బ్రహ్మదేవుండు హిరణ్యకశిపునకు వరంబు లిచ్చుట
దేవతలందరూ బ్రహ్మవద్దకు వచ్చి మొరపెట్టారు; దేవతలలో అగ్రగణ్యుడు అయిన చతుర్ముఖబ్రహ్మ భృగువు దక్షుడు మొదలైన వారితో మందర పర్వతం వద్దకు వచ్చాడు. అక్కడ హిరణ్యకశిపుడు నియమనిష్ఠలతో ఉన్నాడు చీమలు అతని మజ్జనూ మాంసాన్ని చర్మాన్ని రక్తాన్ని పూర్తిగా తినివేశాయి. అతనిపైన పుట్టలు పెట్టాయి. గడ్డి మొలిచింది. వెదురు పొదలు పెరిగాయి. అతడు చేసిన మహాతపః ప్రభావంవల్ల దట్టమైన మేఘాల మధ్యలో ఉన్న సూర్యునివలె పుట్టలమధ్య ప్రకాశిస్తున్నాడు. అటువంటి హిరణ్యకశిపుడనే రాక్షసుని చూచి చతుర్ముఖబ్రహ్మ ఆశ్చర్యపడి నవ్వుతూ ఇలా అన్నాడు.
ఓ రాక్షస రాజేంద్రా! నీవలె తీవ్రమైన తపస్సు చేసినవారు ఇంతకు పూర్వం ఎవరూ లేరు. ఇకపై చేయగలిగినవారు లేరు. నీ తపస్సమాధికి మెచ్చుకొన్నాను. ఓ మహాత్మా! నీ వేమి కోరుకుంటావో అవి అన్నీ ఇస్తాను. ఇంకా ఆయాసపడవలసిన పని లేదు. తపస్సుతో కష్టపడవలసిన పని లేదు. తొందరగా లే! నీ కోరికలు ఏమిటో కోరుకో.
అడవిఈగలతో చీమలతో నీ రక్తమాంస మజ్జాదులు పూర్తిగా తినివేయబడ్డాయి. ఇక నీవు ఎముకల గూడుగా మాత్రం నిలిచి ఉన్నావు. నీ పైని వెదురుపొదలు గడ్డిదుబ్బులు మొలిచాయి. నీ చుట్టూ పెట్టిన పెద్దపుట్టలో ఇంద్రియాల చలనం రవంత కూడా లేకుండా నీవు ఉన్నావు. అసలు ఈ స్థితిలోకూడా నీకు ప్రాణాలు ఎలా నిలబడ్డాయో ఆశ్చర్యంగా ఉంది.
(కేవలం తపోనిష్టలో ఉండడంవల్ల శరీరం సర్వాత్మనా జీర్ణమైనప్పటికీ ఇంద్రియభ్రంశం లేకుండా ప్రాణాలకు నిలకడ సంభవించడం ఆశ్చర్యకరం. రాక్షసులు తమ ఆశయసాధన కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తారు అందుకే రాకాసిపట్టు, రక్కసితాల్మి అనే పదబంధాలు ఏర్పడ్డాయి.)
ఓ రాక్షసరాజా! ఆహార పానీయాలను మాని ఎంతో సడలని ఆసక్తితో ఈ విధంగా నూరు దివ్యవర్షాలు తపస్సు చేశావు. అయినా ప్రాణవాయువులు నిలబెట్టుకొన్నావు. ఇదెలా సాధ్యం. మాకు చాలా ఆనందం అయింది. నీ తీవ్రమైన తపస్సుతో మమ్ము జయించావు. వాత్సల్యంతో నిన్ను కలవాలని వచ్చాను. నీ కోరికలు అన్నీ తీరుస్తాను.
బ్రహ్మ హిరణ్యకశిపునితో ఈ విధంగా మాట్లాడిన పిదప ఈగలు, చీమలచే పూర్తిగా తినివేయబడిన రాక్షసరాజు దేహంమీద తన కమండలం నీటిని ప్రోక్షించాడు. ఆ హిరణ్యకశిపుడు బ్రహ్మ హస్తపద్మంలో ఉన్న బంగారు కమండలంలోని మహిమాన్వితమై తిరుగులేని నీటిధారచే తడుపబడి. తపస్సు విరమించాడు. మహాసౌందర్యవంతమైన యౌవనంతో వజ్రంతో సమానమైన దృఢ దేహంతో పుటం పెట్టబడిన బంగారమువంటి శరీరకాంతితో ఎండుకట్టెలను మంట వేస్తే వచ్చే అగ్నివలె కాంతులీనుతూ హిరణ్యకశిపుడు తన చుట్టూ దట్టంగా మొలచిన వెదుళ్ళ పొదల పుట్టలనుండి బయటకు వచ్చాడు.
