Saturday, March 14, 2026

Prahlada taught his fellow students (the sons of demons) about Vishnu Tatvam - ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులకు విష్ణు తత్త్వం గూర్చి వివరించుట

ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులకు విష్ణు తత్త్వం గూర్చి వివరించుట

రాక్షసకుమారులు ప్రహ్లాదునిగూడ తాము ఆడే పాడే వ్యవహారాలలో పాల్గొనమని కోరగా, అతడు జ్ఞానసంపత్తి గలవాడుగాబట్టి, తనకు గల సమర్థతతో వారి దగ్గరకు పోయి.

మన గురువులు మనకు మంచి చదువును ఎపుడూ చెప్పడం లేదు. కాని, మోహాన్ని కలిగించే మాయ చదువులను మాత్రం ఎపుడూ చెవులు చిల్లులు పడేటట్లుగా చెపుతుంటారు. నేను మీకు మీ మనస్సులు ఆహ్లాదపడే విధంగా ఒక మంచి చదువును చెబుతాను, వినండి!

ప్రహ్లాదుడు రాజకుమారుడైనందువల్ల చాలదయతో, తన తోడి సమవయస్కులు, స్నేహితులైన రాక్షసబాలురతో ఆడుతూ పాడుతూ, నవ్వుతూ, రహస్యంగా ఇలా పలికాడు.

స్నేహితులారా! రండి. మనకు సమవయస్కులయిన బాలురు ఎందరో ఈ భూమిమీద రాలిపోవడం చనిపోవడం చూశారుగదా! మన ఆచార్యుడు దయమాలి నిష్ప్రయోజన విషయాలను ప్రయోజన సహితాలుగా మనలను విశ్వసింపజేయ చూస్తున్నాడు. కావున ఆయన క్రూరుడు. ఆయన బోధించే శాస్త్రం స్వీకార యోగ్యం గాదు. అది తిరస్కార యోగ్యం. నేను మీకు క్షేమకరమైన మార్గాన్ని చూపుతాను. దాన్ని వింటే మీకు నిరంతరం క్షేమం కలుగుతుంది.

మిత్రులారా! వినండి. అన్ని జన్మలలో మానవజన్మ ఉత్తమం. ఎందుకంటే దానిలో ధర్మం, అర్థం అనే పురుషార్థాలకై పాటుబడే వీలు ఉంది. మానవజన్మలోగూడ పురుషజన్మ దొరకడం అరుదు. అదిగూడ వంద ఏళ్ళకు పరిమితం. దానిలో సగం చీకటి తోడి రాత్రులతో గడచిపోతుంది. మిగిలిన ఏబై (రాత్రిభాగం 50సం. పోగా) ఏళ్ళలో ఇరవైఏళ్ళు బాల్యం, కౌమారం - అనే దశల్లో వెళ్ళిపోతుంది. ఇక మిగిలిన ముప్పైఏళ్ళు ఇంద్రియాలచే కట్టుబడి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు దుర్లక్షణాలతో, వాటితోపాటు, వెంటబడే ఆలు, పిల్లలు(కొడుకులు కూతుళ్ళు) అన్నదమ్ములు, తల్లిదండ్రులు, ఇతర బంధువర్గం, సకలసౌకర్యాలకు నిలయాలయిన ఇళ్ళు వాకిళ్ళు, పాడిపంటలు, పరిజనాలు, వంశపరంపరాగతాలయ్యే ఆస్తిపాస్తులు - ఈ సామగ్రినంతటినీ విడిచిపెట్ట లేక, సంసారాన్ని జయించేమార్గం కనబడక, తానే అల్లుకొన్న సంక్లిష్టమైన గూటిలో తానే బందీఅయిన సాలెపురుగు లాగా మానవుడు యాతనల పాలవుతున్నాడు. తన శరీరసుఖాలే పరమావధిగా భావిస్తూ స్వపరభేదభావంతో ఆ సంసారపు చీకటిలోనే పడి కొట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి, కౌమార యౌవనదశలకు, ముందుగానే బుద్ధిమంతుడై భగవద్భక్తిగలిగి ప్రవర్తించాలి. కోరకుండానే స్వయంగా దుఃఖాలు వచ్చి పడినట్లే జీవితంలో సుఖాలూ వాటంతట అవే మనదగ్గరికి చేరతాయి. వాటికని ప్రత్యేకంగా వ్యర్థప్రయత్నాలు చేస్తూ మన ఆయువును వ్యయం చేసికోవలసిన పనిలేదు. విష్ణుమూర్తి సర్వప్రాణి లోకానికి అధినాథుడు. కాగా, ముక్తి కోరేవాడు శరీరయాత్ర సాగినంతకాలం నారాయణుని పాదపద్మాలు సేవించడమే కర్తవ్యంగా జీవించాలి.

