Thursday, March 12, 2026

Disguised as a child by yama and said the story of suyagnu - బాలవేషము దాల్చిన యముండు దెలిపెడు సుయజ్ఞోపాఖ్యానము

బాలవేషము దాల్చిన యముండు దెలిపెడు సుయజ్ఞోపాఖ్యానము

తల్లీ! పరమాత్మ ఏ లక్షణాలు లేనివాడైనప్పటికీ, లక్షణాలు కలవానివలె, కర్మలతో కలిసియుండుటచే యోగాన్ని వియోగాన్ని పొందుతాడు. జన్మము, మరణము, దుఃఖము, వివేకము, అజ్ఞానము, చింత, స్మరణము అనేవి పలురకములుగా ఉంటాయి. ఈ పరమార్థాన్ని చెప్పే సందర్భంలో పెద్దలైనవారు ప్రేతబంధు యమసంవాదమనే ఇతిహాసాన్ని చెపుతూ ఉంటారు. ఆ కథను చెపుతాను విను.

ఉశీనరదేశంలో సుయజ్ఞు డనే రాజు ఉన్నాడు. అతడు యుద్ధంలో శత్రువులచే మరణాన్ని పొంది ఉన్న సమయంలో

చినిగిన రత్నకవచం, రాలిన ఆభరణాలు, బాణాలచే కొట్టబడిన వక్షఃస్థలం, కారుతున్న రక్తం, చెదిరి జారిన జుట్టుముడి, కోపంతో పెదవుల్ని పంటితో కొరుకుతూ, రెప్పపడని నేత్రాలు, దుమ్ము ధూళితో ఉన్న ముఖపద్మం, తెగిపడిన బాహుదండాలు కలిగి జీవం లేని ఉశీనరరాజును బంధువులు చుట్టుముట్టారు. అతని భార్యలు భయంతో కూడి

ఆ రాజు భార్యలందఱూ జుట్టు ముడులు వీడిపోగా, తాము ధరించిన హారాలు తెగిపడగా, చేతులతో గుండెలపై బాదుకుంటూ, ఓ నాథా! అంటూ, గతంలో అతనితో కలిసిమెలసి ఉన్న వేళలలో జరిగిన అనేక అంశాలను గుర్తు చేసుకుంటూ, తమ వక్షాలపై రాసికొన్న ఎర్రని కుంకుమ కన్నీటితో కరిగి అతని పాదాలపై వర్షించగా, విలపించారు.

ఓ పుణ్యాత్ముడా! పూర్వం బ్రహ్మదేవుడు నిన్ను, ఉశీనర దేశప్రజలకు సంపదలతో ఆనందం కల్గించడానికి సృష్టించి; ఇప్పుడు నిర్దయుడై నిన్ను తొలగించాడే! ఈ ప్రజలకు, సుతులకు, మాకు నీవు తప్ప దిక్కుఉందా! ఓ రాజా! సోదరులను, మిత్రులను, పుత్రులను వదలిపోవడం నీ వంటివానికి తగునా!

ఓ నృపాలా! మాకు నిన్ను విడిచిన క్షణాలు యుగాలుగా ఉంటాయి కదా! (నిమిషం సంవత్సరంలా గడుస్తుంది కదా!) ఇలా నీవు తిరిగిరాకుండా పరలోకానికి వెళ్ళిపోతే, మేము ఈ లోకంలో ఎలా ఉండగలం?! ఈ ప్రపంచంలో నీవు లేకుండా బతకడానికి మేము ఇష్టపడం. నీ పాదద్వయాన్ని చూచే నిమిత్తం మేము కూడా ఈ చితిమంటలలో దుముకుతాము.

ఈ ప్రకారంగా ఆ సుయజ్ఞుని భార్యలు భర్త శవందగ్గర విలపిస్తుండగా, సూర్యాస్తమయ సమయంలో వారి దుఃఖవాక్యాలు విని యముడు బ్రాహ్మణ బాలకుని రూపంలో వచ్చి ఆ శవంయొక్క బంధువులతో ఇలా అన్నాడు.

