Wednesday, April 8, 2026

Autumn Description - శరదృతు వర్ణనము

శరదృతు వర్ణనము

ఆ శరత్కాలంలో అడవులన్నీ గుబురులు గుబురులుగా పెరిగాయి. బురదలు ఎండిపోయాయి. నెమళ్లగుంపుల కేకలు ఆగిపోయాయి. ఉరుముల మెరుపుల అలజడలు ఆగిపోయాయి.

ఆ శరత్కాలంలో బ్రతుకుతెరువులు విడిచి, ఆత్మజ్ఞాన సిద్ధిచేత జీవన్ముక్తులయి యథేచ్చగా దేశాటనం చేసే యోగీశ్వరులవలె, మేఘాలు నీటిని జారవిడిచినందువల్ల మునుపటినలుపు విరిగి తెల్లబడి, గాలితాకిడికి చెల్లాచెదరై పోతున్నాయి. మేఘావరణం తొలగిపోవడంచేత అగస్త్యనక్షత్రంతో కూడిన ఆకాశం ఆత్మజ్ఞానం అనే దీపంతో ప్రకాశించే యోగీశ్వరుని హృదయంవలె చక్కగా ప్రకాశిస్తోంది. ఆకాశంలో ఉదయించిన నక్షత్రాలు నల్లనిమేలుకట్టుకు (చాందినీ) కూర్చికుట్టిన ముత్యాలవలె ప్రకాశిస్తున్నాయి. ఆ నక్షత్రాలకాంతుల్ని మించి ప్రకాశిస్తూ, బ్రహ్మాండమనే పెట్టెలో పేర్చిన కర్పూరపు పలుకుల్లాగ చంద్రకిరణాలు చెలువారుతున్నాయి. వెన్నెల సోకి నిండుగా పండిన పైరుల వెన్నులు పొట్టలు విచ్చి, పంట బరువుకి, చప్పుడు చేస్తూ వీచే పైరగాలి తాకిడికి, నేలమీదకు ఒరగిపోయాయి. అప్పుడు అవి తమను కోయబోయే రైతుల కరకు కొడవళ్ల పదును తలచి భయపడి, తమను రక్షించమని మొరపెట్టుకుంటూ తమ తల్లి అయిన భూదేవికి ప్రణామం చేస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. చిలుకలు ఓపినన్ని పైరుల వెన్నులను సంకోచం లేకుండ ముక్కులతో త్రుంచి నోటితో కరచి పెట్టుకొని, గూళ్లకు చేరి తమ పెంటులతోను, పిల్లలతోను కలిసి కడుపార మెక్కి చొక్కి పొగరెక్కి పంటచేలలోని ఎత్తైన మంచెలమీద వ్రాలుతున్నాయి. ఆ మంచెలమీదనుండి పైరులను కాచే కాపుపడుచుల కెమ్మోవులను చూచి అవి ఆరబండిన దొండపండ్లు అనుకొని కొరికాయి. వారు హఠాత్తుగా చేతిచరుపులతో ఎగురగొట్టగా కిలకిల చప్పుళ్లు చేస్తూ ఎగిరిపోయాయి. తేటనీటితో నిండిన సరస్సులలో కలహంసలు, చక్రవాకాలు, బెగ్గురుపక్షులు కలకలధ్వనులు చేస్తూ సంచరిస్తున్నాయి. తరిగిపోయే తమ ఆయుస్సును పట్టించుకోకుండగా భార్యాపిల్లలమీది వ్యామోహంతో సంచరించే మనుష్యులవలె ఇంకిపోయే నీటిని గుర్తించకుండ సరస్సులలో చేపలు మొదలయిన జలచరాలు సంచరిస్తున్నాయి. జలచరాలకు భయం కలిగిస్తూ నదులలోని నీరు ఎండిపోతోంది. ఆ నదులలో వేరు వేరు ఆకృతులుగా మేట వేసిన ఇసుకతిన్నెలు కర్పూరమండపాలవలె, మణులు పొదిగిన నేలలవలె, మేడమెట్ల మాదిరి కనబడుతున్నాయి. ఆ ఇసుక తిన్నెలమీద ఉదయసమయంలో మునులు స్పానసంధ్యావందనాది నిత్యకర్మానుష్ఠానంలో నిమగ్నులయ్యారు. అక్కడి