Thursday, April 9, 2026

Chapter 2 Explanation of the Skandhas - అధ్యాయము 2 స్కంధముల వివరణము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 2 స్కంధముల వివరణము

శ్రీ సూతుడిట్లనియెను : ఇచ్చట నున్న మహాత్ములు వేదమువలె ప్రసిద్ధమును మహా పుణ్యప్రదమునైన శ్రీ దేవీభాగవత పురాణము విషయమన నన్ను ప్రశ్నించిరి. అందుచే నేనెంతయు ధన్యుడను సదృష్టవంతుడను పవిత్రుడను నైతిని. కావున నేనిపుడు సర్వ వేదార్థ సమ్మితమును సకల శాస్త్రములందు నాగమములందు నుత్తమమైనదియు రహస్యమైనదియు నగు దేవీ పురాణమును చెప్పుదును, ఓ ద్విజోత్తములారా! పరమ యోగులకు ముక్తి నొసంగునదియు బ్రహ్మాదులచేత సేవింపబడునదియు స్తుతిపరులగు ముని ప్రవరులచే నెల్లపుడు ధ్యానింపబడ దగినదియు సుకుమారమునగు శ్రీ మదఖిలాండేశ్వరియగు శ్రీ లలితాదేవి పద పద్మముల కభివందనం బాచరించి నవరసభరితము పురాణ శ్రేష్ఠమును శ్రీదేవి పేరుతో ప్రసిద్ధమునగు శ్రీ మద్దేవీ భాగవత మహాపురాణమును పరమభక్తితో నిపుడు రసోదంచితముగ మీకు చక్కగ వివరింతును. ఎల్ల వేదమార్గములందు ఆదిశక్తిగా ఆత్మవిద్యగా పరాశక్తిగా సంసారపాశ విచ్ఛేదినిగా సకలహృదయనివాసినిగా దుష్టుల కలవిగానిదై శిష్టమునుల నిశ్చల ధ్యానమున దెలియబడునది కామదాయిని యై తనరారు శ్రీ రాజరాజేశ్వరి మాకు ప్రత్యక్షమై సిద్ధులను చేకూర్చుగాత! తన త్రిగుణాత్మకమైన మాయాశక్తిచేత నీ సకల చరాచర ప్రపంచములను సృజించి పెంచి ప్రళయ కాలమున సంహరించుచు లీలావినోదము సలుపుచున్న సర్వవిశ్వమాతను మనసార నెదలో సంస్మరింతును. ఈ కనంబడు జగంబునెల్ల బ్రహ్మయే సృజించెనను నుడి లోకమున వ్యాప్తిలో నున్నది. వేదవిదులు పురాణవేత్తలు నీ విషయము నిట్లే చెప్పుచున్నారు. కాని యా బ్రహ్మయు విష్ణుని నాభికమలమునుండియే జన్మించెను. అతడా విష్ణుని ప్రేరణ చేతనే విశ్వసృష్టికి గడంగెను. కనుక బ్రహ్మయును స్వష్టికార్యమున పరాధీనుడే. ప్రళయకాలమున విష్ణువు శేషశయ్యపై పవ్వళించగా నతని బొడ్డుతమ్మినుండి నలువ యుద్భవించెను. ఆ విష్ణువున కాధారము వేయిపడగల శేషఫణియని మన మెఱుగుదుము. కనుక విష్ణువే విశ్వసృష్టి కాధారమని యెట్లు చెప్పగలము? ఆ మహాసాగర మందలి జలము రసమయమైనది. ఆ రస మేయాధారమును లేక నిలువజాలదు. మాయాశక్తి స్వరూపిణియగు విశ్వజననియే యా జలముల కాధారభూతురాలు. నేనా విశ్వకారణయగు తల్లినే శరణు వేడుకొనుచున్నాను. యోగనిద్రలోనున్న విష్ణునిగాంచి నలువ యే దయామయిని ప్రస్తుతించి యామెను ప్రసన్నురాలినిగ జేసికొనెనో యా దయామృత తరంగిణిని నేను శరణు పొందుచున్నాను. ఆ సగుణ నిర్గుణ స్వరూపిణి మాయామయి ముక్తిప్రదాయిని యగు తల్లినే ధ్యానించి సంపూర్ణ దేవీభాగవత మహాపురాణమును మీకు వచింతును. మునులారా! మీర లది కడుశ్రద్ధగ వినుడుః

ఈ శ్రీదేవీభాగవత మహాపురాణము పుణ్యకరమైనది. ఉత్తమోత్తమమైనది. ఇందు పదునెనిమిదివేల శ్లోకములు గలవు. పండ్రెండు స్కంధములు మూడువందల పదునెనిమిది యధ్యాయములు గలవు. దీనిని శ్రీ వ్యాసభగవానుడు ప్రవచించి ప్రకాశింపచేసెను. ఈ శ్రీదేవీభాగవత పురాణము నందు ప్రథమ స్కంధమున ఇరువది రెండవస్కంధమున పండ్రెండు మూడవస్కంధమున ముప్పది నాల్గవస్కంధమున నిరువదియైదు ఐదవస్కంధమున ముప్పదియైదు ఆఱవస్కంధమున ముప్పదియొకటి ఏడవస్కంధమున నలువది ఎనిమిదవస్కంధమున నిరువదినాలుగు తొమ్మిదవస్కంధమున నేబది పదియవస్కంధమున పదుమూడు పదునొకండవస్కంధమున నిరువదినాలుగు ద్వాదశస్కంధమందు పదునాలుగు అధ్యాయములు గలవు. ఈ మహాపురాణము పదునెనిమిదివేల శ్లోకములు గలదిగా శ్రీవ్యాసమహామునిచే రచింపబడెను. ఇది సర్గము ప్రతిసర్గము వంశము మన్వంతరము వంశానుచరితమునను నైదు లక్షణములతో తనరారుచున్నది. ఆ పరాభట్టారికయే నిత్య నిర్గుణ నిర్వికల్ప శివస్వరూపిణి విశ్వాధార యోగగమ్య తురీయ. అనగా సాత్త్విక రాజస తామస శక్తిత్రయము కంటె విశిష్టమగు పరబ్రహ్మరూపిణి. ఆ విశ్వవ్యాపిని యొక్క సాత్త్వికరాజస తామస శక్తులే శ్రీమహాలక్ష్మి శ్రీమహా సరస్వతి శ్రీమహాకాళి యను స్త్రీ త్రితయ స్వరూపమున చెన్నొందు చున్నవి. ఆ మూడు శక్తులే యీ సృష్టికి నిమిత్తమై దివ్యదేహములు దాల్చును. అట్టి రూపములు దాల్చు లక్షణమునే శాస్త్రకోవిదులు సర్గమని పేర్కొందురు. ఆ ముత్తెఱంగులగు శక్తుల కారణముననే విష్ణు బ్రహ్మ మహేశు లుద్భవించిరి. వీరివలననే సృష్టి పాలన లయములు నిరంతరముగ జరుగు చుండును. ఈ మూర్తి త్రయోద్భవ వృత్తాంతమునే ప్రతిసర్గ మందురు. సూర్య చంద్రవంశజులైన రాజుల వంశచరితమును హిరణ్యకశ్యపాదుల చరిత్రమును దెలుపు లక్షణమునకు వంశమనిపేరు. స్వాయంభువుడు మొదలగు మనువుల వంశములను వారి జీవితకాల పరిమాణములను అభివర్ణించుట మన్వంతరమనంబడును. ఆ మనువేల వంశకథల గూర్చి తెలుపుట వంశానుచరిత మనంబరగును. ఇవియే పురాణములయందుండవలసిన పంచలక్షణములు. తొల్లి శ్రీ వ్యాస మహాముని శ్రీ మహాభారతేతిహాసమును విరచించెను. అది వేదసారము పంచమ వేదము నని ప్రసిద్ధిగాంచినది. అందు నూటయిరువది యైదువేల శ్లోకము లొప్పుచుండును.

శౌనకు లిట్లనిరి: ఓ సూత మహామునీ! నీవు సర్వజ్ఞుడవు. ఆ పురాణములన్నియునెన్ని? వాని పేరులేమి? వాని నన్నిటిని వినగోరుచున్నారము. మాకు వానిని వివరించి తెల్పుము. కలికాలమువలని భయమున మేమీ నైమిశారణ్యమందు నివసించుచున్నాము. ఇది పావనక్షేత్రము. మునుపు బ్రహ్మ తన మనోమయ చక్రమును మా కొసంగి యిట్లనియెను: మీరీ చక్రము వెంట నరుగుడు. ఈ చక్రపునేమి - బండి కంటికమ్మి - యెచ్చోట జారిపడునో యచ్చోటు పవిత్రమైనదని యెఱుంగుడు. ఆ చోట కలిప్రవేశము జరుగనేరదని తెలిసికొనుడు. సత్యయుగము మరల వచ్చువఱకు మీరలా పవిత్ర క్షేత్రమందే యుండుడు. మేమా బ్రహ్మవాక్కులు విని సకల లోకములు చూడ ఆ చక్రము త్రిప్పుచు దాని వెంటనే యరిగితిమి. అది తిరిగి తిరిగి యిచ్చోటికి వచ్చెను. వెంటనే ఆ బండి కంటికమ్మి చూచుచుండగనే యిచ్చోట పడెను. చక్రనేమి శీర్ణమై పడిన స్థలమగుటచే నీ క్షేత్రము నైమిశమని ప్రసిద్ధి కాంచినది. ఇది పరమపావనమైన పుణ్యక్షేత్రము. ఈ పావన స్థలమున కలిప్రవేశము జరుగజాలదు. ఈ కారణముననే మహాత్ములు సిద్ధులు మునులు మేమును కలిభయపీడితులమై యిచ్చోటనే నివాసమేర్పరచుకొంటిమి. సత్యయుగము సమీపించు వరకు మేమిచ్చోటనే పశుహింస లేని పురోడాశాది యాగము లొనరించుచు మా జీవితకాలము గడపుకొందుము. సూతముని సత్తమా ! మా పూర్వ పుణ్యవిశేషమున నీవిచ్చటి కరుగుదెంచితివి. మాకు బ్రహ్మ సమ్మితము పరమపావనము నగు పురాణము నీవు వినిపింపుము. నీవు ధీశాలివి. మహావక్తవు. మేము ఇతర విషయ చింతమాని యేకాగ్ర చిత్తమున పురాణము విన నుత్సహించుచున్నవారము. పవిత్రము నిత్య కళ్యాణప్రదము వేదసమ్మతమునగు ఆ దేవీ భాగవత పురాణము మాకు వినిపించి నీవు తాపత్రయములు లేక దీర్ఘాయుష్కుడవై జీవింపుము. ఆ వ్యాసమహర్షి ధర్మార్థకామ మోక్షములగూర్చియును మహావిద్యను గుఱించియు నా పురాణమందు పరి వర్ణించెను. అట్టిదానిని మాకు వినిపింపుము. ఆ మునీంద్రుడు చెప్పిన సుమనోహరము పరమ పావనము రసభరితమునగు కథలెంతవిన్నను మాకు తనవితీరుటలేదు. సకల సద్గుణములకు పాత్రమైనదియు పవిత్రమైనదియు శ్రీ జగన్మాతయొక్క లీలానాట్యములతో విచిత్రమైనదియు సమస్త పాపరాసులను పటాపంచలు చేయునదియు నెల్లకోర్కులీడేర్చునదియునైన శ్రీభగవతి యను దేవి పేరబరగు శ్రీ దేవీమహాభాగవతమును మాకు దయతో వివరింపుము.

అధ్యాయము 3 పురాణములను-వ్యాసులను గుఱించిన వివరములు


SRI DEVI BHAGAVATHAM PART 1 - శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

మా బుద్ధుల నాత్మచింతనమునకై ప్రేరించు దేవియు సర్వ చైతన్యరూపయు ఆద్యయు మహావిద్యయు నగు శ్రీ భగవతిని ధ్యానింతుము.

