మరుత్తులు
ఓ శుకమహార్షీ! మరుత్తులు నలబై తొమ్మిదిమంది ఏ కారణంగా ఇంద్రునకు ఆప్తులై ఎలా శాంతి పొందారు? ఇంద్రునితో సమానంగా ఎలా ప్రవర్తించారు? ఈ విషయాన్ని వినాలని ఉంది. తెలియజేయి.అనగా విని పరీక్షిత్తుతో శుకుడు - ఓ రాజా! వినుము. దితియొక్క కుమారులందరు దేవేంద్రునిచేత చంపబడుతూ ఉండగా కోపంతో, దుఃఖంతో దితి తనలో తాను మిక్కిలి తాపం పొంది బాధపడసాగింది. సోదరులను చంపుతున్న మిక్కిలి పాపాత్ముడైన ఇంద్రుణ్ణి చంపకపోతే నాకు సుఖం ఎక్కడిదని, ఈ ఇంద్రుణ్జి భస్మంచేసే కొడుకును కనాలని అనుకొన్నది. భర్త సమీపానికి చేరి పెక్కు భావాలతో, చక్కటి సంభాషణలతో, మిక్కిలిగా భర్తకు అవసరమైన పదార్థాలను అందిస్తూ, భక్తితో కూడినదై, సేవలతో, స్తుతులతో, సంభోగ క్రీడలతో మనఃపూర్వకంగా నమస్కారాలందిస్తూ ఆయనను సేవించింది.
సౌందర్యవతి అయిన దితి తన కడకంటి చూపులతో, అనురాగం పొంగి పొరలే శృంగార చేష్టలతో, చందమామవంటి అందమైన ముఖంలో చిందే అమృతంవంటి చిరునవ్వులతో, ప్రసన్నమైన ప్రసంగాలతో, అపురూపాలైన ఉపచారాలతో మగని మనస్సును లొంగదీసుకొన్నది.
సర్వమూ తెలిసిన కశ్యపుడంతటి వాణ్ణి దితి తన లీలావిలాసాలతో, రతుల సంగతులతో క్షణంలో మురిపించి మైమరపించింది. పతుల మతులను భ్రమింపజేయలేని సతులు లోకంలో ఉన్నారా?
ఎటువంటి ఆలోచన లేకుండా పురుషులు జీవిస్తున్నవేళ బ్రహ్మదేవుడు ఆ పురుషుల మనస్సులను సంతోషపెట్టడానికి స్త్రీలను సృష్టించాడు. భార్య తన భర్తను వశపరచుకోవడంలో విడ్డూరం ఏముంది?!
ఈ విధంగా తన భార్య అయిన దితిచే కశ్యపప్రజాపతి లాలింపబడి దితియందు ప్రేమతో ఇలా అన్నాడు. “ఓ సుందరీ! నీ యందు నేను ప్రసన్నత పొందాను వరం కోరుకో. భర్త ప్రసన్నుడైతే స్త్రీలకు కోరికలు తీరడంలో ఆశ్చర్యం ఏ ముంది? స్త్రీకి భర్తయే దైవం. సమస్త ప్రాణుల మనస్సులకు వాసుదేవుడే నిజమైన భర్త. ఆ వాసుదేవుడు అనేక నామాలతో అనేక రూపాలతో ఒప్పుతున్న దేవతామూర్తులచేత, పురుషులచేత భర్త రూపంలో సేవింపబడుతూ ఉంటాడు. విశేషమైన విషయం ఏమంటే ఆ పరమేశ్వరుడే భర్త రూపంలో స్త్రీలచేత సేవింపబడుతూ ఉంటాడు. కాబట్టి పతివ్రతలైన స్త్రీలు శ్రేయస్సును కోరి ఏకాగ్రమైన మనస్సుతో తమ తమ భర్తలను పరమాత్మగా భావించి సేవిస్తూ ఉంటారు. నీ సేవలకు సంతసించి నీకు వరం ఇద్దామని అనుకుంటున్నాను. దుష్ట శీలంగల వనితలకు ఎటువంటి వరాలు దక్కవుగదా. నీకు మాత్రం ఎవ్వరూ పొందలేని వరాలు ఇస్తాను కోరుకో” అన్నాడు కశ్యపుడు. అప్పుడు భర్తఅయిన కశ్యపునితో దితి ఇలా అన్నది.
