చిత్రకేతూపాఖ్యానము
ఈ విధంగా పరీక్షిత్తు శుకయోగీంద్రుని అడిగాడు అని సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పి మరల ఇలా అన్నాడు. శౌనకాది మహర్షులారా! ఆ విధంగా హస్తినాపుర ప్రభువైన పరీక్షిత్తు ఆసక్తితో అడిగిన ప్రశ్నకు వ్యాసపుత్రుడైన శుకయోగీంద్రుడు శ్రద్ధతో హరిస్మరణ గావించి ఇలా అన్నాడు. "ఓ పరీక్షిన్మహారాజా! పూర్వం నా తండ్రి వ్యాసభగవానుడు, నారదుడు, దేవలుడు అనే పేరు గల మహర్షులు నాకు తెలియజేసిన ఇతిహాసం ఒకటి ఉంది. దాన్ని నీకు తెలియజేస్తాను సావధానంగా వినూ" మని ఇలా చెప్పాడు.
చిత్రకేతుడు అనే పేరుగల రాజు అంతులేని సంపదతో, మహేంద్రసమానుడై, శూరసేన దేశాలకు రాజై ప్రజలు ఆనందపడేలా పాలన చేస్తున్నాడు. అతనికున్న ఓర్పు అనే సుగుణం అన్ని కోర్కెలు తీరుస్తూ ఉండగా, సుగుణాలంకార భూషితుడై, సత్కీర్తిని పొందుతూ ప్రసిద్ధికెక్కాడు.
మెచ్చుకోదగిన యౌవనమందున్న మన్మథుని గుర్రాల వంటివారు, మన్మథుని విజయానికై అవతరించిన ఖడ్గలతలు, మన్మథమంత్ర అధిష్ఠాన దేవతలు, మదనుని బందీలు, సమస్త ప్రపంచాన్ని అపహసించి లోబరచుకోగల బొమ్మలు, మనోజుని సంసిద్ధమైన సేనవంటివారు, ఇక్షుకోదండధారియైన మన్మథుని విస్తారమైన కాంతులు, శంబరారి బాణాలు వీరేనేమో అనేటట్లున్న కోటిమంది పద్మముఖులు ఆ రాజైన చిత్రకేతువునకు భార్యలుకాగా స్వచ్చకీర్తిని, సంపదను ఇచ్చే సన్మార్గంలో ప్రవర్తిస్తూ అతడు ప్రజాపాలన చేస్తున్నాడు.
రాజైన చిత్రకేతువు తనకు ఎంత సంపద ఉన్నప్పటికీ, ఎంతమంది భార్యలు కలిగినప్పటికీ, సంతతి ఒక బిడ్దకూడా లేని కారణంగా వేసవి తాపానికి ఎండిపోయే మడుగువలె బాధపడుతున్నాడు.
ఆ చిత్రకేతు మహారాజు పుత్రసంతానం లేక పొందిన బాధను అతనిరూపం, పౌరుషం, దేవేంద్ర వైభవం, యౌవనం, సత్ప్రవర్తన, దిగ్విజయశక్తి సత్యనిష్ఠ ప్రపంచమంతా అలుముకొన్న ఖ్యాతి, భార్యలు, వైభవాలు ఇవేవీ పోగొట్టలేకపోయాయి.
ఈ విధంగా సంతానంలేక ఎంతగానో దుఃఖిస్తున్న ఆ రాజు భవనానికి అంగిరసుడు అనే మహర్షి వచ్చాడు. రాజుచేత అతిథి గౌరవాలు పొందాడు. కుశల ప్రశ్నలు వేశాడు. "రాజా! రాజ్యం నీ అధీనంలోనే ఉంది కదా. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలతోపాటు మహత్తు అహంకారం అనే ఏడింటిచేత జీవుడు రక్షింపబడిన తీరుగా రాజుకూడా మంత్రులు, ప్రజలు, కోట, ఆర్థికసంపద, సైన్యం, మిత్రులు అనే సప్తాంగాల చేత రక్షింపబడతాడు. నీవు అలాగే రక్షింపబడుతున్నావా? మంత్రులపై భారంపెట్టి రాజ్యసుఖాలు అనుభవిస్తున్నావా? భార్యలు, ప్రజలు, మంత్రులు, సేవకులు, మంత్రాంగం చెప్పేవారు, పురప్రజలు, గ్రామప్రజలు, రాజులు నీకు వశవర్తులై ఉన్నారా? అన్నీ కలిగిన మహారాజువైనా నీ మొగం ఎందుకో చిన్నబోయినట్లుంది. కారణం ఏమిటో?" అనిన ఆ మునిశ్రేష్ఠునితో రాజు ఇలా అన్నాడు. అయ్యా! తపోబలం కలిగిన మీరు ఎరుగనిది ఏముంది అని తలవంచి మౌనంగా కూర్చున్నాడు.
