Friday, March 20, 2026

The Story Of Matsya Avatar - మత్స్యావతార కథనం

మత్స్యావతార కథనం

నైమిశారణ్యంలో దీర్గసత్రయాగం చేస్తున్న శౌనకాదిమహామునులంతా సూతమహర్షి దగ్గరికి చేరి “మహాభాగా! తమరు ఇప్పటిదాకా ఎన్నోపురాణాలు వివరించి చెప్పారు. సంతోషం. అయితే మాకు ఇంకా వాటిని గురించి వినాలని కోరికగా వుంది. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారాన్ని ధరించి సృష్టిచేసాడు? పరమేశ్వరుడికి, భైరవుడు, మురారి, కపాలి అనేపేర్లు ఎందుకు వచ్చాయి? ఇలాంటి సందేహాలు మాకు ఎన్నోవున్నాయి. దయచేసి వాటిని తీర్చండి” అని ప్రార్థించారు.

మునుల ప్రార్థన విన్న సూతమహర్షి వారికి ఇలా చెప్పటం ప్రారంభించాడు. “మునులారా! పూర్వం సూర్యుడి కుమారుడైన వైవస్వతు మనువు అనే మహారాజుండేవాడు. మహా సంస్కారవంతుడు, క్షమాగుణం కలిగిన వాడు. ఒకనాడు ఆ మనువు తన రాజ్యాన్ని కుమారులకు అప్పగించి వైరాగ్య భావంతో మలయ పర్వతం మీదకు వెళ్ళీ దీర్ఘంగా తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా పది లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. అతడి తీవ్రమైన తపస్సుకు మెచ్చుకుని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమని అడిగాడు. మనువు ఆయనకు నమస్కరించి “స్వామీ! ప్రళయకాలంలో స్థిర, చర, ప్రాణులందరినీ రక్షించే శక్తిని నాకు ప్రసాదించు” అని కోరుకున్నాడు. ఆయన తథాస్తు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు.

అలా కొంతకాలం గడిచింది. ఒకనాడు మనువు పితృతర్పణం చేయటానికి ఒక నదికి వెళ్ళి దోసిలితో నీటిని తీసుకున్నాడు. ఆ దోసిలిలోకి ఒక చేప పిల్ల వచ్చింది. ఆయన దాన్ని రక్షించాలని అనుకుని తనకమండలంలో వేశాడు. తిరిగి మర్నాడు ఉదయమయ్యేసరికి ఆ మత్స్యం పెరిగిపోయి కమండలంనుంచి తలపైకెత్తి రాజా రక్షించు రక్షించు అని పలికింది. వెంటనే దాన్ని బైటికి తీసి పెద్ద పాత్రలో వేశాడు. తిరిగి ఆ చేప ఒక్క రోజులో ఆ పాత్రని మించి పెరిగిపోయింది. రాజా రక్షించు అని కేకలు వేసింది మనువు ఆశ్చర్యపోతూ దాన్ని బావిలో పడేశాడు. అక్కడ కూడా ఇంతే ఒక్కరోజులోనే బావి సరిపోనంతగా పెరిగింది. తిరిగి దాన్ని చెరువులో వేశాడు. అక్కడా అంతే. అక్కడ నుంచి నదిలో ఆ చేపని వదిలిపెట్టాడు. మర్నాటికల్లా యథావిథిగా నదిని మించిపోయింది ఆ చేప. ఈ తతంగం అంతా చూస్తున్న మనువుకు ఈ మాయ ఏమిటో అర్థం కాలేదు. చివరికి ఆ చేపను సముద్రంలో పడేశాడు. అది ఆ సముద్రమంతా వ్యాపించింది.

ఒక చిన్న పిల్లగా తన చేతిలోకి వచ్చిన ఆ చేప మహా మత్స్యంగా సముద్రాన్నంతా ఆక్రమించటం చూసి మనువుకు ఒక్కసారిగా భయం వేసింది. ఆ మహా మత్స్యంతో “ఎవరునీవు? రాక్షసుడివా? లేక భగవంతుడివా? అలాకాకపోతే ఇంత విశాలంగా ఎలా పెరగగలిగావు? బహుశానీవు 
శ్రీమన్నారాయణుడివే అయుంటావు. స్వామీ! నీ వీ మత్స్యరూపాన్ని ధరించి ఎందుకునన్ను పరీక్షిస్తున్నావు” అని ప్రశ్నించాడు.

