Friday, March 20, 2026

Glorious and Divine 60 Vratas - మహిమాన్వితమైన అరవై ప్రతాలు

మహిమాన్వితమైన అరవై ప్రతాలు
నందికేశ్వరుడు నారదుడితో తనకి పరమేశ్వరుడు బోధించిన మహిమాన్వితమైన అరవై వ్రతాల గురించి సవివరంగా ప్రబోధించాడు.

1. దేవవ్రతం : ఒక సంవత్సరం పాటు నక్తవ్రతాన్ని (ఉదయం ఉపవాసం రాత్రికి భోజనం) ఆచరించి సంసారి అయిన విప్రుడికి పాడి ఆవుని బంగారంతో చేసిన త్రిశూలాన్ని చక్రాన్ని వస్త్రాలని 'శివో
హమస్మి - రుద్రోహమస్మి' అనే భావనతో దానం ఇవ్వాలి. ఈ వ్రతం ఆచరించటం వల్ల మహాపాతకాలు నశించి శివలోకం సంప్రాప్తిస్తుంది.

2. లీలావ్రతం : రోజు విడిచిరోజు ఒక సంవత్సరకాలం నక్తవ్రతాన్ని ఆచరించి సంవత్సరం చివర్లో బంగారంతో చేసిన కలువపూవు, పంచదారతో నింపిన పాత్ర, బంగారంతో చేసిన వృషభం (ఎద్దు) ప్రతిమ- వీటిని యోగ్యుడైన విప్రుడికి దానమివ్వాలి. అలా చేసిన వారు విష్ణులోకానికి చేరుకుంటారు.

3. ప్రీతివ్రతం : ఆషాఢం నుంచి వరుసగా నాలుగు నెలలపాటు అనగా ఆశ్వయుజమాసం వరకు, అభ్యంగనం చేసుకోకుండా, యోగ్యుడైన వాడికి భోజన సామాగ్రిని దానం చేయాలి. ఇలా చేసినవాడు విష్ణుపథాన్ని చేరుకుంటాడు.

4. గౌరీవ్రతం : చైత్రమాసం మొత్తం పాలు, పెరుగు, తేనె, నేయి, చెరుకురసం స్వీకరించకుండా వుండాలి. చివరిరోజు బ్రాహ్మణ దంపతుల్ని పిలిచి, వారికి ఒక పాత్రలో తాము వదిలిన ద్రవ్యాలలో ఏదో ఒక రసాన్ని నింపి, 'గౌరీమే ప్రీయతాం' అని చెప్పి వస్త్రాలతో సహా దానమివ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వాడికి అజ్ఞానం తొలగిపోతుంది.

5. కామవ్రతం : వసంత ఋతువు ప్రారంభంలో చైత్రశుక్ష త్రయోదశినాడు నక్తవ్రతాన్ని చేసి, బంగారు అశోక పుష్పాలు, పది అంగుళాల పొడవున్న చెరుకుగడ, నూతన వస్త్రాలు తీసుకుని 'ప్రద్యుమ్నః ప్రీయతాం' అనే మంత్రం చెబుతూ బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఈ వ్రతం అన్ని రకాల శోకాల్నీ పోగొడుతుంది. దీన్ని ఆచరించిన వాడు ఒక కల్పం పూర్తయ్యేంతవరకు 
విష్ణులోకంలో సుఖ భోగానుభవిస్తాడు.

6. శివవ్రతం : ఆషాఢమాసంలో ఈ వ్రతాన్ని ప్రారంభించి వరుసగా నాలుగు నెలలపాటు గోళ్ళు కత్తిరించుకోకుండా వుండాలి. అలాగే ఈనాలుగు నెలలూ వంకాయకూరని, తేనె, నేయి, బెల్లాన్ని విసర్జించాలి. కార్తీకమాసం మొదట్లో బంగారంతో వంకాయ ప్రతిమని చేయించి యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానమివ్వాలి. అలా చేసిన వాడు రుద్రలోకానికి చేరుకుంటాడు.

