Thursday, December 26, 2024

తిరుప్పావై - పన్నెండవ పాశురము

తిరుప్పావై - పన్నెండవ పాశురము

శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
జై శ్రీమన్నారాయణ


నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః


ప్రియ భగవత్ బంధువులారా!

తిరుప్పావై వ్రతాన్ని ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు 11 పాశురాలని అనుసంధానం చేసి 12వ రోజుకు చేరుకున్నాం. ఈరోజు నిద్రలేపబోతున్న గోపిక ఏడో గోపిక. ఇప్పటివరకు ఆరుగురు గోపికల్ని నిద్ర మేల్కొలిపి గోదాదేవితో సహా అందరు గోపికలూ కలిసి ఏడవ గోపిక ఇంటికి చేరుకున్నారు. ఈ గోపిక కూడా మంచి వంశంలో జన్మించింది. వీళ్ల వంశానికి మంచి చరిత్ర ఉంది. ఈ గోపికకి ఒక అన్నయ్య ఉన్నాడు., అతని పేరు శ్రీదాముడు. సుదాముడు కాదండి, సుదాముడు అంటే కుచేలుడు. కానీ ఇతని పేరు శ్రీదాముడు. ఈ గోపాలుడు శ్రీకృష్ణుడికి బాగా పరిచయం, ఇతను ఎప్పుడూ కూడా శ్రీకృష్ణునితోనే తిరుగుతూ ఎప్పుడూ శ్రీకృష్ణుని వదలకుండా ఉంటాడు. అప్పుడు తను పనికి వెళ్ళడం మానేశాడు. ఇంతకి తను చేసి పని ఏమిటి? రోజు ఉదయాన్నే పశువుల్ని మేతకు తీసుకెళ్లి, అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత, పాలు పితకాలి, తోడు పెట్టాలి, పెరుగు చిలకాలి, వెన్న తియ్యాలి, నెయ్యి కాచాలి ఇవన్నీ గొల్ల వాళ్ల యొక్క స్వధర్మాలు. ఎవరు చేయవలసిన ధర్మము వాళ్ళు ఆచరించాలి. ఎవరి పని వారు చేయాలి. వృత్తి ధర్మం మానకూడదు. పూజారి భగవదారాధన చేయాలి. బ్రాహ్మడు సంధ్యావందనం చేయాలి. వైశ్యుడు వ్యాపారం చేయాలి. కుమ్మరి కుండలు చేయాలి. వైశ్యుడికి కుండలు చేసే నైపుణ్యం ఉండదు. కుమ్మరికి వ్యాపారం చేసే అనుభవం ఉండదు. ఎవరి వృత్తిని వారు తప్పనిసరిగా చేయాలి. పుడుతూనే ఎవరూ కూడా కులంతో పుట్టలేదు. వృత్తిని బట్టి కులాన్ని నిర్ణయించారు పెద్దలు. మరి గోపాలుడిది గోసంరక్షణ. అదే అతని పని కదా! గోపాలకులందరి పని అదే కదా! కానీ ఈ శ్రీదాముడు తన పనిని మరిచిపోయి, పట్టించుకోకుండా ఎప్పుడూ శ్రీకృష్ణునితో తిరగడం, బృందావనంలో ఆడుకోవడం, యమునా నదిలో ఈత కొట్టడం, ఆ నది ఒడ్డున ఉన్న చెట్లు ఎక్కడం, బిళ్లా కర్ర ఆడడం. ఇదే రోజు పని అయిపోయింది. కానీ ఇక్కడ గోపాలుడిది అధర్మం కాదు. ఎందుకంటే అతను నిత్యం, నిరంతరం భగవంతుని సేవలోనే ఉన్నాడు. నంద వ్రజంలో గోపాలకులు అందరూ ఇంచుమించు అలాగే తయారయ్యారట.

ఎవరైతే వారు చేయవలసిన కర్మలను చేయకుండా తప్పించుకొని తిరుగుతారో అలాంటి వాళ్ల గురించే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మీకు అందరికీ తెలిసిన శ్లోకమే. 18 వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం లో 5 వ శ్లోకం

యజ్ఞ దాన తపః కర్మ
న త్యాజ్యం కార్యమేవ తత్
యజ్ఞో దానం తపశ్చైవ
పావనాని మనీషినామ్

అంటే..

యజ్ఞము, దానము, తపస్సు లాంటి కర్మలను వదలకూడదు. అవి తప్పకుండా ఆచరించి తీరవలసినవే. యజ్ఞము, దానము, తపస్సుమనసులోని మాలిన్యాన్ని తొలగిస్తాయి. మనుషులకి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి వల్ల ఆత్మ జ్ఞానం కలుగుతుంది. ఆత్మ జ్ఞానమే మోక్షానికి మార్గము. అందుచేత బుద్ధిమంతులు, విజ్ఞులు ఎప్పుడూ కూడా కర్మలను వదలకూడదు. అని శ్రీ కృష్ణపరమాత్మే స్వయంగా భగవద్గీతలో చెప్పాడు.ఈరోజు గోపాలుడు శ్రీదాముడు తన స్వధర్మాన్ని వదిలి శ్రీకృష్ణుడితో సంబంధాన్ని పెంచుకున్నాడు. లక్ష్మణుడు శ్రీరామున్ని ఎలాగైతే వదిలి వుండలేదో అలాగే ఈ గోపిక అన్నయ్య శ్రీదాముడు కూడా శ్రీకృష్ణ పరమాత్మని వదిలి ఉండలేక పోతున్నాడు. ఎవరైనా భగవంతునితో బంధాన్ని పెంచుకున్నప్పుడు, భగవత్ కైంకర్యమొనర్చి నప్పుడు, తనకు వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించడానికి అవకాశం లేక మానివేసినప్పటికీ అతనికి ఏ దోషం అంటదు.

