Sunday, April 12, 2026

Chapter 49 Chanting of Kamaraja Bheeja by Sudarshana - అధ్యాయము 49 సుదర్శనుడు కామరాజ బీజము జపించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 49

సుదర్శనుడు కామరాజ బీజము జపించుట

వ్యాసుడిట్లనియె: భరద్వాజుని వాక్కులు విని యుధాజిత్తు వృద్ధామాత్యుని బిలిచి యతనితో నిట్లనియెను. 

''ఓ సుబుద్ధీ! సుభాషిణియు సుపుత్త్రయునగు మనోరమను నేనిప్పుడు నా బలము ప్రయోగించి తెచ్చుట మంచిదా, కాదా? నా కర్తవ్యమేమో నీవే తెలుపుము. తన మేలుగోరుకొనువాడు తన యల్ప శత్రువునైన సుపేక్షించి విడిచిపెట్టరాదు. అట్లొనర్చిన నది రాజయక్ష్మ రోగమువలె పెరిగి పెరిగి తన చావునకు కారణభూతమగును. ఇచ్చట నన్ను కాదని ధిక్కరించు యోధులు లేరు. కనుక నా మనుమని శత్రువగు సుదర్శనుని పట్టి పల్లార్తును. ఇపుడు బలప్రయోగముతోనైన నీపనికి బూనుకొందును. సుదర్శనుడంతమొందినచో నా మనుమడింక కంటినిండ నిద్రపోగలడు. అతని రాజ్యము నిష్కంటకము కాగలదు.'' 

మంత్రి యిట్లనియె : ఓ రాజా! సాహసము తగదు. ఈ మునివచనము పాటించుము. అతడు విశ్వామిత్రునంతటివానినే యుదాహరించి వాక్రుచ్చెను. పూర్వము గాధినందనుడును ప్రఖ్యాతమునియునగు విశ్వామిత్రుడెల్లెడల గ్రుమ్మరుచు వసిష్ఠమున్యాశ్రమము జేరెను. ప్రతాపియగు విశ్వామిత్ర భూపతి బ్రహ్మర్షికి వసిష్ఠునకు ప్రణమిల్లి యతడొసంగిన యాసనమందాసీనుడయ్యెను. అంత విశ్వామిత్రుడు బ్రహ్మర్షిచే నిమంత్రితుడై ససైన్యముగ భోజనమునకు సిద్ధమయ్యెను. వారి భోజనమునకు వలసిన భక్ష్య భోజ్యాదులెల్ల నందినీ ధేనువు సమకూర్చెను. ఆ రాజు ససైన్యముగ తుష్టిగ భుజించెను. అదంతయును నందినీ ప్రభావ మని విశ్వామిత్రుడెఱింగి వసిష్ఠ మునీశ్వరునితో అతడు ఓ పరంతపా! మునీశా! నీకు కడివెళ్ళ పాలిచ్చు గోవుల సహస్ర మిత్తును. నాకా నందినీ ధేనువు నొక్కటిమ్మని ప్రార్థించుచున్నాను అని యాచించెను.

వసిష్ఠు డిట్లనియె: రాజా! ఇది నా హోమ ధేనువు. నీ కీయను. నీ యావులు నీ యొద్దనే యుండనిమ్ము అని వసిష్ఠుడన మునివరేణ్యా! నీవేరికోరుకొన్న యావులను పదివేలైన లక్షయైన నిత్తును. నాకు నీ గోవునిమ్ము. కాదేని నా బలము చూపి దానిని గొనిపోదును అని విశ్వామిత్రుడనెను. 

అది విని వసిష్ఠమహర్షి యిట్లు వాక్రుచ్చెను: మహీశా! నీకు దోచినట్లుగ బలముపయోగించి నందినిని తీసికొనుము. నేను మాత్రము నా యిష్టముతో నా యింటినుండి నాచేతిమీదుగ దీనిని నీకు వదలిపెట్టను. అంత నరపతి మహాబలదర్పితులగు తన భటులను నందినిని గొనిరమ్మని యాజ్ఞాపించెను. వారు హఠాత్తుగా దానిని బట్టుకొనబోగా నందిని వణకుచు కన్నీరు గార్చుచు మునీశునితో మునివల్లభా! నన్నేల త్యజింతువు? కట్టివేసిన నన్ను లాగికొనిపోవుచున్నారు అన ఓ నందినీ! నేను నిన్ను వదలుట లేదు. ఇపుడే పూజించిన నిన్నతడు బలిమితో గొంపోవుచున్నాడు. నేను మదిలోగూడ నిన్ను వదలదలచలేదు. నేనిపుడేమి సేతును? అను మునివరుని పల్కులు విని నందిని కోపోద్రిక్తయై క్రూరముగ హంభారవమొనరించెను. అంత నా గోవు మేనినుండి కవచధారులును సాయుధులైన ఘోర దైత్యులు బయలువెడలి నిలునిలుడని కేకలు పెట్టుచు వారి వెంటబడిరి. ఆ దైత్య సేనలు వైరి సేనలను ఱుమాడి కాకావికలు చేసి నందినిని విడిపించుకొని వచ్చెను. విశ్వామిత్రుడతి దుఃఃతుడై చేయునదిలేక ఒంటిగ వచ్చినబాట పట్టెను. పాపమతడు దీనాత్ముడై తన క్షాత్రమును ధిక్కరించుచు బ్రహ్మతేజోబలమే నిజమైన బలమని యది దుర్గ్రాహ్యమని భావించి తపోనిమగ్నుడయ్యెను. అట్లు గాధేయుడు పెక్కేండ్లు ఘోరముగ ఘోరారణ్యములందు తపమాచరించి క్షత్రియత్వము వదలి ఋషిత్వమందెను.

కనుక నో రాజేంద్రా! ఇపుడు నీవును మునితో పగబూనకుము. తాపసోత్తములతోడి వైరము కులనాశకరము. నీవిపుడే మునివరుడగు తపోనిధిని సంతసింపజేసి యేగుము. సుదర్శను డిచట యథా సుఖముగ మనుగడ సాగించు గావుత. రాజా! ఈ నిఱుపేద బాలుడు నీకేమపకార మొనరింపగలడు? ఈ దిక్కుమాలిన దుర్బలుడగు బాలునిపై నీకు విరోధ భావము తగదు. అందఱియందు కనికరమును జూపవలెను. జగము సర్వము దైవవశము గద! ఈసువలన ప్రయోజనము సున్న. ఏది ప్రాప్తవ్యమో యది తప్పక ప్రాప్తమై తీరును. ఒక్కొక్క సమయమందు దైవయోగమున గడ్డిపోచ వజ్రముగను వజ్రము గడ్డిపోచగను మారును. కుందేలు శార్దూలమును దోమ యేనుగును చంపగలదు. కాన నతిసాహసము వలదు. నా హిత వాలింపుము.

మంత్రి హితము విని యుధాజిత్తు మునికి తలవంచి నమస్కరించి తన నగరి కరిగెను. మనోరమయు స్వస్థయై ఋతవ్రతుడగు తన సుతుని పోషించుచు మున్యాశ్రమందుండెను. ఆ సుదర్శన బాలుడు నెల బాలునివలె దిన దిన ప్రవర్ధమానుడై మునిబాలురతో నిర్భయముగ నాటలాడుచుండెను. అంత నొకనాడు విదల్లుడచ్చటికేతెంచెను. మునిలబాలురతనినిగని క్లీబుడని పిలిచి గేలిచేసిరి. సుదర్శనుడాశబ్దము విని బకారమువదలి యనుస్వారయుతముగ నేకాక్షరమగు ''క్లీం'' కారమును సుస్పష్టముగ మాటామాటికి నుచ్చరింపదొడగెను. అట్లా బాలుడు కామరాజ బీజమును నెమ్మనమందు నెమ్మితోదాల్చి విసుగుసనక లోలోన నిరంతరాయముగ దానినే జపింపసాగెను. ఆ పగిది భావి శుభయోగసూచకముగ సుదర్శనుడు కామరాజ బీజమును సహజముగ గ్రహించి జపము సాగించెను. ఆ యైదేండ్లప్రాయపు రాకుమారుడు ఋషి ఛందము న్యాసము ధ్యానము వదలి యా దివ్యప్రణవమును జపించుచు ధ్యానించుచుండెను. అతడా యేకాక్షర మంత్రమే సర్వ విజ్ఞాన సారమని స్వయముగ నెఱింగి యేమరక మఱువక నాడుచు పాడుచు నిదురించుచు మనసార హృదయమున జపించుచుండెను.

అతడు పదునొకండేండ్ల ప్రాయమున భారద్వాజునిచేత నుపనీతుడై వేదాధ్యయన మొనరించెను. అతడు "క్లీం" మంత్ర ప్రభావమున సాంగధనుర్వేదము నీతి శాస్త్రము తుదకు సకల విద్యలు తేలికగ నభ్యసించెను. పిమ్మట నతడొకనాడు రక్తాంబర రక్తవర్ణ రక్తమండల మండితయగు శ్రీ పరాదేవతను ప్రత్యక్షముగ సందర్శించెను. అతడు గరుడ వాహనమందాసీనయైయున్న పరమాద్భుత కామకళాశక్తియగు శ్రీ మహావైష్ణవిని సంవీక్షించి నిర్మలవదనుడయ్యెను. అట్లా సుదర్శనుడు వనమందు సకలవిద్యార్థ రహస్యములు బడసి తన మాతృమూర్తిని సేవించుచు నదీతటమున విహరించుచుండగా జగన్మాతయగు శ్రీ మాతృదేవి యతనిపై దయతలచి విల్లమ్ములు కవచతూణీరములు నొసంగినది. అదే సమయమున కాశీరాజు ప్రియపుత్త్రిక సర్వసులక్షణసంయుత యగు శశికళయను నామె యెప్పులకుప్పయై యొప్పారుచుండెను. ఆ కన్యకామణి నృపతనయుడును అపరమన్మథుడును సకల సులక్షణ సంయుతుడునగు సుదర్శనుని గుఱించి వందిజనము వలన విని యతనినే తన వరునిగ వరింప మదిలో గాఢ నిశ్చయము చేసికొనెను. అంత నొకనాటి రేయి కలలో జగదంబ ఆమెకు గనంబడి యాకన్నియ నూరడించుచు ఓ సుశ్రోణీ ! సుదర్శనుడు నాకు భక్తుడు. అతనినే వరునిగ వరింపుము. నా వాక్కుల వలన నతడే నీకు సర్వకామప్రదుడగును అనెను. అట్లు శశికళ కలలో జగదంబనుగని యామె యొక్క ప్రియవాక్కులు విని ముదితాంతరంగయై మేల్కనిన తరువాత గూడ సంతసిల్లుచుండెను. ఆమెతల్లి యామె ప్రమోదమునకు కారణమడిగెను. కాని, యామె సిగ్గును మారు మాట పలుకకుండెను.

ఆ బాల ప్రమదము నిండార తేపతేపకు కలను స్మరించుచు స్వప్న వృత్తాంత మంతయును తన చెలికత్తెకు సవిస్తరముగ చెప్పెను. ఒకనాడు విశాలనయనయగు నాబాల తన చెలితో చంపకములు పరిమళించు సుందరోద్యానమునకు వాహ్యాళి కేగెను. ఆమె పూలుగోయుచు నొక సంపెంగ పూలచెట్టు చెంతనుండి అపుడదే మార్గమున తనవైపునకేతెంచుచున్న యొక విప్రునిగనెను. ఆమెయతనికి చేతులు జోడించి తీయని మాటలతో నో మహానుభావా! మీరాక యేదేశమందుండి?' అని యడుగ ఆ విప్రుడును ఓ బాలా! నేను భరద్వాజాశ్రమమునుండి యొక కార్యము నిమిత్త మేతెంచుచున్నాను. నీవేమడుగుదువో యడుగుము' అనెను. ఓ మహాత్మా! ఆ పవిత్రాశ్రమమందు విశేషముగ వర్ణనీయము లోకాతీతము ప్రేక్షణీయమునైన వస్తువేది కలదు?' అని శశికళయడుగ: 

విప్రుడిట్లనియె: ఓ వరోరు! ధ్రువసంధి రాజు తనయుడు సుదర్శనుడు. అతడు శ్రీమంతుడు. సార్థకనామధేయుడు; పురుషోత్తముడు. అతడాయాశ్రమందు గలడు. కమలనయనా! అతని సోయగముజూడని కన్నులు కన్నులుగావని నాకు దోచుచున్నది. సకలసృష్టి సలుపు విధాత గుణనిలయుని చూడగోరియే విశ్వ సుగుణముల నతనిలో రాశిగబోసి సృజించి యుండె గాబోలు! ఆ రాజకుమారుడే నీ కన్నివిధముల తగిన వరుడు - యోగ్యుడు. ఈ మీ యోగము మణికాంచన యోగమట్లు సంఘటిల్లినది.