సరస్వతీమనోనాథుడు, మంచి ఉత్సవాన్ని కలిగించేవాడు, భక్తులను కాపాడేవాడు, చక్కటి తపస్సు చేసే తాపసుల కోర్కెలు తీర్చేవాడు, జగములను సృష్టించేవాడు, ప్రాణికోటి నుదిటిపై వారి వారి జీవనగమనాలను వ్రాసే మహావిద్యానిపుణుడు అయిన బ్రహ్మదేవుని చూచి దేవతలందరికీ శత్రువైన హిరణ్యకశిపుడు మొక్కాడు.
ఈ విధంగా రాక్షసరాజు హిరణ్యకశిపుడు ఆకాశంలో అగుపించిన బ్రహ్మదేవునకు భూమిమీద నుండి సాష్టాంగదండ ప్రణామాలు చేసి, సంతోషంతో ఆనందాశ్రువులు నిండగా, శరీరం పులకలెత్తగా, నమస్కారం చేసి బ్రహ్మపై చూపు నిలిపి గద్గద స్వరంతో ఈ విధంగా స్తోత్రం చేశాడు.
ఈ ప్రపంచం అంతా కల్పాంత కాలంలో అంధకార మగ్నం కాగా, ఎవడు తన కాంతితో ఈ లోకంలో వెలుగులు నింపుతాడో, రజస్సత్త్వ తమోగుణాలతో కూడి ఎవడు సృష్టి, స్థితి, లయకార్యాలు నిర్వహిస్తాడో, ఎవడు ఆద్యుడో, ఎవ్వడు అన్నిటికీ కారణ భూతుడో, స్వయం ప్రకాశంతో వెలుగొందుతూ ఉంటాడో, ఎవడు ప్రాభవంతో ఒప్పారుతూ ఉంటాడో, మరల సృష్టికాలం రాగా మనస్సు, ప్రాణం, బుద్ధి, ఇంద్రియాలతో ఎవడు గొప్ప ప్రభావంతో ఉంటాడో, అటువంటి సచ్చిదానందమయుడైన వానికి నేను భక్తితో నమస్కరిస్తాను.
ఓ దేవా! నీవు ముఖ్య ప్రాణం అయిన కారణంగా ప్రజాపతివి. మనస్సు, బుద్ది, చిత్తం, ఇంద్రియాలు అనే వాటికి అధినాయకునివి. సమస్త ప్రాణికోటికి నీవు ఆధారమైనవాడివి. వేద శరీరంతో యజ్ఞక్రియలు అధికం చేస్తావు. ఈ లోకంలో ఉండే సమస్త విద్యలు నీ శరీరమే. సర్వార్ధసాధనం కోరే వారికి నీవే సాధనీయుడవు. ఆత్మనిష్ఠాగరిష్ఠులు పొందదగిన ఆత్మవు నీవే. నీవే కాలస్వరూపుడవై ప్రాణికోటి ఆయువును నశింపచేస్తావు. నీవు జ్ఞానమూర్తివి. విజ్ఞానమూర్తివి కూడా నీవే. నీవు ఆద్యంత రహితుడవు. అందరి అంతరాత్మ నీవే. బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు మూలమైన పరమాత్మవు నీవే. నీవే జీవలోకానికి జీవాత్మవు. ఈ సమస్త ప్రపంచం నీవే. నీవు కాకుండా ఈ విశ్వంలో రవంతకూడా లేదు. అందరికి తెలిసేలా వ్యక్తుడవుగా ఉండక పరమాత్మవై, సనాతనుడవై, అనంతుండవై నీవు ప్రాణ ఇంద్రియ మనోబుద్ధి గుణాలను స్వీకరించి, పరమేశక్తి అనే విశేషమైన పదవిలో ఉండి స్థూలశరీరంతో ఈ ప్రపంచమంతా విస్తరిస్తావు. భగవంతుడవైన నీకు నమస్కరిస్తాను. అంటూ మరియు ఇలా అన్నాడు.