రాజు అభిప్రాయాన్ని సమస్యను ఎరిగిన అంగిరసుడు దయాళువై పుత్రకామేష్టి చేసి యజ్ఞప్రసాదాన్ని చిత్రకేతు మహారాజు పట్టమహిషి కృతద్యుతి అనే ఆమెకు ఇచ్చాడు. నీకు పుత్రుడు లభిస్తాడు, అతనివలన సుఖదుఃఖాలు అనుభవిస్తావు రాజా! అని చెప్పి వెళ్ళిపోయాడు. మహారాణి కృతద్యుతి యజ్ఞప్రసాదాన్ని స్వీకరించి గర్భం ధరించి తొమ్మిది నెలలు నిండగా కుమారుణ్ణి కన్నది. ఆ పుత్రోదయ సమయంలో రాజైన చిత్రకేతువు స్నానంచేసి, ఆభరణాలు ధరించి, గ్రామాలను, ఏనుగులను, గుర్రాలను, గోవులను, అరవైకోట్ల ద్రవ్యాన్ని దానంచేసి ప్రాణులకు మేఘుడు వర్షం కురిపించినట్లుగా ఇతరులందరికీ కోర్కెలను కురిపించి ఆనందంతో ఉన్నాడు. పుత్రమోహంతో మహారాణిపై ఎక్కువ ప్రేమను చూపిస్తున్నాడు మహారాజు. కృతద్యుతి పై ప్రేమను చూపడం వల్ల సంతానం లేని మిగిలిన రాణులకు బాధ కలిగింది. ఈర్ష్య కలిగింది. క్రూరచిత్తంతో మిగిలిన రాణులు ఆ రాజకుమారునకు విషం పెట్టారు. ఆ కుమారుడు సుఖనిద్ర పొందిన వానివలె మృతి చెందాడు. తెల్లవారగా దాది రాజపుత్రుణ్ణి మేల్కొల్పటానికి వెళ్ళి రాజపుత్రుడు విగతజీవుడై వికృతాకారంతో ఉండటంచూచి ఆశ్చర్యంతో, దుఃఖంతో, భయంతో శోకించి భూమిపైపడి దుఃఖించింది.
మృతుడై పడి ఉన్న ఆ రాజపుత్రునిజూచి దాది భూమిపై నిట్టనిలువుగా పడి దీనంగా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఎక్కువ ఆతృతతో ఏడ్చింది. అది విని భయంతో రాజు భార్య వెంటనే అక్కడికి వస్తూ
ఒక్కగానొక్క బిడ్డ క్రమక్రమంగా పెరుగుతున్నవాడు అతడే వంశకర్త. తాపసి అయిన అంగిరసుని వరంవల్ల జన్మించినాడు. అటువంటి కుమారుడు చనిపోయిన తీరుచూచి తల్లి దుఃఖించసాగింది.
చిత్రకేతుని భార్య కృతద్యుతి పుత్రమరణాన్ని సహించలేకపోయింది. ముఖంమీద పెట్టుకొన్న కుంకుమబొట్టుయొక్క ఎరుపు, కంటికి పెట్టుకొన్న కాటుక నలుపు కలిసిన కంటినీటి ధారలతో తన వక్షఃస్థలం తడిసిపోగా, బంగారు కంకణాలు ధరించిన చిగురులవంటి సుకుమార హస్తద్వయంతో హృదయాన్ని మోదుకుంటూ బాధతో కోకిల గొంతువంటి మధురమైన శబ్దంతో ఏడ్చింది.
(పంచమ స్వరం అంటే కోకిలగొంతు అని అర్ధం. 'పికః కూజతి పంచమం' అని ఉక్తి. అంటే పంచమస్వరంతో కోకిల కూస్తుంది అని అర్థం.)