అధ్యాయము 50 శశికళ విరహ వర్ణనము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 48 Yudhajit's attempt to kill Sudarshan - అధ్యాయము 48 యుధాజిత్తు సుదర్శనుని జంపదలచుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 48

యుధాజిత్తు సుదర్శనుని జంపదలచుట

వ్యాసు డిట్లనియెను: మహాబలుడగు యుధాజిత్తు యుద్ధము చాలించి యయోధ్య కేగి సుదర్శనుని చంపు నుద్దేశ్యముతో మనోరను యెచ్చటనెచ్చటనని యడుగ సాగెను. సుదర్శనుని జాడ దెలియుటకు సేవకుల నంపెను. కాని, యతడు గనబడలేదు. పిదప నతడొక శుభదినమున తన మనుమనికి పట్టము గట్టెను. వసిష్ఠాదులును మంత్రులును నాథర్వణ మంత్రములతో జలపూర్ణ కలశములతో శత్రుజిత్తు నభిషేకించిరి. ఆ నగరమంతయు భేరీశంఖనినాదములతో తూర్యవాద్య ఘోషములతో నుత్సవములతో గనులపండువగ నుండెను. విప్రుల వేదపఠనములతో హర్షధ్వానములతో వందిగాయక సంస్తుతులతో జయ మంగళ ఘోషములతో నయోధ్యాపురి ముదితవలె శోభిల్లెను. రాజు క్రొత్త వాడగుటవలన నగరము హృష్టపుష్టజనులతో స్తోత్రవాద్యధ్వనులతో కొంగ్రొత్తతనము సంతరించుకొని యెప్పుచుండెను. 

కొందఱు సజ్జనులు మాత్రము సుదర్శన రాజకుమారు డెచ్చటికేగెనోయని తమ ఇండ్లలో పలవరించుచుండిరి. ఆ మనోరమ మహాసాధ్వి. ఆమె తన కొడుకును వెంటబెట్టుకొని యెచ్చటికేగెనోగద! ఆమె తండ్రి రాజ్యలుబ్ధుడగు యుధాజిత్తు చేతిలో మడిసెనుగద! అని ఈరీతిగ సమబుద్ధులగు వృద్ధులు విచారము బొరయుచు శత్రుజిత్తునకు వశవర్తులై దుఃఖించుచుండిరి. 

యుధాజిత్తు అట్లు తన మనుమని రాజుగజేసి రాజ్యభారము మంత్రుల కప్పగించి తన నగరము మొగముపట్టి పోవుచు త్రోవలో నొక మున్యాశ్రమమున సుదర్శనుడు తలదాచుకొను టెఱిగి యతనిని రూపుమాపదలచి వెంటనే చిత్ర కూటగిరి కేగి బలుడను పేరుగలవాడును శూరుడునగు నిషాదరాజును మున్నిడికొని శృంగవేరపురాధిపుడగు దుర్దర్శుడను వానిని శీఘ్రుముగ కలిసెను. వీరిని అట్లు సేనాసహితముగ వచ్చుచున్నట్లు విని మనోరమ భయార్తయై తన చిన్నారి కొడుకునకు గల్గిన యాపదకు దుఃతమతియై కన్నులనిండ కన్నీరు నింపుకొని రోదించుచు మునితిలకునతో  

మనోరమ కిట్లనియెను : మునీశా! ఇపుడు యుధాజిత్తు మా ప్రాణములు బలిగొనుటకు వచ్చుచున్నాడు. నే నిపుడేమి చేతును? ఎక్కడికేగుదును? ఇతడు నా తండ్రిని పొట్టబెట్టుకొనెను. తన దౌహిత్రుని రాజుగ జేసెను. ఇపుడు నా చిన్ని కుమారుని చంప సైన్యముతో వచ్చుచున్నాడు.

పూర్వము పాండవులు పాంచాలీసమేతులై మున్యాశ్రమములందు వసించిరని నేను వింటిని. అపుడొకసారి పాండవులు వేట కేగగ ద్రోవది పావన మున్యాశ్రమమందుండెను. ఆ యాశ్రమమందు ధౌమ్యుడు అత్రి గాలవుడు పైలుడు జాబాలి గౌతముడు భృగువు చ్యవనుడు కణ్వుడు జతువు వీతిహోత్రుడు సుమంతుడు యజ్ఞదత్తుడు వత్సలుడు రాశాసనుడు కహోడుడు యవక్రీతుడు యజ్ఞకృత్తుక్రతువు మొదలుగాగల మునులు భారద్వాజాదులును వేదపఠనములు సలుపుచుండిరి. శోభనాంగియగు ద్రౌపది తన చెలికత్తెయలంగూడి మునుల యాశ్రమమున నిర్భయముగ నుండెను. పరంతపులును వీరవరులును అగు పంచపాండవులు ధనుర్బాణధరులై మృగములను వేటాడుచు వనమునందు గ్రుమ్మరుచుండిరి.

అంతలో సింధుపతియగు జయద్రథుడు సేనతో మార్గమున పయనించుచు వేదఘోషము విని యిది మునిజనాశ్రమమనుకొని ఆ యాశ్రమముచేరి సర్వ విదులగు మునుల వేదఘోషము వినగనే వారిని దర్శించు నాకాంక్షతో తన రథము దిగెను. ఇరువురు భృత్యులను వెంటగొని వేదపఠనమున మునిగియున్న మునుల చూచి చేతులు కట్టుకొని తాపసోత్తముల యాశ్రమములో బ్రవేశించెను. పిమ్మట నతడు కూర్చుండగనే మునిభార్యలతడెవరని యడుగుచు అతనిని చూడవచ్చిరి. వారి నడుమ రెండవలక్ష్మి వలెను దేవకన్యవలెను శోభిల్లు వరారోహయగు యాజ్ఞసేనిని ద్రౌపదినిగని జయద్రథుడా ప్రమద యగు వరానన యెవతెయో తెలియగోరి 

ధౌమ్యు నిట్లడిగెను: ఈమె యెవని భార్య? ఎవని కూతురు? ఈమె పేరేమి? ఈ వరవర్ణిని రూపలావణ్యవతియగు నింద్రాణి భూమికి దిగివచ్చెనో యన నలరుచున్నది. ఈ భామిని ముళ్ళచెట్ల నడిమి లవంగపు తీవియబోలి రక్కసుల మధ్యనుండు రంభవలె నిచట భాసిల్లుచున్నది. మహాభాగా! ఈ యబల యెవ్వని భార్యయో నిక్కువముగ బలుకుము. ఈమె రాజపత్నియే యగును గాని ముని భార్య కాదు అన విని ధౌమ్యుడు ఓ సింధురాజా! సర్వశుభలక్షణయుతయగు నీమె పాంచాలి - పాండవుల ప్రియసతి - ద్రోవది. ఈమె ఇపు డీ ఆశ్రమమందు నివసించుచున్నది.

వీర్యశౌర్యబలయుతులగు పాండవులు శోకముడిగియున్నారా? వారెచ్చటి కేగిరని జయద్రథుడన వారు రథ మెక్కి వేటకేగిరి. వారు మృగములను గొని మధ్యాహ్నమునకు గాని రార'ని ధౌమ్యుడనియెను. ఆ మాటలు విని జయద్రథుడు లేచి ద్రౌపది చెంతకేగి ప్రణమిల్లి యామెతో ఓ వరారోహో! నీకు సేమంబేనా? నీ పతులెచ్చటి కరిగిరి? మీకు వనవాసమున పదునొక్కండేండ్లు గడచెనుగదా! అని యడిగెను. అది విని ఓ నృపా! నీకు శుభమగుత! ఈ యాశ్రమమున విశ్రమింపుము. క్షణములోన పాండవులేతేరగలరు' అని యామె పల్కుచుండగనే యతడు కామలుబ్ధుడై మునిసత్తముల ననాదరించి యామెను పట్టుకొనెను.

కనుక బుధులెప్పుడే నెవ్వరినేని విశ్వసించి యుండరాదు. అట్లొనరించిన వగలబొగులవలసివచ్చును. ఇందులకు బలి తార్కాణము. ఆ బలి శ్రీమంతుడు; విరోచనుని సుతుడు; సత్యసంగరుడు; ధర్మపరుడు; సాధుసమ్మతుడు; మహా దాత; శరణాగత రక్షకుడు; యజ్ఞకర్త. ఎప్పుడేని అధర్మము చేసి యెఱుగడు. ప్రహ్లాదుని మనుమడు. భూరి దక్షిణలతో తొంబది తొమ్మిది జన్నములొనరించినవాడు. సకలయోగిసేవ్యుడు - సత్యమూర్తి - నిర్వికారుడునగు విష్ణుభగవానుడు దేవ హితము చేయదలంచి కశ్యప మహర్షికి పుత్రుడై పుట్టెను. అతడు కపట వామన రూపమున సాగర పరివృతమైన మహీమండల మంతయును బలినుండి వంచనతో హరించెను. ఐనను వైరోచని యగు బలి సత్యవాదియై పేరొందెను. అట్లు హరి యింద్రునికై బలిని వంచించి సర్వము హరించెనని వింటిని. యజ్ఞపాలకుడు - సత్యస్వరూపుడునగు నచ్యుతుడే యిట్లొనరింపగ నన్యుడెవడు మోసము చేయకుండును? కావున నెప్పుడును నెవ్వరును నెవ్వరిని విశ్వసింపరాదు. చిత్తములోభాయత్తమైన వానికి పాపభీతి యెక్కడిది?

మునీశ! లోభోపహతులగు ప్రాణులు దురితములొనరింతురు. అట్టివారికెప్పుడేని ఎచ్చటనేని పరలోకభీతియుండదు. లోభాయత్తచిత్తులు మనోవాక్కాయ కర్మలతో పరుల విత్తమపహరించి నరకమున గూలుదురు. నరులు సురల నారాధించి ధనము బడయజూతురు. కాని, దేవత లెవరిచేతికి ప్రత్యక్షముగ నెప్పుడేని ధనము తెచ్చి యీయరు. వారితరుల నుండి గ్రహించి తెచ్చి యిత్తురు. వ్యాపారముతో - దానముతో - బలముతో - దొంగతనముతో వైశ్యులు ధనవస్త్రాదులు గడించి తనియక తమకింకను ధనము రావలయునని దేవతల నర్చింతురు. వర్తకము చేయునపుడిది పరవిత్తహరణమనుభావ మతనికి గలుగదు. దానిని గ్రహించునప్పుడది వృద్ధిగావలయుననియు దానికెక్కువ వెల రావలయుననియు వర్తకుడు గోరుచుండును. ఇట్లు ప్రతివారును పరద్రవ్య హరణము చేయజూతురు. ఇంక నెవ్వనినని విశ్వసింపవలయును? కనుక లోభమోహములు గలవారి తీర్థ సంసేవనము వృథ! వారియధ్యయనము వ్యర్థము; వారి దానము నిరర్థకము; వారి కృతము లకృతములగును. కావుననో ద్విజవరా! ఈ నా వైరిరాజును వాని యింటికి పంపుము. అపుడు నేనిట జానకివలె సపుత్త్రనై వసింగలనను అనునామె పలుకులు విని తపోవీర్యశాలియగు భారద్వాజ మహర్షి యుధాజిత్తును జేరి, రాజా! స్వేచ్ఛగ నీపురమున కరుగుము. దుఃఃత బాలపుత్త్రయగు మనోరమ నీకు లభించదు అని పలుకగా యుధాజిత్తు ఓ మునీ! హఠము మానుము. మనోరమను వదలుము. ఆమెను గొనిపోక నేను పోను. నా బలము ప్రయోగించియైన నామెను పట్టుకొని పోదును అనెను. 