ఓ నాథా! మీరు నాకు వరం ఇవ్వటానికి సుముఖంగా ఉన్నట్లయితే ఇంద్రుణ్జి జయించగలిగే ప్రసిద్ధమైన బలం, మిక్కిలి తేజస్సు, దైవత్వం, ఓటమి ఎరుగని తనం గలవాణ్ణి కుమారుడుగా నాకు ప్రసాదించు.
అనగా అటుపిమ్మట
దితి మాటలు విని కశ్యపుడు త్రుళ్ళిపడ్డాడు. ఉన్నట్లుండి ఈ కఠినురాలు ఇలాంటి క్రూరమైన వరం కోరిందే అని లోలోపల తల్లడిల్లాడు.
పరమాత్మను కాదని ప్రకృతికి లోబడి కర్మపాశంచే కట్టబడిపోయాను కదా! కుటిల స్వభావంగల స్త్రీయొక్క ఉన్మాదంలోను, మాయలోను పడి ఇంద్రియలోలుడైనవాడు పాపాలలో పడక తప్పదు; ఇలా చంచలాత్ముడనైన నన్ను చూచి దైవం పరిహసించదా?
చక్కెర తీపిని ధిక్కరించే పలుకులు, పద్మవిలాసంగల మోము, వెన్నెలచిందే చేష్టలు, కొత్త నెత్తురు చిమ్మే శరీరం, నిలువునా కరిగించే నేర్పు, పూలకు కూడా లేని వలపు, తమకాన్ని పెంచే ఆలోచన, మదిలో గల ఇష్టం మొదలైన లక్షణాలు కలిగి కరవటానికి సిద్ధంగా ఉన్న కాలనాగుతో సమానమైన ఆడువారి మానసిక వర్తనం నాకే కాదు లోకంలో ఎంతటి ధైర్యవంతులకైనా తెలియవీలవుతుందా?
సతులకు ఎవరు ఇష్టులో ఎవరు అనిష్టులో చెప్పలేం. స్త్రీలు తమకు మేలు కలగడానికి, తమ ఇష్టం నెరవేరడానికి భర్తలకైనా, సుతులకైనా, స్నేహితులకైనా హింస చేయడానికి వెనుకాడరు. ఈ స్త్రీలు పైవారిని హింసించడానికి తమ బలాన్నైనా ఉపయోగిస్తారు లేదా ఇతరుల బలాన్నైనా ఉపయోగించి తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటారు.
కశ్యపుడు దితి కోరికను గురించి చాల ఆలోచించి ఈమె కోరిన కోరికకు నేను ఏమని ప్రతివచనం ఇవ్వగలను? నామాట మొక్కవోనిది కదా! ముల్లోకాలు పాలించే ఇంద్రుడు చంపదగినవాడా! కాదు కదా! ఈమెకోరిక తీరకుండా ఉండడానికి, నామాట వ్యర్థం కాకుండా ఉండడానికి తగినవిధంగా ఒక అంశాన్ని కల్పిస్తాను అనుకొని దితిని చూచి ఓ సుందరి! నీవు కోరిన విధంగా దేవబాంధవుడైన ఇంద్రహంత అగు కుమారుడు నీకు కలుగుతాడు. ఒక సంవత్సరకాలం వ్రతం ఆచరించు. ఆ వ్రత విధానం చెబుతాను విను అని ఇలా చెప్పాడు.