శ్రీ దేవీ రూప పరిణామమే సకల చిదచిదాత్మక చరాచరాత్మక జగత్తులగుటచే నామె సర్వరూప. ఆమె చిద్రూపయగుటం జేసి చైతన్య రూప. చైతన్యాత్మికయగు నామెయొక్క పరిణామమగు నీ జగములు నందలి సకలభూతములును చిద్రూపములే కావలయును. కావున నామె సర్వభూతములయందలి చైతన్యమును నై యున్నది. ఆ దేవి సర్వమునకును ఆద్యయును పరతత్త్వ సాక్షాత్కారమునకు సాధనమగు విద్యయును. అట్టి విద్య యొక్క రూపములలో సర్వ శ్రేష్ఠ మగుటచే నాద్య యగునది ప్రణవము. అది ఆద్య. అ+ఆద్య. అకార ఉకార మకారములు ఓమ్‌. అకారము ఆది వర్ణముగా గలది. ఆ ప్రణవ విద్య యొక్క విస్తృత రూపమే గాయత్రీ మంత్రము. ఆ రూపమున శ్రీదేవీ తత్త్వమును ప్రతిపాదించుటయే శ్రీదేవీభాగవతమునందలి ప్రధాన తత్త్వము. 

శ్రీ గాయత్రీ మంత్రముయొక్క రూపాంతరమే శ్రీ పంచదశీ మహావిద్య. ఆ విద్యయొక్క 'కాదివిద్యా' రూపమునకు ఆది విద్య యని శాస్త్ర సంకేతము. విద్యకును విద్యా ప్రతిపాద్య తత్త్వమునకును అభేదమే కావున ఆ దేవి 'ఆది విద్యా' యగును. శ్రీపంచదశీ మహావిద్యయొక్క సునిష్కృష్ట రూపమగు శ్రీ షోడశాక్షరీ విద్యయు నంతే. శ్రీదేవి శబ్ద బ్రహ్మాత్మిక. అట్టి పరాది వాగాత్మక శక్తి మాతృకారూప. అవి అకారాదికములు గదా! అందుచేత నామె 'ఆద్యా విద్యా' అ-ఆద్యా=అకారము ఆదిగా గలది. ఆ దేవి మనయందర బుద్ధి తత్త్వములను ప్రేరించును. ఆ ప్రేరణకు మూలము సంకల్పము - అనగా - ఇచ్ఛ. బుద్ధి అనగా ఆయా కృత్యముల గూర్చిన జ్ఞానము. జ్ఞానము ననుసరించి సృష్ట్యాది కృత్యములు జరుగును. ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు మూడును ఆ దేవి రూపములే. ఇట్లు ఆమె శక్తిత్రయరూప త్రిగుణాత్మక మాయారూప, మాయా పరిణామ జగద్రూప. మాయా పాశమోచన సాధన విద్యారూప అని యీ గాయత్రీ ఛందోరూపమగు శ్రీదేవీ ప్రార్థనము సూచించుచున్నది.

ఇట్లు సర్వజ్ఞత్వ సర్వశక్తిమత్త్వాది లక్షితమైన శ్రీదేవీ రూప మాయా శబలిత బ్రహ్మ మీ మంగళ శ్లోకమున ప్రార్థింపబడుచు న్నది. మాయా శబల బ్రహ్మను ఇచట ధ్యాన విషయమగుటచే నట్టి తత్త్వము నిష్క్రియము కాదు కావున మా బుద్ధి వృత్తులను ప్రేరించుగాక! అని శ్రీదేవిని ప్రార్థించుట సముచితము.

అధ్యాయము 1 - శౌనక కృత ప్రశ్న




















పంచాంగం

Chapter 1 - The Question of Shaunaka Krita - అధ్యాయము 1 - శౌనక కృత ప్రశ్న

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 1 - శౌనక కృత ప్రశ్న 

శౌనకముని సూతుని పురాణములగూర్చి ప్రశ్నించుట
శౌనకముని యిట్లనెను: ఓ పురుషర్షభా మహాభాగా సూతమహామునీ! మేలు చేకూర్చు పురాణ సంహితలన్నియును నీచే చక్కగ నధ్యయనము చేయబడినవి. నీవు కడు ధన్యుడవు. ఓ సుకృతీ! వేద వ్యాసమహర్షి దివ్యములగు పదునెనిమిది పురాణములను ప్రపంచించగా వానిని నీవు చక్కగ చదివితివి. ఆ పురాణములు సర్గము ప్రతిసర్గము వంశము మన్వంతరము వంశానుచరితము నను నైదు లక్షణములతో నొప్పారుచు రహస్య విషయములతో గూడియున్నవి. అట్టివాని నెల్ల నీవు సత్యవతీ పుత్రుడగు వ్యాసుని వలన నెఱింగితివి. అట్టి నీవు మా పుణ్యవశమున నీ యుత్తమ పుణ్యక్షేత్రమున కరుదెంచితివి. ఈ క్షేత్రము ఉత్తమమును దివ్యమును మునులకు విశ్రామ ప్రదేశమును పుణ్యకరమును కలిదోష శూన్యమునునై యున్నది. ఈ మా మునిగణము పుణ్యప్రదమగు పురాణ సంహితను వినగోరుచున్నది. కనుక మాకు దానిని సమాహితచిత్తుడవై వివరింపుము. నీవు సర్వజ్ఞుడవును మహానుభావుడవును. నీవు ఆధిభౌతిక ఆధ్యాత్మిక ఆధిదైవికములను తాపత్రయములు లేనివాడవు. మాకిపుడు వేద తుల్యమగు పురాణ సంహితను వివరించి చిరకాలము చల్లగ వర్ధిల్లుము. రసాస్వాదన సమర్థులై చెవి మున్నగు నింద్రియములు కలవారైనను పురాణములు వినని మనుజులు దైవ వంచితులే కదా! ఈ నాలుక షడ్రసములచే నాహ్లాద మొందినట్లు మహాత్ముల వచనములు వినుటవలన చెవి ఆహ్లాదము చెందును. చెవులులేని పాములును ఆకాశగుణ మగు శబ్దములచే మోహితములగును. చెవులుండియు సత్కథలు వినని నరులు చెవులు లేనివారేల కారు? ఈ కారణమువలన మా ద్విజులెల్లరము కలిభయ పీడితులమై పవిత్రమైన ఈ నైమిశారణ్య క్షేత్రమును జేరి సావధానముగ సత్కథలు వినగోరుచున్నారము.

ఈ కాలచక్ర మేదోవిధముగ గడచి పోవుచునే యుండును. కాని యది మూర్ఖులకు వ్యసనములతోను పండితులకు శాస్త్ర చింతనములతోను గడచుచుండును. ఈ శాస్త్రములును విచిత్రములైనవి. అవి నానార్థవాదములతో తర్కముతో జల్పముతో వితండ వాదముతో యుక్తిప్రయుక్తులతో రోషగర్వములను కలిగించును.

ఆ శాస్త్రములలో వేదాంతము సాత్త్వికము మీమాంస రాజసము న్యాయశాస్త్రము హేతువాద యుక్తము అగుటచే తామసము నై యొప్పుచుండును. పురాణములు త్రిగుణములతో త్రివిధములై కథలతో కూడియుండును. పంచలక్షణములతో వెలయు ఆ పురాణములు నీవు చెప్పితివి. వానిలో శ్రీ దేవీభాగవత మైదవది. పుణ్యప్రదమైనది. వేదసదృశము. సర్వ లక్షణ సంయుతము. అన్నిటి కంటె శ్రీ భాగవతము ముముక్షువులకు ముక్తిని ధర్మాత్ములకు ధర్మఫలమును సకాములకు కామఫలమును నొసంగగల దగుటచే పరమాద్భుతమైనది. అట్టి దానిని నీవు నామగ్రహణ మాత్రమున చెప్పితివి. ఇపుడా దివ్యమై శుభకరమైన శ్రీ దేవీ భాగవత పురాణోత్తమమును ఆదరముతో మాకు విశదముగ నభివర్ణింపుము. దాని నిచటి ద్విజులెల్లరము విన వేడుకపడుచున్నారము. ధర్మజ్ఞుడవగు సూతా! గురుభక్తి సత్త్వగుణము గలిగిన వాడవగుటచే నీవే వ్యాసముని ప్రోక్తమైన పురాణ వాఙ్మయమును బాగుగ నెఱింగియున్నావు అనునది నీయందలి విశేషము. పురాణతత్త్వ సర్వస్వము నెఱిగిన వాడవు. నీ నోట నెన్నియో పురాణములను వింటిమి. కాని మా కిపుడు అమృత పానముచే నమరులకు వలె మాకు అంత మాత్రమున తృప్తి గలుగుటలేదు. ఎన్నటికిని ముక్తి నీయజాలని యమృతము గ్రోలుట వ్యర్థమే గదా! ఎందువలన ననగా, భాగవతామృతమును త్రాగినచో నరుడు బంధమునుండి వెంటనే విముక్తు డగును. మే మమృతపానము గోరి యెన్నెన్నో జన్మము లొనరించితిమి. కాని యీనాటికిని మాకు పూర్తిగ శాంతి చేకూరలేదు. యాగములకు ఫలితముగ సర్వ ప్రాప్తిగలుగును. కాని యా స్వర్గమునుండి తిరిగి పతనము గలుగును. ఈ విధముగ నీ సంసార చక్రమునందు నిరంతరముగ భ్రమణము గలుగుచునేయుండును. సత్త్వ రజస్తమోరూపమగు నీ కాల చక్రమునబడి తిరుగుచున్న నరులకు తత్త్వజ్ఞానము లేకుండ నెన్నటికిని ముక్తి కలుగదు. కనుక ముముక్షువులకు ప్రియమై రహస్యమై ముక్తిప్రదమై పవిత్రమై సర్వరస భరితమై యొప్పారు శ్రీ దేవీభాగవత మహాపురాణమును మాకు తేటతెల్ల మొనరించుము.

ఇది పదునెనిమిదివేల శ్లోకములుగల శ్రీ దేవీభాగవత మహాపురాణమందలి

అధ్యాయము 2 స్కంధముల వివరణము

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

Wednesday, April 8, 2026

Lord Krishna lifting Govardhana Mountain - శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతము నెత్తుట

శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతము నెత్తుట

శ్వేతవరాహావతారమెత్తి భూమిని సముద్రం నుండి పైకి ఎత్తి తెచ్చిన శ్రీమహావిష్ణువు, ఏనుగు సునాయాసంగా తామరమొగ్గను ఎత్తే విధంగా ముల్లోకాలకు శుభం కలిగించే శ్రీకృష్ణుడు విలాసంగా ఒక చేతితోనే గోవర్ధన పర్వతాన్ని పైకెత్తాడు.

ఎన్నో బ్రహ్మాండాలను చెండులవలె ఎగురవేసి పట్టుకొనే శ్రీమహావిష్ణువుకు గోవర్థనపర్వతం అనే కొండను పెల్లగించి ఎత్తడం సులువైన పనేకానీ బరువైనపని కాదు.

ఇలా కొండనెత్తి

బాలుడు ఆడుకుంటూ పూలగుత్తిని గొడుగుగా భావించి అందమైన తన అరుణహస్తంతో పూలగుత్తిని ధరించినట్లుగా, కృష్ణుడు చిరునవ్వుతో ఆ గోవర్ధన మహాపర్వతాన్ని పైకెత్తి కుడిచేత ధరించి, ఆకాశంనుండి వర్షించే కఠినమైన రాళ్లతో చీకాకుపడుతూ ఉండిన యాదవస్త్రీలు, పురుషులు, గోవులపంక్తులకు విశాలమైన గొడుగుగా పట్టుకొన్నాడు.

ఈ విధంగా యాదవకులాగ్రణి అయిన శ్రీకృష్ణుడు గోవర్దనగిరిని గొడుగులాగా పట్టుకొని ఇలా అన్నాడు.

శ్రీకృష్ణుడు అందరినీ ఇలా పిలుస్తున్నాడు. అమ్మా రా! నాన్నా రండి! గోపస్త్రీపురుషులారా! ఇలా రండి! వినండి! మీ గోవులమందతోకూడా ఈ దిగుడు ప్రదేశంలో ఇష్టంవచ్చిన స్థలంలో ఉండండి.