ఓ దయానిలయా! అభవా! బ్రహ్మదేవా! నీవలె కోరిన వారి కోర్కులు తీర్చి నేరుపుతో నిలబెట్టెవారు ఎవ్వరూ లేరు. నీ విచ్చే పక్షంలో కోరికలు నేను కోరుతాను.
ఓ భువనాధీశ! గాలిలో గాని, భూమిపై గాని; అగ్నిలో గాని; నీటిలో గాని ఆకాశంలో గాని; అష్టదిక్కులలో గాని; రేయింబవళ్ళలో గాని; చీకటి వెలుగులలో గాని; గ్రహాలు, రాక్షసులు, మృగాలు, సర్పాలు, దేవతలు, నరులు మొదలైన వారితో యుద్ధసమయంలో గాని, వివిధములైన అస్త్రశస్త్ర సమూహంచే గాని మృత్యువు లేని, రాని జీవనాన్ని నాకు అనుగ్రహించు.
అంతేకాక, హిరణ్యకశిపుడు యుద్దాలలో తనకు ఎదురులేని పరాక్రమాన్ని లోకపాలురను తృణీకరించగలిగే మహిమను, ముల్లోకాలను జయించే శక్తిని కోరాడు. అతని తపస్సుకు సంతసించిన బ్రహ్మ అసాధ్యాలైనప్పటికీ హిరణ్యకశిపుడు కోరిన వరాలను ఇచ్చి, అతనిని కరుణించి ఇలా అన్నాడు.
అన్నా! ఓ కశ్యప కుమారా! నీవు కోరిన ఈ వరాలు ఎవ్వరికీ సాధ్య పడేవి కావు. ఇటువంటి వరాలు పూర్వం ఎవ్వరూ కోరలేదు. నీ తపాన్ని చూచి సంతోషించి నీవు కోరిన వరాలన్నీ ఇస్తున్నాను. మంచి మనసుతో, ప్రపంచానికి శ్రేయస్సు కలిగించే నడవడికతో, నైపుణ్యంతో, బుద్ధి సంపదకలిగి చక్కగా జీవించుమా!
ఈ విధంగా బ్రహ్మ తిరుగులేని వరాలు ఇచ్చి ఆ దితిపుత్రుడైన హిరణ్యకశిపునిచే పూజలందుకొని, బ్రహ్మ దేవతలు సమూహాలుగా చేరి నమస్కరిస్తూండగా తన నివాసానికి చేరాడు. ఈ ప్రకారంగా ఆ రాక్షసాధిపతి హిరణ్యకశిపుడు వరాల కొల్లలుగా సంపాదించుకుని
ఓ మహారాజా! తన సోదరుడైన హిరణ్యాక్షుని విష్ణువు సంహరించినందుకుగాను పగబూని రవంత అయిన ఆదరం లేకుండా రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణుమూర్తిపై మదంతో విరోధాన్ని పెంచుకొన్నాడు.
దితికుమారుడైన హిరణ్యకశిపుడు ఎదిరించుటకు వీలులేని పరాక్రమంతో ఒకరోజు గంధర్వ సమూహాన్ని సంహరిస్తాడు. ఒకరోజు దేవతలను తరిమి కొడతాడు. ఒకరోజు సర్పాలను సుఖపడకుండా చేస్తాడు. ఒకనాడు నవగ్రహాలను కట్టి పడేస్తాడు. ఒకనాడు యక్షులను భయంకరంగా శిక్షిస్తాడు. ఒకనాడు పక్షులను ఎగరకుండా పట్టుకుంటాడు. ఒకరోజు సిద్ధులను ఓడించి బంధిస్తాడు. ఒకరోజు మనుష్యుల మదాన్ని అణచివేస్తాడు. ఒకరోజు కిన్నరులు, ఖేచరులు, సాధ్యులు, చారణులు, ప్రేతాలు, భూతాలు, పిశాచాలు, అడవిమృగాలు, విద్యాధరులు మొదలైన వారిని సంహరిస్తూ, రోజు కొక్కరకంగా అందరిని బాధిస్తున్నాడు.