“అన్ని జీవుల ఎడ హింసను విడిచి దయగలిగి ఉండాలి. కఠోరమైన మాటలు విడవాలి. కోపం విడిచిపెట్టాలి. అసత్యం ఆడకూడదు. గోళ్ళు, వెండ్రుకలు, కత్తిరించుకోకూడదు. ఎముకలు పుర్రెలు మొదలైన అమంగళ వస్తువులను అంటకూడదు. నదుల చెరువుల నీళ్ళతో మాత్రమే స్నానంచేయాలి. బావినీటితో స్నానం చేయకూడదు. దుర్జనులతో మాట్లాడకూడదు. ఒకమారు కట్టిన కోకనుగాని ఒకమారు ధరించిన పూలనుగాని మరల ధరించకూడదు.
ఒకరు తినగా విడిచిన అన్నంగాని; కాళికాదేవికి నివేదన చేసిన అన్నంగాని; కోతులు, కుక్కలు, పిల్లులు, రాబందులు, క్రిములు, చీమలు మొదలైనవి ముట్టిన అన్నంగాని; మాంసాహారంగాని; శూద్రులు తెచ్చిన అన్నంగాని, ఈ విధంగా శాస్త్రం నిషేధించిన ఐదు విధాలైన ఆహారాలను విడిచి దోసిలితో నీళ్ళు తాగకుండా, సంధ్యాకాలాల్లో జుట్టు విరబోసుకోకుండా, సముచితంగా మాట్లాడుతూ, మంగళకరాలైన అలంకారాలు ధరించి, బయలు ప్రదేశాల్లో సంచరించకుండా; పాదాలు కడుగనిదే నిద్రింపకుండా, తడికాళ్ళతో నీద్రింపకుండా; పశ్చిమ దిక్కున శిరసు ఉంచి నిద్రింపకుండా, దిగంబరంగా నిద్రింపకుండా సంధ్యాకాలాల్లో నిద్రించకుండా నిత్యం ఉదికి ఆరవేసిన వస్త్రాలు ధరిస్తూ శుచిగా సర్వమంగళాలంకారాలతో ఉండాలి. ఉదయకాలాలలో తూర్పుముఖంగా నిలిచి లక్ష్మీనారాయణులను అర్చించాలి.
ఆ లక్ష్మీనారాయణులకు ఆవాహనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, ఆభరణం, పుష్పం, ధూపం, దీపం, ఉపచారం అనే షోడశ ఉపచారాలు సమర్పించాలి. హోమంచేయగా మిగిలిన పదార్థాన్ని పండ్రెండుమార్లు అగ్నికి అందించి, నమస్కారంచేసి భగవంతునియొక్క మంత్రాన్ని పదిమార్లు మనసులో జపించి గంధపుష్ప అక్షతలతో ముత్తెదువలను పూజించాలి.
భర్తను భక్తితో సేవించి పుత్రుడు తన ఉదరంలో ఉన్నట్లుగా భావన చేయాలి. ఈ విధంగా మార్గశిరమాస శుక్షపక్షంలో పాడ్యమినాడు ప్రారంభించి ఒక సంవత్సరకాలం వ్రతం ఆచరించాలి. పండ్రెండు నెలల తరువాత చివరిరోజు విధివిధానంగా ఉద్యాపనం చేయాలి. ఈ పుంసవనం అనే వ్రతాన్ని పండ్రెండు నెలలు జాగరూకతతో చేసినట్లయితే నీవు కోరినవిధంగా కుమారుడు కలుగుతాడు" అని కశ్యపుడు చెప్పాడు. దితి కశ్యపుడు చెప్పిన ప్రకారం చేసింది. వ్రతంవల్ల గర్భం ధరించి వ్రతం జాగ్రత్తగా ఆచరిస్తోంది.