తపోవనాలలోని గున్నమామిడిచెట్లపాదులలో మునికన్యకలు తమ చేతులతో బిందెలతో నీళ్లు మోసికొని వచ్చి పోస్తున్నారు. ఆ వనంలో సూర్యకిరణాలు గాని, గాలికెరటాలు కాని ప్రవేశించడానికి వీలుకానంత దట్టంగా మద్దిచెట్లు, అడవిమొల్లలు అల్లిబిల్లిగా అల్లుకుపోయాయి. అడవిలోని చెట్ల చివరలనుండెడి లేతఆకులను అలములను మేసిన అడవియేనుగులు పొగరెక్కి దంతాగ్రాలతో ఏటిగట్లు పెల్లగించి కోరాడుతున్నాయి. అచటి చెంచెతల సన్ననినడుములు - ఏనుగుల కుంభస్థలాలవలె, బంగారుకుండలవలె బరువైన వారి స్తనాలను భరించడం ఎలాగ అనే భయంతో వణుకుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. చెంచితలకరకుటమ్ములు గుచ్చుకొనడంచేత సత్తువ చెడి కాళ్లు తడబడుతూ ఉండగా అడవిపందులు పెద్దపులులు పెద్ద పెద్ద గోతులలో పడిపోతున్నాయి. తామరలు కలువలు గోరంటలు మొదలైన పూవులలోని తేనెలు త్రాగి మత్తెక్కి సొక్కిన తుమ్మెదల గుంపులు జుంజుమ్మని రొద చేశాయి. కామంతో మదించిన మగజింకలు, ఆబోతులు తమ తమ మందల్ని విడిచిపెట్టి, వెదకి వెదకి ఎదకువచ్చిన ఆడలేళ్లను, ఆవుల్ని మన్మథతాపంతో దాటి చూలు కట్టిస్తున్నాయి. ఆ శరదృతువు కుందం, పద్మం అనే నిధులతో నిండిన కుబేరునిగృహంలాగ మొల్లలు, తామరలతో చూడ చక్కనిదయింది. శివశబ్దం వినడానికి నోచుకోని భాగ్యహీనుని చెవిలాగ నెమళ్లకేకలు లేనిదయింది (వర్షాకాలంలో మదించిన నెమళ్లుకేకలు పెడతాయి. శరత్కాలంలో వానిమదంతోబాటు కేకలు తగ్గుతాయి. వ్యాకరణశాస్త్రవేత్త హృదయంవలె సమస్త ప్రపంచము తేటతెల్లం అయినందువల్ల ఒప్పిదమయ్యింది (వర్షాకాలంలో కారుమబ్బులు కమ్ముకొని ఉండడంవల్ల భూమిమీద వస్తువులన్నీ తమ సహజకాంతుల్ని పూర్తిగా ప్రసరింపజేయలేవు. వర్షాకాలం గడచి మబ్బులు మాయమవడంవల్ల ప్రపంచంలోని వస్తువులన్నీ తమ తమ సహజగుణంతో ప్రకాశిస్తున్నాయి. అలా ప్రకాశింపజేసింది శరదృతువు). వింటితో విజృంభించిన రాముని యుద్ధంలాగ నల్లగోరింట వేగిసచెట్లతో వెలసింది. పాపచింతలేని యముని హృదయంలాగ బురద లేనిదయ్యింది. మహాపుణ్యం చేసినందువల్ల సత్యలోకం చేరిన మహారాజులతో కూడిన బ్రహ్మదేవుని సభామందిరంలాగ రాజహంసలతో విరాజిల్లింది. పాపసంపర్కం లేని ఉత్తమపురుషుని ప్రవర్తనలాగ బురదలేని నీటితో అలరారింది. కొండలనుండి పుట్టే నదులు వచ్చి చేరడంవల్ల సందడించే సముద్రంలాగ దండయాత్రలకు బయలుదేరే రాజుల చతురంగ బలాల కోలాహలంతో కూడిందయ్యింది. ఉత్తమురాలయిన ఇల్లాలి స్తనములు కనబడనట్లు మబ్బులు కనబడనిదయింది. ఆ శరదృతువు భూమండలానికి భూషణం అయింది. ఆ తర్వాత