7. సౌమ్యవ్రతం : ఈ వ్రతాన్ని ఆచరించేవారు హేమంత -శిశిరఋతువుల్లో ఎలాంటి పూలని ధరించకుండా వుండాలి. ఫాల్గుణమాసం చివర ఆ ఋతువుల్లో పూచే మూడురకాల పూలని బంగారంతో చేయించి, మూడు వేళల్లో మూడుపూలని విడివిడిగా 'శివకేశవే
ప్రీయతాం' అనే మంత్రాన్ని చెబుతూ విప్రుడికి దానం ఇవ్వాలి. ఇలా చేసినవారు పరమపదాన్ని పొందుతారు.

8. సౌభాగ్యవ్రతం: ఫాల్గుణమాసం శుక్లపక్ష తృతీయ తిధి నుంచి ఆ నెల చివరి వరకూ ఉప్పుని తినకూడదు. చివరిరోజు బ్రాహ్మణ దంపతుల్ని పూజించి వారికి ఒక ఇంటిని, మంచాన్ని 'భవానీ ప్రీయతాం' అనే మంత్రాన్ని చెబుతూ దానమివ్వాలి. ఇలా చేసిన వారికి ఒక కల్పాంతం వరకూ గౌరీ లోక నివాసం లభిస్తుంది.

9. సారస్వతవ్రతం : ఈ వ్రతాన్ని ఆచరించేవాడు సంధ్యాకాలంలో మౌనాన్ని పాటించాలి. అతడు పాత నేతితో నింపిన పాత్రని, వస్త్రాల జతని, నువ్వులని, ఘంటని విప్రుడికి దానం చేయాలి. ఇలా చేసిన వాడికి రూపం, విద్యాలాభం కలుగుతుంది. అంతే కాదు పునరావృత్తి రహితమైన సారస్వత లోక ప్రాప్తి కూడా లభిస్తుంది.

10. సంపద్వ్రతం : పంచమితిథినాడు ఉపవాసం వుండాలి. మర్నాడు షష్టి తిథినాడు ఒక బంగారు పాత్రలో కొంత బంగారాన్ని ఉంచి యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఇలా చేసినవాడు ప్రతి జన్మలో ధనాధిపతి అవుతాడు. చివరికి విష్ణులోకానికి చేరుకుంటాడు.

11. శుద్ధివ్రతం : ఒక సంవత్సరంపాటు శివాలయంలో గానీ, విష్ణు ఆలయంలో కానీ, నివసించి చివర గంధాన్ని అనులేపనాన్ని ధరించి, ఒక పాడి ఆవుని నీటితో నింపిన కుండని బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఇలా చేసినవాడు పదివేలజన్మల వరకూ రాజుగానే జన్మిస్తాడు. చివరి జన్మలో అతడికి శివలోక ప్రాప్తి కలుగుతుంది.

12. కీర్తివ్రతం : ఒక సంవత్సరం పాటు మంచి మనసుతో ఒకే స్థానంలో వుండి, రావి చెట్టుకి, సూర్యుడికి, గంగకి నమస్కరించి మౌనవ్రతాన్ని పాటిస్తూ ఏకభుక్తుడై వుండాలి. వ్రతం చివర బ్రాహ్మణ దంపతుల్ని పూజించి, మూడు పాడి ఆవుల్ని బంగారంతో చేయించిన వృషభాల్ని దానమివ్వాలి. ఇలా ఇచ్చిన వాడికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది. అంతే కాదు ఎనలేని కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి.

13. కామధుక్‌వ్రతం : గోధుమపిండితో ఒక మండలాన్ని ఏర్పర్చాలి. దానిమీద శివుడిది గానీ విష్ణుమూర్తిది గానీ ఒక ప్రతిమని పళ్ళెంలో వుంచి స్థాపించాలి. ఆ ప్రతిమలకి నేయితో అభిషేకం చేసి, తరువాత అక్షతలతో పూలతో పూజను చేయాలి. పూజ పూర్తయిన తరువాత సామవేదం చదివిన బ్రాహ్మణుడికి నువ్వులు, పాడి ఆవు, ఎనిమిది అంగుళాల పొడవున్న స్వర్ణకమలాన్నిదానం
ఇవ్వాలి. ఈవిధంగా వ్రతాన్ని ఆచరించినవాడు శివలోకానికి చేరుకుంటాడు.