చుట్టాలయిన ఓ గోపకులారా! ఇతడు (నేను) పసివాడు. కొండ ఏమో గొప్పది. దానిబరువు భరించగలడో లేదో అని దీనికింద నిలవడానికి సంశయించవలసిన పనిలేదు. కొండలు, సముద్రాలు, నానాజంతువులతో కూడిన భూమి అంతా వచ్చి ఈ కొండమీద పడినా సరే నాచేయి అటూ ఇటూ కదలదు. మీరందరూ సంతోషంగా వచ్చి, ఈ కొండ కింద నిలవండి అని శ్రీకృష్ణుడు పలికాడు.

ఇలా తమను చూచి చెపుతున్న కృష్ణునిమాటలు విని, నమ్మి, అందరూ కొండకింద తమకు ఇష్టమైన ప్రదేశాల్లో కొడుకులు, మిత్రులు, భార్యలు మొదలైనవారితోను, గోవులతోను, కృష్ణునికరుణగలిగిన చూపులు అమృతవర్షంలా సోకడంవల్ల ఆకలిదప్పులు మరిచిపోయి, కృష్ణసంబంధమైన కథలు చెప్పుకుంటూ వినోదంగా ఉండిపోయారు.

శ్రీకృష్ణుడు ఎత్తిపట్టిన గోవర్థనపర్వతం గొడుగువలె విలసిల్లింది. ఎలాగంటే ఆ గొడుగుకు శ్రీకృష్ణుని బాహుదండమే కాడ. కొండశిఖరమే గొడుగు గుబ్బ. కృష్ణుడు ధరించిన రత్నాలహారాలు జారిపడుతున్న వర్షప్రనీటి బిందువులు. గోపస్త్రీల కడగంటి చూపులతో కూడిన నవ్వులకాంతులు గోవర్ధన పర్వతంలోని రత్న సమూహం. ఆ గొడుగు దేవేంద్రుని దుర్గర్వాన్ని అణచేది, మేఘాలనుండి కురిసే వర్షంలో తడుస్తున్న గోపకులను స్థిరంగా ఆనందపరచేది అయింది.

ఓ పరీక్షిన్మహారాజా! కమలాక్షుడైన శ్రీకృష్ణునిచేతిలో ఆ గోవర్ధనగిరి ఒక కమలంవలె విలసిల్లింది. ఆ కొండమీదనున్న మేఘాలగుంపు తుమ్మెదల గుంపులాగా శోభిల్లింది.

అధిపా! దేవేంద్రుని ఆజ్ఞచే మిక్కిలి వేగంతో ఏడు పగళ్లూ, రాత్రుళ్లూ జడివాన నిరంతరాయంగా కురిసింది. ఆ సమయంలో గోపీగోపకులు గోవర్ధనగిరి అనే గొడుగుకింద వానలో తడవకుండా బతికారు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు ఏడుపగళ్లు, ఏడురాత్రులు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకోగా దేవేంద్రుడు విసిగివేసారి, కృష్ణుని కథలువిని ఆశ్చర్యపడి, తనకోరిక ఫలించనివాడై, మేఘాలను మరలించుకొని వెళ్లిపోయాడు. అప్పుడు ఆకాశమండలంలో సూర్యమండలం ప్రకాశించడం తెలుసుకొని గోవర్థనధరుడైన కృష్ణుడు గోపాలకులతో ఇలా అన్నాడు.

గాలీ వానా ఆగిపోయాయి. నదుల వేగం తగ్గింది. వరదలు తగ్గుముఖంపట్టాయి. ఇక కొండకింద ఉండకుండా గోపజనులారా! మీ కొడుకులు, కోడండ్రు, భార్యలు, గోవులతో వెలుపలికి రండి. (అని కృష్ణుడు అన్నాడు)

శ్రీకృష్ణుడు ఇలా చెప్పగానే, గోపాలకులు అందరూ బండ్లు మొదలైన తమ పనిముట్లతో కూడి గోవులు, తామూ కొండ అడుగును విడిచివచ్చారు. శ్రీకృష్ణుడు కూడా వెంటనే గోవర్ధనగిరిని దాని స్వస్థానంలో ఉంచాడు. అపుడు గోపాలకులందరూ కృష్ణుణ్ణి కౌగిలించుకొని, ఉచితవిధంగా సత్కరించి, దీవించారు. గోపికలు అక్షతలువేసి, పెరుగన్నంముద్దలు చేసి ఇచ్చి, ఆశీర్వదించారు. నందుడు, బలరాముడు, రోహిణి, యశోద కృష్ణుణ్ణి కౌగిలించుకొని క్షేమ శుభవాక్యాలు పలికారు. సిద్దులు, సాధ్యులు, గంధర్వులు పువ్వులు కురిపించారు. దేవతలు శంఖాలు, దుందుభులు మోగించారు; తుంబురుడు మొదలగు ముఖ్యులైన గంధర్వులు గానంచేశారు. అప్పుడు.

గోపస్త్రీలు తనకథలు పాడుతూ ఉండగా, కమలనేత్రుడైన శ్రీకృష్ణుడు గోపకులతో కలిసి, గోకులం చేరాడు.

ఆ సమయంలో కృష్ణునిచరితలు తలచుకొని, నివ్వెరపోతూ గోపకులు నందునితో ఇలా అన్నారు.

కన్నులు తెరవని చిన్ని పాపడుగా ఉండగానే రాక్షసియైన పూతనయొక్క చనుబాలు తాగి ఆ పూతనను చంపాడు. ముద్దుల బాలుడుగా ఉంటూ మూడోనెలలోనే బండిరూపంలో వచ్చిన శకటాసురుణ్ణి కాలితో తన్ని చంపేశాడు. ఏడాది కుర్రవాడై ఉండగానే తృణావర్తుడు అనే రాక్షసుణ్ణి మెడబట్టుకొని కూల్చివేసి పరిమార్చాడు. వెన్నలకోసం ఇతరుల ఇండ్లకు వెళ్తున్నాడని తల్లి యశోదమ్మ రోలుకు కట్టివేయగా, కృష్ణుడు రెండు మద్దిచెట్ల మధ్య దూరి, రోలును ఈడ్చుకుంటూ వెళ్లి వాటిని పడిపోయేట్లు లాగాడు. గోవులను, దూడలను మేపడానికి వెళ్లి బకుడు అనే రాక్షసుణ్ణి చంపాడు. వత్సుడు అనే రాక్షసుణ్ణి వెలగచెట్టుతో కొట్టి సంహరించాడు. బలరామునితో కలసి ఖరుడు అనే రాక్షసుణ్ణి చంపేశాడు. ఈ సాహసకృత్యాలు అన్నీ భావించి చూస్తే బాలకృష్ణుడు మనుష్య మాత్రుడా? అనిపిస్తుంది. (కాదని భావం)

(పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, బకుడు, వత్సుడు అనే వాళ్లందరూ రాక్షసులు. కంసుడు పంపగా కృష్ణుణ్ణి చంపడానికి వచ్చారు. బాలకృష్ణునిచేతిలో హతులయ్యారు.)

బాలకృష్ణుడు సాహసియై అన్న బలరామునిచేత ప్రలంబాసురుణ్ణి చంపించాడు. ఘోరదావాగ్నిని మింగాడు. కాళీయుని ప్రాభవం చెడేటట్లు కాళీయుణ్ణి పాదాలతో తొక్కి చంపకుండా, కాళింది మడుగునుండి బయటికి తరిమేశాడు.

ఏడేండ్ల బాలు డెక్కడ? వేడుకగా ఆటవలె ఏనుగు తామరపువ్వును ఎత్తినట్లు, ఒక చేత్తోనే విలాసంగా గోవర్ధన గిరిఎత్తడం ఎక్కడ? ఆశ్చర్యం గదా!

ఓ తండ్రీ! గోపవల్లభుడవైన నందుడా! నీ కొడుకు కృష్ణుడు చేసే నేర్పరిపనులు మనుష్యులకు శక్యమైనవేనా? అతడు అందరిలాంటి సాధారణ మానవుడా?

ఇలా గోపకులు అనగానే నందుడు తనకు పూర్వం గర్గమహాముని చెప్పిన రహస్యాన్ని గుర్తుకు తెచ్చుకొన్నాడు. సందేహం లేదు. కృష్ణుడు పద్మాక్షుడైన శ్రీహరి అంశే అని అంతరంగంలో భావిస్తుంటాను అన్నాడు. అది విన్న గోపాలకులు ఆశ్చర్యంతో కృష్ణుడు శ్రీమహావిష్ణువే అని పూజించారు. ఆ తర్వాత

హరి ఒక చేతో గోవర్ధనగిరిని ఎత్తి వర్షజలంవల్ల బాధపడుతున్న యాదవులకు, గోవులకు శరణుగా నిలిచాడు. అపుడు ముల్లోకరాజ్యం ఏలుతున్నాననే పొగరు తొలగిపోగా దేవేంద్రుడు గర్వం వదిలి, తన ప్రాభవం చెడి, కామధేనువుతో కూడా వచ్చి, దుష్టరాజుల దుర్గర్వాన్ని నిరాకరించేవాడు, కరుణతో వర్ధిల్లే వాడూ అయిన శ్రీకృష్ణుణ్ణి దర్శించాడు.

కృష్ణుణ్ణి దర్శించి, మునుల హృదయాలకు అలంకారాలుగా ఉండేవి, అణకువగలవారిని ఉద్ధరించేవి అయిన శ్రీకృష్ణుణ్ణి చరణాలను, సూర్యకాంతితో సమానమైన తన కిరీట కాంతులతో దేవేంద్రుడు పూజించాడు.

దేవేంద్రుడు హరికి నమస్కరించి, హస్తపద్మాలు జోడించి ఇలా అన్నాడు.

కృష్ణా! నీ స్వరూపం సత్త్వగుణోపేతం. శాంతగుణంకలది. రజస్తమోగుణాలను అణచివేసేది. నిత్యమూ అధికతపోమయం. మాయతో వర్ధిల్లే గుణాలు నీకు లేవు. నీవు గుణరహితుడవు కాబట్టి గుణాలవలన పుట్టె లోభం మొదలైన దుర్గుణాలు నీలో చేరవు. అయినా, దుష్టశిక్షణం, శిష్టరక్షణంకోసం లోకాధిపతులు భీతిల్లేటట్లు దండధారివై లోకహితం చేస్తావు. ఓ లోకేశ్వరేశ్వరా! నీవు జగత్పతివి, గురుడివి, తండ్రివి.

(శ్రీహరి గుణరహితుడు కాబట్టి ఆయనకు ఎవరిమీదా కోపమూ, ఎవరిమీదా ప్రేమా ఉండవు. కానీ, లోకకల్యాణార్థం దుష్టశిక్షణలో కోపం, భక్తులమీద ప్రేమ చూపించడం ఆయన లీలలే!)

లక్ష్మీవల్లభా! ఈశా! నావంటి జ్ఞానశూన్యులను నీవు శిక్షిస్తే తక్కినవారు గర్వం వీడి, బుద్దితెచ్చుకొని, సజ్జనుల మార్గాలను అనుసరిస్తారు.

ఓ శ్రీహరీ! ఒక్కొక్క లోకాన్ని రక్షిస్తూ ఎంతో గర్వంతో; 'మేమే ఈశ్వరులం' అనుకుంటూ ఆనందించే నాబోటి అజ్ఞానులు నీ మహిమ నెరుగలేరు! ఇది నిజం.

(ఒక్కొక్కలోకానికి ప్రభువు దేవేంద్రునివంటివాళ్లు. సర్వలోకాలకు ప్రభువు శ్రీమహావిష్ణువు. ఇది తెలుసుకోలేనివారు అజ్ఞానులేగదా!)

వసుదేవా! కృష్ణా! నీవు స్వతంత్రుడవు! జ్ఞానస్వరూపుడవు! మహాత్ముడవు! సర్వపుణ్యపురుషుడవు! సర్వభూతాల్లోను భీజరూపంలో ఉన్న పరబ్రహ్మవు! నిష్కలంకుడవు! నీకు వందనం.

