Wednesday, March 25, 2026

The descent of the Ganges (Ganga Avataran) from Shiva's matted locks (Jata) - శ్రీ పరమేశ్వర జటానిర్గత గంగా ప్రవాహ మహిమాభివర్ణనము

శ్రీ పరమేశ్వర జటానిర్గత గంగా ప్రవాహ మహిమాభివర్ణనము

ఈ విధంగా ఆ మహానది శివుని జడల సందునుండి దిగి, అడ్డులేని ప్రవాహంతో భూమిపై కురికింది. బాగా వ్యాపించిన గొప్ప ప్రవాహంతో దూడవెంబడి గంతులువేస్తూ పరుగులు తీసే యౌవన ప్రాయంలో ఉన్న కామధేనువులాగా ముందుకు వ్యాపిస్తూ, ముద్దులొలికే చంద్రునిపై ప్రేమతో ఉప్పొంగే పాలసముద్రంలాగా అతిశయించి, పరమాత్ముని వదనంనుండి వెలువడే ఓంకారాన్ని అనుసరించే శబ్దబ్రహ్మంలాగా, విస్తృతమైన విలాసంతో ఆ రాజశ్రేష్ఠుని మార్గాన్ని అనుసరించింది. ఐరావతతొండాన్ని అనుకరిస్తూ ప్రవహించే వరద ముఖాలు కలిగి, వరద ముఖాల వెనుకనే అక్కడక్కడ కనిపించి తొలగిపోయే బాలసరస్వతి కుచకలశాలను మించిన అధికమైన నీటిబుడగలనూ, నీటి బుడగల చేరికతో పారిజాతపు పూలగుత్తుల కాంతిని మించిన తెల్లని నురగలనూ, ఆ నురగల ప్రక్కన సగం విరిసిన కర్పూరపు చెట్ల చిగుళ్ల సోయగాన్ని గేలిచేసి సుడులును, ఆ సుడుల ప్రక్కన తెల్లమేఘాలను మెచ్చుకోని నిడుపైనయేర్లును, ఆ యేర్లను కలసి గాలి తాకిడి వల్ల తీవ్రంగా పైకెగసే పాపనాశనకరమైన కెరటాలను, ఆ కెరటాల చివరల్లో ముక్కలు ముక్కలై కుప్పించి పైకెగరే ముత్యాలహారాల్లాగా, మల్లెపూదండల్లాగా, కర్పూర ఖండాలలాగా, చంద్రుని శకలాల్లాగా, చుక్కల గుంపులాగా ప్రకాశిస్తూ బాటసారుల తాపాన్ని పోగొట్టే నీటి తుంపురులు కలిగి, భూలోకానికి శుభాన్ని కలిగించేదిగా, లక్ష్మీదేవి హస్తంలాగా విష్ణుపాదమైన ఆకాశాన్ని తాకి ఆకాశం వలె ప్రకాశించే హంసల కాంతితో ఒప్పి, శుక్షపక్షంలోని భూమండలం లాగా శోభించే కలువలు కలిగి, అనేకమైన బ్రతుకు తెరువులతో కూడిన లోకంలాగా అధికమైన నీటిని కలిగి, మంచి మనస్సుతో శోభించే జీవితం లాగా వికసించిన పూలతో కూడి, అనేక సేనలు, బక, భీమ, సుభద్రార్జునుల చరిత్రతోడి మనోహరమైన భారత పర్వంలాగా అనేకమైన చక్రవాకపక్షులతోకూడి, కొంగలతో భయంకరమైన అలలతో సుందరమై, తన వాళ్లను కలిసిన రాక్షసులకు అభయ మివ్వడంలో సమర్థమైన శ్రీరాముని హృదయంలాగా తన నీళ్లలో మునిగిన పాపులకు అభయమివ్వడంలో సమర్థమై, మృత్యువును జయించిన గొప్పదాత ప్రవర్తనలాగా, గొప్పనడకతో శివుణ్ణి సేవిస్తూ విభూతితో కూడిన అందమైన శివుని రూపంలాగా సంపదతో సుకుమారమై, క్రౌంచ పర్వతాన్ని జయించిన కుమారస్వామి చరిత్రలాగా కొంగలు మొదలైన వాటితోకూడి; అర్జునుడి రథంలాగా సూర్యుని గుఱ్ఱాలవంటి వేగం కలిగి, శ్రీరామునికి వనవాసం కల్పించిన మంథర ఆలోచనలాగా శీఘ్రంగా వనపర్వతాలలో ప్రవేశించే కోరికకలిగి, మన్మథుని జెండాలాగా మొసళ్లతో కూడి; సైన్యంతో కూడిన శంబరాసురునిలో ప్రవేశించే మన్మథుని బాణంలాగా, తనలో లీనమైన ఇతర ప్రవాహజలాలు కలిగి, మన్మథుని చిగురుకత్తిలాగా, బాటసారుల తాపాన్ని తొలగించి; అల్పులపట్ల, అధికులపట్ల సమానంగా ప్రవర్తించే యముని దండంలాగా ఎత్తుపల్లాల్లో సమానంగా మెలిగి యతితోనూ, గురులఘువులతోనూ, వాక్యసమూహంతోనూ కూడిన ఛందశ్శాస్త్రంలాగా వేగంతోను, పెద్ద చిన్న శబ్దాలతోను కూడి గొప్ప వర్ణమూలాలతో, భిన్నాలతో, మిశ్రాలతో, ప్రకీర్ణాలతో నిండిన గణిత శాస్త్రంలాగా, పరస్పరం రాచుకునే పొదరిండ్లతో, లోయలతో భయంకరంగా ప్రవహించేదై, భగవద్గీతా సహితమైన భీష్మపర్వంలాగా సుఖకరమైన శబ్దాలతో కూడినదై, వాద్యం నుండి వెలువడే మంద్రతార స్వరాలుగల సంగీతశాస్త్రంలాగా అనేక విధాలైన శబ్దాలతో కూడిందై; అచ్చులు, హల్లులు కలిగిన వ్యాకరణశాస్త్రంలాగా వడిగలదైై; మహాభాష్యవృత్తిలాగా వృద్దిగుణాల సామర్థ్యం కలిగిందై; పెక్కు ప్రయోజనాలతో కూడిన నిడివి అందరికీ అందుబాటులో ఉండే గొప్పగుణంతో విలసిల్లిందై. వేదసమూహాలకు అతీతమైన పరబ్రహ్మలాగా అనేక మార్గాలను అతిక్రమించిందై వర్ణపదక్రమాలతో కూడిన వేదంలాగా ధ్వనిక్రమాలకు