Friday, March 20, 2026

Shraddha Kala Nirnayam - శ్రాద్ధకాల నిర్ణయం

శ్రాద్ధకాల నిర్ణయం

పగలు మొత్తం పదిహేనుముహూర్తాలు వుంటుంది. ఈ పగటికాలంలో ప్రాతఃకాలం, పూర్వాహ్నం, మధ్యాహ్నం, అపరాహ్నం, సాయంత్రం అని అయిదు విభాగాలతో వుంటుంది. వీటిలో ఒక్కో విభాగానికీ మూడుముహూర్తాలకాలం. సాయంకాలాన్ని రాక్షసీ హోరా అంటారు. కనుక సాయంకాలం శ్రాద్ధం పెట్టరాదు. ఈ రాక్షసీ హోర అనేది ఏపనులకీ మంచిది కాదు. ఈ మొత్తం
పదిహేను ముహూర్తాలలో ఎనిమిదోముహూర్తకాలానికి 'కుతుప' కాలం అంటారు. మధ్యాహ్నం సమయం తరువాత ఏ సమయంలో సూర్యుడు చల్లబడతాడో అప్పటినుంచి సాయంకాలం ప్రారంభమవుతుంది. ఈ సాయంకాలం ప్రారంభమయ్యేలోపే శ్రాద్దాన్ని జరపాలి. అలాచేస్తే సూర్యభగవానుడు అనుగ్రహిస్తాడు.

1.మధ్యాహ్నకాలం,
2. కత్తిఉంచేపాత్ర,
3. నేపాళదేశంలో నేసిన కంబళి,
4.దీపం 
5. దర్భలు 
6.పువ్వులు,
7. ఆవులు 
8.దౌహిత్రుడు (కూతురుకొడుకు)
ఈ ఎనిమిదింటినీ కుతపం అంటారు. కుతపం అంటే 'కు' అనగా పాపాన్ని 'తపం' అనగా తపింపచేసేది అని. ఇవిగాక పగటి ముహూర్తకాలాలలో ఎనిమిదోదైన 'కుతుప' ముహూర్తకాలం తరువాత వచ్చే నాలుగు ముహూర్తాలు. మొత్తం ఈ అయిదు ముహూర్తాలనూ 'స్వథాభవనం' అని వ్యవహరిస్తారు.

దర్భలు, నల్లనువ్వులు మహావిష్ణువు శరీరంనుంచి ఆవిర్భవించాయి. శ్రాద్ధం మంచి ఫలితాన్ని ఇవ్వాలంటే శ్రాద్ధంలో వీటిని ఉపయోగించాలి. ఈ విషయాన్ని ద్యులోకంలో నివసించే పితృదేవతలు స్వయంగా చెప్పారు. కనుక శ్రాద్దంపెట్టెవాడు ఒక చేతలో దర్భలు పట్టుకొని నువ్వులతో తిలోదకాలు పితృదేవతలకు సమర్పించాలి.

ఈ శ్రాద్ధ విధిని మత్స్యరూపాన్ని ధరించిన శ్రీమన్నారాయణుడు మనువుకు చెప్పాడు. ఇది పుణ్యకరమైనది, పవిత్రమైనది. దీన్ని చదివినా, విన్నా ఆ మానవుడు పుణ్యఫలాలు పొందుతాడు. అతడికి ఐశ్వర్యం లభిస్తుంది.

శ్రాద్ధం జరిపితే పుణ్యం వచ్చే తీర్థక్షేత్రాలు
సూతమహర్షి శౌనకాది మునులకు, ఏఏ తీరాలలో, క్షేత్రాలలో శ్రాద్ధవిధిని జరిపిస్తే అఖండమైన పుణ్యఫలాలు లభిస్తాయో ఇలా చెబుతున్నాడు.

అభిజిత్‌ ముహూర్తం, రేణముహూర్తం ఉండే అపరాహ్న కాలంలో పెడితే అది అనంతమైన ఫలాన్నిస్తుంది.

భూలోకంలో గయాతీర్థం శ్రాద్ధవిధిని ఆచరించటానికి ఎంతో ప్రశస్తమైనది. ఆ క్షేత్రంలో బ్రహ్మ దేవుడు స్వయంగా నివసిస్తుంటాడు. గయతరువాత వారణాసిక్షేత్రం శ్రాద్ధవిధికి మంచిది. ఆ దివ్య క్షేత్రాన్ని విశ్వనాథుడు, అన్నపూర్ణాదేవీ ఎప్పటికీ విడిచివుండరు. కాబట్టి అది అవిముక్త క్షేత్రంగా ప్రసిద్ధిచెందింది. అక్కడ శ్రాద్ధంపెట్టటం వల్ల భక్తిముక్తి రెండూ లభిస్తాయి. వీటితోపాటు విమలేశ్వరం, ప్రయాగ, కటీశ్వరం అనే క్షేత్రాలు కూడా పితృదేవతలకు ఇష్టమైనవి. పుణ్యప్రదమైనవి.