కృతద్యుతిచేసిన దుఃఖ ధ్వనిని విని రాజైన చిత్రకేతువు భయపడ్డాడు. తాను రాజును అన్న గంభీర భావాన్ని విడిచిపెట్టి సుతుని వద్దకు వేగంగా వచ్చి మోహంతో తన కుమారునిపై వాలి చిత్రకేతువు ఇలా అంటున్నాడు. "ఓ కుమారా! నీ మరణవార్త వజ్రాయుధమై నన్ను కూలగొట్టక ఇలా నిలబెట్టి ఎందుకు జాలి తలచిందో! ఇకపై నా బతుకు ఎలా ఉంటుందో. ఈ నీ మరణవార్త విన్న మీ తల్లికి దుఃఖం ఎలా ఉపశమిస్తుందో కదా!"
ఈ ప్రకారంగా కిందు మీదులు తెలియకుండా భటులతో, మంత్రులతో, బంధువులతో కూడి ఆ రాజు దుఃఖిస్తున్నాడు. ఆ రాజు బాధ తెలుసుకొని అంగిరసుడు నారద మహర్షితో కలసివచ్చాడు. మరణించిన తన కొడుకు పాదాల దగ్గర శవంలా పడి ఉన్న రాజును చూచి అంగిరసుడు ఇలా అన్నాడు.
ఓ సార్వభౌమా! ఈ బాలుడు నీ కేమి అవుతాడు? నీవు ఎవరికొరకు దుఃఖిస్తున్నావు? ఈ పుత్రులు, ఈ మిత్రులు పూర్వజన్మలో ఎవరివారో నీవు ఎరుగుదువా! నదిలోని ప్రవాహ వేగంవల్ల ఇసుక ఒకప్పుడు ఒకచోట మేటవేసి మరొకప్పుడు విడిపోయినట్లుగా ప్రాణులకు చావు పుట్టుకలు జరుగుతూ ఉంటాయి. విష్ణుమాయ వలన మమకారం కలిగి జీవులకు జీవులు జన్మిస్తాయి. దీనికి బాధపడవలసిన పనిలేదు. ధైర్యం కోల్పోకూడదు. ఈ విషయాన్ని నీవు ఆలోచించుకోవాలి కదా!
'ఓ రాజా! వినవయ్యా! మేము, నీవు, మిగిలిన వారందరూకూడా ఈ నడుస్తున్న కాలంలో జన్మించి మృత్యువులో విశ్రాంతి పొందుతాము. ఇపుడే లేకుండా పోతాము. చావు, పుట్టుక ఈ రెండూ నిజం కాదు. పరమేశ్వరుడు తన మాయాప్రభావంతో జీవులచేత జీవులను పుట్టించి, ఆ జీవుల చేతనే రక్షింపజేసి, ఆ జీవులచేతనే మరణించేలా చేస్తాడు.
ఈ సృష్టి స్వతంత్రమైనది కాదు. భగవంతునికి ప్రత్యేకమైన ఉద్దేశం లేదు. అందుకే ఆ భగవంతుడు ఈ సృష్టి విషయంలో ఎటువంటి అపేక్ష లేకుండా బాలునివలె ఉంటాడు. పితృదేహంచేత పుత్రదేహం మాతృదేహంవల్ల కలుగుతుంది. ఈ విధంగా బీజాలవల్ల బీజాలు పుడుతూ ఉంటాయి. దేహికి ఈ జననమరణ దేహాలు శాశ్వతంగా జరుగుతూనే ఉంటాయి. పూర్వం సామాన్య విశేషాలు సన్మాత్ర వస్తువులయందు ఏ విధంగా ఏర్పడ్డాయో ఆ ప్రకారంగానే దేహానికి జీవునకు ఒకదానికి ఒకటి విభజింపబడటం అజ్ఞానంవల్ల కల్పింపబడింది. జన్మ ఫలితాలను చూచేవారికి మండుతున్న మంట అనేక ఆకారాలలో ఎలా కనబడుతుందో అలాగే ఒకే జీవుడు అనేక దేహాలతో వివిధకాలాలలో వెలుగుతూ ఉంటాడు. ఆత్మజ్ఞానం లేకపోవడంవల్ల దేహి దేహం ఒకటే అనుకోవడం జరుగుతుంది.
స్వప్నంలో భయంకరమైన విషయాన్ని చూచి ఆ స్వవ్న విషయం తనను ఏమీ చేయదని తెలియక అది తనకే జరిగినట్లు భయపడి; మెలకువ వచ్చిన తరువాత ఈ భయం అన్నది కేవలం కల మాత్రమేనని తనకు ఏమాత్రం అంటదని తెలుసుకొన్నరీతిగా, జీవుడే తాను అనే విషయం జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది. కావున ఈ దేహాలు, జన్మ పరంపరలు కేవలం మనస్సుకు సంబంధించినవే అని తెలిసికొని మోహం అనే చీకటిని విడిచి భగవంతుడైన వాసుదేవునిపై చిత్తాన్ని నిలిపి, నిర్మలమైన మనస్సు కలవాడవు కమ్ము" అని బోధించగా చిత్రకేతుడు లేచి అంగిరస నారదులతో ఇలా అన్నాడు.