ఋషి ఇట్లనియెను: ''నీకు శక్తియున్న నీ బలము చూపి యీమెను మున్ను వసిష్ఠమమహర్షి నుండి విశ్వామిత్రుడెట్లు ధేనువున పహరించెనో అట్లు నా యాశ్రమమునుండి గొనిపోమ్ము చూతము. (తుదకతడేమయ్యెనో తెలియదా)''

అధ్యాయము 49 సుదర్శనుడు కామరాజ బీజము జపించుట

Chapter 47 Seeking refuge with the sages with Manorama Sudarshan - అధ్యాయము 47 మనోరమ సుదర్శనునితో మునుల శరణు వేడుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 47

మనోరమ సుదర్శనునితో మునుల శరణు వేడుట

వ్యాసు డిట్లనియె: ఆ విధముగ నిరువురు రాజులను శస్త్రపాణులై మోహరించి రణరంగమున నిలుచుండిరి. క్రోధ లోభవశులగు వారిరువుర మధ్య తీవ్రమైన పోరాటము సంఘటిల్లెను. యుధాజిత్తు ధనుర్బాణధారియై తన విపుల సేనతో రణమున కాయత్తు డయ్యెను. వీరసేనుడును క్షాత్రధర్మానుసారముగ సురపతి సమతేజుడై సేనాసమేతుడై సమర రంగమున బోరుటకు సంసిద్ధుడయ్యెను. సత్యపరాక్రముడగు వీరసేనుడు క్రోధోద్రిక్తుడై తన యెదుట నున్న యుధాజిత్తుపై పిడుగులు పడునట్లు మహావేగముగల వాడి బాణములతో వర్షము గురిపించెను. యుధాజిత్తు తన పైకి వచ్చు శత్రు బాణములను తన వాడి బాణములతో సగములోనే తునుకలు చేయుచుండెను. ఆ రీతిగ రథ గజ తురగ పదాతి దళముల నడుమ తుముల యుద్ధము సాగుచుండెను. సుర నర మునిగణము లా పోరు గాంచుచుండెను. కాకులు గ్రద్దలు మున్నగు పక్షుల గుంపులచే నింగి కప్పబడెను. వీర గజతురగముల శరీరములనుండి నెత్తురు టేర్లు ఘోరముగ కాల్వలు గట్టసాగెను. అవి పాపాత్ముల పాలిటి వైతరుణి ప్రవాహములవలె ఘోరముగ నుండెను. యమునానదీ తట జాతులైన-ఆట లాడుకొను బాలురచే యమునయందుంచబడిన తుంబీఫలములో యన రక్తనదీతీర మందలి నెత్తుటి తిన్నెల పై తెగిపడిన పీనుగుల తలలు పడియుండెను. ప్రేతాత్మలు తమ చక్కని తనువులను వదలిపోలేక అవశములైనను మరల వానిలో బ్రవేశింప దలంచుచున్నవో యన నరదమునుండి నేలగూలిన మృతవీరుల శవములపై కాకులును గ్రద్దలును కాట్లాడుచుండెను.

ఆ రణమందు నిహతుడై యమరుడైన యొక వీరుడు దివ్య విమాన మెక్కి తన్ను వలచివచ్చి తన యొడిలో నున్న యచ్చర లేమతో 'నో కరభోరు! బాణపు దెబ్బలకు నేలగూలిన నా చక్కని మేను గనుమా' యని యామెకు చూపుచుండెను. మఱొక్క వీరుడు హతుడై అంతరిక్షమున కేగి యమరకన్యతో దివ్య విమానమున విహరించుచుండగ నతని అబల (భార్య) సహగమనము చేసి సబలయైన దివ్యరూపమున తన పతిని కలిసికొనెను. ఇరువురు వీరులు పరస్పర శస్త్రములతో పోరి యొకేసారి యీల్గి దివి కేగి యచ్చట నొకే యందాల యచ్చరలేమ పొందికకై తగవులాడుకొనుచుండిరి. అమరుడైన వేరొక్కవీరుడు తన్నుమించిన రూప ¸యవనగుణములుగల దేవకన్యను బడసి యామెకు తనపై ప్రీతి మెండుగ నుండునట్లుగ తన గోరంతలను కొండంతలుజేసి చెప్పుకొనుచు ప్రేమతో ఆమె ననుసరించెను అత్తఱి నేలనుండి నింగి కెగసిన ధూళి సూర్యుని గప్పివేసెను. రాత్రి నొనరించెను. ఆ ధూళియే వెంటనే రక్తపు సంద్రమున బడుటవలన రవి మరల మింట వెల్గెను. ఇంకొక్క వీరుడు దివి కేగి భక్తియుక్త చారువదన యగు నొక్క దేవకామినిని జేరియు తన నిశ్చలబ్రహ్మచర్య మెక్కడ చెడిపోవునో యని తన పేరున కెక్కడ కళంక మేర్పడునోయని యా యన్నుల మిన్న కూడికకు నొప్పక మిన్నకుండెను. అట్లు దారుణముగ పోరు జరుగుచుండగ యుధాజిత్తు తన తీవ్రబాణములతో వీరసేనుని సంహరించెను. వీరసేనుడు తలతెగి నేలబడగనే యతని సమస్తబలము చెల్లాచెదరై నలుదెసలు ముట్ట పరుగెత్తెను.

తన తండ్రి రణమున నిహతుడగుట విని మనోరమ తన తండ్రి వైరియగు యుధాజిత్తువలని భయమున విహ్వల చిత్తయయ్యెను. యుధాజిత్తు తీరని రాజ్యదాహముచే దురాశయుడు-పాపాత్ముడు. అతడు తప్పక తన కొడుకునుగూడ హతమార్చునని యామె చింతిల్లెను. నే నిపుడేమి చేయుదును? నాకు దిక్కెవ్వరు? నా తండ్రి మరణించెను. నా పతియు దివంగతుడయ్యెను. ఇక నా కొడుకో! అతడు బాలుడు. లోభము చాల చెడ్డది. దాని కెంత మంచివాడైనను తలవంచి తీరును. అట్టి లోభావిష్టులైన రాజు లేదైన చేయగలరు. లోభావిష్టుడగు నరుడు తన బందుగులను అన్నదమ్ములను తలిదండ్రులను గురువులను సైతము వెనుకముందు లాడక చంపివేయగలడు. ఆతడు తినరానిది తినును. పోరాని చోట్లకు పోవును. వేయేల! లోభతృష్ణార్తుడైన నరుడేదియైన చేయజాలును. తుదకతడు స్వధర్మమునకును తిలోదకము లిచ్చును. నే నిపుడీ నగర మందుండి నా సత్పుత్త్రుని గాపాడుకొనదలచినచో నా కిట గుండె ధైర్యముతో సాయపడువాడు లేడు. నా కొమరు డొకవేళ వైరి రాజుచేత జచ్చెనా - పిమ్మట నేను చేయగలుగునదేమి? నా కీ లోకమున నా యను వాడెవ్వడు? అతనిని చూచుకొనియే గద నా బ్రదుకు వెలగవలె! నే నింకెవనికి చెప్పుకొని సుఖింతును? నా సవతి లీలావతియు నాపై నెల్లపుడు పగబూని నది కావచ్చును. ఆమె యింక నా కొమరునిపై జాలి పూనుట కల్ల. ఇప్పుడిచ్చోటికి యుధాజిత్తు వచ్చినచో నేనీ నగరము నుండి బయటకు పోజాలను. ఆతడు నా కొమరుని కారాగారబద్ధుని చేసి తీరును.

తొల్లి యింద్రుడు తన తల్లి గర్భమునందలి శిశువు నేడు ఖండములుగ చేసెను. తిరిగి యా ఖండములు ఏడు ఏడులుగ నయ్యెను. అట్టు లింద్రుడు తన తల్లి గర్భము ప్రవేశించి యొక చిన్న వజ్రము తునుకతో ఖండింపగ నలువది తొమ్మిదిమంది మరుత్తులు పుట్టి వారు దివిపై విలసిల్లుచున్నారు. మున్నొక రాజు భార్య తన సవతి గర్భవతియగుట కని యా గర్భ నాశమున కామె కింత విషము తినిపించెనని నే వింటిని. పిదప ఆమెకు పుట్టిన శిశువు విషయుతుడగుటవలన భూమండలమునందు సగరుడను విఖ్యాత నామము బడసెను. పూర్వము కైక తన సవతి కుమారుడును జ్యేష్ఠుడును నగు శ్రీరామచంద్రు నడవుల కంపగ రామ! రామ! రామ! యని యతనిని తలంచుచు దశరథుడు ప్రాణములు వదలెను గదా! ఆనాడు నా సుదర్శనునకు పట్టముగట్ట తలపెట్టిన మంత్రివర్యు లీనాడు యుధాజిత్తుని వశమున నున్నారు. ఇపుడు నా యన్నయు నన్నీ యిక్కట్టులనుండి పాపజాలినవాడు కాడు. అక్కటా! నాకు దైవదుర్విపాకమున నెంతటి సంకటము వాటిల్లెను. ఏది యెట్టులైనను ప్రయత్న మవశ్యకార్యము. కార్యసిద్ధి దైవాధీనము. కనుక నే నిపుడు నా పుత్త్ర రక్షార్థము సత్వరముపాయ మొనరింతును అని మనోరమ యీ రీతి తనలో దలపోసి సర్వకార్య నిపుణుడును అతిమానియు నగు విదల్లుడను మంత్రివర్యుని బిలిచి తన బాలుని గొని దీనాననయై 'నా తండ్రి రణమున గూలిపోయెను. నా కొడుకు బాలకుడు. యుధాజిత్తు బలశాలియగు శత్రురాజు. ఇప్పట్టున నా కర్తవ్య మేదియో యానతిమ్ము' అని యేకాంతమున నతనితో చెప్పి యేడ్చెను. 'మన మిట నుండదగదు. వనముల కేగి యచటినుండి కాశి జేరుదము. అచట మా మేనమామ సుబాహుడు గలడు. అతడు మహాబలవంతుడని ప్రఖ్యాతి గడించినవాడు. అతడు మనకు తప్పక శరణ మిచ్చును. నీవు నీ తండ్రిని దర్శించు నెపమున వెడలుము. పిమ్మట మనము రథ మెక్కి పోవచ్చును. దీనివలన నెవరికిని సందియ మావంతయు గలుగదు' అని విదల్లుడామెతో ననెను.

మంత్రిమాటలు విని మనోరమ లీలావతిని జేరి నేను నా జనకుని చూడ నేగుచున్నానని పలికి సైరంధ్రితోను విదల్లునితోను రథ మెక్కి నగరమునుండి నిర్గమించెను. ఆమె విగతజీవుడై పడియున్న తన తండ్రిని గాంచి ఆర్తయు అతి దీనయు శోకసమాకులయు భయవిహ్వలయునై వణకుచు తన తండ్రికి పరలోకక్రియ లొనర్పజేసి పిదప రెండునాళ్లలో గంగాతటము చేరెను. అచట పెక్కురు శఠులు దస్యులు విషాదులు చేరి యామె ధనమును దోచుకొని రథముగొని పారిపోయిరి. అట్టులా చారువక్త్రయగు మనోరమ సైరంధ్రి చేయూతగాగ తన తనయుని వెంటబెట్టుకొని వలవల ఏడ్చుచు గ్రక్కున నొక్క పడవ యెక్కి భయాకులమతితో పుణ్యభాగీరథిని దాటి త్రికూట పర్వతము జేరెను.

