Monday, April 13, 2026

Chapter 67 The influence of the asceticism of Naranarayana - అధ్యాయము 67 నరనారాయణుల తపఃప్రభావము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 67

నరనారాయణుల తపఃప్రభావము

నృపవర్యా! వేయేల? ఈ ప్రపంచ మంతయు గాలించినను ద్రోహబుద్ధిలేని ధర్మాత్ముడు నూటికి కోటి కెక్కడనో యెవ్వడో లభించును. సృష్టికి ఆరంభమందుకూడ నీ చరాచరవిశ్వము రాగద్వేషమయమై యున్నది. ఇక కలి దూషితమైన యీ కాలమున దాని సంగతి చెప్పనేల? 

ఓ నృపా! దేవతలలోనే యీర్ష్య ద్రోహము కపటము గలవారు గలరు. ఇంక నర తిర్యక్కులను గూర్చి చెప్పనేల? ద్రోహ మొనర్చిన వానికి ద్రోహము మరల చేసిన నది సరిసమానముగ నుండును. కాని, ద్రోహము ద్వేషము లేని శాంతునకు ద్రోహము చేయుట దుష్టత్వ మనిపించుకొనను. ఎవ్వ డేని తాపసుడు శాంతుడై జపధ్యాన పరాయణు డైనచో నింద్రు డోర్వలేక యతని తపమునకు విఘ్నములు గలిగించుచుండును. 

సత్పురుషులకు సత్యయుగము మధ్యములకు క్రియాయోగాత్మకములైన త్రేతా ద్వాపర రూప మధ్య యుగములు దుష్టులకు కలియుగము నిర్దేశింపబడినవి. రాజా! ఎప్పుడో యెక్కడో యెవ్వడో యొకడు సత్యధర్మము లనుసరించును. కాని, భిన్న భిన్న యుగములందు భిన్న భిన్న జీపులు దానికి వ్యతిరేకముగ నా యా యుగధర్మముల బట్టి వర్తింతురు. సర్వధర్మ సంస్థితికి వాసనలే ముఖ్యకారణము లందురు. అవి మలినములైనచో ధర్మముగూడ చెడిపోవును. మలిన వాసనలు ఎల్ల విధములుగ సత్యమును చెఱచును. 

పూర్వము బ్రహ్మ హృదయమునుండి ధర్ముడను కుమారు డుండెనని విందుము. ఆ బ్రాహ్మణోత్తముడు సత్యసంపన్నుడు-వేదనిరతుడు. ఆతడు దక్షుని పదిమంది కుమార్తెలను వరించెను. ధర్ముడు వారిని క్రమముగ పాణిగ్రహణము చేసికొనెను. సత్యస్వరూపుడగు ఆతడు వారియందు పుత్త్రులను బడసెను. వారు హరి కృష్ణుడు నరుడు నారాయణుడు నను నలుగురు కుమారులు. వారిలో హరి కృష్ణులు నిరంతరము యోగనిరతులైరి. నర నారాయణులు మహిమాలయమైన హిమాలయము జేరి బదరికాశ్రమ తీర్థమున నుత్తమ తప మాచరించిరి.

ఆ తాపసోత్తములగు పురాణ మునిసత్తములు పావనగంగా విశాల తీరమున సవితృ పరబ్రహ్మమును జపింప దొడంగిరి. ఆ విష్ట్వంశ సంభూతులగు నరనారాయణ పరమర్షులు సంపూర్ణముగా వేయి సంవత్సరముల వఱకు భవ్య తప మాచరించిరి. వారి తపము వేడిమి కీ చరాచర జగము తపించినది. ఆ ధర్మ తనయులు ధ్యాననిష్ఠులైరి. నే నిపుడేమి సేతునని యింద్రుడు సైతము చింతాపరవశుడై యిట్లు కలతను వెతను జెందెను. తాము సిద్ధార్థులైనచో వీరు నా యింద్రాసనము గ్రహింపక యుందురా? 