ప్రాణికోటికి సహజమైన విషయం ఒక్కటి ఉన్నది. ఎక్కువగా మక్కువ పెంచుకోవడం ఒక విచిత్రం. ప్రాణులు పుడుతూ చస్తూ ఉంటారు. అయినా చనిపోయినవారి కొరకు వీళ్లు చావనివాళ్లలాగా దుఃఖపడుతూ ఉంటారు. చావును ఎవరైనా తప్పించుకో గలరా! ప్రాణులన్నీ ఎక్కడ నుండి పుట్టాయో అక్కడికే వెళ్ళడం సహజమైన విషయం కదా!

(ఈ పద్యమే మానవుల నైజగుణాన్ని ఒక సూక్తిగా మలచి వ్రాసినాడు పోతన. ఇది ఒక వేదాంతార్థసూక్తి! “చచ్చినవారికేడ్చెదరు చావక మానెడు వారి భంగి" అనే వాక్యం, దుఃఖమనేది వాస్తవికమైన మృత్యువు ముందు ఎంత హాస్యాస్పదమో నిరూపిస్తున్నది.)

తల్లిదండ్రులను విడిచికూడా పసిపిల్లలమై వుండి, తోడేళ్ళవంటి మృగాల బారినపడకుండా అడవులలో అయినా బ్రదుకగలం. ఎందుకంటే భూమిపైకి రాకముందు తల్లిగర్భంలో ఉండగా మనలను ఎవడు పోషించడం వల్ల బ్రదికి ఉన్నామో. ఆ పరమాత్మయే నిజమైన పోషకుడు.

ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించి, రక్షించి, నశింప చేసే వాడెవడో ఆ అనంతశక్తి సంపన్నుడు ఎవడో, ఈ విశ్వానికి ప్రభువు ఎవడో, అతడే లీలావిలాసంతో ఈ లోకాలను రక్షిస్తూ పోషిస్తూ ఉంటాడు.

దైవయోగం బాగున్నప్పుడు మన ధనం బైట పారవైచినా సురక్షితంగా ఉంటుంది. అలా కానప్పుడు ఇంట్లో మూల భద్రంగా దాచినా మటు మాయమై పోతుంది. బలహీనుడు కూడా దైవయోగం బాగుంటే అడవిలో ఉన్నా హాయిగా బతికే ఉంటాడు. అలా కాని పక్షంలో భవనంలో రక్షణతో భద్రంగా ఉన్నా వాడు మరణిస్తాడు.

ప్రాణులన్నీ కాలకర్మవశాలై పుడతాయి, జీవిస్తాయి, మరణిస్తాయి . ఇది ప్రకృతిలో జరిగే అంశం. కాని ఆత్మమయుడైన పరమాత్మ ఆ ప్రకృతి గుణాలు అంటనివాడై, అగమ్యుడై అనగా ఎవ్వరును చేరలేనివాడై ఉంటాడు.

పంచభూతాలతో కూడిన ఈ దేహము ఒక భవనం వంటిది. అందులో ఆత్మ అనే పురుషుడు పురాకృత కర్మల కారణంగా ఒక్కసమయంలో ఉంటాడు, వెలుగుతాడు, సమయం వస్తే వెళ్ళిపోతాడు. శరీరం నశిస్తుంది తప్ప, అందులో వున్న ఆత్మ(పురుషుడు) నశించదు. ఆత్మకు రవంతకూడా చేటు రాదు. పురుషునకు దేహానికి భేదం ఉంది కాని, ఆ రెండూ ఒకటి కావు. కట్టెలలో అగ్ని ఉన్నట్లుగా, శరీరాలలో గాలి కదులుతున్నట్లుగా, తామరతూడులో శూన్యం ఉన్నట్లుగా, దేహికి దేహానికి గల భేదాన్ని తెలుసుకోవాలి.

(ఇక్కడ దేహమనగా 'ప్రకృతి' చే నిర్మించబడిన పాంచభౌతిక దేహం. 'దిహ ఉపచయే' అని ధాతువు. వృద్ధిపొందే లక్షణం కలది దేహం. దేహియైన జీవుడు నివసించేది దేహం. ఇది ప్రాకృతికమైనది. 'ప్రకృతి'లో పరిణామం సహజం. అందుచేత కాలగతిలో శరీరం నశిస్తుంది. దేహాన్ని ఆశ్రయించిన దేహి (జీవుడు)కి మరణం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే - ఎటువంటి వికారాలు మార్పులు లేనిది జీవాత్మ! అది మరోశరీరాన్ని ఆశ్రయిస్తుంది. 'షడ్భావవికారములు గలది శరీరం' అవి ఉన్నది, పుడుతున్నది, పెరుగుతున్నది, మారుతున్నది, క్షీణిస్తున్నది, నశిస్తున్నది. 'దేహంబు సెడుంగాని పురుషుండు సెడండాతనికి నింత సేటు లేదు' అన్నవాక్యంలో దేహం= శరీరం నశించేది; పురుషుడు= దేహి (జీవుండు) నశింపడు.