మాధవా! సర్వేశ్వరా! నీ సామర్థ్యం తెలుసుకోలేక, గోపకులు నన్ను ఉద్దేశించి యాగం చేయడం లేదని, నీ గోకులాన్ని భయంకరమైన, తీవ్రమైన జడివానతో ముంచెత్తాను. నీ మహిమవల్ల నా ప్రయత్నం ఇలా వృథా అయింది. నేను నీ సేవకుణి! అపరాధం చేసినవాణ్ణి! నన్ను దయతోచూడు.

దేవా! సర్వాంతర్యామీ! నిన్ను బ్రహ్మాది దేవతలే తెలుసుకోలేరు. నేను జడుణ్ణి! ముల్లోకాలను రక్షిస్తున్నాననే దురభిమానగరిష్ఠుణ్ణి చెడ్డ పాండిత్యం కలవాళ్లలో మేటిని. వినయాన్ని త్యజించినవాళ్లలో శ్రేష్ఠుణ్ణి! దుర్జనులలో, గర్వులలో, శ్రేష్ఠుణ్ణి, నీ ఘనలీలా వైభవాతిశయాన్ని తెలియడానికి నేనెంతటివాణ్ణి?

(నిష్ఠుండు, గరిష్ఠుడు, భూయిష్ఠుడు, వరిష్ఠుడు, శ్రేష్ఠుడు అనేవి శ్రేష్ఠతా వాచకాలు. వీటిని సాధారణంగా మంచివాటికి విశేషణాలుగా వాడుతుంటారు. ఇక్కడ దుర్గుణాలకు విశేషణాలుగా వాడడం విశేషం.)

ఇలా అనగా విని, నవ్వుతూ మేఘగంభీరమైన కంఠధ్వనితో ఇంద్రునితో శ్రీకృష్ణుడు ఇలా పలికాడు.

జంభారీ! దేవేంద్రా! రాజ్యసంపదచే అంధుడవై ఉన్ననీ మదోద్రేకాన్ని అణచివేయడానికి, ఈయజ్ఞం నేనే తప్పించాను. సిరిసంపదలతో మదించినవారు నన్ను తెలుసుకోలేరు. ఎవరిని నేను నిజంగా రక్షించాలనుకుంటానో, వారిని నిర్ధనులుగా చేస్తాను.

ఐరావతగమనా! దేవేంద్రా! నా ఆనతిని శిరసావహించు! నీ పదవిని నిలుపుకో! రాజ్యలక్ష్మీయుతుడి వయ్యావని గర్వించకు! నీకు శుభాలు కలుగుతాయి! వెళ్లు!

అని ఇలా ఇంద్రునితో పలుకుతున్న కృష్ణునికి మ్రొక్కి గోవుల మందతో వచ్చిన కామధేనువు భక్తజన సురభి అయిన శ్రీకృష్ణునితో ఇలా పలికింది.

విశ్వేశ్వరా! విశ్వభావనా! విశ్వాకారా! మునులకు వందనీయా! వినండి! నీవల్ల మేం శాశ్వతులం అయ్యాము. ఇప్పుడు శాశ్వతానందాన్ని పొందగలిగాము.

దేవా! నీవు మాకు పరమదైవానివి, ఇంద్రుడివు, బ్రాహ్మణుల, గోవుల, దేవతల, సజ్జనుల సుఖాలకోసం నిన్ను ఇంద్రునిగా చేసి పట్టం కట్టుమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించి పంపించాడు. నీవు భూమండలం యొక్క గొప్పదైన బరువు నివారించడానికి అవతరించిన శ్రీమహావిష్ణుడివి అని పలికి తర్వాత.

కామధేనువు క్షీరంతోను, ఐరావతం తన తొండంతో తెచ్చిన సురగంగాజలంతోను, దేవేంద్రుడు దేవమాత అయిన అదితితోను, మహర్షులతోను కలిసి పద్మాక్షుడు, సాధుసంరక్షకుడు, యుద్దాల్లో శత్రువులను జయించేవాడు అయిన పద్మాక్షుడైన కృష్ణుని అభిషిక్తుని చేసి 'నీవు గోవిందుడివి' అని విశేషంగా ప్రశంసించాడు.

వసుదేవసుతుడైన శ్రీకృష్ణునిఅభిషకసమయంలో తుంబురుడు నారదుడు మొదలైనవారు, దేవజాతులైన సిద్ధులు, చారణులు, గంధర్వులు కృష్ణలీలలను గానంచేశారు. అప్సరసలు నాట్యం చేశారు. గొప్పదైన కుసుమ వృష్టిని దేవతలు కురిపించారు. ముల్లోకాలు సంతోషం పొందాయి. తొలిచూలు ఆవుల పొదుగులనుండి వాటంతట అవే పాలు ధారాపాతంగా స్రవించాయి. చెట్లన్నీ తేనెలు వర్షించాయి. తీగెలు పూలు, పండ్లతో విరాజిల్లాయి. పర్వతాలు మణులకాంతులతో ఒప్పాయి. ప్రాణులకన్నింటికి తమలోని వైరాలు అంతరించాయి.

(జగతికి మేలు జరిగే సందర్భంలో కనిపించే శుభచిహ్నాలనన్నింటిని కవి వర్ణించాడు. శ్రీకృష్ణుడు సర్వలోక రక్షకుడు. అతని అభిషేక సమయం అందరికీ శుభసమయమే. అందుకే నారదుడు, తుంబురుడు, సిద్దులు, చారణులు, గంధర్వులు పాడడం. అప్సరసలు ఆడడం. అప్రాణులైన చెట్లు లతలు కూడా సంతోషించాయి. స్వామికి ప్రాణి అప్రాణి భేదం లేదు. గోవులను రక్షించేవాని అభిషేక సమయం కాబట్టి తొలిచూలు ఆవులు క్షీరం స్రవించాయి. పర్వతాలు రత్నాలతో తళుక్కున మెరిశాయి. నదులు ఉప్పాంగాయి. ప్రాణులు తమ జాతి వైరాన్ని మరిచాయి.)

దేవేంద్రుడు ఇలా శ్రీకృష్ణుని గోపకులకు, గోవులకు అధినేతగా అభిషిక్తుని చేసి, వీడ్కొలు తీసుకొని, తన దేవగణాలతో స్వర్గానికి తిరిగి వెళ్ళాడు. ఆ తర్వాత

శ్రీకృష్ణమూర్తినందుని వరుణనగరమునుండి కొనితెచ్చుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Nanda's discussing with sri krishna about Indrayagam - నందాదు లింద్రయాగము సేయ శ్రీకృష్ణునితో నాలోచించుట

నందాదు లింద్రయాగము సేయ శ్రీకృష్ణునితో నాలోచించుట

ఈ విధంగా బ్రాహ్మణులు అనేక విధాలుగా అనుతాపం అనుభవించారు. తమ తప్పులు మన్నించమని మనస్సులోనే మాధవుణ్ణి ధ్యానించి నమస్కరించారు. అయినా కంసునిభయంవల్ల సమీపంలో ఉన్న బలరామకృష్ణులను సందర్శించడానికి వెళ్లలేదు. ఆ తర్వాత యమునాతీరంలో ఉన్న సర్వసాక్షి అయిన శ్రీకృష్ణుడు, ఇంద్రయాగం చెయ్యాలనే సంకల్పంతో తనవద్దకు వచ్చిన నందుడు మొదలగు పెద్దలైన యాదవులకు నమస్కరించి, నందునితో ఈ విధంగా అన్నాడు.

తండ్రీ! మీరేదో యాగం చెయ్యాలనే తలంపుతో ఇక్కడికి వచ్చారు. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఈ యాగానికి అధిదేవత ఎవరు? అధికారి (యజమానుడు) ఎవరు? దీనికి కావలసిన సాధన సంపత్తి ఎంత? ఈ యాగం శాస్త్రవిహితమా? లౌకికమా? శత్రువులకు ఇటువంటి కార్యాల విషయాలు చెప్పకూడదు గాని, హితులకు, మిత్రులకు కావలసిన వారికి చెప్పవచ్చును. కర్మతత్త్వం తెలిసి చేస్తే ఫలం బాగా సిద్ధిస్తుంది. పగ, స్నేహం అనే ద్వంద్వం లేకుండా సమభావంతో మెలగే మీవంటి మంచివారికి దాచవలసిన రహస్యాలు ఏమి ఉంటాయి? అమృతతుల్యమైన మాటలతో మీ అభిప్రాయా లేమిటో చెప్పండి.

ప్రౌఢుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా ప్రశ్నించగా, తండ్రి అయిన నందుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు.

వర్షానికి వరుణుడూ, షడ్గుణైశ్వర్యసంపన్నుడూ అయిన దేవేంద్రుడు ఈ యాగానికి అధిపతి. ఇంద్రుడికి ప్రియమైన మేఘాలు, అతని ఆజ్ఞచేత నేలమీద వానలు కురిపిస్తాయి. సర్వజీవులకూ ఆప్యాయనం కలిగిస్తాయి. ఆ నీటివల్ల పంటలు పండి ప్రజలకు ధర్మార్ధకామాలు సిద్ధిస్థాయి. ఈ సంగతి అంతా ఎరిగిన రాజులు, లోకంలో ఇంద్రయాగం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా కామ లోభ భయద్వేషాలకు లోబడి చేయడం మానేస్తే వారికి తప్పకుండా కీడు మూడుతుంది.

అంతమాత్రమేకాక, ఇంకా ఇంద్రయాగం చేస్తే దేవేంద్రుడు సంతోషించి వానలు కురిపిస్తాడు. వానలు కురిస్తే భూమిమీద గడ్డి పెరుగుతుంది. ఆ గడ్డిని మేసి ఆలమందలు బతుకుతాయి.

కుమారా! ఆవులు బదికితే గొప్ప పాడి కలుగుతుంది. ఆవుల గుంపులవలన చక్కగా పాడి కలుగుతుంది. పాడి కలిగితే మానవులు దేవతలను తృప్తిపరచి జీవిస్తారు.

అని ఇలా నందుడు చెప్పిన మాటలు విని రాక్షససంహారకుడయిన శ్రీకృష్ణుడు, దేవేంద్రుడికి కోపం పెరిగే విధంగా, తన తండ్రితో ఈ విధంగా అన్నాడు.

ఓ నందరాజా! లోకంలో ప్రాణి తాను చేసిన కర్మకు తగిన జన్మనే ఎత్తుతోంది. కర్మచేతనే పెరుగుతోంది. కర్మచేతనే నశిస్తోంది. కాబట్టి ఆ కర్మమే మనుష్యులకు దేవత. ప్రాణుల సుఖదుఃఖాలకుకూడా ఆ కర్మమే మూలం.

మహాత్మా! కర్మాచరణం చేసేవాని కర్మలకు తగిన ఫలాన్ని ఇవ్వడానికి ఈశ్వరుని అవసరం ఉందనుకుంటే అతడుకూడా కర్మలుచేసిన వానికే ఫలం కలిగిస్తాడు. వాస్తవానికి కర్మసంబంధం లేని యీశ్వరుడు కూడా కర్మ చేయనివానికి ఫలమీయలేడు.

