Monday, April 13, 2026

Chapter 76 The belief that God is the most powerful - అధ్యాయము 76 దైవమే బలవత్తరమను నుపాఖ్యానము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 76

దైవమే బలవత్తరమను నుపాఖ్యానము

అట్లు శుక్రాచార్యుడు తన మదిలో నాలోచించుకొని నవ్వుచు దైత్యులతో నిట్లు పలికెను. 'ఓ దైత్యులారా! మీరు నా రూపుదాల్చి వచ్చిన దేవగురుని నమ్మి మోసపోసితిరి. వాస్తవ శుక్రుడను నేను. నా యాజ్యులు మీరు. ఇతడు దేవకార్యము సాధింపవచ్చిన బృహస్పతి. మీరితని చేత నిజముగ వంచితులైతిరి. 

ఇతడు నా రూపరేఖలు దాల్చిన దాంభికుడు. ఈతని మాటలు నమ్మకుడు. ఈ బృహస్పతిని వీడి నన్ననుసరింపుడు' అను శుక్రుని మాటలు విని వారెల్లరును పరమ విస్మయమందిరి. వారా యిరువురి యాకారములను సరిగ పోల్చుకొనలేకపోయిరి. తమకు బోధించుచున్న గురుని వారు శుక్రునిగ భావించిరి. 

అంత బృహస్పతి మాయామోహితులైన రాక్షసులను గని యిట్లు పలికెను, 'దైత్యులారా! ఇతడు శుక్రుడు గాడు. ఆ బృహస్పతి నా రూపమున నిపుడు మీ కడకు వచ్చెను. ఇతడు దేవతల పని నెరవేర్ప మీ కడకు వచ్చి మిమ్ము వంచింపజూచుచున్నాడు. ఇతని మాట నమ్మకుడు. నేను శంభునినుండి విద్య బడసితిని. దానిచే మీకు దేవతల తోడి యుద్ధమున జయము గల్పింతు'నని శుక్రరూపుడైన గురువు పలికెను. 

దానవులును అతడే తమ గురువగు శుక్రుడని తమ మదిలో నిశ్చయించుకొనిరి. అపుడు శుక్రుడు వారి కెంతయో నచ్చజెప్పి చూచెను. కాని, వారు గురుమాయా మోహితులై కాల విపర్యయమున శుక్రుని మాటలు పెడచెవిపెట్టిరి. వారట్లొక నిర్ణయమునకు వచ్చి శుక్రునితో నిట్లనిరి : 

"ఇతడే మా గురువు. ధర్మాత్ముడు. మాకు మంచిబుద్ధి నొసగి మా మేలుగోరువాడు. ఈ శుక్రుడే పదేండ్లనుండి మమ్మెడబాయక శాసించుచున్నాడు. నీవు టక్కరివలె బొడగట్టుచున్నావు. నీవు మా గురువు గావు. ఇచ్చోటు వదలి వెళ్ళుము."

అట్లు మూఢదైత్యులు నిజమైన శుక్రుని పలుమారులు నిందించిరి. శుక్రరూపముననున్న గురుని నమస్కరించి యతనిని ప్రేమతో గురునిగ దలచిరి. అతని మాటలే నమ్ముచు తన్మయులై యున్నారని శుక్రుడు కోపాతిరేకమున వారినిట్లు శపించెను: "నేనెంతగ చెప్పినను మీరు నా మాట నమ్ముటలేదు. కనుక చైతన్యరహితులై తిరస్కార మొందుదురుగాక! నన్ను నిందించిన దాని ఫలితముగ కొలదికాలములోనే మీరు తగిన ఫలితమనుభవింతురుగాక! ఇతని కపట వర్తనము లానాడుగాని మీకు బోధపడవు" అని యిట్లు శుక్రుడు పలికి కోపముతో నచ్చోటువదలి వెళ్ళెను. 

అంత బృహస్పతి ముదముతో నచటనే స్థిరచిత్తుడై యుండెను. అట్లు శుక్రుడు దానవులను శపించిన విషయము గురునకు తెలిసెను. ఆతడు వెంటనే యచ్చోటు వదలి నిజరూపము దాల్చి వెడలి ఇంద్రునిజేరి యతనితో నిట్లనియెను: 

"ఓ సురసత్తమా! నేను నా పని నెరవేర్చితిని. శుక్రుడు వారిని శపించెను. నేను వారిని వదలి వచ్చితిని. ఇపుడు దానవులు నిరాశ్రయులు. నావలన శాపదగ్ధులు. కనుక నిపుడు పోరాటమున కాయత్తపడుము అను గురువాక్యము లాకర్ణించి యింద్రుడు ప్రమోదభరితుడయ్యెను. 

సురలు సంతసిల్లిరి. వారు గురుని పెక్కు రీతుల బూజించిరి. అపుడు దేవతలెల్లరు పరస్పరము మంతనము జరుపుకొనిరి. యుద్ధమే కర్జమని యెల్లరు నిశ్చయించుకొనిరి. వారు మూకుమ్మడిగ దానవులపై బడిరి. అట్లు దేవతలు గొప్ప బలముతో ముందు ప్రయత్నముతో బవరమునకు గడంగుటయును తమ గురువు వెళ్ళిపోవుటయు గని దానవులు చింతాక్రాంతులైరి.

వారు తమలో తామిట్లనుకొనిరి: 'మనము గురుని మాయచే విమోహితులమైతిమి. శుక్రుడు కోపమువచ్చి వెళ్ళిపోయెను. ఇపుడా మహాత్ముని శుక్రుని ప్రసన్నుని జేసికొనుట మన కర్తవ్యము. ఆ గురువు కపటచతురుడు - పాపి - భ్రాతృభార్యాగామి. లోన మలినము బయట నైర్మల్యము గలవాడు. మనమిపుడేమి చేయుదము? ఎచటికేగుదము? 

శుక్రుడు కోపముతో మండిపడుచున్నాడు. మనకిపుడు సాయ మవసరము. మఱి యతనిని మనమెట్లు ప్రసన్నునిగ జేసికొనగలము? ఇట్లు దైత్యులు తమలో తామాలోచించుకొని భయకంపితులైరి. వారు ప్రహ్లాదుని ముందిడుకొని శుక్రాచార్యుని సన్నిధి కరిగిరి. 

వారందఱు మౌనముగ నున్న శుక్రుని చరణములకు నొకేసారి నమస్కరించిరి. శుక్రుడు నిప్పులు గురియుచు వారికిట్లు పలికెను. 'నేనానాడు మీకు హితముగ నెంతయో చెప్పితిని. కాని, మీరు గురుమాయా మోహితులై నాడు నా మాట పెడచెవిని బెట్టితిరి. మూఢాత్ములై నన్ను తూలనాడితిరి. మదోన్మత్తులగు మీరు తత్ఫలితము వెంటనే పొందితిరి. ఈనాడుగూడ మీరు కపటాకృతి - వంచకుడు. సురకార్యార్థియైన మీ గురుని చెంతకే వెళ్లుడు. మీరు భ్రష్టులైపోతిరి. నేనతనివలె వంచకుడనుగాను.' అట్లు శుక్రుడు సందిగ్ధ వాక్యములు పలుకగ 

ప్రహ్లాదుడ తని పాదములు పట్టుకొని యిట్లు పలికెను:' ఓ భార్గవమునీశ! నీవు సర్వజ్ఞుడవు. మేము నీ యాజ్యులము. నీకు హితకరులము. పుత్రతుల్యులము. భయాతురులమై వచ్చినవారము. అట్టి మమ్ము నీవీ పరిస్థితిలో విడువ తగదు. నీవు మంత్రార్థ మరిగితివి. అపుడా దురాత్ముడు కపట నటునివలె నీ వేష భాషలతో వచ్చి తియ్యగ బలుకరించుచు మమ్ము వంచించెను. 

తెలియక పొరపడిన వారి దోషములకు శాంతులు కోపింపరు.' నీవు సర్వవిదుడవు. మా చిత్తములు నీయందే లగ్నమైనవని నీవెఱుగుదువు.

నీ తపఃప్రభావ మతీతము. కోపముడుగుము. సాధుసత్తములు క్షణకోపులని మునులందురుగదా! నీరు సహజముగ చల్లగా నుండును. అది నిప్పుతో గలిసిన వేడియగును. వేడిమి తగ్గిన నీరు మరల చల్లబడును. క్రోధము చండాలుని వంటిది. బుధులు దాని నెల్లవిధముల వదలిపెట్టుదురు - కాన నీవు నటులే రోషము విడనాడి మాపట్ల ప్రసన్నుడవు గమ్ము. 

నీవు కోపము విడువక దుఃఖితులమైన మమ్ము వదలినచో మేము పాతాళమున కేగుదుము అను ప్రహ్లాదుని మాటలు విని శుక్రుడు జ్ఞాననేత్రముతో సర్వము నెఱింగి సుమనస్కుడై చిరునగవుతో వారితో నిట్లనెను: 

'దానవులారా! మీరు భయపడి పాతాళమునకు వెళ్ళవలదు. మీరు నా యాజ్యులు. నా మంత్రబలముచే మిమ్ము రక్షింతును. పూర్వము బ్రహ్మ సత్యము హితకరమునైన యొకమాట చెప్పెను. అది మీకు వినిపింతును వినుడు. 

ఈ నేలపై మేలుగాని కీడుగాని జరుగవలసినది తప్పక జరిగితీరును. దైవమునకు విరుద్ధముగ నెవ్వడు నేమియు జేయజాలడు. మీరిపుడు కాలయోగమున నిజముగ బలహీనులైతిరి. దేవతలచేత నోటమిచెంది యొకమారు పాతాళ మేగవలయును. కాలము కలిసివచ్చినప్పుడు మీరు సర్వసమృద్ధమైన త్రైలోక్య రాజ్యమనుభవింతురని తొల్లి బ్రహ్మ వచించెను. 

మీరొకప్పుడు దైవయోగమున దేవతలను తలదన్ని పదియుగముల వఱకు పూర్తిగ త్రైలోక్య సంపద లనుభవించితిరి. సావర్ణిక మన్వంతరమందు మరల సామ్రాజ్యము మీ కైవసమగును. అపుడు ప్రహ్లాదుని మనుమడైన బలి విజయుడై ముల్లోకముల కేలిక గాగలడు.

మున్ను విష్ణువు వామనావతారమున బలి సర్వస్వము హరించెను. అప్పుడు హరి బలితో నేను దేవ వాంచాసిద్ధికి లోకత్రయ సామ్రాజ్య మిపుడు హరించితిని. ఇకముందు సావర్ణిక మన్వంతరమందు నీవే యింద్రుడవగుదువు' అని పలికెను. ఓ ప్రహ్లాదా! ఆనాడు విష్ణువట్లుపలుక నీ పౌత్రు డెల్ల భూతముల కదృశ్యుడై గుప్తముగ భీతునివలె నేడు చరించుచున్నాడు. 