పిమ్మట ఆమె త్వరత్వరగ భారద్వాజాశ్రమముజేరి యచటి తాపసులను వీక్షించి భయాకులత్వము వీడి నిర్భయత్వ మందెను. ఆమెను గని భరద్వాజ ముని 'ఓ శుచిస్మితా! నీ వెవరవు? ఎవ్వారి ధర్మపత్నివి? ఇన్ని క్లేశములతో నిక్కడి కేల వచ్చితివి? నీకు వచ్చిన బాధ యేమి? సర్వము నిజము తెలుపుము. నీవు దేవతవో! మానుషివో! ఈ బాలపుత్త్రుని గొని వచ్చుటచే నీవు రాజ్యభ్రష్టవని తోచుచున్నది.' అని పలికెను. దుఃఖసంతప్తయగు మనోరమ కన్నీరుమున్నీరుగా విలపించుచు తా బలుకలేక విదల్లుని బలుకు మనగా 

విదల్లు డిట్లనియె: 'ఈ యమ ధ్రువసంధి నరేశుని ధర్మపత్ని. పేరు మనోరమ. ఆ రాజు రవి వంశజుడు. అతడొక సింహమువాత బడెను. ఈ బాలకుడతని కొడుకు. ఇతని పేరు సుదర్శనుడు. ఈ మనోరమ తండ్రియు తన మనుమని పక్షమున బోరి నిహతు డయ్యెను. అంత నీమె యుధాజిత్తువలని భీతిచే నిట్లు వనములు పట్టి మీ యాశ్రమము ప్రవేశించినది. మహానుభావుడవగు ఓ మునిసత్తమా! ఈమె తన చిన్నారి ముక్కుపచ్చలారని రాకుమారునితో నిన్ను శరణు వేడుచున్నది. నీవు వీరికి రక్షకుడవు గమ్ము. ఆర్తులకు శరణ మిచ్చుట యాగములకంటె నధికపుణ్యప్రదమని పెద్దలందురు. అందును భయత్రస్తుడు దీనుడునైన వానికిచ్చుట విశేష పుణ్యఫలప్రదము, 

ఋషి యిట్లనియె: 'ఓ కల్యాణీ!సువ్రతా!నీవు నిర్భయముగ నిచట నీ కుమారుని పోషించుకొనుచుండుము. నీకిట శత్రుభీతి యేమాత్రమును గలుగదు. నీ బాలుని సుదర్శనుని కాపాడుకొనుము. ఇతడే రాజు గాగలడు. ఇట నీకు దుఃఖ శోకములు లేశమాత్రము సంభవింపవు, అని ఋషి పలికెను. భారద్వాజుని ప్రియవచనములు విని మనోరమ గుండె నిబ్బరము చేసికొని ముని చూపిన కుటీరమందు వీతశోకయై మసింపసాగెను. ఈ రీతిగ మున్యాశ్రమమున మనోరమ సైరంధ్రీవిదల్లులతో తన కుమారుని పోషించుకొనుచుండెను. అని వ్యాసముని జనమేజయునితో పలికెను.

అధ్యాయము 48 యుధాజిత్తు సుదర్శనుని జంపదలచుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 46 History of Dhruvasandhi - అధ్యాయము 46 ధ్రువసంధి చరిత్ర

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 46

ధ్రువసంధి చరిత్ర

'విప్రవర్యా! నీవు శ్రీమహావిష్ణుయాగము గుఱించి సవిస్తరముగ నాకర్ణించితిని. ఇపుడు శ్రీవిశ్వమాతయొక్క మాహాత్మ్యము విపులముగ విశదపఱచుము. నీ యనుగ్రహభాగ్యమున శ్రీదేవీ దివ్యచరిత్ర మహత్త్వము నాలకించి పవిత్రుడనై శ్రీభగవతీ యజ్ఞ మాచరింతును.' అని జనమేజయుడడుగ. 

వ్యాసు డిట్లనెను: రాజా! శ్రీ మాతృదేవియొక్క సనాతన పవిత్ర చరిత్ర నీకు వినిపింతును. తదేకచిత్తమున నాలకింపుము. పూర్వము కోసలదేశమందు సూర్యవంశమున జన్మించిన మహాతేజస్వియగు ధ్రువసంధి యను మహారాజుండెను. ఆతడు పుష్పరాజునకు కుమారుడు. ఆ ధ్రువసంధి ధర్మాత్ముడు-సత్యసంధుడు-శుచివ్రతుడు-వర్ణాశ్రమ ధర్మపాలకుడునై సకల సంపత్సమృద్ధమగు నయోధ్యను రాజధానిగ చేసికొని ఏలుచుండెను. ఆతని యేలుబడిలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు తమ తమ వృత్తులందేమఱుపాటులేక వర్తించుచు ధర్మయుక్తులై యుండిరి. ఆ రాజ్యమందు దొంగలు పిసినిగొట్టులు మూర్ఖులు ధూర్తులు డంబాచారులు కృతఘ్నులు మచ్చునకైన కనబడరు. ఆ రీతిగ రాజ్య మేలు ధ్రువసంధి కిరువురు భార్యలుండిరి. వారిరువురును సురూపసంపదలు గలవారు. రాజును సకల కామభోగములతో దనుపువారు. వారిలో మొదటి ధర్మపత్ని మనోరమ. ఆ యమ సురూపవతి. విచక్షణురాలు. చతుర. సుగుణముల కాలవాలము. రెండవ భార్య లీలావతి రూపవతి-గుణవతి.

ఆ రాజు తన భార్యలంగూడి గృహములందు వివిధ సౌధములందును వనోపవనములందును క్రీడాపర్వతము లందును డిగ్గియలందును విహరించుచుండెను. అంతనొక శుభసమయమున మనోరమ సర్వరాజలక్షణ లక్షితుడగు నొక పుత్త్రుని గనెను. ఆతని పేరు సుదర్శనుడు. లీలావతియు నదే మాసమున శుభపక్షమున శుభదినమున నొక కుమారుని గనెను. రాజు తన యిరువురు తనయులకు యథావిధిగ జాతకర్మాదు లొనరించెను. పుత్రోత్సాహమున విప్రులకు భూరిదాన దక్షిణ లొసంగెను. రాజు తన కొమరులందు భేదభావము పాటింపక సమభావమున నుండెను. వారును సోదరప్రేమతో నుండునట్లు చేసెను. ఆ రాజు ప్రీతితో వారికి యథావిభవముగ చూడాకర్మ జరిపించెను. చూడాకర్మలు జరిగిన పిమ్మట ఆ బాలురు లోకానురంజకులై పితృమనోహరులై క్రీడించుచుండిరి. వారిలో మనోరమ పుత్రుడగు సుదర్శనుడు జేష్ఠుడు. రెండవ కుమారుడు శత్రుజిత్తు. అతడు చాటు వాక్యములు చతుర భాషణము లాడుటలో నేర్పరి. ఆ శత్రుజిత్తు మంచి రూపము కలవాడు. మంజుభాషి. రాజునకు మంత్రులకు ప్రజలకు ప్రీతిపాత్రుడై వర్తించువాడు. రాజునకు శత్రుజిత్తునందున్నంత ప్రేమయు మమకారమును మందభాగ్యుడగు సుదర్శనునందు లేకుండెను. అట్లు కొంతకాలము గడచిన పిమ్మట ధ్రువసంధి వేటతమకమున వనముల కేగెను. ఆతడు వనములందు మృగ-రురు-గజ-కంబు-సూకర-గవయ-శశ-మహిష - శరభ-ఖడ్గమృగాదులను వేటాడుచు క్రీడించుచుండెను.

రాజు భీకరమైన కాఱడవిలో వేటాడుచుండగ నొక క్రోధోద్రిక్తమైన మృగరాజు యమునిబోలె పొదరిల్లు వెడలి వచ్చెను. రాజు దానిని బాణముతో గొట్టెను. కాని యా సింహము దెబ్బతిని యెట్టయెదుట రాజునుగని మరింత కోపముతో మేఘ గంభీరముగ గర్జించి తోకపైకెత్తి సటలు విదళించి మహాక్రోధమున నింగికెగసి రాజుపై దుమికెను. అదికని రాజు వెంటనే చేత ఖడ్గముదాల్చి యెడమచేత డాలు బూని మరొక సింహమోయన నొప్పెను రాజభటులును కుపితులై వేర్వేరుగ పుంఖానుపుంఖములుగ సింహముపై బాణములు వేసిరి. ఆ క్రూరసింహము రాజుపై తీవ్రముగ దాడిచేసెను. ఆ ఘోరప్రహారముల వలన నచట హాహాకారములు చెలరేగెను. అట్లు తనపై క్రూరముగ దుముకు సింహమునుగని రాజు తన ఖడ్గముచేత వ్రేటువేసెను. అదియు నతనిని తన కఱకు గోటికొనలచే చీల్చివేసెను. ఆ సింహపు వాడి గోళ్ళచే దారుణముగ జీల్చబడి రాజు నేలగఱచెను. సైనికులెల్లరు దానిపై నొక్కుమ్మడిగ బాణాలు ప్రయోగించిరి. ఆ దెబ్బలకదియు నేలగూలెను. సైనికులు రాజు మరణవార్తను మంత్రులకెఱగించిరి. మంత్రులావనమునకేగి పరలోకగతుడైన రాజున కంత్యక్రియలొనర్చిరి. రాజూర్ధ్వలోకములకేగుటకు వసిష్ఠమహర్షి విధివిధానముగ నంత్యక్రియలు జరిపించెను.

అంత వసిష్ఠ మహర్షియు ప్రజలను గలిసి సుదర్శనుని రాజుగ నాలోచించిరి. సుదర్శనుడు ధర్మపత్నీ తనయుడు శుభలక్షణ లక్షితుడు పరమశాంతుడు కాననితడే రాజ్యర్హుడగునని మంత్రిసత్తములు నిర్ణయించిరి. ఈ రాజపుత్త్రుడు బాలుడైనను ధర్మాత్ముడు. కనుక నితడే సింహాసనమునకు యోగ్యుడని వసిష్ఠుడు వక్కాణించెను. ఇట్లు వృద్ధామాత్యులాలోచించుచుండ లీలావతి తండ్రియగు నుజ్జయినీపతి యుధాజిత్తు తన యల్లుని చావు విని తన మనుమనికి ప్రియము చేకూర్పదలచి త్వరితగతి నచటికరుదెంచెను. ఆట్లే మనోరమ తండ్రి గళింగాధిపతి వీరసేనుడును తన మనుమడగు సుదర్శనునకు హితము గూర్పదలంచి క్రన్నన నచటికి వచ్చిచేరెను. సైన్యసమేతులగు నా యిరువురు రాజులును కాబోవు రాజును గూర్చి మంత్రి ముఖ్యులతోడ మంతనములాడదొడగిరి.

ఈ యిరువురు రాకుమారులలో జ్యేష్ఠుడెవడు? రాజ్యమునకు జ్యేష్ఠుడు తగినవాడు. కనిష్ఠుడెన్నటికిని రాజ్యార్హుడు గాడని యుధాజిత్తు పలికెను. ధర్మపత్నికి బుట్టినవాడే యెల్ల విధముల రాజ్యమునకు దగినవాడని శాస్త్రజ్ఞులవలన వింటినని వీరసేనుడు వాదించెను. రాజులో నెట్టి రాజలక్షణములుండవలయునో యట్టివి సుదర్శనునందులేవని యుధాజిత్తనియెను. ఇట్లు రాజ్యలుబ్ధులగు నిరువురు రాజుల మధ్య తీవ్ర వాద వివాదములు చెలరేగును. వారి పోరాటమెవ్వడు నాపజాలకుండెను. ''మీరెల్లరును స్వార్థపరులు. సుదర్శనుని రాజుగజేసి ధనము సంపాదింప దలంచుచున్నాను. మీ రహస్యసమాలోచనముల వలన మీలోని యుద్దేశ్యమెఱింగితిని. కాని నిజమునకు శత్రుజిత్తు సబలుడు. నృపాసనమునకు యోగ్యుడు. సేనాసమేతుడు. సుగుణఖనియగు జ్యేష్ఠుని వదలి నేను బ్రతికియుండగనే చిన్నవానినెట్లు రాజుగ చేయుదురు? నేనిపుడు యుద్ధము చేయుదును. అందు నా వాడి ఖడ్గధారచే నేల వ్రయ్యలగును. ఇక మీరొక లెక్కయా?'' అని యుధాజిత్తు మంత్రులతో ననెను. ''ఇరువురు కుమారులును సమ ప్రజ్ఞులు. వారిలో నెట్టియంతరమును గోచరింపదు'' అని వీరసేనుడు యుధాజిత్తుతో వాదించెను. ఇట్లాపుడమి పతులిద్దఱును వాదించుకొనుచుండగ ఋషులను జనులును వ్యగ్రమనస్కులైరి. అంత సేనాసమేతులగు సామంతులు విచారించి చేయునదిలేక యుద్ధసన్నద్ధులైరి. అదే సమయమునందు రాజు మరణవార్త విని శృంగివేర పురవాసులగు నిషాదులు రాజద్రవ్యమపహరింప నచ్చటికి వచ్చిరి. బాలురగు రాకొమరులు పరస్పరము కలహించుకొనుట విని దేశదేశాంతరమందలి చోరులచ్చటికి వచ్చిరి. ఇట్లు కలహము చెలరేగగ జనసమ్మర్ద మెక్కువయ్యెను. యుధాజిద్వీర సేనులు యుద్ధకాములై నిలుచుండిరి.