శ్రీదాముడు ఆ విధంగా ఉంటే, ఇక్కడేమో ఇంటి దగ్గర ఉదయమే పాలు పితికే వారు లేరు. కట్టిన దూడలను విప్పేవారు లేరు. ఇలా ఎవరూ లేకపోవడం చేత ఆవులూ, గేదెలూ వాటి యొక్క లేగదూడలను తలచుకుంటున్నందువలన.. పొదుగులు బరువెక్కి.. పాలు వాటంతట అవే నేలమీద క్రిందనే స్రవించేయట. పెద్ద ధారలాగ క్రిందని ఒలిగిపోయేవట, కారిపోయేవట. ఈ అన్నయ్య పట్టించుకునేవాడు కాదు. భక్తుడు. అలాంటి మహా భక్తుడైన శ్రీ కృష్ణుని స్నేహితుడైన అన్నకి చెల్లెలైన గోపికని నిద్ర నుంచి లేపడానికి గోపికలందరూ కలిసి వచ్చేరు.

ఇప్పుడు పాశురం చూద్దాం.

కన్నెత్తిళం కత్తెరుమై క్కన్రుక్ కిరంగి
నినైత్తు ములై వళియే నిన్ఱు పాల్ శోర
ననైత్తిల్లం శేరాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీళ నిన్ వాశల్ కడైపట్రి
శినత్తినాల్ తెన్ని లంగై క్కోమానై శెట్ర
మనత్తుక్కు ఇనియానై పాడవుం నీ వాయ్ తిరవాయ్
ఇనిత్తాన్ ఎళుందిరాయ్! ఈదెన్న పేరురక్కమ్!
అనైత్తు ఇల్లత్తారుమ్ అరిన్దు ఏలోర్ ఎంబావాయ్ || 12 || 

ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థం చూద్దాం

కన్నెత్తు ఇళంకత్తెరుమై క్కన్రుక్కు ఇరంగి

ఉదయమే ఆవులకు పాలు పితికే వాళ్ళు లేరట. ఆవు దగ్గరికి దూడలను వదిలేవాళ్లు కూడా లేరట. లేగ దూడలు ఆ తల్లి కోసం, తల్లేమో తన దూడ కోసం అరుస్తున్నాయిట. పాలు చేపడం వల్ల పొదుగులు బరువుగా అయిపోయాయట.

నినైత్తు ములై వళియే నిన్ఱు పాల్ శోర

పొదుగులు బరువుగా అయిపోవడం వల్ల అవి దూడలను తలుచుకుంటూ అరుస్తూ పాలని ధారగా కురిపిస్తున్నాయట.

ననైత్తు ఇల్లం శేరాక్కుం నర్చెల్వన్ తంగాయ్

అలా పాలన్నీ దారగా కారడం వల్ల ఇల్లంతా చిత్తడి అయిపోయిందిట. అంటే పాలతో బురద బురద అయిపోయిందట ఇల్లంతా, ఆ వాకిలంతా పాలేనట. చూడండి ఆ పాల సంపద ఎంతుందో!

పనిత్తలై వీళ నిన్ వాశల్ కడైపట్రి

అలాంటి పాడి సంపద కలిగిన ఐశ్వర్య వంతుడైన అన్నకి తోడబుట్టిన దానా! ఓ ముద్దుల చెల్లెలా!

శినత్తినాల్ తెన్ని లంగై క్కోమానై శెట్ర

మా తల మీద మంచు పడి అది కరిగి మా వళ్లంతా కారి పోతుంది. అయినా అంత చలిలో కూడా మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాం.

మనత్తుక్కు ఇనియానై పాడవుం నీ వాయ్ తిరవాయ్

ఒకనాడు లంకాధిపతి అయిన రావణాసురుడుని రాముడు కోపంతో సంహరించాడు. అలాంటి రాముడు నామాన్ని, ఆ శ్రీరామచంద్రుడు నామాన్ని మేము కీర్తిస్తున్నాం.

ఇనిత్తాన్ ఎళుందిరాయ్! ఈ తెన్న పేరురక్కమ్

అనైత్తు ఇల్లత్తారుమ్ అరిన్దు ఏలోర్ ఎంబావాయ్

అయినా నువ్వు నోరు మెదపడం లేదు. ఇంత మొద్దు నిద్రేవిటమ్మా! చూడు అందరూ నిన్నే చూస్తున్నారు. లే ఇంక లేచిరా! గేదెలు దూడల కోసం అరుస్తున్నాయి. ఆవుల కంటే కూడా గేదెలకు తమ దూడల మీద అభిమానం ఎక్కువ ఉంటుందట. ప్రేమ ఎక్కువగా ఉంటుంది. లేగ దూడలకి ఏమాత్రం కష్టం కలిగినా అవి సహించలేవట. లేగ దూడకి తమను తాము పోషించుకునే శక్తి ఉండదు. ఆవులు, గేదెలు ఆచార్యులు, గురువులు... వారికి భగవదనుగ్రహం పుష్కలంగా, సంపూర్ణంగా ఉంటుంది. పాలు ఎలాగైతే సమృద్ధిగా ఉన్నాయో అలాగే. దూడని దూరంగా ఉంచి తాడుతో కట్టేస్తారు. ఆ దూడ తనంతతానుగా తల్లి దగ్గరకు రాలేదు. దాన్ని ఎవరో విడిపించాలి. విడిపిస్తే గాని తల్లి దగ్గర పాలు తాగలేవు. అలాగే మనం కూడా సంసార బంధం అనే తాడుతో కట్టపడ్డాం. మనల్ని ఈ బంధాల నుంచి విడిపిస్తారు గురువులు. అప్పుడు దూడ తల్లి దగ్గరికి వెళ్లి పాలు తాగినట్లు మనం భగవంతునికి చేరువై మోక్షాన్ని పొందుతాం. ఇక్కడ లంకకు రాజు అయిన రావణాసురుని చంపిన శ్రీరామచంద్రుని కీర్తిస్తున్నారట. రావణాసురుడు పాలిస్తున్న లంకే మన మానవ శరీరం. రావణాసురుడు మన మనస్సు. ఆ మనసుకు 10 ఇంద్రియాలు, రావణుడికి పది తలల్లాగా. రజోగుణం చేత రావణుడు తనది కాని దాన్ని నాది అనుకున్నాడు. అది రావణుడి అధర్మం. సీతను విడిపించి తనలో చేర్చుకున్నాడు రాముడు. శ్రీకృష్ణుడు తమని పట్టించుకోవటం లేదని, నిర్లక్ష్యం చేస్తున్నాడని అందుకే వారిని దూరంగా ఉంచిన కృష్ణుణ్ణి వదిలి శ్రీరాముని కీర్తించడం మొదలుపెట్టారు గోపికలు. తమలో ఉన్న అహంకార మమకారాలను నాశనం చేసి గురువుల అభిమానాన్ని పొందటానికి, భాగవత సహవాసానికి, కావలసిన యోగ్యతను ప్రసాదించాలని శ్రీరామచంద్రుడి నామాన్ని స్తోత్రం చేస్తున్నారు. రాముని ప్రార్థిస్తున్నారు. ఈ రోజు పాశురంలో మేల్కొనబడిన గోపిక అంటే కులశేఖరాళ్వారులు. కులశేఖరుడుని గుర్తు చేస్తుంది ఆండాల్ తల్లి. ఈయన గురించి మనం ముకుందమాలలో తెలుసుకున్నాం.