ఇంద్రుడు (పిన) తల్లి దితి అభిప్రాయం గ్రహించి ఆమెను అనుదినం రహస్యంగా సేవిస్తూ ఆమె వ్రతానికి అవసరమైన పుష్పాలు, ఫలాలు, సమిధలు, దర్భలు, ఆకులు, అంకురాలు మొదలైన వస్తువులను మూడుపూటలా తెచ్చి సమకూరుస్తున్నాడు. లేడిని అందిపుచ్చుకోవడానికి అదనుకోసం ఎదురుచూస్తున్న పులిలా దితివ్రతాన్నీ చేయాలనే తలపుతో ఎదురు చూస్తూ శుశ్రూషచేస్తూ తన పినతల్లి ధరించిన తేజస్సునకు భయపడుతూ సన్నగిల్లిపోతున్నాడు ఇంద్రుడు. ఇంతలో ఒకనాడు
(ఇచట ఇంద్రహంత అనే మాటకు ఇంద్రుని చంపేవాడు అని ఒక అర్ధం, ఇంద్రుడు చంపువాడుగా గలవాడు (అంటే ఇంద్రుని చేతిలో మరణించే వాడు) అని రెండవ అర్ధం స్ఫురిస్తున్నాయి.)
కశ్యపుని భార్య దితి ప్రతిదినం వ్రతం ఆచరిస్తూ సేవాకార్యక్రమాల వలన బడలి అలిసిపోయి, ఒకనాడు భోజనమారగించి కాళ్ళుసేతులు కడుగుకొనటం మరచిపోయి తన కర్మవశాన నిద్రపోయింది. దితి వ్రతభంగం ఎప్పుడు చేస్తుందా అని ఎదురుచూస్తున్న ఇంద్రుడు ఈ అవకాశాన్ని ఆసరాగా తీసికొని వెంటనే యోగమాయాబలంతో దితియొక్క గర్భంలోకి చొరబడ్డాడు. తీవ్రమైన కోపంతో దితిగర్భంలో అధిక తేజంతో ప్రకాశిస్తున్న బిడ్డను తన వజ్రాయుధంతో తెగగొట్టాడు. ఆ బిడ్డ ఏడు ముక్కలైపోయాడు. తెగిపడిన ఆ ఏడుముక్కలూ ప్రాణాలు కోల్పోక ఏడుగురు బిడ్డలుగా రూపొందారు.
ఇంద్రుడు ఖండించిన బిడ్డ ఏడుగురు బిడ్డలుగా మారి పెద్దపెట్టున ఏడ్వసాగారు. ఓరి ఓరి ఏడవకండి అంటూ ఇంద్రుడు ఆ ఒక్కొక్కణ్ణీ ఏడేసి ముక్కలుగా నలభై తొమ్మిది ముక్కలు చేశాడు. అలా ఖండించినప్పటికీ ముక్కలైన ఆ నలబై తొమ్మిదిమందీ నశించలేదు.
ముక్కలైన ఆ నలబై తొమ్మిదిముక్కలూ నలబై తొమ్మిదిమంది బిడ్డలుగా సూర్యప్రకాశసమానంగా వెలుగొందుతూ ఏక కంఠంతో ఇంద్రునికి దయగలిగేలా ఇలా అన్నారు.
ఇంద్రునిచేత ముక్కలు కావింపబడిన బిడ్డలు అందరూ ఇంద్రునికి చేతులు జోడించారు. 'మేము నీకు తోబుట్టువులం. మాకు కీడుచేయవలసిన పనిలేదు. మేము నీకు సేవకులమై 'మరుద్గణాలు' అనేపేరుతో నిన్ను సేవిస్తాం. మమ్మల్ని రక్షించు' అన్నారు. శ్రీమన్నారాయణుని దయవలన హాని పొందని మరుద్గణాల మాటలకు దయగలవాడై ఇంద్రుడు వారిని సహోదరులుగా స్వీకరించి హింసించడం మానుకున్నాడు.
ఓ పరీక్షన్మహారాజా! అశ్వత్థామ ప్రయోగించిన బాణాగ్నినుండి నారాయణునిచేత నీవు ఎలా రక్షింపబడ్డావో ఆ విధంగానే వజ్రాయుధం అంచులచేత ముక్కలైనవారు కూడా రక్షింపబడి ఆకృతులు ధరించి, కొద్దికాలం తక్కువగా సంవత్సరం పాటు విష్ణువును పూజించగా జన్మించినవారు గావున ఇంద్రునితోసహా నలబై తొమ్మిదిమంది మరుద్గణంగా దితిగర్భంనుండి పుట్టారు. అప్పుడు దితి మేలుకొని అగ్ని సమాన తేజస్సు కలిగి, ఇంద్రునితో సహా వెలుగొందుతూ ఉన్న కుమారులను చూచి సంతోషించకుండా ఇంద్రునితో ఇలా అన్నది.