హరిద్వారం, నందాతీర్థం, మాయాపురం, గంగా గోమతీసంగమం, నైమిశక్షేత్రం పితృదేవతలకు ప్రీతికరమైన స్థానాలు. గంగా గోమతీ సంగమ స్థలంలో యజ్ఞవరాహమూర్తి అయిన శ్రీమహావిష్ణువు, త్రిశూలధారి అయిన పరమేశ్వరుడు సన్నిహితంగా వుంటారు. అక్కడ బంగారు ద్వారం వున్నది.
అక్కడ వుండే శివుడికి పద్దెనిమిది చేతులువుంటాయి.

శ్రీమహావిష్ణువు చక్ర నేవి (అంచు శీర్ణమైన (శిధిలమైన)) చోటే నైమిశక్షేత్రం.

ఈ క్షేత్రంలో కొలువున్న యజ్ఞవరాహమూర్తిని దర్శిస్తే విష్ణులోకాన్ని చేరుకుంటారు. కృతశేచం అనే గొప్ప అరణ్యం వుంది. అది అన్ని పాపాల్నీ పోగొట్టే దివ్య ప్రదేశం. నారాయణుడు ఆ వనంలో నరసింహుడి రూపంలో వుంటాడు. అలాగే ఇక్షుమతీ గంగాసంగమతీర్థం కూడా పవిత్రమైనదే.
ఈ చెప్పిన క్షేత్రాలు తీర్థాలన్నీ పితృదేవతలకు ప్రీతికరమైనవి. ఈ ప్రదేశాలలో శ్రాద్ధవిధిని ఆచరించాలి.

కురుక్షేత్రంలో అన్ని తీర్థాలూ చేరివుంటాయి. సరయూనదీ తీరం పవిత్రమైనది. ఐరావతీ, యమునా, దేవికా, కాళీ, చంద్రభాగా, దృషద్వతీ, వేణుమతీ, పారా, వేత్రవతీ అనే నదులు కూడా శుభప్రదమైనవి. పితృదేవతలకు ఇష్టమైన ఈ ప్రాంతాల్లో శ్రాద్ధం జరిపితే కోటిరెట్లు ఫలితం లభిస్తుంది. శిప్రానది (ఉజ్జయినీ దగ్గర) నర్మదాద్వారం (నర్మదాసాగర సంగమ (ప్రాంతం) ఇక్కడ పిండప్రదానం చేస్తే గయలో చేసిన ఫలితం లభిస్తుంది. 

తుంగభద్రానదీ, త్రిసంధ్యాతీర్ధం, భీమనది, భీమేశ్వర క్షేత్రం, కృష్ణవేణీ, కావేరీ, మంజులా, గోదావరీ త్య్రంబక తీర్ధం, ప్రశస్తమైనవి. వీటిలో 
త్య్రంబక తీర్ధంలో పరమేశ్వరుడు ఎప్పుడూ కొలువైవుంటాడు. ఇక్కడ పిండప్రదానంచేస్తే అక్షయఫలం లభిస్తుంది. గోదావరీనదీ పరీవాహక ప్రాంతంలో వున్న 
జమదగ్నితీర్థం శ్రాద్ధం చేయటానికి ఉత్తమమైనది. సహస్రలింగక్షేత్రం, రాఘవేశ్వర క్షేత్రం. ఇంద్రసేనానది పితృదేవతలకు పీతికర స్థానాలు.

పుష్కరతీర్థం, సాలగ్రామతీర్థం, శోణపాదతీర్థం, లోహదండతీర్థం, ఋణమోచనతీర్థం, గౌతమేశ్వరం, వశిష్ఠతీర్థం, శంఖధారం, ఘటేశ్వరతీర్థం, బదరీతీర్థం, కరవీరతీర్థం, వైకుంఠతీర్థం, గౌరీతీర్థం, రామతీర్థం, శ్రీపతితీర్ధం, రైవకతీర్ధం, శారదాతీర్థం ఇవన్నీ శ్రాద్ధకర్మల్ని ఆచరించటానికి ప్రశస్తమైనవి.

మహామునులారా! ఇప్పుడు నేను చెప్పిన ఈ దివ్య తీర్దాలేకాక ఇంకా ఎన్నో పుణ్యక్షేత్రాలు తీ
ర్దాలు పితృదేవతలకు ప్రీతినికలిగించేవి వున్నాయి. వాటన్నిటినీ వివరించిచెప్పటం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యంకాదు. మానవులకు సత్యం-దయ-ఇంద్రియ నిగ్రహం అనేవి అత్యుత్తమమైన తీర్థాలు. ఈ మూడు గుణాలతో వర్ణాశ్రమధర్మాల్ని అనుసరించి నడుచుకునే వారికి వారి ఇల్లే ఒక దివ్య తీర్థమౌతుంది. పితృదేవతలు వారి ఇంటికి వచ్చి స్వయంగా పిండప్రదానాన్ని స్వీకరిస్తారు.” ఈ విధంగా సూతమహర్షి పితృదేవతలకు ప్రీతికరమైన తీర్థాల గురించి, క్షేత్రాలగురించి అక్కడ శ్రాద్ధవిధిని ఆచరిస్తే లభించే ఫలితాల గురించి మునులందరికీ ప్రబోధించాడు. 


మత్స్య పురాణము

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...