ముకుందమాలలో ఒక శ్లోకము

శ్రీ వల్లభేతి వరదేతి దయాపరేతి
భక్త ప్రియేతి భవలుంఠన కోవిదేతి
నాథేతి నాగ శయనేతి జగన్నివాసేతి
ఆలాపనం ప్రతి పదం కురుమే ముకుందా!


కులశేఖరాళ్వారుల వారు ఆ రంగనాధుని, ఆ శ్రీరంగనాథుడిని, ఆ శ్రీరంగం లో ఉండే అర్చామూర్తిని ప్రార్థిస్తున్నారు.

ఓ ముకుందా! శ్రీవల్లభా! దయాపరా! వరదా! భక్త ప్రియా! భవలుంఠన కోవిదా! నాథా! నాగశయనా! జగన్నివాసా!ముకుందా! మోక్షాన్ని ప్రసాదించే వాడా! మోక్షాన్నిచ్చే వాడా! అని

శ్రీవల్లభా! లక్ష్మీదేవికి ఇష్టమైన వాడా! అని.

(భర్త అంటే ఎవరికండీ ఇష్టం ఉండదూ!).

దయాపరా! అమితమైన దయని కురిపించే వాడా! అని.

వరదా! వరాలను ఇచ్చేవాడా! వరాలను కురిపించే వాడా! అని.

భక్త ప్రియా! భక్త ప్రియుడా! భక్తులు అంటే ఇష్టమైన వాడా! అని.

భవలుంఠన కోవిదా! ఈ సంసార సాగరం నుండి మమ్మల్ని ఒక ఒడ్డుకు చేర్చటంలో నీకంటే నేర్పరు లెవరయ్యా! అని

నాథా! నాథుడా! ఎవరికి నాథుడట, లక్ష్మీదేవికి నాథుడు, అంటే లక్ష్మీదేవికి భర్త లక్ష్మీపతి. లక్ష్మీపతీ! అని.

నాగశయనా! ఆదిశేషుడు మీద పడుకునే వాడా! మన ఇంట్లో పాముందని ఎవరైనా అన్నారనుకోండి, దాన్ని పట్టుకొని బయటికి పంపించేదాక మనకి నిద్ర పట్టదు. అలాంటిది ఒక పాము కాదు, వేయి పడగల పాము. ఆయనకు ఎలా నిద్ర పడుతుందో. (ఈ వాక్యం చమత్కారంగా రాశాను ఎవరూ ఏమీ అనుకోవద్దు).

జగన్నివాసా! ఈ జగత్తులో అంతా నివసిస్తుండేవాడు. జగత్తంతా ఆయనే.

విశ్వం విష్ణుః ఆలాపనం ప్రతి పదం కురుమే ముకుందా!

ప్రతి పదంలోనూ నీ నామమే రావాలి అంటే వచ్చే ప్రతి మాట నీగురించే కావాలి. ఇక్కడ పదం అనే మాటకు ఇంకొక అర్థం అడుగు. అంటే ప్రతి అడుగులో నేను వేసే ప్రతి అడుగు నీ దేవాలయానికి రావాలి, నీ దగ్గరికే రావాలి. అని కులశేఖరుడు ప్రార్ధించినట్లు ఇక్కడ గోపికలు ఆ శ్రీ రామచంద్రుని ప్రార్థిస్తున్నారు.


ఆండాల్ తిరువడిగళే శరణం


Wednesday, December 25, 2024

తిరుప్పావై - పదకొండవ పాశురము

తిరుప్పావై - పదకొండవ పాశురము

శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ


ప్రియ భగవత్ బంధువులారా!

జై శ్రీమన్నారాయణ


నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ఈ రోజు 11.వ. పాశురం

ఈరోజు లేపబడే గోపిక ఆరో గోపిక..చాలా భక్తురాలు, చాలా సౌందర్యవతి కూడా. ఈ గోపిక అంటే ఊరి వారందరికీ కూడా చాలా ఇష్టం. వీరి కుటుంబంలో వారందరూ తరతరాల నుంచి కూడా మంచి భక్తులు గానే ఉన్నారు. మనం చేసే ఏ కర్మ అయినా సరే భగవంతుని పొందడానికి అడ్డుకాదు, ప్రతిబంధకం కాదు. భగవంతుడే నాలో ఉండి నా చేత ఆయనకు ప్రీతికరమైన కర్మలను చేయిస్తున్నాడు అని భావించి ప్రపన్నుడు కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. ఆ కర్మఫలితాలు మంచైనా, చెడైనా విచారించడం గానీ, దుఃఖించడం గానీ చేయడు. అటువంటి వాడిని కూడా స్థితప్రజ్ఞుడు అని అంటారు.