ఓ రాజా! హిరణ్యకశిపుడు మిక్కిలి కోపంతో, బురుజులతో సహా కోటలన్నిటిని ధ్వంసం చేసి రాక్షసులు చుట్టూరా మోహరింపగా, అష్టదిక్పాలకుల నగరాలను వశపరచుకొన్నాడు.
ఓ పుణ్యాత్ముడా! రాక్షసరాజైన హిరణ్యకశిపుని తీవ్రమైన ఆజ్ఞకు లోబడి, చిక్కి దుర్దశ పొంది, రేయిం బవళ్ళు, దిక్కులు దైన్యంతో కట్టుబడ్డాయి.
పగడాలతో నిర్మించబడిన మెట్లుకలది, మరకతాలనే పచ్చరాళ్ళుగల ప్రాంతాలు గలది, వైడూర్య రత్నస్తంభాలతో కూడినది, వెన్నెలతో సమానమైన తెల్లని స్పటికాలతో చేయబడిన గోడలు కలది, పద్మరాగ పీఠాలతో, బంగారంతో చేయబడిన తలుపులు, గదులు, గూళ్ళు, కిటికీలు కలది, వ్రేలాడు ముత్యాలదండలతో శోభించే తెల్లని పాన్సులు కలది, వివిధాలైన విచిత్రాలైన విమానాలు కలది, ఎల్లప్పుడు సువాసనలు వెదజల్లే పూలతో పళ్ళతో కూడిన చెట్లుగల తోటలు కలది; బంగారు పద్మాలతో, సౌగంధిక పుష్పాలతో నిండిన సరస్సులు కలది, రమణీయాలైన రత్నభవనాలు గలదియు, మనసుకు ఆనందం కలిగించే చల్లని సువాసనాభరిత మందవాయువులు కలది, సుకుమార మధురశబ్దాలు చేయు చిలుకల కోకిలల సమూహం కలది అయిన విశ్వకర్మ నిర్మితమై త్రిలోకరాజ్యలక్ష్మీ శోభితమైన మహేంద్రుని భవనంలో ఆ దానవరాజు హిరణ్యకశిపుడు ప్రవేశించి
దితియొక్క కుమారుడైన హిరణ్యకశిపుడు ముల్లోకాలకు ప్రభువై దేవేంద్ర సింహాసనం అధిష్టించి ఉండగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప మిగిలిన యక్ష్మ కిన్నరులు, మరుత్తులు, గంధర్వులు, సిద్దులు మొదలైనవారంతా భయంతో కలిసికట్టుగా అతనిని కొలిచి పాదాభివందనాలు ఆచరిస్తూ కానుకలు సమర్పిస్తున్నారు.
హిరణ్యకశిపుడు ఈ రోజు ఏ దిక్పాలకుని మీద కోపగించుకుంటాడో, ఏ దేవుని బంధిస్తాడో; ఏ దిగ్భాగంమీద దాడి చేస్తాడో, ఏ ప్రాణులను చంపుతాడో అనుకుంటూ దేవతలందరూ తాము ఎవరికి వారు భయంతో గగుర్పాటు పొందిన శరీరాలతో వారి వారి ఆస్థానాలలో ఉండే వేదికలపైకి ఎక్కి దేవేంద్రాది దేవతలు రహస్యంగా నిక్కి చూస్తుంటారు.
ఓ ధర్మరాజా! దేవతలకు శత్రువైన హిరణ్యకశిపుడు పరిశుద్ధమైన కర్పూరంతో పరిమళభరితమైన తీయని నూతనమైన మధువును తాగుటచేత సుఖంలో మునిగి ఉన్నాడు. అలజడిగా కాక శాంతిగా వుండడానికి దేవతలారా! మీరు కలకలం మానండి. తాపసులారా! మీరు దీవించండి; ఓ సర్పశ్రేష్ఠులారా! గర్వంతో మీ పడగల నెత్తకండి. దిక్పాలులారా! మీరు చక్కగా నమస్కరించి వెళ్ళండి. ఓ గంధర్వ శ్రేష్ఠులారా! మీరు గానం చేయండి. సాధ్యులారా! మీరు సందడి చేయకండి. అప్సరఃకాంతలారా! మీరు చక్కని నృత్యాలు చేయండి. ఓ సిద్దులారా! మీరు ఈ హిరణ్యకశిపుని చేరి మొక్కండి. అంటూ వేగులు నిత్యం హెచ్చరిస్తుంటారు.