మీరు చూస్తున్నారు కదా! మనతోటివారు ఒక ఇంటివారై ఆలుబిడ్డలతో విసిగి జీవితంలో ఏమీ సాధించలేక వెర్రివారుగా మిగిలిపోయారు. వారూ మోక్షాసక్తులైగూడ, సంసారాన్ని వదలలేక, దానిలోనే పడి కొట్టుమిట్టాడుతున్నారు. ఆవిధంగా లోకంలో ఉనికిలో ఉన్న అన్ని జీవజాలాల్లో మాటిమాటికీ తామూ పుడుతున్నారు. నరుడు ఈ జనన మరణ చక్రంలో పడి, తనను తాను గ్రహించలేకపోతున్నాడు. కర్మవివశుడై చక్రభ్రమణం చేస్తూనే ఉన్నాడు. బయటపడే మార్గం, నూరుజన్మలెత్తినా అతడు అందుకోజాలడు. కాగా, ఈ సంసార జీవనంలో శుభమూ, కీర్తీ ఏదీలేదు. ప్రయోజనంలేని సంసారచక్రంలో పడి, మనమూ మళ్లీ మళ్లీ చావు పుట్టువులలో పడి పొర్లడమెందుకు? చావు పుట్టువులకు అతీతమైన మార్గాన్ని వెదకి పట్టుకోవడం గొప్పతెలివిగదా!

మద్యపానం చేసి, మదగర్వంతోకూడి, మత్తుగా శరీరస్పృహ లేని కన్యయొక్క చూపులనే సంకెళ్ళకు మహాపండితుడుకూడా బందీ అవుతాడు. అంతేకాక ఒడ్డుకు చేరే దారితెలియని ఆ గొప్ప పండితుడు కాముకురాలి శృంగార విలాసాలకు ఆకర్షించబడిన జింకపిల్లవలె, హీనమైన స్థితిని పొందుతారు. ఇట్టి అధోగతిని విన్నారా?

(ఆడవాళ్ళ చూపులు లేళ్ళను ఆకర్షిస్తాయని చెప్పడం కవి సమయం. మహాపండితుడైనా భక్తిజ్ఞానాలు లేకపోతే యువతుల విలాసాలకు బంధీ అవుతాడు. అతని పాండిత్యం లోకానికి ఉపయోగపడదు. పాండిత్యంతోపాటు భక్తి జ్ఞానాలను అలవరచుకున్నప్పుడు లోకానికి ఉపయోగపడతాడని ప్రహ్లాదుని సందేశం.)

బాలకులారా! బాల్యంలో మీరు లౌకిక అంశాలలో తగుల్కొన్న రాక్షసులతో కలిసి జీవించవద్దు. మోక్షకాంక్షతో, ఇంద్రియ లంపటత్వాన్ని త్యజించిన వారితో కలిసి, ఆదిదేవుడైన విష్ణువును ఆశ్రయించండి.