యః సర్వత్ర అనభిస్నేహః
తత్తత్ ప్రాప్య శుభాశుభం
న అభినందతి న ద్వేష్టి
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

ఈ శ్లోకం మీకు తెలిసిందే భగవద్గీతలో రెండవ అధ్యాయం 57.వ.శ్లోకం.దీనర్థం ఏమిటంటే.. ఇది కూడా స్థితప్రజ్ఞత గురించి చెబుతుంది.

యః సర్వత్ర అనభిస్నేహః

ఎవరైతే ఏ విషయంలోనీ ఆసక్తి చూపడో

తత్తత్ ప్రాప్య శుభాశుభం

ఆ కర్మల వల్ల వచ్చిన ఫలితం కష్టమైనా, దుఃఖమైనా అయినా

న అభినందతి న ద్వేష్టి

సంతోషించడం గానీ విచారించడం గానీ చేయడో

తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

అతనిని స్థితప్రజ్ఞుడు అంటారు. అటువంటి వంశానికి చెందినదే ఈ ఆరో గోపిక.


ఇక పాశురం చూద్దాం


కత్తుక్కఱవై క్కణంగల్ పలకఱన్దు
శెత్తార్ తిరలళియ చెన్రు శెరుచ్చెయ్యుమ్
కుత్త మొన్రిల్లాద కోవలర్ తం పొర్ కొడియే!
పుత్తరవల్ గుల్ పునమయిలే! పోదరాయ్
శుత్తత్తుత్ తోళిమార్ యతఎల్లారుం వందు - నిన్
ముత్తమ్ పుగున్దు ముగిళ్ వణ్ణన్ పేర్ పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్ పెణ్ డాట్టి! నీ
ఎత్తుక్కురంగుం పొరుళ్-ఏలోర్ ఎంమ్బావాయ్ || 11 || 

ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని చూద్దాం.

కత్తుక్కఱవై క్కణంగల్ పలక ఱన్దు

ఓ బంగారు తీగ వంటి దానా! ఇందాక అనుకున్నాం కదా! ఈ గోపిక చాలా సౌందర్యవతి అని. అందుకే ఓ బంగారు తీగా!అని అంటున్నారు.

నందవ్రజములో ప్రతి ఇంట్లో గోసంపద ఉంటుంది. లేత వయసు దూడలు, లేగదూడలు మంచి బలిష్టంగా ఉంటూ పెద్ద పెద్ద పొదుగులతో చాలా ఎక్కువగా పాలిస్తాయి. కుండల కొద్దీ పాలిస్తాయట. నీ వంశంలో గోపాలురు అందరూ లేత వయస్సుగల పశువుల మందలు కలవారు. అందరూ పాలు పితకుడంలో నైపుణ్యం వున్నవారే.

శెత్తార్ తిరలళియ చెన్రు శెరుచ్చెయ్యుమ్

మీ వంశంలో ఉన్నవాళ్ళు అందరూ శత్రువులను ఎదిరించగలిగిన శౌర్యము, ధైర్యం కలవారే. గొప్ప పరాక్రమం, కండబలం కలవారే. లేకపోతే అంత గొప్ప లక్షల సంఖ్యలో గోసంపద ఉన్నప్పుడు వాటి బరువైన పొదుగులనుండి పాలు పితకటం మమూలు వాళ్లకు సాధ్యం కాదు. అంత భుజబలం ఉందట వాళ్ళకి. ఎంత భుజబలం, ఎంత ధైర్యం ఉన్నా, శత్రువులని ఎదిరించే ధైర్యం ఉన్నా సరే వాళ్లు అనవసరంగా ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్ల పనేదో వాళ్లు చేసుకుంటారట.

కుత్త మొన్రిల్లాద కోవలర్ తం పొర్ కొడియే

ఒక దోషము కూడా లేని వారట ఆమె యొక్క వంశస్థులు. అక్కడ గోపికల్లో ఏ ఒక్కరిలో ఎలాంటి దోషం కనిపించదట. వాళ్ళందరూ కృష్ణుడు భక్తులు కదండీ, వాళ్లలో దోషం ఎందుకుంటుంది!అలాంటి వంశంలో పుట్టిన ఓ స్వర్ణలతా! ఓ బంగారు తీగా! చెట్టుకు అల్లుకున్న ఒక తీగ ఒక లత ఎంతో అందంగా ఉంటుంది కదా!. అలాంటిది బంగారు తీగ ఇంకెంత అందంగా ఉంటుంది. అందుకే అంత సౌందర్యవతి కాబట్టి ఆ గోపికని బంగారు తీగా అన్నారు.

పుత్తరవల్ గుల్ పునమయిలే! పోదరాయ్

ఇక్కడ గోపిక యొక్క సౌందర్యాన్ని చెబుతున్నారు. పుట్టలో ప్రవేశిస్తున్నటువంటి పాము యొక్క నితంబ ప్రదేశము కలదానా! అంటే పాము యొక్క శరీరం అంతా సన్నగా ఉండి, పడగ పెద్దగా ఉంటుంది. అలాగే ఆ గోపిక యొక్క నడుము సన్నగా ఉండి ఆ కింద పిరుదుల భాగం పాము పడగలాగ పెద్దగా, లావుగా ఉంటుందట. బంధువులం, స్నేహితురాళ్ళం వచ్చి నీ వాకిట్లో నిలబడ్డామమ్మా! ఎందుకో తెలుసా!

అముగిల్ వణ్ణన్

ఆ నీలమేఘ శ్యాముడైన సర్వేశ్వరుని అనంతమైన కళ్యాణగుణములను పాడుతున్నారు.