ఓ పరీక్షిన్మహారాజా! శరదృతువు రాగానే రాజులందరు దిగ్విజయయాత్రకు బయలుదేరబోతూ తమ తమ వాహనాలకు హారతు లెత్తుతున్నారు. విజయయాత్రలు సాగిస్తున్నారు. లక్ష్మీపూజలు, దేవతలకు ఉత్సవములను జరిపిస్తున్నారు.

(దండయాత్రకు బయలు దేరేటప్పుడు గుఱ్ఱాలు మొదలయిన వాహనాలకు హారతులిస్తారు. ఆ సమయంలో జ్వాలలు ప్రదక్షిణక్రమంగా వెలిగాయంటే దాన్ని శుభసూచనగా భావిస్తారు.)

మన్మథుడు చేవగల తన చెఱకువింటియందు నల్లకలువ అనే తన అమ్మును సంధించి వియోగంతో ప్రజలను వడిగా బాధించసాగినాడు.

(మన్మథునికి ఉన్న అయిదు పుష్పబాణాలలో నల్లకలువ ఒకటి. మిగిలిన నాలుగు అరవిందం, అశోకం, చూతం (మామిడిపూవు), నవమల్లిక.)

ఈ విధంగా ఆ శరత్కాలపు రోజులలో శ్రీకృష్ణుడు బృందావనంలో చక్కగా ఆలమందలను మేపుతూ

చక్కగా నటించే నేర్పుగల ఆ శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవి చేతబట్టి స,రి,గ,మ,ప,ద,ని అనే సప్తస్వరాలు చక్కగా వ్యక్తమయ్యే విధంగా వేదసంబంధమయిన గంధర్వగీతం ఆలపించాడు. సిగలో నెమలిపించెం, మెడలో పూలదండ అందంగా అలరిస్తున్నాయి. చెవులలోని కొండగోగుపూలరంగు చెక్కిళ్లమీద అంతట వ్యాపించి వానిశోభను ఇనుమడింపజేసింది. కనుబొమ్మల సొబగుతో ఎడమవైపునకు వంచబడిన మొగం లోకానికి మైమరపు కలిగిస్తోంది. సుకుమారమైన కుడిచేతివ్రేళ్లు పిల్లనగ్రోవిరంధ్రములమీద నటిస్తూ సప్తస్వరాలకు ధ్వనిరహస్యాలు నేర్పుతున్నాయి. ఎడమకాలిమీద అడ్డంగా చాచి ఉంచిన కుడికాలిగోళ్ల కాంతి నేలమీద అంతటా వ్యాపించింది.

ఈ విధంగా శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవి ఊదాడు. కామోద్దీపకమైన ఆ పాట విన్న గోపికలు సిగ్గులు విడిచిపెట్టెశారు. వలపులు ఊరడంచేత సహనం కోల్పోయారు. తమ చెలికత్తెలతో కలిసి, అయిదుగురు, పదిమంది చొప్పున గుంపులు గుంపులుగా చేరి ముద్దుముచ్చట్లలో

ఓ చెలీ! శ్రీకృష్ణుడు చెవిలో కొండగోగుపువ్వును ధరించాడు. పసిడివన్ని బట్ట కట్టాడు. సిగలో నెమిలి పింఛం తురుముకున్నాడు. మెడలో తామరపూలదండ ధరించాడు. వేణువు నూదుతూ అడవిలో ఆవులవెంట తిరిగే శ్రీకృష్ణుణ్ణి చూచావా! ఎంత చక్కగా ఉన్నాడో!