14. వీరవ్రతం : నవమితిథినాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజు ఏకభుక్తం చేసి, ఒక కన్యకి మంచి భోజనంతో సహా బంగారు జరీ అంచుగల చీరని, రవికని దానంగా ఇవ్వాలి. అలాగే ఒక బ్రాహ్మణుడిని పిలిచి కొంచెం బంగారాన్ని దానమివ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరించినవారికి చక్కని రూప సౌందర్యం కలుగుతుంది. శివలోకం ప్రాప్తిస్తుంది. స్త్రీలకి ఈ వ్రతం ఆనందాన్ని పుణ్యాన్ని,
ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.

15. పితృవ్రతం : పౌర్ణమినాడు పాలుమాత్రమే ఆహారంగా స్వీకరించాలి. ఆ మర్నాడు పాడ్యమినాడు పితృదేవతల్ని ఉద్దేశించి శ్రాద్దాన్ని జరిపి బ్రాహ్మణులకి అయిదు పాడి ఆవుల్ని ఎరుపు పసుపు రంగుతో వున్న వస్త్రాలు అయిదింటిని నీటితో నింపిన అయిదు కుంభాలని దానం ఇవ్వాలి. ఈవిధంగా వ్రతాన్ని ఆచరించినవాడు, అతడి పితృదేవతలు తరిస్తారు. విష్ణులోకానికి చేరుకుంటారు. కల్పాంతమై తిరిగి నూతన కల్పం ప్రారంభంలో మహారాజుగా జన్మిస్తారు.

16. ఆనందవ్రతం : ఈ వ్రతాన్ని ఆచరించేవాడు చైత్రమాసం నుంచి వరుసగా ఆరుమాసాలు అయాచితంగా జలదానం చేయాలి. నాలుగో మాసం చివర వ్రతసమాప్తి నాడు మణికం అనే పాత్రని, అన్న వస్త్రాలని నువ్వులతో నింపిన పాత్రని, బంగారాన్ని యోగ్యుడైన విప్రుడికి దానమివ్వాలి. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.

17. రాజ్యవ్రతం : ఒక సంవత్సరంపాటు శివుడికి పంచామృతస్నానాన్ని ప్రతిరోజు జరిపించాలి. సంవత్సరం పూర్తయిన తరువాత ఒక ధేనువుని, శంఖాన్ని పంచామృతాలతో సహా బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరించినవాడికి శివలోక ప్రాప్తి కలుగుతుంది. కల్పాంతం అయిన తరువాత తిరిగి నూతన సృష్టి ప్రారంభంలో రాజుగా జన్మిస్తాడు.

18. అహింసావ్రతం : మాంసాహారులైనవారు ఒక సంవత్సరం పాటు మాంసాహారాన్ని భుజించకూడదు. సంవత్సరం చివర ఒక పాడి ఆవుని, బంగారంతో చేసిన లేడి ప్రతిమని దానమివ్వాలి. ఈ వ్రతం చేసిన వారికి అశ్వమేధ ఫలం లభిస్తుంది. బ్రహ్మలోక ప్రాప్తి కూడా కలుగుతుంది.

19. సూర్యవ్రతం : ఈ వ్రతాన్ని మాఘమాసంనాడు ఉషోదయకాలంలో ఆచరించాలి. ఉదయాన్నే స్నానం చేసి, విప్రదంపతుల్ని పూజించి వస్త్రా భరణాల్ని వారికి సమర్పించి మంచి భోజనాన్ని పెట్టాలి. ఈవిధంగా వ్రతం చేసిన వారికి రవిలోక ప్రాప్తి కలుగుతుంది.

