Thursday, April 9, 2026

Chapter 1 - The Question of Shaunaka Krita - అధ్యాయము 1 - శౌనక కృత ప్రశ్న

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 1 - శౌనక కృత ప్రశ్న 

శౌనకముని సూతుని పురాణములగూర్చి ప్రశ్నించుట
శౌనకముని యిట్లనెను: ఓ పురుషర్షభా మహాభాగా సూతమహామునీ! మేలు చేకూర్చు పురాణ సంహితలన్నియును నీచే చక్కగ నధ్యయనము చేయబడినవి. నీవు కడు ధన్యుడవు. ఓ సుకృతీ! వేద వ్యాసమహర్షి దివ్యములగు పదునెనిమిది పురాణములను ప్రపంచించగా వానిని నీవు చక్కగ చదివితివి. ఆ పురాణములు సర్గము ప్రతిసర్గము వంశము మన్వంతరము వంశానుచరితము నను నైదు లక్షణములతో నొప్పారుచు రహస్య విషయములతో గూడియున్నవి. అట్టివాని నెల్ల నీవు సత్యవతీ పుత్రుడగు వ్యాసుని వలన నెఱింగితివి. అట్టి నీవు మా పుణ్యవశమున నీ యుత్తమ పుణ్యక్షేత్రమున కరుదెంచితివి. ఈ క్షేత్రము ఉత్తమమును దివ్యమును మునులకు విశ్రామ ప్రదేశమును పుణ్యకరమును కలిదోష శూన్యమునునై యున్నది. ఈ మా మునిగణము పుణ్యప్రదమగు పురాణ సంహితను వినగోరుచున్నది. కనుక మాకు దానిని సమాహితచిత్తుడవై వివరింపుము. నీవు సర్వజ్ఞుడవును మహానుభావుడవును. నీవు ఆధిభౌతిక ఆధ్యాత్మిక ఆధిదైవికములను తాపత్రయములు లేనివాడవు. మాకిపుడు వేద తుల్యమగు పురాణ సంహితను వివరించి చిరకాలము చల్లగ వర్ధిల్లుము. రసాస్వాదన సమర్థులై చెవి మున్నగు నింద్రియములు కలవారైనను పురాణములు వినని మనుజులు దైవ వంచితులే కదా! ఈ నాలుక షడ్రసములచే నాహ్లాద మొందినట్లు మహాత్ముల వచనములు వినుటవలన చెవి ఆహ్లాదము చెందును. చెవులులేని పాములును ఆకాశగుణ మగు శబ్దములచే మోహితములగును. చెవులుండియు సత్కథలు వినని నరులు చెవులు లేనివారేల కారు? ఈ కారణమువలన మా ద్విజులెల్లరము కలిభయ పీడితులమై పవిత్రమైన ఈ నైమిశారణ్య క్షేత్రమును జేరి సావధానముగ సత్కథలు వినగోరుచున్నారము.

ఈ కాలచక్ర మేదోవిధముగ గడచి పోవుచునే యుండును. కాని యది మూర్ఖులకు వ్యసనములతోను పండితులకు శాస్త్ర చింతనములతోను గడచుచుండును. ఈ శాస్త్రములును విచిత్రములైనవి. అవి నానార్థవాదములతో తర్కముతో జల్పముతో వితండ వాదముతో యుక్తిప్రయుక్తులతో రోషగర్వములను కలిగించును.

ఆ శాస్త్రములలో వేదాంతము సాత్త్వికము మీమాంస రాజసము న్యాయశాస్త్రము హేతువాద యుక్తము అగుటచే తామసము నై యొప్పుచుండును. పురాణములు త్రిగుణములతో త్రివిధములై కథలతో కూడియుండును. పంచలక్షణములతో వెలయు ఆ పురాణములు నీవు చెప్పితివి. వానిలో శ్రీ దేవీభాగవత మైదవది. పుణ్యప్రదమైనది. వేదసదృశము. సర్వ లక్షణ సంయుతము. అన్నిటి కంటె శ్రీ భాగవతము ముముక్షువులకు ముక్తిని ధర్మాత్ములకు ధర్మఫలమును సకాములకు కామఫలమును నొసంగగల దగుటచే పరమాద్భుతమైనది. అట్టి దానిని నీవు నామగ్రహణ మాత్రమున చెప్పితివి. ఇపుడా దివ్యమై శుభకరమైన శ్రీ దేవీ భాగవత పురాణోత్తమమును ఆదరముతో మాకు విశదముగ నభివర్ణింపుము. దాని నిచటి ద్విజులెల్లరము విన వేడుకపడుచున్నారము. ధర్మజ్ఞుడవగు సూతా! గురుభక్తి సత్త్వగుణము గలిగిన వాడవగుటచే నీవే వ్యాసముని ప్రోక్తమైన పురాణ వాఙ్మయమును బాగుగ నెఱింగియున్నావు అనునది నీయందలి విశేషము. పురాణతత్త్వ సర్వస్వము నెఱిగిన వాడవు. నీ నోట నెన్నియో పురాణములను వింటిమి. కాని మా కిపుడు అమృత పానముచే నమరులకు వలె మాకు అంత మాత్రమున తృప్తి గలుగుటలేదు. ఎన్నటికిని ముక్తి నీయజాలని యమృతము గ్రోలుట వ్యర్థమే గదా! ఎందువలన ననగా, భాగవతామృతమును త్రాగినచో నరుడు బంధమునుండి వెంటనే విముక్తు డగును. మే మమృతపానము గోరి యెన్నెన్నో జన్మము లొనరించితిమి. కాని యీనాటికిని మాకు పూర్తిగ శాంతి చేకూరలేదు. యాగములకు ఫలితముగ సర్వ ప్రాప్తిగలుగును. కాని యా స్వర్గమునుండి తిరిగి పతనము గలుగును. ఈ విధముగ నీ సంసార చక్రమునందు నిరంతరముగ భ్రమణము గలుగుచునేయుండును. సత్త్వ రజస్తమోరూపమగు నీ కాల చక్రమునబడి తిరుగుచున్న నరులకు తత్త్వజ్ఞానము లేకుండ నెన్నటికిని ముక్తి కలుగదు. కనుక ముముక్షువులకు ప్రియమై రహస్యమై ముక్తిప్రదమై పవిత్రమై సర్వరస భరితమై యొప్పారు శ్రీ దేవీభాగవత మహాపురాణమును మాకు తేటతెల్ల మొనరించుము.

ఇది పదునెనిమిదివేల శ్లోకములుగల శ్రీ దేవీభాగవత మహాపురాణమందలి

అధ్యాయము 2 స్కంధముల వివరణము

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

No comments:

Post a Comment

Chapter 19 Sri Sukuni's married life - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము శ్రీ శుకుడిట్లనియె: "ఓ మహాశయా! ఈ మాయామోహములో కొట్టుమిట్టాడు నరుడ...