ఒకప్పుడు బలి యింద్రుని భయమున గర్దభరూపముదాల్చి యొక శూన్యగృహమందు తలదాచుకొనెను. ఒకనాడింద్రుడు బలినిగని ఓ రాక్షస సత్తమా! నీవు సర్వలోక భోక్తవు. దానవ శాస్తవు. అంతటి నీకీ గాడిదరూపు సిగ్గు గల్గించుటలేదా? అన విని దైత్యరాజిట్లనియెను: 

"ఓ శతక్రతూ! ఇందు వింతేమి గలదు? విష్ణువంతటివాడు చేప-తాబేలు మున్నగు రూపులు దాల్చెనుగదా! తొలుత నొకప్పుడు నీవును బ్రహ్మహత్యవలన మానస సరోవమందలి కమలమున లీనమై దాగియుంటివి కదా! అట్లే నేనును కాలవశమున యీ ఖరరూపమున నున్నాను. 

దైవపరాధీనునకు సుఖమెక్కడికి? దుఃఖమెక్కడికి? అఖండమైన కాలము నిజముగ నెట్లు దలచునో యట్లు జరిగితీరును! ఇట్లు బలి యింద్రుడు తమలో తాము సంభాషించుకొనిరి. వారు పిదప తెలివొంది నిజనివాసముల కరిగిరి. ఈ యుపాఖ్యానము దైవమే బలవత్తరమైనదను విషయము తెలుపుచున్నది. దీనిని మీకు తెలిపితిని. ఈ సురాసుర నరజంతుయుతమగు జగమెల్ల దైవాధీనమే.

అధ్యాయము 77 ప్రహ్లాదుడు శ్రీదేవి మహిమను కొనియాడుట

Chapter 75 The divine teacher deceives the demons - అధ్యాయము 75 దేవగురువు దానవులను వంచించుట

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 75

దేవగురువు దానవులను వంచించుట

అట్లు ధీశాలియైన బృహస్పతి మోసముతో శుక్రరూపము దాల్చి దైత్యులకు పురోహితుడయ్యెను గదా! ఆ పిదప నతడేమి చేసెను? ఆ దేవగురువు సర్వ విద్యానిధి - అంగిరుని తనయుడు - అంతటి మహాముని యింతటి కపటమునకేల తలపడెను? సత్యము ధర్మమూలమని సకల ధర్మశాస్త్రములు వక్కాణించును. ఆ పరమ సత్యము వలన పరమాత్మ లభ్యమగునని మునులు వక్కాణింతురు. ఆ బృహస్పతి యంతటివాడును దానవులతో మిథ్యావచనములు పలికెను గదా! 

ఇంక నేలోకములో నేగృహస్థుడు సత్యవాది కాగలడు? ఈ యఖండ బ్రహ్మాండములోని విభవములందు భోజ్యమైన యాహారమును బొందుట కంటె మరేదియును లేదు. అట్టి తిండికొఱకు మునులు సైతము వంకర నడకలు నడతురు. 

శిష్టులు కొఱవడుట వలన శబ్దము విషయమున ప్రామాణికత్వ భావన తగ్గిపోయినది. ఆ గురునిలోనే నింద్యవర్తన మున్నదే! ఇంక నతనిలో శిష్ట గుణ మెట్లుండును? దేవతలు సత్త్వసంభూతులనియు మనుజులు రజోగుణజనితులనియును జంతువులు తమోగుణజాతము లనియును మునులు వచింతురు. అమరగురు నంతటివాడు తానే మిథ్యావాది యయ్యెనే: 

ఇంక రజస్తమోగుణములు గల నరులలో సత్యమెవడు పలుకును? ఈ జగత్త్రయము మిథ్యయందు - మాయయను పెంజీకటియందు మునిగి యున్నది. ఇంక సాధారణ జంతువుల కేదిగతి? ధర్మమునకు స్థానమేది? అను సందేహము నాకు గల్గుచున్నది. హరి - బ్రహ్మ - ఇంద్రుడు - ఇతర దేవతలును కపట వర్తనములందు చతురులై యున్నచో ఇంక నల్పబుద్ధులగు నరులమాట చెప్పనేల? ఎల్లదేవతలును తపోధనులగు మునులును కామక్రోధకలుషితులు - లోభోపహత చిత్తులు - కపట రచనా నిపుణులునై వర్తింతురు. 

వసిష్ఠ వామదేవ విశ్వామిత్రాది మునులును గురువును పాపరతులుగదా! ఇక ధర్మాభ్యుదయమునకు గతియేది? బ్రహ్మ ఇంద్రుడు అగ్ని చంద్రుడు మున్నగు దేవతలును పరస్త్రీ లంపటులు గదా! ఇంక భువనములం దార్యత్వ మెక్కడ నుండును?

ఎల్ల సురలును మునులను లోభముచే అభిభూతులై యున్నారు. ఇంకెవరి వాక్కుల నుపదేశ రూపమున మననము చేయవలయును? అని జనమేజయుడు ప్రశ్నింపగా 

వ్యాసమహర్షి యిట్లనెను : బ్రహ్మయేమి? విష్ణువేమి? శివుడేమి? ఇంద్రుడేమి? దేహధారియైన ప్రతివాడును ప్రకృతి వికారములతో బుట్టుచుండును. బ్రహ్మయును విష్ణువును శివుడును నెల్లరును రాగవంతులే. రాగవంతుడు చేయని యకృత్య మేముండును? రాగి తన నేర్పుచే పైకి ముక్తుని పగిది గనబడును. కాని, కష్టములు కలిగిన తఱి ప్రతి రాగవంతుడును గుణములచేత బద్దుడగును. 

కారణము లేక కార్యమెట్లుండును? బ్రహ్మాది దేవతలకును విడదీయ రాని త్రిగుణములే కారణభూతములు. వారి దేహములు సైతము పంచవింశతి తత్త్వముల వలన బుట్టుచుండును. కాని, మరొక విధముగ గావు. ఎల్లరును కాలము సమీపించగనే మరణించవలసినదే. ఇందు రవంతయును సందియము లేదు. 

అందఱు నితరుల కుపదేశించుటలో శిష్టులే. ఏదైన పని జరుగవలసి వచ్చినచో మొదట స్వభావమున కలత బయలుదేరును. ఆ పిదప కామక్రోధ లోభములును ద్రోహమత్సరములును అహంకారమును బుట్టును. తరువాత పని సాధ్యమగును. వీనినన్నిటి నేదేహియును వదలజాలడు. 

ఈ ప్రపంచ మెల్లప్పుడు నిదేవిధముగ సాగుచుండునని పెద్దలందురు. ఈ ప్రపంచము మంచి చెడ్డల కలయిక. కనుక నీ భావ పరంపరలకు భిన్నముగ ప్రపంచ ముద్భవించును. 

ఒకప్పుడు విష్ణుభగవాను డంతటివాడే ఘోరతరముగ తపమాచరించును. ఒకప్పుడు సురపతియును పెక్కు జన్నము లాచరించును. అతడే వేరొకప్పుడు రమణీ విలాసములకు రంజితుడగును. విష్ణువు వైకుంఠ ధామ మందు లక్ష్మీపరవశుడై యామెతో లీలావినోదము లందును. అతడే యింకొకప్పుడు ఘోరదానవులతో దారుణ రణ మొనరించును. 

విష్ణువు సహజముగ దయాసముద్రుడే! ఐనను నతడును పోరు సల్పును. తీవ్రమగు వైరిబాణములచే బాధింపబడును. ఒకప్పుడు దైవయోగమున జయమో పరాజయమో పొందుచుండును. ఇట్లు శ్రీనాథుడైన హరియు సుఖ దుఃఖములలో పరిభ్రమించు చుండును. 

ఇందు శంక రవంతయును లేదు. ఒకప్పుడా విష్ణువే శేషశయ్యపై యోగనిద్రా ముద్రితుడగును.

ఆ విష్ణువు యథా సమయమున స్వభావముచే ప్రతిబోధితుడై మేల్కొనును. బ్రహ్మ - హరి - శివుడు - ఎల్లదేవతలును ఎల్ల మునులును తమకాయు వున్నంత కాలముచు సంచరింతురు. రాత్రి తొలగిపోగా స్థావర జంగమాత్మకమైన జగములు తిరిగి సంభవించును. రాత్రి రాగా నంతయును మరల మహాప్రళయమందు కలియును. 

ఇందు సందేహము లేదు. బ్రహ్మాదులును తమ తమ యాయువులు తీరగనే సంక్షయ మొందుదురు. మరల బ్రహ్మ విష్ణువు శివుడు ఇంద్రాది దేవతలు తేజో దేహములతో సముద్భవింతురు. వారు మరల తమ తమ కామాది స్వభావములను పూర్వశక్తులను బొందుచుందురు. ఈ ప్రపంచము కామక్రోధాదుల కలయికలో నిరంతరముగ సాగుచుండును. 

ఇట్టి జగము గూర్చి నీవు విస్మయమంద బనిలేదు. ఈ విశ్వమున పరమార్థ విదుడును సంసార నిర్ముక్తుడైన యుత్తమ పురుషుడు లభించుట కడు కష్టము. ఈ సంసార బాధలకు భయపడువాడు పెండ్లి చేసికొనడు. అట్టివాడు సర్వసంగ పరిత్యాగముతో నిశ్చింతుడై చరించును. 

తొల్లి చంద్రుడు తన గురుని భార్యతో సంగమించెను. ఆ గురుడు తన తమ్ముని భార్యను గూడెను. ఈ రీతిగ నీ సంసార చక్రము రాగలోభాదులతో కలిసి నిరంతరము తిరుగుచుండును. గృహస్థ జీవనయాత్ర సాగించు నరుడే వైరాగ్యముతో సంసారము నిస్సారమని కర్మములు వదలవలయును. 

ఆ విరాగి సచ్చిదానంద స్వరూపిణియైన శ్రీ రాజరాజేశ్వరి నారాధింప వలయును. ఈ చరాచర జగములా త్రిభునేశ్వరి మాయాశక్తిచే నావరింపబడి యుండును. ఈ జగములు మదిరామత్తునివలె పిచ్చివానిరీతి నెడతెగక పరిభ్రమించుచుండును. ఆ జగన్మాత నారాధించినవాడు మాయాగుణముల నుండి విడివడును. మతిమంతుడు. ముక్తి నందవలయును. 

దీనిని మించిన సన్మార్గము మరొకటి లేదు. బుద్ధిమంతుడు జగదేక మాతను సేవించి దయామృతమునకు పాత్రుడు గావలయును.