అధ్యాయము 47 మనోరమ సుదర్శనునితో మునుల శరణు వేడుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 45 Lord Vishnu performing the Sridevi Yajna - అధ్యాయము 45 శ్రీమహావిష్ణువు శ్రీదేవీయజ్ఞ మాచరించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 45

శ్రీమహావిష్ణువు శ్రీదేవీయజ్ఞ మాచరించుట

రాజట్లనియె: పితామహా! జగత్కారణభూతుడు ప్రభవిష్ణువు విష్ణువునగు శ్రీహరిచేత పూర్వమీ దేవీయజ్ఞమెట్టు లాచరింపబడెను? దానికి సహాయకులెవరు? ఋత్విజులెవరు? వేదవిదులగు బ్రాహ్మణులుగనెవరెవరు నియమింపబడిరి? నాకిదంతయు విశదమొనరింపుము. శ్రీవిష్ణువు శ్రీదేవీ యాగమొనరించిన విధానమెఱిగిన పిదప నేను విధి ప్రకారమున దేవీయాగము నదే విధముగ నాచరింపగలను. 

వ్యాసుడిట్లనియె: రాజేంద్రా! పూర్వము విష్ణువుచే విధి పూర్వకముగ నాభగవతీ దేవీ యాగమెట్లు పరమాద్భుతముగ సమాచరింపబడెనో దెలుపుదును. సమాహిత మతితో నాలకింపుము. సృష్టికి పూర్వము బ్రహ్మ విష్ణు మహేశ్వరులా పరాదేవతచేత దివ్యశక్తులు బడసి యామె యనుమతితో విమానము మీద బయలుదేరిరి. ఆ మువ్వురు బుధోత్తములును ఘోర మహార్ణవముజేరి తమ తమ నివాసము లేర్పరచుకొనుటకై ముందుగ భూమిని సృష్టించిరి. అంత నాదేవదేవి భూమి కాధారశక్తి నొసంగుటచే నా యాధారమున భూమి అచల అయ్యెను. మధుకైటభుల మేదస్సు కలియుటవలన మేదిని యనియు సర్వమును ధరించుటవలన ధరయనియు విస్తారముగ నుండుటవలన పృథివియనియు భూమి పిలువబడెను. సర్వాధిక్యము నందుటవలన భూమికి మహియనియు పేరుగలదు. ఆమె యాదిశేషుని శిరములపై నుంచబడెను. భూమిని ధరించుట కున్నత విశాలములగు పర్వతములు సృష్టించబడినవి.

ఒక పెద్దకట్టెకు నినుపచీలలు బిగించియున్నట్లు పర్వతములు భూమియందు నెలకొల్పబడినవి. కావున గిరులు బుధులచేత మహీధరము లని పేర్కొనబడును. ఆ గిరులలో మేరుగిరి బహు యోజనముల వైశాల్యముగలిగి మణిదీపశిఖరములతో నలరారుచు మహాద్భుతముగ రంగారుబంగారు కాంతు లీనుచు తనరారుచున్నది. మరీచి నారదుడు పులస్త్యుడు పులహుడు అత్రి క్రతుడు వసిష్ఠుడు దక్షుడు ననువారలు బ్రహ్మ మానసపుత్త్రులు. మరీచికి కశ్యపు డుద్భవించెను. ఆతనికి దక్షుని కూతురుతో వివాహము జరిగెను. వీరిరువురికి పెక్కురు దేవదానవులు సముద్భవించిరి. ఆ కశ్యపునివలన విస్తారమైన కాశ్యపసృష్టి జరిగెను. కాన భూమికి కాశ్యపి యనియు పేరు గలిగె. ఆ కాశ్యపునివలన మనుజులు పశువులు పన్నగములు మున్నగు భేదములతో లోకసృష్టి జరిగెను. బ్రహ్మ కుడిభాగమునుండి స్వాయంభువ మనువు నెడమభాగమునుండి శతరూపయను నామె ఉద్భవిల్లిరి. వీరిరువురకు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు నను కుమారులును మఱి మువ్వురు వరారోహలగు చక్కని కూతులును జన్మించిరి. ఇట్లు బ్రహ్మ విశ్వరచన సాగించి సుమనోహరమైన మేరుగిరిపై తన లోకము నిర్మించుకొనెను. శ్రీవిష్ణు భగవానుడు సర్వలోకములకు మీద రమారమణమై రమణీయమైన క్రీడాస్థానముగల యకుంఠితమైన వైకుంఠధామ మేర్పరచుకొనెను. భక్తవశంకరుడగు శంకరుడు భూతగణములతో స్వేచ్ఛగ విహరించుట కనువైన కైలాసగిరిని తన నివాసముగ నియమించుకొనెను. మహేంద్రుడు మేరుగిరిపైన స్వర్గసీమ నిర్మించుకొనెను. అది నానారత్న విరాజితమై కామప్రదమై తనరారుచున్నది.

పాలసంద్రమును మధించి నప్పుడందుండి దివ్యవృక్షమగు పారిజాతము చతుర్దంతములుగల యైరావతము కామితములెల్ల వర్షించు కామధేనువు నుద్భవించెను. అశ్వరాజమగు నుచ్చైఃశ్రవము రంభాద్యప్సరోగుణము సకలస్వర్గభూషణములు నింద్రునకు లభించినవి. సముద్రమునుండి పుట్టిన చంద్రుడును ధన్వంతరియు స్వర్గసీమలో దేవతల నడుమ విరాజిల్లు చున్నారు. ఈ తెఱుంగున దేవతలు మనుష్యులు తిర్యక్కులునను ముత్తెఱంగులతో మొదటి సృష్టి జరిగినది. ఎల్లజీవులు తమ తమ కర్మానుసారముగ నండజములు స్వేదజములు ఉద్భిజ్జములు జరాయుజములు నను నాల్గు తెఱంగుల నుత్పన్నములైరి. ఈ విధముగ బ్రహ్మవిష్ణుమహేశ్వరులు విశ్వసృష్టికార్య మారంభించి తమ తమ నెలవులందు యథేచ్ఛగ విహారము సల్పుచుండిరి. ఇట్లు సృష్టిక్రమము జరుగుచుండగ శ్రీమహాలక్ష్మీ సమేతుడై జగన్నాథుడైన యచ్యుతుడు వైకుంఠమున నానందవిలాసముల తేలియాడుచుండెను. ఇట్లు విశ్వుడగు హరి యల వైకుంఠపురంబులో నకుంఠితగతినుండి యొక్కనాడు సుధాసాగరమధ్యమున దీపిల్లు మనిద్వీపమును నెమ్మదిలోన దలంచెను. ఆ శ్రీహరి పూర్వ మాసాగర మధ్యమందే మహామాయను సందర్శించి యా దేవి మాయవలన స్త్రీరూపమంది యా దేవి దయవలన మంత్రరాజము బడసెను.

అట్టి రమారమణుడు శ్రీదేవీ యాగ మొనర్పదలచి తన భవనము వెడలి శంకరు నాహ్వానించెను. శ్రీవిష్ణువు-బ్రహ్మ-ఇంద్రుడు-అగ్ని-యముడు- వరణుడు-కుబేరుడు-వసిష్ఠుడు-కశ్యపుడు-దక్షుడు-బృహస్పతి మొదలుగాగల దేవతల నాహ్వానించెను. వారెల్లరును యజ్ఞార్థము సాత్త్వికములు - మనోహరములు - మహావిభవ సంభరితములు-నగు పెక్కు యాగ సంభారములు సమకూర్చిరి. అంత దివ్యశిల్పులచేత విశాలమైన మండపము నిర్మింపబడెను. ఆ యజ్ఞమునం దిరువదియేడుగురు ఋత్విజులుగ నియమింపబడిరి. బ్రహ్మణులు విశాలమైన యజ్ఞవేదిక నేర్పఱచి యందగ్నిని ప్రతిష్ఠించి శ్రీదేవీ బీజసంభరితములగు దేవీ మంత్రములతో హోమము చేసిరి. వారి విధముగ విధివిధానముగ హోమము జరుపగ నాకాశవాణి సుస్వరముతో మదుర మధురముగ సుధలొలుకబోయుచు నిల్లు పలికెను: 

"ఓ విష్ణూ! నీవు సకల దేవతలలో శ్రేష్ఠతముడవు. నఖిలసురలకు మాన్యుడవు. పూజ్యుడవు. దక్షుడవు. ఇంద్రుడు మున్నగు దేవతలెల్లరు నిన్ను పెక్కురీతుల నర్చింపగలరు. మానవులు నీయందు మధురభక్తిపూరితులై వర్తింతురు. సర్వమానవాళికి నీవు వరదాయకుడవై ప్రఖ్యాతిగాంతువు. అఖిల దేవతలకు కామితార్థప్రదుడవు-పరమేశ్వరుడవు-యజ్ఞముఖ్యుడవు-పరమపూజ్యుడవు నగుదువు. సకల యాజకులు నిన్నే యాజింతురు. సకల జనులు నిన్ను పూజింతురు. దానవ పీడితులైన దేవతలు నిన్ను శరణు జొత్తురు. నీ వెల్లవారి కభయప్రదుడవు-వరదుడవు గాగలవు.

పురుషోత్తమా! నీవు సర్వశరణ్యుడవు. సకల వేదపురాణములందు నీవే పూజనీయుడవు. నీవే పరముడవు-విశ్వమాన్యుడవు. నీ కీర్తిచంద్రికలు దెసలు వ్యాపించును. ఈ భూతలమునం దధర్మము పెచ్చు పెరిగి ధర్మహాని సంభవించును. ఆ సమయములందు నీవు నీ యంశముతో ధర్మసంస్థాపనకు యుగయుగములన నవతరింపగలవు. నీ వీ భూమిపై పెక్కు లవతారములు దాల్చెదవు. భూతభావనా! మాధవా! నీ యవతారము లెల్ల మహాత్ములకు మాననీయము లగును. నీ వనేక యోనులందు పెక్కవతారములు దాల్చెదవు. మధుసూదనా! ఇట్లు నీ దివ్యావతారము లెల్లలోకములందును ప్రసిద్ధి గాంచును. ఈ యెల్ల యవతారములందు నా మహాశక్తి నీకు తోడునీడగ నుండగలదు. ఆ దివ్యశక్తి నా యంశమున జనించి చిత్రవిచిత్ర కార్యములు పెక్కులు మానవాతీతములు సాధించగలదు. శ్రీనారసింహి-వారాహిమున్నగు పలుభేదములతో నా శక్తి యొప్పారుచుండును. నా శక్తిస్వరూపిణులు నానాయుధధారిణులు-శుభకారలు-దివ్యభూషణభూషితలు-నై నెగడుదురు. నీవు నా వరప్రభావమున నట్టి నా శక్తులనుగూడి సర్వాతిశాయులగు దేవకార్యములు నెరవేర్చగలవు. నీ వెన్నడు నెప్పుడు నెంతమాత్రము వారిని కించపఱచరాదు. ఆ శక్తులు కర్మభూమియగు భరతఖండమున సర్వకామములు కురియుదురు. వారెల్లవారికి పూజనీయులు. ప్రయత్నపూర్వకముగ మాననీయులు.

ఆ శక్తి దేవతలు ప్రతిరూపమున మానవులచేత పూజలందుకొందురు. భక్తుల వాంఛితము లీడేర్తురు. వారి మూలమున నీ కీర్తియు నేల నాలుగు చెఱగుల వ్యాపించును. నీవు భూమండలమందు సప్తద్వీపములందు చిరయశము గాంతువు. మహాభాగుడవగు నిన్ను-నా దివ్యశక్తులనుజనులు తమ వాంచాసిద్ధికి పలుభావములతో కానుకలతో సకాములై యర్చింతురు. అచ్యుతా! నీ దివ్యనామజపము వేదోక్త మంత్రములతో జరుగుచుండును. నీ మహోజ్జ్వలశక్తి మహిమము భూమండలమంతయు నిండును. స్వర్గమున వ్యాపించును. అనంతా! నిన్ను పూజించుటవలన నెల్లదేవతలు నరులు పచ్చని బ్రతుకులతో కలకలలాడుదురు. 

వ్యాసుడిట్లనెను: అని యిట్లు గోవిందునకు వరము లొసగి యాకాశవాణి విరమించెను. అమృతము జాలువాఱు శ్రీదేవీ వాక్కు లాలకించి విష్ణు భగవానుడు సంప్రీతుడై విధివిధానముగ శ్రీదేవీ యజ్ఞమును సమాప్తము గావించెను. పిదప వైకుంఠుడు బ్రహ్మపుత్త్రులను మునికుమారులను వీడ్కొలిపి తన యనుచరులతో గరుడునెక్కి వైకుంఠ మేగెను. ఎల్లదేవతలు తమతమ నివాసముల కరిగిరి. మునులు పరమవిస్మితులై తమలో తాము దేవినిగూర్చి తలపోయుచు హర్షము వెలిపుచ్చుచుండిరి. ఆ పిదప మును లెల్లరు తమతమ పిత్రాశ్రమములకు జనిరి. కర్ణపేయము-దివ్య సుందరము-మహిమాన్వితమునైన యాకాశవాణిని చెవులపండువుగ వినినంతనే యెల్లరికి శ్రీదేవియందు భక్తి ఉప్పొంగెను. ఆనాటినుండి సకల మునులు బ్రాహ్మణులు భక్తితో దేవీపూజ సలుపదొడగిరి. మునివరులారా! నిజముగ శ్రీదేవీపూజ ఫలదాయకము. ఆగమోక్తము.

అధ్యాయము 46 ధ్రువసంధి చరిత్ర

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 44 Sridevi Yajna Method - అధ్యాయము 44 శ్రీదేవి యజ్ఞ విధానము

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 44

శ్రీదేవి యజ్ఞ విధానము

స్వామీ! ఆ పరాదేవీ యజ్ఞవిధానము నాకు చక్కగ నెఱిగింపుము. దానిని విని యథాశక్తిగ నిశ్చలమతితో యాగమొనరింపగలను. శ్రీ మహాదేవీ యాగమునకు పూజా విధానమెట్టిది? ఏ మంత్రములు పఠించవలయును? ఏయే ద్రవ్యములావశ్యములు? ఎందఱు విప్రులు గావలయును. ఎంత దక్షిణలీయవలయును? ఇదంతయును నాకు సవిస్తరముగ దెలుపుము అని జనమేజయుడడుగ 

వ్యాసుడిట్లనెను: భూపతీ! ఆ దేవీ యజ్ఞవిధానము దెలుపు ఆలకింపుము! ఇది వేదోక్తమును విధ్యుక్తమునగు యాగము. సాత్త్వికము మునులకును రాజసము రాజులకును తామసము రాక్షసులకును సంబంధించినవి. ఆత్మానాత్మ వివేకముగల జ్ఞానులు చేయు యాగము నిర్గుణ మైనది. అనగా అట్టి విముక్తుల యాగము పరిపూర్ణ జ్ఞానమయమై యొప్పారును. వానినన్నిటిని తేటతెల్లముగ వివరింతును వినుము. దేశకాలమంత్ర ద్రవ్యములలో బ్రాహ్మణులతో గూడి సాత్త్వికశ్రద్ధతో వెలయు యాగము సాత్త్విక యజ్ఞము. మంత్ర ద్రవ్యక్రియా శుద్ధులతో జరుగు యాగము సంపూర్ణఫలప్రదమగును. అన్యాయముగ సంపాదించిన డబ్బుతో చేసిన యాగమువలన నీ లోకమున కీర్తియు పరలోకమున సౌఖ్యమును గలుగజాలవు. కావున న్యాయధర్మములతో గడించిన ద్రవ్యములతో యాగ మొనరించినచో నిహమందు కీర్తియు పరమందు సుఖశాంతులను గల్గును.

పాండవులు భూరిదక్షిణలతో రాజసూయమను మహాయాగమొనరించుటెల్ల నీవెఱింగినదే కదా! అందు మహామనస్వియు యదువంశ తిలకుడునగు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగ నుండెను. సకల విద్యాపారంగతులగు భారద్వాజాది బ్రాహ్మణులు నుండిరి. ఆ యజ్ఞము పురిపూర్ణమైన పిదప నొక నెలకే వారు దారుణమైన వనవాస క్లేశము లనుభవించిరి. జూదమునందోటమి ద్రౌపది పరాభవము దుర్గమ వనవాస క్లేశములు వారనుభవించిరి గదా! మఱి వారి యాగఫలిత మేమైనట్లు? మహోర్జితులు మానధనులు ద్రౌపదీసహితులగు పాండవులు విరాటుని చెంత దాస్యమొనర్చిరే! రూపాభిమాని దుర్విదగ్ధుడు బలగర్వితుడునగు కీచకాధమునిచేత నారీమణి ద్రౌపది లాగబడినదే! అట్టి సంకటపరిస్థితులలో నెల్ల బ్రాహ్మణుల యాశీర్వచన బలము లేమయ్యెను? వాసుదేవునందలి వారి నిశ్చల భక్తికి ఫలిత మేమయ్యెను? ఆ సాధ్వీమతల్లియగు ద్రౌపదిని రక్షించువారే సభలో లేకపోయిరే! అయ్యో! ఆ పతివ్రతాతిలకము తలవెంట్రుకలు పట్టి నిండుకొలువులో నేలవడనీడ్చిరి గదా! సర్వభూతాత్మకుడగు వాసుదేవుడును ధర్మసుతుడగు ధర్మరాజును బ్రదికియుండగనే ధర్మమునకు గ్లాని యేర్పడెను గద! దీని కంతటికిని కారణమేమో విచారింపవలసి యున్నది. దీనికంతటికిని భవితవ్యతయే కారణ మందుమా! అది సరిగాదు. అట్లన్నచో ఆగమములు నిష్ఫలములగును. వేద మంత్రములు పొల్లుమాటలగును. ఇది నిజము. ఇంతేకాక ఇతరోపాయములన్నియు సాధనములన్నియు నిరర్థకములు నిష్పలములు నగును. కేవలము భవితవ్యతకే బలము చేకూరును. అత్తరినెల్ల యాగమములు నర్థవాదములగును. కర్మములు నిరర్థకములగును. స్వర్గ నిమిత్తమైన తపము వ్యర్థమగును. వర్ణాశ్రమ ధర్మములు వ్యర్థములగును. భవితవ్యత యొకటే హృదయములలో బలపడినచో దైవమును సర్వప్రమాణములు నుపాయములును వ్యర్థములగును. మన మొనరించిన మంచిపనికేదైన వైపరీత్యము జరిగినచో నందేదియో దోషమున్నదని విజ్ఞులు పండితులు భావింపవలయును. కర్మ బహువిధములుగ నుండునని కర్మవిదులగువారందురు. ప్రతి కర్మమును కర్తృభేదమున మంత్రభేదమున ద్రవ్యభేదమున ననేకభేదముల నొప్పుచుండును.

ఎట్లన - తొల్లి యింద్రుడు విశ్వరూపుడనువానిని తన గురువుగ వరించెను. కాని యా గురువు తన తల్లి పక్షమువారగు రాక్షసుల హితమునుకోరి విపరీతకార్యమొనరించెను. ఆ గురువు దేవతలకు (ప్రత్యక్షముగ) రాక్షసులకు (పరోక్షముగ) స్వస్తియగుగాక యని మాటమాటకు పలికెను. మాతృపక్షమువారగు రాక్షసులు కూడ రక్షణ చేసెను. మంత్రబలమున పుష్టిజెందిన దానవులగని యింద్రుడు కోపించి తన వజ్రముతో విశ్వరూపుని శిరములను శీఘ్రముగ ఖండించెను. ఇట్లిచట కర్తృభేదమున నిస్సంశయముగ క్రియలో దోషము సంభవించినది. కర్మ వైగుణ్యము లేనిచో నధికఫలము కలుగును. ఎట్లనగా-పాంచాల రాజగు ద్రుపదుడు రోషముతో యాగమొనర్చినను ద్రోణాచార్యుని నాశము చేయగల పుత్త్రుడు గలుగవలయునని మాత్రమే భావించి యాగము చేసినను ఫలితముగ యజ్ఞవేదినుండి ధృష్టద్యుమ్నుడుదయించుటయేకాక అధికముగ ద్రౌపదియును యాగమున సంభవించినదిగదా! తొల్లి యపుత్త్రకుడగు దశరథుడు ఒక్క కుమారుని కొఱకు పుత్త్రకామేష్టి యొనరింపగ యజ్ఞాగ్ని నుండి నలువురు కుమారులుద్భవించిరి. కాననోమహీశా! యుక్తితో చేసిన ప్రతి పనియు సిద్ధించును. అయుక్తితో చేసిన ప్రతి పనియు విపరీతఫలమొసంగును. యాగమందలి కొలది దోషమువలన పాండవులు జూదమందోడుట మున్నగు వ్యతిరేక ఫలములందిరి. సత్యవాదియు ధర్మసుతుడునగు యుధిష్ఠిరుడు నతని తమ్ములును ద్రాపదియు నిందఱుండియు శుభులైనవారు ఇందఱున్నను పాపద్రవ్యము వలనో సాభిమానత్వము కారణముననో వారుచేసిన యాగమునందు వైగుణ్యమును దానివలన విపరీత ఫలమును ప్రాప్తించినవి. రాజవర్యా! సాత్విక యజ్ఞము కడుంగడు దుర్లభమైనది. అది కేవలము వైఖానస వ్రతనిష్ఠులగు మునివర్యులకే విధింపబడినది.

అట్టి తాపసోత్తములు న్యాయార్జితము వన్యము ఋషిహితకరము సుసంస్కృతమునగు స్తాత్విక భోజనము చేయుదురు. అదే మేలైనది. పురోడాశములు మాత్రము గలిగియూ పరహితమై శ్రద్ధాభక్తులతో పరమ సంయమముతో సమంత్రకముగ నొనర్పబడు యజ్ఞములు సాత్త్విక యజ్ఞములనబడును. ఇక రాజస యజ్ఞములు ద్రవ్యబహుళమై యూపస్తంభము గలిగి అభిమాన సహితములై యుండును. అవి క్షత్త్రియులకు వైశ్యులకు విహితములు. కామక్రోధములను మదలోభములను నినుమడింప జేయునని సంస్కారము గలవి క్రూరములునగు యాగములు తామసయాగములు. అవి రాక్షసులకు మహాత్ములచే ప్రోక్తములు. ముముక్షులు విరక్తులు మహాత్ములునైన మునులకు సర్వసాధనసహితమైన మానస యజ్ఞము చెప్పబడినది. ఇతర యాగములందు కొంచెము లోపమున్నను నది పూర్ణము కాదు. బ్రాహ్మణుల శ్రద్థ ద్రవ్యము క్రియ మున్నగు వాని విషయమున లోపములుండవచ్చును. అటులే దేశకాల సాధనములందును లోటుపాటులుండవచ్చును. అట్టియెడ అవి మానస యాగమువలె పరిపూర్ణములును దోషరహితములును గావు. మానసయజ్ఞమొక్కటే దోషరహితమై పూర్ణమై శుద్ధమై వెల్లును. మొదట మన మనస్సు పరిశుద్ధమగును. దాన దేహము గూడ శుద్ధ (పాపరహిత) మగును. విషయరహితమై వృత్తులుబాసి నిర్మలమైన చిత్తముకల యతడే నిజమైన యజ్ఞాధికారి. అట్టి తగిన యాగాధికారి తన హృదయాంతరాళములో చక్కని యజ్ఞ వృక్షముల స్తంభములతో పెక్కు యోజనముల వఱకు చల్లని దేవీ మండపములు కల్పించుకొనవలయును. ఆ మండపమున తన పవిత్రమైన మనసుచే చక్కని యజ్ఞవేదికను కల్పించుకొని యందగ్నులను విధివిధానముగ తన మనసుచే ప్రతిష్టింపవలయును.

ఆ మానసయాగమును బ్రహ్మ-అధ్వర్యుడు-హోత-ప్రస్తోత ఉద్గాత-ప్రతిహర్త యితర సభ్యులు మున్నగు బ్రాహ్మణోత్తములను యథావిధిగ ఋత్విక్కులుగ వరించవలయును. మఱియు నా యాగమందు ఆ ఋత్విక్కులను మనస్సుతోనే విధ్యుక్తముగ పూజింపవలయును. ఆ యజ్ఞవేదికయందు ప్రాణము-అపానము-వ్యానము-ఉదానము-సమానము అను పంచప్రాణములను పంచాగ్నులను స్థాపింపవలయును. వానిలో ప్రాణమును గార్హపత్యాగ్నిగ అపానము నాహవనీయముగ వ్యానమును దక్షిణాగ్నిగ సమానము నావసథ్యాగ్నిగను ఉదానమును సభ్యాగ్నిగను నీ పంచాగ్నులు పరమోత్కృష్టములుగ చెప్పబడినవి. ఈ పావకులు కామప్రదులు-మహాశ్రేష్ఠులు. ఆ పిదప నంతరంగమందు పరమపావనమైన నిర్గుణ ద్రవ్యములను భావించి సమకూర్పవలయును. ఆ మానసయజ్ఞమందు మనస్సును హోతగ యజమానునిగ నెన్నవలయును. యజ్ఞాధి దేవతగ నిర్గుణ సనాతన పరబ్రహ్మమే యుండవలయును. నిర్గుణ శివాశక్తి మోక్షఫలప్రదాయిని-బ్రహ్మవిద్య-సదాధార-సర్వవ్యాపినియై యంతట జ్యోతిర్మయియై వెలుగొందును. ఆ తరువాత శ్రీ నిర్గుణ జగదంబ నుద్దేశించి కల్పించిన వస్తువులను బ్రహ్మాగ్నిలో వేయవలయును. పిదప చిత్తప్రాణముల నేకగ్రీవముగ నిరాధారముగ సంకల్పరహితముగ నొనరింపవయలును. ప్రాణములను కుండలీ ముఖమార్గమున పరబ్రహ్మమందు లగ్న మొనరింపవలయును. అట్టి స్థితిలో సంకల్పవికల్పములు బ్రహ్మసమాధిలో నశించును. ఆత్మసాధకుడు స్వాత్మానుభవముతో సర్వాత్మభూతయగు మహేశ్వరిని స్వయముగ సమాధియోగమున నిర్వికల్పుడై ధ్యానింపవలయును. అపుడా యోగి సర్వభూతములను తన యాత్మలోను తన్ను సర్వభూతాత్మలోనూ నున్నట్లు తెలివివెలుగుతో దెలిసికొనగలుగును. అపుడా విధేయాత్ముడు పరమదివ్యమంగళ విగ్రహ శివ యగు శ్రీదేవి సందర్శనభాగ్య మనుభవించగలడు. ఆ పరమయోగి సచ్చిదానందస్వరూపిణిలో లీనమై బ్రహ్మానంద భూయము నందును. దాన ఆ నాడీ హృదయ దౌర్బల్యములు దగ్ధమైపోవును. తనువు మాత్రము ప్రారబ్ధమనుభవించుటకు నిలుచును. ఇట్లా జగదంబను మానసయాగమున నెవడు ధ్యానించునో వాడు సోమపానము చేసినవాడగును. కృతకృత్యుడు-జీవన్ముక్తుడు నగును. వాని యెల్ల కాలమములు ఫలించును. అతడు పరమ నిఃశ్రేయసమందగలడు. ఇది నిజము.

కనుక శ్రీభువనేశ్వరీదేవిని గురు వాక్యములను బట్టి ప్రయత్నించి తెలిసికొని ధ్యానించవలయును. ఇట్లు నిశ్చలముగ నొనరించిన మానసయజ్ఞము నిస్సంశయముగ పరమపద సౌఖ్య మొనగూర్చగలదు. ఇతర యాగములు సకామములై క్షణఫలము లగును. స్వర్గకాములు విధిగా నగ్నిష్టోమయాగ మొనర్పవలయునని వేదములు శాసించుచున్నవని మనీషులందురు. కాని వారును క్షీణపుణ్యులై తిరిగి మర్త్యలోకమునకు వత్తురు. కనుక నక్షయ ఫలప్రదమైన మానసయజ్ఞమే యెల్ల విధముల సర్వశ్రేష్ఠమైనది. జయకాంక్షులగు రాజుల కీ మానసయాగము సాధ్యముగాదు. నీవును తొల్లి తామస చిత్తవృత్తితో సర్పయాగ మొనరించితివి. నీవు నీ శత్రువగు తక్షకునితో పగ సాధించుట కనేక సర్పముల నిండుప్రాణముల నగ్ని కాహుతి యొనర్చితివి. కనుక నీ విపుడు భవ్యమైన శ్రీదేవీ మహాయజ్ఞము విధిప్రకార మాచరింపుము. పూర్వము సృష్టి ప్రారంభమునందా యజ్ఞమును శ్రీమహావిష్ణు వాచరించెను. అదే విధముగ నీవును శ్రీదేవీయాగ మొనరింపుము. నీ కా యజ్ఞ విధానము తెలియపఱచెదను. వేదవిదులగు బ్రాహ్మణులు యజ్ఞ విధానము సమగ్రముగ నెఱిగినవారు గలరు. వారు మంత్రశాస్త్రవేత్తలు. సమయమార్గ విచక్షణులు. శ్రీకామరాజ బీజ విధానజ్ఞులు. అట్టి వారు యాజకులుగ నుందురు. నీవు యజమానుడవు కమ్ము. నీవు విధిగ శ్రీదేవీ యజ్ఞ మాచరించి యాగఫలమును నీ పితరుల కొసంగి వారిని దుర్గతులనుండి సముద్ధరింపుము. ఏ విప్రునైన నిందించిన దోషము దుర్భరమును నరకప్రదము నగును. నీ తండ్రి కట్టి విప్రనిందవలన దోషము సంప్రాప్తమైనది.

నీ తండ్రి పాముకాటుచే నంతరాళమున దుర్మరణ మొందెను. ఆతడు దర్భలపైగాని భూమిపైగాని చావలేదు. ఓ కురువరా! ఓ తండ్రి చావు రణమునగాని పావనగంగానదిలోగాని జరుగలేదు. ఆతని భవనమందే స్నాన దాన రహితముగ సంభవించినది. ఓ నరవరా! కుత్సితమైన పనులన్నియు నరకమునకై దారి తీయును. వానిలో నే యొక్కటియు జీవుల నుద్ధరింపజాలదు. కావున ప్రతి ప్రాణియు నెచ్చటనైన నెప్పుడైన తనకు కాలము మూడినచో తాను సాధనరహితుడైనను సంకటములలో బడియున్నను నిర్మలచిత్తముతో వైరాగ్యసంపన్నుడై యిట్లు చింతింపవలయును: ''ఈ దేహము పాంచ భౌతికము; దుఃఖదాయకము; నాకేదియులేదు. ఈ శరీరము నేడు పడిపోయినపోవుగాక! ఆత్మస్వరూపుడనగు నేను శాశ్వతుడను; ముక్తుడను; నిర్గుణుడను. ఈ భౌతిక పదార్థములు నశ్వరములు. ఇక వీనికొఱకు శోకింపనేల? నేనే సనాతనుడను; నేనే సదాముక్తుడను; నేనే బ్రహ్మమను; నేనే సంసారముక్తుడను; నా కీ శరీరముతో నెట్టి సంబంధమును లేదు. కర్మలవలననే నా కీ తనువుతో సంబంధ మేర్పడినది. మానవుడీ దేహసంబంధమువలన సుఖదుఃఖ సాధనములను శుభాశుభములను ననుభవించును. నేను భయంకరము-ఘోరము-దుఃఖదమునైన సంసారసాగర మందుండి విముక్తుడనైతిని'' అని యిట్లు చింతించువాడు. స్నానదానములు చేయనవసరములేదు. అతడు మరణించి జన్మమరణ దుఃఖములనుండి విడువబడును. ఇది పరమయోగులకును దుర్లభమైన పరకాష్ఠాగతి. ఓ నరశార్దూలా! నీ తండ్రి విప్రశాపము విని గూడ తన శరీరమందలి మమకారము వదలుకొనలేకపోయెను. వైరాగ్యభాగ్య మందలేక చిక్కులోబడి ఈ చెప్పబోవు విధమున పలుకుచుండెను:

'నే నెట్లు రోగముక్తుడ నగుదును? నా రాజ్య మెట్లు నిష్కంటకముగ నుండగలదు? నే నెట్లు జీవింపగలను? మంత్ర విదులను రావింపుడు' అని పలికెను. ఇట్లు నీ తండ్రి మణిమంత్రౌషధములతో యంత్రములతో తన చావును బాపుకొనుటకు సౌధోపరిభాగమున తలదాచుకొనెను. అట్టి చావుదశలోగూడ నీ తండ్రి శ్రీదేవి నొక్కసారియైన భక్తితో నమ్మా! యని నోరార పిలిచి యెఱుగడు. స్నానదానములు చేసికొనలేదు. దైవము బలవత్తరమైనదని నేల పై నైనను శయనింపలేదు. తుదకు కలి ప్రభావమున తాప సోత్తము నవమానించిన ఫలముగ మోహార్ణవమందు మునిగి నీ తండ్రి మేడపై ఘోర దుర్మరణమునకు బలియయ్యెను. ఇట్టి వానివలన తప్పక నరకము ప్రాప్తమగును. కాన నీ విపుడు నీ పితరుని పాపకూపము నుండి సముద్ధరింపుము. అమితతేజస్వి యగు వ్యాసుని యీ వచనము లాలకించి జనమేజయుడు కనులనిండ దుఃఖాశ్రులు నిండగ రుద్ధకంఠముతో విలపించుచు నా తండ్రికి సద్గతి గల్గనిచో నా జీవితము వ్యర్థము. కాన నా తండ్రికి సద్గతులు గల్గునట్టు లొనర్తును అని పలికెను.

అధ్యాయము 45 శ్రీమహావిష్ణువు శ్రీదేవీయజ్ఞ మాచరించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 43 Satyavrata was accomplished under the influence of Vagbeeja - అధ్యాయము 43 వాగ్బీజ ప్రభావమున సత్యవ్రతుడు సిద్ధినందుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 43

వాగ్బీజ ప్రభావమున సత్యవ్రతుడు సిద్ధినందుట

లోమశుడిట్లనెను : ఆ యుతథ్యుడు వేదాధ్యయనముగాని జపధ్యానములుగాని దేవతార్చనగాని యెఱుగడు. నియమాసనములు ప్రాణాయామ ప్రత్యాహారములు భూతశుద్ధి విధానములు నెఱుంగడు. మంత్రకీలక జపములుగాని శ్రీగాయత్రి గాని శుచిత్వముగాని స్నానవిధిగాని యాచమనాదులుగాని ఆతనికి తెలియవు. ప్రాణాగ్ని హోత్రమున బలిదానము అతిథిసత్కారము సంధ్యోపాసన సమిద్ధోమములు మున్నగువాని గూర్చి బొత్తుగ తెలియదు. అతడు మాత్రము ప్రతి దినము నుదయ కాలమందు మేల్కాంచి పండ్లు తోముకొని శూద్రునివలె స్నానమంత్రము చెప్పకయే గంగలో మునుగుచుండును. ఆ శఠద్విజుడు పట్టపగలు స్వేచ్ఛగ వనమందేగి తినదగినవనిగాని కూడనివనిగాని తలంపక కొన్నిపండ్లు దెచ్చుకొని తినుచుండును. ఆ బాపడు నిత్యము సత్యమే పలుకును. అసత్య మాడకుండుటవలన లోకు లతనికి సత్య తపుడను పేరిడిరి. ఆతడెవ్వరికి గాని హితాహితము లొనర్పక నిర్భయముగ నిశ్చింతగ నేదియో లోన జింతించుచు సుఖనిద్ర చెందుచుండును.

నాకు చావెప్పుడు మూడునో కద! ఈ యడవిలోబడి జీవిత మతి కష్టమున వెళ్ళబుచ్చవలసివచ్చినది. అయ్యో! మూర్ఖుని జీవితము లోకమున నెంతయు పనికి మాలినదే! దీనికంటె చావే నయము. నా దైవమే నన్ను మూర్ఖునిగ జేసినది. అంతేకాని మరింకేదియు దీనికి కారణముగాదు. నే నుత్తమజన్మమెత్తియు వట్టి వ్యర్థుడనై పోతిని గదా! అందాలు విరజిమ్ము గొడ్రాలు ఫలములులేని చెట్టు పాలులేని యావు నెట్లో నేను నట్లే యెందులకును పనికిమాలినవాడనై పోతినే! నన్ను బుట్టించిన దేవుని నిందించి ఫలమేమి? నే చేసికొన్న కర్మ కేడువవలయును. నే నెన్నడైన నొక బ్రాహ్మణునకైన నొక పుస్తకము దాన మీయలేదేమో! నా తొంటి పుట్టువులో నా వెంటబడు విద్యార్థులకు బ్రహ్మవిద్య ధారపోయనైతినొక్కో! ఆ దుష్కర్మయోగమున నే నిపుడీ నికృష్టజన్మ మనుభవించుచున్నాను. పూర్వము నేను పుణ్యతీర్థములందు తపము సేయలేదేమో? సాధులను సేవింపలేదో? ద్విజులను ద్రవ్యములతో బూజింపలేదో? దాని ఫలితముగనే యిపుడీ దుష్టబుద్ధితో బుట్టితినేమో! పెక్కురు నాతోడి మునికుమారులు వేదశాస్త్ర పారగులై యున్నారు. ఏదో తెలియని దైవయోగమున నా కర్మకాలి నే నిట్లు మూఢుడనై పడియున్నాను. నాకు జపతపములు తెలియవు. సాధన లొనర్చు టంతకంటె తెలియదు. నా సంకల్పములన్నియు మిథ్యలు-గాలిమూటలు- తీరనివి. నా యదృష్టము తలక్రిందైనది. మానవున కెంత పౌరుషమున్న నంతయు నిరర్థకము. కార్య పరిశ్రమయు వ్యర్థము. అన్నిటికి దైవబలమే పరమార్థము. అన్నియు దైవమువలననే నెరవేరును. బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఇంద్రాది దేవతలు నఖండమైన కాలమునకు కట్టుబడినవారే. కాల మె వారికిని దురతిక్రమణీయము. విచిత్రము.

ఇట్లతడు రేయింబవళ్లు తనలోతాను వితర్కరించుకొనుచు పావన గంగాతటమున కాలము గడపుచుండెను. ఒంటరిగనుండి విరక్తుడై జీవితమును పరమశాంతముగ సాగించుచుండెను. ఇట్లతడు జపమంత్రార్చనల విధాన మెఱుంగక నదీతీరమున వసించుచుండగ పదునైదేడులు నాగిపోయెను. నిత్యము సత్యమే పలుకుచు పొరపాటుననైన నసత్యము బల్కి యెఱుగనందున నతనికి సత్యతపుడను నామము సార్థకమై ఆతని కీరితి నేల నాల్గుచెఱగుల వ్యాపించెను. అంత నొక్కనాడొక బోయవాడు విల్లమ్ములుదాల్చి వేట తమకమున నచ్చటి కేతెంచెను. అతడు యమునివలె భీకరాకారుడు. మహాక్రూరుడు; శఠుడు; ప్రాణాలు బలిగొనుటలో వెనుకాడనివాడు. ఆ కిరాతుడు వింట బాణమును సంధించి యొక పందిని గొట్టెను. అది గడగడలాడుచు ప్రాణాలమీది తీపితో మునిచెంతకు పరుగెత్తెను. నెత్తుటదోగాడు తనువుతో కంపించుచు నాశ్రమ సమీపమున జేరిన దాని దీనస్థితి గనగనే ముని గుండె దయతో నిండెను. అట్లు తన యెదుట నెత్తుట దడిసిన పంది పరుగెత్తుటగాంచి ముని బాలుడు దయాంతరంగితాంతరంగుడై సారస్వత బీజమగు ''ఐ'' కారముతో దాని నదల్చెను. అతడంతకుముందా బీజము వినలేదు. తెలిసికొనలేదు. అది యిప్పుడతని నోటి వెంట దైవయోగమున వెలువడెను కాని, ఆ పంది దైన్యమునకాముని మిక్కిలి బాధపడెను. ఆ పంది కిరాతుని బాణపు దెబ్బకు తాళలేక వడకుచు రొప్పుచు మూల్గుచు నెవ్వరును చొరలేని యాశ్రమపు పొదరింట దూరెను.

ఆ బోయ రెండవ యమునివలె భీకరదేహముతో నారి సారించుచు పందిని వెదకుచు మునిచెంతకువచ్చి దర్భాసనముపై పద్మాసనమున గూర్చున్న సత్యవ్రతుడను మునినిగని సాగిలపడి మ్రొక్కి యిట్లనెను : 

'ఓ మునీ! నా పంది యెటు పరుగిడెను? చెప్పుము. నీవు సత్యవ్రతుడవని వాసిగాంచుట నే నెఱుంగుదును. నా కుటుంబము పేరాకట మలమల మాడుచున్నది. దానిని పోషించుటకు వేటకు వచ్చితిని. నా బాణము దెబ్బతిన్న పంది యెటుపోయెను? తెలుపుము. నేను నిజము పలుకుచున్నాను. నాకు తగిన కులవృత్తి యిదేగాని మరేదియులేదు. నా సంసారమును మంచిదికాని చెడుదికాని అగు ఏదేనుపాయమున పోషించుట నా విధి. ఓ ద్విజవర్యా! నీవు సత్యవాదివి - సత్యవ్రతుడవు. నా కుటుంబ మాకటిమంటతో నకనకలాడుచున్నది. కాన నా బాణము తాకిడి తిన్న పంది యేమయ్యెనో నాకు వెంటనే తెలుపుము.' అను బోయని మాటలు విని ముని యిట్లు తలపోసెను: 

'ఇపుడు నేను చూడలేదనుటచే నాసత్యవ్రతము భంగము కాదా? ఇపుడేమి చేతును? పెద్ద సందేహములో చిక్కుకొంటిని. బాణము దెబ్బతిన్న పంది యిచటికి వచ్చెనని నిజముగాని రాలేదని యసత్యముగాని నే నిపు డెట్లు పలుకగలను? ఇతడాకలిమంటతో నున్నాడు. అది వచ్చెనందునా? ఇతడు వెంటనే దానిని చంపి తీరును. హింసతోగూడిన సత్యము సత్యముగాదు. దయతోగూడిన యతస్యముగూడ సత్యమే యగును. దేనివలన విశ్వహితము చేకూరునో యదే లోకములందు సత్యమనం బరగును. తదితర మట్లు గాదు. ఇట్టి సంకట పరిస్థితులలో పందికి మేలు జరుగుట - నేను నిజము పలుకుట రెండు నొకేసారి యెట్లు పొసగునా, యని యతడు ధర్మసంకటమున వెనుక ముందులాడుచు బ్రాహ్మణుడవగు జమదగ్నీ! వాస్తవము దెలుపలేకుండెను. కాని బాణముదెబ్బ తగిలిన పందినిగాంచి ముని తలవనితలంపుగ దయతో ''ఐ'' యని పల్కెను. ఆ పల్కునకు వాగ్రూపిణియగు సరస్వతీశక్తి సంతసల్లి యతడు తన వాగ్బీజమే పల్కెనని యతనికి పండితుల కందని మహావిద్యను ప్రసాదించెను. తత్ప్రభావమున మున్ను వాల్మీకి ముని కెల్లవిద్యలు స్ఫురించినట్లా ముని బాలున కెల్లవిద్దెలు ప్రస్ఫురించెను. తత్ఫలితముగ నతడు మహాకవి యయ్యెను.

అపుడు తన ముందట విల్లమ్ములుదాల్చి నిలుచున్న బోయనుగని దయాధర్మ కాముడగు సత్యకాముడొక శ్లోకము చదివెను: 

"ఓ వ్యాధా! ఏది చూచునో యది పలుకదు. ఏది పలుకునో యది చూడదు. కాన నీ స్వార్థమునకు నన్నింతగ గ్రుచ్చి గ్రుచ్చి యడుగుదువేల? ముని మాటలు విని పశుఘాతకుడగు వ్యాధుడు పందిమీది యాస వదలి తన యింటి మొగము పట్టెను. పిదప నా బ్రాహ్మణు డపర వాల్మీకివలె మహాకవిశేఖరుడై యెల్లలోకములందు సత్యవ్రత నామమున ఖ్యాతినందెను. పిమ్మట నా బ్రాహ్మణుడు వాగ్బీజము నిరంతరముగ విధిగ జపించుచు భూతలమున పండితోత్తముడై పేరెన్నిక గనెను. ఎల్ల మునులు విప్రులు ప్రతిపర్వమందు సత్యవ్రతుని యశము గానము చేయుదురు. ఆతని మహత్తర చరిత్రమును సంస్తుతింతురు. ఒకప్పుడతని నింటినుండి గెంటినవారే నేడతని కీర్తి ప్రభావము తెలిసికొని మరల నతని నింటికి గొనిపోయిరి.

కావున నో మహారాజా! ఆ యాదిశక్తి జగత్కారణురాలు. పరాదేవి. ఆ తల్లి యెల్లరచే నైకాంతిక పరభక్తితోడి పూజలు సేవలు నందుకొనుచు విరాజిల్లుచుండును. ఓ రాజా! ఆ దేవీ యాగ మొనరింపుము. ఆమె నీ సర్వకామితము లీడేర్చును. ఇందు నలుసంతయు సందేహము లేదు. తన్నెవరు చిత్తశుద్ధితో నభ్యాసయోగ సంస్కృత చిత్తముతో ధ్యానింతురో సంస్మరింతురో పూజింతురో నామ సంకీర్తనము చేయుదరో వారి వాంచితార్థము లొసంగును గాన దేవి కామప్రదాయిని నా బరమగును. ప్రపంచములో రెండు విధముల మనుజులుందరు. వారెవ్వరన దీనులు - ఆర్తులు - దరిద్రులు - శఠులు - ఆకలి దప్పులచే మండి యెండిన గుండెల వారు రోగ పీడితులు - పతితులు - మూర్ఖులు - వైరిపీడితులు - బానిసలు - వ్యాకులచిత్తులు - దిక్కులేనివారు - వికలులు - నీచాత్ములు ననువారొక విధమువారు. భోగములెన్ని భోగించినను తనియనివారు ఇంద్రియా సంభోగ నష్టవీర్యులు వేదవాదులు రాజ్యలక్ష్మీ మత్తులు శూరులు అమాయికులను నెత్తిమీదకొట్టువారు స్వార్థపరులు సకల లక్షణ లక్షితులు ననువారింకొక విధమగువారు. వీరిలో దైవ ధర్మవిరుద్ధమైన గుణములు గల వారినిచూచి సర్వార్థముల నొసంగు సర్వేశ్వరి వీరిచే పూజింపబడలేదు. కావుననే యిట్లు దేవీ పూజాఫలములగు సకల దుఃఖము లననుభవించుచున్నారనియు శుభ లక్షణములుగల రెండవ రీతి వారినిచూచి దేవీ సేవాఫలములు వీరి యొద్ద కనబడుటచే సకల సుఖములకు హేతువగు దేవీ పూజ వీరిచే నొకప్పుడు చేయబడియుండుననియు అన్వయ వ్యతిరేకములచే పండితులూహించ వలయును. ఒకనాడా పరాంబిక నారాధించిన దేవీ భక్తులే నేడీ సంసారమున సుఖ సంతోషములతో నలరుచున్నారు. ఇది ముమ్మాటికి నిజము. జనమేజయా! నేనటులా లోమశ మహామునివలన మునుల సమాజమందు శ్రీదేవీ మాహాత్మ్యము చెవుల పండువుగ వింటిని. కావున నా జగన్మాతృదేవీ దివ్యస్వరూపము నీ హృదయపీఠమందుంచుకొని శ్రీదేవి నర్చింపుము అని వ్యాసుడు జనమేజయునితో పలికెను.

అధ్యాయము 44 శ్రీదేవి యజ్ఞ విధానము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...