కాబట్టి జీవులు తాము పూర్వజన్మలలో చేసుకొన్న కర్మలనుబట్టి సుఖదుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. అలాంటివారు ఇంద్రుడికి భయపడవలసిన అవసరంలేదు. పూర్వ పర్వజన్మలలో చేసిన కర్మలఫలాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. వాటి ప్రభావంవల్ల ప్రస్తుత జన్మలలో తగిన కర్మలు చేస్తున్నారు. ఆ కర్మఫలాలనుండి తప్పించడం పరమేశ్వరునికి కూడా సాధ్యం కాదంటే ఇంక ఇతరుల సంగతి చెప్పేదేమిటి? దేవ దానవ మానవ సముదాయాలతో నిండిన ప్రపంచమంతా పూర్వకర్మకు లోబడే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇందులో సందేహం లేదు. జీవుడు తాను చేసిన కర్మలకు తగిన విధంగానే పెద్దవో, చిన్నవో దేహాలు ధరిస్తూ ఉంటాడు. విడిచి పెడుతూ ఉంటాడు. కర్మఫలాన్ని అనుసరించియే గురువు, దేవత, మిత్రుడు, శత్రువు, చుట్టము మనకు లభిస్తూ ఉంటారు. ఎన్నిజన్మ లెత్తినా జీవుడు కర్మఫలాన్ని అనుసరించే ప్రవర్తిస్తూ ఉంటాడు. జీవునికి కర్మమే దేవత. ఇంతటికీ ముఖ్యకారణం కర్మమే అయినప్పుడు ఆ కర్మను విడిచిపెట్టి ఇతరుల్ని ఆశ్రయించడం భార్య భర్తను విడిచిపెట్టి జారపురుషుణ్ణి ఆశ్రయించడం వంటిది. బ్రాహ్మణుడు వేదవిహితమైన కర్మను ఆచరిస్తూ జీవిస్తాడు. రాజు - ప్రజాపాలన చేస్తాడు. వైశ్యుడు - సేద్యం, వడ్డీకి ఇవ్వడం, పశువులను పోషించడం ద్వారా జీవిక గడుపుకొంటాడు. శూద్రుడు - పైవారిని సేవిస్తూ జీవిస్తాడు. సత్త్వం, రజస్సు, తమస్సు అనే గుణాలు ప్రపంచంయొక్క ఉత్పత్తి, స్థితి, నాశాలకు కారణాలు. వానిలో రజోగుణంవల్ల విశ్వం పుడుతుంది. రజోగుణప్రేరణవల్ల మబ్బులు వానలు కురుస్తూ ఉంటాయి, వానలవల్ల ప్రజలు వృద్ధిపొందుతూ ఉంటారు. ఇందులో ఇంద్రుని అవసరం ఏమి ఉంది? అంతమాత్రమేగాక,

ఈ సందర్భంలో ఇంద్రుడు కోపగించవలసిన అవసరం లేదు. ఒకవేళ కోపగించుకొన్నాడే అనుకొందాం. అందువల్ల మనకు వచ్చే లోటు ఏమీ లేదు. మనకుండే నగరాలు, రాజ్యాలు, ఇళ్లు, వ్యాపారాలు పోతాయేమోనని భయమా? మనం వాటితో నిమిత్తం లేకుండా కొండలలో, అడవులలో పశువులను కాచుకొంటూ, బ్రదుకుతున్నవాళ్లు. మనకు జంకు ఎందుకు?

మనకు జీవనాధారమైన ఆవులను, ఆ ఆవులకు కడుపునిండుగా తినడానికి, త్రాగడానికి, గడ్డిని, నీటిని ఇచ్చే ఈ కొండను, ఎల్లప్పుడు మనహితం కోరే బ్రాహ్మణులను గురించి యజ్ఞం చేయడం మంచిపని. అంతేకాని ఇప్పుడు ఇంద్రయాగం చేయవలసిన అవసరం లేదు. ఇంద్రయాగం గురించి ఏ యే ద్రవ్యాలు తెప్పించాలనుకొన్నారో వానినన్నిటిని తెప్పించండి. పరమాన్నాలు, అప్పాలు, గోధుమపిండివంటలు, పప్పులు, పండ్లు, ఆకుకూరలతో వండదగిన పదార్దాలు వండించండి. అగ్నికి ఆహుతులు సమర్పించండి. షడ్రసోపేతంగా బ్రాహ్మణులకు సంతర్పణ చేసి, పాడిఆవులను, అధికంగా దక్షిణలను సమర్పించండి. స్థిరచిత్తంతో పర్వతాన్ని పూజించండి. పతితులకు, చండాలురకు భోజనాలు పెట్టండి. కుక్కలకు తగిన వంటకాలు పెట్టండి. ఆవులకు కడుపు నిండుగా గడ్డిని పెట్టండి.

ఓ తండ్రీ! చందనం పునుగు జవ్వాజివంటి సుగంధద్రవ్యాలు పూసుకోండి. అలంకారాలు వేసుకోండి. కొత్తబట్టలు కట్టుకోండి. మీరుమీ చుట్టాలతో కలిసి నోరూరించే తినుబండారాలు తినండి. నా మాటమీద గురి ఉంచి, ఈ పర్వతానికి, బ్రాహ్మణులకు, ఆవులకు, అగ్నికి మొక్కండి. మీ పుట్టుక సార్ధకం అవుతుంది.

శ్రీకృష్ణుడు ఇంద్రునిగర్వం అణచడానికి ఈ నూతనయాగం తనకు సమ్మతమని చెప్పాడు. దీన్ని విన్న నందాదులు బాగు బాగని బ్రాహ్మణులచేత పుణ్యాహవాచనమంత్రాలు చదివించారు. వారికి తృప్తిగా భోజనాలు పెట్టారు. ఆవులకు కడుపునిండుగా మేతలు పెట్టారు.

శ్రీకృష్ణుడు ఎప్పటిలాగా తన నిజమయినరూపంతో గొల్లలమధ్య ఉంటూనే 'ఇదిగో పర్వతం. మీరంతా వచ్చి పూజించండి' అని చెప్పి, తాను పర్వతరూపం ధరించి, వారి యెదుట నిలిచాడు. తాను నందాదులతో కలిసి పర్వతరూపంలో ప్రత్యక్షమైన తననే పూజించుకొన్నాడు. ఆ గొల్లలు భక్తితో సమర్పించిన అన్నాదులన్నీ ఆరగించాడు.

తనను ఆశ్రయించిన వారికి కల్పవృక్షమై, కోరిన కోర్కెలు తీర్చే శ్రీకృష్ణుడు గోపాలురతో ఈ విధంగా అన్నాడు. మీరు బాగా వినండి. ఈ పర్వతం తన యిచ్చ వచ్చిన రూపం ధరించగలదు. దుష్టుల్ని శిక్షిస్తుంది. మనం పెట్టిన నెతి బువ్వలన్నీ తిన్నది. మనల్ని ఆదరించింది. మనమీద దయ చూపించింది. ఈ విధంగా పలికి శ్రీకృష్ణుడు కొండకు నమస్కరించాడు.

ఈ విధంగా గొల్లలందరు శ్రీకృష్ణునితో కలిసి కొండకు పూజలు చేసి నైవేద్యాలు పెట్టారు. ఆవులమందల్ని ముందుంచుకొని, బ్రాహ్మణులు ఆశీర్వదిస్తూ ఉండగా, పర్వతానికి ప్రదక్షిణ చేశారు. అప్పుడు,

ఓ పరీక్షిన్మహారాజా! నందాదులు గుర్రాలకంటె వేగంగా పరుగెత్తే ఎడ్లతో బండి కట్టుకొని, గొల్లపిల్లలు కేరింతలు కొడుతూ ఉండగా ఆలమందల్ని వెన్నంటి తరిమి ముందుకు పరుగెత్తించారు.

కలిగొట్టు పూలవాసనవంటి శరీర వాసనగల గోపికలు రథాలమీద వెళ్లుతూ తమ గాన విద్యానైపుణ్యం తేటతెల్లం అయ్యేలా, ఆరోహణావరోహణల క్రమంతో శత్రుసంహారం చేసేవాడు శ్రీకృష్ణుడు - అంటూ అతని లీలలను పాటలుగా పాడారు.

పెద్ద కుండలవంటి పొదుగులతో, మెరుగుగొలుపే పలురంగులతో, బహువిధాలైన ఆకారాలతో, నిండుగా ఉన్న పొట్టలతో ఒప్పే పాడి ఆవులమందలు నేత్రానందం గొల్పుతూ ముందుకు కదిలాయి.

బలిసిన మూపులు, పొడవైన తోకలు, కొండలవంటి పెద్ద శరీరాలు, నింగి నేల నిండేలా వేసే రంకెలుగల ఎడ్లగుంపు నెమ్మదిగా నడచింది.

ఈ విధంగా పర్వతానికి ప్రదక్షిణం చేసిన గొల్లవారు శ్రీకృష్ణునితో కలిసి గొల్లపల్లెకు వెళ్లిపోయారు. అపుడు తనను కాదని కొండను పూజించిన వృత్తాంతం తెలుసుకొన్న దేవేంద్రుడు మహాకోపంతో ప్రళయం కలిగించే సంవర్తకాదిమేఘాలతో ఈ విధంగా అన్నాడు.

(ప్రళయకాల మేఘాలు తొమ్మిది 1.సంవర్తకం 2.ఆవర్తకం 3.పుష్కరం 4.ద్రోణం 5.కాలం 6.నీలం 7.ఆరుణం 8.తమస్సు 9.వారుణం.)

భూలోకంలో నందగోకులంలో ఉన్న గొల్లలు పెరుగులు నేతులు తాగి బాగా పొగరెక్కిపోయారు. వారికి భయం భక్తి కూడా లేకుండా పోయాయి. కొండల గుంపుల కఠినమైన రెక్కల్ని తెగనరకిన వజ్రాయుధం ధరించిన దేవేంద్రుణ్ణి నన్ను లక్ష్యపెట్టక, నా గురించి యాగం చెయ్యక, ఆ శ్రీకృష్ణుని మాట పట్టుకొని ఆ కొండకు పూజచేసి, ఇండ్లకు వెళ్లిపోయారు. చూశారా?

భూలోకంలోని నందగోకులంలో ఉన్న గొల్లలు కృష్ణునిమాట విని, నన్ను విడిచిపెట్టారు. ఆ కృష్ణుడు గురువు, దేవత లేనివాడు, లోకానుభవం లేని పసివాడు. కొండలలోను చెట్లతోపులలోను తిరిగేవాడు, ఎవరిమాట విననివాడు, నిలకడలేనివాడు, మంచికులం, మంచిగుణం లేనివాడు.

ఈ గొల్లవాళ్లు చాల తెలివి తక్కువవాళ్లు. బ్రహ్మవిద్య అనే ఓడతో దాటలేక ఈ పెద్ద సంసార సముద్రాన్ని యజ్ఞాలు, యాగాలు అనే తెప్పలతో దాటాలని వీళ్లు కోరుతున్నారు.

ఓ మేఘములారా! మానవులయిన ఈ గొల్లవారు మరణించే స్వభావం కలవారు. తమ గోసంపద శాశ్వతం అనుకొని, కృష్ణుని ప్రేరణచేత నన్ను గురించిన యాగం చెయ్యడం మానివేశారు. కాబట్టి మీరు వెంటనే వెళ్లి, మెరుపులు మెరయించి, ఉరుములు మొరయించి, వారూ వారితోబాటు వారిఆవులూ ప్రాణాలు వదలేటట్లు అప్రతిహతంగా రాళ్లవాన కురిపించండి;

ఆ కృష్ణుని ఆల మందల్ని బాధించడానికి, నేనునా వాహనమైన ఐరావతాన్ని ఎక్కి దేవసైన్యంతో కలిసి, మీ వెనుకనే వస్తాను, నడవండి.