అట్లు పాత్రుడు గానంతవరకు అమృతానంద మెట్లు గల్గును? ఆ దయావతీమతల్లి యగు తల్లికి గాక మనపై నితరుల కెవ్వరికి దయ కలుగును? కనుక విశుద్ధ చిత్తముతో నా దయామృతనిధిని భజింపవలయును. 

ఏ యమ్మలయమ్మను సేవించిన నరుడు జీవన్‌ ముక్తుడగునో అట్టి దేవిని దుర్లభమగు మనుజ జన్మ నెత్తియు ప్రాణి సేవించనిచో అట్లు మాతను గొలువనివాడు నిచ్చెనపై నుండి క్రిందపడినవాని వంటివాడు. ఈ త్రిగుణమయమైన విశ్వ మహంకారమయము. ఈ జగము సత్యముచే బద్ధమైనది. ఆమెను సేవింపక నరుడు ముక్తుడెట్లు కాగలడు? 

కనుక మానవుడు సకలమును పరిత్యజించి శ్రీ త్రిభువనేశ్వరీ దేవిని సంసేవింపవలయును. 

జనమేజయు డిట్లనియెను : ఓ పితామహా! అట్లు గురుడు శుక్ర రూపము దాల్చి యేమి చేసెను? శుక్రుడెన్నడు తిరిగి రాగల్గెను? నాకంతయు దెలుపుము' అన 

వ్యాసు డిట్లు పలికెను: రాజా! అట్లు శుక్ర రూపమున దాగియున్న మహాత్ముడు బృహస్పతి పిదప నేమి చేసెనో తెలుపుదు నాలింపుము. దైత్యులు గురువును తమ గురునిగ భావించి యతని పట్ల విశ్వాసము గల్గి తన్మయులై యతని యానమేర మీఱకుండిరి. దైత్యులు బహుకాలము శుక్రుని వియోగమున మ్రగ్గిరి. 

కాన వారు గురు మాయామోహితులైరి. వారు విద్యకై శుక్రరూపుని శరణు జొచ్చిరి. ఈ లోకమందెంతటివాడును లోభమునకు వశుడగును గదా! అట నటుల శుక్రుడు జయంతిని గూడి పదేండ్లు నిండుగ క్రీడించెను. ఆ పిదప శుక్రునకు తన యాజ్యులగు దానవజనము జ్ఞప్తికి వచ్చెను. 

దైత్యులు నా మీద కొండంత యాస పెట్టుకొని నాకై యెదురుతెన్నులు చూచుచుందురు. నేనిపుడే వెళ్ళి వారిని గందును. వారు భయాతురులు, నా భక్తులు, వారికి దేవతల భయము గలుగకుండుత! అని మదినెంచి శుక్రుడు జయంతితో ఇటుల పలికెను: 

చారునేత్రీ! నా పుత్రులు దేవతలకు లొంగిపోయిరి. నీ పదేండ్ల గడువు పూర్తియైనది.

కనుక నో సుమధ్యమా! నే నిపుడే వెళ్ళి నావారిని గని తిరిగి వేగిరమే నీ ముంగిటికి చేరుకొందును అనగా ధర్మవిత్తమురాలగు జయంతి  'ఓ ధర్మజ్ఞ! సరి. నీ యిష్టానుసారము గానిమ్ము. నేను నీకు ధర్మలోపము గలిగింప'నని శుక్రునితో ననెను. 

ఆ మాటలు విని శుక్రుడు త్వరితగతి నరిగి దానవుల చెంత నున్న బృహస్పతిని గనెను. బృహస్పతి కపట వృత్తితో యజ్ఞములు నిందించు జైన ధర్మమును దానవులకు బోధించుచుండెను. ఓ యమరవైరులారా! మీ మేలుగోరి నేను నిజము పలుకుచున్నాను. అహింస పరమధర్మము. కాన దుష్టులనుగూడ చంపరాదు. బ్రాహ్మణులు జిహ్వాచాపల్యముతో భోగాసక్తితో వేదములందు పశుహింస తగిన దనిరి. 

కాని, యహింసయే పరమధర్మము సుమా! అని యిట్లు గురుడు వేదశాస్త్రములు నిందించుచు బలుకుచున్న మాటలు శుక్రుడు విని ఆశ్చర్యమందెను. అపుడు శుక్రుడు మదిలో నిట్లు తలపోసెను: 

'ఈ గురువు నాకు పరమశత్రువు. ఈ ధూర్తుని మూలమున నావారు వంచింపబడిరి. లోభము కడుంగడు చెడ్డది. ఇది పాపబీజము. నరకద్వారము. ఆ లోభమునకు లొంగి గురుడంతటివాడు నబద్ధములు ప్రచారము చేయుచున్నాడు. దేవతలందఱకు గురువు గురువు, అతడు ధర్మశాస్త్ర ప్రవర్తకుడు. ఎల్లరకు గురువాక్యము ప్రమాణము గద! 

నేడట్టి గురువే పాఖండమతము బూనెను గదా! ఇట్లు గురువే పాఖండ పండితడయ్యెననిన ఇంక కలుషచిత్తులైన యితరులు లోభవశమున నేమేమి చేయుదురో కదా! నా యాజ్యులు దానవులు మిక్కిలి మూఢాత్ములు. వీరిని నేడీ ద్విజోత్తముడు నటుని వేసము దాల్చి మిక్కిలి మోసగించుచున్నాడు.

అధ్యాయము 76 దైవమే బలవత్తరమను నుపాఖ్యానము

Chapter 74 Jayanthi and Shukra Samagammamu - అధ్యాయము 74 జయంతీ శుక్రుల సమాగమము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 74

జయంతీ శుక్రుల సమాగమము

ఓ జనమేజయా! ఆ ఘోరమైన స్త్రీ వధ గాంచి భృగుమహర్షి కంపితుడై దుఃఖార్తుడై మధుసూదనున కిట్లనెను : 

విష్ణూ! మహామతీ! నీ కీ దుష్కార్యము పాపమని తెలియును గదా! ఐన నీ పని కేల యొడిగట్టితివి? విప్ర స్త్రీ వధ మనసున సైతము దలంపరాదు గదా! విష్ణువు సత్వగుణ సంపన్నుడు - బ్రహ్మ రజోగుణయుక్తుడు - శివుడు తమోగుణుడని మహర్షులందురు. కాని, నేడా విషయము నీ యెడల విపరీతమైనది. సాత్త్వికుడవైన నీవు తామసుడ వెట్లయితివి? అతినిందిత కార్యమేల చేసితివి? స్త్రీని వధింపరాదు గదా! ఈమె యేపాప మెఱుగనిదే! మఱి యీమె నేల చంపితివి? నీవు కడు దురాచారుడవు. నిన్నేమి చేసినన తప్పులేదు. నిన్నిప్పుడే శపించివైతును. 

ఇంద్రుని మేలుగోరి నీవే దురిత మొనర్చితివి. నన్ను దుఃఖముల పాలు చేసితివి. నీవు కపటివి - దురాశయుడవు - నీచ యోని సంజాతుడవు. కనుక నేను నిన్నే శపింతును, ఇంద్రుని శపింపను. జనార్దనా! మునులు నిన్ను సాత్త్వికుడందురు. కాని నీవు తామసుడవు. నీవు చేసిన దుర్మార్గము నేను కనులార గంటిని. 

ఇదిగో! నా శాప కారణముగ నీవు మృత్యులోకమున నవతారములు దాల్చెదవు. ఈ పాప ఫలితముగ గర్భ దుఃఖమనుభవించి తీరుదువు.'' అట్టి భృగు శాప ఫలితముగ ధర్మము నశించి నపుడెల్ల ధర్మసంస్థాపనకై విశ్వ కల్యాణార్థము విష్ణువు మాటిమాటికిని మనుజలోకమం దవతరించును అను వ్యాస వచనములు విని 

రాజిట్లనెను : మహాతేజముగల సుదర్శన చక్రముతో భృగు పత్ని చంపబడెను గదా! అటు పిమ్మట భృగు మహర్షి గృహస్థ జీవిత మెట్లు గడపెను? అన 

వ్యాసు డిట్లనియెను : అట్లు కార్యకుశలుడగు భృగుమహర్షి మహారోషముతో విష్ణుని శపించి పిమ్మట తన భార్యతలను మొండెముతో జేర్చి యిట్లు వచించెను : 

"ఓ దేవీ! నేను సర్వధర్మ విదుడనేని ధర్మాచరణుడనేని విష్ణుని చేతిలో చచ్చిన నిన్ను పునర్జీవితురాలి నొనర్తును.

నేను నిత్యసత్యవాదినేని నా సత్య ప్రభావమున నీమె పునర్జీవితు రాలగును గాక! ఎల్లదేవతలు నేడు నా తపోమహిమ గాంతురు గాక! నేను సత్య-శౌచ-వేద-తపోవీర్యము గలవాడనేని నా తపో మహిమచే చల్లని మంత్రజలము సంప్రోక్షించి యీమెను పునర్జీవితురాలి నొనర్పగలను" అని మంత్రజలముచే ప్రోక్షించినంత భృగుపత్ని పునర్జీవితురాలై పరమ ప్రీతితో పవిత్రమగు నగవుతో నిదుర నుండి లేచినటులే లేచెను. 

వారిని సర్వభూతములును గాంచి నలుదెసల నుండి మేలు మేలనుచు ప్రణుతించెను. అట్లు భృగుముని భార్య మరల జీవించుట నింద్రాది దేవతలు గాంచి పరమ విస్మయ మందిరి. అట్లు భృగువు తన యర్ధాంగిని మరల బ్రతికించు కొనెను. 

అటు శుక్రుడు మంత్ర ప్రాప్తికై ఘోరముగ తపమొనర్చుచున్నాడు. ఆ శుక్రుడు మంత్ర లాభమున నింకేమేమి చేయగలడో? యని యింద్రుడు సురలతో ననెను. అట్లు నిద్రాదేవి తన్ను వదలగా నింద్రుడు మేలుకొని శుక్రుడు మంత్ర ప్రాప్తికై ఘోర తప మొనర్చుట ఎఱిగి దుఃఖాక్రాంతుడయ్యెను. 

అంత నింద్రుడు నెమ్మదిలో ముందుచూపుతో నంతయు నాలోచించి జయంతి యను యనుంగు కూతుతో నవ్వుచు నిట్లు పలికెను: 

"ఓ పుత్త్రీ! నిన్ను తపమొనర్చుచున్న శుక్రుని సేవకు నియోగించితిని. నీవిపుడేగి యతనిని సేవించి నీవానిగజేసికొమ్ము. నీవతని యాశ్రమమున కరుగుము. అతని చిత్తము మెచ్చునట్లుగ మసలుకొనుము. చేయదగిన తగిన యుపచారము లొనర్చుము. అతనిని బూజించి వేగమే నా భయ ముడుపుము. 

