతి తీర్థానికీ మధ్యలో కోట్లాది ఋషులున్నారు. వారందరూ అక్కడ నిత్వాగ్ని హోత్రాలు, యజ్ఞ యాగాది క్రతువులు చేస్తుంటారు.

నర్మదానదీతీర్ధ మాహాత్మ్యాన్ని ఎవరు శ్రద్ధతో వింటారో, పఠిస్తారో అతన్ని ఈ నదీతీరంలోవున్న సమస్తతీర్ధాలూ అభిషేకిస్తాయి. అతడికి అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. నర్మదానది అనుగ్రహం అతడికి కలుగుతుంది. దీని శ్రవణం వల్ల పఠనం వల్ల విప్రులకి వేదాధ్యయనఫల క్షత్రియులకి రాజ్యఫలం, వైశ్యులకి ధనలాభం, శూద్రులకి సద్గతి లభిస్తాయి.

సప్తఋషుల గోత్రాలు ప్రవరలు

మత్స్య పురాణము

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...