20. విష్ణువ్రతం : ఆషాఢమాసం నుంచి వరుసగా నాలుగు మాసాలు అనగా ఆశ్వయుజమాసం వరకు వరుసగా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేయాలి. నిత్యం పూజ చేసుకుని కార్తీకమాసం ప్రారంభంలో వ్రతసమాప్తి చేసి ఆ రోజు విప్రుణ్ణి పిలిపించి అతడికి మృష్టాన్న భోజనం పెట్టి ఒక ధేనువుని దానమివ్వాలి. ఇలా చేసినవాడికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది.

21. శీలవ్రతం : ఉత్తారాయణంలో పూలని, దక్షిణాయనంలో నేతిని విడిచిపెట్టాలి. ఇలా ఒక సంవత్సరం గడిచాక ఒక బ్రాహ్మణుడికి నేతి పాయసంతో భోజనాన్ని పెట్టి, పూలదండల్ని నేయిని, పాడిఆవుని దానంగా ఇవ్వాలి. ఇలా చేసినవాడికి మంచిశీలం, ఆరోగ్యం కలుగుతాయి. చివరికి అతడు శివలోకాన్ని చేరుకుంటాడు.

22. దీపవ్రతం : ఒక సంవత్సరం పాటు ఎలాంటి నూనెని ఆహారంలో తీసుకోకూడదు. ఈ సంవత్సరం అంతా ప్రతిరోజూ దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించాలి. సంవత్సరాంతంలో యోగ్యుడైన బ్రాహ్మణుడికి బంగారంతో చేసిన చక్రాన్ని శూలాన్ని వస్త్రాలని దానమివ్వాలి. ఇలా చేసినవాడికి మంచి తేజస్సు కలుగుతుంది. రుద్రలోకం ప్రాప్తిస్తుంది.

28. కల్యాణగౌరీ వ్రతం : కార్తీకమాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం ఉన్న రోజునించి ఒక సంవత్సరం పాటు గోమూత్రాన్ని గోధుమరవ్వని, పాలతో వండిన అన్నాన్ని మాత్రమే భుజిస్తూ, నక్త దీక్షలో వుండాలి. సంవత్సరం చివర వ్రత సమాప్తి చేసి యోగ్యుడైన విప్రుడికి గోదానం చేయాలి. దీనివల్ల కల్పాంతం వరకూ గౌరీలోక ప్రాప్తి కలుగుతుంది. కొత్త సృష్టి మొదట్లో రాజు జన్మలభిస్తుంది.

24. దీప్యవ్రతం : ఈ వ్రతాన్ని చేసేవారు చైత్రమాసం అంతా గంధానులేపనాన్ని విడిచిపెట్టాలి. మాసం చివర విప్రుడికి గంధంతో నింపిన ముత్యపుచిప్పని, తెల్లని వస్త్రాలని దానమివ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి వరుణలోక ప్రాప్తి కలుగుతుంది.

25. శుభకీర్తివతం : ఈ వ్రతం చేసేవారు వైశాఖ మాసమంతా ఉప్పు-పూవులు విడిచిపెట్టాలి. మాసం చివర ఉప్పుతో నింపిన కుండని విప్రుడికి దక్షిణతో సహాదానమివ్వాలి. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించిన మంచి తేజస్సు కీర్తి కలుగుతాయి. ఒక కల్పకాలం విష్ణులోక నివాసం కలుగుతుంది.

26. బ్రహ్మవ్రతం : ఈ వ్రతాన్ని ఆచరించేవాడు మూడు పలాలకి తక్కువ బరువుకాకుండా బంగారంతో బ్రహ్మాండం ప్రతిమని తయారుచేయించాలి. తరువాత మూడు రోజులు వరుసగా నువ్వులతో హోమం చేయాలి. హోమం పూర్తయిన తరువాత బ్రాహ్మణ దంపతులని భోజనంతో సంతృప్తి పరిచి వారిని వస్త్ర మల్యాది ఆభరణాలతో పూజించి 'విశ్వాత్మా ప్రీయతాం' అనే మంత్రాన్ని చెబుతూ తాను చేయించిన బంగారు బ్రహ్మాండం ప్రతిమని దానమివ్వాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించినవారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.