కూడికయై; కర్కటమీనమిథునాలతో ప్రకాశించే ఖగోళ చక్రంలాగా కుళీరాలు, చేపలు, మొసళ్ళతో ఉండి; సుందరిముఖంలాగా స్వచ్చమైన చంద్రకాంతులతో నిండి; స్త్రీ పెదవివలె ఎఱ్ఱని కెంపు వర్ణం కలిగి; కాంత పెదవిలాగా ఎఱ్ఱరంగుతో కూడిందై, అందమైన స్త్రీ జడబంధంలాగా నల్లనాగు అందాలతో అతిశయించి, బుద్ధిమంతుని శాస్త్రవాదంలాగా అంతులేని శారదావిజయంతో ప్రకాశించేదై, విభ్రమవతి చనుదోయిలాగా సమస్త ప్రజానీకానికి బ్రతుకు తెరువై పయోధారతో నిండి జీవనప్రద తుంగయైన తుంగభద్రానది సొగసును మించిందైె; మనోజ్ఞవతి చిరునవ్వులాగా చంద్రభాగానదిని గేలిచెసేదై, గొప్ప ఒడ్డాణాలు ధరించిన కన్యక సహితుడైన అదృష్టవంతుని వివాహంలాగా భూమి నిండా వ్యాపించిందై, తార తనహస్తంతో సుగ్రీవుని తాకినట్లు ముత్యాలవంటి తనచేతితో యమునానదిని ఆక్రమించేదై; భీముని రథవిజ్బంభణాన్ని నివారించిన కర్ణుని బాణపరంపరలాగా భీమరథి నది ఆటోపాన్ని నివారించేదై; నీటిని చిమ్మే ఏనుగుతొండంవంటి గొప్ప విజృంభణతో కూడిందై, సురసాతిశయమైన రంభ ముఖంలాగా మంచినీటితో అతిశయించి, సముద్ర గర్వాన్ని అణచిన శ్రీరామచంద్రుని బొమముడిలాగా సింధునది గర్వాన్ని అణచిందై; తన్ను సమీపించిన దుశ్శాసను గర్వాన్ని అణగించే భీముని గదాఘాతంలాగా తనను చేరినవారి పాపాల్ని కడిగి వేసేదై; మాటి మాటికి కదలాడే గాజులతో శోభిల్లే వేశ్యముంజేయిలాగా మళ్ళీ మళ్ళీ కదలాడే నీటిబిందువులు కలిగి; పాపంలేని కృతయుగంలాగా పవిత్రమై, బ్రహ్మముఖం లాగా గొప్ప బ్రాహ్మణుల ఆశ్రయాన్ని పొందిందైై; అనేకదీర్ఘాలు, బిందువులతో, విసర్గలతో కూడిన వర్ణ గుణింతంలాగా అనేకమైన నీటివిందువులు కలిగిందై; సర్గబంధకావ్యానికి వలె గంభీరభావమాధుర్యం కలిగిందైై మధురాపురం నందనందనునితో కలసి ఆనందపడ్డట్లు ఆనందానికి నందనవనమై; ఇంద్రుడు విహరించే నందన ఉద్యానవనంలాగా కౌశికనదితో తిరిగేదై; ఇంద్రుని గుఱ్ఱం వలె స్థిరమైన మంచి స్థితికలిగి, విష్ణుచింత కలిగిన ధ్రువుని ఆలోచనలాగా విశ్వాన్ని పరిశీలించేదై, విష్ణువు శంఖంలాగా కుడినుండి ఎడమవైపుకు తిరిగి, ఉత్తర వివాహంలాగా అర్జునునికి ఆనందదాయకమై, పాలతో పొంగే పచ్చి బాలింతరాలి స్తనంలాగా నిరంతరం వృద్ధి కలిగిన నీళ్లతో (పాలతో) నిండిందై మకరం, పద్మం, మహాపద్మం, కచ్చపం అనే నిధులతో నిండిన కుబేరుని నిలయంలాగా మొసళ్ళతో, పద్మాలతో మెట్టతామరలతో తాబేళ్లతో నిండిందై; కూలిన కొండను పైకెత్తే ఆది కూర్మపు బలమైన వెన్నెముకలాగా కొండల్ని కదలించేదై, ఎత్తైన కటకాలతో నిండిన కొండలాగా ఎత్తైన గట్లతో కూడిందై భూమిని మోసే ఆదివరాహంలాగా ఓర్పుకలిగిందై, దర్భను ధరించిన బ్రాహ్మణుని హస్తంలాగా పవిత్రమై; తన నెదుర్కోడానికి వచ్చే ఖరదూషణాదుల గర్వాన్ని పోగొట్టే రామబాణంలాగా తనను చేరవచ్చే పాపుల అహంకారాన్ని పోగొట్టేదై; రాజులను సమూలంగా ఖండించే పరశురాముని గండ్రగొడ్డలిలాగా పర్వతాలను సమూలంగా పెల్లగించే బలం కలిగిందై; విరోధుల్ని దున్నే బలరాముని నాగలి లాగా గట్లను రాచుకొని పొంగేదై; బుద్దుని శరీరంలాగా ఆశ్రితులను రక్షించే సామర్థ్యం కలిగిందై; దేవతలను సైతం సంతోషపెట్టె శివుని నాట్యంలాగా ఎగిరిపడే చేపలతో నిండిందై; వేదాలకు శుభాన్ని ఇచ్చే మత్స్యావతారంలాగా చెవులకు ఆనందకరమై, ధనసమూహంతో ఇవ్వాలనుకొనే దాత దానంలాగా అర్ధసమూహంతో విస్తారమైందై; బలిచక్రవర్తి వంశాన్ని నిర్మూలించిన వామనుని పాదం లాగా గొప్ప వెదురు పొదలను పెకలించేదై; సామభేదోపాయాలతో కూడిన నీతిశాస్త్రం లాగా నేర్పరితనం కలిగిందై; అనేక జగాలతో, ప్రాణి సమూహంతో సేవింపబడే బ్రహ్మాండం లాగా పలు జీవరాశులతో నిండినట్టిదై మానిని లాగా గుట్టుతెలియనీక, ఇల్లాలి లాగా శబ్దంచేయక, ముగ్ధవలె బయటపడక, జవరాలిలాగా వేగం కలిగి, పతివ్రతలాగా స్థిరత్వం కలిగి, తల్లిలాగా అన్నిటిని కడుపులో దాచుకొంటూ, దేవతలాగా భక్తుల కోరికలను ఈడేరుస్తూ, క్రమక్రమంగా హద్దులను దాటి మాటకు మనసుకు అందకుండా ఆ గంగానది భగీరథునివెంట ప్రవహించింది.