జంభాసురుణ్ణి జయించిన దేవేంద్రుడు ఈ రీతిగా పలికిఆటోపంతో వజ్రాయుధం అటూ ఇటూ ఝళిపించాడు. జంకు గాంకులు లేకుండా క్రోధంతో పుష్కలావర్తకాది మేఘాల సంకెలలు విడిపించి వ్రేపల్లెమీదికి ఉసిగొలిపాడు. పెనుగాలులు ప్రేరేపింపగా గుంపులుగూడి రేపల్లె మీది ఆకాశమండలాన్ని కారుమొయిళ్లు కమ్ముకొన్నాయి. సూర్యమండలాన్ని కప్పేశాయి. నింగికి నేలకు నడుమ కారుచీకట్లు కమ్మి కన్ను కానరావడం లేదు. త్రివిక్రముడైన వామనుని రెండవ అడుగుతాకిడికి పగిలిన బ్రహ్మాండభాండంచిల్లులనుండది కారే బాహ్యసముద్రజలప్రవాహాలవలె పెద్ద పెద్ద వర్షధారలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా వడగళ్లు, పిడుగులు పడ్డాయి. ఎత్తుపల్లాలు ఏకమయ్యేలా వర్షజలం ప్రళయకాల సముద్రాన్ని తలపించింది. ఆ జలప్రవాహంలో దుడుకు తగ్గిన లేగదూడలు ఈదుతూ ప్రళయాగ్ని జ్వాలలవలె విజ్బంభించే విద్యుల్లతలను చూచి, కళ్లు బైరులు కమ్మి సొమ్మసిల్లి పోయాయి. ఆ లేగలకు తమ మోరలు అడ్డంగా ఉంచిన పాడిఆవులు ప్రళయకాల భయంకర భేరీ భాంకారాలవలె వినబడే మేఘగర్జనలకు తమ చెవులు చిల్లుపడగా, గుండెలు పగిలి సాగిలి పడసాగాయి. ఆ గోవులముందు ఆబోతులు నిలబడి, ప్రళయకాలరుద్రునిచేతిలోని పెనుగదాప్రహారాలనుండి పుట్టినవా అన్నట్లుగా ఎడతెగకుండా పడే పిడుగులపాట్లకు అంబా అంబా అని అరుస్తున్నాయి. ఆ అరుపులు శ్రీకృష్ణుణ్ణి రక్షించమని మొర పెట్టుకుంటున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. లేగలను, ఆవులను, ఆబోతులను రక్షించుకునే ప్రయత్నంలో ఉన్న గొల్లవాళ్లు వడివడిగా కురిసే వడగళ్ల తాకిడికి సత్తువ తప్పి కొయ్యబారిపోయారు. దట్టమయిన వానతాకిడికి తాళలేక తమ మగలను పట్టుకొని, బలహీనమైన నడుములు వణుకుతూ ఉండగా, రక్షించుమని గోపికలు శ్రీకృష్ణుణ్ణి గురించి మొరపెడుతున్నారు. భయపడిన శిశువులు గట్టివి, పెద్దవి అయిన తమ తల్లుల చన్నులమాటున తలలు దాచుకొంటున్నారు. ఈ విధంగా అల్లకల్లోలమయి, ఆక్రందనలతో నిండిన వ్రేపల్లెను చూచి, ముదుసలి గొల్లలు కొందరు దుష్టశిక్షకుడు శిక్షరక్షకుడు అయిన శ్రీ కృష్ణుణ్ణి సమీపించి, నమస్కరించి ఈ విధంగా ప్రార్థించారు.

దయగలవారిలో మేటివయిన కృష్ణా! ఎక్కడ ఉన్నావయ్యా! అయ్యో, గోకులమంతా జడివానలో తడిసి ముద్దయిపోయింది. మనవారంతా ఆకులపాటుతో అలమటించిపోతున్నారు. నువ్వే దిక్కని నిన్నే నమ్ముకొని ఉన్నమన వారందరినీ కాపాడకుండా ఇంతదాకా ఉపేక్షించడం నీకు తగునా?

గుణమణులకు గనివంటి వాడవయిన కృష్ణా! నీమీద ఒట్టు పెట్టి మరీ చెబుతున్నాము. ఇంతటి తీవ్రమైన ఉరుములు, మెరుపులు, పిడుగుల చప్పుళ్లు, వానధారలు ఇంతకు ముందెప్పుడూ కనీ, వినీ ఎరుగము. మా మొర వినవయ్యా!

తామరపూలవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! గొల్లపల్లెలోని మనవారికి ఈ వర్షపునీటిబాధ భరింపరానిదయింది. నీవు తప్ప రక్షించేవారు ఇంకెవరూ లేరు. వెంటనే ఈ మేఘాల బాధ పోగొట్టవయ్యా!

సర్వజ్ఞుడయిన శ్రీకృష్ణుడు మందలోని వారు చెప్పిన మాటలన్నీ విని, జరగిందంతా తెలుసుకొని మనస్సులో ఈ విధంగా భావించాడు.

ఈ గొల్లలు తనంటే లక్ష్యం లేకుండా, క్రమానుగతంగా చేయవలసిన ఇంద్రయాగం చెయ్యకుండా, కొత్త పర్వతయాగం అంటూ మొదలు పెట్టారు అనే కోపంతో దేవేంద్రుడు గొల్లవారిమీద రాళ్లవాన కురిపిస్తున్నాడు. దేవేంద్ర వైభవంవల్ల కలిగిన గర్వం అనే గొప్ప పర్వతంమీద కూర్చుండి, తరతమభావం లేకుండా ఉన్నాడు. గర్వాంధుడయినవాడు ఇతరుల్ని లక్ష్యపెట్టడు గదా!

దేవతలంతా నన్ను సేవిస్తూ ఉంటారు. వారికి దేవపదవి వచ్చిందనే గర్వం లేదు. ఇంద్రునికి కీడు కల్గించకుండా గర్వభంగంమాత్రం చేయాలి.

అని ఆలోచించి రాళ్లవానవల్ల దెబ్బలు తిని, తన్ను శరణు జొచ్చిన వ్రేపల్లెలో గొల్లవారిని కాపాడడం ధర్మమని లోకరక్షకుడు, వివేకశాలి అయిన శ్రీకృష్ణుడు భావించి

వనితలారా! కలతపడకుండి, గొల్లపెద్దలారా! భయంతో వణకిపోకండి. బాలురూ! ఇటూ అటూ పారిపోకండి. మిగిలినవారుకూడా రాళ్లవాన చూచి కంగారు పడకండి. ఆలమందల్ని చెల్లాచెదరుగా గాకుండా ఒకచోట నిలపండి. పరమేశ్వరుడు జాగరూకతతో దయగలవాడై తప్పక మీకు మేలు చేస్తాడు.

శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతము నెత్తుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Sage Wifes came and gave food to Srikrishna - మునిభార్యలు అన్నము దీసికొని వచ్చి శ్రీకృష్ణుని ఆరగింప జేయుట

మునిభార్యలు అన్నము దీసికొని వచ్చి శ్రీకృష్ణుని ఆరగింప జేయుట

శ్రీకృష్ణుడు ఈ విధంగా గోపికలను అనుగ్రహించి, బృందావనాన్ని దాటి, దూరంగా తోలుకొనిపోయి ఆవుల్ని మేపుతున్నాడు. ఎండ మెండుగా కాస్తోంది. గొల్లవారు ఆ వేడికి తట్టుకోలేక పోతున్నారు. నీరసించి పోతున్నారు. అక్కడ విశాలంగా విస్తరించి గాడుగులవలె నీడనిచ్చే చెట్లు ఉన్నాయి. వాటిల్ని చూచి తక్కిన గొల్లవారు శ్రీకృష్ణుడు, బలరాముడు, శ్రీదాముడు, దేవప్రస్థుడు, విశాలుడు, అర్జునుడు, మొదలయినవారితో ఈ విధంగా అన్నారు.

గోపబాలకులారా! ఈ చెట్లు చూడండి. ఎంత గొప్పవో! తమకు కీడు తలపెడదామని వచ్చినవారికికూడా కీడు చేయవు. ఎవరిసంబంధం లేకుండా ఏకాంతంగా ఉన్నాయి. ఎండ, చలి, వానలనుండి ప్రజల్ని కాపాడుతున్నాయి. వారికి అవసరమైన బెరడు, గంధం, జిగురు, బూడిద, చిగుళ్లు, తేనె, పూలు, పండ్లు, నీడలు ఇచ్చి ఆదుకుంటున్నాయి.

(రాగద్వేషాలు లేని మహాయోగీశ్వరులు ఏకాంతంగా తపస్సు చేసుకొంటూ ఉంటారు. తమను ఆశ్రయించినవారు మంచివారయినా, చెడ్డవారయినా సర్వసమభావంతో ఆదరించి, వారికీడులను తొలగించి మేళ్లు కలిగిస్తారు. అటువంటివి ఈ వృక్షాలు అని సారాంశం.)

అక్కడి చెట్లన్నీ పువ్వులు కాయలు పండ్లు మెండుగా ఉండడంవల్ల వాటి బరువుకు వంగి ఉన్నాయి. వాటి నడుమనుండే దారులగుండా గొల్లవారు ఆలమందలను యమునవద్దకు తోలుకొని పోయారు. ఆ నదిమడుగులలోని చల్లనినీరు త్రాగించి, సమీపంలోని పచ్చికబయళ్లలో మేపుతూ, తమకు ఆకలిగా ఉందని శ్రీకృష్ణునికి విన్నవించారు. బలరామ సహితుడైన శ్రీకృష్ణుడు తనయందు భక్తిగల బ్రాహ్మణభార్యలను అనుగ్రహించాలని సంకల్పించి, గొల్లవారితో ఈ విధంగా అన్నాడు.

ఓ గోపాలకులారా! ఈ అడవిలో వేదాలు వల్లించిన బ్రాహ్మణులు స్వర్గలోకప్రాప్తికయి 'ఆంగిరసము' అనే యజ్ఞం చేస్తున్నారు. మీరు వారివద్దకు వెళ్లి మా అన్నదమ్ముల పేరులు చెప్పి, వారు పంపగా వచ్చామని చెప్పి, అన్నం పెట్టుమని అడగండి. వారు పెడతారు. అలాగే అని గోపబాలకులు బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి, నమస్కరించి, అయ్యా! మీరు ధర్మతత్త్వం ఎరిగినవారు. యాచకులు అడిగినవి అనుగ్రహించేవారు! ఆవులను మేపుతూ అలసిపోయిన బలరామకృష్ణులు ఆకలితో అన్నం పెట్టమని మీ వద్దకు పంపారు. కాబట్టి అన్నం పెట్టండి. ఆకలితో నకనకలాడేవారిని పిలిచి మరీ అన్నం పెడతారు కదా మీవంటి పెద్దలు!

ఓ పుణ్యాత్ములారా! యజ్ఞదీక్ష వహించిన యజమానుడు పశువిశసనం జరిగిన పిమ్మట, సౌత్రామణి క్రతువు పూర్తి అయిన పిమ్మట భోజనం చేయవచ్చు. ఇతరులకు పెట్టవచ్చు. అది దోషం కాదు. కావున మాకు అన్నం పెట్టండి.

ఈ విధంగా గొల్లవారు అన్నం పెట్టండి అని బ్రాహ్మణులను యాచిస్తే

అజ్ఞానంతో కూడినవారు, దుర్బుద్ధి కలిగినవారు అగు బ్రాహ్మణులు, సమస్తానికీ ప్రభువయినవాడు శ్రీకృష్ణుడని గ్రహించ లేకపోయారు. వాస్తవానికి యజ్ఞం, మంత్రాలు, దేశకాలధనాలు, యజ్ఞం చెయ్యడంవల్ల కలిగే పుణ్యఫలం (అపూర్వం), అన్నీ కూడ శ్రీవిష్ణుస్పరూపాలే. అటువంటి శ్రీ కృష్ణుణ్ణి సామాన్యమైన గొల్లపిల్లవాడు అని భావించి, అతని మాటలను గౌరవించకుండా, అన్నం లేదు లేదు వెళ్లిపొండి అని తిరస్కరించి పంపించారు.

అపుడు గోపాలకులు నిరాశతో శ్రీకృష్ణుని వద్దకు వచ్చి, జరిగిన విషయం వివరించారు. అంతట శ్రీకృష్ణుడు లోకవ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ గొల్లవారితో మీరు వెళ్లి ఆ బ్రాహ్మణులను గాకుండగా వారిభార్యలను దర్శించి, వారికి మా రాకను చెప్పండి. వారు తప్పక అన్నం పెడతారు, అని పంపించాడు. వారు వెళ్లి యజ్ఞవాటికలో ఉన్న బ్రాహ్మణ భార్యలను దర్శించి, నమస్కరించి వారిచే సత్కారం పొంది, వారితో ఈ విధంగా అన్నారు.

బుద్ధిమతులయిన ఓ అమ్మలారా! శ్రీకృష్ణుడు ఆవులను మేపుతూ, ఆకలి గొన్నవాడయి మిమ్మల్ని అడిగి అన్నం తెమ్మని ఈరోజు మమ్మల్ని పంపించాడు. కావున వెంటనే అన్నం పట్టుకొనిరండి.