27. సువ్రతం : ఈ వ్రతాన్ని ఆచరించాలనుకునేవారు బంగారంతో సహా, ఉభయముఖీగోదానం (అనగా అపుడే ఈనుతున్న ఆవుని) చేయాలి. ఆ రోజంతా కేవలం పాలనే ఆహారంగా తీసుకోవాలి. ఈవిధంగా చేస్తే పునరావృత్తి రహితమైన పరమపదాన్ని చేరుకుంటారు.

28. కల్పప్రతం : మూడురోజుల పాటు పాలనే ఆహారంగా తీసుకోవాలి (దీన్నే పయోవ్రతం అంటారు). నాలుగోరోజు ఒక పలానికి తక్కువకాకుండా బంగారంతో కల్పవృక్షాన్ని తయారుచేయించి, బియ్యంతో సహా దాన్ని యోగ్యుడైన విప్రుడికి దానం చేయాలి. ఇలా చేసిన వారికి బ్రహ్మలోకం సంప్రాప్తిస్తుంది.

29. భీమవ్రతం : ఒక నెలరోజులపాటు ఏకభుక్తం లేక నక్త వ్రతాన్ని అవలంబిస్తూ నెల చివర్లో యోగ్యుడైన విప్రుడికి పాడి ఆవుని దానమివ్వాలి. ఇలా చేసినవారికి విష్ణులోకప్రాప్తి కలుగుతుంది.

30. ధరావ్రతం : ఈ వ్రతాన్ని చేసేవారు ఇరవై పలాలకి తక్కువ కాకుండా బంగారంతో భూమి ప్రతిమని చేయించి విప్రుడికి దానమివ్వాలి. ఆ రోజు మొత్తం కేవలం పాలనే ఆహారంగా తీసుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదు అతడు చేసిన పుణ్యఫలం ఏడు కల్పాల దాకా వెంటవస్తుంది.

31. మహావ్రతం : మాఘమాసంలోకానీ, చైత్రమాసంలోకానీ, శుక్లపక్ష తృతీయతిథినాడు గానీ బెల్లంతో వండిన పాయసాన్ని ఆహారంగా స్వీకరించి, ఆ రోజు బెల్లంతో సహా ధేనువుని విప్రుడికి దానమివ్వాలి. ఈ వ్రతం చేసిన వారికి గౌరీలోక ప్రాప్తి కలుగుతుంది.

32. ప్రభావ్రతం : ఒక పక్షం (పదిహేను) రోజులు ఏక భుక్తంతో గానీ, నక్తంతో గానీ ఉపవాసం ఉండి, పదిహేనోరోజు తరువాత రెండు కపిలగోవుల్ని బ్రాహ్మణులకి దానమివ్వాలి. ఇలా ఈ వ్రతాన్ని చేసినవారు దేవతలతో పూజించబడి బ్రహ్మలోకంలో సుఖంగా నివసిస్తారు.

33. ప్రాప్తివ్రతం : ఒక సంవత్సరం పాటు ఏకభుక్తం చేస్తూ ఉపవాసముండి సంవత్సరం చివర మంచి భక్ష్యాలతో సహా నీటితో నింపిన కడవల్ని దానమివ్వాలి. ఈ వ్రతాన్ని చేసిన వారు ఒక కల్పం వరకూ శివలోకంలో నివసిస్తారు.

34. సుగతివ్రతం : ఒక సంవత్సరకాలం ప్రతి అష్టమీతిథినాడు నక్త వ్రతాన్ని చేస్తూ సంవత్సరం చివరి అష్టమినాడు గోదానం చేయాలి. అలా చేసినవాడికి శుభమంగళాలు కలుగుతాయి.

35. వైశ్వానరవ్రతం : వర్షాకాలం నాలుగునెలలు అనగా ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం బ్రాహ్మణులకి వంట కట్టెల్ని దానమివ్వాలి. నాలుగు నెలల తరువాత నేయిని, దేనువుని దానం చేయాలి. ఇది అన్ని పాపాలనీ తొలగించి బ్రహ్మలోక ప్రాప్తి కలిగిస్తుంది.