శిత్తాదే పేశాదే శెల్వప్ పెట్టాంట్టి! నీ ఎత్తుక్కు ఉరంగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్

నీవు కదలకుండా, మాట్లాడకుండా ఉన్నావు. ఓ చిన్నదానా! ఎందుకు అలా నిద్రపోతున్నావు. లేచి రావమ్మా! అని ఆ గోపికని ఎంతోగానో పొగుడుతూ మేల్కొలుపుతున్నారు.

ఈ పాశురంలో మేల్కొన బడుతున్నటువంటి ఆళ్వార్ ఎవరంటే శ్రీ తిరుమంగై ఆళ్వార్లు. ఈయన పేరు నీలుడుఈయన చాలా బలశాలి, పరాక్రమవంతుడు, ధైర్యశాలి.

ఈయన గురించి తెలుసుకొని చోళరాజు వీరికి కొన్ని గ్రామాలు ఇచ్చి, తనకు సామంతరాజుగా చేసుకున్నాడు చోళరాజు. ఈయన (అంటే నీలుడు) ఆ గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు ఒక చెరువు దగ్గర ఒక అందమైన యువతిని చూశాడు. చూసి ఆమెను ప్రేమించాడు. ఆమె పేరు కుముదవల్లి. ఒక రెండు షరతుల మీద ఆమె నీలుడిని వివాహం చేసుకోవడానికి అంగీకరించింది. ఏమిటా షరతులు అంటే ఒకటి ఆచార్య సమాశ్రయణం చేయడం, రెండోది ఒక సంవత్సరం పాటు వెయ్యి ఎనిమిది మందికి సమారాధన చేయడం. ఈ 2 నియమాలు కి నీలుడు అంగీకరించి కుముదవల్లిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి నీలుడు భాగవత తదీయారాధనకి తన రాజ్యంలో వచ్చే రాబడి అంతా ఖర్చు పెడుతూ చోళ రాజుకి కప్పం కట్టడం మానేశాడు. చూసి చూసి చోళరాజు విసిగిపోయి నీలుడి మీదకి దండెత్తాడు. ఆ యుద్ధంలో చోళరాజు ఓడిపోయాడు. నీలుడు గెలిచాడు. నీలుడికి పరకాలుడు అనే బిరుదు వరించింది. కానీ నీలుడు ధర్మానికి కట్టుబడి కప్పం కట్టడానికి తపస్సు చేయగా పరమాత్మ ప్రత్యక్షమై వేగవతి నదీ తీరంలో ఉన్న గుప్త నిధిని చూపించాడు. అతను ఆ నిధిని తవ్వి తీసి రాజుకి కప్పం చెల్లించాడు. తర్వాత రాజ్యాన్ని వదిలేసి దొంగతనమే వృత్తిగా చేసుకొని డబ్బు సంపాదించి, దొంగతనం చేయగా వచ్చిన ఆ డబ్బుతో భగవత్ భాగవత కైంకర్యములు చేస్తుండేవాడు. అతను ఆ వృత్తిలో భగవద్భక్తులను హింసించకుండా, నాస్తికులైన ధనవంతుల్ని దోచి, దాచి శ్రీరంగంలో ప్రాకారాలని, మండపాలని కట్టించాడు. అంతేకాకుండా ఆయన శ్రీ నమ్మాళ్వార్ రచించిన నాలుగు తమిళ వేదాలని, ఆరు వేదాంగ దివ్య ప్రబంధాలను రచించాడు.

పరమాత్మ సొత్తును తమది అనుకొని దుర్వినియోగం చేసే వారి నుంచి దానిని తీసుకుని తిరిగి పరమాత్మకే అర్పించినవారు దొంగలు కారు ధన్యులు. అందుకే పరకాలునికి 'కలివైరి' అని పేరు వచ్చింది.కలివైరి లాగానే ఈ పాశురంలో గోపాలురు, గోపాల వంశం వారు కూడా తమ సంపదనంతా, అంతా అంటే.. కష్టపడి సంపాదించిన సంపద అంతా దానధర్మాలకే వినియోగించారు. అలాంటి వంశంలో పుట్టిన గోపికను ఈ రోజు మేల్కొలుపుతున్నారు.

మనం - ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి.

మనకి భగవంతుని పొందడానికిఅవసరమైనటువంటి జ్ఞానం కలిగినా సరే మనం చేయవలసిన కర్మలను విధిగా, తప్పకుండా చేయవలసిందే. కర్మలు చేయకుండా ఎవరూ తప్పించుకోలేరు.


భగవద్గీత 18వ అధ్యాయం లో 46 వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు.

యతః ప్రవృత్తిర్ భూతానాం
యేన సర్వమిదం తతం
స్వకర్మణా తమ భ్యర్ చ్య
సిద్ధం విందతి మానవః

యతః ప్రవృత్తిర్ భూతానాం

ఎవరి వల్ల అయితే సర్వ ప్రాణుల యొక్క సృష్టి జరుగుతుందో, సమస్త జీవులకు ఆయనే ఆధారమైనవాడు. అందుకే మనం ఆ భగవంతుని పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన్నే ఆరాధించాలి. భగవంతుడు మనకి పెద్దల ద్వారా ఏ కర్మలు నైతే చేయమని చెప్పారో అటువంటి కర్మలని మనం ఆచరించాలి.

యేన సర్వమిదం తతం

ఎవరు ఈ సమస్త విశ్వమంతా వ్యాపించి ఉన్నారో, అందుకే మనం విష్ణుసహస్రనామాల్లో మొట్టమొదట చెప్తాం,విశ్వం విష్ణుః అని, ఆయనే సర్వవ్యాపి. పాలలో ఉన్న వెన్న లాగా, పాల అంతటిలోనీ వెన్న ఉంటుంది కదా! మనకు కనిపిస్తుందా! వెన్న మనకి కనిపించాలంటే, దాన్ని మనం తినాలి అంటే, దాన్ని మనం అనుభవించాలి అంటే, ఏం చేయాలో మీకు తెలుసు. అదేవిధంగా ఆ పరమాత్మ కూడా మన స్థూల నేత్రానికి కనిపించడు. జ్ఞాన నేత్రానికి మాత్రమే కనిపిస్తాడు. ప్రతి అణువు లోని భగవంతుడు వ్యాపించి ఉంటాడు. అది మనం తెలుసుకోవాలి.