ఓ సుందరీ! ఇటురా! చెలీ! నే చెప్పేది శ్రద్ధగా విను. శ్రీకృష్ణుడు బృందావనంలో విహరిస్తూ, ఎడమవైపునకు వంచిన ముఖంతో కనుబొమలు కదిలిస్తూ, వేణువుమీద వేళ్ల స్వరవిన్యాసాలు నెరపుతూ, ఆరితేరిన నటుని లాగ షడ్జస్వరప్రధానంగా గాంధర్వగీతాన్ని ఆలపిస్తున్నాడు.

ఓ చెలీ! శ్రీకృష్ణుని తీయని వేణుగానం చెవులలో బడిన వెంటనే నా మనస్సు వశం తప్పింది. ఇంక భయం ఎందుకు? దీన్ని గురించి ఆలోచించవే.

నా తోడ రావడానికి భయపడ వద్దు. నీ తోటివారు నిన్ను మెచ్చుకొనే విధంగా నిన్ను తీసికొని పోయి, శ్రీకృష్ణునితో మాటాడిస్తాను. నీమీద ఒట్టు సుమా!

ఈ విధంగా గొల్లపడుచులు తమలో తాము చెప్పుకొంటూ, మాటి మాటికీ శ్రీకృష్ణుణ్ణి తమ మనస్సులోనే కౌగిలించుకొంటూ, బలరామ కృష్ణుల గురించి

ఓ చెలులారా! ఈ బలరామకృష్ణులు మామిడిచిగుళ్లు, నల్లకలువలు, నెమలిపింఛాలు, తామరపూలు దండలుగా చేసుకొని ధరించారు. మంచిబట్టలు కట్టుకొన్నారు. వేణువులు ఊదుతూ, అనేకవేషాలు వేస్తూ వినోదం కలిగిస్తూ సంతోషంతో బహువిధాలైన నాట్యాలు చేస్తున్నారు. చూడండి.

ఓ సుందరులారా! చక్కగా వినండి! వీరిని వర్ణించడానికి వందమాటలు పలకడం ఎందుకు? కళ్లున్నందుకు ఈ బలరామకృష్ణుల్ని చూడడమే ప్రయోజనం.

ఈ విధంగా మాటాడుకొన్నారు. వారిలో కొందరు శ్రీకృష్ణుణ్ణి గురించి

ఓ చెలియా! ఈ పిల్లనగ్రోవి అద్భష్టం ఎంతటిదో కదా! గోపికలకు కొంచెంకూడ మిగుల్చకుండ శ్రీకృష్ణుని అధరామృతం అంతా తనొక్కతే త్రాగేసోంది. చక్కగా మ్రోగుతోంది. తన పర్వాలను నేత్రపర్వంగా చూచుకొంటూ మిడిసిపడుతోంది. ఇది పూర్వం ఎంత తపస్సు చేసిందో కదా!

ఓ చెలీ! ఈ వేణువు పూర్వం ఏ నదీజల బిందువులవల్ల పెరిగి ఇంతటి మహాభాగ్యాన్ని పొందిందో కదా! కాని ఆ నదికి కలిగే సంతోషాన్ని వర్ణించగలమా? ఆ నది మంచి కొడుకును గన్న తల్లిలాగ తనలో విహరించే హంసల కల కల ధ్వనులే పాటగా, తన కెరటాల కదలికలే హస్తాభినయంగా నాట్యం చెయ్యదా! తప్పక చేస్తుంది.