కనుక వీరి తపమునకు విఘ్న మొనరింపవలయును. దారుణమైన కామక్రోధ లోభములను వీరి చిత్తములందు కలిగించి ఈ మునుల తపస్సునకు విఘ్నము చేయవలయును అని కోరి ఇంద్రుడు గజమధిరోహించి వేగముగ గంధమాదనగిరి కరిగి పుణ్యాశ్రమమున ఆ పరమర్షులను సందర్శించెను. ఆహా! వీరి శరీరములనుండి తపఃకాంతులు విరజిమ్మబడుచున్నవి. వీరు సూర్యులో బ్రహ్మలో విష్ణులో రూపుదాల్చిన యగ్నులో యన నొప్పుచున్నారు. వీరు నిజముగ ధర్మపుత్త్రులు-మహర్షులు. ఈరింత మహోగ్రతపము చేసి యేమి చేయుదరో యని తలపోయుచు నింద్రుడు వారితో నిట్లనెను: 

'ధర్మసుతులగు మహానుభావులారా! మీ తపః ప్రయోజన మేమో తెలుపుడు. నేను మీకు శ్రేష్ఠమైన వర మీయ నేనెంచితిని. మీ తపమునకు సంతసించితిని. మీ కోరిక యెంత యీరానిదైన నిత్తును.' ఇట్లు పలికి యింద్రుడు వారి యెదుట నిలిచెను. కాని, ఋషులు మాత్రము ధ్యాననిష్ఠులై యాత్మచింతనతో అతనితో నేమియును బలుకక మిన్నకుండిరి. అంత నింద్రుడు భయంకరమైన మోహినీమాయను కల్పించి –

సింహములు వ్యాఘ్రములు తోడేళ్లు మున్నగు క్రూర జంతువుల నుత్పన్న మొనర్చెను. వాన గాలి నిప్పులను కల్పించెను. ఇట్లు పలు మారు వారిని భయ పెట్టజూచెను. కాని, యతని బెదరింపులకు ధర్మసుతు లేమాత్రమును జంకలేదు. ఆ తాపసు లింద్రు డిచ్చు వరముల కాస పడకుండిరి. గాలినిప్పుల భయమునకు వెనుకంజ వేయలేదు. అది కని యమరపతి నిజ నివాసమున కేగెను. ఆ తాపసులను సింహవ్యాఘ్రములు చుట్టుముట్టెను. ఐనను వారు తమ యాశ్రమము నుండి యెంతమాత్రమును చలింపలేదు. వారి ధ్యాననిష్ఠకు భంగ మొనరించు వాడెవ్వడును లేకుండెను. 

అట్లా మునివరులు తన భయలోభములకు లొంగిపోలేదని దుఃఖించుచు నింద్రుడు తన యమరావతిలో చింతింపసాగెను. ఆ మునులద్భుత పరాప్రకృతిని-సకల లోకేశ్వరేశ్వరిని-సనాతనిని ఆదిశక్తిని మహావిద్య నుపాసించుచున్నారు. అట్లు ధ్యానించువారి నిష్ఠను మహామాయావి సైతము భంగ మొనర్పజాలడు. ఏలయన - ఆ పరాశక్తి సకల దేవాసుర మాయలకు మహామాయ గదా! ఆ ఋషులు వాక్‌-మాయా-కామ బీజ మంత్రములను ధ్యానించుచు దురితదూరులై యున్నారు. వారి నింకెవ్వరు బాధింపగలరు? ఎవ్వాని చిత్తఫలకమునందు శ్రీత్రిభువనేశ్వరీ బీజము ప్రకట మగుచుండునో వానికి విఘ్న మొనరింపగలవాడెవ్వడు? 

ఆ యింద్రుడును మాయమోహితు డగుట వలననే వారికి ప్రతిక్రియ చేయదలచెను. అపు డింద్రుడు కామవసంతులను బిలిపించి కామునితో నిట్లనియెను: 

మదనా! నీవు రతిని వసంతుని అచ్చరలను తోడుగగొని గంధమాదన గిరిపై బదరి కాశ్రమమున తప మొనరించుచున్న పురాణ పురుషులు ఋషి సత్తములు నైన నరనారాయణుల చెంత కేగుము. అట నొంటరిగ తపించు ఋషులకు తపోభంగము గల్గించుము. వారి చిత్తములు కామాయత్తము లగునట్లు చేయుము. నీ కమ్మని పూములుకుల దెబ్బలతో వారినపి మోహపఱచి యుచ్చాటన మొనరించి మదిలో నోపలేని తాపము రేకెత్తించుము. నా కార్యము చక్కబెట్టుము.