గొల్లల మాటలు విన్న బ్రాహ్మణస్త్రీలు శ్రీకృష్ణుణ్ణి చూడాలనే కుతూహలంతో, సంతోషం, తొట్రుపాటు అధికం కాగా, భక్ష్య భోజ్య చోప్య లేహ్య పానీయాలనే భేదాలతో కూడుకొని ఉన్న ఆహారపదార్జాలను పాత్రలలో నింపుకొని, సముద్రం చేరడానికి తొందరపడే నదులవలె (బయలుదేరారు)

పిల్లలు, మగలు, అన్నదమ్ములు అడ్డం వచ్చి వెళ్లవద్దని వారించారు. అయినా ఆ బ్రాహ్మణస్త్రీలు వారిని లక్ష్య పెట్టక, ఎదిరించి, మాదారికి అడ్డురాకండి తొలగిపొండని గద్దించి, ఆహారపదార్థాలు తీసికొని వేగంగా శ్రీకృష్ణుణ్ణి సమీపించారు.

బ్రాహ్మణస్త్రీలు ఈ విధంగా వెళ్లి, యమునకు సమీపంలో కొత్తచిగుళ్లతో కూడిందీ, తన క్రిందికి చేరినవారి బడలికను పోగొట్టేదీ అయిన అశోకవృక్షచ్చాయలో ఒకమంచి చోట

అపుడు శ్రీకృష్ణుడు ఒక స్నేహితుని భుజంమీద ఒక చేయివైచి, రెండచేతితో వేడుకగా తామరపూవును ఇటు అటు త్రిప్పుతున్నాడు. తలమీది ముడికి అందని కొన్ని ముంగురులు చెక్కిళ్లమీద చిందులాడుతున్నాయి. కురుచగా కుచ్చెళ్ళువచ్చేలాగున బంగారు రంగుబట్ట కట్టుకొని ఉన్నాడు. తలచుట్టు గుండ్రంగా అమరి ఉండునట్లుగా దట్టంగా కుట్టిన నెమలీకలదండ ధరించాడు. చెవిసందున కలువపూవు పెట్టుకొన్నాడు. పారవశ్యం కలిగించేటంతటి చక్కటి నటవేషంతో ప్రకాశిస్తున్నాడు. అటువంటి శ్రీకృష్ణుణ్ణి బ్రాహ్మణవనితలు కన్నుల కరువెల్ల తీరేలా కనుగొన్నారు.

సన్ననినడుములు గల ఆ బ్రాహ్మణస్త్రీలు శ్రీకృష్ణుని సుందరమైన రూపాన్ని కన్నులతో హృదయంలోనికి క్రమంగా ఆకర్షించుకొన్నారు. మనస్సులలోని తాపాలు హరించే విధంగా అతణ్ణి తమ మనస్సులతోనే కౌగిలించుకొన్నారు.

ఈరీతిగా ఆ బ్రాహ్మణస్త్రీలు ఐహికమైన అన్నికోరికలను వదలుకొని తనను దర్శించడానికి వచ్చిన సంగతిని గ్రహించిన శ్రీకృష్ణుడు, చిరునవ్వు నవ్వి, నిశ్చలదృష్టితో వారిని చూస్తూ, వారితో ఈ విధంగా అన్నాడు.

గొప్పవారయిన ఓ పడతులారా! నా దగ్గరకు రండి. మీ యిండ్లలో అందరు క్షేమమే కదా! ఏ ప్రయోజనాన్ని కోరి నావద్దకు వచ్చారో చెప్పండి. పతిపుత్రాదులపట్ల ఉన్న ప్రేమనుకూడా కాదని నన్ను చూడాలనే వేడుకతో వచ్చారు. ఏ విధమైన ఫలాసక్తి లేకుండా వచ్చారని నాకు తెలుసు. యోగీశ్వరులుకూడ మీలాగుననే నన్ను ఆశ్రయించి, సేవించి, సమస్త ప్రయోజనాలు పొందుతూ ఉంటారు.

“మీ భర్తలు గృహస్థధర్మాలను పాటించేవారు. వారు మీతో కలిసి యాగం పూర్తి చేస్తారు. కావున మీరు వెంటనే యాగశాలకు వెళ్లండి” అని శ్రీకృష్ణుడు చెప్పగా బ్రాహ్మణస్త్రీలు శ్రీకృష్ణునికి ఈ విధంగా సమాధానం చెప్పారు.

ఓ లక్ష్మీపతీ! మాతో ఇటువంటి తీక్ష్ణమైన మాటలు మాటాడవచ్చునా? ఇది నీకు న్యాయమా! మా భర్తలు, బిడ్డలు, అన్నదమ్ములు, తండ్రులు వద్దని అడ్డగిస్తూ ఉన్నా, వారిని కాదని నీ మీది వ్యామోహంతో నీ దగ్గరకు వచ్చాము. ఇపుడు ఇంటికి తిరిగి వెళితే వారు స్వీకరిస్తారా? కావున ఇపుడు నువ్వు చెప్పినమాటలు మాకు నచ్చవు. మేము నీ వద్దనే ఉంటాము. మమ్మల్ని నీ సేవకురాండ్రుగా భావించి కాపాడు.

అని బ్రాహ్మణస్త్రీలు పలుకగా శ్రీకృష్ణుడు వారికి నచ్చ జెప్పాడు. మీరునా దగ్గర ఉన్నారని మీ చుట్టాలు, అన్నదమ్ములు, మగలు, బిడ్డలు ఎవ్వరూ కోపపడరు, సరికదా - దేవతలయినా మిమ్మలను మెచ్చుకోవలసిందే. నా దేహంతోడి సంబంధం కామసౌఖ్యాన్ని, కామభావాన్ని కలిగించదు. పైగా ముక్తిని ప్రసాదిస్తుంది. నన్ను గూర్చి స్తుతించడం, దర్శించడం, వినడం, ధ్యానం చేయడం, మీ మనస్సులను నా యందే లగ్నం చేయడం అనే వాటివల్ల, కర్మసంబంధంతో ఏర్పడిన ఈ శరీరం విడిచి తగినకాలంలో నాలో ఐక్యమైపోతారు. నా మాటలు నమ్మండి అని పలికిన పిమ్మట శ్రీకృష్ణుడు వారు తెచ్చిన ఆహారహూర్జాలను తన ఆప్తవర్గంవారితో కలిసి ఆరగించాడు.

ఓ పరీక్షిన్మహారాజా! పరమేశ్వరభావంతో సామాన్యజనునికి భిక్ష పెడితే పరమపదం అయిన వైకుంఠం సిద్ధిస్తుంది. మరి, స్వయంగా పరమేశ్వరుడే శ్రీకృష్ణరూపంలో వచ్చి భీక్ష స్వీకరించినందువల్ల కలిగే ఫలం ఎంతటిదో ఎవరు చెప్పగలరు?.

ఈ విధంగా పరమేశ్వరుడయిన శ్రీకృష్ణునికి ఆహారం సమర్పించి, తమ భార్యలు ఆయనచేత ధన్యురాండ్రయిన సంగతి తెలుసుకొని ఆ బ్రాహ్మణులు తమలో తాము పశ్చాత్తాపం పొందారు.

అయ్యయ్యో! మనం ఎంత మోసపోయామో గదా! ఆడవారికున్నవాటి బుద్ధికూడ మనకు లేదు. దగ్గరకు వచ్చిన శ్రీకృష్ణుణ్ణి వెళ్లి దర్శించలేక పోయామే! మన మనస్సులు మంచివి కావు. మనం ఎంతో పాపం చేసుకొన్నాము. విష్ణువును పూజించనివారితెలివితేటలు, తపస్సు, సదాచారం, తీర్ధయాత్రలు, యాగాలు వ్యర్థములే గదా!

ఆడవారు జపాలు, హోమాలు, వేదాధ్యయనాలు, తపస్సులు, వ్రతాలు, ఏమీ ఎరుగరు. అయినప్పటికినీ భక్తి కలిగి శ్రీకృష్ణునిదయకు పాత్రలయ్యారు. జపహోమాదులు అన్నీ చేస్తూ ఉండికూడ భక్తిలేని కారణంగా చాంచల్యానికి లోనయి, శ్రీకృష్ణుని అనుగ్రహానికి నోచుకొనలేక పోయాము గదా!

విష్ణుమాయ దేవతలకు గురువులయిన మహాయోగీశ్వరులనే మోహంలో ముంచేస్తుంది. ఇక సామాన్యమానవులకు గురువులమై అజ్ఞానులమయిన మమ్మల్ని మోహింప జేయడంలో ఆశ్చర్యం ఏమి ఉంది?

యజ్ఞాలు, మంత్రాలు, తంత్రాలు, పుణ్యం, ధనం, కాలం, దేశం, దేవత, త్రేతాగ్నులు, బ్రాహ్మణులు అంతా విష్ణుమయమే! అట్టి పరమేశ్వరుడు భూమిని రక్షించడంకోసం శ్రీకృష్ణుడుగా అవతరించాడు అనే సంగతి తెలుసుకొన లేకపోయాం. లక్ష్మీదేవికి భర్త, సృష్టి స్థితిలయాలకు కర్త భూమండలానికి ఉద్ధర్త, రాక్షసరాజులకు సంహర్త అయిన శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాము.

నందాదు లింద్రయాగము సేయ శ్రీకృష్ణునితో నాలోచించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

The taking of the clothes of the Gopikas - గోపికా వస్త్రాపహరణము

గోపికా వస్త్రాపహరణము

ఒకనాటి ఉదయం గోపికలు మేలుకొని, ఒకరినొకరు రండురండని ప్రియంగా పేర్లు పెట్టి పిలుచుకొంటూ, శ్రీకృష్ణుని స్తోత్రం చేస్తూ పాటలు పాడుతూ, బరువైన చనుగవలవల్ల సన్నని నడుములు అల్లలాడుతూ ఉండగా గజగమనంతో ఒకరి చేతులు మరొకరు పట్టుకొని యమున ఒడ్డుకు చేరుకొన్నారు.

గజగమనలయిన ఆ గోపికలు ఈ విధంగా యమునానదీతీరానికి చేరుకొన్నారు. ఒక ఏకాంత ప్రదేశంలో తాము కట్టుకొన్న బట్టలు విడిచి పెట్టి, మనస్సులో ఏ సంకోచం లేకుండా స్నానం చేయడంకోసం నీళ్లలోకి దిగారు.

ఆ గోపికలు శ్రీకృష్ణుణ్ణి గురించి గానం చేస్తూ వినోదంగా, ఇచ్చానుసారంగా జలవిహారాలు సాగించారు. వారి విహారాలకు లోకంలో సాటి లేదు.

అలాంటి వేళలో

ఓ రాజా! దూరంగా ఉన్న శ్రీకృష్ణునికి గోపికలు యమునానదిలో స్నానం చేస్తున్నారనే సంగతి తెలిసింది. వెంటనే తన సావాసగాండ్రతో కలిసి అక్కడకు చేరుకొన్నాడు.

శ్రీకృష్ణుడు తనతోవచ్చిన గొల్లవారిని కదలకుండ నిలబడండి అని కంటితో సైగ చేశాడు. తాను మెల్లమెల్లగా పొదల మాటున నుండి నక్కి దాగి నడచుకుంటూ వచ్చి, గోపికల వస్త్రాలను అపహరించాడు.

ఈ విధంగా గోపికల వస్త్రాలను దొంగిలించినవాడై,

ఆదిపురుషుడు, విశ్వభర్త అయిన శ్రీకృష్ణుడు లీలాబాలకుడయి, తనతోటివారితో వచ్చి, గోపికల వస్త్రాలు అపహరించాడు. యమునానదికెరటాల మీదనుండి వచ్చే చల్లనిగాలి అతనికి హాయి కలిగిస్తోంది. ఏనుగులాగ విలాసంగా నడుచుకుంటూ వెళ్లి, సమీపంలో ఉన్న కడిమిచెట్టును ఎక్కినాడు. ఆ చెట్టు వృక్ష జన్మ ఎత్తినందువల్ల కలిగిన సంతాపాన్ని ఆ క్షణంలోనే విడిచిపెట్టి, తన జన్మ ధన్యమయిందని భావించింది.

ఆ సమయంలో గోపికలు ఇలా అన్నారు.

కృష్ణా! వద్దు వద్దు. మా వస్త్రాలు అపహరించి మా అభిమానాన్ని పాడు చేయవద్దు. మా మనస్సులు అపహరించి మాకు మైమరపు కలిగించవద్దు.