విశాలాక్షి మనోరమయగు ఆ జయంతి తన తండ్రిమాట లాకర్ణించి శుక్రు నాశ్రమమున కేగెను. శుక్రుడు ధూమపాన మొనర్చు చుండుట నామె కాంచెను. ఆ ముని మేనిని జూచి తన తండ్రి మాటలు మదిలో దలంచి జయంతి మునివరునకు లేత యరటి యాకులతో వీవ మొదలుపెట్టెను.

ఆమె పరమభక్తిమీర నిర్మలమైన చల్లని జలములు వేగమే కొనివచ్చి మునిపతి త్రాగుట కందించెను. పగటింటి సూర్యుడు నడినెత్తిమీదికి రాగా నా తన్వంగి తాను ధర్మమందు నిలిచి వస్త్రమును శుక్రాచార్యునకు గొడుగుగ బట్టి చల్లని నీడను కల్పించెను. ఆ యువిద బాగుగ పండిన తీపి పండ్లను దెచ్చి యారగించుటకు ఏర్పరచి ముని సమక్షమున నుంచెను. 

ముని నిత్యవిధులు నిర్వహించుటకై చిల్కల వంటి దర్భలు దెచ్చి యాతన్వంగి ముని యెదుట నుంచెను. ముని ప్రవరుడు నిద్రించుట కాప్రమద మెత్తని చిగురుటాకు సెజ్జ సమకూర్చెను. ఆ ముని యందలి ఆదర భావముతో మెల్లగ వీచుచుండును. ఆ నెలతుక యేనాడు గాని ముని శాపభయమున యతనికి వికారములు గొలుపు హావభావములు వెల్లడించలేదు. 

ఆ సుభాషిణి ప్రియము లొలుకుచు అతనికి ననుకూలములైన మాటలతో మునిని ప్రస్తుతించుచుండెను. ముని మేల్కనినంతనే యాలలన ముని కాచమనము కొఱకు నీరు దెచ్చి యిచ్చెను. ఈ తీరున నామె ముని మనస్సు నెఱిగి యనువర్తించుచుండెను. ఆతురుడగు సురపతి జితాత్ముడైన ముని చేష్టల నెఱుంగదలచి యచ్చోటికి తన సేవకుల నంపెను. 

ఈ ప్రకారముగ జితేంద్రియ - నిర్వికార - బ్రహ్మచారిణి యగు జయంతి మునినాథునకు పెక్కేండ్లు పరిచర్యలు చేసెను. అట్లు వేయేండ్లు నిండెను. అంత మహాదేవుడు ప్రీతమనస్కుడై సంతుష్టుడై ప్రసన్నుడై మునివరునకు వర మొసగవచ్చి నీ కేమి వరము కావలెనో కోరుమని ఇట్లనెను : 

"ఓ భృగునందనా! యీ విశ్వమందు ఏదేది కలదో యేది వాక్కున కందదో దేనిని నీవు గనదలతువో దానిని నీవు గందువు. 

వాని నన్నిటిని నీవు జయింపగలవు. నీవు సర్వభూతములలో వేనికిని వధ్యుడవు గావు. నీవు ప్రజాపతివి. ద్విజోత్తముడవు. ఇందు సందేహము లేదు అని ఇట్లు వరము లొసంగి శివు డదృశ్యుడయ్యెను. అంత శుక్రుడు కన్నెత్తి కాంచి జయంతితో నిట్లు పలుకసాగెను : 

"ఓ సుశ్రోణీ ! నీ వెవ్వతవు? ఎవ్వరి దానవు? నీలోని కోరిక యేమి? నీ వేమి చేయదలచితివి? నీవు నన్ను దేనికి జేరితివి? నీకు నావలన గాదగిన కార్య మేది? త్వరగ తెలియబఱచుము. ఓ సులోచనా! నీలోని కోరిక యెంతటి యసాధ్యమైన దైనను నేను తప్ప కీడేర్పగలను. నీ యింపైన చేతలకు నా మది ప్రీతినందినది. ఇప్పుడే వరము గోరుకొమ్ము, ఇదిగో యిత్తును అను మునివరుని మాటలకు జయంతి ముఖము సంతోషముతో వికసించగా ఆ మగువ 

"భగవన్‌! మీరు మీ తపోమహిమముననే నా మనస్సునందలి ఈప్సితమును తెలిసికొన వేడుకొనుచున్నాను అనగా శుక్రు డిట్లనెను : 

"నే నిదంతయు నెఱుంగుదును. ఐనను నీ మనస్సునందలి యీప్సితమును నాకు చెప్పుము. నీ కన్ని విధముల శుభము కలిగింతును. నీ పరిచర్యకు ప్రీతి నందితిని అను శుక్రుని వచనములు విని 

జయంతి యిట్లు పలికెను" ఓ ముని వరేణ్యా! బ్రాహ్మణోత్తమా! నే నింద్రుని కూతురను. జయంతుని చెల్లెలను. నా పేరు జయంతి. నన్ను నా తండ్రి మీకు సమర్పించెను. ఓ విభూ! నేను మీ విషయమున కామముతో నున్నాను. ఇపుడు నా కోరిక తీర్చుడు. ధర్మము ననుసరించి ప్రీతి పూర్వకముగా మీతో రమింతును అనగా శుక్రు డామెతో 

"సుశ్రోణివగు ఓ భామినీ! నీవు పదియేండ్లపాటు సర్వ భూతములకు అదృశ్యురాలవై నాతో కూడి ఇచ్చటనే నీ ఇచ్ఛానుసారము రమింపుము" అనెను. అని యిట్లు పలికి ముని వరుడు శుక్రు డామెను వెంటగొని తన యింటికేగి యామెను పెండ్లాడి ఆ చందముగ ముని జయంతిని గూడి పదేండ్లవఱకు నివసించెను. 

ఆ కాలములో శుక్రుడును మాయాశక్తితోగూడి సర్వభూతములకు కంటబడక యుండెను. శుక్రుడు మంత్రయుక్తుడై యేతెంచెనని దైత్యులు విని మునిని గన మదముమీద నాతని యింటి కరిగిరి. కాని, వారికి ముని కనబడలేదు. ఏలన, శుక్రుడెవరి కంటబడక జయంతిని కూడి యుండెను.

అంతట వారు భగ్న హృదయులై విమనస్కులై చింతాపరులై దీనులై మాటిమాటికి మునికై ఎదురు తెన్నులు చూచుచుండిరి. 

కాని మాయావృతుడైన శుక్రు డెంతకును వారికి గనబడలేదు. అంత వారు భయార్తులై చింతాపరులై తమ యిండ్ల కేగిరి. 

అట్లు శుక్రుడు జయంతితో రమించు చుండుట యింద్రుడెఱిగి తన గురునితో 'ఇక మీద మా కర్తవ్య మేమి? ఓ విప్రశ్రేష్ఠా! నీవు మాత్ర మిపుడే వెళ్ళి దానవుల కాసగొల్పుము. నీ చక్కని బుద్ధితో నాలోచించి మన కార్యము సాధింపుము' అనెను. బృహస్పతి యింద్రుని మాటలన్నియు వినెను. 

శుక్రుడు మాయావృతుడై జయంతితో రమించుచుండు టెఱింగెను. అపుడు గురుడు శుక్రునియున్న రూపుదాల్చి దానవుల చెంతకేగెను. గురుడుచటి కేగి దానవుల నతిప్రీతితో నాహ్వానించెను. అసురు లెల్ల రేతెంచి తమ ముందున్న శుక్రుని పొడగాంచిరి. వారు మాయా మోహితులై దేవగురుని దైత్యగురునిగ భావించి దోయిలించిరి. 

కాని, శుక్రరూపము దాల్చిన గురుని మాయ దెలియరైరి. మాయతో శుక్రరూపము దాల్చిన గురువు వారికి స్వాగతము పలికి నేను మీ మేలుగోరి వచ్చితిననెను. నేను మీ మేలుగోరి తపమొనరించితిని. శివుడు మెచ్చి నాకు విద్య నొసంగెను. దాని నిపుడు మీకు ప్రబోధింపగలను. అది విని రాక్షసులు ప్రీతమనస్కులైరి. మన యాచార్యులవారు మన పని సాధించిరని మోహితాత్ములై సంతసిల్లిరి. 

Chapter 73 Venus performing penance to attain the mantra - అధ్యాయము 73 శుక్రుడు మంత్రప్రాప్తికై తపమొనర్చుట

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 73

శుక్రుడు మంత్రప్రాప్తికై తపమొనర్చుట

అట్లు దేవతులు వెళ్ళిన మీదట శుక్రుడు దనుజులను గని యిట్లు పలికెను: 

ఓ దానవులారా! తొల్లి బ్రహ్మ నాతో పలికిన కొన్ని వాక్కులు కలవు. మీకు వినిపింతును. వానిని వినుడు. జనార్దనుడైన శ్రీమహావిష్ణువు ధర్మరక్షణకై దైత్య వధ గావించును. అట్టే మున్ను హరి వరాహరూపమున హిరణ్యాక్షు నంత మొందించెను. శ్రీ నృసింహరూపమున హిరణ్యకశిపుని చీల్చిచెండాడెను. అదేవిధముగ నతడెల్ల దైత్యగణములను చంపగలడు. ఇందు సందేహము లేదు. 

ఇపుడు హరిశక్తి ముందు నా మంత్రబలము పనిచేయదు. మీరు నా చేత రక్షింపబడినచో దేవతలను జయింపగలరు. కొంతకాల మోపికపట్టుడు. నేనిప్పటికిప్పుడే వరమంత్ర ప్రాప్తికై మహాదేవుని సన్నిధానమున కరుగగలను. నేను మహామంత్రశక్తి బడసి వెంటనే రాగలను. దాని బలమున మిమ్ము తప్పక రక్షింపగలను' అనవిని 

దైత్యులిట్లనిరి : మునిసత్తమా ! మేమోటమి చెందితిమి. ఈ నేలపై నింకెట్లు నిలువగలము? మీరు తిరిగివచ్చునంతదనుక మే మెదురుతెన్నులు చూచుచుండజాలము. మాలో మహాబలశాలురందఱును మడిసిరి. కొందఱు మాత్రము చావుదప్పి బయటపడిరి. ఇట్టి దీనస్థితిలో మేము రణమున నిలువజాలము. 