స్వకర్మణా తమ భ్యర్ చ్యస్వకర్మణా - అభ్యర్చ్య - తమ్

మనిషి కర్మని ఆచరించడం ద్వారా మోక్షాన్ని ఎలా పొందగలడో భగవంతుడు సమాధానం కూడా చెప్పాడు.నీవు నీ కర్మ చేస్తూ దైవాన్ని ఆరాధించు, దైవాన్ని స్మరించు, పరమేశ్వరునికి అర్పిస్తున్నట్టుగా భావించి కర్మ చెయ్యమని పరమాత్మ మనకు సూచిస్తున్నాడు.


ఆండాల్ తిరువడిగళే శరణం


Tuesday, December 24, 2024

తిరుప్పావై పదవ పాశురము

తిరుప్పావై పదవ పాశురము .


శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

ప్రియ భగవత్ బంధువులారా!


నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం

పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!

స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే

గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

భగవత్ బంధువులారా! గోపికలు శ్రీకృష్ణ పరమాత్ముని వదిలి ఉండలేక, విరహంతో బాధపడి, నిద్రలేక, వ్రతము చేయవలెనని బయలుదేరి అందరూ వస్తుంటే, పది మంది మాత్రమే లేవకుండా నిద్రించటం ఆశ్చర్యంగా ఉంటుంది చూసేవాళ్ళకి. ఆ పది మందిని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మేలుకొలుపుతున్నారు. వారి నిద్ర మనలాగా, మన నిద్రలాగ కాదు. లౌకికమైన తామస నిద్ర కాదు. అది భగవదనుభవం వలన కలిగిన సాత్విక నిద్ర అని మనం తెలుసుకోవాలి. భగవంతుని పొందడానికి ఉపాయాలు మూడు రకాలుగా ఉన్నట్లు మనకి భగవద్గీత ద్వారా తెలుస్తుంది. భగవద్గీత 18 అధ్యాయాలు మూడు భాగాలుగా అంటే మూడు షట్కములుగా విభజించడం జరిగింది.

మొదటి ఆరు అధ్యాయాలు కర్మ షట్కం,7 నుంచి 12 వరకు గల అధ్యాయాలను భక్తి షట్కంగా,13 నుంచి 18 వరకు గల అధ్యాయాలను జ్ఞాన షట్కం గా విభజించారు.భగవత్ ప్రాప్తికి ఉపాయములుగా ఈ మూడు షట్కంలను నిర్దేశించారు.జ్ఞాన షట్కంలో 18వ అధ్యాయం మోక్షసన్యాస యోగములో 46.వ.శ్లోకం.

స్వ కర్మణా తమభ్యర్చ్య

సిద్ధిం విన్దతి మానవః

తనకు నిర్దేశించబడిన కర్మని ఆచరించడం ద్వారా మానవుడు సిద్ది పొందుతాడు

అలాగే భక్తి షట్కం 11 వ అధ్యాయము లో విశ్వరూప సందర్శన యోగంలో54 వ.శ్లోకం శ్రీ కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెబుతున్నారు.

భక్త్యా త్వనన్యయా శక్యః

అహమేవంవిధోఽర్జున

జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన

ప్రవేష్టుం చ పరంతప

అనన్యమైన భక్తి చేత మాత్రమే నన్ను పొందగలరు. అనన్యమైన అంటే వేరే ఏ ఇతర వస్తువు పైన కాకుండా కేవలం భగవంతుని మీదే ప్రేమ, అనురాగం, ఆసక్తి ఉండాలి.. అప్పుడు మాత్రమే భగవంతుని పొందగలరు.

సర్వం జ్ఞానప్లవేనైవ

వృజినం సంతరిష్యసి

జ్ఞానం అన్న పడవ సహాయంతో భగవంతుని చేరడానికి ప్రతిబంధకంగా ఉన్న పాపరాశిని దాటగలవు.ఈ మూడు శ్లోకాల్లోని మనకి భగవంతుని దగ్గరకు చేర్చే మార్గాన్ని చెబుతున్నారు.

ఈ పదవ రోజు లేపబోతున్న 5.వ.గోపిక కూడా స్థితప్రజ్ఞురాలే. ఈ గోపిక శ్రీకృష్ణుడు ఇంటి పక్కనే ఉంటుందట. రెండిళ్లకి మధ్యలో ఒక గోడ. అవకాశం వచ్చినప్పుడల్లా మన శ్రీకృష్ణుడు గోడ దూకుతుంటాడాన్నమాట.

ఈగోపిక కూడా శ్రీకృష్ణుడే తన వద్దకు వస్తాడు; నేను ఎందుకు వెళ్ళాలి? ఆ పరమాత్మే వచ్చి తనను సంతోష పెడతాడని తన ప్రయత్నం ఏమీ లేకుండానే హాయిగా చీకు చింతా లేకుండా నిద్రపోతుంది. భగవంతుడి మీద నమ్మకం ఉంటే భక్తులు ఆ విధంగానే ప్రవర్తిస్తారు. అందరూ నోము నోచేందుకు కృష్ణ పరమాత్మ దగ్గరికి బయలుదేరుతుంటే కృష్ణుడేమో ఆయనే నోము నోచి ఈ గోపిక దగ్గరకు వస్తాడట. ఈ గోపిక దగ్గరికి రావడానికి తాపత్రయపడి పోతుండాట. అది ఈ గోపిక యొక్క ప్రత్యేకత. ఏది జరిగినా మన మంచికే. అంతా ఆయనే చూసుకుంటాడు అని భావిస్తారు. కష్టం వస్తే కుంగిపోరు. సుఖం వస్తే పొంగిపోరు. భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం 22 శ్లోకంలో శ్రీ కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెబుతాడు.