(ఆకాశాన్నుండి భూమికి అవతరించిన గంగానది సోయగాల్ని పోతనగారు సహజసుందరంగా, సాభిప్రాయంగా, మనోజ్ఞంగా వర్ణించారు. పరమేశ్వరు జటాజూటంనుండి క్రిందికి దిగబడ్డ ఆ నది పోయిన పోకడలు కళ్ళకు కట్టినట్లు వర్ణించబడ్డాయి. సృష్టిలోని వర్ణనీయ వస్తువుల్నీ సందర్భోచితంగా గ్రహించి చినుకులు, తుంపురులు, బిందువులు, బుడగలు, కాలువలు, సెలయేళ్లు మొదలైన నీటియొక్క అవస్థా భేదాలతో కవి ఒక అనుబంధాన్ని చేర్చాడా అన్నట్లు వచనం ముక్తపదగ్రస్తంగా చిత్రించబడింది. ఆయాచోట్ల శ్లేష సాభిప్రాయంగా మనోజ్ఞతను వెల్లివిరిసింది. గంగ 'విష్ణుపాదోద్భవ'గా ప్రసిద్ది. గంగావతరణాన్ని విష్ణవుయొక్క దశావతారాలతో అనుబంధించి ఒక విశిష్టతను ఆపాదించాడు కవి. పోతన ఇటువంటి వచనాల్ని నరసింహావతారాది ఘట్టాల్లో కూడ వ్రాశాడు. అవన్నీ ఎక్కడి కక్కడే సందర్భోచితంగా ఉన్నాయి.)

