Sunday, April 12, 2026

Chapter 63 The doubts of the Janamejay - అధ్యాయము 63 జనమేజయుని సంశయములు

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 63

జనమేజయుని సంశయములు

జనమేజయు డిట్లనియెను : ఓ మునిముఖ్యా! మత్స్యగంధ పుత్రుడవగు మిమ్ముల నేను మరికొన్ని ప్రశ్నములడుగ కుతూహల మగుచున్నది. శ్రీ శూరసేనుని కుమారుడు వసుదేవుడు. అతడు మహాప్రతాపవంతుడు. ఆ వసుదేవునకు హరి పుత్త్రుడుగ జన్మించెను అని వింటిని. ఆ వసుదేవ డానక దుందుభి యనుపేర విఖ్యాతుడు. అతడు దేవతలకును పూజనీయుడు. అట్టి ధర్మతత్పరుడు కంసుని కారాగారమున ఏల బంధింప బడెను? ఆ వసుదేవుడు తన భార్యయగు దేవకిని గూడి సుఖముండెను. అత్తఱి వారేమి పాపము చేసినందున వారి యార్గురు కొడుకులు చంపబడిరి? కంసుడు యయాతి వంశజుడు. అట్టి వాడారుగురు శిశువుల నేల చంపెను? ఆ వాసుదేవుడగు శ్రీహరి కారాగారమునం దెట్లవతరించెను? ఆ భగవానుడగు శ్రీహరి జన్మాంతర మేల పొందెను? అతడు గొల్లపల్లె కేల కొనిపోబడెను? అతని తల్లిదండ్రు లినుపసంకెళ్ళచే నేల బంధింపబడిరి? ఆ శ్రీకృష్ణుడు అమిత తేజోవంతుడు గదా! మఱి యట్టి శ్రీహరి తన ముదుసలి తల్లిదండ్రులగు దేవకి వసుదేవులను బంధముక్తులగ నేల చేయలేదు? ఎల్ల లోకములను బుట్టించు దిట్టయగు నతడు తన తల్లి గర్భమందుండియు వారినేల చెఱవిడిపంచ లేకుండెను? వారి వెనుకటి కర్మమెంత బలవత్తరమైనదో మహాత్ములకును తెలియనలవికాదు కదా! పరమాత్ముడగు వాసుదేవు డవతరించు చోట గూడ కర్మ బంధమునకు తావుండునా? కంసుని చేతిలో ప్రాణములు గోలుపోయిన యా యార్గురు బాలు రెవరు?

కంసుడొక బాలికను నేలకు వేసి కొట్టబోగా నా బాల నింగిపై కెగసి యష్టభుజ యయ్యెను గదా! ఆ బాల యెవరు? ఆ హరి బహు భార్యావంతుడు గదా! మఱి యాతని గృహస్థ జీవిత మెట్టిది? ఆ కృష్ణు డొనరించిన ఆయా కార్యములను ఆ హరి దేహత్యాగమును గూర్చి నేను కింవదంతిగ వినిన విషయములు నన్ను మోహితుని చేయుచున్నవో అన్నట్లున్నవి. నా కా వాసుదేవుని చరిత మున్నదున్నట్లుగ తెలుపుము. 

పూర్వము నరనారాయణులను పురాణ ఋషి శ్రేష్ఠులుండిరి. వార లిరువురును ధర్ముని కుమారులు. శ్రీ మహావిష్ణు వంశమున జన్మించినవారలగు ఆ మహనీయులు పుణ్యబదరి కాశ్రమ మందు పెక్కేండ్లు విజితేంద్రియులు - నిరాహారులు - నిఃస్పృహులు - జితకామక్రోధులు నగుచు విశ్వ కల్యాణము నుద్దేశించి ఉత్తమ తప మొనరించిరి. ఆ నరనారాయణుల దివ్యాంశముల వలన మహావిక్రములగు నర్జునుడును కృష్ణుడును జన్మించిరని సర్వజ్ఞులగు నారదాది మహర్షులనిరి. ఆ నరనారాయణ మహర్షులు సశరీరులైయున్నారు గదా! అట్టివారు మరల కృష్ణార్జునులుగ నెట్లు జన్మాంతర మందిరి? వారు బంధముక్తి కొఱకు కుగ్రతప మొనరించి సర్వసిద్ధులును బడసిరి గదా! అంతటి ముని ముఖ్యులు మరల జన్మము లేల దాల్చిరి? స్వధర్మ నిరతుడగు శూద్రుడు వైశ్యుడు క్షత్రియుడుగను నతడు బ్రాహ్మణుడుగను క్రమమున జన్మించునని నేను వింటిని.

ఉత్తమ బ్రాహ్మణుడు విగతరాగుడై శాంతుడైనచో నతడు తప్పక భవబంధముక్తుడగును. ఈ విషయము నరనారాయణులందు తద్విరుద్ధముగ నున్నది. వారు తపమువలన వశ్యాత్ములైరి గద! వారేకర్మమువలన మరల జన్మమొందిరి? ఆ శాంతచిత్తు లెవరి శాపమున క్షత్రియులై పుట్టిరి? ఆ మహర్షులగు బ్రాహ్మణులు క్షత్రియులగుటకు గల కారణము తెలుపుము. విప్రశాపమున యాదవ వంశము నశించెనని వింటిని. గాంధారీ శాపమున కృష్ణుని వంశ మంతరించెనట. శంబరాసురుడు ప్రద్యుమ్ను నేల యపహరించెను? దేవదేవుడును జనార్దనుడునగు వాసుదేవుడుండగా పురిటింటి నుండి పుత్త్రహరణము జరుగట వింతగ నున్నది. శ్రీహరి భవనము దుర్గమమైన ద్వారకా దుర్గము నడుమ నున్నది. అందుండి శంబరాసురుడు ప్రద్యుమ్నుని గొనిపోవుచుండగా శ్రీహరి దివ్య నేత్రములతో నేల కనలేదు? వాసుదేవుని భార్యలు దస్యులచే దోచుకొనబడుటగూర్చి నాకు సందేహముగ నున్నది. ఆ సందియమును నివారింపుము. ఆ దేవదేవుడగు వాసుదేవుడు పరమ పదము జెందిన వెంటనే యట్టి దుస్సంఘటన జరుగుటవలన నా చిత్తమందు సంశయమును కలతయు కల్గుచున్నవి. ఆ హరి భూభార మణచుట కవతరించినవాడును విష్ణు నంశమున బుట్టినవాడును గదా! అట్టివాడు భయముతో మథురారాజ్యము వదలి ఏల ఏగెను? ఆ భూభార మడప నవతరించిన హరి తన సేనతో మిత్రులతో నేల ద్వారావతి కేగెను? దుష్టశిక్షణము శిష్టరక్షణము ధర్మసంస్థాపనము చేయుట కవతరించిన హరి యా చోరుల నేల చంపలేదు? ఆ వాసుదేవుడు సర్వజ్ఞుడు గదా! అతడు తన భార్యలను దస్యులు దోచుకొనుట ఎఱుగడా?

మహామనీషులైన భీష్మద్రోణాదులు భూమికి భారమని కృష్ణుడు వారిని చంపించెనా? ధర్మారాజాదులు శ్రీకృష్ణుని ప్రియభక్తులు సదాచార సంపన్నులు. వారు యజ్ఞరాజమగు రాజసూయమును యథావిధిగ నాచరించిరి గదా! ఆ యజ్ఞమందు దేవాంశజులును వాసుదేవాశ్రితులు నైన పాండవులు బ్రాహ్మణులకు భూరిగ దానదక్షిణ లొసంగిరి గదా! ఐనను వారేల ఘోర దుఃఖముల పాలైరి? వారి పున్నెమంతయు నేమయ్యెను? వారంతగా దుఃఖములు పొందుటకు తామంతగా చేయరాని దోషమేమి చేసిరి? రమాంశమువలన యజ్ఞవేదికలో నవతరించిన ద్రోపది పరమ సాధ్వియు శ్రీకృష్ణ భక్తురాలును గదా! అట్టి ద్రౌపది తలవెండ్రుకలు బట్టి దుశ్శాసనుడు లాగుచుండగ నామె మిక్కిలి దుఃఖించెను ఆమె యేల అట్టి ఘోరదుఃఖములకు గురికావలసి వచ్చెను? ఆ ద్రోపది రజస్వలము ఏకవస్త్రయు భీతయునై యుండగా నామెను నిండుకొలువున కట్లీడ్చిరే! ఆ పతివ్రత విరటు నగరమున మత్స్యపతికి దాసిగ నయ్యెను కదా! ఆమె కీచకునిచేత అవమానింపబడి కురరివలె పలవరించినదిగదా! ఆమె జయద్రథునిచే నపహరింపబడి బిట్టుగ విలపించినదిగదా! ఆమె మరల విక్రమశాలురగు పాండవులచేత విముక్తురాలయ్యెను అక్కటా! పూర్వ జన్మమున నెట్టి ఘోరదురితము లొనర్చి వారిట్టి యిక్కట్టుల పాలయిరో కదా! నా పూర్వజులు మహాయజ్ఞమగు రాజసూయ మొనరించియు నేల యీ కష్టముల పాలయిరో తెలుపుము. పాండవులు దేవాంశజులు గదా! వారి పూర్వకర్మము ననుసరించి ఇట్టి ఘోర దుస్తర దుఃఖములు గల్గుట నాకు సంశయము గలిగించు చున్నది.

కుంతీపుత్రులు సదాచారులుగదా! ఈ జగము నశ్వరమని తెలియును గదా? మఱి వారు భీష్మద్రోణులను మోసముతో నేల చంపిరి? వారు పరమాత్ముడును వాసుదేవుడునగు హరిచే ప్రేరితులై యంతటి ఘోరదురితముల కొడిగట్టిరి. దానిచే చివరకు తమ కులక్షయమును తామే కొనితెచ్చుకొనిరి. ఇట్టు లన్యాయముగ లోభముతో యోధులను చంపుటకన్న బిచ్చమెత్తుకొనుటో నీవారజీవనమో శిల్పజీవనమో శ్రేష్ఠతరము గదా! తొల్లి యీ కురువంశమంతరించ బోవుచుండగ నీవు శత్రునాశకులగు గోలకపుత్రులను బుట్టించి యీ వంశమును నిలువబెట్టితివి. తరువాత కొద్దికాలమునకు ఉత్తరాసుతుడగు నా తండ్రియొక పరమతాపసుని మెడలో పామునేల వేసెనో నాకు వింతగనున్నది. ఓ మునివర! క్షత్రియ కులజుడెవ్వడు గూడ నొక బ్రాహ్మణుని ద్వేషింపడు. అట్లు మౌనముగ తపమొనర్చుకొను మునికి నా తండ్రి యట్లేల చేసెనో కదా! నీవు సర్వజ్ఞుడవు. దయానిధివి. నా యీ సంశయములన్నిటిచే నా మనస్సు వికలమై పరిపరి విధములు కలతజెందుచున్నది. వీనిని వారించి నా మదికి శాంతి చేకూర్చుము.

అధ్యాయము 64 కర్మ ప్రభావము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

Chapter 62 Rama Done Navaratri Vratha With the help of Narada - అధ్యాయము 62 నారదుని ద్వారా రాముడు దేవీ నవరాత్రములు ఆచరించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 62

నారదుని ద్వారా రాముడు దేవీ నవరాత్రములు ఆచరించుట

వ్యాసమునిచంద్రు డిట్లనియె : ఈ ప్రకారముగ రామలక్ష్మణులు విచారించి మౌనముగ నుండిరి. అంతలో గగన సీమనుండి నారద భగవాను డేతెంచెను. ఆ మహర్షి షడ్జాది స్వరములతో నొప్పారు మహతీ వీణను మీటుచు బృహద్రథ సామగానము సేయుచు రాముని సమీపించెను. తేజశ్శాలి యగు రాము డతనిని వీక్షించి యతనికి శుభాసనము నర్ఘ్యపాద్యములు నొసంగి పరమపూజ లాచరించి యంజలి ఘటించి యతని యనుమతితో నతని సన్నిధి నుపవిష్టుడయ్యెను. 

రాముడు తన తమ్మునితో గూడి మదిలో గుందుచు దిగులుతో గూరుచున్న శ్రీరాముని మహర్షి కుశల మడిగెను: "ఓ రాఘవేంద్రా! ఒక ప్రాకృత నరుని పగిది శోకింతు వేల? క్రూరుడు రావణుడు సీతను హరించుట నే నెఱుంగుదును. అతడు తన చావు తానెఱుగలేక మోహవశమున సీత నపహరించెను. ఇదంతయును నేను సురలోక మందుండియే వింటిని. 

ఓ కాకుత్థ్సా! నరాధిపా! నీవు రావణ వినాశమునకే యవతరించితివి. అందులకే యతడు సీత నపహరించెను. పూర్వజన్మమున సీత యొక ముని కుమారిగ జన్మించెను. ఆమె వనములందు ఘోర తప మొనరించుచు రావణుని కంటబడెను. అతడామెను తనకు భార్యగ గమ్మని వేడుకొనెను. కాని, యామె యతనిని తిరస్కరించెను. అతడామె కేశపాశములు బట్టి బలిమితో లాగెను. ఓ రామా! ఆ దుష్టాత్ముని స్పర్శము చేత తన శరీరము కళంకితమైనదని యెంచి యామె తన తనువు చాలింపదలచెను. ఆమె వెంటనే కోపమునం 'ఓరీ దురాత్మా! నేను నీ వినాశమునకై భూమిపై నయోనిజగ సంభవింపగలను' అని శపించి యామె తన మేను చాలించెను.

ఆ యీ సీత లక్ష్మ్యంశ సంభూతురాలు. నాగుపామును పూలమాల యను భ్రాంతితో బట్టినట్లుగ నతడు తన కులనాశనమునకు సీత నపహరించెను. ఓ సుజన మనోనయనాభిరామా! రామా! అతని సర్వనాశమునకే నీవును సంభవించితివి. ఎల్లదేవతలును ప్రార్థింపగా జన్మములేని నీవు నారాయణాంశమున నజుని వంశమునందు అవతరించింతివి. మహాబాహూ! ధైర్యము వహింపుము. అచ్చట సీతయును ధర్మరతయు సతియునై అవశయై రేయింబవళ్ళు నిన్నే తన మదిలో ధ్యానించుచు నున్నది. 

దేవేంద్రుడు స్వయముగ నొక పాత్రలో నమృత మధురములైన కామధేనువు పాలు పోసి త్రాగుట కామె కంపించెను. ఆ దివ్య గోక్షీరము త్రాగుటచే నా కమలదళనయన యాకలి దప్పులు పాసి సుఖ ముండెను. ఇదంతయును నేను గంటిని. రాఘవా! రావణుడు చచ్చుటకు నీకొక వ్రతము దెల్పుదును. అదేమన, నీ వాశ్వయుజ మాసమున శ్రద్ధతో శ్రీదేవీ నవరాత్ర వత్ర మాచరింపుము. రామా! నవరాత్రములం దుపవసింపుము. దేవిని జపహోమాది విధులతో బూజింపుము. నీకు సర్వసిద్ధులు కరతలామలకము లగును. దేవికి యాగ పశువును బలి యొసంగుము. జపదశాంశము వేల్చుము. దీనివలన నీ వధిక శక్తిమంతుడవు గాగలవు. 

పూర్వము శ్రీ మహావిష్ణువు శివుడు బ్రహ్మ సురలోకమందలి యింద్రుడును యథావిధిగ నీ దేవీ నవరాత్ర వ్రతము జరిపిరి. నీలమేఘశ్యామా! రామా! ఈ నవరాత్ర వ్రతమును సుఖములు బొందువారు సేయవలయును. కష్టములలో బాధపడువారు చేయుట మరింత యవసరము. తొల్లి వసిష్ఠుడు భృగువు కశ్యపుడు విశ్వామిత్రుడు నీ దేవీ నవరాత్ర వ్రతము సల్పి సుఖించి రనుటలో లేశమయినను సందియము లేదు. 

మునుపు బృహస్పతి భార్య యపహరింపబడెను. అపుడత డీ దేవీ నవరాత్ర వ్రత మాచరించెను. నీవును రావణ వధార్థము దీని నాచరింపుము. మున్ను దేవపతి వృత్ర సంహారమునకును శివుడు త్రిపుర వినాశమునకును ఈ దేవీ నవరాత్ర వ్రత మాచరించిరి.

సీతాపతి! మహామతీ! శ్రీహరి తొలిసారిగ మధు సంహారమునకు మేరుగిరిపై శ్రీదేవీ మహావ్రతము యథావిధిగ నప్రమత్తతతో నొనరించెను. 

రామభద్రుడిట్లనియెను : ఓ దయానిధీ! సర్వజ్ఞా! ఆ మహాదేవి యెవరు? ఆమె పేరేమి? ఆమె యెట్లు ప్రాదుర్భవించెను? ఆమె ప్రభావ మెట్టిది? ఆ దేవీ వ్రతమేది? నా కంతయు యథావిధి నెఱిగింపుము. 

నారదు డిట్లనియెను: ఓ రామా! శ్రద్ధగ నాలింపుము. ఆ దేవి నిత్య - సనాతని - ఆద్యశక్తి- విశ్వపూజిత-సర్వదుఃఖనాశని - అభీష్ట ప్రదాయిని. గడ్డిపోచ మొదలుకొని బ్రహ్మవఱకు గల సకల జంతువుల కామె కారణభూతురాలు. ఆమె చేతనశక్తి తోడులేనిచో నెవడును కదలనైన నోపడు. బ్రహ్మలోని పుట్టించు శక్తియు విష్ణు నందలి పాలనశక్తియు రుద్రుని యందలి సంహారశక్తియు నివన్నియు నా మహాశక్తి యొక్క ప్రతిరూపములే. ఆ మహాశక్తియే పరాశివశక్తి యన చెలువు మీరును. ఈ రేడు లోకాలలో సదసదాత్మక రూపమున భాసిల్లు ప్రతి చిన్న వస్తువులోని శక్తియు నా పరాచైతన్య మహాశక్తి నుండియే కలుగుచున్నది. 

ఈ సకల సృష్టికి పూర్వము హరిహరబ్రహ్మలు సూర్యుడు సురపతి భూమి గిరులు మొదలగు దేవతలు ఎవరును - ఏమియు నుండలేదు. అట్టి సమయమున ఆ పరమ ప్రకృతి శక్తి పరమపురుషునితోడి పరమ బ్రహ్మానంద సంగమమున పరిపూర్ణయై నిర్గుణ శివ స్వరూపమున విలసిల్లెను. సృష్టి ప్రారంభమున నా ప్రకృతి మహాశక్తి సగుణ రూపము దాల్చును. ఆ శక్తి యీ భువనత్రయమును సృజించును. బ్రహ్మాదులను పుట్టించి, వారిని సర్వశక్తి సంపన్నులను జేయుము. ఆ యెల్ల లోకముల నేలెడి తల్లి - మహావిద్య - వేదాద్య - వేదకారిణి - యని యెఱిగినవాడు జన్మమరణ సంసార సాగర బంధనముల నుండి విముక్తు డగును. 

ఆ మహాదేవి యొక్క గుణకర్మ విభాగములు బట్టి బ్రహ్మాదు లామెకు పెక్కు నామము లుంచిరి. ఆ దేవీ నామము లనంతములు. అకారాది క్షకారాంతములగు స్వర వర్ణఘటనలతో నా దేవీ సుధామధుర నామములు శతసహస్రాధికములు గలవు.

అనగా 

రాముడిట్లనియెను: ఓ దేవర్షీ! నా కా దేవీ వ్రత విధానము సంక్షేమముగ దెల్పుము. నే నిపుడే శ్రద్ధా భక్తులతో దేవీ వ్రత మాచరింతును. అన నారదుడిట్లనియెను. ఓ రామభద్రా! ఒక సమతల ప్రదేశమున నొక పీఠమేర్పరచవలయును. దానిపై జగదంబికను స్థాపించవలయును. ఉపవసించి యథావిధిగ దేవీ నవరాత్ర వ్రత మాచరింప వలయును. 

ఈ దేవీ శుభవ్రత మహోత్సవమునం దాచార్యుడుగ నేనే యుందును. నాకు దేవీ కార్య నిర్వహణమున నమితోత్సాహము గల్గుచుండును.''

వ్యాసుడిట్లనియెను: ముని పలుకులు విని అవి లోన గట్టిగ నమ్మి మహావీరుడగు రాముడొక యున్నతమైన పీఠము చేయించెను. దానిపై నంబికను ప్రతిష్ఠించెను. రాముడా గిరిపై నుండగనే యంతలో నాశ్వయుజ మాసము సమీపించెను. శ్రీరాముడు యథావిధిగ దేవీ నవరాత్ర పూజ లోనరించెను. రాముడుపవాసముతో నుత్తమ దేవీ వ్రత మాచరించెను. యథా విధిగ పూజా హోమ బలి విధానము లొనరించెను. ఆ యిరువు రన్నదమ్ములును నారదానుమతముతో దేవీ వ్రతము సలిపిరి. 

అష్టమినాడు నడిరేయి శ్రీ భగవతీదేవి వారి భక్తిభావమునకు సుప్రసన్నయై సింహాసనాసీనయై గిరిశిఖర మందుండి వారికి దర్శన భాగ్య మొసంగి మేఘగంభీర నాదమున సానుజుడగు రామున కిట్లనియెను:

"రామా! రామా! ఓ మహాబాహూ! నీ వొనరించిన వ్రతమునకు సంతుష్టి జెందితిని. నీ మన మందలి యేదేని వరము గోరుకొనుము. నీవు నారాయణాంశ సంభూతుడవు. పావన మను వంశ పంజాతుడవు. అమరులు నిన్ను రావణ వధార్థము ప్రార్థించిరి. మున్ను నీవు మత్స్యరూపము దాల్చి క్రూర దనుజుని హతమార్చితివి. దేవతల మేలు గోరి వేదములను గాపాడితివి. కూర్మ రూపము దాల్చి మందరగిరి నెత్తితివి. పాలసంద్రము మధించునపుడు విబుధులకు సంతసము గల్గించితివి. వరాహావతార మెత్తి కొనకోఱలపై భూమిని ధరించితివి. హిరణ్యాక్షుని వధించితివి. భీకర నరసింహావతారము ధరించి హిరణ్యకశిపుని పరిమార్చితివి. 

రామా! భాగవతోత్తముడగు ప్రహ్లాదుని గాచితివి. వామన రూపమున బలి గర్వ మడగించితివి. దేవకార్యము నిమిత్త మింద్రునకు సోదరుడ వైతివి. విష్ణువంశమున జమదగ్నికి తనయుడవై యుద్భవించితివి. క్షత్రియుల నెల్ల సంహరించితివి. బ్రాహ్మణులకు భూమి నంతయును దాన మొసంగితివి. 

ఓ కాకుత్థ్సా! అట్టి నీవే యిపుడు దశరథుని నందనుడవై యవతరించితివి. రావణ పీడితులైన దేవత లెల్లరును నిన్ను శరణు వేడిరి. ఇచటి కపివీరులు దేవాంశజులు. మహాబలవంతులు. వీరు నీకు సాయ మొనరింపగలరు.

నీ యీ రూపములన్నియును నా మహాశక్తితో సంపన్నములై సంభవించినవి. లక్ష్మణుడు శేషు నంశమున నుద్భవించెను. అతడు రావణుని కుమారుని పరిమార్చగలడు. నా మాటలందు నీ కెంతమాత్రమును సందేహము వలదు. 

ఇదే విధముగ నీవు వసంత నవరాత్రములను జరిపి శ్రద్ధతో దేవీపూజ లొనరింపుచుండవలయును. నీవా పాపాత్ముడగు రావణాసురుని దునుమాడి భూమిపై పదునొక్కండు వేలేండ్లు సుఖశాంతులతో రామరాజ్యము నెలకొల్పుదువు. ఆ పిదప నీవు స్వర్గలోక మేగుదువు అని యీ విధముగ దేవి పలికి యంతర్ధాన మొందెను. 

శ్రీరాముడు సంతుష్టాంతరంగుడయ్యెను. శ్రీరాముడీ విధముగ శ్రీ మద్దేవీ నవరాత్ర వ్రతము పరిసమాప్తము గావించి దశమినాడు విజయా (దశమీ) పూజ లొనరించి అనేక దాన ధర్మము లొనరించెను. జైత్రయాత్ర సాగించెను. ఆ రణశూరుడు కోదండ రాముడు నగు రాముడు కపిపతి యగు సుగ్రీవ బలము సాయముతో లక్ష్మణుని గూడి పరమశక్తి ప్రేరితుడై పూర్ణకాముడై సముద్రముపై సేతువు గట్టెను. సురవైరి యగు రావణు నంతమొందించెను. సుగుణకీర్తిధాముడై స్థిరముగ విలసిల్లెను. 

ఏ పుణ్యాత్ముడుడీ యుత్తమోత్తమమైన దేవీ చరిత్ర మాకర్ణించునో యతడు విపుల భోగములంది పిదప పరమసౌఖ్యము లనుభవించును. ఎన్నెన్నో పురాణములు విపులములు గలవు. కాని యవన్నియు శ్రీ మద్దేవీ భాగవతముతో సరిపోలజాలవనియు నా దృఢ విశ్వాసము అని వ్యాసముని జనమేజయునితో పలికెను.

అధ్యాయము 63 జనమేజయుని సంశయములు

Chapter 61 Sita Kidnap - అధ్యాయము 61 సీతాపహరణము

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 61

సీతాపహరణము

వ్యాసభగవాను డిట్లనెను: ఆ దురాత్ముని మాటలు విని సీత భయాకుల చిత్తయై వణకుచు నెట్టకేలకు మది దిట్ట పఱచుకొని యతనితో నిట్టు లనెను: "పౌలస్త్యా! ఏల మదనమోహితుడవై యసద్వాక్యము లాడెదవు? నేను కులటను గాను. జనక కుల సంజాతను. దశముఖా! నీవు లంక కేగుము. కాదేని రాముడు నిన్ను హతమార్పగలడు. నా నిమిత్తమున నీకు చావు వ్రాసియున్నదేమో! అని యిట్లు సీత పలికి లోకరావణుడగు రావణునిగూర్చి పోపొమ్మని పలుకుచు పర్ణశాలలోని యగ్ని సన్నిధి కేగెను. 

అపుడతడు రాక్షస స్వరూపము ధరించి లోని కేగి భయవిహ్వలయై యో రామా! రామా! ఓయి లక్ష్మణా! యని మాటిమాటికి నెలుగెత్తి యేడ్చుచున్న సీతను బలిమితో బట్టుకొనివచ్చి తన తేరి నెక్కించి ఆ పాపాత్ముడు త్వరితగతిని వెడలిపోయెను. అరుణతయుడగు జటాయువు త్రోవలో రావణు నడ్డగించెను. అపుడా వనమందు వారిరువురకు పోరు ఘోరముగ జరిగెను. తుదకు రాక్షసరాజు జటాయువును చంపి కురరి (ఆడ లకుముకిపక్షి) వలె విలపించు సీతను గొని లంక కేగి అచట నశోక వృక్షము క్రింద నుంచెను. మ్రుక్కడిరక్కసుల గుంపు లామె చుట్టు నుండెను. వారెన్ని యో సామదానములు ప్రయోగించిరి. ఐనను నా పరమపావని తన పవిత్ర చరిత్రమును ధ్రువముగ నిలుపుకొనెను.

అట రాముడు జింకను చంపి తీసికొని వచ్చుచుండెను. అంతలో నతని కెదురుగ లక్ష్మణు డేతెంచెను. అతనిని గని రాముడు "ఓ యనుజా! ఎంత ఘోరము చేసితివి? ఆ పాపిష్ఠుని మారుగొంతుకతోడి పిలుపు విని ఒంటరిగ నున్న నా ప్రియురాలిని వదలి యిట కేల వచ్చితివి?" అన అది విని సౌమిత్రి రామునితో "ప్రభూ! నేను సీతా వాగ్చాణముల దెబ్బతిని దైవయోగముననిటకు వచ్చితిని. ఇందు నా దోష మేమియును లేదు" అనెను. 

అంత వారిరువురును పర్ణశాల కేగి చూచిరి. కాని, యట వారికి సీత కనబడలేదు. అపుడు వారు దుఃఖతమతులై సీతను వెదుక సమకట్టిరి. ఆమెకై కలయ వెదకుచు వెదకుచు కొనయూపిరితో పడియున్న జటాయువును గాంచిరి. "సీతను రావణుడు తీసికొనిపోయెను. నేనా పాపాత్మునెదిరించి యిచట పడిపోతిని" అని పలికి జటాయువు ప్రాణములు వదలెను. రాముడు జటాయున కంత్యక్రియలు జరిపెను. వారిరువురందుండి మరల ముందునకు సాగిరి. పిదప కబంధుడు రామబాణములచే చచ్చి శాపమునుండి ముక్తుడయ్యెను. కబంధుని మాట ననుసరించి రాఘవుడు సుగ్రీవునితో మైత్రి చేసికొనెను. వాలిని దునిమి రామ సుగ్రీవులు పరస్పరము సాహాయ్యము చేసికొనుటకు ప్రతినలు చేసికొనిరి. రాముడు సుగ్రీవుని కిష్కింధకు రాజుగ జేసెను. అచట సుగుణధాముడగు రాముడు రావణుడు కొనిపోయిన తన ప్రియయగు జానకిని స్మరించుచు లక్ష్మణునితో వర్షాకాలము నాలుగు నెలలు గడపెను.

రాముడు దుర్భర సీతావియోగముతో తన తమ్మున కిట్లనెను. "లక్ష్మణా! ఇపుడు కైక కోరిక పూర్ణమైనది. నా జానకి లభించనిచో నేను బ్రతుకజాలను. నా సీత లేనిచో నయోధ్యకు రాజాలను. నా రాజ్యము పోయెను. వనవాసము మిగిలెను. తండ్రి గతించెను. ప్రియ హరింపబడెను. దుష్ట దైవము నన్నిట్లు వేధించుచు ఇంక ముందేమి చేయనున్నదో తెలియదు. 

లక్ష్మణా! ప్రాణుల భవితవ్య మెంతటివారికిని తెలియదు. మన కింక నెంతటి దుఃస్థితి పట్టనున్నదో కదా! మనము మనువంశమునందు రాజులమై జన్మించితిమి. కాని, పూర్వ కర్మానుసారముగ నిపుడు వనములందు వెతలతో మనుచున్నాము. సౌమిత్రీ! నీవును రాజభోగములు పరిత్యజించి దైవయోగమున నా వెంట వచ్చితివి. ఇపుడు తీరని దుఃఖములను బాగుగ ననుభవింపుము. 

మన పవిత్ర వంశమందు నావంటి దుఃఖభాగి అకించనుడు అసమర్థుడు క్లిష్టుడు పూర్వము లేడు. ముందుండబోడు. నే నీ దుఃఖసాగరమున మునిగితిని. నిస్సహాయుడనగు నా కింక తరణోపాయ మేదియును లేదు గదా ! నా కిపుడు బలముగాని ధనముగాని లేవు. నీ వొక్కడవే నాకు తోడు - నీడ. నేను నా స్వయంకృత మనుభవించుచున్నాను. ఇతరు నెవని గోపింపగలను? 

ఒక్క త్రుటిలో నింద్రసభా సమానమైన రాజ్యము చేత జిక్కినట్లే చిక్కి మాయ మయ్యెను. వనవాసము ప్రాప్తమయ్యెను. దైవ నిర్మిత మెవ డెఱుంగును? బాల భావమున మన వెంట వచ్చెను. ఆమెయును దైవదుర్విపాకమున దుఃఖతరమైన దుర్దశ ననుభవించుచున్నది. సుశీల పతివ్రత యగు నామె నా పట్ల నత్యంతప్రీతితో వర్తించును. అట్టి యామె నేడు లంకేశు నింట నెన్ని బాధలు పడుచున్నదో కదా! ఆ వైదేహి రావణున కెన్నడును వశవర్తిని గాదు. పావన జనకనందిని స్వైరిణివలె నెటుల గాగలదు? 

ఒకవేళ రావణుడు బలాత్కరించినచో సీత ప్రాణములైన వదలును గాని యతనికి మాత్రము స్వాధీన గాదని నా నిశ్చయము. ఆ యసితాపాంగి యగు జానకి మరణించినచో నేను ప్రాణములు వదలుదును. ఆమె గతించిన పిమ్మట నా కీ తనువుతో నేమి పని?''

అని బిట్టు విలపించుచున్న కమలలోచనుడు ధర్మాత్ముడునగు శ్రీరాముని లక్ష్మణు డూరడించి ప్రియహిత వచనముల నిట్లు పలికెను. "ఓ మహాబాహూ! భయ ముడుగుము. నే నా రాక్షసాధముని హతమార్చి వైదేహిని దెత్తును. 

ధీరులు సంపదలందు నాపదలందును ధైర్యమువలన సమభావమున నుందురు. అల్పమతులు కష్టసుఖములందు మునిగిపోదురు. సంయోగ వియోగములు రెండును దైవాధీనములు. ఈ యనాత్మయగు తనువునుగూర్చి యింతగ శోకింపనేల? రాజ్యమునుండి మనకు వనవాస మెట్లు కలిగెనో వైదేహీహరణ మెట్లు సంభవించెనో అటులే మంచికాలము వచ్చినపుడు మనకు మరల సంయోగము కూడ సంభవించును. సుఖదుఃఖములు మనలను వెన్నాడుచుండును. వాని ననుభవించిన గాని యవి తీరిపోవు. 

కావున నో జానకీరమణా! ఇపుడు శోక ముడుగుము. ఇచట పెక్కురు వానరులు గలరు. వారు నలుదెస లేగి సీత జాడ నరసి రాగలరు. పిమ్మట చక్కని మార్గము గుర్తించి అచటి కేగి మనము పరాక్రమముతో నా పాపకర్ముని రూపుమాపుదము. మైథిలిని గొనివత్తము. కాదేని భరతుని ససైన్యముగ సోదరునితో గలిసి రప్పించుదము. అపుడు మన మెల్లరమును కలిసి శత్రువును (రావణుని) పరిమార్చెదము. ఇంతమాత్రాన కూరక శోకింపనేల? 

పూర్వము రఘుమహారాజొక్క రథముతో నేగి యెల్ల దిక్కులను జయించెను. నీ వా రఘువంశ సంజాతుడవు. ఇంక శోకింపతగవు.

నే నొక్కడనే సకల సురాసురులను గెలువజాలినవాడను. ఇక నీవును తోడు నీడగ నుండగ కులపాంసనుడగు రావణుడొక లెక్కయా? అట్లు కాదేవి జనకుని సాయము బడసి సురకంటకు డగు దుష్ట రావణుని అంతమొందింతము. సుఖము తరువాత దుఃఖము, దుఃఖము తరువాత సుఖము రెండును బండి చక్రము వలె తిరుగుచుండెను. ఒక్క దుఃఖముగాని సుఖముగాని రాదు. సుఖ, దుఃఖములు కలిగినపుడు ఎవని మనస్సు భయగ్రస్తమగునో యతడు శోకసాగరమగ్ను డగును. 

అట్టి వానికి సుఖ మెట్లు గలుగును? మున్నింద్రుడు దుఃఖముల పాలుగాగా దేవత లెల్లరు గలిసి యతని స్థానమున నహుషు నుంచిరి. అపుడు సురపతి యంతవాడే భీతిల్లి తన పదము బాసి యొక పద్మము నడుమ పెక్కేడు లజ్ఞాతవాసమున నుండెను. పిమ్మట కాలము రాగా నింద్రుడు మరల తన పదవి తాను బడసెను. నహుషుడు శాపవశమున నజగరమై నేల గూలెను. నహుషు డింద్రాణిని గోరెను. విప్రులను దిరస్కరించెను. 

అందువలన నగస్త్యునిచే నతడు సర్పము కమ్మని శపింపబడెను. కునుక నో సుగుణాభిరామా! తెలివి గలవాడు కష్ట కాలములందు శోకింపగూడదు. అతడు తన పనిలో చిత్తముంచి వర్తింపవలయును. ఓ మహానుభావా! త్రిజగత్పతీ! నీవు సమర్థుడవు. సర్వజ్ఞుడవు. ఒక ప్రాకృత నరునివలె నాత్మ నింతగ క్షోభ పెట్టుకొందువేల? ఈ రీతిగ బలుకు లక్ష్మణుని వచనములచే ప్రబోధితుడై రఘురాముడు అధిక శోకము వదలి శాంత చిత్తుడయ్యెను అని వ్యాసముని జనమేజయునితో పలికెను.

అధ్యాయము 62 నారదుని ద్వారా రాముడు దేవీ నవరాత్రములు ఆచరించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 60 The Story Of Sitarama - అధ్యాయము 60 శ్రీసీతారామ చరిత్ర

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 60

శ్రీసీతారామ చరిత్ర

''శ్రీరాముడెట్లు రాజ్యభ్రష్టు డయ్యెను? సీతాపహరణ మెట్లు జరిగెను? రాము డేవిధముగ సుఖప్రదమగు శ్రీదేవీ వ్రత మాచరించెను? అంతయు నాకు తేటతెల్ల మొనరింపుము'' అని జనమేజయు డడుగ. 

వ్యాస భగవాను డిట్లనెను: పూర్వము సూర్యవంశజుడగు దశరథ మహారాజయోధ్యా పురమేలుచుండెను. ఆ రాజు దేవ బ్రాహ్మణులను బూజించువాడు. ఆ పురము సకల సంపదలతో స్వయంసమృద్ధము. ఆ రాజునకు శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నులను పేర్లతో త్రిలోక విఖ్యాతి బడసిన నలువురు కొమరు లుద్భవించిరి. సుగుణగణములందు సురూపసంపదలందు వారికి వారే సాటి. వారు తమ తండ్రి కత్యంత ప్రీతిపాత్రులు. శ్రీరాముడు కౌసల్యానందనుడు. భరతుడు కైక కొడుకు. సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులను నిరువురు కొమరులు గలిగిరి. 

వారు బాల్యమునుండియే ధనుర్బాణధరులైయొప్పెసగిరి. వారు నలువురును తమ కులోచిత సంస్కారములు బడసి తమ తల్లిదండ్రులకు ప్రియము సుఖము గూర్చుచుండిరి. 

అంత నొక్కనాడు విశ్వామిత్ర మహర్షి యేతెంచి శ్రీరాముని తనతో బంపుమని దశరథుని కోరెను. దశరథుడు పదారేండ్ల ప్రాయముగల రాముని లక్ష్మణుని యాగ సంరక్షణార్థము విశ్వామిత్రుని వెంట బంపెను. ఆ సుందరాకారులు ముని వెంట బయనించుచు త్రోవలో ఘోరరూపయగు తాటక యను రక్కసిని చంపిరి. ఒక్క రామబాణముననే మునులకు దుఃఖదాయినియగు ఆ రక్కసి మడిసెను. సుబాహు దానవుడు సమసెను. రాముని బాణ వేగమున మారీచుడు చచ్చినంతపనియై దూరముగ చిమ్మివేయబడెను. 

ఇట్లు రామలక్ష్మణులచే కౌశికుని యాగ పరిరక్షణమను సత్కర్మము నెరవేర్చి -

అటనుండి శ్రీరామలక్ష్మణులు కౌశికుని వెంట మిథిలకు జనుచుండిరి. మార్గమధ్యమున పరమపావనమగు శ్రీరామ పాదధూళి సోకినంతనే యహల్య పాపరహితయై శాపవిముక్త యయ్యెను. వారు ముని వెంట విదేహనగర మరిగిరి. 

అట జనకుడు సీతా స్వయంవరమున శివచాపమును పణముగ నుంచెను. దానిని రామభద్రు డవలీలగ దునిమి రమాంశ సంజాతయగు జానికిని వివాహ మయ్యెను. జనకుడు తన మరొక పుత్రియగు నూర్మిళను లక్ష్మణున కొసంగెను. సుశీలురు శుభలక్షణోపేతులు నగు భరతశత్రుఘ్ను లిర్వురును కుశధ్వజుని కూతులను పెండ్లి చేసికొనిరి. ఆ విధముగ నలుగు రన్నదమ్ములకు మిథిలాపురియందు విధి విధానముగ వివాహ మంగళ మహోత్సవము జరిగెను. 

శ్రీరామచంద్రుడు రాజ్యమునకు యోగ్యుడుగాగ దశరథు డతనికి పట్టము గట్టదలచెను. ఆ రామ పట్టాభిషేక మహోత్సవము గని యీసున కైక తన వశవర్తియగు దశరథుని తన వెనుకటి రెండు వరములిమ్మని కోరెను. అందులో మొదటిది తన కొడుకగు భరతునకు రాజ్యమిచ్చుట. రెండవది రాముని బదునాలుగేండ్లడవుల కంపుట. ఆ తల్లి మాట ప్రకారము సత్యధర్మపరాక్రముడగు రాముడు సీతను లక్ష్మణుని వెంటగొని నిశాచరులు తిరుగు దండకాటవి కేగెను. 

దశరథుడు శ్రీరామ వియోగ భారము సైపలేక తన కున్న శాపము దలంచుచు హే రామ! రామ! యనుచు ప్రాణములు వదలెను. భరతుడు తన తల్లి కుతంత్రమును తండ్రి చావును గని రామునకు ప్రియము గూర్చు తలంపుతో రాజ్యము గైకొనకుండెను.

రాముడు పంచవటిలో నివసించుచుండగా రావణుని చెల్లెలు శూర్పణఖ కామాతిరేకమున రాముని సమీపించి లక్ష్మణునిచే వికృతగ జేయబడినది. ఆమె ముక్కు చెవులు తెగుటచూచి రాక్షసులు మహాతేజస్వి యగు రామునితో పోరు సలిపిరి. సత్యపరాక్రముడగు రాము డతిబలులగు ఖరాది రాక్షసులను దునుమాడి మునులకు హితము చేకూర్చెను. 

ఆ దుష్ట శూర్పణఖ లంక కేగి శ్రీరాముని చేతిలో ఖరదూషణాదులు చచ్చుటను రావణునకు దెలిపెను. వారి మరణవార్త విని రావణుడు కోపోద్రేకమున రథమధిరోహించి మారీచాశ్రమమున కేగెను; సీతన ప్రలోభపెట్టులకు మారీచుని అసంభవమైన బంగరు లేడిగ జేసి దానిని సీత కడ కంపెను. మాయావి యగు అతడు బంగరు లేడియై చిత్రవిచిత్ర గతులతో దుముకుచు సమీపమున తిరుగుచు కంటబడెను. దానిని గాంచి దైవ ప్రేరణచేత సీత స్వాధీన పతికవలె తన కా జింక తోలు తెచ్చి యిమ్మని రామునడిగెను. రాముడనాలోచితముగ నచ్చట లక్ష్మణు నుంచి ధనుర్బాణములు దాల్చి ఆ జింకను వెంబడించెను. 

ఆ మాయా చతురమగు లేడి రాముని గని యతనికి గనబడి కనబడక వనాంతరమునకు చేరెను. అది తన చేతి కందుబాటులో నుండు టెరిగి రాముడు మహాక్రోధముతో తీవ్రశరముతో మాయలేడిని గూలనేసెను. ఆ మాయావి యగు దుష్ట మారీచుడు రాముని బాణపు దెబ్బ తిని హే లక్ష్మణా! హతుడ నైతినని రోదించి నేలగూలెను.

ఆ యార్తనాదము విని యది తన రామునిదే యని తలచి సీత దీనయై లక్ష్మణా! నీవు వేగిరమే వెళ్ళుము. రఘునందనుడు హతు డగుచు నిన్ను కేక వేసెను. అతనికి వెంటనే సాయపడుము' అని లక్ష్మణునితో పలుక నత డిట్లనియె: 

"అమ్మా! రాముడు హతుడైనను నాశ్రమమున నిస్సహాయురాలవగు నిన్ను వదలి నేను వెళ్ళను. నన్నిచ్చట నుండుమని రామాజ్ఞ. దానిని మీరి నేను నీ సాన్నిధ్యము వదలను. ఆ మాయామృగము రాఘవుని కడు దూరము గొనిపోయి యుండినను నిన్ను వీడినే నడుగైన ముందుకు వేయను. ధైర్య మవలంబింపుము: ఈ నేలపై మహావీరుడగు రామచంద్రుని చంపగల వాడు లేడు. రామాజ్ఞను త్రోసిపుచ్చి నిన్ను వదలి నేను వెళ్ళను."

ఆ సీత కల్లకపటము లేనిదైనను క్రూరభావమున శుభలక్షణలక్షితుడగు లక్ష్మణుని గని విధి ప్రేరణచే విలపించుచు నిట్లనియెను: 

"సౌమిత్రీ! నీవు నాయం దనురక్తుడ వగుట నే నెఱుగుదును. భరతు డందులకే నిన్ను ప్రేరించి పంపెను. ఓ మోసగాడా! నే నొక మోసగత్తె యగు స్వేచ్ఛాచారను గాను. రాముడు చనిపోయినను కామవశత నిన్ను పతిగా గొనను. ఆ రాముడు తిరిగి రానిచో నేను నా జీవితమునే వదలి పెట్టుదును. 

అతడు లేమి విధవనై వంతలపాలై మనజాలను. నీవుండుము లేక పొమ్ము. నీ యభీష్టము నాకు తెలియదుగాని ధర్మరతుడగు జ్యేష్ఠు నందలి నీ సౌహార్ద మేమయ్యెను?"

అను సీత పలుకులు విని దీనవదనుడు గద్గదకంఠుడునై లక్ష్మణుడు జానకి కిట్లు పలికెను. "ఓ భూమిజా! ఇంత కఠినతరముగ నా విషయమున పలుక నేల? దీనివలన మున్ముందు నీకు ఏదేని అరిష్టము చుట్టుకొనునని నా మదికి దోచుచున్నది'' అని పలికి లక్ష్మణుడు తుట్టతుదకు సీతను బాసి విలపించుచు రామభద్రుని పదచిహ్మములను గనుచు నేగెను. 

వెనువెంటనే రావణుడు కపటభిక్షు వేషమున నాశ్రమమును ప్రవేశించెను. సీత యతనిని యతిగ నెంచి సాదరమున నర్ఘ్యమొసగి యతనికి వన్యభోజ్య పదార్థము లర్పించెను. ఆ దురాత్ముడు మెత్తని కంఠమున మెల్లగ నామె కిట్లనెను. 

"ఓ పద్మదళాక్షీ! ప్రియా! నీ వెవ్వతెవు? ఈ వనమున నొంటిగ నుంటివేల? నీ తండ్రి యెవడు? సోదరు డెవడు? పతి యెవడు? ఏకాకినివై మూఢురాలవువలె నుంటివేల? సౌధము లందుండదగిన నీ వీ యడవులం దొంటిగ నుండలేల? దేవకన్యాసమాన ప్రభగల నీవు ఈ పర్ణశాలలో ముని పత్నిగ నుండదగవు."

ఇట్లు పలికిన తరువాత గూడ ప్రారబ్ధముచే వైదేహి మండోదరిపతి యగు రావణుని దివ్య యతిగనే భావించి యతని కిట్లనెను: 

"శ్రీయుతుడగు దశరథ మహారాజునకు నలువురు కుమారులు. వారిలో పెద్దవాడు నా పతి. అతడు పావన రామ నామమున విఖ్యాతుడు. దశరథు డిచ్చిన వరము కారణమున కైకేయి రాము నడవుల కంపెను. ఇట రాముడు లక్ష్మణునితో పదునాలుగేండ్లు వసించును. నేను జనకుని కూతురను. నన్ను సీత యందురు. శ్రీరాముడు శివధనుస్సు విఱిచి నన్ను వివాహము చేసికొనెను. 

ఆ రఘునాథుని బాహుబలమున మే మిట వనమున నిర్భయముగ మనగలుగుచున్నాము. నా నాథు డొక కాంచనమృగమును గని దానిని వధింప నరిగెను. అన్న పిలుపు విని లక్ష్మణుడు నిపుడే యేగెను. వారి భుజ విక్రమమున నే నిట భీతిలేక వసించుచున్నాను. మా వనవాస వృత్తాంత మంతయును నీ కెఱింగించితిని. వారిపుడే వచ్చి నీకు తగిన సత్కారము లొనరింపగలరు. యతివగు నీవు కేవలము విష్ణు స్వరూపుడవు. కనుక నేను నిన్ను బూజించితిని. ఈ మా యాశ్రమము ఘోర రాక్షస కులముల మధ్య నడవిలో నున్నది. కాని, త్రిదండి రూపమున నీ యడవి కేతెంచిన నీ వెవడవో నా యెదుట నిజము పలుకుము.

అను సీత పలుకులు విని రావణు డిట్లనియె: "శోభనాంగీ! నేను లంకాధిపతిని. మందోదరీపతిని. నీ కొఱకీ రూపు దాల్చి వచ్చితిని. ఈ జనస్థానమున ఖరదూషణులను నిరువురు సోదరులు చచ్చిరని నా సోదరి చెప్పగా నామెచే ప్రేరితుడనై వచ్చితిని. ఆ రాముడు రాజ్యభ్రష్టుడు; వనవాసి; దుర్బలుడు; భాగ్యహీనుడు; మనుజ మాత్రుడు నగుపతి. అతనిని వదలి రాజు నగు నన్ను వరింపుము. నీవే మండోదరికంటె పై స్థానమున పట్టపురాణివి కమ్ము. నేను నీ దాసుడను. ఓ భామినీ! నాకు స్వామినివి గమ్ము. 

ఓ జానకీ! నేను లోకపాలురనే జయించితిని. ఇపుడు నీ పాదాలపై బడుచున్నాను. నన్నను గ్రహించి సనాధుని చేయుము. అబలా! నేను నీ నిమిత్తముగ నీ జనకుని యాచించితిని. కాని, యతడు పణ మేర్పరచితినని నాతో ననెను. నాకారాధ్యుడగు రుద్రుని చాపమును నేను భంగము చేసిన నా దైవమునకు నవమాన మగునను భయముచే నేను స్వయంవరమునకు రాలేదు. కాని, నా మనస్సు మాత్రము విరహాతురమై నీ యందే లగ్నమై యున్నది. నీ వీ వనమందుండుట విని పూర్వానురాగ మోహితుడనై వచ్చితిని. నా శ్రమను సఫల మొనరింపుము."

అధ్యాయము 61 సీతాపహరణము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 59 Sridevi's Navratri Vrat Mahatmyam - అధ్యాయము 59 శ్రీదేవీ నవరాత్రవ్రత మాహాత్మ్యము

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 59

శ్రీదేవీ నవరాత్రవ్రత మాహాత్మ్యము

వ్యాసు డింకను నిట్లనియెను : కన్యకలలో మంచి కులమున బుట్టినదైనను కుష్ఠరోగము గలది - వ్రణములతో గూడినది. దుర్గంధముతో రోగ పుట్టించునది - వికల హీనాంగములు గలది పూజకు దగదు. పుట్టు గ్రుడ్డి మెల్లకన్ను గలది మిక్కిలి రోమములు గలది దీర్ఘ రోగగ్రస్తు రజస్సు మున్నగు యవన చిహ్నములు గలదియగు స్త్రీ పూజాది కర్మలకు బనికి రాదు. కృశాంగి - మిక్కిలి శిశువు - విధవాసంజాత - కన్యకకు బుట్టినది పూజాది సర్వ కర్మలందు బనికిరాదు. ఏ రోగములును లేనిది - యేక వంశసంజాత - వ్రణములు లేనిది - అందకత్తె - సురూప అగు కన్నియగు చక్కగ పూజింపవలయును. 

ఎల్ల కార్యములందు బ్రాహ్మణకన్యను భయమునకు రాచకన్నెను లాభమునకు వైశ్య కన్యనుగాని శూద్రకన్యనుగాని పూజింపవలయును. బ్రాహ్మణులు బ్రాహ్మణకన్యను క్షత్రియులు బ్రాహ్మణకన్యను వైశ్యులు త్రివర్ణముల కుమారికలను శూద్రులు చతుర్వర్ణముల కన్నెలను పూజింపవచ్చును. శిల్పులు తమ కొలమున బుట్టిన కన్నెలనే తగినట్లు బూజింపవలయును. ఈ విధముగ నవరాత్ర వ్రతమునందు భక్తి పూర్వకముగ కన్యలను దేవీభావమున బూజింపవలయును. ఈ నవరాత్రములందును నిత్యము నియతితో పూజింప శక్తి జాలనివారొక్క యష్టమినాడైన విశేషించి యెల్లప్పుడును శ్రద్ధాభక్తులతో దేవి నర్చింపవలయును. 

ఎందులకనగా, పూర్వము దక్షయాగ విధ్వంస కాలమునందు శ్రీ భద్రకాళి మహాభీకర స్వరూపముతో యోగినీగణ కోటులతో నష్టమినాడే ప్రాదుర్భవించినది. కావున అష్టమినాడు శ్రీ పరమేశ్వరిని నానావిధములగు నుపాహారములతో గంధమాల్యాను లేపనములతో నర్చింపవలయును. పాయసములతోను క్షత్రియాదులు మాంసములతోను బ్రాహ్మణ భోజనములతోను ఫలపుష్ఫోపహారములతోను జగజ్జననిని సంతోష పెట్టవలయును. 

ఓ రాజా! నవరాత్రములు పూర్తిగా నుపవసింప జాలనివాడు మూడునాళ్ళు మాత్రముపవసించిన జాలును; నవరాత్రముల ఉపవాస ఫలితమంతయు లభించును.

సప్తమి - అష్టమి - నవమి - యీ మూడు దినము లైకాంతిక భక్తితో శ్రీదేవిని బూజించిన సర్వ ఫలములును సంప్రాప్తమగును. ఈ దేవీ నవరాత్ర వ్రతము దేవీపూజలు హోమములు కుమారికాపూజలు బ్రాహ్మణ సంతర్పణములు వీనితో సంపూర్ణమగును. ఈ భూమండలమందు నితరములగు నానావిధ వ్రతములును దానములును దేవీ నవరాత్ర వ్రతముతో సరిపోలజాలవు. ఈ శ్రీదేవీ నవరాత్ర వ్రతము నిత్యము ధనధాన్యముల నిచ్చును. సుఖ సంతాన వృద్ధికరము. ఆయురారోగ్య ప్రదము, స్వర్గమోక్షదాయకము. 

విద్యార్థిగాని విత్తార్థిగాని పుత్రార్థిగాని యథావిధిగ మంగళకరమగు సౌభాగ్య సంపత్కరమగు ఈ దేవీ నవరాత్ర వ్రత మాచరింపవలయును. ఈ వ్రత సాధనము వలన విద్యార్థి సకల విద్యలు పడయును. రాజ్యభ్రష్టుడు మరల రాజ్యము పొందును. 

పూర్వజన్మమున దేవీవ్రత మాచరింపనివారు నేడు వ్యాధిగ్రస్తులు దరిద్రులు పుత్రహీనులై పుట్టుదురు. వంధ్య విధవ నిఱుపేదరాలునగు స్త్రీ వెనుకటి జన్మలో దేవీవ్రతము చేయలేదని ఊహించవలయును. ఈ దేవీ నవరాత్ర వ్రతమును భూతలమున చక్కగ నాచరింపనివారు స్వర్గ సుఖవైభవములు పడయజాలరు. రక్త చందన మలందిన సుకుమారములగు మారేడు దళములతో శ్రీ జగన్మాతను బూజించినవాడు తప్పక రాజు గాగలడు. దుఃఖార్తినాశని సిద్ధికరి జగద్వర యగు శివనుగొలువనివాడు భూమిపై దుఃఖ భాజనుడు నిఱుపేద శత్రుయుతుడు గాగలడు. హరిహర హిరణ్య గర్భులు ఇంద్రుడు మిత్రాగ్ని వరుణులు కుబేరుడును సైతము సర్వార్థ సిద్ధుల నంది ముదితాత్ములై యే దేవి నారాధింతురో యా చండికను నరులేల గొల్వరు?

ఎల్లయాగములందును స్వాహా స్వధారూప మంత్రములతో వేల్చగ సర్వదేవతలు పరితృప్తులగుదురు. కావున మునీంద్రులు సంతోషముతో సర్వ యజ్ఞములందును దేనియొక్క ఏ స్వాహాస్వధా రూపమంత్రములను వేదమంత్రాంతమున నుచ్చరించుచు వేల్తురో ఏ దేవియొక్క కటాక్ష వీక్షణ మాత్రమున బ్రహ్మ జగములు సృజించునో వారి పెక్కవతారము లెత్తి వానిని బ్రోచునో హరుడు లయకాలమున నంతమొందించునో అట్టి యాత్మ శాంతిదాయినియగు జగదంబను నరుడేల భజింపడు! 

ఆదేవీ చైతన్యశక్తి లేనిచో నీ విశ్వభువనము లందలి సుర-నర-దనుజ-గంధర్వ-పక్షి-పన్నగ-పిశాచ వృక్షము లందెవ్వ డైనను కదలుటకును శక్తుడు గాడు. పురుషార్థములు గోరువాడు సకల కామార్థదాయిని - శివ - చండి యగు దేవినేల సంసేవింపడు? మహాపాపియైనను దేవీ నవరాత్ర వ్రత మాచరించినచో నతడు సకల దురితముల నుండి తప్పక ముక్తుడగును.

రాజా! తొల్లి యొక వర్తకుడు దనహీనుడగుటచేత దుఃఖార్తుడగుచు సకుటుంబముగ కోసల దేశమున వసించుచుండెను. అతనికి పెక్కురు సంతానము కలరు. వా రాకటిచే నకనకలాడుచు సాయంకాలమునందు దొరకు నన్నముతో కాలము గడుపుచుండిరి. ఆ కోమటియు ఇతరులకడ పని చేయుచు నాకలితో బాధ పడుచునే ఎటులో కుటుంబమును పోషించు కొనుచు కలవరపాటు మాత్ర మందక కాలము గడుపుచుండెను. 

అతడు ధర్మనిరతుడు - సదాచార సంపన్నుడు - సత్యధైర్యవంతుడు - శాంతుడు - క్రోధమద రహితుడు. అతడు నిత్యమును దేవతలను బూజించి పితరులను తనిపి యున్నంతలో నతిథుల కన్నమిడి తన కుటుంబమువారు తిన్న పదిప తాను తినుచుండెడివాడు.

ఇట్లు చాలాకాలము గడచుచుండగా ఒకనాడు పేరుచేతను గుణము చేతను సుశీలుడగు నత(వైశ్యు) డాకట మలమల మాడుచు శాంతుడగు నొక ద్విజునితో నిట్లనెను: 

"ఓ భూదేవా! మహామతీ! నా యీ దుర్భరమైన దారిద్య్ర బాధ తొలగు నుపాయమును దయతో సెలవిమ్ము. నేను గొప్ప ధనవంతుడను గావలయునన్న ధనాశ నాకు లేదు. నేను తిని నా కుటుంబము కింత పెట్టగలిగినంత యున్న చాలును. నా బిడ్డ లాకటిమంటకు నకనకలాడుచున్నారు. అక్కటా! దానము సేయుటకు గూడ పట్టెడన్నమైనను లేదు గదా! 

ఒక బాలుని ఇల్లు వెడలగొట్టితిని. అతడు మోము నిండ కన్నీరు నిండగ నిల్లు వెడలెను. అపుడది చూచి నా నిఱుపేద గుండె కరగి చెఱువైనది. ఒక కన్నె పెండ్లి కెదుగుచున్నది. ఆమె కెప్పుడో పదేండ్లు నిండుటచే కన్యాదాన కాలము దాటుచున్నది. అందువలన దుఃఖించుచున్నాను. విప్రవర్యా! సర్వజ్ఞుడవు. దయామయుడవు. నా కేదేని తపమో జపమో మంత్రమో దానమో వ్రతమో యేదేని నుపాయము చూపింపుము. దానిచే పోష్యవర్గ పోషణము చేసెదను. నీ దయవలన నా కుటుంబము సుఖముండు గాక! అందుకై తెలివి వెల్గుతో విచారించి యేదేని వెల్గుబాట చూపుము. 

ఆ కోమటి మాటలు విని సంశితవ్రతు డగు విప్రుడతనికి పరమప్రీతితో నిట్లు పలికెను: "వైశ్యోత్తమా ! శుభకరమైన దేవీ నవరాత్ర వ్రత మాచరింపుము. భగవతీ పూజా హోమములు జరుపుము. దేవికి భక్తితో నైవేద్యము సమర్పింపుము. యథాశక్తిగ దేవీ పూజా జపహోమములు బ్రాహ్మణ భోజనము జరిపింపుము. వేదపారాయణము చేయింపుము. నీ వాంఛితము లెల్ల సఫలము లగును.

ఈ భూమండల మంతటను దీనిని మించిన వ్రతము మరేదియును లేదు. ఈ నవరాత్ర వ్రతము పావనము, సుఖసంతోషప్రదము. ఇది సుఖసంతాన వర్ధకము. జ్ఞాన మోక్షప్రదము. శత్రు నాశకము. మున్ను రాజ్యభ్రష్టుడై సీతా వియోగమున విలవించు శ్రీరాముడు కిష్కింధలో దేవీ నవరాత్ర వ్రత మాచరించెను. అపుడు సీతా విరహానలమున తపించు రామభద్రుడు యథావిధిగ దేవీ నవరాత్ర వ్రతము చక్కగ నాచరించెను. ఈ వ్రత ప్రభావముననే శ్రీరాముడు జలధిపై సేతువు గట్టి రావణ కుంభకర్ణాదులను దనుమాడెను; మేఘనాథుని వధించి విభీషణుని లంకాపతిగ జేసి పిమ్మట నయోధ్యకేగి నిష్కంటముగ రాజ్య మేలెను. 

ఈ దేవీ వ్రత మహత్త్వమువలన నమిత విక్రముడగు రఘురాము డమితానందభరితు డయ్యెను. విప్రుని పలుకులు విని వైశ్యు డతనిని తన గురునిగ భావిచి మాయా బీజ (భువనేశ్వరీ) మంత్రము గ్రహించి ఆ మంత్రము నతడు దేవీ నవరాత్రములందు నిశ్చలభక్తితో జపించుచు నానా విధోపహారములతో భక్తితో దేవి నారాధించెను. ఇట్లతడు తొమ్మిదేండ్లు మాయా బీజ జప పరాయణుడై యుండి తొమ్మిదవ యేడు చివర నొక మహాష్టమినాడు శ్రీమహేశ్వరి యతనికి నడురేయి ప్రత్యక్షమై నానా వరము లొసగి యతనిని ధన్యుని జేసెను అని శ్రీవ్యాసముని జనమేజయునకు తెలిపెను.

అధ్యాయము 60 శ్రీసీతారామ చరిత్ర

Chapter 58 Sridevi Navratri Puja Method - అధ్యాయము 58 శ్రీదేవీ నవరాత్ర పూజా విధానము

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 58

శ్రీదేవీ నవరాత్ర పూజా విధానము


జనమేజయు డిట్లు వ్యాసుని ప్రశ్నించెను : ఓ ద్విజోత్తమా! నవరాత్రములందు - విశేషించి శరన్నవరాత్రములందు - విధి విధానమున నాచరింపదగిన విధాన మేది? దేవీ నవరాత్రము లాచరించు విధమేది? దాని ఫలితమేమి? నాకు దయతో నంతయు వివరింపుము. 

వ్యాసభగవాను డిట్లనెను : రాజేంద్రా! శ్రీ దేవీ శరన్నవ రాత్రములను గుఱించి విధి పూర్వకముగ వివరింతును. వినుము. శ్రీదేవీ నవరాత్రములు వసంతకాలమున శరత్కాలమున నాచరింప వలయును. ఈ రెండు ఋతువులు జనులకు యముని దంష్ట్రల వంటివి. ఎల్ల ప్రాణులకును వసంత శరదృతువులు రెండును రోగకరములు. నరులకు ఘోర రోగములు గల్గించి ప్రాణనాశనమునకు కారణము లగును. కనుక మేలు వెలుగు గోరు బుధులు ప్రయత్నించి చైత్రాశ్వ యుజమాసములందు భక్తి యుక్తులై నవరాత్ర వ్రతము లాచరించి విదిగ శ్రీ చండీ పూజలు సలుపవయును. అమావాస్యనాడే సకల సంభారములు సమకూర్చుకొని యేకభుక్తముగ హవిష్యాన్నము భుజింపవలయును. ఒక మంచి సమతల ప్రదేశమున పదారు చేతుల ప్రమాణము గల స్తంభములు కల్గి పతాకములతో నలరారు చక్కని దేవీ మండపము. నిర్మింపవలయును. అచ్చోటున నెఱ్ఱమట్టితో గోమయముతో చక్కగ నలుకవలయును. అందు రంగవల్లికలు తీర్చి దిద్దవలయును. దాని మధ్య భాగమందు స్థిరమై యున్నతమైన వేదిక సమర్పింవలయును. ఆ వేదికపై నాల్గుమూరల పొడవు నంతియ వెడల్పును మూరయెత్తును గల్గి యలంకరింపబడిన పీఠము నమర్చవలయును. దాని చుట్టును మామిడి తోరణములును విచిత్రములైన పూలమాలలను గట్టవలయును.

ఆ ముందు రాత్రియే దేవీతత్త్వ విశారదులు సదాచార సంపన్నులు దాంతులు వేదవేదాంగ పారగులు నగు బ్రాహ్మణులను పిలువ వలయును. పాడ్యమి నాడు విధివిధానమున నదీ నదములందుగాని వాపీకూప తటాకములందుగాని గృహమందుగాని ప్రాతఃస్నాన మొనరింపవలయును. మరునాడు ప్రభాత వేళయందు నిత్యకృత్యము లాచరించి విప్రవరణ మొనరించి వారికి మధుపర్క పూర్వకముగ నర్ఘ్యపాద్యాది విధు లాచరింప వలయును. బ్రాహ్మణోత్తములకు యథాశక్తిగ వస్త్రాలంకరణము లీయవలయును. 

సంపన్నుడు దానమొసంగుటలో ద్రవ్యలోప మెంతమాత్రమును జేయగూడదు. బ్రాహ్మణులు సంతృప్తి జెందినచో కార్యము సంపూర్ణ ఫలప్రద మగును. బ్రాహ్మణులు తొమ్మిదిమందిగాని యేవురుగాని మువ్వురుగాని తుదకొక్కడుగాని శ్రీ మద్దేవీ భాగవతాది పారాయణ మొనరింపవలయును. శాంతుడగు ఒక విప్రుని దేవీభాగవత పారాయణమునకు వరింపవలయును. వేదఘోషలతో స్వస్తివాచనము జరుపవలయును. ఆ వేదికపై సింహాసనము స్థాపించవలయును. దానిపై తెల్లని వస్త్రము పరచవలయును. దానిపై దివ్యాంబర ధారిణి చతుర్భుజ దివ్యాయుధ ధారిణి యగు జగదంబికను ప్రతిష్ఠింపవలయును. నానారత్న భూషణ భూషిత - ముక్తాహార విరాజిత - దివ్యాంబర ధర - సౌమ్య - సర్వ లక్షణ సంయుత - శంఖచక్రగదాపద్మధర - సింహోపరిసంస్థిత - శివ - అష్ఠాదశభుజ - సనాతని యగు దేవిని ప్రతిష్ఠింపవలయును. అట్టి దేవీ విగ్రహము లేనిచో నచట నవార్ణ మహామంత్రయుమగు యంత్ర ముంచవలయును. దాని ప్రక్కను కలశస్థాపన మొనరింపవలయును. సుసంస్కృతమై పంచ పల్లవములు (మామిడి - రావి - మఱ్ఱి - మేడి - జువ్వి చిగురులు) బంగారము గల కలశమునందు వేదమంత్రములతో తీర్థ జలము నుంచవలయును. అచట పూజకు శోభన ద్రవ్యములు సమకూర్చుకొనవలయును. తొలుదొలుత మంగళ సూచకముగ గీతవాదిత్రాది మంగళ వాద్యములు మ్రోగింపవలయును.

శ్రీదేవిని హస్తానక్షత్రముతో గూడియున్న నందా (ప్రతిపత్‌) తిథియందు పూజించుట ఉత్తమము. మొదటినాడు చేసిన దేవీపూజ లోకులకు సర్వకామము లీడేర్చును. మొదట సంకల్పము చేసి పిదప దేవీపూజ ప్రారంభించవలయును. దేవి నుపవాసమున గాని నక్తవ్రతమునగాని ఒక్కపూట భోజనముతోగాని భక్తిశ్రద్ధలతో బూజింపవలయును. జగదంబా! మదంబా! నేను నీ యుత్తమ నవరాత్ర వ్రత మాచరింతును. అందులకు వలయు నీ సాహాయ్యము - చేయూత నాకందిమ్మని దేవిని వేడుకొన వలయును. దేవీవ్రత సమాచరణకు యథాశక్తి నియమనిష్ఠలతో నుండవలయును. 

పిమ్మట మంత్రపూర్వకముగ విధిగ పూజలు సలుపవలయును. శ్రీదేవిని చందనాగురు కర్పూరములతో పరిమళములు గుబాళించు పూలదండలతో మందారము - కరజము - అశోకము - చంపకము - కరవీరము - మాలతి - బిల్వదళములు - బ్రాహ్మీసుమములతో ధూపదీపములతో దేవి నర్చించి ఆమె కర్ఘ్య మొసంగవలయును. నారికేళము - కదళి - మాతులుంగము - దానిమ్మ - పనస - నారింజ మున్నగు మధుర రసములు గల ఫలములు నైవేద్యము చేయవలయును. ఆ పిదప ఘనముగ బ్రాహ్మణ సమారాధనము జరుపవలయును. మాంసాశనులగు వారు మహిషము - మేక - వరాహములను బలిదాన మొనరింపవలయును. శ్రీదేవీ సమక్షమున బలిపీఠముపై బలియైన పశువులు అవ్యయ స్వర్గమేగును. ఓ యనఘా! యాగమున పశుహింస హింస యనబడదు. యజ్ఞమున సలుపు హింస యహింసయని సర్వ శాస్త్రముల నిర్ణయము. దేవతలకై బలియైన పశువులకు స్వర్గతి నిశ్చయము. హోమమునకు త్రికోణాకారముగ కుండ మేర్పరుప వలయును. కానిచో త్రికోణాకృతిగ స్థండిల మేర్పరుప వలయును.

మూడు వేళల పెక్కు సుందర పదార్థములతో నిత్యము దేవిపూజ లొనరింపవలయును. గీతవాద్యములతో దేవీ మహోత్సవములు జరుపవలయును. నిత్యము నేలపై పరుండవలయును. కుమారికలను శుభ్ర వస్త్రాలంకరణములతో నమృతాన్నములతో నర్చింపవలయును. ప్రతిదిన మొక కన్యనుగాని యేకవృద్ధిగ గాని ద్విగుణవృద్ధితోగాని త్రిగుణవృద్ధితోగాని ప్రతిదినము తొమ్మండుగురిని గాని కుమారికలను బూజింపవలయును. తన శక్తికి తగినట్లుగ శక్తియాగ మొనరింపవలయును. 

రాజా! శక్తి యాగమున నెప్పుడును ధనలోపము చేయరాదు. కన్నెలను బూజింపు నపు డేడాది పిల్లను బూజింపరాదు. ఏలన, నా శిశువు భోగములను సుగంధములను గ్రహింపజాలదు. రెండేండ్లు గలది కుమారిక. మూడేండ్లు గలది త్రిమూర్తి. నాలుగేండ్లు గలది కళ్యాణి. ఐదేండ్లు గలది కాళిక. ఏడేండ్లు గలది చండిక. ఎనిమిదేండ్లు గలది శాంభవి. తొమ్మిదేండ్లు గలది దుర్గ. పదేండ్లు గలది సుభద్ర అనబడును. ఇంతకన్న నెక్కువ యేండ్లు గల దానిని బూజింపరాదు. అట్టిది సర్వకార్యములందు నింద్య యగును. 

దేవి నీ తొమ్మిది నామములతో విధిగ బూజింపవలయును. ఈ తొమ్మిది విధముల పూజల ఫలితమును వివరింతును : కుమారికను బూజించినచో దుఃఖ దారిద్య్రనాశము - శత్రుక్షయము - ఆయుర్బల ధనముల వృద్ధియు నగును. త్రిమూర్తి పూజ వలన పుత్త్రపౌత్రాభివృద్ధి - యాయుర్వద్ధి - ధనధాన్య సమృద్ధి - త్రివర్గఫల ప్రాప్తియు జరుగును.

కళ్యాణిని విద్యార్థి - విజయార్థి - రాజ్యసుఖార్థి - పూజింపవలయును. కళ్యాణి సకల కామప్రదాయిని. శత్రునాశమునకు కాళికను పూజింపవలయును. ఐశ్వర్య ధనకామనకేకభక్తితో చండికను పరిపూజింపవలయును. శోకదారిద్య్ర నాశమునకు సమర విజయమునకు రాజసమ్మోహమునకు నిత్యమును శాంభవిని గొలువవలయును. క్రూర శత్రువినాశమునకు ఉగ్రకర్మ సాధనమునకు పరలోక సుఖములకు సంతతభక్తితో శ్రీ దుర్గాదేవి నారాధింపవలయును. వాంఛితార్థ సిద్ధికి సుభద్రను - రోగనాశమునకు రోహిణి నర్చింపవలయును. ''శ్రీరస్తు'' అను మంత్రముతోగాని శ్రీయుక్తమైన మంత్రమునగాని బీజమంత్రమునగాని నరుడు భక్తితో దేవిని పూజింపవలయును. ఎవరు లీలామాత్రమున కుమారుని (షణ్ముఖుని) తత్త్వములను (రహస్యములను) బ్రహ్మాది దేవతలను సృజించునో అట్టి కుమారిని నేను పూజించుచున్నాను.

ఏ తల్లి సత్త్వాది గుణములచే నానా స్వరూపిణి మహాలక్ష్మీ మహా సరస్వతీ మహా కళ్యాది త్రిమూర్తియై త్రికాల వ్యాపిని యైనదో యట్టి శక్టియగు త్రిమూర్తిని నేనారాధింతును. నిత్యము నెల్లపుడు పూజింపబడినదై భక్తులకు కళ్యాణి కారిణియగు నా సర్వకామ ప్రదాయిని యగునట్టి కళ్యాణిని నేను దృఢభక్తితో నిత్య మర్చింతును. ఏ దేవి సర్వప్రాణుల జన్మార్జిత (సంచిత)ములగు కర్మబీజముల నంకురింపజేయునో యట్టి రోహిణీ దేవతను నే నర్చింతును. ఈ చరాచర ప్రపంచమును కల్పాంతమున నేకాళి యంతమొందించునో యట్టి కాళికను నేను గొల్తును. చండముండ దైత్య ఖండినియు చండ(భయంకర) రూపిణియు చండపాతకనావనియునగు చండికను నేను పూజింతును. ఏ తల్లి యొక్క సముత్పత్తి తద్రూపములేయగు వేదములచే నకారణముగ కలుగుచున్నట్లు చెప్పబడుచున్నదో సుఖములొసగు నా శాంభవీదేవిని నేనర్చింతును. భక్తుని దుర్గము నుండి రక్షించునదియు వాని దుర్గతి నశింపజేయునదియు సకల దేవతలకును తెలియరానిదియునగు శ్రీ దుర్గాదేవిని నేనారాధింతును. పూజలుగొన్న మాత్రమున భక్తులకు సుభద్రము లొడగూర్చి యభద్రములు తొలగించి విలసిల్లు సుభద్రా దేవిని నేను నిత్యము పూజింతును. ఇట్టి మంత్రములతో బుధులు అనేక వస్త్రాలంకరణ మాల్య సుగంధములతో సంతతము పరాభక్తితో కన్యకలను పూజింపవలయును అని శ్రీ వ్యాసముని శ్రీదేవి నవరాత్ర పూజవిధానమును జనమేజయునకు ప్రవచించుటయందు నిరతుడయ్యెను.

అధ్యాయము 59 శ్రీదేవీ నవరాత్రవ్రత మాహాత్మ్యము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 57 The worship of Sri Durga Devi - అధ్యాయము 57 శ్రీ దుర్గాదేవి ప్రతిష్ఠ

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 57

శ్రీ దుర్గాదేవి ప్రతిష్ఠ

వ్యాసభగవాను డిట్లనియె: ఆ విధముగ తన మిత్రులతో సుదర్శన రాజవరేణ్యు డయోధ్యకేగి శోక సంతప్తయగు శత్రుజిత్తుని తల్లికి ప్రణమిల్లి యామె కిట్లు పలికెను. తల్లీ! నేను నీ తనయునిగాని తండ్రినిగాని రణరంగమున జంపలేదు. నీ పాదములు సాక్షిగ బలుకుచున్నాను. వారు పోరులో శ్రీ దుర్గాదేవి చేతిలో మడిసిరి. ఇందు నా యపరాధ మిసుమంతయును లేదు తప్పక జరుగవలసి జరుగు కార్యముల విషయమున ప్రతీకారమెన్నడును జరుగదు. 

ఓ మానినీ! ఇంక నీ చచ్చిన కొడుకునకై శోకింపకుము. ప్రాణులు కర్మపరతంత్రులై సుఖ దుఃఖము లనుభవింతురు సుమా! ఓ మాతా! ధర్మజ్ఞులారా! నేను నీకు దాసుడను. నాకు నా తల్లి మనోరమ యెట్లో నీవు నట్టే. మీ యిరువురి పట్ల నాకు భేదభావము లేదు. ప్రాణులు వెనుకటి శుభాశుభము లవశ్య మనుభవించి తీరవలయును. కాన సుఖ దుఃఖములు ప్రాప్తించినపుడు శోకింపదగదు. ఎవ్వడును దుఃఖములందు దుఃఖాదికమును సుఖములందు సుఖాదికమును అనుభవించును కాని దుఃఖము కలిగినపుడు అత్యంత శోకమును సుఖము కలిగినపుడు అధిక హర్షమును పొంది వాటికి లోబడరాదు. 

ఈ సమస్త బ్రహ్మాండమును దైవాధీనము. ఇందాత్మాధీన మైన దేదియును లేదు. కాన మతిమంతుడగు నరుడు శోకములచే తన యాత్మను శోషింపజేసికొనరాదు. ఒక కట్టెబొమ్మ నటుని చేతిలోబడి యభినయించును. అటుల జీవుడు తాను జేసికొన్ని కర్మకు పరతంత్రుడై ప్రవర్తిల్లును. స్వయంకృత కర్మఫలముల ననుభవింపక తప్పదు. అందువలన నేను వనమందున్నను మనస్సునందు బాధపడలేదు. నా తాత చనిపోయెను. నాతల్లి విధవ యయ్యెను. ఆమె భయాతిరేకమున నన్ను వనములకు కొనిపోయెను.

ఆమె తన సర్వస్వమును ముష్కరుల వలన గోలుపోయినది. ఆమె బాలపుత్రయై నిరాశ్రయురాలై పెక్కు వస్త్రములు లేనిదై యుండెను. నా తల్లి నన్ను భారాద్వాజాశ్రమమునకు గొనిపోయినది. మావెంట విదల్లుడును నొక దాదియు నేతెంచిరి. అచ్చట మేము మువ్వురమును మునులును మునిపత్నులు నొసంగిన పండ్లును నీవారాన్నములును దిని వారిచే బోషింపబడితిమి. 

ఆ పవిత్ర స్థలమునందు నా నిర్మల చిత్తమందు ధనము వలని సుఖముగాని లేమి వలని దుఃఖముగాని వైరద్వేషములుగాని లేవు. రాజభోగముల కన్న నీవారాన్న భోజనములు మేలైనవి. రాజభోగి తుదకు నరకమేగును. కాని, నీవారన్నములు దిన్నవాడు జనడు. పండితుడైన పురుషుడు ధర్మాభ్యుదయము గల్గింప వలయును. అతడింద్రియ వర్గమును జయింపవలయును. అట్టివాడు నరకమున పతనము బొందడు. ఎల్ల ప్రాణులకు నాహార విహారముల వలన సౌఖ్యము చేకూరును. 

కాని, యీ పవిత్ర భరత ఖండమునందు మనుజజన్మము లభించుటచే మాత్రము ఇతర జన్మములందు కడుంగడు దుర్లభమగు మోక్షము లభించును. అట్టి సదుర్లభమైన నరజన్మ మెత్తినవాడు తప్పక ధర్మసమాచరణము జరుపవలయును. ఈ నరజన్మము స్వర్గమోక్షములకు చక్కని రాజమార్గము. ఇది యితర జంతువుల కసాధ్యమైనది. ఇట్లు సుదర్శను నోదార్పు మాటలకు లీలావతి లజ్జించి పుత్రశోకము వీడియు కన్నీరు గార్చుచు నతని కిట్లనియెను 

"నా తండ్రీ యుధాజిత్తు. అతడు నీ తాతను జంపెను. నీ రాజ్య మపహరించెను. పుత్రా! నన్నీ దుఃస్థితి పాలుచేసెను. ఆనాడు నేను నా తండ్రిని నా కొడుకును వారింపలేక పోతిని. అతడు చేసిన పనిలో నా దోష మేమియును లేదు. వారు స్వయంకృతాపరాధమున మడిసిరి. అందులకు నీవు కారణము గావు. నా పుత్రుని గూర్చి నేను శోకించుటలేదు. అతని చెడునంతకు కుందుచున్నాను. పుత్త్రా! నీవు నాకు తనయుడవు. మనోరమ నా సోదరి. నీ మీద నాకు కోపతాపము లెంత మాత్రము లేవు. నీవు చక్కగ రాజ్యమేలుము. ప్రజలను కన్నబిడ్డలను వలె బాలింపుము. నీకీ నిష్కంటక రాజ్యము భగవతి కరుణ వలన సంప్రాప్తించినది.''

అను తల్లి మాటలు విని సుదర్శనుడామెకు నమస్కరించెను. ఆ పిదప మనోరమ మునుపు వసించిన రమ్య హర్మ్యమున కేగెను. సుదర్శను డందుండి యెల్ల మంత్రులను దైవజ్ఞులను రావించి వారికొక శుభముహూర్తము చూడుడనెను. నేనొక బంగారు గద్దె చేయింతును. దానిపై శ్రీదేవిని ప్రతిష్ఠ చేతును. మనము నిత్య మా దేవిని బూజింపవలయును. 

పూర్వము శ్రీరామచంద్రులు ధర్మార్థ కామమోక్షదాయిని యగు భగవతి నున్నత పీఠముపై ప్రతిష్ఠించి పూజించిరి. నేను నట్లు చేసి పిదప రాజ్యమేలుదును. ఆ దేవి శివాశక్తి - వాంఛితార్థ సిద్ధిద. అట్టి జగదంబను నాగరికజనులు భక్తి ప్రపత్తులతో ప్రతినిత్యము పూజించవలయుననియు సుదర్శనుడు పలికెను. 

అపుడు మంత్రులు రాజశాసనములను తలదాల్చిరి. వారు శిల్పివరులచేత సుందర దేవీమందిరము నిర్మింపజేసిరి. సుదర్శనుడు చైతన్యముట్టిపడు దేవీ విగ్రహమును సిద్ధము చేసెను. వేదవిదులగు బ్రాహ్మణులను రావించెను. ఒక సుముహూర్తమున శ్రీదేవీ ప్రతిష్ఠ జరిపించెను. 

ఆ మతిమంతుడు యథావిధిగ శ్రీ మద్దేవీ యాగము జరిపించెను. సురలను బూజించెను. దివ్య పీఠముపై పరాశక్తిని ప్రతిష్టించెను. ఆ దేవీ ప్రతిష్ఠామహోత్సముల విప్రుల వేదఘోషలతో దివ్యగానములతో వాద్యనిస్వనములతో కనులకు చెవులకు పండువుగ నుండెను.

ఆ విధముగ సుదర్శనుడు వేదవిదుల వలన శ్రీదేవిని ప్రతిష్ఠించి విధి విధానమున నానావిధ పూజలు జరిపించెను. అట్లు సుదర్శనుడు పూజా విధులు సమాచరించి తన పైతృక రాజ్యము బడసెను. ఇట్లంబికాదేవి కోసల దేశమున విఖ్యాతి నందెను. అట్లు ధర్మవిజయుడగు సుదర్శనుడు రాజ్యము బడసి ధర్మిష్ఠులగు సకల సామంతులను తనకు వశుల జేసికొనెను. శ్రీ దిలీపుడు రఘువు శ్రీరాముడు పరిపాలించిన రాజ్యములోని ప్రజ లెట్లుండిరో సుదర్శనుని పాలనలోని ప్రజలు నట్లు సుఖ సంపన్నులై విలసిల్లిరి. అతని యేలుబడిలో వర్ణాశ్రమాదుల ధర్మము నాలుగు పదములతో ప్రవర్తిల్లెను. ప్రతివాడును ధర్మతత్పరుడై యుండెను. ఆనాటినుండి గ్రామగ్రామమున దేవీమందిరములు వెలసినవి. 

ఇట్లు కోసలదేశమున శ్రీ భగవతీ పూజ విరివిగా జరుగుచుండెను. కాశియందు సుబాహువును భక్తి భావములతో శ్రీ దుర్గా విగ్రహము చేయించెను. దేవీ మందిరము నిర్మింపజేసెను. అందా దేవిని ప్రతిష్ఠించెను. అచటి భక్తులెల్లరును భక్తి పరాయణులై శ్రీ విశ్వేశ్వరుని పూజించు విధముగ శ్రీ దుర్గాదేవిని యథావిధిగ బూజించుచుండిరి. ఈ విధముగ భూమిపై శ్రీ దుర్గాదేవి విలసిల్లినది. 

ఈ రీతిగ దేవీభక్తి దేశదేశముల వ్యాపించెను. ఆనాటినుండి యావద్భారతమున భూలోకమందంతటను నెల్ల వారికెల్ల భంగుల భగవతీ దేవి పూజింపదగినదయ్యెను. కొందఱు భక్తి యుక్తులై యాగమప్రోక్తములైన స్తోత్రములతో జపధ్యాన పరాయణులై దేవిని గొలుచు చుండిరి. దేవీభక్తులెల్లరును శ్రద్ధాభక్తులతో శ్రీ మద్దేవీయాగములును సమారాధనములును జరుపుచుండిరి అని వ్యాసముని జనమేజయునకు తెలిపెను.

అధ్యాయము 58 శ్రీదేవీ నవరాత్ర పూజా విధానము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...