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం

శ్రీకృష్ణుడు అంటున్నాడు అర్జునుడితో. ఎవరైతే వేరే ఏ ఇతర ఆలోచనలు లేకుండా ఎల్లప్పుడు అత్యంత భక్తితో పరమేశ్వరుడనైన నన్నే ఉపాసన చేస్తారో, ధ్యానిస్తారో వారి యొక్క యోగక్షేమాలు, కష్ట, సుఖాలు అన్నీ కూడా నేనే చూసుకుంటాను. ఆ బాధ్యతంతా నాదే అని ఆ పరమాత్మ చెప్తున్నాడు. ఆ నమ్మకంతోనే, ఆ విశ్వాసంతోనే ఉన్నది ఇప్పుడు మనం లేపబోయే 5.వ.గోపిక.ఆ పరమాత్మే వచ్చి తనని సంతోష పెడతాడని, తన ప్రయత్నం మానుకొని సంతోషం గా ఉంటుంది ఈరోజు గోపిక. తను చేసిన కర్మకి ఫలితం వచ్చినా, రాకపోయినా దాని వల్ల వచ్చే లాభాలు, నష్టాలు అన్నీ భగవంతుడికే కాని తనకి కావు అని నిశ్చింతగా ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంద్రియాలు అన్నీ వాటి పని మానేసి, ఒక్క మనసు మాత్రమే పని చేస్తుంది. ఈ స్థితిని ఏకేంద్రియావస్థ అంటారు. ఈ స్థితిలో ఉన్న వారిని కూడా స్థితప్రజ్ఞులనే అంటారు. భగవద్గీత రెండవ అధ్యాయం 56 వ శ్లోకంలో కూడా స్థితప్రజ్ఞుడు గురించి శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా చెప్తారు.

దుఃఖేష్వనుద్విఘ్నమనాః సుఖేషు విగత స్పృహః

వీత రాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే


దుఃఖేషు అనుద్విఘ్నమనాఃఇందాక చెప్పినట్లుగా కష్టంలో కూడా కుంగిపోని వాడు.

సుఖేషు విగత స్పృహఃసుఖం వచ్చినప్పుడు పొంగిపోడు. ఎందుకంటే వాడికి తెలుసు ఏదీ శాశ్వతం కాదని, కష్టం గాని, సుఖంగాని ఎక్కువ కాలం ఉండదని.

వీత రాగ భయ క్రోధఃరాగద్వేషాలు, భయము, కోపము లేనివారు స్థితధీర్మునిరుచ్యతే

స్థిత ధీ(ఇతి)=స్థిత ప్రజ్ఞుడు అనిమునిః=మనసుని తన ఆధీనంలో ఉంచుకున్న వాడు
ఉచ్యతే=చెప్పబడుతున్నాడు. ఈరోజు గోపిక ఇలాంటి కోవకే చెందుతుంది.


ఈరోజు పాశురాన్ని చూద్దాం


నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱఅమ్మనాయ్

మాత్తముం తారారో వాశల్తిఱవాదార్

నాత్తత్తుళాయ్ ముడినారాయణన్- నమ్మాల్

పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్- వండొరునాళ్

కూత్తత్తిన్ వాయ్ వీళందకుమ్బకరణనున్

తోత్తుం ఉనక్కే పెరుందుయిల్తాన్ తందానో?

ఆత్త అనందలుడై యాయ్!అరుంగలమే!

తేత్త మాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్ || 10 || 


ఇప్పుడు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.ఇక్కడ చూడండి గోదాదేవి ఈ 5.వ. గోపికను కొంచెం వెటకారంతో కొంచెం ఈర్ష్యతో లేపుతుంది.


నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱఅమ్మనాయ్

ఏమ్మా! మా కంటే ముందే నోము నోచేసి స్వర్గంలోకి ప్రవేశిద్దామనుకుంటున్నావా? ఆ పరమాత్మని కలుసుకుందాం అనుకుంటున్నావా? నీకు ఏంటమ్మా హాయిగా పడుకున్నావ్. ఇంత మంచులో, ఇంత చలి వేస్తుంటే మేమందరం కూడా ఆ పరమాత్మ దర్శనం కోసం వెళ్ళడానికి వస్తుంటే నువ్వు కనిపించలేదు. అందుకని నీ ఇంటి దగ్గర ఆగాం. నిన్ను కూడా తీసుకొని వెళ్దామని. నువ్వు చాలా ముఖ్యమైన దానివి కదా.


మాత్తముం తారారో వాశల్తిఱవాదార్

పోనీలే అమ్మా! తలుపు తీయకపోతే పోయావు, కనీసం మాట్లాడు. జవాబు అయినా ఇవ్వచ్చు కదా!. మాట్లాడితే నీ సొమ్ము ఏమైనా పోద్దా. లోపల కృష్ణుడు ఏమైనా ఉన్నాడా? అందుచేతనే మాట్లాడటం లేదా.

లోపల గోపిక.:

లోపల కృష్ణుడు లేడమ్మా! నేను ఒక్కత్తినే పడుకున్నాను. అయినా కృష్ణుడు మా ఇంట్లో ఉన్నాడని మీకెందుకు అనుమానం వచ్చింది. లోపల కృష్ణుడు ఉన్నాడని మీకు ఎలా తెలిసింది. కృష్ణుడు గాని మీకేమైనా కనబడుతున్నాడా?

బయట గోపిక.:

ఏమీ లేదమ్మా! ఆయన మాకు కనబడడానికి తలుపు అడ్డంగా వుంది కదా! అయినా సరే కృష్ణుడు లోపల ఉన్నాడని మాకు ఎలా తెలిసిందో చెప్పమంటావా? ఆయన ధరించిన కిరీటంలోని తులసి వాసన వస్తుందమ్మా! తులసి ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు కదా! అయితే మరి కృష్ణుడు నీ దగ్గర లేకుండానే ఇంత మొద్దు నిద్ర పోతున్నావా?