గంగానది భగీరథ మహారాజు రథం వెంబడి అనేక దేశాల్ని దాటి ఆ సగర రాజకుమారుల బూడిదరాసులను ముంచి ప్రవహించగా వారు నూతనశోభలతో దేవతల నగర నివాసమైన స్వర్గాన్ని పొందారు. పుణ్యాత్ముల పట్ల చేసిన అంతులేని ద్రోహమనే అగ్ని గంగాజల ప్రవాహంవల్ల కాకుండా వేరేవిధంగా చల్లారుతుందా? (చల్లారదు).

(సజ్జనులపట్ల చేసిన దోషం ఊరకే చల్లారదు. ఆ దోషం పోగొట్టగల సాధనం పవిత్రమైన గంగాజలమే.)

వంశానికి కలిగిన జటిలమైన దుఃఖాన్ని నివారించినవాడు, శాశ్వత శుభకరుడు అయిన ఆ భగీరథుడు పరమేశ్వరుణ్ణి గొప్ప తపోనిష్టతో మెప్పించి, ఆకాశమందలి దేవగంగానదిని భూమిమీదకు తెచ్చి, తనకీర్తి అనే తీగకు శాశ్వతమైన స్తంభంగా చేసుకొని పితృకార్యాన్ని పూర్తిచేశాడు. అతడు సామాన్యుడు కాడు.

('మందాకినీ వియద్గంగా స్వర్ణదీ సురదీర్ఘికా' అని గంగానదికి పేర్లు. ఆకాశమందలి నదిని భూమికి తేవడం అసాధారణం. దాన్ని సాధించటం చేతనే అతడు కీర్తిపొందాడు. 'భగీరథ ప్రయత్నం' గా శాశ్వతత్వాన్ని పొందాడు.

అప్పుడు కొందరు మహర్షులు శ్రీహరిని తమ మనస్సులలో తీవ్రంగా ధ్యానిస్తూ విష్ణుపాదోద్భవమైన గంగానదిలో క్రుంకులిడి త్రిగుణాతీతులై విష్ణువులో ఐక్యమయ్యారు.

తరువాత వరుసగా ఆ భగీరథునికి శ్రుతుడు, శ్రుతునికి నాభావరుడు నాభావరునికి సింధుద్వీపుడు, సింధుద్వీపునికి అయుతాయువు, అయుతాయువునకు ఋతుపర్ణుడు జన్మించారు. అతడు

ఆ ఋతుపర్ణుడు గొప్ప బుద్ధిమంతుడైన నలమహారాజుతో స్నేహం చేశాడు. అతనికి తనకు తెలిసిన అక్షహృదయాన్ని (పాచికల ఆటకు సంబంధించిన శాస్త్రాన్ని) ఇచ్చి, అతనినుండి గుర్రాలకు చెందిన శాస్త్రాన్ని తెలుసుకున్నాడు.