ఆ మత్స్యం మనువుతో “రాజా! నీవు సత్యం గ్రహించావు. అతి తొందరలోనే మహాప్రళయం సంభవించబోతోంది. ఈ పర్వతాలు, భూమి, నగరాలు అన్ని నీటిలోమునిగిపోతాయి. అదిగో సముద్రంలోకనిపిస్తున్న ఆ మహానౌకను చూశావు కదా! అది జీవుల్ని రక్షించటానికి దేవతలు చేత నేనే నిర్మింపచేసాను. స్వేదజాలు(చెమటనుంచి పుట్టేవి) అండజాలు(గ్రుడ్ల నుంచి పుట్టే జీవులు) దోమలు, పక్షులు, ఉద్భిజాలు నేల నుంచి పుట్టేవి చెట్లు, మొక్కలు, అలాగే జరాయుజాలు ఇవన్నీ భీకరమైన గాలికి నశించిపోతాయి. కనుక నీవు వీటిని నౌకలో చేర్చి ఆ నౌకను నా కొమ్ముకు కట్టు. ప్రళయం ముగిసిన తరువాత తిరిగి ఆవిర్భవించే నూతన ప్రపంచానికి నీవు ప్రజాపతివై సకల
దేవతలచేతా పూజింపబడతావు” అని పలికాడు.

ప్రళయం
మత్స్యరూపంలోవున్న మహావిష్ణువు మాటలువిన్న మనువు ఆయనతో “ప్రభూ! శ్రీహరీ! ఎన్ని సంవత్సరాల తరువాత ప్రళయం వస్తుంది. నేను ప్రాణులందరినీ ఎలా రక్షించగలను? తిరిగి నిన్ను ఎలా చేరుకోగలను? అని ప్రశ్నించాడు. “మహారాజా! నేటినుంచి భూమండలంలో అనావృష్టి
ప్రారంభమవుతుంది. వందసంవత్సరాలవరకూ ఇది కొనసాగుతుంది. ఆ కరువుకు ఎందరో మరణిస్తారు. తరువాత సూర్యుడు నిప్పుకణికల్ని భూమి మీదకి వర్షిస్తాడు. ఆ వేడికి అల్పప్రాణులన్నీ నాశనమైపోతాయి. ప్రళయకాలంలో సముద్రం నించి బడబాగ్ని విజృంభిస్తుంది. పాతాళం నుంచి అగ్ని పైకి వెలువడుతుంది. అదే విధంగా శివుడి మూడోకంటి నుంచి భయంకరమైన జ్వాలలు ఎగసి అన్ని లోకాల్నీ భస్మంచేస్తాయి.

ఆ విధంగా భూమండలమంతా తగలబడి పోయి తాబేలు వీపులా మారిపోతుంది. ఆకాశమంతా సూర్యుడి వేడితో నిప్పుల కొలమిలా మారిపోతుంది. ఆ వేడికి పైనవున్న దేవతలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ నశిస్తాయి. 

1. సంవర్తం, 
2, భీమనాదం, 
3. ద్రోణం, 
4.ఇంద్రం, 
5.పలాహకం, 
6. విద్యుత్సాతకం,
7.శోణం 
అనే మహాప్రళయకాల మేఘాలు జన్మించి భూమండలాన్నంతా తమ వర్ష ధారలతో ముంచెత్తుతాయి. సప్తసముద్రాలు ఒక్కటై పోతాయి.

అలాంటి భయంకరమైన పరిస్థితిలో అపార జలరాశిలో స్థిరంగా ఈ మహానౌక నిలిచివుంటుంది. అనేక లోకబీజాల్ని తీసుకువచ్చి నేను చెప్పిన విధంగా వాటిని సంరక్షించు. అలాగే నేను చెప్పిన జీవుల్ని కూడా నౌకలోకి ఎక్కించి ఆ నౌకని నా కొమ్ముకు తగిలించు నేను నౌకను నిన్ను రక్షిస్తాను.

మహారాజా! ఆవాంతర ప్రళయంలోఅన్ని జీవరాసులు, దేవతలు నశించినప్పటికీ నీవు ఒక్కడివే జీవించివుంటావు. నీతోపాటు, సూర్య చంద్రులు, స్వర్గ, మర్త్య పాతాళ బ్రహ్మలోకాలు బ్రహ్మదేవుడు, నేను, నర్మదానది, మార్మండేయ మహర్షి పరమేశ్వరుడు, వేదాలు, పురాణాలు, ఇతర మహావిద్యలు నిలిచి వుంటాయి”. ఈ విధంగా మత్స్యావతారుడు మనువుకు బోధించి అదృశ్యమయ్యాడు.

మనువు తిరిగి నగరానికి వచ్చి రాబోయే ప్రళయకాలాన్ని తలుచుకుంటూ, అన్నిటినీ వదిలేసి ఏకాగ్రంగా ధ్యానయోగాన్ని అవలంబించాడు.

మహావిష్ణువు చెప్పినట్టే ప్రళయకాలం ప్రారంభమైంది. స్వామి చెప్పిన ప్రకారం ఆ మహాజలధిలో పెద్ద కొమ్ముతో వున్న మహామత్స్యం ఆవిర్భవించింది. అలాగే మహానౌకకూడా కనిపించింది. ఆదిశేషుడు(సర్పం)ఒక తాడులా మారి మనువు దగ్గరకు వచ్చాడు. మనువు ఆ తాడుతో నావను మహామత్స్యం కొమ్ముకు తగిలించాడు. నారాయణుడికి నమస్మరించి ఆ మత్స్యం కొమ్ము మీద నిలిచాడు. క్రమంగా ప్రళయం ముగిసి పోయింది. కొత్తయుగం ఏర్పడింది. ఆ సమయంలో 
మనువు కోరగా నారాయణుడు మత్స్యపురాణాన్ని అతడికి బోధించాడు.

దేవీ అష్టోత్తరశత (108) స్థానాలు
పూర్వం దక్షప్రజాపతి మహాయాగాన్ని చేయటం ప్రారంభించాడు. ఆ యాగానికి సకల దేవతల్ని ఆహ్వానించాడు గానీ తన అల్లుడు, కూతురైన సతీ-శంకరుల్ని ఆహ్వానించలేదు. అయితే తండ్రిచేసే యాగాన్ని చూడాలని కోరుకున్న సతీదేవి శివుడు వారిస్తున్నా వినకుండా యాగశాల దగ్గరకు వచ్చింది. దక్షుడు ఆమెను పట్టించుకోకుండా అల్లుడైన శివుణ్ణి దూషించాడు. ఆ అవమానభారం సహించలేని సతీదేవి యోగాగ్నిని సృష్టించుకుని తన శరీరాన్ని తానే దగ్గంచేసుకోవటం ప్రారంభించింది. అదిచూసి అక్కడున్న దేవతలంతా దక్షుడు చేసిన పనికి అతన్ని నిందించారు. తప్పుతెలుసుకున్న దక్షుడు దగ్గమౌతున్న కుమార్తె దగ్గరకి వెళ్ళి ఎంతో దుఃఖిస్తూ తన అపరాధాన్ని మన్నించమని ప్రార్థించాడు. తనను విడిచి శరీరత్యాగం చేయవద్దని
వేడుకున్నాడు. అయితే సతీదేవి దక్షుడి మాటని మన్నించలేదు. ఆయనతో “తండ్రీ! నేను అనుకున్నదే చేస్తాను. నీవు నన్ను భక్తితో ప్రార్ధిస్తున్నావు. అయినాసరే నా భర్త శివుడి చేతిలో నీ యజ్ఞం ధ్వసంకాక తప్పదు. రాబోయేకాలంలో నా అనుగ్రహాన్ని పొంది, సృష్టిని కొనసాగించటానికి నా సన్నిధిలో వుండి సాధన చేయి అప్పుడే నీవు తిరిగి ప్రజాపతులందరిలోకీ గొప్పవాడివవుతావు.
నా అంశతో నీకు అరవైమంది కుమార్తెలు జన్మిస్తారు” అని చెప్పింది.

సతీదేవి మాటల్నివిన్న దక్షుడు “అమ్మా! సతీ! నీవు ఏ ఏ తీర్థాలలో వుంటావు? నిన్ను ఏ ఏ పేర్లతో సంబోధించాలి? స్తుతించాలి? అని ప్రశ్నించాడు.

తండ్రీ! నన్ను సర్వకాలాలలో ఈ భూమ్మీద వుండే అన్ని ప్రాణుల్లో దర్శించగలగాలి. ఈ సకలలో కాలంలో నేను కానిది ఏదీ లేదు. అయితే అన్నిట్లో నన్ను చూడటం అందరికీ సాధ్యంకాదు. కనుక తమ తమ కోరికల్ని తీర్చుకోవాలనుకునేవారు, ఇహపర సుఖాలు రెండిటినీ వాంఛించేవారు. ఈ భూమండలంలో ఇతర లోకాలలో ఏఏ స్థానాలలో, ఏఏ రూపాలతో నన్ను స్మరించాలో పూజించాలో చెబుతున్నా విను.

అష్టోతరశత (108) శక్తిపీఠ స్తోత్రం

మత్స్య పురాణము

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...