వైవస్వత మన్వంతర వివరణ
ఓ రాజా! ప్రస్తుత మన్వంతరాన్ని ఏడవమనువైన వైవస్వతుడు నిర్వహిస్తున్నాడు. ఆయనను శ్రాద్ధదేవుడని అంటారు. ఆయనకు ప్రసిద్ధులైన, మహాబలవంతులయిన పదిమంది కుమారులున్నారు.వారు ఇక్ష్వాకుడు, నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశకుడు, పృషద్ధ్రుడు, వసుమంతుడు, అనేవారు. ఈ పదిమందీ రాజులైనారు. పురందరుడనేవాడు ఇంద్రుడైనాడు. ఆదిత్యులూ, మరుత్తులూ, అశ్వినులూ, రుద్రులూ, వసువులూ అనేవారు దేవతలైనారు. గౌతముడూ, కశ్యపుడూ, అత్రీ, విశ్వామిత్రుడూ, జమదగ్నీ, భరద్వాజుడూ, వసిష్ఠుడూ అనేవారు సప్తర్షులైనారు. వారిలో కశ్యపునికి అదితి అనే భార్యయందు విష్ణుమూర్తి వామనమూర్తియై జన్మించి ఉపేంద్రుడు(ఇంద్రుని తమ్ముడు) అయినాడు. ఇంతవరకు ఏడు మన్వంతరాలను గురించి చెప్పినాను. ఇక రాబోవు మన్వంతరాలను గురించి విష్ణువు పరాక్రమాన్ని గురించి వివరిస్తాను. శ్రద్ధగా విను అని శుకుడు ఇలా అన్నాడు.
(చాలామంది వ్యక్తులపేర్లు చకచకా చెప్పాలి. కనుక పద్యంలో కన్న వచనంలో చెప్పటమే సుగమంగా ఉంటుందని ఈ వచనం సువ్యక్తం చేస్తుంది.)
ఓ రాజా! సూర్యునికి సంజ్ఞాదేవి, ఛాయాదేవి అనే భార్యలున్నారు. వారు విశ్వకర్మ కుమార్తెలు. ఇంతకు ముందే ఈ విషయం చెప్పినాను. వారిద్దరేకాక 'బడబ' అనే భార్యకూడా ఉంది. సంజ్ఞాదేవికి యముడు, శ్రాద్ధదేవుడు, యమునాదేవి పుట్టినారు. ఛాయకు సావర్ణి, శనైశ్చరుడు, తపతీదేవి పుట్టినారు. తపతీ దేవిని సంవరణుడు పెళ్ళాడినాడు. బడబకు అశ్వినీ దేవత లిద్దరు పుట్టినారు. రాబోయే కాలంలో సావర్ణి ఎనిమిదవమనువు అవుతాడు. అతడు ప్రస్తుతం తపస్సు చేస్తున్నాడు.
ఓ రాజా! ఒక పర్యాయం కనిపించి మరొక పర్యాయం కనిపించక మాయమయ్యే సిరులకోసం ఒక్కొక్క మనువు దిగిపోయే సమయానికి ఒక్కొక్కమనువు కాచుకొని ఉంటాడు.
(భౌతికమైన సిరిసంపదలు ఎంత చంచలమూ, అశాశ్వతమైనవో! భౌతికమైన ఉన్నత పదవులు కూడ చంచలమూ, అశాశ్వతమైనవని అంతరార్థం! ఈ చిన్ని కందపద్యం లోకనీతిని, రీతిని అద్దం పడుతున్నది. 'చేటువేళ' అనే పదబంధం అత్యంత సాభిప్రాయం. జీవితము ఒక కాలపరిమితికి ఎలా లోబడినదో, ఉన్నత పదవులు కూడ ఒక కాలపరిమితికి లోబడినవేనన్న పరమార్ధమిందులో దాగి ఉన్నది. ఈ లోకంలో ఏదీ శాశ్వతంకాదు. ఆఖరికి బ్రహ్మపదవికూడ శాశ్వతంకాదు. ఇది తెలిసి ప్రవర్తించేవాడే నిజమైన బుద్ధిమంతుడు.)
సూర్య సావర్ణి పరిపాలించే ఎనిమిదవ మన్వంతరంలో ఆయన కుమారులైన నిర్మోహుడు, విరజస్కుడు మొదలయినవారు రాజులవుతారు. సుతపులు, విరజులు, అమృతప్రభులు దేవతలవుతారు. గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, ద్రోణుని కొడుకైన అశ్వత్థామ, కృపుడు, వ్యాసుడు, ఋష్యశృంగుడు సప్తర్షులవుతారు. ఇప్పుడు వారు తమ తమ యోగబలాలతో తమ ఆశ్రమాలలో ఉన్నారు. విరోచనుని కొడుకైన బలిచక్రవర్తి ఇంద్రుడవుతాడు.
ఓ రాజా! పూర్వం బలిచక్రవర్తి బలవంతుడై స్వర్గలోకాన్ని వశం చేసుకోగా శ్రీహరి వామనుడుగా వెళ్ళి ఆయనను మూడడుగులనేలను దానమడిగినాడు. దానమిచ్చిన బలిచక్రవర్తిని త్రివిక్రముడు బద్దుని చేసినాడు. తరువాత బలికి అమరావతికంటె అందమైన పాతాళలోకాన్ని ఇచ్చినాడు. దానిలో బలి సుఖంగా ఉన్నాడు. ఆ తర్వాత విష్ణువు వేదగుహికీ సరస్వతికీ "సార్వభౌముడు" అనే పేరుతో జన్మిస్తాడు, ఇంద్రుని పదవినుండి తొలగిస్తాడు. ఆ పదవిలో బలిచక్రవర్తిని నెలకొలుపుతాడు. విష్ణువు నుండి బలి ఇంద్రపదవిని పొందినప్పటికి అతడు మొదట విష్ణువునకు దానం చేసిన పుణ్యం చెడదు.
ఆ తర్వాతి కాలంలో వరుణుని కొడుకైన దక్షసావర్ణి తొమ్మిదవ మనువు అవుతాడు. అతని కొడుకులయిన ధృతకేతువు, దీప్తకేతువు మొదలయినవారు రాజులవుతారు. పరుడూ, మరీచులూ, గర్గుడూ మొదలయినవారు దేవత లవుతారు. అద్భుతుడు అనేవాడు ఇంద్రు డవుతాడు. ద్యుతిమంతుడు మొదలయినవారు సప్తఋషులు అవుతారు.
విష్ణువు ఆయుష్మంతునికీ అంబుధారకు జన్మిస్తాడు. అతని రక్షణలో దేవేంద్రుడైన అద్భుతుడు మూడు లోకాలను సంతోషంగా పరిపాలిస్తాడు.
ఓ రాజా! ఆ పిమ్మట ఉపశ్లోకుని కుమారుడైన బ్రహ్మసావర్ణి పదవ మనువు అవుతాడు. ఆయన కొడుకులైన భూరిషేణుడు మొదలయినవారు రాజులవుతారు. హవిష్మంతుడు మొదలయినవారు సప్తర్షులవుతారు. శంభుడనేవాడు ఇంద్రుడవుతాడు. విబుద్ధి మొదలయినవారు దేవతలవుతారు.
విష్ణువు విశ్వసృజునికీ విషూచికీ 'విష్వక్సేనుడు' అనే పేరుతో జన్మించి శంభునికి స్నేహితుడై లోకాన్ని కాపాడుతాడు.
ఆ పిమ్మట వచ్చే కాలంలో ధర్మసావర్ణి పదకొండవమనువు అవుతాడు. ఆయన కుమారులయిన సత్యధర్ముడు మొదలయినవారు పదిమందీ రాజులవుతారు. విహంగములు, కామగమనులు, నిర్వాణరుచులు దేవతలవుతారు. వైధృతుడనేవాడు ఇంద్రుడవుతాడు. అరుణుడు మొదలయినవారు సప్తర్షులవుతారు.
విష్ణువు 'ధర్మసేతువు' అనే పేరుతో సూర్యుని కుమారునిగా జన్మిస్తాడు. ఆయన మహిమలతో సంపన్నుడై వైధృతుడు సంతోషించేటట్లు మూడు లోకాలను కరుణతో కాపాడుతాడు.
ఓ రాజా! ఆ పిమ్మట రాబోయేకాలంలో భద్రసావర్ణి పన్నెండవ మనువు అవుతాడు. అతని కొడుకులయిన దేవవంతుడు, ఉపదేవుడు, దేవజ్యేష్ఠుడు మొదలయినవారు రాజులవుతారు. ఋతధాముడనేవాడు ఇంద్రుడవుతాడు. హరితులు మొదలయినవారు దేవతలవుతారు. తపోమూర్తి, తపస్వి, అగ్నీధ్రకుడు మొదలయినవారు సప్తర్షులవుతారు.
(తప ఆగ్నీద్ర అనే పాఠం వ్యాకరణరీత్యా సరిపోతుంది. (తవ అగ్నీధ్ర పాఠం సరికాదు) పోతన భాగవతముద్రిత ప్రతులన్నింటిలో ఋతుధాముడనే ఉన్నది. ఈ పాఠం సరికాదు. సంస్కృతమూలంలో ఋతధాముడని ఉన్నది. దీనికి ప్రమాణం వాల్మీకిరామాయణం.)
ఆ కాలాన విష్ణువు సత్యతపునికి సూనృతకు 'స్వధాముడు' అనే పేరుతో జన్మిస్తాడు. మనువు సంతోషించేటట్లు లోకాన్ని రక్షిస్తాడు.
ఓ రాజా! ఆ తరువాతి కాలంలో దేవసావర్ణి పదమూడవ మనువు అవుతాడు. అతని కొడుకులయిన చిత్రసేనుడూ విచిత్రుడూ మొదలయినవారు రాజులవుతారు. సుకర్ములూ సుత్రాములూ దేవతలవుతారు. దివస్పతి అనేవాడు ఇంద్రుడవుతాడు. నిర్మోహుడూ తత్త్వదర్శుడూ మొదలయినవారు సప్తర్షులవుతారు.
ఓ రాజా! విష్ణువు దేవహోతకూ బృహతికీ 'యోగవిభుడు' అనే పేరుతో జన్మిస్తాడు. ఇంద్రునికి చాలా సాయం చేస్తాడు.
ఆ పిమ్మట వచ్చేకాలంలో ఇంద్రసావర్ణి పదునాలుగవ మనువు అవుతాడు. అతని కుమారులు ఉరుగంభీరుడు, వసువు మొదలయినవారు రాజులవుతారు. పవిత్రులు, చాక్షుషులు దేవతలవుతారు. శుచి అనేవాడు ఇంద్రుడవుతాడు. అగ్ని, బాహువు, శుచి, శుక్రుడు, మాగధుడు మొదలయినవారు సప్తర్షులవుతారు. ఇంకా
ఆ కాలాన విష్ణువు సత్రాయణునకు వితానకు 'బృహద్భానుడు' అనే పేరుతో జన్మిస్తాడు. దేవతలు సంతోషించేటట్లు క్రియాకలాపాలను విస్తరిస్తాడు.
ఓ రాజా! మూడుకాలాల్లోనూ ప్రఖ్యాతి పొందే మనువుల విధానాన్ని చెప్పినాను. పదునాలుగుమంది మనువులు అంతరించి వెయ్యియుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక దినం అవుతుంది. అని శుకుడు చెప్పగా పరీక్షిన్నరేంద్రుడు ఇలా అన్నాడు.
ఓ శుభచరితా! ఈ పదవులలో మనువులను ఎవరు నియమిస్తారు? ఎందువల్ల వారు గొప్ప వైభవాన్ని పొందారు? ఆ మన్వంతరాలలో ఎందుకు విష్ణువు జన్మిస్తాడు? నాకు తెలిసేటట్లు చెప్పు. అని అడిగిన పరీక్షిత్తుతో శుకుడిలా అన్నాడు.
మనువులు, మునులు, మనువుల తనయులు, ఇంద్రుడు, దేవతలు విష్ణుమూర్తి ఆనతికి లోబడి ఉంటారు. యజ్ఞుడు మొదలయినవారు విష్ణుదేవుని అంశంతో రూపుదాలుస్తారు. అతని సహాయంవల్ల మనువులు లోకాన్ని పాలిస్తారు. క్రమంగా నాలుగుయుగాల చివర వేదాలను కాలం మింగి వేస్తుంది. పుణ్యాత్ములయిన మునులు తమ తపశ్శక్తివల్ల మళ్లీ వేదాలను దర్శిస్తారు. పూర్వం వలె ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. విష్ణువు ఆజ్ఞ చెల్లుబడి అవుతుంది. తమ తమ కాలాలలో రాజులు లోకాన్ని పంచుకొని పరిపాలిస్తారు.
విష్ణుమూర్తి ప్రాప్తమున్నవారిని ఇంద్రపదవులలోను, పెక్కు విధాలయిన దేవతల పదవులలోను నియమిస్తాడు. వారు తమకు నిర్ణయించబడిన నియమాలతో ముల్లోకాలను పాలిస్తారు. లోకాలు సుభిక్షంగా ఉంటాయి.
ఓ నిర్మల చరితుడా! శాశ్వతుడైన విష్ణువు యోగీంద్రుని రూపంతో యోగం బోధిస్తాడు. మౌనిరూపంతో కర్మానుష్ఠానాన్ని బోధిస్తాడు. ప్రజాపతి రూపంతో సృష్టిచేస్తాడు. ఇంద్రుడై రాక్షసుల పొగరును అణచివేస్తాడు. సిద్ధరూపంతో జ్ఞానోపదేశం చేస్తాడు. కాలస్వరూపంతో కడతేరుస్తాడు. అవ్యయుడైన ఆ శ్రీపతి పెక్కుపేర్లతో అనేక రూపాలతో ఉంటాడు. అతడు విషయాసక్తుల కంటికి కనిపించడు. అతడు జరిగిన, జరుగుతున్న, జరుగబోయే కాలాలలో అనేక విధాలుగా వేరువేరు రూపాలతో వెలుగొందుతాడు.
No comments:
Post a Comment