మహానుభావా! ఆ మునులైన ధర్మసుతులను నీ వశము చేసికొనుము. ఈ విశాల ప్రపంచమందలి దేవదానవ మానవులందు నిన్నెదిరించువాడులేడు. నీ బాణపు దెబ్బలు తిని నీకు వశము గానివాడెవ్వడు? నీ ప్రభావమున బ్రహ్మనగు నేను శివుడు చంద్రుడు అగ్ని ఇందరము కామమోహితుల మైనవారమేగదా. 

ఓ పూవిల్తుడా! పరాక్రమముగల నీ పూలబాణాలకు వారొక లెక్కయా? ఈ దేవవారకాంతలను నీకు తోడుగ పంపుచున్నాను. వీరు నీ వెంట రాగలరు. అచటికి రంభ మున్నగు నచ్చరలును రాగలరు. రంభకాని తిలోత్తమకాని కార్యసాధనమున నెఱజాణలు. ఈ శుభకార్యమునకు నీ వొక్కడవే చాలుదువు. ఇంక వీరందఱు నీవెంట నున్న కార్యసాధనమున సంశయమేల యుండును? కాన ఓ మహాశయా! నా కార్యము చక్కపెట్టుము. నీ వాంఛితార్థ మీడేర్తును. 

ఆ తాపసోత్తములను వరదానములతో నా యోపినంత ప్రలోభింపజేసి చూచితిని. ఐనను వారు శాంతముగ నుండి తమ చోటులనుండి చలింపలేదు. నా పడిన శ్రమ యంతయు బూడిదలో బోసిన పన్నీరయ్యెను. అటు పిమ్మట నా మాయను పన్ని యా తపస్వులను భయపెట్ట జూచితిని. ఐనను వారు తమ నెలవులనుండి చలింపలేదు. వారికి తమ మేనులు గాపాడుకొను కోరికి యున్నట్లును లేదు.

ఆ మాటలు విని మదనుడింద్రున కిట్లనెను: వాసవా! నీ మదిలోని కార్యము నిపుడే యొనరింతును. ఆ మునులొకవేళ బ్రహ్మ-విష్ణు-శివుడు-సూర్యుడునను వారిలో నెవరినిగూర్చి ధ్యానించుచున్నను వారిని వశము చేసికొందును. కానీ శ్రీకామ రాజబీజమును శ్రీమహాదేవీ బీజమును నెమ్మదిలో పరమభక్తితో వారు ధ్యానించుచున్నచో నట్టి దేవీభక్తులను వశము చేసికొనుట నా వశముగాదు. ఆ మహాశక్తిని పరమభక్తి భావమున వారు ధ్యానించుచు నా దేవి నాశ్రయించినచో నా పూములుకులు వారిముందు పనిచేయవు అన 

ఇంద్రు డిట్లనియెను: మహానుభావా! నీవు ఈ సర్వులతో సన్నద్ధుడవై తరలుము. నీవు నాకు హితకరుడవు. ఎంత దుస్సాధమైన పనినైనను చేయగలవాడవు. నీవు దక్క నా కితరుడు సహాయము లేదు. ఈ విధముగ నింద్రు డాదేశింపగ మన్మథుడు మొదలుగా నెల్లరును సిద్ధమై ధర్మపుత్రులు దుస్తరతపమొనర్చు చోటి కరిగిరి అని వ్యాసుడు జనమేజయునకు తెలిపెను.

No comments:

Post a Comment

SRI DEVI BHAGAVATHAM PART 9 - శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము శౌనకాది మహామునులారా ! వ్యాసభగవానుడు నాకు చెప్పిన నారద-నారాయణ సంవాదరూపమైన దేవీ ప్రకృతిస్వరూపారాధనను వివరిస్తున్న...