Friday, March 20, 2026

Parvathi Converted as Gouri (Gowri) - పార్వతి గౌరిగా మారటం

పార్వతి గౌరిగా మారటం

పూర్వం పార్వతీదేవి కైలాసం నుంచి వేరే ప్రదేశంలో తపస్సు చేసుకోవటానికి వెళ్తూ వీరకుడు అనే ద్వారపాలకుడిణ్ణి అక్కడ నియమించి వెళ్ళింది. ఒకనాడు ఆడీ అనే అసురుడు బ్రహ్మ వరప్రభావంతో కామరూపశక్తిని సంపాదించాడు. తనకి శత్రువైన పరమేశ్వరుణ్ణి ఎలాగైనా సంహరించాలని నిశ్చయించుకున్నాడు. పార్వతీదేవి కైలాసంలో లేదన్న విషయం అతడికి
తెలిసింది. ఇదే సరైన సమయమని భావించి వెంటనే పార్వతీదేవి వేషాన్ని ధరించి కైలాసంలోకి ప్రవేశించాడు. ద్వారం బైటవున్న వీరకుడు ఈ విషయాన్ని గుర్తించలేదు. లోపలికి వెళ్ళిన ఆడి రాక్షుడు పార్వతీ రూపంలో శివుణ్ణి కౌగిలించుకోగా, ఆయనకి వచ్చింది పార్వతికాదు అసురుడని తెలిసింది. ఆగ్రహంతో ఆ మాయా రాక్షసుణ్ణి సంహరించాడు. అతడు స్త్రీ రూపంలోనే నేలపైపడి ప్రాణాలు కోల్పోయాడు.

కైలాసంలోపల పరమేశ్వరుడు ఒక స్త్రీని సంహరించిన విషయం ద్వారం బైటవున్న వీరకుడికి తెలిసింది. వెంటనే ఆ విషయాన్ని వాయుదేవుడి ద్వారా తన మాత అయిన పార్వతీ దేవికి తెలియచేసాడు. ఆ విషయం విన్న పార్వతీదేవికి ఎంతో ఆగ్రహం కలిగింది. తను లేనప్పుడు శంకరుడి దగ్గరకి వేరే స్త్రీ ప్రవేశానికి కారకుడైన వీరకుణ్ణి ఒక శిల నీకు తల్లి అగుగాక! అని  శపించింది. అలా శపించిన తరువాత కూడా ఆ ముఖంలో ఆగ్రహం ఏ మాత్రం తగ్గలేదు. తక్షణమే ఆమె హృదయంలోనించి పైకి ఉబికిన క్రోధం ద్వారా భయంకరమైన సింహం ఆవిర్భవించింది. ఆ సింహం భయంకరమైన కోరలతో, విశాలమైన ముఖంతో జడలు నిండిన కంఠంతో సన్నని నడుముతో దొరికిన దానిని దొరికినట్టే తిందామన్నంత ఆకలితో వుంది. తన భర్త అన్య స్త్రీ తో వున్నాడని అపోహపడి ఎంతో బాధలోవున్న పార్వతీదేవి ఆకలిగా ఎదురుచూస్తున్న ఆ సింహానికి తానే ఆహారంగా మారాలనుకుంది.

పార్వతీదేవి హృదయంలో పడుతున్న వేదన బ్రహ్మదేవుడికి తెలిసింది. వెంటనే ఆయన ఆమె ముందు ప్రత్యక్షమై “దేవీ! ఎందుకు నీవిలా బాధపడుతున్నావు. నీ కోరిక ఏమిటి? తీవ్రమైన తపస్సుచేయాల్సిన అవసరం నీకెందుకొచ్చింది?" అని ప్రశ్నించాడు. బ్రహ్మ మాటలు విన్న పార్వతి ఆయనతో “బ్రహ్మదేవా! పూర్వం నేను ఎంతో కఠోరదీక్షతో తపస్సుచేసి శంకరుణ్జి భర్తగా పొందాను. ఆయన కూడా నా మీద అనురాగంతోనే వుండేవాడు. అయితే ఆయన చాలాసార్లు నన్ను శ్యామలవర్ణా! (నల్లని శరీరం కలదానా) అని అనేవాడు. దానితో నా శరీరం రంగు ఆయనకి ఇష్టం లేదని గ్రహించాను. కనుక నేను బంగారు రంగు శరీరంగల దానినవ్వాలి. తిరిగి నా భర్త ప్రేమని పొందాలి”. ఇదే నాకోరిక అన్నది.

పార్వతి మాటలు విన్న బ్రహ్మ దేవుడు “దేవీ! నీవు కోరిన విధంగానే బంగారు (గౌర} వర్ణం గల శరీరాన్ని పొందుతావు. నీ భర్త శరీరంలో అర్ధభాగం కూడా నీకు లభిస్తుంది” అని వరాన్ని ప్రసాదించాడు. వెంటనే వర ప్రభావంతో పార్వతీదేవి నల్లని తుమ్మెదలా తన శరీరం మీదున్న చర్మాన్ని విడిచిపెట్టింది. తాను పచ్చని పసిడి వర్ణంతో (గౌర) చర్మాన్ని ధరించి సర్వాలంకార భూషితగా మారిపోయింది.

పార్వతీదేవి విడిచిన నల్లని చర్మం నుంచి అన్ని అవయవాలు ధరించి ఒక మహాశక్తి ఆవిర్భవించింది. చేతిలో ఘంటతో, మూడుకళ్ళతో నల్ల కలువకాంతితో ప్రకాశిస్తూ నిలిచింది. ఆ మహాశక్తిని చూసి బ్రహ్మదేవుడు “ఓ నిశాదేవీ! నీవు పూర్వం నా ఆజ్ఞతోనే ఈ పార్వతీదేవి శరీరంలోకి ప్రవేశించావు. ఇప్పుడు నీకు నీ స్వస్వరూపం లభించింది. ఇదుగో పార్వతీదేవి ముఖం నుంచి ఆవిర్భవించిన ఈ సింహాన్ని నీకిస్తున్నాను. దీన్ని నీ వాహనంగా చేసుకో. ఈ సింహాన్ని అధిరోహించి ఇక్కడి నుంచి సరాసరి వింధ్యాచలానికి వెళ్ళు. అక్కడ మహాశక్తిగా కొలువుండి రాబోయే కాలంలో దేవతల కార్యాలు నెరవేర్చు. నీకు పంచాలుడు అనే యక్షుణ్సి అనుచరుడిగా ఇస్తున్నాను. ఈ యక్షుడు మహామాయావి. లక్షమంది అనుచరులు వీడికున్నారు. తీసుకెళ్ళు” అని ఆజ్ఞాపించాడు.

బ్రహ్మ ఆజ్ఞని అనుసరించి ఆ కౌశికీ దేవి పరివారంతో సహా వింధ్యాచలానికి వెళ్ళిపోయింది. పార్వతీదేవి శరీరం నుంచి ఆవిర్భవించింది కాబట్టి నిశాదేవికి కౌశికీ అనే పేరు వచ్చింది. బ్రహ్మ దేవుడికి నమస్కరించి నూతన శరీరాన్ని పొందిన పార్వతీ దేవి సరాసరి కైలాసానికి బయలుదేరింది. 

కైలాసానికి వచ్చిన పార్వతి లోపలికి వెళ్ళబోతుంటే ద్వారం దగ్గరున్న వీరకుడు ఆమెను అడ్డగించాడు. ఎందుకంటే తన మాత పార్వతీదేవి శరీరం రంగు మారిపోవటంతో అతడామెని గుర్తించలేదు. ఎంతో కఠినంగా నీవెవరు? లోపలికి ప్రవేశించటానికి వీల్లేదు అని హెచ్చరించాడు. పార్వతి అతని మాటలు విని ఆశ్చర్యపోయింది. అక్కడే నిల్చున్న పార్వతితో “ఓ అమ్మాయీ! పూర్వం నీలానే ఎవరో ఒక రాక్షసుడు మాయా స్త్రీ రూపాన్ని ధరించి లోపలికి వెళ్ళాడు. పరమేశ్వరుడు అది గ్రహించి ఆ అసురుణ్ణి సంహరించాడు. నన్ను పిలిచి నా అశ్రద్ధ కారణంగానే అన్య స్త్రీ లోపలికి వచ్చిందని ఇక నీవు ఈ కాపలాకాసే పనిచేయక్కర్తేదని నన్ను పరుష పదాలతో నిందించాడు” కనుక నీవు లోపలికి వెళ్ళటానికి అనుమతించను. ఇక్కడ నుంచి మరియాదగా వెళ్ళు అని గద్దించాడు.

వీరకుడి మాటలు విన్న తరువాత పార్వతీదేవికి యథార్థం తెలిసింది. “అయ్యో! అన్యాయంగా నేను సత్యం తెలుసుకోకుండా వీరకుణ్ణి శపించానే. ఇతడు వట్టి అమాయకుడు. నా భర్త అన్యస్త్రీతో ఉన్నాడని నేనే పొరపాటు పడ్డాను. ఆవేశంతో కోపంతో నిజం తెలుసుకోకుండా శపించాను. అసలు క్రోధం వల్లనే కదా కీర్తి సంపదలు నశిస్తాయి” అని మనసులో భావించి వీరకుడితో “వీరకా! నేను నీ తల్లిని నాయనా! హిమపుత్రికని, శంకరుడి భార్యని, మారిన నా శరీరాన్ని చూసి సందేహపడకు నేను చేసిన తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడు నాకా దివ్య శరీరాన్ని ప్రసాదించాడు. నిజం తెలియక నేను నిన్ను శపించాను. శాపాన్ని మరల్చలేనుకానీ నీకు త్వరలో శుభం జరుగుతుంది” అని పలికింది.

గౌరవర్ణంతో మెరిసిపోతున్న పార్వతీదేవి మాటలు విని వీరకుడు ఎంతో ఆనందించాదు. తల్లికి భక్తిగా నమస్కరించి ఇలా స్తుతించాడు.

గౌరీస్తుతి

నతసురాసుర మౌళీమిలన్మణి ప్రచయకాంతి తాళనఖాం కితే ॥

నగసుతే శరణాగతవత్సలే తవ నమోస్తు నతార్తి వినాశిని 

తపన మండల మండిత కందరే పృథుసువర్ణ సువర్ణ తనుద్యుతే ॥

విషభుజంగ విషంగవిభూషితే గిరిసుతే ప్రణమే మహదాశ్రయే ।
జగతిః కః ప్రణతాభిమతందదౌ ఝడితి సిద్ధనుతే భవతీయథా ॥

జగతికాంచనవాంచతి శంకరో భువధృత్తనయే భవతీం యధా ।
విమలయోగవినిర్మిత దుర్జయ స్వతను తుల్యమహేశ్వర మండలే ॥

విదళితానందక బాంధవ సంహతిససరవరైః ప్రథమం త్వమ భిష్టుతా 

సితనటాపటలోద్ధత కంధరాధర మహామృగరాజ రధస్థితా ॥

విమల శక్తి ముఖానల పింగశాయిత భుజేషు విపిష్ఠ మహాసురా 

నిగథితా భువనైరితి చండికాజనని శుంభనిషుంఛ నిషుందినీ
 ॥

ప్రణత చింతిత దానవదాన పమధనైక రతిస్తరసాభువి ।
వియతివాయుపథే జ్జ్వలనోజ్వలే
వనితలే తవదేవిచ యద్వపుః ॥

తరజితే
ప్రతిమే ప్రణమామ్యహం భువనభావని తేభవ వల్లభే ।
జలదయౌలలితోద్ధత వీచయో హుతవహద్యుత యశ్చచరాచరం ॥

ఫణసహస్ర భృతశ్చ భుజంగ హస్త్వభిదాస్యతి మయ్యభయంకరాః ।
భగవతి స్థిర భక్తి జనాశ్రయే ప్రతిగతో భవతీ చరణాశ్రయం ॥

కరణ జాతమిహాస్తు మమాచలన్నుతిలవాప్తి ఫలాశయ హేతుతః ।
ప్రశమమేహి మమాత్మజ వత్సలే నమో
స్తుతే దేవి జగత్త్రయాశ్రయే ॥
(అధ్యా-157, శ్లో 11-20)

ఈ విధంగా వీరకుడు చేసిన స్తుతిని విని ఎంతో ఆనందించిన పార్వతీదేవి కైలాసమందిరంలోకి ప్రవేశించింది. వీరకుడు యధావిధిగా కైలాస ద్వారం వద్దే కాపలా కాస్తూ ఎవరూలోపలికి వెళ్ళకుండా చూస్తున్నాడు.

కుమారస్వామి స్తుతి

తారకాసుర సంహారం కోసం ఆవిర్భవించినవాడు కుమారస్వామి. పార్వతీ పరమేశ్వరుల అనురాగఫలంగా మహావీరుడుగా అసుర సంహారుడుగా జన్మించిన కుమారస్వామి దేవతలందరిచేతా ఎంతో భక్తి ప్రపత్తులతో ఇలా స్తుతించబడ్డాడు.

నమఃకుమారాయ మహాప్రభాయ స్కందాయ చ
స్కందిత దానవాయ ।
నవార్కబింబద్యుతయే నమోస్తు నమో
స్తుతే షణ్ముఖ కాలరూపిణే ॥

సినంద నానాభరణాయ భర్త్రే నమోరణే దారుణధారణాయ ।
నమోస్తుతే
உర్క ప్రతిమప్రభాయ నమోస్తు గుహ్యాయ గుహాయ తుభ్యం ॥

నమోస్తుతే లోకభయావహాయ నమోస్తుతే బాలకృపావరాయ ।
నమోవిశాలాయతలోచనాయ నమోవిశాఖాయ మహావ్రతాయ ॥

నమోనమస్తేస్తు మనోరమాయ నమో నమస్తేస్తు గుణోత్కటాయ ।
నమోమయూరోజ్జ్వల వాహనాయ నమోస్తు కేయూరధరాయ తుభ్యం ॥

నమోధృతో దగ్రవతాకినే
స్తు నమః ప్రభావప్రణతాయతేస్తు ।
నమోస్తు ఘంటాధర వీర్యశాలినే క్రియాపరాణాం భోవభవ్యమూర్తే
 ॥

క్రియపరాయజ్ఞ పతిం చస్తుత్వా విరేమురేవం హ్యమరాధిపాద్యాః ।
ఏవం తదాషడ్వదనంతు సేంద్రైర్యుదా సుతుష్టశ్చ గుహస్తతస్తాన్‌ ॥
(ఆ
ధ్యా-158 శ్లో-13-20)


దివ్యమైన కాంతి గలవాడు, అసురుల్ని నాశనం చేసేవాడు, కొత్త సూర్యబింబంలా ప్రకాశించేవాడు, కాల స్వరూపుడు అయిన కుమారస్వామికి నమస్మారం. స్కందుడికి, షణ్ముఖుడికి నమస్మారం.


వివిధా భరణాలని ధరించినవాడు, అన్ని లోకాలకీ అధిపతి, లోకాలన్నిటినీ పోషించేవాడు, యుద్ధరంగంలో శత్రువుల్ని చీల్చి చెండాడేవాడు, సూర్యుడితో సమానమైన తేజస్సుకలవాడు, యోగులకి తప్ప ఎవరికీ తెలియని రహస్య స్వరూపుడు, దేవతా సైన్యానికి రక్షకుడు అయిన స్వామికి నమస్మారం. 

లోకాల భయాల్ని పోగొట్టేవాడు. దయామయుడు, విశాలమైన దీర్ఘమైన నేత్రాలు కలవాడు, శ్రేష్టమైనవాడు బాలుడు అయిన స్వామికి వందనం.

మనస్సులకి ఆనందాన్ని చేకూర్చే వాడు, భుజకీర్తుల్ని ధరించినవాడు అయిన స్వామికి నమస్మారం. 

భయాన్ని పుట్టించే పతాకాన్ని ధరించిన వాడు, అత్యంత ప్రభావ శీలురచేత నమస్మారాలు అందుకొనేవాడు, ఘంటను ధరించినవాడు, వీర్యశాలి, క్రియాపరులైన వారికోసమే జన్మించిన మంగళ స్వరూపుడు, అయిన కుమారుడికి, నమస్మారం. 

యజ్ఞపతి అయిన కుమార స్వామిని దేవతలంతా ఈవిధంగా స్తుతించి నమస్కరించారు. ఈ స్తోత్రం
ఎంతో మహిమాన్వితమైనది. దేవతలు చేసిన ఈ స్తోత్రం వినే కుమారస్వామి వారికి ప్రసన్నుడయ్యాడు.

నాలుగు యుగాల పరిమాణం

మత్స్య పురాణము

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...