శుక్రాచార్యు డిట్లనెను: నేను శంకరు నుండి మంత్ర విద్య గ్రహించు నంతకాలము శాంతులై తపమొనర్చు చుండుడు. విబుధులు సమయోచితముగ సామదానాది చతురుపాయముల నెఱిగి దేశకాల శక్తులు దెలిసి మెలగవలయు నందురు. భద్రము గోరు బుద్ధిశాలి యవసరమైనచో వైరికి సేవయైన చేయవలయును. పిమ్మట తఱియెఱింగి బలము పుంజుకొని శత్రువును తుదముట్టించవలయును. కాన మీరిపు డతివినయము నటించి సామ మార్గముతో మీ మీ నిలయములకేగుడు - నా రాకకు దారి తెన్నులు చూచుచుండుడు. నేను మహాదేవుని నుండి మంత్రశక్తి గ్రహించి వచ్చిన మీదట మంత్రబలముతో దేవతలతో బోరు సాగింతము.' 

అట్లు శుక్రుడు దానవుల నొప్పించి మంత్రార్థము దృఢ సంకల్పముతో శివతరుడైన పరమశివుని సన్నిధికరిగెను. అపుడు రాక్షసులు సంధికొఱకు సత్యవాదియు సురలకు విశ్వాసపాత్రుడునైన ప్రహ్లాదుని దేవతుల సన్నిధి కంపిరి.

ఆతడు వేల్పుల సన్నిధి కసురులను వెంటగొనియేగి నమ్రవచనములతో దేవతలతో ఓ దేవతలారా! మేము కవచ సంన్యాసము నస్త్ర సంన్యాసమును చేసితిమి. నారచీరలు దాల్చి తపమొనరింప దలంచితిమి. అనగా ప్రహ్లాదుని సత్యవాక్కు లాలించి యమరులు రణముమాని బాధలుపాసి ప్రమోదభరితులై నిబ్బరముగ నుండిరి. 

అసురులు శస్త్ర నంన్యాసము సేయగా వారిని నమ్మి యమరులు తమ తమ నివాసముల కరిగి క్రీడాసక్తులై సుఖముండిరి. ఆంత దానవులును నిగ్రహము వహించి శుక్రుని శుభాగమనము గోరుచు తపముచేయుచు కశ్యపాశ్రమమందు వాసముండిరి. 

అటు శుక్రుడు కైలాసరిగి కరిగి శంభునకు ప్రణమిల్లెను. హరుడతని రాకకు కారణమడుగ ఓ మహాదేవా! నేను గురునియొద్ద లేని మంత్రములు గోరుచున్నాను. వానివలన సురపరాజయము - అసురజయము గలుగుగాక! యని శుక్రుడనెను. అతని పలుకు లాలించి సర్వజ్ఞుడు శివుడునైన శర్వుడు తన కర్తవ్యము గూర్చి యించుక యాలోచించెను. 

రాక్షసగురుడు దేవతలయందలి ద్రోహబుద్ధిచే తనకడకు మంత్రార్థము వచ్చెనని శివుడు నిశ్చయముగ దెలిసికొనెను. ఎల్లభంగుల దేవతలు తనకు రక్షణీయులని పరమశివుడు మదితలంచెను. ఆ యుగ్రుడు శుక్రునితో - నీవు మహోగ్రము దుస్సాధనమునైన యొక వ్రత మనుష్టించ వలయును అని పలికెను. 

వేయేండ్లు తలక్రిందుగ నుండి పొట్టుపొగ పానమొనర్చు చున్నచో నీ కోర్కె యీడేరును. అపుడు మంత్రములు పడయగలవు అని పలికెను. అపుడు శుక్రుడు చేతులు జోడించి యిట్లనెను. "ఓ సర్వేశ్వరా! మహాప్రసాదము. మీ మాట పాటింతును. వ్రతమాచరింతును. అనుమతియిండు" అని పలికి శుక్రుడు ధూమపాయియై శాంతుడై మంత్రార్థము కఠిన వ్రత మాచరింప దొడగెను. శుక్రుడు వ్రతరతు డగుటయు రాక్షసులు దంభ నిరతులగుటయు విబుధు లెఱిగి మంత్రాలోచనలు సలుపుచుండిరి.

మఱియు దేవతలాయుధములు దాల్చి దృఢనిశ్చయముతో రణోద్యక్తులై దానవులున్నయెడ కరిగిరి. దేవతలు కవచ కార్ముకములు దాల్చి నలుదెసలనుండి వచ్చి యొక్కుమ్మడి ముట్టడించుటగని దనుజులు భీతిల్లిరి. వారు దిక్కులేకుండిరి. దేవతలు బలగర్వితులై హఠాత్తుగా యుద్ధసన్నద్ధులై తమపై పడుటగని రాక్షసులు చకితులైరి. 

వారు దేవతలతో నిట్లు నిజము పలికిరి: ఓ యమరులారా! మే మస్త్ర సంన్యాసము చేసితిమిగదా! మాయాచార్యవర్యుడు వ్రతనిష్ఠుడయ్యెను. ఈ సమయము గని పెట్టి మీరు మా మీది కెత్తి వచ్చితిరే? మీరిచ్చిన యభయ మేమయ్యెను? మీ సత్యవాక్యము లేమయ్యెను? వేదవిహిత ధర్మమేడగలిసెను? శస్త్రత్యాగి-భీతుడు-శరణార్థి-వీరు హంతవ్యులు గారని పెద్దలందరుగదా'! అనవిని 

దేవత లిట్లనిరి : మమ్ము గెల్చుటకై మీరు కృపణత్వముతో శుక్రుని మంత్ర ప్రాప్తికై పంపితిరి. మీ తపమెందులకో మేము తెలిసికొంటిమి! కనుకనే మేము యుద్ధమునకు కలిసికట్టుగ నాయత్తమైతిమి. ఇపుడు మీరును శస్త్రపాణులై యుద్ధసన్నద్ధులు గండు. శత్రువు దుర్బలుడగుటకని వానిని చంపుట సనాతన యుద్ధనీతిగదా! 

అను వారి వచనము లాలకించి దైత్యులు తమలో తామలోచించుకొని భయవికలులై అచ్చోటు వదలి పారిపోయిరి. వారెల్లరును శుక్రుని తల్లికడ కరిగి శరణు వేడిరి. ఆమె భయకాతరులగు దనుజులనుగని వారి కభయమొసగి ఇట్లు నుడివెను : 

దనుజులారా! మీరు భయపడకుడు. జంకు వదలుడు. నా సన్నిధానమందు మీరెట్టి భయమును జెందబనిలేదు. ఆమె మాట లాలకించి దనుజులు భ్రమలును వెతలును మాని నిరాయుధులై యా యాశ్రమమందు వాసముండిరి. దేవతలంత బలాబలము లెఱుంగక కాలికి బుద్ధిచెప్పుచున్న దానవుల వెన్నంటిరి. శుక్రుని తల్లి వారి నడ్డగించెను. 

కాని, దేవత లాశ్రమస్థులగు దానవుల నెక్కడివాని నక్కడ పట్టి పల్లార్ప దొడంగిరి. అట్లు దనుజులు దేవతల చేతిలో మడియుట గని శుక్రుని తల్లి కినుకపూని నా తపోబలమున నేనిపుడే దేవతలను నిద్రపోవునట్లు చేయుదునని పలికెను.

భృగుసతి నిద్రాదేవిని ప్రేరించగా ఆమె వారిని మోహితులనుగ జేసెను. ఇంద్రునితోడి దేవత లెల్లరును నిద్రావశులై మూగవోయి నేలపై బడిరి. అట్లు దీనత్వముతో నిద్రించి యున్న యింద్రునిగని విష్ణువు అతనితో ఓ సురోత్తమా ! నీవు నాలో ప్రవేశింపుము. నీకు మేలగు! అనెను. 

అది విని యింద్రుడు హరిలో ప్రవేశించెను. అపు డింద్రుడు నిర్నిద్రుడు-నిర్భయుడు-అనిరుద్ధరక్షితుడు నయ్యెను. అట్లు హరి రక్షితుడై యింద్రుడు వెతలు మానియుండుట గని శుక్రుని మాత కోపముతో, 

ఓ యింద్రా ! నేనిప్పుడే దేవతలందఱు చూచుచుండగ నిన్ను నీ హరిని మ్రింగివేయుదును. నా తపోమహిమ యట్టిది అనెను. అది విని ఇంద్రుడును విష్ణువును మహాయోగవిద్యలో జేరి స్తబ్ధులైయుండిరి. అట్లు హరింద్రులు తిరస్కృతులై పీడితులైయున్నందున దేవతలెల్లరు దీనమానసములతో హాహాకారములు చేసిరి. ఆర్తనాద మొనరించు దేవతలను గాంచి యింద్రుడు హరి కిట్లనెను. 

'ఓ మాధవా! నేను నీకంటెను మిక్కిలి తిరస్కృతుడనైతిని. జనార్దనా! ఈమె తపోగర్వితురాలు-దుష్టురాలు. ఈమె మనలను దహించుటకు ముందే యీమెను నాశ మొందింపుము' అనెను. ఇంద్రుని ప్రార్థనము మన్నించి శ్రీ విష్ణువు స్త్రీవధ విషయమై ఘృణను వదలి తన చక్రమును మది దలంచెను. క్షణమాత్రాన చక్రము హరికి వశమయ్యెను. హరి యింద్ర చోదితుడై మహాకోపమున చక్రము చేతబూని వేగమే యామె తల ఖండించెను. ఆమె నిహతురాలు కాగా ఇంద్రుడు ప్రమోద మందెను. దేవతలును విగతజ్వరులై ప్రమోదభరితులునై హరికి జయజయధ్వనులు చేసిరి. అట్టు లింద్రుడు నుపేంద్రుడును బాధాముక్తులైరి. 

Chapter 72 War of the gods and demons - అధ్యాయము 72 దేవదానవుల యుద్ధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 72

దేవదానవుల యుద్ధము

జనమేజయు డిట్లనెను : పారాశర్యా! మీరు చెప్పిన మాటలు విని నాకు గొప్ప సందియము గలుగుచున్నది. ఏమన, ఆ నరనారాయణులు వైష్ణవాంశ సంజాతులు - తపోధనులు - శాంతులు - తీర్థాశ్రయులు - సాత్త్వికులు - వన్యఫలాశనులు - సత్యసంగరులు - మహామునులు - ధర్మపుత్త్రులు గదా! అట్టివారు రాగయుక్తు లేలయైరి? శుభము లొనగూర్చు తపము నేల మాని సంగరమునకు గడంగిరి? శాంతి సౌఖ్యప్రదమైన యాత్మానందమును వదలి దివ్య సహస్రవర్షము లెట్టు పోరగలిగిరి? ఆ మునులు ప్రహ్లాదునితో నెట్లుపోరిరి? వారికి పరస్పరము విరోధము గలుగుటకు కారణమేమి? నాకిదంతయును విశద పఱచుము. 

సామాన్యముగ కామినీ కాంచనములగూర్చి వైరము గలుగుచుండును. కాని, అట్టి హేతువు లేకయే వీతరాగులై తీవ్రతప మొనర్చు వారికి యుద్ధబుద్ధి యేల కలిగెను? వారు సర్వఫలప్రదమైన అట్టి తపమేల చేసిరి? సుఖభోగములకా? ఇతరులను మోహములో ముంచుటకా? కాక స్వర్గభోగార్థమా? వారు శాంతచిత్తులు గాద! తుదకు వారికెట్టి ఫలము ప్రాప్తించెను? వారి శరీరములు తపముచే కృశించినవి. రణముచే క్షీణించినవి. వారు దివ్య వర్షములు శ్రమ కోర్చి పోరుటచే పీడ నందిరి. 

వారు రాజ్యములు కోరికాని ధనముకోరికాని భార్యా పుత్త్రుల గోరికాని సంగర మొనరింప లేదుగదా! మఱి మహాత్ముడగు ప్రహ్లాదునితో కయ్యమునకు కాలు ద్రవ్విరి. నిష్కాముడైన వాడెవ్వడైన శాంతి రహితమైన యుద్ధ మొనర్చునా? వారికి సనాతన ధర్మ తత్త్వము తెలియునుగదా! మఱి వారు మేనులకు దుఃఖకరమైన రణమేల యొనరించిరి? బుద్ధిమంతు డెల్ల వేళల సుఖములు గూర్చు శుభకర్మలే యాచరించును గాని దుఃఖదములగు పనులు చేయడు. ఇది సనాతన ధర్మము. 

ధర్మజ్ఞా! ఆ ధర్మపుత్రులు విష్ణ్వంశజులు - సర్వకళాకోవిదులు - సర్వగుణవిభూషితులు. అట్టివారు సుఖైక నిలయము శాంతిఫలప్రదమునైన తపము మాని ధర్మనాశకము దుఃఖకరమునైన కదనమున కేల తలపడిరి?

ఇంతటి దారుణ రణము మూర్ఖుడుగూడ చేయడు. తొల్లి యయాతి భూపతి స్వర్గచ్యుతుడయ్యెనని వింటిని. ఆ పుడమిఱేడు ఘనముగ దానధర్మములు యాగములు నాచరించెను. కాని, దురహంకారమున గల్గిన పాపఫలితముగ దివినుండి భువిపై పడిపోయెను. నేను పెక్కు జన్నము లొనరించితినని యన్నంతమాత్రమున నింద్రు డతనిని పతితునిగ జేసెను. దురహంకృతి లేనిచో పోరు గలుగదని తలతును. పుణ్య వినాశకమైన యుద్ధము వలన గలుగు ఫలిత మేమి? అనగా 

మునివరు డిట్లనెను: రాజా! ఈ సంసారమునకు మూలము మువ్విధములుగ నుండునని పెద్దలందురు. ధర్మనిర్ణేతలు సర్వవిధులునైన మును లీ మాయాకృత సంసారమునకు త్రిగుణముల సమ్మేళనమైన యహంకారము కారణమని పేర్కొందురు. దేహధారియగు ముని యట్టి యహంకారము నెట్లు విడిచి యుండజాలును? కారణము లేక కార్యము ఘటిల్లదు. ఇది తిరుగులేని నిజము. 

సత్త్వముచే తపము - దానము - యాగము గల్గును. అహంకారమున రజస్తమస్సుల తీవ్రతచే కలహ ముత్పన్నమగును. ఎంత కొలది పనియైన చెడుగైన ఈ పుడమిపై నహంకారము లేనిదేదియును కలుగదు. అహంకారము మూలముననే యీ విశ్వసృష్టి సంభవించినది. అది లేనిచో జగమే లేదు. బ్రహ్మ-విష్ణువు-శివుడు సైతము అహంకారయుతులే. మఱి ఇతర మునుల విషయము చెప్పనేల? 

ఈ సకల చరాచర జగ మహంకారమయమై పరిభ్రమించుచుండును. కర్మము మూలమున మాటి మాటికి పుట్టిగిట్టుటలు సాగుచుండును. దేవ మనుజ తిర్యక్కులు సర్వమును సంసారమందు రథచక్రములవలె నిరంతరాయముగ తిరుగుచుందురు. ఆ శ్రీమన్నారాయణు నవతారముల సంఖ్య నెవడు లెక్కింపగలడు?

అ శ్రీహరి జనార్దనుడు జగన్నాథుడు నగు వాసుదేవుడు యుగయుగములందును ఈ విశాల ప్రపంచమందలి యుత్తమాధమ యోనులందు పెక్కుమారులు జన్మములెత్తి కూర్మ వరాహ వామన నరసింహాద్యవతారములు దాల్చెను. 

ఇట్లే హరి విధిప్రేరితుడై ప్రతి యుగమునందును లెక్కకు మిక్కిలిగ నవతారము లెత్తుచుండును. ఏడవదియగు వైవస్వత మన్వంతరమందును విష్ణువు పెక్కవతారములు దాల్చెను. ఈ యవతారముల తత్త్వము తెలుపుదును, వినుము : 

"తొల్లి భృగు మహర్షి వలన హరి పలుశాపములనుభవించి తత్ఫలితముగ నతడు పెక్కవతారములు దాల్చెను అన విని 

రాజిట్లనెను : ఓ మహామతీ! నా యెడదలో మరొక్క సందియము గలుగుచున్నది. భృగుమహర్షి శ్రీ విష్ణువు నేల శపించెను? హరి ముని కేమి యప్రియ మాచరించెను? అమరవందితుడైన శ్రీహరిపై భృగు ఋషి యేల కోపించెను? ఏల శపించెను? అన 

వ్యాసుడిట్లనెను : ఆ భృగుశాపమునకు కారణము వచింతును. వినుము : 

మున్ను కశ్యపుని దాయాదుడగు హిరణ్య కశిపుడను దానవుడు గలడు. అతడు దానవులంగూడి తలచినపుడెల్ల దేవతలతో పోరుచుండెను. ఇట్టి పోరాటమున జగములు తల్లడమందుచుండెను. అపుడు శ్రీహరి శ్రీనరహరి రూపమున దనుజపతిని దెగటార్చెను. అంత నతని కుమారుడు ప్రహ్లాదుడు దానవరాజయ్యెను. మహావిక్రమి యగు ప్రహ్లాదుడు దేవతలను మిక్కిలిగ బాధించెను. ఇట్లు దేవదానవపతులకు ఘోరసమరము సంఘటిల్లెను. ఇట్లు వారికి నూఱండ్లు యుద్ధము జరిగెను. అందు తుద కమరపతియే గెలుపొందెను. 

అంత ప్రహ్లాదుడు వైరాగ్యోపరతుల వలన సనాతన ధర్మమందెఱుకగలిగియుండి తుదకు తన రాజ్యమును విరోచనుని తనయుడగు బలి కప్పగించి తాను తపమాచరింప గంధమాదన గిరి కరిగెను. ఇట బలి రాజై సురలతోడ పగపూనెను.

అంత వారు పరస్పరము ఘోరముగ పోరు సల్పిరి. అం దమిత తేజోవంతుడగు నింద్రుడు రాక్షసుల నోడించెను. ఇంద్రుడు శ్రీ మహావిష్ణుని సాయమున బలిని రాజ్యభ్రష్టు నొనరించెను. ఓడిన దనుజుల శుక్రాచార్యుని శరణుజొచ్చి 

"ఓ మహాభాగా! నీవు తపోబలవంతుడవు. మాకు సాయమొనర్చుము. లేనిచో మేమిట నిలువ నోపము-రసాతల మేగుదుము. సర్వమంత్ర శాస్త్రవేత్తవగు నీవే మాకు సాహాయ్య మొనర్పవలయును" అనిన వారి మాటలకు దయార్ద్ర హృదయుడైన శుక్రాచార్యుడు వారితో నీ రీతిగ బలికెను మీరు భయపడకుడు. నేను నా తేజమున మీకు సాహాయ్య మొనరించి మిమ్ము కాపాడుదును. మీరుత్సాహవంతులై సంతాపరహితులగునట్లు చేయుదును.'' 

అపుడు దేవతలుగూడ చారుల వలన వృత్తాంతమంతయు నెఱింగిరి. వారింద్రుని గూడి రహస్య మంత్రణములు జరిపిరి. తుదకు వారొక నిర్ణయమునకు వచ్చిరి. ఆ శుక్రుని మంత్ర ప్రభావమున దనుజులు మనలను పదవీభ్రష్టులుగ జేయకమున్నే మనము వారినెదిరింతము. మనము హతశేషులను పాతాళమున కంపుదము అని తలంచి దేవతలు శస్త్రపాణులై రోషాతిరేకమున రాక్షసులపై కురికిరి. 

వారు హరిప్రేరితులై హరిసాయమున దనుజుల యుక్కడగింప గడంగిరి. దానవులు బాధితులై భయపీడుతు లైకకావికలైరి. దనుజులు వెంటనే శుక్రుని శరణుజొచ్చి త్రాహిత్రాహి అని మొఱపెట్టుకొనిరి. అపుడు శుక్రుడు దేవపీడితులు - బలరహితులునైన రాక్షసులతో మనకు మంత్రౌషధముల బలముగలదు. భీతిల్లవలదు' అని పలికి వారినూరడించెను. దేవతలెల్లరును శుక్రునిగాంచి యసురులను వదలి వెడలిపోయిరి.

అధ్యాయము 73 శుక్రుడు మంత్రప్రాప్తికై తపమొనర్చుట

Chapter 71 Naranarayana's fight with Prahlad - అధ్యాయము 71 నరనారాయణులు ప్రహ్లాదునితో పోరుట

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 71

నరనారాయణులు ప్రహ్లాదునితో పోరుట

ఆ విధముగ ప్రహ్లాదుడు విధి విధానముగ తీర్థవిధిని నిర్వర్తించుచు తన యెదుట నొక మఱ్ఱిచెట్టు గాంచెను. ఆ చోట నతనికి కొన్ని పలువిధములైన బాణములు గనబడెను. అవి గృధ్రపక్షములతోకూడి వాడియై మహోజ్జ్వలములై తనరుచుండెను. 