ఓ ధర్మరాజా! దేవతలను ద్వేషించే ఆ హిరణ్యకశిపుడు లీలావతులతోకూడి ఉద్యానవనాలలో విహరిస్తూ మధువును సేవించడంవల్ల అతిశయించిన మదంతో చంచలమై తిరుగుతున్న ఎఱ్ఱటి కన్నులతో, కేళీవిలాసాలలో తేలుచున్నప్పుడు నారదుడినైన నేను, తుంబురుడు అతనిని (ఆ హిరణ్యకశిపుని) మా మా సంగీత ప్రసంగాలతో తప్పనిసరి పరిస్థితులలో ఆనందింప చేస్తుంటాం.
భూమిపై పలుచోట్ల పండితోత్తములు యజ్ఞయాగాది క్రియలు చేస్తుండగా, ఆ హిరణ్యకశిపుడు తానే వేగంగా అక్కడికి వచ్చి, ఆ హవిర్భాగాలు దేవతలకు ఇవ్వక దోచుకొంటున్నాడు.
అష్టదిక్పాలకుల గుణాలన్నీ ఆ రాక్షసరాజైన హిరణ్యకశిపుడే గైకొని ముల్లోకాలపై ఆధిపత్యం వహించి వృద్ధిలో ఉన్నవేళ సమస్త ద్వీపాలతో కూడియున్న భూభాగం దున్నకుండానే పంటలను ఇస్తున్నవి. ఆకాశం కామధేనువు మొదలైన వాటి వలె (కల్పవృక్షం, చింతామణి, కల్పలత వంటివివలె) యాచించే వారి కోరికలు సమృద్ధిగా కురుస్తున్నాయి. సప్తసముద్రాలు, నదులు వాటి తరంగాలచే రత్నాలను మోసుకొస్తున్నవి. వృక్షసముదాయం అన్నివేళల్లో అన్ని ఋతువుల గుణాలను కలిగి ఉన్నవి. అన్ని కాలాలలో అన్ని పూవులు పూస్తూ అన్ని పండ్లు పండుచున్నవి. పర్వతాలు మంచినీటితో బాగా నిండిన లోయలతో ఒప్పారి ఉన్నవి.
ఇట్లు అన్ని దిక్కులను హిరణ్యకశిపుడు జయించాడు. అన్ని లోకాలకు నాయకు డయ్యాడు. తన ఇష్టానుసారంగా ఇంద్రియ భోగాలను అనుభవించి తనివి తీరక ధర్మమార్గాన్ని అతిక్రమంచి, బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో జనించిన అధికమైన అహంకారంతో హిరణ్యకశిపుడు ఐశ్వర్యం కలవాడై చాలకాలం రాజ్యం చేస్తున్న సమయంలో
దేవ, కిన్నర, సిద్ధ, సాధ్య, ముని, ఖేచరుల అధిపతులు అందరు, మాకు శరణు ఎప్పుడు దొరుకుతుంది? ఆ రాక్షసుడైన హిరణ్యకశిపుని బాధ మాకు ఎప్పుడు తొలగిపోతుంది? మాకు అభివృద్ధి ఎప్పుడు లభిస్తుంది? మాకు రక్షకులు ఎవరున్నారు? అనుకుంటూ ఆ శేషశాయిని, భవ బంధములు త్రెంచువానిని, శేషతల్పుడు, పద్మాక్షుడైన విష్ణుమూర్తిని శరణు వేడారు.
ఈ విధంగా హిరణ్యకశిపుని భయంకరమైన శిక్షలకు భయపడి మరెవ్వరిని శరణువేడక రహస్యంగా అందరూ కూడుకొన్నారు.
సకలజగదీశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఆత్మస్వరూపుడైన శ్రీపతి ఎక్కడకు వెళ్ళాడు? పరమశాంతులు, మునిశ్రేష్ఠులు, సన్యాసులు - ఏ దివ్యపదానికి వెళ్ళి తిరిగిరారో ఆ పరమపదంలో ఉండే పరంధామునికి, దిక్కులన్నిటికి దిక్కైన దివ్యమూర్తికి, చివరకు విశ్వమంతటినీ తనలో విలీనం చేసుకొనే ఆ దేవదేవునికి మేము అంజలి ఘటించి మమ్ము రక్షించవలసినదిగా మొక్కుతున్నాము.
అని యీ ప్రకారంగా ఆహారం నిద్ర విడిచి మనసు ఇతర విషయములపై నిలపక, కుదురుకొన్న బుద్ది గలవారై భగవంతుడు, మహాపురుషుడు, మహాత్ముడు, నిర్మలజ్ఞానానందస్వరూపుడు అయిన హృషీకేశునకు నమస్కరించే సమయంలో మేఘధ్వనితో సమానమైన శబ్దంతో దిక్కులు ప్రతిధ్వనించేలా సత్పురుషులకు అభయం ప్రసాదిస్తూ కనులకు కనబడకుండా పరమేశ్వరుడైన హరి ఇలా అన్నాడు.
ఓ దేవతలారా! మీరు భయాన్ని పొందకండి. మీకు భద్రం కలుగుతుంది నా దర్శన భాగ్యంచేత జీవకోటికి జయ లాభాలు సమృద్ధిగా కలుగుతాయి. హిరణ్యకశిపుని క్రియలు అసంబద్ధమైన మాటలు అన్నీ నేను ఎరుగుదును. కాలం కలసివచ్చినపుడు అతనిని నేను సంహరిస్తాను. అంతవరకు మీ మీ మార్గాలలో మీరు సంచరించండి.
సత్పురుషులపై, దేవతలపై, వేదాలపై, గోవులపై, బ్రాహ్మణులపై ధర్మమార్గంపై విష్ణువైన నాపై ఆ రాక్షసుడెప్పుడు కోపించి వైరాన్ని పొందుతాడో ఆనాడే ఆ రక్కసుడు హింసను పొందుతాడు.
తన కన్న కొడుకు ప్రహ్లాదుడు శమదమాది సద్గుణ సంపన్నుడనీ, అజాత శత్రువని భావించక ఆ హిరణ్యకశిపుడు ఆ ప్రహ్లాదునికి రోషంతో ఎప్పుడు ఆపదకలిగిస్తాడో ఆనాడే ఆ రక్కసుని నేను పట్టి సంహరిస్తాను.
ఈ హిరణ్యకశిపుడు బ్రహ్మ ఇచ్చిన వరబలం వల్ల ఇంతవాడై మిమ్మల్ని బాధపెడుతున్నాడు. ఇది నాకు తెలుసు. తెలిసినా ఇది సమయం కాదని ఇన్నాళ్ళు నేను సహించాను. ఇకపై వీనిని సంహరిస్తాను. మీరు నిర్భయంగా మీ మీ స్థావరాలకు వెళ్ళండి.
(భగవంతునికైనా సరే కాలనియతిని తప్పించ తరముకాదు. కనుకనే విష్ణువు దేవతలతో 'మీరు వేచి చూడండి. ఆ సమయం వచ్చినప్పుడు తప్పక సంహరిస్తాను'. అని మాట ఇచ్చాడు.)
ఈ ప్రకారంగా రాక్షసాంతకుడైన శ్రీమహావిష్ణువు దేవతలకు అభయమిచ్చాడు దేవతలు గుంపులు గుంపులుగా పరమాత్మకు మొక్కినారు. హిరణ్యకశిపుడు మరణించుట తథ్యమని వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోయారు. హిరణ్యకశిపునకు విచిత్రమైన నడవడిగల నలుగురు పుత్రులు జన్మించారు. వారిలో
ప్రహ్లాద చరిత్రము
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
పంచాంగం
Subscribe to:
Post Comments (Atom)
Prahlada Sent to Gurukula - ప్రహ్లాదుని విద్యాభ్యాసం
ప్రహ్లాదుని విద్యాభ్యాసం ఓ నారద మహార్షీ! బాలుణ్ణి, కాంతిగల వాడిని, హరిపాద పద్మాలను అనుదినం చింతించేవాడిని, దయాస్వభావం గలవాడిని, సత్పురుషులకు...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
No comments:
Post a Comment