ఆ ఋతుపర్ణునికి సర్వకాముడు, సర్వకామునికి సుదాసుడు పుట్టారు. ఆ సుదాసుని భార్యపేరు మదయంతి. ఆ రాజశ్రేష్ఠుని మిత్రసహుడు, కల్మాషపాదుడు అని కూడా అంటారు. ఆ రాజు వసిష్ఠుని శాపంవల్ల రాక్షసుడై తన కర్మానుసారంగా బిడ్డలు లేనివాడయ్యాడు అని చెప్పగా పరీక్షిన్మహారాజు, ఏ కారణంచేత సుదాసునికి గురుశాపం కలిగింది అని ప్రశ్నించాడు.

అపుడు శుకయోగీంద్రు డిట్లన్నాడు.

ఆ సుదాసుడు వేటకోసం అడవికి వెళ్ళి బలగర్వంతో ఒక రాక్షసుణ్ణి చంపాడు. కాని వాని సోదరుణ్ణి మాత్రం వదలి వేశాడు. వాడు తన తోబుట్టువు చావు సహించలేక ప్రతీకారంతో మోసపూరితంగా రాజుగారి భవనంలో వంటలవాడుగా చేరాడు. ఒకరోజు వసిష్ఠుడు అతిథిగా రాగా రాజు ఆయనకోసం వంటచేయమని వానికి చెప్పాడు. వాడు నరమాంసాన్ని వండి మునికి వడ్డించాడు. అపుడు వసిష్ఠుడు రాజును పిలిచి కోపంతో నరమాంసాన్ని వండించి పెట్టావు అంటూ రాక్షసుడవు కమ్మని శపించాడు.

ఆ విధంగా శపించిన తర్వాత రాక్షసుడు వండితేవడం, సుదాసునికి తెలియదనే విషయం మనోదృష్టితో తెలుసుకొన్న వసిష్ఠుడు పండ్రెండేండ్లు మాత్రం రాక్షసుడవై ఉండమని శాపాన్ని సవరించాడు.

అపుడు రాజు గురువును మారు శపిస్తానని దోసిటితో నీటిని తీసుకున్నాడు. వద్దని భార్య వారించింది. భూమ్యాకాశాలు, దిక్కులు సర్వం ప్రాణిమయంగా గ్రహించిన రాజు చేసేదేమీ లేక దుఃఖంతో చేతిలోని నీటిని తనపాదాలమీద చల్లుకున్నాడు.

(గురువును మారుశపిస్తానని దోసిటిలో నీళ్లు తీసుకున్నాడు సుదాసుడు. అంటే శాపసామర్థ్యం ఉందనుకోవాలి. సర్వం ప్రాణిమయం కాబట్టి కాళ్లమీదనే చల్లుకున్నాడు. అందుకే కల్మాషపాదుడనబడ్డాడు. తన దోషాన్ని తెలుసుకున్న ముని శాపాన్ని సవరించాడు. అది తెలియని రాజు ప్రతిశాపమిచ్చేందుకు సిద్ధపడ్డాడు. కాబట్టే అతని వృత్తాంతం సుఖాంతం కాలేదు.)

ఇట్లా మిత్రసహుడైన అతడు భార్యమాటకు అనుకూలుడై శపించడానికి ఇష్టపడక రాక్షసత్వం పొంది నల్లని రంగు కలిగిన పాదాలతో కల్మాషపాదుడై అడవుల్లో తిరుగుతూ

(సుదాసునికి మిత్రసహుడు, కల్మాషపాదుడనే పేర్లు ఉన్నట్లు కథాప్రారంభంలో చెప్పబడింది. వాటి సార్ధకత ఇక్కడ చెప్పబడింది.)

ఆకలితో మలమల మాడుతున్న సుదాసుడు అడవిలో ఒక బ్రాహ్మణదంపతుల జంటను చూశాడు. వెంటనే వారిని ఎదుర్కొని తటాలున బ్రాహ్మణుణ్ణి జుట్టుపట్టుకొని మింగడానికి తీసుకొనిపోతుండగా

అప్పుడు ఆ బ్రాహ్మణునిభార్య గుండెలు బాదుకొంటూ గొంతు పెగలక భర్తకు అడ్డం వచ్చి ఏడుస్తూ, ఆ రాక్షస రాజుతో ఇట్లా అంది.