ఇది పావన పుణ్యతీర్థము. ఋషుల ఆశ్రమము. ఇందు వాడిబాణములు! ఇవెవరివోయని ప్రహ్లాదుడు మదిలో నాలోచించుచుండగనే యతని కున్నతమైన జడలు దాల్చి కృష్ణాజినముల దరించి విరాజిల్లు ధర్మసుతులు గనంబడిరి. అతడు వారి సమీపమునందు మంచి లక్షణములుగల శారఙ్గము ఆజగవమను పేరుగల రెండు విండ్లను అక్షయతూణీరములను గాంచెను. ఆ దానవపతి నిశ్చలధ్యాన నిమగ్నులై యున్న ధర్మసుతులైన నరనారాయణులను గాంచి క్రోధతామ్రాక్షుడై వారితో నిట్లు పలికెను: 

"మునులారా! మీ యందు ధర్మ వినాశకరమైన దంభము చేరెనా యేమి? ఈ సత్యయుగమునందు తపశ్చరణము-చాపము దాల్చుట యను రెండు నెప్పుడును జరుగవని మీరు కనివిని యెరుగరా? ఆ రెండును ఒకేచోట నుండుట కలికి ప్రియము. అవి యీ యుగమునకు విరుద్ధ ధర్మములు. కనుక యుక్తములు గావు. విప్రులకు తపము యుక్తము. చాపధారణ మయుక్తము. ఈ శరీరమందీ జడలు దాల్చుటేమి? ఈ యాడంబరముతోడ ధనుస్సులు బట్టుటేమి? దివ్య భావములతో ధర్మమాచరించుటే మీకు తగును అను ప్రహ్లాదుని మాటలు విని 

నరుడిట్లు నుడివెను : దైత్యేంద్రా! మా ఇరువురి తపమును గూర్చి నీకీ వ్యర్థ ప్రలాపము లేల? ఎవడు దేనికి సమర్థుడై ఏది చేయునో వాని కది సంపన్నమగును. మే మీ రెండు కార్యములందును దక్షుల మగుట లోక విదితమే గదా! మాకు రణమునకు సర్వథా సమర్థత గలదు. నీవేమి చేయగలవు? నీ ఇచ్చ వచ్చినచోటి కిచ్చవచ్చినట్టు లేగుము. ఈ చేతకాని డంబములు పలుకుటేల? బ్రహ్మతేజో బలమే బలము. అది కడుంగడు దుర్లభమైనది. మూఢబుద్ధికి | నీకేమి తెలియును? సుఖము గోరు ప్రాణి యెన్నడును బ్రాహ్మణుల విషయము చర్య సేయడు. అనగా విని 

ప్రహ్లాదు డిట్లనెను : తాపసులారా! మీరు మందమతులు. వ్యర్థముగ గర్వమోహితులు; నేను ధర్మసేతు ప్రవర్తకుడను. దైత్యరాజను. ఈ తీర్థమందధర్మాచరణము తగదు. నీకు రణమందు శక్తిగలదేని యేది-చూపుము చూతము. ప్రహ్లాదుని మాటలు విని 

నరుడిట్లు పలికెను: నీకు రణమొనరించు బుద్ధియున్నచో నాతో యుద్ధమొనరింపుము. ఓ యసురాధమా! నీ శరీర మిప్పుడే ముక్కలు ముక్కలు చేతును. ఇంక నీ కేనాటికిని రణమందు పట్టుదల పుట్టకుండుగాక! అను నరుని పలుకులకు బలశాలియు దైత్యపతియునగు ప్రహ్లాదుడు కుపితుడై, నే నేయుపాయముచేతనైనను ఋషులు - తాపసులు దాంతులు నైన నరనారాయణులను గెలిచి తీరుదును అని ప్రతినబూని వెంటనే ధనువు చేత ధరించెను వింటి నారిని లాగి టంకార మొనరించెను. 

నరుడును విల్లు చేతబూని తీవ్రశరము లెక్కిడి క్రోధాతిరేకమున ప్రహ్లాదునిపై పెక్కు బాణములు నిగుడించెను. దైత్యపతి వానినెల్ల తన బంగారు పింజ బాణపరంపరలతో వేగమే ఖండించెను. తన శరములు మొక్కపోయినందులకు నరునకు రోషమతిరేకించి పెక్కు బాణవర్షములు గురిసెను. దైత్యాధిపతి వానినెల్ల తన తీవ్ర బాణములతో ఛేదించి పిమ్మట నరుని రొమ్ముపై శరములు నాటెను. నరుడుగ్రుడై యైదమ్ములతో నతని బాహువులను గాటముగ ప్రహరించెను. విను వీథిలో నింద్రాది దేవతాగణము విమానములపై నుండి వారి పోరు కనులార తిలకించుచుండిరి. కారు మబ్బులు వేగముగ కుంభవర్షము గురియునట్లు దానవపతి నరునిపై పెక్కు వాడి బాణవర్షములు కురిసెను. 

అంత నారాయణుడు లేచి సాటి లేని మేటి విల్లగు శార్గము చేబూని బంగరు పింజలుగల వాడి బాణములు ప్రహ్లాదునిపై ప్రయోగించెను. విజిగీషులగు ఆ నారాయణ ప్రహ్లాదులకు ఘోరముగ పోరాటము సాగెను. సకల సురులు గగన మార్గమున సంతుష్టచిత్తులై దివ్య సుమములు కురిసిరి. అసురపతి క్రోధముతో తీవ్రగాములైన బాణములు ఏయగా నారాయణుడు వేగముగ తన ధనువునుండి వదలిన వాడి బాణములతో వాని నెల్ల నట్టనడుమనే సుళువుగ దనుమాడెను.

మరల ప్రహ్లాదుడు ధర్మతనయుడగు నారాయణునిపై పెక్కు వాడి యమ్ములు ఏయగ వెంటనే నారాయణుడు నతనిమీద పదునైన బాణములు ప్రయోగించెను. పిమ్మట నారాయణుడు తన యెదుట నున్న ప్రహ్లాదుని మిక్కిలిగ నొప్పించెను. చూపరై గుమిగూడిన దేవ దానవులు జయఘోషలు పెట్టిరి. గగనతల మంతయును బాణ పరంపరలతో నిండి కనిపించకుండెను. పగలు చీకటి రేయిగ మారెను. 

దేవదానవులు చోద్యమంది యొండొరులతో వీరికిపుడు దారుణమును అపూర్వమునైన పోరు సంఘటిల్లెనని మాటలాడుకొనుచుండిరి. మింట దేవర్షి గంధర్వులు యక్ష కిన్నెర పన్నగులు చారణ విద్యాధరులు చేరి యదిచూచి పరమ విస్మితులైరి. అది చూచుటకు పర్వత నారదులు నేతెంచిరి. నారదుడు పర్వతునితో నిట్లు పలికెను. 

ఇట్టి పోరు పూర్వము జరుగలేదు. తారక వృత్రాసురుల పోరు నిట్టుండలేదు. ఆ హరి తోడి మధుకైటభుల బవరము గూడ నింతగ జరుగలేదు. ఈ ప్రహ్లాదుడును మిక్కిలి శూరుడు. కనుకనే అద్భుత కర్ముడును సిద్ధపురుషుడునైన నారాయణుని తోడను పోరుచున్నాడు. అట్లు వీరిర్వురు నిర్విరామముగ రేయింబవళ్ళు పోరుచుండిరి. అంత నారాయణుడు ప్రహ్లాదుని వింటి నొకే బాణమున వేగమే ఛేదించెను. 

ప్రహ్లాదుడు మరొక వింటిని గ్రహించెను. నారాయణు డా వెనువెంటనే మరొక వాడి తూపు వదలెను. దానిచే నా ధనువును విరిగెను. ఇట్లు తన చాపములెన్ని విరిగిన నన్నిటిని ప్రహ్లాదుడు మరల గ్రహించెను. నారాయణుడు మహోగ్రుడై యతని విండ్ల నన్నిటిని ఖండించి వేసెను. తన ధనుస్సులన్నియును తెగిన మీదట నసురపతి పరిఘను బూని కోపముకొలది ధర్మపుత్రుని భుజా మధ్యమున విసరివేసెను. బలశాలియగు నారాయణుడు తనపైకి వచ్చు పరిఘను తొమ్మిది బాణములతో నెదుర్కొని –

పరిఘను దునిమి మరల పది బాణములతో ప్రహ్లాదుని ప్రహరించెను. అపుడు ప్రహ్లాదుడు గట్టి ఇనుపగద చేబూని కోపముతో దానిని నారాయణుని మోకాళ్ళపై వేసెను. ఐనను ధర్మజుడు పర్వతము పగిది నిశ్చలముగ నిలుచుండుటే కాక మహావిక్రముడైన నారాయణుడు వాడి యమ్ములతో ప్రహ్లాదుని పటుగదను మధ్యమందే నడుమకు దునిమెను. గగన వీథి నుండి చూచు వారదికని పరమ విస్మితులైరి. 

అంత పరంతపుడగు దానవపతి శక్తిని చేపట్టి యుగ్రుడై నారాయణుని ఱొమ్ముపై వేసెను. తన పైకి వచ్చు ఆ శక్తిని గని నారాయణుడు ప్రతిబాణమును ప్రయోగించి దానితో నా శక్తిని తునకలు చేసెను. పిమ్మట నే డమ్ములతో ప్రహ్లాదుని బాధించెను. ఇట్లు వారిరువురకును దివ్య సహస్రవర్షముల వఱకు నా మాశ్రమ మందెల్లరకు వింత గొల్పు బవరము జరిగెను. 

అంత నచటికి పీతవాసుడగు చతుర్భుజుడేతెంచెను. రమాకాంతుడు - శంఖచక్రగదా పద్మధారియై తన చెంతకేతెంచిన భగవానుని సందర్శించి పరమభక్తితో దోయిలొగ్గి ప్రహ్లాదుడు దేవదేవా! జగన్నాథా! భక్తవత్సలా! మాధవా! ఈ తాపసులు రణమున నెంతకు నోటమి జెందుటలేదు. నేను వీరితో దివ్య సహస్ర వర్షములు పోరాడితిని. వీరు జయింపబడ కుండుట నాకు వింతగ నున్నది అన 

విష్ణువిట్లనెను: ఓ క్షమాశీలా! వీరు మద్దివ్యాంశసంభూతులు. పరమసిద్ధులు. ఇందు వింత యెంత మాత్రమును లేదు. ఈ పరమ తాపసులుజితాత్ములు అపరాజితులు - కాన నింక నీవు రసాతల మేగుము. పూర్వమువలె నా యందు నిశ్చల భక్తి కల్గియుండుము. ఈ మునీశ్వరులతో నెన్నడును వైరము బూనకుము అని విష్ణువాజ్ఞాపింపగా ప్రహ్లాదుడు దనుజులను గూడి యరిగెను. 

నరనారాయణులును మరల నాత్మధ్యానమున నిమగ్నులైరి.