తమ కులంలో పుట్టిన గొప్ప విష్ణుభక్తుణ్ణి చూచి, ఆ కులంలోని వారంతా సంతోషంతో ఆనందబాష్పాలు రాల్చెవిధంగా, శ్రీకృష్ణునిచేతిలోని వేణువు యొక్క రమణీయ రవళిని విని సంతోషించిన చెట్లు మకరందాన్ని వర్షిస్తున్నాయి.

అయ్యో! నేనెంత మోసపోయానో గదే! సఖీ! నేను పూర్వజన్మంలో నోములు నోచేటప్పుడు రాబోయేజన్మలో భూలోకంలో యమునానది ఒడ్డున వెదురుగా పుట్టాలని కోరుకున్నా బాగుండేది. అలా కోరుకొని ఉంటే నాకు శ్రీకృష్ణుని మోవితేనె దక్కేది కదా!

ఓ చెలీ! యమునాతీరంలో శ్రీకృష్ణుని అధరసుధను పానం చేసే వెదురుగా పుట్టాలంటే ఏమి నోము నోచాలో నాకు చెప్పు.

శ్రీకృష్ణుణి చూచి నల్లనిమేఘం అనీ, వేణురవం విని అది ఉరము చప్పుడు అనీ సంతోషంతో కేకలు వేస్తూ నెమళ్ల గుంపులు నాట్యం చేస్తున్నాయి చూచావా?

ఓ సఖీ! కొండలలో తిరిగే దేవ గంధర్వాది జాతులకు చెందిన దంపతులు శ్రీకృష్ణుని పాదముద్రలచే పవిత్రీకరింపబడి అందంగా కనిపించే బృందావనాన్ని అమరావతికంటె గొప్పదిగా భావిస్తూ చూస్తూ ఉండిపోతున్నారు.

ఓ సఖీ! అటు చూడు. దేవతాశ్రేష్ఠుల భార్యలు విమానాలమీద ఆకాశంలో విహరిస్తూ వెడుతూ మంగళకరమైన శ్రీకృష్ణునిరూపం చూశారు. ఆతని మురళీగానం మరీమరీ విన్నారు. అంతే! మన్మథావేశానికి లోనయి కోకముడులు వీడి పోతుండగా భర్తలకౌగిళ్లలో వాలిపోయారు.

ఓ సఖీ! ఈ అడవిలోని మృగాలజంటలు రసవంతమయిన శ్రీకృష్ణునివేణుగానాన్ని వింటున్నాయి. ఆ పాటలో స్వారస్యం గుర్తించే వివేకం వాటికి లేదు. అయినప్పటికీ పరవశించిపోయి, ఒళ్లుమరచి, మేతలు విడిచి, తిన్ననయిన చూపులతో శ్రీకృష్ణుణ్ణి అభినందిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. గమనించు.

చెలులారా! లేగలు తల్లులపాలు త్రాగే సమయంలో, తమ చెవులలో తమకు ఇష్టమయిన శ్రీకృష్ణుని మురళీరవం అనే అమృతధార ప్రవేశించింది. అంతే, పరవశించిపోయి అవి, త్రుళ్లిపాటు విడిచిపెట్టి, పాలు త్రాగడం మాని, పొదుగులు కుమ్మకుండా చూపులు కృష్ణునిమీద లగ్నం చేసి నిలబడిపోయాయి. చూశారా!

తామరపూలవంటి కన్నులుగల ఓ చెలీ! ఆవులు మమకారంతో శ్రీకృష్ణునిరూపం మనస్సులో నిల్పుకొని, శ్రీకృష్ణుని మురళీగానామృతాన్ని ఆస్వాదిస్తూ మైమరచిపోయి, మోరలు చాచి, మేతలు మాని, ఆనందబాష్పాలు రాలుస్తూ బొమ్మలవలె నిలబడి పోయాయి. అదిగో చూశావా?