36. కృష్ణప్రతం : ఒక ఏడాదిపాటు ప్రతి ఏకాదశినాడు నక్త వ్రతాన్ని ఆచరించాలి. ఏడాది చివర వచ్చే ఏకాదశినాడు బంగారంతో విష్ణుచక్రాన్ని తయారు చేయించి విప్రుడికి దానమివ్వాలి. ఈ వ్రతం చేసిన వాడికి విష్ణులోక ప్రాప్తి కులుగుతుంది.

37. దేవీవ్రతం : ఈ వ్రతం చేసేవాడు ఒక సంవత్సరం పాటు పాల అన్నాన్ని మాత్రమే భుజించాలి. సంవత్సరం చివర యోగ్యుడైన విప్రుడికి రెండు పాడి ఆవుల్ని దానమివ్వాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించిన వాడికి ఒక కల్పకాలం లక్ష్మీలోక ప్రాప్తి కలుగుతుంది.

38. భానువ్రతం : ఒక సంవత్సరం పాటు సప్తమీతిథుల్లో నక్తదీక్షతో ఉపవాసం ఉండాలి. సంవత్సరం చివర్లో యోగ్యుడైన బ్రాహ్మణుడికి ఒక పాడి ఆవుని దానమివ్వాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించినవారు రవిలోకాన్ని చేరుకుంటారు.

39. వైనాయకప్రతం : ఒక సంవత్సరంపాటు వరుసగా అన్ని చవితి తిథుల్లో నక్తదీక్షతో ఉపవాసముండాలి. సంవత్సరం చివర బంగారంతో ఏనుగు ప్రతిమని తయారుచేసి దానమివ్వాలి. ఈ వ్రతాన్ని చేసినవారికి శివలోకం ప్రాప్తిస్తుంది.

40. కాలవ్రతం : ఆషాఢమాసం నుంచి వరుసగా నాలుగుమాసాల పాటు ఆ ఋతువుల్లో లభించే ఫలాలని భుజించకూడదు. కార్తీకమాసం ప్రారంభంలో తాము వదిలేసిన ఫలాల ప్రతిమల్ని బంగారంతో చేయించి వాటిని రెండు పాడి ఆవులతో సహా యోగ్యుడైన విప్రడికి దానం చేయాలి. దీనివల్ల వ్రతం చేసిన వాడికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.

41. సౌరవ్రతం : హేమంత ఋతువులో ప్రారంభించి ఒక సంవత్సరకాలం ప్రతి సప్తమినాడు ఉపవాసంచేయాలి. తిరిగి సంవత్సరం గడిచాక వచ్చే హేమంతంలో యధాశక్తిగా బంగారు కమలాన్ని ఆవుని నీటితో నింపిన కుండని విప్రుడికి దానంగా ఇవ్వాలి. ఇది సూర్యలోకాన్ని ప్రాప్తింపచేసే వ్రతం.

42. విష్ణువ్రతం : పన్నెండు ద్వాదశి తిథుల్లో ఉపవాసంచేసి, చివరి ద్వాదశినాడు 
గోవస్తుకాంచ(బంగారం)నాలతో బ్రాహ్మణుణ్ణి సంతృప్తి పరచాలి. ఆవిధంగా వ్రతాన్ని ఆచరించిన వాడికి ఐశ్వర్యం పరమపదం సంప్రాప్తిస్తాయి.

43. వృషవ్రతం : కార్తీకమాసంలో వృషోత్సర్గం చేసి నక్తవ్రతాన్ని అవలంబించాలి. (వృషోత్సర్గం అంటే నాలుగు దూడలతో కలిసిన ఆవుకి త్రిశూల చక్రాంకితాలు వేసి విడిచిపెట్టటం) అలా చేసిన వారికి శివలోకం ప్రాప్తిస్తుంది.

