ఓ రాజా! కార్తిక మహాత్యమును వినుము. విన్నంతనే మనో వాక్కాయముల వలన చేయబడిన పాపమంతయు నశించును.
కార్తిక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమారచించువాడు కైలాసనివాసి యగును. కార్తికమాసమున సోమవారమందు స్నానమునుగాని, దానమునుగాని, జపమునుగాని చేసిన యెడల అశ్వమేధయాగముల ఫలమును బొందును. ఇందుకు సందేహములేదు.
కార్తికమాసమందు ఉపవాసము, ఒకపూట భోజనము రాత్రిభోజనము, ఛాయానక్త భోజనము, స్నానము, తిలదానము యీ ఆరున్నూ ఉపవాస సమానము లగుననిఋషులు చెప్పిరి.
శక్తిగలవాడు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివాడు రాత్రిభోజనమును జేయ వలెను. అందుకు శక్తిలేనివాడు ఛాయానక్షక్తమును జేయవలెను. అందుకు శక్తిలేనివాడు బ్రాహ్మణులకు భోజనముపెట్టి వారితో పగలే భోజనము చేయవలెను.
ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాతరెట్టింపు కొలతకు తన నీడరాగానే పగలే భుజించుట. సాయంకాలము 4 1/2 గంటలకు భుజించుట ఛాయానక్తమగును. మానవులు పైన చెప్పిన 6టిలో దేనినయినను ఆచరించని యెడల యెనిమిది యుగములు నరకమందు కుంభీపాకనరకములోను, రౌరవనరకములోను బాధలనొందుదురు.
కార్తికసోమవారమందు విధవ యధావిధిగా ఉపవాసముచేసి శివుని పూజించినట్లయిన శివలోకమును బొందును. స్త్రీలుగాని పురుషులుగాని ఎవరు కార్తికసోమవార మందు నక్షత్రములనుజూచి రాత్రిభోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలె నశించును.
కార్తిక సోమవారమందు శివలింగమునకు అభిషేకమును, పూజయుచేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును.
ఈ విషయమందొకకథ గలదు. చెప్పెదవినుము, ఇది వినువారికిని చెప్పువారికిని పాపనాశనమగును. కాశ్మీరదేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్య్రనిష్ఠురి యనునొక స్త్రీ గలదు. అది చక్కని రూపముతో మంచియౌవనముతో గూడియుండి తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచూ జారిణియై యుండెడిది.
ఓ రాజా! దీని దుర్గణములను జూచి తల్లిదండ్రులును, అత్తమామలును దీనిని విడిచిరి.
దీని భర్త సౌరాష్ట్రదేశస్థుడు, అతని పేరు మిత్రశర్మ, అతడు వేదవేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతములందు దయగలవాడును, అనేకతీర్థముల సేవించినవాడును, అబద్ధ మాడనివాడును, నిరంతరము దయగల వాడును.
భర్త ఇట్టి ఉత్తమగుణములు గలవాడైనప్పటికి అదుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము దానిచేత దెబ్బలు తినుచును గృహస్థ ధర్మమందుండు కోరికచేత భార్యను విడువలేక దానితో కష్టపడుచుండెడివాడు.
ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, అంగములనగా శిక్ష వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదవేదాంగ పారగుడనబడును.
ఈ మిత్రశర్మ భార్యకు కర్కశ యనియు నామముగలదు. భర్తయైన మిత్రశర్మయు సంభోగవాంఛచేత దీనియందు రాగముతో నుండెను.
అంత నొకనాడు దీని రంకుమొగుడు ద్రవ్యములను నగలను వస్త్రములను తృప్తిగా యిచ్చినిరంతరము సంభోగమునకు నీభర్తవల్ల భంగము గలుగుచున్నది గాన నీభర్తను చంపుమని చెప్పగా అది సమ్మతించి రాత్రి భర్త తనతో సంభోగించి పిమ్మట నిద్రించగానే తానులేచి పెద్దరాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను.
ఆ దెబ్బతో అతడు మృతినొందెను. తరువాత కర్కశ స్వయముగా తన భర్త శవమును వీపుమీద వేసికొని తీసికొనిపోయి పాడునూతిలో పడవేసెను.
ఇట్లు భర్తనుచంపి తరుణులును, పరస్త్రీ సంగమాభిలాషులును, కామశాస్త్రప్రవీణులును, వర్ణ సంకరకారకులును అయిన అనేక జాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగముచేయు చుండెడిది.
ఇంతేగాదు. భర్తయందనురాగముతో గూడి యున్న భార్యలను దుర్భోధలచేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్నీ వ్రత పరాయణులను భంగపరచి వారితో సంభోగించుచు నిత్యము పరనిందచేయుచు పరద్వేషముకలదై దేవతాద్వేషిఅయి యుండెను.
అది నిరంతరము దయాశూన్యయై ఆడంబరముచేతగాని, నవ్వుచేత గాని, కపటముచేతగాని విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు. హరికథను విననూలేదు. ఇట్లుండగానే దీనికి యౌవనము పోయి ముసలి తనము వచ్చినది.
తరువాత వ్రణ(రాచకురుపు) వ్యాధి కలిగినది. ఆ కురుపుకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను.