నేను నీకు మృత్యువు కలిగించే కుమారుణ్ణి ఒక్కని కోరి అతి కష్టమైన వ్రతాన్ని ఆచరిస్తే నేను కోరిన రీతిగా ఒక పుత్రుడుగాక ఈ నలబై తొమ్మిదిమంది కుమారులు కలగటానికి కారణం ఏమిటి? నీకు తెలిసిన నిజాన్ని చెప్పు అని ఇంద్రుణ్ణి దితి ప్రశ్నించింది. ఇంద్రుడు దితికి బదులు చెప్పాడు. తల్లీ దితీ! నీవు చేస్తున్న కఠోరమైన వ్రతాన్ని, నీ కోరికను నేను గమనించాను. నీకు నియమభంగం ఎప్పుడవుతుందా! అని ఎదురుచూచి నీవు కాళ్ళూ చేతులూ కడుక్కోకుండా నిద్రించి నియమభంగం చేసినవేళ నీ గర్భంలో యోగమాయాబలంతో ప్రవేశించాను. పాపబుద్ధి కలిగి, వజ్రాయుధంతో నీ గర్భస్థ శిశువును ఖండించాను.
ఆశ్చర్యంగా ఆ బిడ్డ నా వజ్రఘాతానికి నశింపకుండా ఈ విధంగా నలబై తొమ్మిదిమంది కుమారులు అయ్యింది. అయినా మహాత్ములను పూజిస్తే కార్యసిద్ధి కలుగకుండా ఉండదు గదా! ఎవరు ఎటువంటి కోరికలూ లేక భగవదారాధన చేస్తారో వారు ఇహపరలోకాలలో అన్ని ప్రయోజనాలూ నిశ్చయంగా పొందుతారు.
ఆ మహాపురుషుడైన విష్ణుమూర్తియొక్క వ్రతాచరణంవల్ల జన్మించిన తేజస్సును ఎవ్వడు నివారించగలడు? దుష్టబుద్ధితో, మూర్ఖత్వంతో నేను చేసిన ఈ దోషాన్ని ఈ దుర్మార్గాన్ని తల్లివైన నీవు తప్ప ఎవ్వరు క్షమించగలరు? పాపాత్ముడనైన నన్ను కాపాడు. నేను నీ పుత్రులతో సమానుడను అని మోసంలేకుండా స్వచ్చంగా మాట్లాడాడు ఇంద్రుడు. ఇంద్రుని ప్రార్థన విన్న దితి అట్లే అగుగాక అని శాంతమైన మనస్సుతో అంగీకరించింది.
ఇంద్రుడు మరుద్గణంతో స్వర్గానికి పోయి ఆ మరుద్గణానికి సోమపాన అర్హత, హవిర్భాగాన్ని గ్రహించడం అనే విషయాలు సమకూర్చి దితి పుత్రులకు ఎవ్వరికీ లేని గౌరవాన్ని ఇచ్చి సుఖంగా ఉన్నాడు అని చెప్పి పరీక్షిత్తుతో యోగీంద్రుడైన శుకమహర్షి మరల ఇలా అన్నాడు.
వరాలు ఇచ్చే విష్ణుమూర్తియొక్క వ్రతమై, విష్ణుమూర్తి అంశతో జన్మించిన దేవతలయొక్క ఆవిర్భావాన్ని స్ఫురింపచేస్తూ ఉన్న ఈ కథను పఠించినవారికి అనేక జన్మార్జిత పాపాలు హరించిపోవటం నిశ్చయం కదా!