44. ప్రాజాపత్యవ్రతం : చాంద్రాయణ వ్రతం, కృచ్చవ్రతం వంటివి పాటించి, వ్రతం చివర గోదానాన్ని చేసి యధాశక్తిగా యోగ్యులైన బ్రాహ్మణులకి భోజనం పెట్టించి వారితో పాటు తానూ భుజించాలి. దీన్ని ఆచరించటం ద్వారా సకల శుభమంగళాలు జరుగుతాయి.

45. త్రయంబకవ్రతం : ఒక సంవత్సరం పాటు చతుర్ధి తిథులలో నక్తవ్రతాన్ని ఆచరించాలి. సంవత్సరం చివర్లో విప్రుడికి ఆవుని, ధనాన్ని దానంగా ఇవ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వాడికి శివసాయుజ్యం లభిస్తుంది.

46. ఘృతవ్రతం : వరుసగా ఏడురోజుల పాటు ఉపవాసం చేయాలి. చివరిరోజు నేతితో నింపిన కుండని విప్రుడికి దానమివ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరించినందువల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.

47. ఇంద్రవ్రతం : ఒక సంవత్సరంపాటు దర్భలమీదే శయనిస్తు (పడుకుంటూ) సంవత్సరం తరువాత బంగారాన్ని ఒక పాడి ఆవుని విప్రుడికి దానమివ్వాలి. ఈ వ్రతాన్ని చేసినవారికి ఇంద్రలోకప్రాప్తి, స్వరసుఖాలు లభిస్తాయి.

48. శివవ్రతం : ఒక సంవత్సరంపాటు ప్రతి తదియనాడు నిప్పులపై ఉడికించిని ఆహారాన్ని అనగా పచ్చిపాలు, పళ్ళు మాత్రమె ఆహారంగా తీసుకోవాలి. ఆఖరి తదియనాడు విప్రుడికి గోవుని దానంచేయాలి. ఇలా చేసిన వారికి పునరావృత్తి రహితమైన శివలోకం లభిస్తుంది.

49. అశ్వవ్రతం : రెండు పలాలకి తగ్గకుండా బంగారంతో రెండు రథాల్ని, గుర్రాల్ని చేయించి యోగ్యుడైన విప్రుడికి దానమివ్వాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. ఈ వ్రతాన్ని చేసినవారు వందకల్పాలు స్వర్గలోకంలో నివసించి సృష్ట్యాదిలో మహారాజుగా జన్మిస్తారు.

50. కరివ్రతం : ఈ వ్రతాన్ని ఆచరించేవారు రెండు పలాలకి తక్కువ కాకుండా బంగారంతో ఒక రథాన్ని రెండు ఏనుగుల్ని తయారు చేయించి, యోగ్యుడైన విప్రుడికి దానమివ్వాలి. దానం చేసిన రోజు పూర్తిగా ఉపవాసముండాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సత్యలోక ప్రాప్తి కలుగుతుంది.

51. నిర్దుఃఖవ్రతం : ఒక సంవత్సరం పాటు ఏకభుక్తతో గానీ, నక్తంతోగానీ ఉపవాసం చేయాలి. సంవత్సరం చివర్లో విప్రుడికి గోదానం చేయాలి. ఈ వ్రతాన్ని చేసిన వారికి యక్షాధిపత్యం లభిస్తుంది.

52. వరుణవ్రతం : ఒక రాత్రిఅంతా నీళ్ళల్లో గడిపి, ఆ మర్నాడు ఉదయం యోగ్యుడైన విప్రుడికి గోదానం చేయాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించిన వారికి వరుణలోక ప్రాప్తి కలుగుతుంది.

53. చంద్రవ్రతం : ఒక నెలరోజులపాటు చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించి, వ్రతం చివరి రోజున బంగారంతో చంద్రుడి ప్రతిమని తయారు చేయించి, విప్రుడికి దానమివ్వాలి. దీనివల్ల చంద్రలోక ప్రాప్తి కలుగుతుంది.

