Thursday, March 19, 2026

Lord Shiva consumed the deadly Halahala poison - శివుండు దేవప్రార్థితుండై హాలాహలమును బానము సేయుట

శివుండు దేవప్రార్థితుండై హాలాహలమును బానము సేయుట

పార్వతీ! లోకాలు పడుతున్న దుఃఖాన్ని చూస్తున్నావా! సముద్రంలో పుట్టిన హాలాహలం సృష్టించిన విషాగ్నిని గురించి వింటున్నావా! ప్రభువైనవాడు ఆర్హుల బాధల్ని పోగొట్టాలి. అది ప్రభువుల లక్షణం. దీనివల్ల కీర్తికూడా లభిస్తుంది.

మగువా! ప్రాణభయంతో ఆశ్రయం కోరివచ్చిన ప్రాణులను కాపాడటం ప్రభువుల కర్తవ్యం. ప్రాణాలు నీటి బుడగల్లాగా క్షణభంగురాలు. కనుకనే ఉత్తములు ఇతరుల్ని కాపాడటానికి తమ ప్రాణాలను సమర్పించడానికి వెనుదీయరు. సులభంగా ప్రాణదానం చేస్తారు.

ఇతరులకు ఎవడు మేలు చేస్తాడో వాడు పంచభూతాలకు పరమాప్తుడు అవుతాడు. పరహితసాధనమే పరమధర్మం. పరహితునికి ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ ఉండదు.

ఓ కమలాక్షీ! హరి సంతోషిస్తే అన్ని లోకాలూ సంతసిస్తాయి. కనుక హరీ, జగత్తూ సంతోషపడేలా ఈ విషాన్ని అదుపు చేయటమే మంచి పని.

(శివ - విష్ణు పారమ్యాన్ని - పరస్పర సంబంధాన్ని బోధించే ఘట్టమిది. ఇక్కడ విష్ణు ప్రసక్తి ఎందుకు? విష్ణువుకు తృప్తి కల్గించటం కోసం శివుడు హాలాహలాన్ని శిక్షిస్తానంటున్నారు. వారి హృదయాలు ఒకదానిపట్ల మరొకటి అంత ఆకర్షణ కల్గినవి - అని అర్ధం.)

పద్మముఖీ! ఇప్పుడే హాలాహలాన్ని దండిస్తాను. తియ్యని చిన్నపండు రసాన్ని తాగినట్టు తాగేస్తాను. జీవలోకాన్నంతటినీ కాపాడుతాను. నీవు చూస్తూ ఉండు.

అని శివుడు పలుకగా పార్వతీ దేవి 'స్వామీ! మీ మనస్సుకు తగినట్టు నిర్ణయించుకోవచ్చు' అని పలికింది - అని చెప్పగా శుకమహర్షిని పరీక్షిత్తు ఇలా అడిగాడు.

ఆ సమయానికి తగినట్టు లోకానికి మేలు కలుగుతుందని శివుడు 'సరే' అన్నాడనుకో. భయంతో దేవతలు 'స్వామీ! ఈ విషాన్ని మింగివేయండి' అని కోరారే అనుకో. బ్రహ్మాదులు తమను కాపాడమని 'శివా!' లే - లే - అని అన్నారే అనుకో. ఇదంతా కన్నులారా చూసికూడా తన భర్తను ఈ భయంకర విషాగ్ని జ్వాలలను తినండి అని ఆ ఉమాదేవి ఎలా చెప్పింది? (ఇది విడ్డూరంగా ఉందే) అని పరీక్షిత్తు అడుగగా శుకుడు ఇలా చెప్పాడు.

తింటున్నవాడు తన భర్త అని, తింటున్నది విషమని, తింటే లోకానికి మేలవుతుందని తెలిసిన పార్వతి 'మింగివేయండి'(పరవాలేదు) అన్నది. ఆ తల్లికి ఆ స్వామి కట్టిన మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో!

(పార్వతికి 'సర్వమంగళ' అని పేరు. వధువులు భర్తల ప్రాణరక్షణార్థం మంగళగౌరీ వ్రతం చేస్తారు. ఈ కథే దీనికి మూలం.)

తనచుట్టూ దేవతలంతా మూగి జయజయధ్వానాలతో పెద్దగా కేకలు వేస్తుండగా, గంభీరమైన కంఠధ్వనితో హుంకరిస్తూ 'ఒరే! లోకద్రోహీ! ఎక్కడికి పోతావు రా!' అంటూ తన ఎర్రని చేతులతో సర్వత్రా వ్యాపించిన ఆ విషాగ్నిని ఒకచోట చేర్చుకుని ఒక ముద్దలాగా మార్చుకొని నేరేడు పండును తిన్నంత సులభంగా విలాసంగా ఆరగించాడు.

ఆ ప్రచండ విషాన్ని శివుడు ఆరగిస్తున సమయంలో, ఆ వేడికి పాములు కదలి పారిపోలేదు. సమీపిస్తున్నపుడు ఆ మహాదేవుని దివ్యదేహానికి చెమట కూడా పట్టలేదు. దాన్ని నిమ్మళంగా ముద్దగా చేస్తున్నపుడు ఆ విషప్రభావంతో కళ్ళు ఎర్రబడలేదు; చంద్రుడు కందిపోలేదు. దాన్ని నోట్లో వేసుకొని, తిని మింగినపుడు నోరు ఎండిపోలేదు.

తన కడుపులో అన్ని లోకాలూ ఉంటాయని శివుడు స్మరించుకొని, తాగితే లోపలున్న లోకాలు భస్మమై పోతాయని, లోపలికి పోకుండా తన గొంతులోనే జాగ్రత్తగా కదిలి పొర్లిపోకుండా నిలుపుకొన్నాడు.

ఇతరులపై ప్రేమ పుట్టినపుడు, మెచ్చుకొన్నపుడు, తమకు ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఈవచ్చు - కాని అగ్నిని ముద్దగా చేసి తినటానికి త్రినేత్రుడైన - చిచ్చర కన్నుగల ఒక్క శివుడికి తప్ప ఇతరులకు సాధ్యమవుతుందా!

శివుడు తన గొంతులో ఆ విషాన్ని నిలుపుకోగా నల్లదనం ఏర్పడి అదీ ఒక అలంకారమయింది. సత్పురుషులకు సాధుసంరక్షణమే ఒక పెద్ద అలంకారం కదా!

ఆ తరువాత ఏమయిందంటే

మహేశ్వరుడు ఆ విధంగా గొంతులో ఆ మహావిషాగ్నిని ధరించటం చూసి విష్ణువు, బ్రహ్మ పార్వతీదేవి, మహేంద్రుడు అందరూ మనసారా 'మేలుమేలు' అంటూ ప్రశంసించారు.

ఈ హాలాహల భక్షణ కథను లీలగా విలాసంగా విన్నాా రాసినా, ఇష్టంతో చదివినా, పాములవల్ల, తేళ్ళవల్ల ఆపదలు పొందకుండా ఉంటారు. అగ్నివల్ల కూడా బాధపడరు.

అనంతరం దేవాసురులు ఆ సముద్రాన్ని చిలకడం కొనసాగించారు.

పాలకడలిం దరుచునెడ నైరావతాదులు జనించుట

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...