ఈ విధంగా విష్ణుమూర్తియొక్క కథలను వినటంలో ఆసక్తిగల శౌనకాది మహామునులకు సూత పౌరాణికుడు పరీక్షిత్తునకు యోగివర్యుడైన శుకమహర్షి చెప్పాడని తెలియజేసి
రాజీవరాజపూజ్య, శ్రీజిత గోపీకటాక్ష సేవాంతర వి
భ్రాజితమూర్తి! మదోద్ధత, రాజకులోత్సాద రామరాజాఖ్యనిధీ!
మురవిదారణ! ముఖ్య కారణ! మూలతత్త్వ విచారణా!
దురితతారణ! దుఃఖవారణ! దుర్మదాసుర మారణా!
గిరివిహారణ! కీర్తిపూరణ! కీర్తనీయ మహారణా!
ధరణిధారణ! ధర్మతారణ! తాపసస్తుతి పారణా!
మురవిదారణ! ముఖ్య కారణ! మూలతత్త్వ విచారణా!
దురితతారణ! దుఃఖవారణ! దుర్మదాసుర మారణా!
గిరివిహారణ! కీర్తిపూరణ! కీర్తనీయ మహారణా!
ధరణిధారణ! ధర్మతారణ! తాపసస్తుతి పారణా!
కరుణాకర! శ్రీకర! కంబుకరా!, శరణాగత సంగత జాడ్యహరా!
పరిరక్షిత శిక్షిత భక్తమురా!, కరిరాజ శుభప్రద! కాంతిధరా!
వికసించిన కమలాల కాంతులను జయించే కటాక్ష వీక్షణాలుగల గోపీజనులచే సేవింపబడే కాంతిమంతమైన ఆకృతికలవాడా! మదించిన రాజాధముల వంశాలను నిర్మూలించినవాడా! రామ నామంతో నిధియై అందరకూ సంపదలనిచ్చే వాడా!
మురాసురుని సంహరించినవాడా! జగాలకు మూలకారణమైన వాడా! మూలతత్త విచారణచేత తెలియదగినవాడా! పాపాలనుండి దాటించేవాడా! దుఃఖాలను నివారించేవాడా! దుర్మదరాక్షసులను సంహరించేవాడా! గిరివిహారం చేసేవాడా! లోకాలను కీర్తితో నింపినవాడా! కీర్తింపదగిన యుద్ధనైపుణ్యం గలవాడా! భూభారాన్ని వహించేవాడా! ధర్మాత్ములను దరికి
చేర్చేవాడా! మునుల స్తుతులకు పాత్రమైనవాడా!
పరిరక్షిత శిక్షిత భక్తమురా!, కరిరాజ శుభప్రద! కాంతిధరా!
వికసించిన కమలాల కాంతులను జయించే కటాక్ష వీక్షణాలుగల గోపీజనులచే సేవింపబడే కాంతిమంతమైన ఆకృతికలవాడా! మదించిన రాజాధముల వంశాలను నిర్మూలించినవాడా! రామ నామంతో నిధియై అందరకూ సంపదలనిచ్చే వాడా!
మురాసురుని సంహరించినవాడా! జగాలకు మూలకారణమైన వాడా! మూలతత్త విచారణచేత తెలియదగినవాడా! పాపాలనుండి దాటించేవాడా! దుఃఖాలను నివారించేవాడా! దుర్మదరాక్షసులను సంహరించేవాడా! గిరివిహారం చేసేవాడా! లోకాలను కీర్తితో నింపినవాడా! కీర్తింపదగిన యుద్ధనైపుణ్యం గలవాడా! భూభారాన్ని వహించేవాడా! ధర్మాత్ములను దరికి
చేర్చేవాడా! మునుల స్తుతులకు పాత్రమైనవాడా!
కరుణకు నిలయమైనవాడా! సంపదలు కలిగించేవాడా! శరణని చేరినవారికి చైతన్యం కలిగించేవాడా! ఆర్హులను రక్షించి మురాసురాదులను శిక్షించేవాడా! గజేంద్రునకు శుభాన్ని ప్రసాదించినవాడా! దివ్యతేజస్సును ధరించినవాడా!
॥ శ్రీకృష్ణార్పణమస్తు ॥
No comments:
Post a Comment