అయ్యా! యతిరూపాలను ధరించి గుప్తంగా వచ్చిన మీరు ఎవరు? నాబోటి అజ్ఞానులను ప్రబోధించడానికి వచ్చిన పుణ్యాత్ములా? సనత్కుమార, నారద, ఋ షభాదులా? దేవలుడు అసితుడు అను ధీరులా? వ్యాస, వసిష్ఠ, దుర్వాస, మార్కండేయ, గౌతమ, శుక, రామ, కపిలుడు మొదలైనవారా? యాజ్ఞవల్క్యుడు, సూర్యుడు, ఆరుణి, చ్యవనుడు, రోమశుడు, ఆసురి, జాతుకర్ణుడు దత్తాత్రేయుడు, మైత్రేయుడు మొదలైనవారా! భరద్వాజునిచే గుర్తింపబడిన పంచశిఖులా! పరాశరుడు మొదలైన మునులా?
నేనన్న వారిలో మీరు ఎవరు? దేవతలు, చారణులు, గంధర్వులు, సిద్దులు మొదలైన వారి సమూహంలోని వారలా? ఆలోచించిచూడగా ఎవరియందు ఇటువంటి సుజ్ఞానం మూలకారణమై ఉంటుంది?
అయ్యా! అజ్ఞానం వల్ల ఏర్పడిన పశుత్వంతో గొప్ప దుఃఖమనే చీకటిలో ఉన్న నాకు దివ్యజ్ఞానం అందజేసిన మీరు ఎవరో తెలియజెప్పండి.
అంగిరసుడు చిత్రకేతునితో ఇలా అన్నాడు. 'పుత్రుని కోరుకున్న నీకు పుత్రుని ప్రసాదించిన అంగిరసుడను నేను. ఇతడు చతుర్ముఖబ్రహ్మకుమారుడైన నారదుడు. అంతులేని పుత్రశోకంలో ఉన్న నిన్ను అనుగ్రహించి, నిజమైన జ్ఞానాన్ని ఉపదేశించడానికి వచ్చాము. నీ దుఃఖాన్ని చూచి చనిపోయిన నీ కుమారుని బ్రదికించినా, పుత్రులు గలవారు పొందే దుఃఖం నీవు అనుభవించక తప్పదు. ఈ ప్రకారంగా లోకంలో భార్యలు, ఇళ్ళు, సంపదలు, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం మొదలైన విషయాలు, రాజ్య సంపదలు ఇవన్నీ నిశ్చలమైనవి కావు. చంచలములు మాత్రమే. అంతేకాదు, భూమి, బలం, ధనం, భటులు, మంత్రులు, స్నేహితులు మొదలైనవన్నీ దుఃఖాన్ని మోహాన్ని భయాన్ని బాధను కలిగించేవే కాని సుఖాన్ని ఇచ్చేవి కావు.
గగనంలో కనిపించే గంధర్వ నగరంలాగా కలలో కనబడే వస్తువులు కోరికలు తీర్చినట్లు ఉంటాయి కాని అవి మాయం అయిపోయేవే. మన హృదయగత భావాలు స్వప్నంలో సాక్షాత్కరించి అదృశ్యం అవుతాయి. జీవియొక్క దేహం - ద్రవ్యం, జ్ఞానం, క్రియ అనే వాటిచేత దేహికి అనేకరకాలైన దుఃఖాలను, తాపాలను కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి నీవు నిర్మలమయిన మనసుతో ఆత్మ తత్త్వాన్ని గ్రహించి సత్యపదాన్ని పొందు' అని చెప్పాడు. తరువాత నారదుడు ఇలా అన్నాడు. 'ఉపనిషత్తులలో రహస్యంగా దాగి ఉన్న నేనిచ్చే మంత్రాన్ని ఏడు రాత్రులు ఎవడు మననం చేస్తాడో వాడు సంకర్షణుడనే భగవంతుణ్ణి దర్శించగలుగుతాడు. సమస్త ప్రపంచానికీ ఆశ్రయమైన శ్రీమన్నారాయణుని పాదాలు సేవించి ఈ మోహాన్ని వదిలి వెంటనే ఉత్తమపదాన్ని పొందు. ఈ కుమారుని వలన ఇప్పుడు నీకు ప్రయోజనం లేదు చూడు అంటూ చనిపోయిన బాలకుని శరీరాన్ని చూచి 'ఓ జీవుడా! నీకు శుభం కలుగుగాక! మీ తల్లిదండ్రులను, బంధుజనులను చూచి, వీళ్ళ దుః ఖాన్ని పోగొట్టి, ఈ కళేబరంలో ప్రవేశించి, మిగిలిన నీ జీవితాన్ని అనుభవించి మీ తండ్రి ఇచ్చే సింహాసనంపై కూర్చో' అనగా ఆ బాలుడు ఇలా అన్నాడు.