ఓ రాజా! మానవదేహం కలగడం బహుకష్టం. అటువంటిది కలిగాక మానవునికి దానం, పరోపకారం, పొగడ తగిన కీర్తి ఉండాలికదా!

సూర్యవంశంలో ప్రముఖుడివై, భూమండలాన్ని పరిపాలించే వాడివై, మంచి పొగడిక కలవాడివై ఇతరుల మేలుకోరేవాడివై, పుణ్యాత్ముడివై ఉండి దోషరహితుడైన బ్రాహ్మణుణ్ణి, తపశీలుణ్ణి, సజ్జనుణ్ణి, బ్రహ్మవేత్తను, గుణవంతుడు అయిన నా భర్తను భక్షించడం ధర్మమేనా? (ధర్మంకాదు).

అయ్యా! సూర్యవంశీయులైన మీకు బ్రాహ్మణుడు దైవసమానుడవుతాడని అంటారు. ఆ పలుకులు ఏమైనాయి? మీ బోటి సాధువులు బ్రాహ్మణ గోహత్యలకు ఇష్టపడతారా? ఇంత రాక్షసత్వం ఎందుకు? ఒకసారి మీ తండ్రులను తాతలను, పూర్వికులను గుర్తుకు తెచ్చుకో. ధర్మంగా ప్రవర్తించు.

(ప్రసిద్ధమైన వంశం పేరు చెపితే ఈ క్రూరకార్యం మానతాడని ఆమె ఆశ. వాళ్ల పూర్వికులను గుర్తుకు తెచ్చుకోమంది. సూర్యవంశంలో మహానుభావులు జన్మించారు. ఒక్కొక్కరు ఒక్కో విషయంలో కీర్తి గడించారు కదా!)

అన్నా! నీకు చెల్లెలి నవుతాను. నా భర్తను వదులు. నీకు ఆహారాన్ని సమకూరుస్తాను. నా భర్త గంగిగోవు దూడలాంటివాడు. బ్రాహ్మణుడు. అతన్నెందుకు హింసిస్తావు? నీకు తోబుట్టువులు లేరా? నీవు చంపాలనే అనుకుంటే ముందు నా తలను ఖండించి తరువాత నా భర్తను భుజించు.

అని ఆమె జాలి కలిగేటట్లు బతిమలాడుతుండగా అతడు శాపవశాత్తు అవివేకుడై పులి జంతువును తినే పద్ధతిలో భక్షించాడు.

(ఆమె అన్ని మాటలు చెప్పి బతిమలాడినా అవన్నీ వ్యర్థమయ్యాయి. అతడు అవివేకు డయ్యాడు. కారణం గురుశాపమే. పైగా గురువుకే ప్రతిశాప మిచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఆ దోషంకూడ అనుభవించవలసి ఉంది గదా!)

అపుడా బ్రాహ్మణుని భార్య కోపించి కామార్త నైన నా భర్తను భక్షించావు కాబట్టి నీవు స్త్రీసాంగత్యానికి సిద్ధపడ్డప్పుడు మరణిస్తావు అని కల్మాషపాదుని శపించి తన భర్త ఎముకలతో అగ్ని ప్రవేశం చేసి ఉత్తమగతిని పొందింది. పిమ్మట పండ్రెండేండ్లు గడిచాయి. ఆ రాజు శాపం తీరిపోయింది.

తరువాత అతడు పొందుకోరి భార్యను పిలువనంపగా, బ్రాహ్మణ స్త్రీశాపం తెలిసిన ఆమె భయపడి భర్తను వారించి మైథునకృత్యాన్ని మాన్పించింది. అప్పటినుండి అతడు స్త్రీసాంగత్యాన్ని మానుకున్నాడు.

ఆ కారణంచేత ఆ సుదాసునికి సంతానం లేకపోయింది. అతని కోరిక ప్రకారం వసిష్ఠుడు మదయంతికి గర్భం ప్రసాదించాడు.

ఇలా సుదాసుని భార్య మదయంతి వసిష్ఠుని వల్ల గర్భవతియై ఏడేండ్లు గర్భాన్ని ధరించి ప్రసవించడానికి కష్టపడుతుంటే వసిష్ఠుడు పదునైన రాతితో అమె గర్భాన్ని చీల్చగా అశ్మకుడనే కొడుకు పుట్టాడు. అతనికి మూలకుడు జన్మించాడు.