అని పలుకుతూ ఇంకా ఇలా అన్నాడు.

ఓ వెర్రులారా! ఈ రాజు నిద్రిస్తుంటే ఎందుకు దుఃఖిస్తారు! మాటలు మాట్లాడే, వినే జీవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు; ప్రాణభూతంగా ఉన్న వాయువు ఉన్నా, అది విడిగా భాషించడం కాని, వినడం గాని చేయలేదు. జీవుడు ప్రాణికి దేహానికి వేరుగా ఉండి అతడే ప్రధానుడై ఇంద్రియ ప్రభావంతో ఉంటాడు. పంచభూతాలు, ఇంద్రియాలు మనసులతో లింగదేహాలను అతడు కలుస్తూ ఉంటాడు. విడుస్తూ ఉంటాడు. అసలు ఈ వ్యాపారానికి ప్రభువు మరొకడున్నాడు. అతడే పరమాత్మ. ఈ రాజు మరణించాడని మీరు బాధ పడవలసిన పని లేదు. దుఃఖంతో దొర్లవలసిన పని కూడా లేదు.

ఆత్మ, దేహంతో ఎంతవరకు కలసి ఉంటుందో అంతవరకే ఈ కర్మయోగ సంబంధం ఉంటుంది. ఆత్మ, దేహాన్ని విడిచిన తరువాత ఈ సంబంధాలు ఉండవు. మాయకు గురియై ఎందుకు వ్యర్థంగా చింతిస్తారు?!

మహామాయా మోహితులైన కొందరు - స్నేహితులు, తల్లులు, తండ్రులు, కుమారులు, ఆశ్రితులు, భార్యలు మంచి గృహాలు అంటూ కొన్ని ఏర్పరుచుకుంటారు. స్వప్నంలో కనిపించిన అర్థాలు (విషయాలు) సత్యాలా! కాదు కదా! నిజానికి కర్మబంధంవల్లనే కలయిక, కర్మ నశిస్తే నిస్సంగం కలుగుతూ ఉంటాయి.

ఈ మాయాప్రపంచ లక్షణం ఎరిగిన, తత్వం తెలిసిన మహాత్ములు నిత్యమైన వాటికి సుఖం పొందరు. అనిత్యం అయినవాటికి దుఃఖం పొందరు. కొందరు అజ్ఞానులు మాత్రమే ఈ సంయోగ వియోగాలకు సుఖ దుఃఖాలు పొందుతారు. పూర్వం ఒక భయంకరారణ్యంలో ఒక బోయవాడు పక్షులను సంహరించేవాడు. అతడు ఒకనాడు సూర్యోదయాన లేచి, వేటాడాలనే ఆసక్తితో, బయలుదేరాడు.

వలలు, ఉచ్చులు, జిగురు కండెలు, చద్ది అన్నపుమూట, చిక్కము తీసుకున్నాడు. ఇంకా విల్లంబులు తీసుకొని, పక్షులను వేటాడే ఉత్సాహంతో బాణాలు వేసికొంటూ అడవిలోకి వెళ్లాడు.

ఈ విధంగా అడవికి వెళ్లాడు. ఆ అరణ్యంలో

మిక్కిలి ఆగ్రహంతో, పొదల మాటున, ఉరిగోలలతో పిట్టలను పట్టుకొని, కఠినంగా వాటి రెక్కలను విరిచి చిక్కెంలో వేసికొంటూ లోకభయంకరంగా ఆ అడవిలో ఆ కిరాతుడు సంచరించాడు.

మరియు అన్ని విధాల పక్షులను చంపుతూ పక్షులను సంహరించడానికి ఒడిగట్టిన ఆ కిరాతుడు తన ముందు దైవవశాన ఎగిరి సంచరిస్తున్న అడవి పిచ్చుక జంటలో ఆడపక్షిని ఉరిగోల వేసి పట్టుకొని తన చిక్కంలో వేసుకున్నాడు. అది జూచి మగపక్షి దుఃఖిస్తూ ఇలా అంది.

ఇతరులకు ఎవ్వరికీ ఏ కష్టం కలిగించకుండా, అడవులలో మేతమేసి సంచరించే మనకు, కఠినాత్ముడైన బ్రహ్మ ఈ బోయవాని చేతిలో పడే వ్రాతను మన నుదుట వ్రాశాడు. పాడుదైవం చూపులకు, మన బ్రదుకు ఇంత బరువయ్యిందా? ఓ ప్రియురాలా! అయ్యో! ఇంకేమి చెప్పమంటావు!

ఈ బోయవాని వలలో మనం అందరం ఒకే మారు పడేలా చేయకుండా, వంచన చేయడంలో నేర్పరియైన దైవం నిన్నొక్కదానినే ఈ బోయవాని వలలో పడేలా చేశాడు. ఈ విధి వికృత చేష్టలను ఏమని చెప్పగలను?

పిల్లలకు ఇంకా రెక్కలు రానే రాలేదు. తెల్లవారేసరికి ఆకలి వేస్తే దుఃఖిస్తాయి, తప్ప గూటినుండి ఎగరలేవు. నా తల్లి ఈ వైపునుండి వస్తుంది కదా అని చూపులు త్రిప్పకుండా మెడను పైకెత్తి దీనత్వంతో చూస్తూ ఉంటాయి. ఎలా నేను భరించగలను?!

అని ఈ విధంగా పలుకుతుండగా గొంతు ఎండిపోయేలా గద్గద స్వరంతో, బాధ పడుతున్న ఆ మగపక్షిని కూడా పట్టి చంపే ఆసక్తితో వున్న బోయవాడు ఒక్క బాణంతో గురితప్పకుండా నేల కూలేలా కొట్టాడు.

ఎంతటి సుగుణ సంపన్నులైనా కాలం సమీపించినట్లయితే, నేలకూలక తప్పదు గదా! అలాగే అంత్యకాలం చేరువ కాగానే ఈ మగపక్షి ఆ బోయవాని బాణపు దెబ్బకు పెద్దధ్వనితో నేల గూలింది.

ఓ దుఃఖితులైన కాంతలారా! మీరు కూడా మీ మరణ సమయాన్ని గుర్తించ లేరు. నేలగూలి మరణించిన ఈ రాజు దేహంపై పడి ఏడ్చినా, వందేళ్లకైనా మీరు అతనిని చేరలేరు. వెళ్ళిపొండి. అయినా చనిపోయిన వారు తిరిగి వస్తారా!

ఈ ప్రకారంగా మాయాబాలుడై అక్కడ తిరుగుతున్న యముని ఓదార్పు మాటలు విని సుయజ్ఞుని బంధువులంతా ఆశ్చర్యపడ్డారు. ఈసమస్త ప్రపంచం అశాశ్వతం అని తెలిసికొని, దుఃఖపడకుండా సుయజ్ఞునికి ఉత్తరక్రియలు జరిపించి వెళ్ళిపోయారు. ఆ తరువాత యముడు అదృశ్యం అయిపోయాడు. అంటూ హిరణ్యకశిపుడు తన తల్లిని, తమ్ముని భార్యలను చూచి ఇలా అన్నాడు.

వీళ్ళు పరాయివాళ్ళు, వీళ్ళు మనవాళ్ళు అని అనుకుంటారు గాని, పరికించి సత్యం గుర్తిస్తే, అందరూ ఒక్కటే. ఈ తత్త్వం తెలియక పోవడంవల్లనే ప్రాణులందరికీ “వారు - మేము” అని భేదభావం కలుగుతున్నది.

అని హిరణ్యకశిపుడు స్పష్టంగా చెప్పగా తల్లి దితి, కోడళ్ళు, దుఃఖాన్ని దిగమింగి, తత్త్వాన్ని గ్రహించారు. పరలోకానికి చేరిన హిరణ్యాక్షుని గూర్చి దుఃఖపడకుండా వెళ్లారు. అని చెప్పి, నారదుడు ధర్మరాజుతో ఇంకా ఇలా అన్నాడు.

హిరణ్యకశిపుడు మరణం, ముసలితనం లేని స్థితిని, ఎదురులేని ముల్లోకాధిపత్యం, ఇతరులందరినీ జయించగల భుజబలం, సింహబలం కావాలని కోరుకున్నాడు.

ఇటువంటి వరాలుకోరి హిరణ్యకశిపుడు మందరాచలంయొక్క కొండపల్లపు ప్రాంతానికి చేరి, అక్కడ తన కాలిబొటన వ్రేలుపై నిలబడి, చేతులు పైకెత్తి, ఆకాశం వైపు చూస్తూ తీవ్రమైన కిరణాలతో కూడిన ప్రళయకాల భాస్కరునివలె పొడవైన ఎరుపురంగు జటలతో, ఎవ్వరు తేరిపార చూడలేనట్లుగా పరమఘోరమైన తపస్సు చేస్తున్నాడు. దేవతలంతా చేష్టలుడిగి వారివారి స్థానాలలో ఉండి చూస్తున్నారు. ఇలా ఉండగా,

అతికష్టమైన ఆచారంతో హిరణ్యకశిపుడు తపస్సు చేయగా, పర్వతాలతో సహా భూమి అదిరింది. సప్తసముద్రాలు కల్లోలమయ్యాయి. గ్రహాలన్నీ ఉమ్మడిగా దిక్కులు పగిలి మండాయి. హిరణ్యకశిపుని తపస్సుయొక్క వేడిమితో అతని శిరస్సునుండి పొగతో కూడి, ఎగిసి పడే మంటలకు జంతుకోటి గుండెలు అదిరిపోయాయి.

ఈ విధంగా రాక్షసరాజు హిరణ్యకశిపుని తపస్సుయొక్క తీవ్రత మూడులోకాలను బాధించగా, దేవతలు సహింపలేక స్వర్గాన్ని విడిచి బ్రహ్మలోకానికి వెళ్ళి సకలలోక పాలకుడైన బ్రహ్మకు నమస్కరించి ఇలా విన్నవించారు.

ఓ దేవ దేవా! కరుణానిలయా! బ్రహ్మదేవా! దితి పుత్రుడు హిరణ్యకశిపుడు చేస్తున్న తపోదీక్షవల్ల వచ్చిన వేడిచేత మేమందరం బాగా తపించి పోయాం. ఆందోళనతో ఈ అమరావతిలో ఉండలేం. మాకు దిక్కు తెలియక ఉన్నాం.

ఓ దేవా! మూడులోకాలను నశింపచేయాలనో, దేవతలను అణగద్రొక్కాలనో, వేదశాస్రాల వినాశనమో కోరి ఈ హిరణ్యకశిపుడు ఈ తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. ఇందులో రవంతైనా సందేహం లేదు. ఈ హిరణ్యకశిపుని ఆలోచనకు ప్రతీకారం ఏమి చేస్తే బాగుంటుందో ఆలోచించు!

ఓ ప్రభూ! నీవు నీ తపోబలంతో దేవపాలకులందరికంటె గొప్పవాడవై జగత్తులను సృష్టించి సంపదతో శోభిస్తుంటే ఈ హిరణ్యకశిపుడు తన తపస్సుతో ఈ లోకాలన్నిటిని హింసించి ఇంకొక క్రొత్త ప్రపంచనిర్మాణం చేసే శక్తిని మనసులో కోరుతున్నాడు.

అంతేగాక కాలానికి అధీనమైన జీవులు అశాశ్వతులు కనుక; తపస్సు, యోగము, సమాధి బలంతో తనకు శాశ్వతత్వం కలగాలని హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు అంటూ, ఇంకా ఇలా అన్నారు.

ఓ లోకాధీశ్వరా! నీ మహోన్నతమైన బ్రహ్మపీఠాన్ని కొనియాడబడే నీ ఐశ్వర్యాన్ని విజయాన్ని సౌఖ్యాన్ని సంతోషాన్ని లోకులపాలు చేయడానికి సిద్ధపడిన ఈ హిరణ్యకశిపుని తపస్సును నివారించి నీ పరిపూర్ణమైన దయతో ఈ లోకాలను కాపాడు.

No comments:

Post a Comment

The Story of Prahlada - ప్రహ్లాద చరిత్రము

ప్రహ్లాద చరిత్రము ఓ ధర్మరాజా! రాక్షస కుమారుడైన ప్రహ్లాదుడు సమస్త జీవులను తనతో సమానంగా భావించేవాడు. పెద్దలు కనిపిస్తే సేవకునిలా వారిని చేరి న...