ఓ మునిసత్తమా! నా పూర్వకర్మల కారణంగా ఇప్పటివరకు నేను దేవతలలో, పశుపక్ష్యాదులలో, నరులలో జన్మించి ఉంటాను. ఇప్పుడు నా ఎదురుగా ఉన్న వీరు ఏ జన్మలో నాకు తల్లిదండ్రులో తెలియజేయండి.
ఒకొక్క జన్మలో ఒక్కొక్కరు బాంధవులుగా, దాయాదులుగా, కుమారులుగా, శత్రువులుగా, మిత్రులుగా, పట్టించుకోనివారుగా, మధ్యస్థులుగా సంబంధాలు కలిగి ఉంటారు. ఇవన్నీ గమనిస్తే ప్రాణికుండే వావివరుసలు, సంబంధ బాంధవ్యాలు శాశ్వతాలా? కావు.
అమ్మకాలు, కొనుగోళ్ళు జరిగేటప్పుడు బంగారమూ, రత్నాలూ మన ఇష్టానిష్టములను బట్టి మారినట్లుగా ఈ జీవుడు అనేక దేహాలలోకి మారుతూ తిరుగుతూ ఉంటాడు. ఈ వేళ ఒక దేహంలో ఉన్న దేహి లేక ఆత్మ రేపు మరొక దేహంలోకి మారుతూ తిరుగుతూ ఉంటాడు. దేహాలు మారవచ్చునేమో గాని జీవుడు మాత్రం నశించక శాశ్వతంగా ఉంటాడు.
నారాయణుడు ఒక్కడు. అతడు నిత్యుడు. ఆద్యంతాలు లేనివాడు. జన్మాదులు లేనివాడు. సర్వంలోనూ తానుంటాడు. ఆయనలో సర్వమూ ఉంటుంది. అన్నిటికీ ఆతడే ఆశ్రయుడు. సూక్ష్మం స్థూలం తానే అయి, స్థూలానికి సూక్ష్మానికి తానే ఉదాహరణమై తన తేజస్సుతో తానే సయంప్రకాశుడై ఉంటాడు. సమస్తమూ తాను చూడగలడు. అన్నిటిపై తన ప్రభావం చూపగలడు. సమస్త విశ్వాన్ని తనలో ఇముడ్చుకోగలడు. తన మాయాగుణాలతో ఈ సమస్త ప్రపంచాన్ని ఆత్మమయంగా సృష్టి చేస్తుంటాడు. ఈ సమస్త ప్రపంచాలను జీవింపచేసే సంజీవనుడు ఆ నారాయణుడే.
ప్రపంచంలోని ప్రాణులందరి ఆత్మలలో ఉండే ఘనుడు, గుణముల సాక్షి అయిన పరమాత్మకు భార్యలు, కుమారులు, భర్తలు, మిత్రులు, శత్రువులు, బంధువులు, ప్రియులు అనే సంబంధం ఉండదు. పరమాత్మ అందరి ఆత్మలో ఉంటూ, అన్నీ సాక్షిభూతంగా చూస్తుండేవాడే తప్ప, బంధాలలో, బంధుత్వాలలో చిక్కేవాడు కాదు.
చిత్రకేతుండు తపం బాచరించి భగవత్ప్రసాదంబు నొందుట
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
పంచాంగం
Subscribe to:
Post Comments (Atom)
The Story Of Savitru Genealogy - సవితృవంశ ప్రవచనాది కథ
సవితృవంశ ప్రవచనాది కథ ఓ రాజా! విను. త్వష్టయొక్క వంశం గూర్చి నీకు వివరంగా చెప్పాను. తరువాత సవిత పృశ్ని, సావిత్రి, వ్యాహృతి అనే భార్యలయందు పశు...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
No comments:
Post a Comment