రాక్షసులు లోకసుఖాలలో చిక్కి విష్ణుని సేవించుట అసాధ్యం. అయితే విష్ణుసేవ ఆకర్షణ కల్గినదయినా ఎంతో, ఎన్నో మహా ప్రయత్నాలతో మాత్రమే సిద్ధించే విషయం. అని మీరు తలపోస్తే, మీకు నేను చెప్పేదేమిటంటే, విష్ణువు సర్వవ్వాపి. అతడులేని ప్రదేశం లేదు. అతడు సర్వప్రకృతి స్వరూపుడు, సర్వకాలాల్లో, దిక్కులలో ఆతడే ఉన్నాడు. బ్రహ్మ మొదలు సకల జీవులలో, పృథివి, నీరు, కాంతి, గాలి, ఆకాశం అనే ఈ పంచభూతాలలో అతడే నిండి ఉన్నాడు. అంతేకాదు, ఆ పంచభూత సృష్టియైన జగత్తంతా విష్ణమయమే. గుణసామ్యంగల ప్రకృతి, గుణవ్యతికరమైన బుద్దితత్త్వం, సత్త్వరజస్తమోగుణాలు, ఈ అన్నింట ఈశ్వరుడు, పరమాత్మ, పరబ్రహ్మ అనే పేర్లతో కేవల ఆనందానుభవమే తన రూపురేఖలుగా గలిగి, తన సృష్టియైన మాయతో తనలో తాను లీనమై ఉన్నాడు. సృష్టిలోని వ్యాప్యవ్యాపకాలు రెండూ, కార్యం, కర్త స్వయంగా తానే అయి ప్రకాశిస్తున్నాడు. కాగా, ఈశ్వరుడు తానే స్వయంగా, చూచేవాడూ, చూడబడే వస్తుసముదాయంగా భాసిస్తూ, తానే స్వయంగా అనుభవమూ, అనుభోక్తా అయి సర్వం తానే ఇమిడి ఉన్నాడు. కావున రాక్షసభావం వదలిపెట్టి, సర్వప్రాణులపట్ల దయను, మైత్రిని వహించాలి. ఈ రెండు గుణాలు-దయ మైత్రి నరుడు అలవరచుకొంటే నారాయణుడు సంతోషిస్తాడు. అతడు సంతోషిస్తే, త్రి పురుషార్థాలు ధర్మ - అర్థ - కామాలతో పాటుగా చతుర్థమైన మోక్షమూ నరునికి కరతలగతమైన ఆమలకమే (ఒక చేతిలో ఉసిరికకాయ అంత సులభమనటం). అపుడు నరుడు నారాయణునకు ఆత్మ సమర్పణ చేసికోవాలి. దానివల్ల అతనిలో అవధూతభావం ఉద్భుద్ధమై లౌకికాంశాలను అన్నింటిని, స్వయంగా చూస్తూకూడ, వాటిని కలలోని వానినిగా మిధ్యగా భావిస్తూ ద్వంద్వాతీతంగా జీవించగలుగుతాడు అని పలికి ప్రహ్లాదుడు ఇంకా ఈ విధంగా అన్నాడు.

(త్రైగుణ్య, నిస్త్రైగుణ్య విషయాలు

త్రైగుణ్య విషయావేదా నిస్త్రైగుణ్యో భవార్జున ।
నిర్ద్వంద్వో నిత్య సత్త్వ స్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్‌ -భగవద్గీత (2-45)

'ఓ అర్జునా! వేదాలు(అందులోని పూర్వభాగమైన కర్మకాండ) త్రిగుణాత్మకాలైన సంసార విషయాలను తెలిపేవిగా ఉన్నాయి. నీవు త్రిగుణాలను వదలి వేసినవాడవై, ద్వంద్వాలు పాటింపనివాడివై, నిరంతరం శుద్ధసత్వాన్ని ఆశ్రయించినవాడవై, యోగక్షేమాలమీద దృష్టిలేనివాడవై ఆత్మజ్ఞానివి కావయ్యా!)

నేను మీకు చెప్పే ఈ జ్ఞానాన్ని అంతటినీ పూర్వం, నారాయణుడు నరునితో కలిసి, నారద మహర్షికి వివరించాడు. దీనిని గ్రహించడం అందరికీ సాధ్యపడే విద్య కాదు. హరిభక్తుల పాదధూళితో పవిత్రమైనవారు, విష్ణువుపై అనన్యభక్తి గల్గి కైంకర్యం తప్ప కైవల్యం వద్దనేవారు, పరతత్త్వజ్ఞానం కలవారు తప్ప, ఇతరులు మదిలో నిలుపుకో జాలరు. ధనసంపాదనకు శక్తిసామర్థ్యాలున్నా దానియందు లంపటత్వం లేనివారు, అసలు భౌతిక వస్తువ్యామోహంలేనివారు అకించనులు.

పూర్వం నేను దివ్యదృష్టిగల నారదునినుండి ఈ జ్ఞానాన్ని విన్నా ననగా, రాక్షసబాలురు ఆశ్చర్యం చెంది రాజకుమారునితో ఇలా అన్నారు.

మేమూ రాక్షసగురుకుమారులతో కలిసి జీవించాం. వారివద్దే శాస్త్రాలూ చదువుకొన్నాం. మాకూ, నీకు గూడ ఇతర గురువు లెవరూ లేరు. నీవుండే 'రాజప్రాసాదం, ఇతరులకు గాదు గదా స్వయంగా శివునకూ చొరరానిది. నీవు బయట ఎక్కడా విద్యాభ్యాసం చేయలేదు. మరి ఈ పరిస్థితులలో ఏ గొప్పగురువు నీకు భాగవతధర్మం తెలియజేసే విద్యను బోధించాడు? చెప్పు.

కుమారా! నీవు మాకు రాజపుత్రుడవు. ఎప్పుడు నీ సేవలోనే గడుపుతూ ఉంటాం. నిన్ను మాకు కాబోయే రాజుగా కూడా చూస్తాం. నీకు కానుకలూ సమర్పించుకుంటాం. కాని, ఆశ్చర్యకరంగా నీలో ఈ తెలివితేటల తేజస్సు ఎలా ఏర్పడిందో మాకు తెలియదు.

అని పైవిధంగా రాక్షసకుమారులు తనను అడిగారు. అందుకు పరమభక్తుల్లో శ్రేష్టుడయిన ప్రహ్లాదుడు నవ్వుతూ, తాను పూర్వం నారదుని నుండి విన్న మాటల్ని స్మరించుకొంటూ ఇలా పలికాడు.

పూర్వమొకప్పుడు మా తండ్రి హిరణ్యకశిపుడు గొప్ప తపశ్చర్యకోసం మందరగిరి మీదికి ప్రశాంతంగా వెళ్ళి ఉండగా, దేవతలు ఆయనను జూచి "వీడు తన పూర్వపాపాలతో, చీమలదండుచేత జిక్కిన పామువలె ఆరగింపబడ్డాడనుకుని తొందరపాటుతో రాక్షసులపై యుద్దానికి దిగి

ఇంద్రుడు, దేవతలు, యుద్ధభేరుల మహాధ్వనులతో, పరాక్రమంతో దండెత్తి రాగా ఆ ఆర్భాటాన్ని గమనించిన రాక్షసులు బెదరిపోయి, తమశక్తి సామర్థ్యాలు ఉడిగి, తమ తమ కొడుకులను, స్నేహితులను, ఇళ్ళను, ఇల్లాండ్రను, ధనకనకవస్తువాహనాలను అన్నింటినీ విడిచిపుచ్చి, కేవలం తమప్రాణాలు కాపాడుకోవడంకోసం పారిపోయారు.

దేవతలు క్రోధంతో రాజనివాసాలు చేరుకొని, అక్కడి సిరిసంపదలన్నింటిని ఏపాటి కనికరం లేకుండా కొల్లగొట్టి ఎత్తుకొని వెళ్ళారు. అప్పుడు వారి రాజు ఇంద్రుడు, అంతఃపురంలో దూరి, సిగ్గుతో ఏడుస్తున్న మా అమ్మను బెదిరించి ఏ సంకోచం లేకుండా చెరపట్టాడు.

దేవేంద్రుని చెరలో జిక్కిన మా తల్లి, పెంటి లకుముకిపిట్ట లాగా పెద్దగా మొరపెడుతుండగా, ఆ దారిలో అదృష్టవశాన వెళ్తున్న నారదమహర్షి ఆ దృశ్యాన్నిచూచి, ఇలా అన్నాడు.

స్వర్గమేలే సురశ్రేష్ఠా! ఇంద్రా! నీవు దేవతలలో పుణ్యాలరాశివి, నీతిమంతుడవు గూడ. బెదరి ఏడ్చే ఈ గర్భవతిని చెరబట్టడమెందుకు? వదలిపెట్టు. ఈమె పాపాత్మురాలు గాదు. నీకు రోషముంటే, దానిని దేవతల శత్రువైన హిరణ్యకశిపునిపై చూపించు అబలపై కాదు.

నారదుని మాటలకు ఇంద్రుడు బదులు ఇలా పలికినాడు.

నాశనమునకు కారణమైన రాక్షసరాజు తేజస్సు ఈ స్త్రీ గర్భంలో పెరుగుతూ ఉంది. కాబట్టి, ఈమె ప్రసవించే వరకు బందీగా ఉంచి, అనంతరం, పుట్టిన బాలుణ్ణి నా వజ్రాయుధపు పదనుతో నరికి నిశ్చింతగా ఉంటాను. అపుడే ఈమెను విడిచిపెడతాను. ఇది నిశ్చయం.

ఆతని మాటకు బదులుగా. ఇంద్రునితో నారదుడిట్లంటున్నాడు

రాక్షసరాజ్ఞి గర్భస్థశిశువు నిర్భయుడు. ప్రసిద్ధ భగవద్భక్తుడు. అతనికి శత్రువులు ఉండరు. అంతేగాదు. పూర్వజన్మవాసనగా అబ్బిన విష్ణుభక్తితో పరిపూర్ణుడు. అందువల్ల నీ భుజబలగర్వం ఆతనిపై ప్రభావం ఏమాత్రం చూపదు. ఏ యుద్దాలలోను ఏ ఉపాయాలతోను ఆతడు చావడు.

నారదుని మాటలు గౌరవించిన ఇంద్రుడు తానును హరిభక్తుడు కాబట్టి నా తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నారదు డామెను కూతురువలె భావించి ఊరడించి, ఆమెను తోడ్కొని తన ఆశ్రమానికి వెళ్ళి, తపశ్చర్యకై వెడలిన నీ పెనిమిటి మరలి వచ్చేవరకు నా ఆశ్రమాన నిలువుమని మా అమ్మను తన దాపున నిలుపుకొన్నాడు.

(ఇంద్రునికి హిరణ్యకశిపునిపై వైరం ఉంది కాని, లీలావతియందు పతివ్రత భావమే ఉన్నది. గర్భవతి అయిన స్త్రీని వధింపకూడదనే సనాతనధర్మాన్ని పాటించాడు. అందువల్లనే లీలావతిని ప్రదక్షిణంచేసి విడిచి వెళ్లాడు.)

మా అమ్మ ఉత్తమురాలు. పతివ్రత, ప్రయత్నశీల. పతిరాకను నిరీక్షిస్తూ నిర్భయంగా నారదాశ్రమంలో తన గర్భరక్షణ చేసికొంటూ నారదసేవలో సంతోషంగా నివసిస్తూ ఉంది.

తన సేవలో మునిగిన నా తల్లికి నారదుడు తన శక్తితో అభయప్రదానం చేసి, గర్భంలోఉన్న నన్ను గురించి ధర్మస్వరూప స్వభావాలను, పరిశుభ్రమైన జ్ఞానాన్ని ఉపదేశించాడు. అయితే, ఆమె స్త్రీ కాబట్టి, ఏనాటి సంఘటనోకాబట్టి సంప్రదాయం తెలియదుగాబట్టి, ఆ ఉపదేశమంతటిని మరచింది. నారదుని దయవలన నాలో మాత్రం

ఆ నాడు, మొదలు నా మనస్సున మాత్రం ఋషిమతం మొత్తం స్పష్టంగా నిలిచి ఉంది. అదృష్టవశాన ఏనాడూ మరపుకు రాలేదు.

(భారతీయ సనాతన ధర్మానికి ఋషిమతం, మునిమతం అని మొదటి పేర్లు. వైదికమతం, సనాతనమతం, అనాదిమతం, అనికూడ పేర్లున్నాయి. 'మత' మంటే “అభిప్రాయం” ఇదే తర్వాత 'సంప్రదాయం'గా స్థిరపడింది. 'ధర్మ' మంటే 'సనాతనధర్మము'. స్థిరంగా, ఎప్పటికీ, నాశములేక నిలిచి ఉండేది సనాతనధర్మం. దీనినే పోతనగారు 'మునిమతము', 'తపసిమతము' అన్నారు. ఇవి మనమతానికి తొట్టతొలి పేర్లు.)

బాలులారా! వినండి. నేను పలికేది ఋషిమతం, దీనిని నమ్మారంటే స్త్రీ బాల సహితంగా ఎల్లజనులూ శుభం పొందవచ్చు. ఇది దేహవ్యామోహాలను నాశనం చేయగలదు.

ప్రహ్లాదుడు రాక్షస బాలురతో నారదుడు చెప్పిన విధంగా ఇలా అన్నాడు. కాలం ఈశ్వరస్వరూపం. కాలంవల్ల చెట్టు కలుగగా చెట్టునుండి పండు(విత్తు) ఏర్పడుతుంది. కాగా చెట్టు ముందు, విత్తుగాదు. దానికి మాత్రం పుట్టుక, ఉనికి, పెరుగుదల, తగ్గుదల, పండబారుట, నశించుట అనే దశలు సంక్రమిస్తాయి. పండు శరీరం, దానికి మూలమైన కాలస్వరూపవృక్షం ఆత్మ, కాగా శరీరానికి తప్ప, పైన జెప్పిన ఆరు వికారాలు(పుట్టుక మొదలైనవి) ఆత్మకు లేవు. ఆత్మ నిత్యుడు, నాశరహితుడు, వ్యాపకుడు, బంధరహితుడు, నిండైనవాడు, ఒక్కడు(కేవలుడు), స్వయంగా వెలిగేవాడు, సృష్టికి మూలం, ఏ సాంగత్యమూ లేనివాడు, నిర్మలుడు, క్షేత్రమెరిగినవాడు, ఆకాశాదులకు ఆధారుడు. ఈ పండ్రెండు ఆత్మలక్షణాలు. వీటిని గ్రహించి, అహంకార మమకారాలను విడిచి, బంగారుగనులలోని మినుకుమినుకుమనే రాళ్ళను పుటం పెట్టి, నిప్పంటించి, కరిగించి, స్వర్ణకారుడు నేర్పుగా బంగారాన్ని కనుగొన్నట్లు, సాధకుడు శరీరంలో గల ఆత్మను సాధనాలద్వారా గ్రహించగలగాలి. ప్రకృతులు ఎనిమిది ప్రకృతి గుణాలు మూడు, మూలప్రకృతి, మహత్తు, అహంకారం, ఐదు తన్మాత్రలు, కర్మేంద్రియాలు ఐదు, జ్డాన ఇంద్రియాలు ఆరు, భూతాలు ఐదు, ఈ పదహారూ వికారాలు అని కపిలమహర్షి మొదలైనవారి కథనం. ఈ మొత్తం ఇరవై ఏడింటినీ, ఆత్మ తాను సాక్షీభూతుడుగా కలిసి ఉంటాడు. ఈ అన్నిటితో కూడింది దేహం. అది రెండు విధాలు. స్థావరం (కదలనిది), జంగమం (కదిలేది) పైన చెప్పిన మూలప్రకృతి మొదలైన సమూహానికి భిన్నంగా మణుల వరుసల్లో దూరివున్న ధారంవలె ఆత్మ ఈ అన్నింటిలోనూ ప్రవేశించి ప్రకాశిస్తుంది. కాగా ఆత్మకు పుట్టుక, ఉనికి, నాశం ఉన్నాయని భ్రమించక దేహంలోని ఆత్మను పరిశుద్ధమైన మనస్సుతో విచారించి దేహంలో ఆత్మను వెదకి గ్రహించాలి. ఆత్మకు గూడ అవస్థలు, దశలు ఉన్నట్లు ఉంటుంది గాని, నిజానికి ఉండవు. గాలిని చూడలేకపోయినా, వాసననుబట్టి (గంధవహుడు) గ్రహించినట్లు శరీరంలో ఆత్మను గ్రహించాలి.

(ఆత్మ లక్షణాలు 1. నిత్యుడు 2. నాశరహితుడు 3. శుద్ధుడు 4. క్షేత్రజ్ఞుడు 5.ఆకాశాదులకు ఆశ్రయుడు 6. నిష్క్రియుడు 7. స్వప్రకాశకుడు 8. సృష్టికి కారణమైనవాడు 9. సర్వత్రా వ్యాపించినవాడు 10.దేనితోనూ ఏ సంబంధమూ లేనివాడు 11. పరిపూర్ణుడు 12. ఏకమాత్రుడు.

ప్రకృతులు :1. మూలప్రకృతి 2. మహత్తు 3. అహంకారం 4. పంచతన్మాత్రులు

పంచతన్మాత్రులు:1. శబ్దం 2. స్పర్శం 3. రూపం 4. రసం 5. గంధం

ప్రకృతి గుణాలు 1. సత్త్వము 2. రజస్సు 3. తమస్సు.

కర్మేంద్రియాలు 1. నోరు 2. చేతులు 3. కాళ్ళు 4 గుదం 5. జననేంద్రియం.

జ్ఞానేంద్రియాలు 1. చెవులు 2. కళ్ళు 3. నాలుక 4. చర్మం 5. ముక్కు (ఉభయేంద్రియం - మనస్సు)

పంచభూతాలు 1. భూమి 2. నీరు 3. తేజస్సు 4. గాలి 5. నింగి

షడ్భావాలు 1. ఆస్తి-ఉండడం 2. జాయతే - పుట్టడం 3. వర్ధతే - పెరగడం 4 విపరిణమతే -మార్చుచెందడం 5. అపక్షియతే - కృశించడం 6. నశ్యతి - నశించడం

క్షేతజ్ఞుడు: శరీరానికే క్షేత్రం అని పేరు. క్షేత్ర తత్త్వాన్ని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు.)

ఈ సంసారం కేవలం బుద్ధివలన ఏర్పడినది. గుణాలు సత్త్వరజస్తమాలు. వాటివలన కలిగే పనులనుండి పుడుతుంది. కలవంటిది. నిజమైనది గాదు, మనం చేసే, చూసే సమస్తమూ మన మనస్సు కల్పించినదే. నిద్ర, మెలకువ రెండూ ఒకటే. పరమాత్మ గుణరహితుడు. అయితే దేహాశ్రయుడైన కారణాన అతనికీ పుట్టుక నాశనం ఉన్నట్లు అనిపిస్తుంది. కాని వివేకంతో విచారించి చూస్తే ఉండవు.

బాలకులారా! సత్త్వరజస్‌ తమోగుణాలవలన కర్మలు జరుగుతాయి. ఆ కర్మలకు మూలమైన అజ్ఞానాన్ని, జ్ఞానమనే నిప్పుతో కాల్చివేసి, కర్మలనుండి బయటపడి, విష్ణువును గ్రహించుట శుభము.

కాబట్టి గురుసేవ, కలుములన్నింటి సమర్పణము, సజ్జన సాంగత్యము, దేవుని బొమ్మను పూజించుట, హరికథలయెడ ఆసక్తి, కృష్ణప్రేమ, విష్ణువును పొగడుట, విష్ణుపాదపద్మ ధ్యానము, దైవసందర్శన సమారాధనలు, మొదలయిన భగవద్భక్తుల ధర్మాచరణపై ఆసక్తితో, సర్వప్రాణులు దైవసమానాలని భావిస్తూ అరిషడ్వర్గమును, ఇంద్రియాలను నియంత్రించి విష్ణుని చేరవచ్చును.

(శుశ్రూష అనేశబ్దానికి, విను కోరిక - “శోతుమిచ్చా” అని అర్థం. రూధ్యర్థం 'సేవ'గా స్థిరపడినది.

భాగవత ధర్మములు : 1. గురుపాదసేవ 2. సర్వసమర్పణం 3. సజ్జనసాంగత్యం 4. అర్చావతారపూజ 5. హరికథాశ్రవణం 6. వాసుదేవుని పైభక్తి 7. నారాయణ నామసంకీర్తన 8. విష్ణుపాదధ్యానం 9.అధ్యాత్మచింతన - ఇవి భాగవతధర్మాలుగా పోతన స్పష్టీకరించాడు.)

భక్తుడుగా మారిన నరుడు భిన్నంగా కనిపిస్తాడు. విష్ణుకథలు విని, వానిలోని శౌర్య ధైర్య గాథలు ఆలకించి పులకిస్తాడు. కళ్ళలో నీళ్ళు ఉబుకగా విష్ణునామ సంకీర్తనం చేస్తాడు. బిగ్గరగా పాడి ఆడతాడు, దేవునికై ఎలుగెత్తి ఏడుస్తాడు, అంతలో ఆలోచనలో మునుగుతాడు, దేవునిపై మరులు కొంటాడు. దయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తాడు. చిట్టచివరకు భవబంధాలు వీడి, అజ్ఞానరాసుల్ని దగ్ధం చేసి, దేవునిలో లీనమౌతాడు.

కాబట్టి లౌకిక విషయాసక్తుడైన నరునికి సంసార చక్రభ్రమణంనుండి విముక్తి కల్గించే హరిస్మరణ బ్రహ్మానందంలాంటిదని పండితులంటారు. హరిసేవ సులభమైనదే. హరి సకలప్రాణుల హృదయాలలో ఆకాశంవలె నిండి ఉన్నాడు. లౌకికాలైన సంపాదనలవలన ఒరిగేది శూన్యమే. నిమిష మాత్రమే జీవించగల ప్రాణులైన మానవులకు 'నావి' అనే భావాన్ని కల్గిస్తూ చంచలాలైన బిడ్డలు, స్నేహితులు, భార్యలు, పశువులు, సేవకులు, చతురంగబలాలు, చుట్టాలు, రాజ్యం, ధనాగారం, మణులు మాన్యాలు, ఇళ్లు మంత్రులు, ఏనుగులు భూములు మొదలైన వైభవాలు నిరర్ధకాలు. యజ్ఞాలవల్ల వచ్చే పుణ్యాలకు ఫలితంగా లభించే స్వర్గసుఖాలు కూడా పుణ్యం అయిపోగానే అంతరిస్తాయి. అవి నిత్యాలు కావు. నరుడు తాను మహావిద్వాంసుడు అనుకుంటూ చేసే పనులు అతనికి వ్యతిరేకఫలితాలు కల్పించి దుఃఖంలో పడవేస్తాయి. ఫలం కోరకుండా కర్మలు చేయాలి. ఫలం కోరి చేస్తే దుఃఖాలు ప్రాప్తిస్తాయి. మానవుడు దేహంకోసమై భోగాలు కోరుకుంటాడు. దేహం క్షణభంగురం నరునకు తోడుగా వచ్చేదికాదు. మరణానంతరం అది కుక్కల నక్కల పాలవుతుంది. దేహి కర్మాచరణంవలన కర్మబద్ధుడవుతున్నాడు. పిదప తాను చేసిన కర్మలకు తగిన దేహాన్ని ధరిస్తాడు. అజ్ఞానంవల్ల జీవుడు కర్మకు తగిన దేహాలు విస్తరించుకుంటాడు. ధర్మార్థకామాలు అజ్ఞానమూలకాలు. జ్ఞానంచేతనే మోక్షం సిద్ధిస్తుంది. మోక్షప్రదాత శ్రీహరి ఒక్కడే. ఆయన సకలభూతాలలోని ఆత్మలకు ఈశ్వరుడు. ఇష్టమైనవాడు. తానే ఏర్పాటు చేసిన భూతాలతోకూడి జీవుడనే పేరుతో పిలువబడుతుంటాడు. కోరికలు లేకుండా తమ హృదయాలలో ఉన్న శ్రీహరిని మిక్కిలి భక్తితో సేవించాలి. అప్పుడే జీవులకు మోక్షం సిద్ధిస్తుంది.

సృష్టిలోని సర్వ సమాజాలు, రాక్షసులు, నాగులు, నరులు, గంధర్వులు, దేవతలు వీరిలో ఎవ్వరైనా హరిచరణాలు ధ్యానించి ముక్తి పొందవచ్చు.

భక్తితో హరి దొరకినట్లుగా వ్రతాలు, జప తపాలు, యుక్తి ప్రయుక్తులు దాన ధర్మాలతో దొరకడు. ఇది నిజము.

యత్న శీలురయిన బాలకులారా! హరిని మెప్పించుటకు భక్తి ఒక్కటే సమర్థమైనది. మిగిలిన బ్రాహ్మణత్వం, దేవత్వం, అధిక శాంతత్వం - ఇవి ఏవీ సరిపోవు.

హరి ఎల్లలోకాల్లో నిండి, సర్వము తానై ఉన్నాడు అని తలచేవారు, పాపజీవులైనా ముక్తికి అర్హులే. వారు రాక్షసులైనా, నాగులయినా, యక్షులయినా, మృగాలయినా, గొల్లలయినా, స్త్రీలయినా, పక్షులయినా, శూద్రులయినా, బోయలైనా! అందరూ అర్హులే.

కుమారులారా! మన గురువులు, తమకు మనం లొంగి ఉండే మార్గాలు ఉపదేశిస్తారు తప్ప, హరిని చేరే మార్గం మాత్రం చెప్పరు. కాబట్టి, చీకట్లో పరుగులు పెట్టడ మెందుకు? ఇది కేవలం వ్యర్థప్రక్రియ.

పుస్తకాలన్నింటిని తెచ్చి గురువులకు అప్పగించండి. మళ్లీ ఏకాంత ప్రదేశానికి రండి. మరొక విశేషం చెబుతాను. నా మాటలు వినని వారెవరైనా మీలో ఉంటే, వారు వెళ్ళిపొండి. ఎవరి కర్మకు వారే బాధ్యులు.

మనం హరిభక్తితో ఆడుదాం. హరి కీర్తిప్రతిష్టలను, శుభకరమైనవాటిని పాడుకొందాం. రాక్షసుల స్నేహాన్ని విడిచి పెడదాం. హరిభక్త కోటిలో సూటిగా చేరిపోదాం.

సంసార పరివారాన్ని విడుద్దాం. కోర్కెలు మొదలయిన, ముక్తివిరోధి గుణగణాలను చీల్చి చెండాడుదాం. నేడే మన మనస్సులను హరికి అర్పిద్దాం. ముక్తిమార్గాన ప్రవేశిద్దాం. మనకు శుభం కలుగుతుంది.

నరసింహా అవతారం

No comments:

Post a Comment

Narasimha Avatar - నరసింహా అవతారం

నరసింహా అవతారం ఈ విధంగా ప్రహ్లాదుడు అనేక విధాలుగా అనుకూలమైన సమయాలలో రాక్షస కుమారులకు రహస్యంగా మోక్షమార్గం బోధించసాగాడు. అప్పుడు వాళ్ళందరూ గు...