తరువాత జారులందరు రూపవంతులు ముదయుక్తులైవచ్చి చూచి విగతాశులై వేశ్య యింటికి వచ్చుట మానివేసిరి.
తరువాత పాపాధిక్యముచేత చాలా బాధనొంది ఆ వ్రణవ్యాధితోడనే మృతినొందెను. తరువాత భయంకరులయిన యమ దూతలువచ్చి ఆ కర్కశను పాశములచేతకట్టి యముని కడకు తీసికొనిపోయి యమునికి అప్పగించిరి.
యముడు దానినిచూచి కోపముచేత కళ్ళెఱ్ఱజేసి దీనిని భయంకరమగు ముళ్ళతో గూడినదియు ఇనుముతో చేయబడిన స్తంభమునుకాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను.
అంత యమాజ్ఞ మీద భటులు ఆ కర్కశను చేసిన పాపములను జెప్పుచు ఆ వేడి స్తంభమును సంభోగించుమనిరి.
తరువాత దాని పాదములు రెండు పట్టుకుని గిరగిర త్రిప్పి రాతిమీద పెట్టికొట్టిరి. తరువాత రక్తమునుకాచి త్రాగించిరి. సీసమునుకాచి రెండు చెవులలోను పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి.
ఆ కర్కశ యిట్లు తన పితృ పితామహులతోను, తన బాంధవులతోను తనకు పూర్వము పదితరములు తరువాత పదితరముల వారితో ఘోరములయిన నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమియందు జన్మించెను.
భూమియందు పదిహేను మాఱులు కుక్కగా జన్మించినది. అందులో పదిహేనవ జన్మ కళింగదేశమందు బ్రాహ్మణుని ఇంటివద్ద కుక్కగా పుట్టి యింటింటికి తిరుగుచుండెను.
ఇట్లుండగా ఒకప్పుడు అ బ్రాహ్మణుడు కార్తికమాసమందు సోమవారము దినంబున పగలంతయు ఉపవాసముచేసి గృహమందు శివలింగాభిషేక పూజాదులనుజేసి నక్షత్రమండలమును జూచి గృహమునకుబోయి దేవనివేదనచేసి పిమ్మట బలిదానము కొరకు బయటకువచ్చి భూమిమిద బలిని ఉంచి కాళ్ళుకడిగికొని ఆచమనము చేసి తిరిగి యింటిలోనికి వెళ్ళెను.
ఆకుక్క ఆనాడు పగలంతయు ఆహారము కొద్దియైనను దొరక నందున కృశించినదై కార్తిక సోమవారము రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించెను.
ఆ బలి భోజనముచేత కుక్కకు పూర్వజాతి స్మృతికలిగి బ్రాహ్మణోత్తమా! రక్షింపుము రక్షింపుమని పలికెను. ఆ మాటవిని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడినవాడై
ఓ కుక్కా! మా యింటలో ఏమేమి చేసితివి. రక్షింపుమనుచున్నావు అని అడిగెను.
కుక్క ఇట్లనెను. ఓ బ్రాహ్మణోత్తమా! వినుము. నేను పూర్వజన్మమందు బ్రాహ్మణ స్త్రీని. పాపములను చేయుదానను, వర్ణసంకరమును చేసిన దానను, అన్యపురుషులను మఱగి నిజభర్తను చంపితిని.
ఈవి మొదలయిన పాపములు అనేకములుజేసి చచ్చి యమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలనొంది తిరిగి భూమికివచ్చి 15 మాఱులు కుక్కగా జన్మించితిని. చివరికి ఇప్పుడు నాకీ జాతిస్మరణ కలిగినది. ఎట్లు గలిగినదో చెప్పుము. విని తరించెదను.
ఆ బ్రాహ్మణోత్తముడీమాట విని జ్ఞానదృష్టితో చూచి తెలిసికొని యిట్లనియె. ఓ శునకమా! యీ కార్తికసోమవారమునాడు ప్రదోషసమయము వరకు భుజింపక యిప్పుడు నేనువుంచిన బలిని భక్షించితివి గనుక నీకు జాతిస్మృత గలిగినది.
ఆ మాటను విని కుక్క బ్రాహ్మణోత్తమా! ఈ కుక్కజాతి నుండి నాకెట్లు మోక్షము గలుగునో చెప్పుమని విప్రుని అడిగెను.
ఆ కుక్క యిట్లు ప్రార్థించగా పరోపకారబుద్ధితో కార్తికసోమవారములందు తాను జేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను.
బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఈయగానే కుక్క దేహును విడిచి ప్రకాశించుచున్న శరీరముగలదై ప్రకాశించెడి వస్త్రములను, మాల్యములను ధరించి ఆభరణాలంకృతయై తనపితరులతో గూడ కైలాసానికి బోయి అచ్చట పార్వతీ దేవి వలె శివునితో గూడ ఆనందించుచుండెను.
కాబట్టి కార్తికమాసమందు సోమవారవ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తిక సోమవారవ్రతమును జేయుదురో వారికి మోక్షము హస్తమందుండును.
కాబట్టి ఓ జనకమహారాజా! పుణ్యప్రదమైన కార్తికవ్రతమును నీవు చేయుము.
No comments:
Post a Comment