అధ్యాయము 72 దేవదానవుల యుద్ధము

Chapter 70 Prahlad's pilgrimage - అధ్యాయము 70 ప్రహ్లాదుని తీర్థయాత్రాసేవనము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 70

ప్రహ్లాదుని తీర్థయాత్రాసేవనము

ఈ ప్రకారముగ జనమేజయుడు ప్రశ్నింపగా సత్యవతీ సుతుడగు వ్యాస భగవాను డతనికి సవిస్తరముగ నంతయు తెలిపెను. ధర్మాత్ముడగు జనమేజయుడును తన తండ్రి చిత్తము దుర్వర్తనముతో కూడినదను విషయమును స్మరించి మిగుల నిర్వేదమును చెందెను. 

బ్రాహ్మణు నవమానించి యమపురి కేగిన తన తండ్రి నెట్టులైన నుద్ధరింపవలయునని రాజు తన మదిలో నిశ్చయించెను. పుత్త్రుడు తన తండ్రిని పున్నామ నరకము నుండి సముద్ధరించినచో నతని పుత్త్రనామము సార్థకమగును. పరీక్షిన్మహారాజు విప్రశాపముచే స్నానదానము లుజ్జగించి తన భవనములో నుండగా సర్ప మతనిని కాటువేసెను. తనతండ్రికట్లు గల్గిన దుర్గతి విని మహాభాగుడగు జనమేజయుడు భయవిహ్వలత్వమున మిక్కుటముగ నిర్విణ్ణుడయ్యెను. తన గృహమునకు ఏతెంచిన వ్యాసమునీశ్వరుని ఉదాత్తుడగు జనమేజయరాజు తనకు నరనారాయణుల పుణ్యగాధ నెఱిగింపు మని కోరెను. 

వ్యాసుడిట్లనెను : హిరణ్యకశిపుడు పరాక్రమశాలి. అతడు మరణించగ నతని రాజ్యమున కతని సుతుడు ప్రహ్లాదుడభిషిక్తుడయ్యెను. ఆ దానవపతి దేవబ్రాహ్మణ పూజా నిరతుడు. అతని పాలనమున రాజులు శ్రద్ధతో పెక్కు జన్నములొనర్చిరి. ఆ ప్రహ్లాదుని యేలుబడిలో నెల్ల బ్రాహ్మణులు తపోధర్మరతులు - తీర్థయాత్రా చరణశీలురు నైరి. వైశ్యులు నిజవృత్తి నిరతులైరి. శూద్రులు సేవా తత్పరులైరి. శ్రీ లక్ష్మీనృసింహస్వామి ప్రహ్లాదుని పాతాళమందుండ నియమించెను. అందుచే ప్రహ్లాదుడచ్చటనే యుండి ప్రజాపాలన తత్పరుడై రాజ్యమేలు చుండెను. ఒకప్పుడు భృగుపుత్రుడగు చ్యవన మహర్షి నర్మదలో స్నానము చేయుటకు వ్యాహృతీశ్వర తీర్థమున కరిగెను.

అతడు పుణ్యతీర్థమైన రేవానదిలోనికి దిగుచుండగనే యొక భయంకర విషసర్ప మతనిని గట్టిగ పట్టుకొనెను. అది తన్ను పాతాళమునకు గొనిపోవుచుండుట గని మునిసత్తముడు భయముతో దేవదేవుడగు విష్ణుని మనసార సంస్మరించెను. ఆ పుండరీకాక్షుని దివ్యనామ మొక్కమారు స్మరించినంతనే సర్ప విషము దిగిపోయెను. అందుచే నతడు రసాతలమున కేగియు నెంత మాత్రము దుఃఖ మొందకుండెను. ఇతడు గొప్ప ముని-తపస్వి- కునుక తన్ను శపించునేమో'యని భయపడి పాము మునిని వదిలిపెట్టెను. 

ఆ చ్యవన మహర్షి నాగకన్యలచేత బూజింపబడుచు నెల్లెడల స్వేచ్ఛగ దిరుగుచు నాగదానవుల సుందరపురము ప్రవేశించెను. అచ్చోట భృగుపుత్రుడగు చ్యవన మహర్షి తిరుగుచుండగా ధర్మవత్సలుడగు ప్రహ్లాదుడా మునిని గాంచెను. ఆ దానవరాజు మునిరాజు నుచిత రీతిగ సత్కరించి ఓ ద్విజసత్తమా! దానవ విద్వేషియైన యింద్రుడు నా రాజ్యపాలన గాంచి రమ్మని పంపెనా యేమి? నిజము పలుకుము' అని యతడు పాతాళమునకు వచ్చుటకు గల కారణమడిగెను. 

ఆ యింద్రునితో నా కేమి పని? అతడు నన్ను దూతగ పంపుటేమి? నేను నీ నగరమునకు వచ్చుటేమి? నేను ధర్మతత్పరుడను - స్వతంత్రుడను - భృగుమహర్షి పుత్త్రుడను. నన్ను మహేంద్రుడు పంపలేదు. మనమున నీ వీ సందేహము విడువుము. 

రాజా! నేను స్నానార్థమయి నర్మదానదిలో నొక పుణ్యతీర్థమున దిగితిని. ఇపుడు నన్నొక భీకర సర్పము పట్టుకొనెను. నేను సత్వరమే శ్రీహరినామ సంస్మరణ మొనరించితిని. ఆ సర్ప విషము దిగిపోయెను. అట్లు నేను హరినామ స్మరణ ప్రభావమున పాము బారినుండి విముక్తి బొందితిని.

ఇచటికి వచ్చిన తోడనే మీ దర్శనభాగ్యము లభించినది. దానవేంద్రా! నీవు విష్ణుని పరమభక్తుడవు. నన్ను నట్లే యెఱుంగుము అని చ్యవనుడు పలికెను. 

ప్రహ్లాదుడు ముని యమృతవాక్కు లాకర్ణించి తనకు వివిధ తీర్థ విశేషములు విస్తరించి తెలుపుమని కోరుచు పరమప్రీతితో మునితో నిట్లనెను: 

"మునీశా! ఆకాశము భూమి పాతాళము - వీనియం దేయే పుణ్యతీర్థములు గలవో వాని నెల్ల నాకు స్పష్టముగ తెలియబలుకుము అన 

చ్యవనర్షి యిట్లనెను: రాజేంద్రా! ఎవ్వని మనో వాక్కాయ కర్మములు విశుద్ధములుగ నుండునో వాని యడుగడుగున తీర్థమే యుండును. మలిన చిత్తులకు గంగయును కీకట ప్రదేశముకంటె చెడ్డది. మొదట మనస్సు పాపరహితము గావలయును. చిత్తశుద్ధి యేర్పడవలయును. అపుడతనికి సర్వ తీర్థములును పవిత్రములగును. 

దైత్యసత్తమా! పవిత్రమైన పుణ్యగంగాతటమునందు పెక్కు నగరములు గ్రామములు గొల్ల పల్లెలు గలవు. అట బోయపల్లెలును గలవు. వానియందు హూణవంగవ్లచ్ఛాది జాతుల వారు నివాసముందురు. ఆ బ్రహ్మ సమానమైన పావన గంగాజలమందు పుణ్యాత్ములు త్రికాలముంలందును క్రుంకులిడుచు జలములు క్రోలుచు స్వేచ్ఛగనుందురు. 

కాని, వారి యందొక్కడును విశుద్ధాత్ముడు గానరాడు. ఇంక విషయోపభోగ చిత్తులకు తీర్థఫలమెట్లు గల్గును? ఇంతకును మనస్సు కారణము - ఇతర మేదియు గాదని యెఱుగుము. శుచిత్వము గోరువాడు తొలుత తన మనస్సును శుద్ధ మొనర్చుకొనవలమును. తీర్థవాసి యితరులను వంచించినచో నతడు మహాపాపి యగును. ఆ తీర్థములందొనరించని కొలది పాప మనంతగుణముల పెరుగును. ఇంద్రవారుణ మను పండు పండినను తీయగ నుండదు. అట్లే చిత్తశుద్ధి లేనివాడు కోటిమారులు తీర్థ మాడినను పవిత్రుడు గాజాలడు.

శుభము గోరువాడు మొదట చిత్తశుద్ధిని బడయవలయును. హృదయశుద్ధిచే ద్రవ్యశుద్ధి యగును. అంతేకాని వేరు విధమున గాదు. ద్రవ్యశుద్ధికి తరువాత నాచారశుద్ధి దాని తరువాత తీర్థశుద్ధి జరుగును. శుద్ధిలేనిచో నంతయు క్షణమాత్రమున వ్యర్థమగును. తీర్థ మేగినవాడు నీచజాతులతో సాంగత్యము చేయరాదు. అతడు స్థిరబుద్ధితో సత్కర్మములతో భూతదయ నెఱపవలయును. దివ్యతీర్థ కథలు చెప్పుమంటివి. వచింతును, ఆలకింపుము. 

రాజేంద్రా! మొట్టమొదట పుణ్యప్రదమైన తీర్థము నైమిషము. తరువాతిది చక్రతీర్థము. ఆ తరువాత పుష్కరతీర్థము ప్రశస్తము. ఈ భూమండలమందుగల పుణ్యతీర్థము లెన్నతరముగాదు. ఇంకను పావన తీర్థరాజము లెన్నియో కలవు, అను ముని మాటలు విని ప్రహ్లాదుడు నైమిషమున కేగ సిద్ధపడెను. అతడు సంతుష్టచిత్తుడై యితర దానవుల నిట్లు ప్రేరించెను. 

ఓ మహాత్ములారా! లెండు. మనము నైమిషమున కేగుదము. అచట పీతాంబరుడు పండరీకాక్షుడు నైన యచ్యుతుని సందర్శింతము'' అని యిట్లు ప్రహ్లాదుడు వచింపగా దనుజులెల్లరును లేచి సిద్ధపడిరి. వారెల్లరును పరమప్రీతితో ప్రహ్లాదునిగూడి పాతాళమునుండి వెడలిరి. అట్లు బలశాలురగు దైత్యదానవులెల్లరును గుమిగూడి ప్రమోదముతో నైమిశారణ్యము చేరి యచటి తీర్థమున తానములాడిరి. 

ప్రహ్లాదుడు నెల్ల దైత్యులంగూడి తీర్థము లెల్ల తిరిగెను. ఆ మహాత్ముడగు ప్రహ్లాదుడు విమలజలములతో పుణ్యప్రదమైన సరస్వతీ తీర్థమునందలి పావనజలములను గాంచెను. అతడందు మునిగినంతనే యతని చిత్తము సుప్రసన్నమయ్యెను. అతడా పరమపావన తీర్థమునందు సవిధిగ స్నానదానాదులొనర్చెను. ఇట్లు ప్రహ్లాదుడు పరమపావన తీర్థమున శుద్ధాత్ముడై పెక్కు శుభకర్మములాచరించెను. అని శ్రీ వ్యాసముని జనమేజయునితో వచించెను.

అధ్యాయము 71 నరనారాయణులు ప్రహ్లాదునితో పోరుట

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...