అతడు వీరుడైన పరశురాముడు భయంకరమైన గండ్ర గొడ్డలితో రాజులను వధించే సమయంలో స్త్రీలు మూలకుని చుట్టూ ఉండి కాపాడడంవల్ల అతనికి నారీకవచుడని ప్రసిద్ధి కలిగింది.

(నారీకవచుడంటే నారీజనం కవచంలా ఉండినవాడని భావం. స్త్రీలు కవచంగా ఉన్నందున వారి మధ్య ఉన్న రాజును గుర్తించలేక స్త్రీగా భావించాడు పరశురాముడు. అందువల్లే మూలకుడు రక్షింపబడ్డాడు.

ఆ నారీకవచుడు పరశురామునిచే నిర్మూలింపబడ్డ సూర్యవంశానికి మూలమైనందువల్ల మూలకుడని పేరు పొందాడు. ఆ మూలకునికి విశ్వసహుడు పుట్టాడు. విశ్వసహునికి ఖట్వాంగుడు జన్మించి చక్రవర్తి అయ్యాడు.

అతడు దేవతల ప్రార్ధన మేరకు రాక్షసరాజులను చంపి, దేవతలతో తన ఆయుర్దాయమెంత? అని అడిగాడు. వారు 'ఇదిగో పూర్తవబోతుంది. ఎక్కువ సమయం కూడలేదు. ఏదైనా వరాన్ని కోరుకో' అన్నారు. అతడు వరాలు కోరుకోకుండా విమానమెక్కి తన నగరానికి వచ్చి అధ్యాత్మజ్ఞానంతో భగవంతునిపై మనసు లగ్నంచేసి, కులదైవం, బ్రాహ్మణులకంటె ఆలుబిడ్డలు, రాజ్యం నాకు ఇష్టమైనవి కావు. నా మనసు అధర్మంగా ప్రవర్తించదు. ఆ ఈశ్వరుని తప్ప మరొకటి తెలియదు అంటూ ఇంకా

(ఖట్వాంగుని ప్రస్తావన ప్రథమస్కంధంలో కూడా ఉంది. గోవిందనామ స్మరణచే ఆతడు రెండు ఘడియల్లో కైవల్వం పొందాడని చెప్పబడింది. పరమేశ్వరుడు తప్ప మరొకటి ఇష్టం కాదనడానికి ఆతని తత్త్వబుద్ది కారణం. ఆ స్పృహచేతనే అశాశ్వతమైన వస్తువులజోలికి పోక, దేవతలను వరమడగకుండా వచ్చాడు. అతడు నిజమైన బ్రహ్మవేత్త.)

భూమిపై ఈ బ్రతుకెందుకు? దేవతల వరాలెందుకు? ధనమెందుకు? అస్థిరమైన గంధర్వనగరాన్ని పోలిన సంపదలెందుకు? లోకాలను సృష్టించడంకోసం ప్రకృతితో పొత్తుపెట్టుకొని, చివరకు దాన్ని కూడా వదలి పరిశుద్ధమై, వాక్కుకు, మనసుకు అందని ఆ భగవతత్త్వాన్ని నేను పొందుతాను.

అని నిర్ణయించుకొని ఖట్వాంగుడు బంధాలను తెంచుకొని దీక్షతో అశ్రాంతమై ఉండికూడ లేనిదనిపించేది, శుభకరమైనది, మాటలలో చెప్పడానికి వీలుకానిది, తత్వవేత్తలు వాసుదేవుడని మనసులో స్థాపించుకొనేది అయిన పరబ్రహ్మలో లీనమయ్యాడు.

అటువంటి ఖట్వాంగునికి దీర్ఘబూహుడు, దీర్ఘబాహునికి రఘువు, రఘువునకు పృథుశ్రవుడు, పృథుశ్రవునికి అజుడు, అజునికి దశరథుడు పుట్టారు. ఆ దశరథునికి దేవతల ప్రార్థనచే సాక్షాత్తు పరబ్రహ్మమైన శ్రీహరి తన అంశంతో నాలుగు విధాలుగా శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులనే పేర్లతో జన్మించాడు. ఆయన చరిత్రను వాల్మీకి మొదలైన ఋషులు వర్ణించారు. ఐనా చెపుతాను. శ్రద్ధగా విను.

శ్రీరామచరిత్ర

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...