ఓ కృష్ణా! నీవు మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రఘురామ బలరామ బుద్ధ కల్క్యివతారాలెత్తి, లోకాలను రక్షించావు. అటువంటి నీవు మంచిజీవిక కలిగి ఉండాలి. ప్రేమతో నీ వంశంవారిని సాకుతూ ఉండాలి. ప్రభుత్వాన్ని వహించి భూమిని పాలిస్తూ ఉండాలి. ఇతడు సింహంవంటివాడు అనే ప్రశస్తిని పొందాలి. 'వయసున చిన్నవాడవయినా నీకంటె బలవంతుడయిన వాణ్ణి వంచి లోకానికి మేలు చేశాడనే' కీర్తిని పొందాలి. లోకంలో దుర్మార్గులయిన రాజులను జయించాలి. మంచిబుద్ధి కలవాడవు అనిపించుకోవాలి. నీ కులం వారిని ఆదుకోవాలి. స్వపరభేదం లేకుండా ప్రవర్తించాలి. ఇటువంటి కొంటెపనులు నీ వంటివాడు చేయకూడదు. మా వస్త్రాలు మాకు ఇవ్వు,

శ్రీకృష్ణా! మా మనస్సులను, మానాభిమానాలను, సిగ్గును, చివరకు బట్టలను కూడా నీవు అపహరించావు. ఇంకా ఏమేమి చేయదలచుకొన్నావో గదా! నీవు కొంటెవాడివికదా! నీ సంగతి బాగా తెలుసుకొన్నాము.

ఓ కృష్ణా! నీవు రాచఠీవితో లోకాతీతమైన కార్యాలు సాధిస్తూ ఉంటావు. బలవంతుడవై ఇతరులను శిక్షిస్తూ ఉంటావు. కోపంతో లోకాలు కూల్చివేస్తూ ఉంటావు. మాయలమారివై ఒక తీరుగా ఉండవు. నీ తీరుతెన్ను లేమిటి? నీ పరిమితి ఏమిటి? ఒక్కగుణం కూడ నీలో లేదు. ఏనాడు ఒకచోట నిలకడగా ఉండవు. మా బట్టలు మా కిచ్చివేయుము.

అర్భాంతరం : కృష్ణా! నీవు పరమాత్మవు. రజోగుణాన్ని ఆశ్రయించి విశ్వసృష్టిని, సత్త్వగుణాన్ని ఆశ్రయించి స్థితినీ, తమోగుణాన్ని ఆశ్రయించి లయాన్నీ కొనసాగిస్తూ ఉంటావు. సమస్తరూపుడవు. అపరిచ్చిన్నుడవు. గుణాతీతుడవు. దేశకాలాలకు లోబడనివాడివి.

ఓ కృష్ణా! నీకు రాజులసంగతి తెలియదు. నువ్వేమీ ఈ రాజ్యానికి రాజువు కావు. మా చీర లియ్యకపోతే నందమహారాజుకు నీ ఆగడాల్ని గురించి, చెప్తాం.

శ్రీకృష్ణుడు గోపికల మాటలు విన్నాడు. ముసి ముసి నవ్వులు నవ్వుతూ, తన సావాసుల చేతులలో చేతులు వేసి, చతురుడైన కృష్ణుడు నేర్పుగా వారితో ఇలా అన్నాడు.

స్త్రీలు రాజులతో ప్రవర్తించవలసిన తీరు ఇదేనా? కేవలం నన్ను నిందిస్తున్నారు. కానీ మీ తప్పు మీరు తెలిసికోవడం లేదు. చంద్రబింబాననల్లారా అయిన మీరు నీటినుండి బయటకు వచ్చి మీ బట్టలు తీసికోండి. వెంటనే ఇచ్చేస్తాను.

శ్రీకృష్ణుని మాటలు విన్న గోపికలు ఒకరి మొగం ఒకరు చూచి నవ్వుకొన్నారు. మర్మాలు నాటే ఆ మాటలకు తిరిగి జవాబు చెప్పడానికి సిగ్గుపడ్డారు. గొంతులోతు నీటిలో నిలబడి చలికి వణకిపోతూ నిలకడలేని మనస్సుతో ఇలా అన్నారు.

దుందుడుకు తనంతో మా బట్టలు ఎందుకు అపహరించావు. నీవేమైన తక్కువవాడవా! కాదు గదా! నీకు తెలియని ఏదైనా విషయం ఉందా? ప్రజలందరిలోను నీవు గొప్ప ధర్మాత్ముడవు గదా!

ఓ కృష్ణా! ఆడవాళ్లు స్నానం చేస్తూ ఉండగా మగవారువచ్చి ఎక్కడైనా చూస్తారా! పొరపాటున వచ్చినా, చీరలు ఎత్తుకొని పోవడంలాంటి తప్పుడు పనులు దయమాలినవారయి చేస్తారా? ఇటువంటి కూడని పనులు నీకే తగినవి కానీ, ఇంకెవరూ ఇలాగ చేయరు. నీ సేవ చేసుకొంటాం. మా చీరలు మాకివ్వండి.

కృష్ణా! నీవు రమ్మంటే వచ్చేస్తాం. నీ వేది కోరినా ఇచ్చేస్తాం. నీ వెక్కడికి వెళ్లమన్నా వెళ్లిపోతాం. ఇపుడు మాత్రం మా చీరలు మాకిచ్చి మమ్ము ఏలుకో.

అని గోపికలు ప్రాధేయపడగా, శ్రీకృష్ణుడు చిరునవ్వు మోముతో ఇలా అన్నాడు.

ఏ యువకుణ్ణి భర్తగా కోరి మీ రీవ్రతం చేస్తున్నారో చెప్పండి. చెప్పకపోతే మీ మీద ఒట్టే. ఇటువంటి ప్రేమ లోకసహజమైందే కదా!

మీరు ఎవణ్ణి చూచి మోహించారు? మీ మానధనాలు హరించిన వాడెవడు? మీకు ఎవరిమీద ప్రేమ పుట్టింది? నేను అన్యుణ్ణి కాను. నేను మీవాడనే. నాకు చెప్పవచ్చు కదా!

ఈ మాటలు విని గోపికలు ఒకరి నొకరు చూచుకొన్నారు. వారిని కామభావం కల్లోలపరుస్తూంది. నవ్వుతూ మిన్నకుండి పోయారు. అప్పుడు లోకపూజ్యుడయిన శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు.

ఓ గోపికలారా! మీరు నా యింటిలో సేవచేస్తూ నా ఆనతిప్రకారం నడుచుకొంటామంటే మీ కోకలు మీకిస్తాను.

శ్రీకృష్ణునిమాటలు విన్న గోపికలు నీళ్లలో నిలబడలేక చలికి భయపడి

ఓ పరీక్షిన్మహారాజా! గోపికలలో కొందరు బయటికి వెళ్దాం అంటారు. మరికొందరు బయటకు వెడితే మన మానం పోతుంది అంటారు. ఇంకొందరు చలికి వణకిపోతూ ఆందోళన చెందుతున్నారు.

గోపికలు చివరకు ఎలాగో మనస్సుల్ని గట్టిచేసికొని నీటినుండి బయటకు వచ్చి,

ఆ గోపికలు, కదలుతున్న చిగురుటాకులవలె కోమలమయినవి, నవరత్నాలు పొదిగిన బంగారపు కంకణాలు కలిగిన చేతులతో తమ మర్మాంగాలను మాటు పరచుకొని నీటినుండి వరుసగా (బయటకు వచ్చారు)

మెల్లమెల్లగా నడిచే గొల్లపడుచులు తమలో గడుసరులయిన వారిని ముందుంచుకొని మడుగులోనుండి బయటకు వచ్చి శ్రీకృష్ణునిముందు నిలువగా అతడు వారితో ఇలా పలికాడు.

గోపికలారా! మీ కీ సిగ్గెందుకు? చిన్నప్పటినుండి మీలో ఒకడుగా మీతో పెరిగివాణ్ణే కదా! నేను చూడని రహస్య స్థానాలు మీలో ఏమి ఉన్నాయి? మీరు కాత్యాయనీ వ్రతదీక్ష పూని ఇలా దిగంబరంగా యమునలో దిగి స్నానం చేయవచ్చునా? ఇది నియమం తప్పి ప్రవర్తించడం కాదా? దేవి విషయంలో అపరాధం చెయ్యడం కాదా? ఇలాగ అపమార్గంలో నోములు నోచేవారు ఎక్కడయినా ఉంటారా? మీకు వ్రతఫలం దక్కాలని మీరు అనుకొంటే, మీ రెండు చేతులు ఎత్తి నాకు నమస్కరించండి. నా వద్దకు వచ్చి మీ కోకలు తీసికోండి. సిగ్గులేకుండగా వాదించడం ఎందుకు? మోసపుమాటలు మాట్లాడడం ఎందుకు?

అని పలికిన శ్రీకృష్ణుని మాటలను వినిన గోపికలు తమలో తాము

నోములు నోచేవారు ఏ పరమాత్మను ధ్యానం చేస్తే చాలో, వ్రతాల ఆటంకాలు అన్నీ తొలగిపోతాయో అటువంటి శ్రీకృష్ణుణ్ణి గోపికలు చూశారు. కట్టుబట్టలు విడిచి, దిగంబరంగా స్నానం చేయడం తమ తప్పే అని తెలిసికొన్నారు. తమ చేతులను ఎత్తి నుదుట చేర్చి అందరూ శ్రీకృష్ణునికి నమస్కారం చేశారు.

శ్రీకృష్ణుడు దయ గలవాడు. భక్తులను రక్షించే స్వభావం కలవాడు. అందులకే చలికి గజగజ వణకిపోతూ, పశ్చాత్తాపంతో నుదిటిపై చేతులెత్తి మొక్కుతున్న గోపికలకు వస్త్రాలు ఇచ్చివేశాడు.

కోకలు దొంగిలిస్తే దొంగిలించాడు, సిగ్గులు పోగొడితే పోగొట్టాడు, వేళాకోళం చేస్తే చేశాడు. కానీ మన వ్రతానికి లోపం రాకుండా ఆదుకొన్నాడు అని భక్తిభావంతో గోపికలంతా శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేశారు.

ఓ రాజా! మనస్సు నొచ్చేలా మాటాడినా, మోసగించినా, వేళాకోళం చేసినా, కలతను కలిగించినా ప్రియులు చేసే పనులు ప్రియురాండ్రకు బాధ కలిగించక పోగా, ఎంతో ఇష్టంగా ఉంటాయి.

ఈ విధంగా శ్రీకృష్ణుడు చీర లియ్యగా గోపికలు కట్టుకొని గాఢమైన అనురాగంతో, కలతపడక, రెప్పవేయక చూస్తూ ఉండగా నేర్పరి అయిన శ్రీకృష్ణుడు వారివద్దకు వెళ్లి ఈ రీతిగా అన్నాడు.

మంచి గుణాలుకల ఓ గోపికలారా! మీరు సిగ్గువల్ల చెప్పలేకుండా ఉన్నారు. కానీ మీ మనస్సులోని గుట్టులు బయటపడ్డాయి. మీరు నన్ను మగనిగా పొందడం కోసం ఈ కాత్యాయనీవ్రతం చేస్తున్నారు. నా అనుగ్రహంవల్ల మీ నోము పండుతుంది. నన్ను సేవించినవారికి మోక్షమే సిద్ధిస్తుంది. ఇంక మిగిలిన ధర్మార్థకామాలగురించి చెప్పేది ఏముంది? మీరు ఈ వ్రతం పూర్తిచేయండి. రాత్రులలో నా కలయిక లభిస్తుంది. నా మాటలు నమ్మి మీరు ఇండ్లకు వెళ్లిపొండి అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఆ మాటలు విన్న గోపికలు తమ తపస్సు ఫలించిందని సంతోషిస్తూ శ్రీకృష్ణుని పాదపద్మాలు మనస్సులో ధ్యానించుకొంటూ, వ్రేపల్లెకు వెళ్లిపోయారు.

మునిభార్యలు అన్నము దీసికొని వచ్చి శ్రీకృష్ణుని ఆరగింప జేయుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను ...