Sunday, April 12, 2026

Chapter 48 Yudhajit's attempt to kill Sudarshan - అధ్యాయము 48 యుధాజిత్తు సుదర్శనుని జంపదలచుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 48

యుధాజిత్తు సుదర్శనుని జంపదలచుట

వ్యాసు డిట్లనియెను: మహాబలుడగు యుధాజిత్తు యుద్ధము చాలించి యయోధ్య కేగి సుదర్శనుని చంపు నుద్దేశ్యముతో మనోరను యెచ్చటనెచ్చటనని యడుగ సాగెను. సుదర్శనుని జాడ దెలియుటకు సేవకుల నంపెను. కాని, యతడు గనబడలేదు. పిదప నతడొక శుభదినమున తన మనుమనికి పట్టము గట్టెను. వసిష్ఠాదులును మంత్రులును నాథర్వణ మంత్రములతో జలపూర్ణ కలశములతో శత్రుజిత్తు నభిషేకించిరి. ఆ నగరమంతయు భేరీశంఖనినాదములతో తూర్యవాద్య ఘోషములతో నుత్సవములతో గనులపండువగ నుండెను. విప్రుల వేదపఠనములతో హర్షధ్వానములతో వందిగాయక సంస్తుతులతో జయ మంగళ ఘోషములతో నయోధ్యాపురి ముదితవలె శోభిల్లెను. రాజు క్రొత్త వాడగుటవలన నగరము హృష్టపుష్టజనులతో స్తోత్రవాద్యధ్వనులతో కొంగ్రొత్తతనము సంతరించుకొని యెప్పుచుండెను. 

కొందఱు సజ్జనులు మాత్రము సుదర్శన రాజకుమారు డెచ్చటికేగెనోయని తమ ఇండ్లలో పలవరించుచుండిరి. ఆ మనోరమ మహాసాధ్వి. ఆమె తన కొడుకును వెంటబెట్టుకొని యెచ్చటికేగెనోగద! ఆమె తండ్రి రాజ్యలుబ్ధుడగు యుధాజిత్తు చేతిలో మడిసెనుగద! అని ఈరీతిగ సమబుద్ధులగు వృద్ధులు విచారము బొరయుచు శత్రుజిత్తునకు వశవర్తులై దుఃఖించుచుండిరి. 

యుధాజిత్తు అట్లు తన మనుమని రాజుగజేసి రాజ్యభారము మంత్రుల కప్పగించి తన నగరము మొగముపట్టి పోవుచు త్రోవలో నొక మున్యాశ్రమమున సుదర్శనుడు తలదాచుకొను టెఱిగి యతనిని రూపుమాపదలచి వెంటనే చిత్ర కూటగిరి కేగి బలుడను పేరుగలవాడును శూరుడునగు నిషాదరాజును మున్నిడికొని శృంగవేరపురాధిపుడగు దుర్దర్శుడను వానిని శీఘ్రుముగ కలిసెను. వీరిని అట్లు సేనాసహితముగ వచ్చుచున్నట్లు విని మనోరమ భయార్తయై తన చిన్నారి కొడుకునకు గల్గిన యాపదకు దుఃతమతియై కన్నులనిండ కన్నీరు నింపుకొని రోదించుచు మునితిలకునతో  

మనోరమ కిట్లనియెను : మునీశా! ఇపుడు యుధాజిత్తు మా ప్రాణములు బలిగొనుటకు వచ్చుచున్నాడు. నే నిపుడేమి చేతును? ఎక్కడికేగుదును? ఇతడు నా తండ్రిని పొట్టబెట్టుకొనెను. తన దౌహిత్రుని రాజుగ జేసెను. ఇపుడు నా చిన్ని కుమారుని చంప సైన్యముతో వచ్చుచున్నాడు.

పూర్వము పాండవులు పాంచాలీసమేతులై మున్యాశ్రమములందు వసించిరని నేను వింటిని. అపుడొకసారి పాండవులు వేట కేగగ ద్రోవది పావన మున్యాశ్రమమందుండెను. ఆ యాశ్రమమందు ధౌమ్యుడు అత్రి గాలవుడు పైలుడు జాబాలి గౌతముడు భృగువు చ్యవనుడు కణ్వుడు జతువు వీతిహోత్రుడు సుమంతుడు యజ్ఞదత్తుడు వత్సలుడు రాశాసనుడు కహోడుడు యవక్రీతుడు యజ్ఞకృత్తుక్రతువు మొదలుగాగల మునులు భారద్వాజాదులును వేదపఠనములు సలుపుచుండిరి. శోభనాంగియగు ద్రౌపది తన చెలికత్తెయలంగూడి మునుల యాశ్రమమున నిర్భయముగ నుండెను. పరంతపులును వీరవరులును అగు పంచపాండవులు ధనుర్బాణధరులై మృగములను వేటాడుచు వనమునందు గ్రుమ్మరుచుండిరి.

అంతలో సింధుపతియగు జయద్రథుడు సేనతో మార్గమున పయనించుచు వేదఘోషము విని యిది మునిజనాశ్రమమనుకొని ఆ యాశ్రమముచేరి సర్వ విదులగు మునుల వేదఘోషము వినగనే వారిని దర్శించు నాకాంక్షతో తన రథము దిగెను. ఇరువురు భృత్యులను వెంటగొని వేదపఠనమున మునిగియున్న మునుల చూచి చేతులు కట్టుకొని తాపసోత్తముల యాశ్రమములో బ్రవేశించెను. పిమ్మట నతడు కూర్చుండగనే మునిభార్యలతడెవరని యడుగుచు అతనిని చూడవచ్చిరి. వారి నడుమ రెండవలక్ష్మి వలెను దేవకన్యవలెను శోభిల్లు వరారోహయగు యాజ్ఞసేనిని ద్రౌపదినిగని జయద్రథుడా ప్రమద యగు వరానన యెవతెయో తెలియగోరి 

ధౌమ్యు నిట్లడిగెను: ఈమె యెవని భార్య? ఎవని కూతురు? ఈమె పేరేమి? ఈ వరవర్ణిని రూపలావణ్యవతియగు నింద్రాణి భూమికి దిగివచ్చెనో యన నలరుచున్నది. ఈ భామిని ముళ్ళచెట్ల నడిమి లవంగపు తీవియబోలి రక్కసుల మధ్యనుండు రంభవలె నిచట భాసిల్లుచున్నది. మహాభాగా! ఈ యబల యెవ్వని భార్యయో నిక్కువముగ బలుకుము. ఈమె రాజపత్నియే యగును గాని ముని భార్య కాదు అన విని ధౌమ్యుడు ఓ సింధురాజా! సర్వశుభలక్షణయుతయగు నీమె పాంచాలి - పాండవుల ప్రియసతి - ద్రోవది. ఈమె ఇపు డీ ఆశ్రమమందు నివసించుచున్నది.

వీర్యశౌర్యబలయుతులగు పాండవులు శోకముడిగియున్నారా? వారెచ్చటి కేగిరని జయద్రథుడన వారు రథ మెక్కి వేటకేగిరి. వారు మృగములను గొని మధ్యాహ్నమునకు గాని రార'ని ధౌమ్యుడనియెను. ఆ మాటలు విని జయద్రథుడు లేచి ద్రౌపది చెంతకేగి ప్రణమిల్లి యామెతో ఓ వరారోహో! నీకు సేమంబేనా? నీ పతులెచ్చటి కరిగిరి? మీకు వనవాసమున పదునొక్కండేండ్లు గడచెనుగదా! అని యడిగెను. అది విని ఓ నృపా! నీకు శుభమగుత! ఈ యాశ్రమమున విశ్రమింపుము. క్షణములోన పాండవులేతేరగలరు' అని యామె పల్కుచుండగనే యతడు కామలుబ్ధుడై మునిసత్తముల ననాదరించి యామెను పట్టుకొనెను.

కనుక బుధులెప్పుడే నెవ్వరినేని విశ్వసించి యుండరాదు. అట్లొనరించిన వగలబొగులవలసివచ్చును. ఇందులకు బలి తార్కాణము. ఆ బలి శ్రీమంతుడు; విరోచనుని సుతుడు; సత్యసంగరుడు; ధర్మపరుడు; సాధుసమ్మతుడు; మహా దాత; శరణాగత రక్షకుడు; యజ్ఞకర్త. ఎప్పుడేని అధర్మము చేసి యెఱుగడు. ప్రహ్లాదుని మనుమడు. భూరి దక్షిణలతో తొంబది తొమ్మిది జన్నములొనరించినవాడు. సకలయోగిసేవ్యుడు - సత్యమూర్తి - నిర్వికారుడునగు విష్ణుభగవానుడు దేవ హితము చేయదలంచి కశ్యప మహర్షికి పుత్రుడై పుట్టెను. అతడు కపట వామన రూపమున సాగర పరివృతమైన మహీమండల మంతయును బలినుండి వంచనతో హరించెను. ఐనను వైరోచని యగు బలి సత్యవాదియై పేరొందెను. అట్లు హరి యింద్రునికై బలిని వంచించి సర్వము హరించెనని వింటిని. యజ్ఞపాలకుడు - సత్యస్వరూపుడునగు నచ్యుతుడే యిట్లొనరింపగ నన్యుడెవడు మోసము చేయకుండును? కావున నెప్పుడును నెవ్వరును నెవ్వరిని విశ్వసింపరాదు. చిత్తములోభాయత్తమైన వానికి పాపభీతి యెక్కడిది?

మునీశ! లోభోపహతులగు ప్రాణులు దురితములొనరింతురు. అట్టివారికెప్పుడేని ఎచ్చటనేని పరలోకభీతియుండదు. లోభాయత్తచిత్తులు మనోవాక్కాయ కర్మలతో పరుల విత్తమపహరించి నరకమున గూలుదురు. నరులు సురల నారాధించి ధనము బడయజూతురు. కాని, దేవత లెవరిచేతికి ప్రత్యక్షముగ నెప్పుడేని ధనము తెచ్చి యీయరు. వారితరుల నుండి గ్రహించి తెచ్చి యిత్తురు. వ్యాపారముతో - దానముతో - బలముతో - దొంగతనముతో వైశ్యులు ధనవస్త్రాదులు గడించి తనియక తమకింకను ధనము రావలయునని దేవతల నర్చింతురు. వర్తకము చేయునపుడిది పరవిత్తహరణమనుభావ మతనికి గలుగదు. దానిని గ్రహించునప్పుడది వృద్ధిగావలయుననియు దానికెక్కువ వెల రావలయుననియు వర్తకుడు గోరుచుండును. ఇట్లు ప్రతివారును పరద్రవ్య హరణము చేయజూతురు. ఇంక నెవ్వనినని విశ్వసింపవలయును? కనుక లోభమోహములు గలవారి తీర్థ సంసేవనము వృథ! వారియధ్యయనము వ్యర్థము; వారి దానము నిరర్థకము; వారి కృతము లకృతములగును. కావుననో ద్విజవరా! ఈ నా వైరిరాజును వాని యింటికి పంపుము. అపుడు నేనిట జానకివలె సపుత్త్రనై వసింగలనను అనునామె పలుకులు విని తపోవీర్యశాలియగు భారద్వాజ మహర్షి యుధాజిత్తును జేరి, రాజా! స్వేచ్ఛగ నీపురమున కరుగుము. దుఃఃత బాలపుత్త్రయగు మనోరమ నీకు లభించదు అని పలుకగా యుధాజిత్తు ఓ మునీ! హఠము మానుము. మనోరమను వదలుము. ఆమెను గొనిపోక నేను పోను. నా బలము ప్రయోగించియైన నామెను పట్టుకొని పోదును అనెను. 

ఋషి ఇట్లనియెను: ''నీకు శక్తియున్న నీ బలము చూపి యీమెను మున్ను వసిష్ఠమమహర్షి నుండి విశ్వామిత్రుడెట్లు ధేనువున పహరించెనో అట్లు నా యాశ్రమమునుండి గొనిపోమ్ము చూతము. (తుదకతడేమయ్యెనో తెలియదా)''

అధ్యాయము 49 సుదర్శనుడు కామరాజ బీజము జపించుట

No comments:

Post a Comment

Chapter 52 Controversies about Swayamvara - అధ్యాయము 52 స్వయంవరమును గూర్చిన వాదోపవాదములు

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 52 స్వయంవరమును గూర్చిన వాదోపవాదములు వ్యాస సంయమి యిట్లు వాక్రుచ్చెను : ఈ విధముగ కేరళాధిపతి వాదింప...