ఓ సఖీ! ఈ పక్షులు చెట్లకొమ్మలమీద కూర్చుండి, శ్రీకృష్ణునిమురళీగానామృతాన్ని చెవులారా ఆస్వాదిస్తూ, కళ్లు మూసుకొని పరవశించిపోతున్నాయి. ఆ కనులమూతలు తమ మనస్సులో లగ్నమైన శ్రీకృష్ణునిదివ్యసుందరరూపం బయటికి పోకుండగా బంధించి యోగీశ్వరులవలె బ్రహ్మానందం అనుభవిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. చూశావా?

ఓ యువతీ! నదులన్నీ శ్రీకృష్ణుని వేణురవం విని, మన్మథవేదనకు లోనయ్యాయి. తమలోని సుడిగుండాలు మన్మథ బాణాల తాకిడివల్ల కలిగిన గాయాలా అన్నట్లుగా ఉన్నాయి. ఆ వేదననుండి బయటపడడానికి హంసలకలధ్వనులనే మిషతో శ్రీ కృష్ణుణ్ణి ఆహ్వానిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. అలలనే చేతులతో శ్రీ కృష్ణుణ్ణి దగ్గరకు లాగికొని తామరపూల సమర్పణలతో శ్రీకృష్ణునిపాదాలు పూజిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. చూశావా

రమణీ! నేడు శ్రీకృష్ణుని మురళీగానం విని మేఘం పూలవాన కురిపించింది. దానితో తెల్లబడి తన శరీరాన్నంతటినీ వెల్లగొడుగుగా మార్చి, శ్రీకృష్ణునికి ఎండ తగులకుండా నీడ కల్పించింది. చూశావా.

ఓ చెలీ! ఆ చెంచితలను చూడు. వారు నెమలియీకలు, చెట్లఆకులు కోకలుగా కట్టుకున్నారు. బాగా మాగిన పండ్లు తెచ్చి శ్రీకృష్ణుని చేతుల నిండా నింపి, ఆపైన ఆతనిచేతులు పట్టుకొని ఆనందంతో ఆడుతున్నారు.

ఓ సఖీ! అటు చూడు. ఒక ఆటవిక స్త్రీ బరువయిన తన పాలిండ్లను మోయలేక, నడుము జవజవలాడుతూ తొట్రుపాటుతో వచ్చి, ఒక చక్కని పూలదండను శ్రీకృష్ణునికి సమర్పిస్తోంది.

ఓ ముద్దలారా! శ్రీకృష్ణుని మురళీనాదామృతం సోకగానే కొండలన్నీ కరిగి నీరయ్యాయి. చెట్లన్నీ చిగురించాయి. దేవతలు మానవులు అందరు పరవశించిపోయారు. చూశావా?

ఓ పద్మముఖీ! ఎదురుగా ఉన్న ఈ కొండను చూడు. బలరామకృష్ణుల పాదన్యాసములచేత తనను ధన్యమైన దాన్ని భావించుకొంటోంది. పండ్లు పువ్వులు అనే కానుకలు వారికి సమర్పిస్తోంది. సంతోషంతో మిన్ను ముట్టుతోంది. నీటిని, గద్దిని సమృద్ధిగా కలిగించి ఆవులకు ఆప్యాయనం కలిగిస్తోంది. చక్కనైన చెట్లు అనే పులకాంకురాలతో అందగిస్తోంది.

ఈ విధంగా గొల్లపడుచులు బృందావనంలో విహరిస్తూ ఉన్న శ్రీకృష్ణుణ్ణి చూచి, కామవికారానికి లోనయి ఏకాంత ప్రదేశాలలో అతణ్ణే ధ్యానం చేస్తూ ఉండిపోయారు.

హేమంత ఋతువర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

No comments:

Post a Comment

Definition of nature - ప్రకృతి నిర్వచనం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము -  ప్రకృతి నిర్వచనం వత్సా ! నారదా ! ప్రకృతి లక్షణాన్ని వివరించి చెప్పగల సామర్థ్యం ఎవరికైనా ఉందని నేను అనుకోను. ...