54. రుద్రవ్రతం : జ్యేష్ట శుక్ల అష్టమి, చతుర్దశి తిథుల్లో పగటిపూట పంచాగ్నులమధ్యలో వుండాలి (అనగా నాలుగువైపులా అగ్నిని వెలిగించుకుని పైన సూర్యుడు వున్నప్పుడు) సాయంకాలం వ్రతసమాప్తి చేసి విప్రుడికి గోదానం చేయాలి. ఈ వ్రతాన్ని నిష్టగా ఆచరించినవారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది.

55. భవానీదేవివ్రతం : ఒక సంవత్సరం పాటు ప్రతి తదియ నాడు చాందినీని నిర్మించాలి. చివరి తదియరోజు విప్రుడికి గోదానం చేయాలి. ఆవిధంగా వ్రతాన్ని ఆచరించినవారికి భవానీలోక ప్రాప్తి కలుగుతుంది.

56. స్నాపకవ్రతం : ఈ వ్రతాన్ని ఆచరించేవారు మాఘమాసం శుక్షపక్ష సప్తమినాడు రాత్రంతా తడిబట్టలతో గడపాలి. మర్నాడు ఉదయం విప్రడికి గోదానం చేయాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఒక కల్పం వరకు స్వర్గలోకంలో నివసించే యోగం కలుగుతుంది.

57. దేవేంద్రవ్రతం : ఒక రోజు పూర్తిగా ఉపవాసం వుండి, ఆ రోజు మూడు సంధ్యల్లో విప్రదంపతుల్ని వస్రాదిభూషణాలతో అర్చించాలి. ఇలా చేసిన వారికి ముక్తి లభిస్తుంది.

58. సోమవ్రతం : ప్రతిమాసం శుక్లపక్ష ద్వితీయా తిథినాడు చంద్రుణ్ణి పూజించాలి. ఆ తిథినాడు ఉప్పుతో నింపిన పాత్రని దానం ఇస్తూ వుండాలి. వ్రతం చివర యోగ్యుడైన విప్రుడికి గోదానం చేయాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించినవారికి శివలోక ప్రాప్తి కలుగుతుంది. కల్పాంతం అయ్యాక తిరిగి ప్రారంభమయ్యే సృష్టి మొదట్లో మహారాజుగా జన్మించే యోగ్యత లభిస్తుంది.

59. వైశ్వానరవ్రతం : ఒక సంవత్సరంపాటు ప్రతి పాడ్యమి తిథినాడు ఏకభుక్తం చేస్తూ, సంవత్సరం పూర్తయిన తరువాత పది ఆవుల్ని యోగ్యులైన విప్రులకి దానంచేయాలి. ఇలా చేసిన వారికి అగ్నిలోక ప్రాప్తి కలుగుతుంది.

60. విప్రప్రతం : ఒక సంవత్సరం పాటు ప్రతిదశమితిథినాడు ఏకభుక్తం చేస్తూ సంవత్సరాంతాన పది ఆవుల్ని విప్రులకి దానం చేయాలి. తరువాత బ్రహ్మవిష్ణు శివులని, బ్రాహ్మణుల్ని ఆరాధించాలి. ఈ వ్రతాన్ని ఆచరిస్తే మహాపాతకాలు కూడా తొలగిపోతాయి.

సర్వోత్తమమైన ఈ షష్టి(60) వ్రతకల్పం గురించి విన్నా చదివినా వందమన్వంతరాల వరకూ గంధర్వాధి పత్యం కలుగుతుంది. ఇది ఎంతో పుణ్యకరమైనది. సకలశుభఫలితాలనీ అందించేది.

(గమనిక - పై తెలిపిన అరవై వ్రతాలలో బంగారం, గోవులు దానంగా ఇవ్వాలని చెప్పారు. ఇది ఆనాటి పరిస్థితులకి అనుగుణంగా చెప్పినదానం. ప్రస్తుతకాలంలో వీటికి బదులుగా యధాశక్తి ధనాన్ని దక్షిణ రూపంలో 'తదభావే' అని సమర్పించినా వ్రతఫలం దక్కుతుంది)

ప్రయాగ మాహాత్మ్యం

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...