లోపల గోపిక.:

అయినా ఆయన మా ఇంట్లో ఎలాగుంటాడమ్మా! వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి కదా! ఆయన పేరు ఏంటన్నావ్! నారాయణుడు కదా! నారాయణుడంటే లోపలా, బయటా అంతటా ఉన్నవాడే కదా! నీ లోనీ ఉంటాడు, నా లోనీ ఉంటాడు. ఆ స్వామి ఎంత భక్తసులభుడో కదా! ఆయన వద్దకు వెళ్లి మనం ఏమీ అడగక్కరలేదు. "స్వామి నేను క్షేమంగా ఉండాలి" అని అంటే చాలు మనకు కావాల్సినవన్నీ తెలుసుకుని ఆయనే ఇస్తాడు. ఆయన మన నోముల పంట.

నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్

నువ్వు దాచినా దాగని తులసి వాసన వస్తుందమ్మా! కృష్ణుడు ఒక్కసారి గాని నిన్ను కౌగిలించుకొని వదిలేసినా సరే ఆ తులసి వాసన నీకు అంటుకుంటుంది. ఎన్ని స్నానాలు చేసినా ఆ వాసన పోదు.తులసి మాలలు ధరించిన శ్రీకృష్ణపరమాత్మని మనము ప్రార్థించి నట్లయితే మనకి పరను ప్రసాదిస్తాడు కదా! మన వ్రతానికి కావలసిన పరని ఇస్తాడు కదమ్మా! అందుకనే బయలుదేరాం.


నమ్మాల్ పోత్త ప్పఱై తరుం పుణ్ణి యనాల్

నేను మంగళం పాడగానే పరను ప్రసాదిస్తాడు.

అలాంటి పుణ్యమూర్తిని సేవించడానికి మనం బయలుదేరుతున్నాం కదా!


వండొరునాల్ కూత్తత్తిన్వాయ్ వీళంద కుమ్బకరణనున్

నీది కుంభకర్ణుడు నిద్రమ్మా! కుంభకర్ణుడు ఎవరో అంటావా! ఒక రోజు రామాయణంలో శ్రీరామచంద్రుడు చంపాడే కుంభకర్ణుడు. ఆ కుంభకర్ణుడే. అందుకే మనందరం కుంభకర్ణుడి నిద్ర అంటాం. కుంభకర్ణుడు నిద్రలో నీతో పోటీపడి ఓడిపోయి ఉంటాడు. ఆ నిద్ర అంతా నువ్వు తీసుకున్నట్లు ఉంది.


తోత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో?

ఆత్త అనందలుడై యాయ్!అరుంగలమే!

ఏమమ్మా నువ్వు లేకపోతే మా గోష్టిలో సందడేం ఉంటుంది చెప్పు. (చూడండి మనలో కొంతమంది ఒక కిట్టి పార్టీ అవ్వచ్చు, సత్సంగం అవ్వచ్చు. అందులో ఒక్కొక్కొక్కరు లేకపోతే అసలు హడావుడి ఉండదు.) అలా నువ్వు రాకపోతే ఎలాగమ్మా! మా గోష్ఠి అంతా ఒక ఎత్తు, నువ్వొక ఎత్తు.

తేత్త మాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్

ఆండాళ్ తల్లి మనకు ఈ పాశురంలో నమ్మాళ్వారిని గుర్తు చేస్తుంది. ఈ గోపిక అంత గొప్ప గోపిక అన్నమాట. ఎలాగూనమ్మాళ్వారిని మనం గుర్తు చేసుకున్నాం కాబట్టి ఆయన గురించి కూడా రెండు విషయాలు చెప్పుకుందాం.

ఈ పాశురాన్ని అర్థం చేసుకొని అనుసంధానం చేస్తే మనకు ఆ నమ్మాళ్వార్ దర్శనమిస్తారు. శ్రీ కృష్ణుడి మహాప్రస్థానం తర్వాత... కలియుగం ప్రారంభంలో 43 వ.రోజైన ప్రమాది సంవత్సరం, శుక్లపక్షం, చతుర్దశి శుక్రవారం, కర్కాటక లగ్నంలో విశ్వక్సేనుల వారి వంశంలో కురుకాపురి ఆళ్వార్ తిరునగరిలో నమ్మాళ్వార్ అవతరించారు.

ఈయన ఒక అసాధారణ శిశువు. ఈ శిశువు తల్లి పాలు గానీ, నీరు గానీ లేకుండా, ఏడవకుండా, కళ్ళు తెరవకుండా ఉన్నాడు. లేక లేక పుట్టాడు, వరప్రసాదుడు, ఈ బిడ్డకి ఈ స్థితి ఏమిటి? ఈ విపరీత పరిస్థితికి విచారించి తల్లిదండ్రులు ఆ శిశువును, ఆ బిడ్డను కురుకాపురి లోని ఒక ఆలయానికి తీసుకువెళ్లి దేవుని ముఖమండపంలో వుంచారు. వెంటనే ఆ బిడ్డ కళ్ళు తెరిచి, పాక్కుంటూ పోయి ఆ ఆలయంలో వున్న చింత చెట్టు పైకి ప్రాకి, ఆ చెట్టు తొర్రలో పద్మాసనం వేసుకొని ధ్యానంలో మునిగి పోయాడు. అలా 16 సంవత్సరాలపాటు ధ్యానంలో జ్ఞానముద్రతో మౌనంగా ఉండిపోయాడు.


ఉణ్ణం శోరు, పరుకు నీరు,

తిన్నుం వెత్తిలైయుం ఎల్లాం కణ్ణన్


ఉణ్ణం శోరు అంటే తినే అన్నం,

పరుకు నీరు అంటే తాగే నీళ్లు,

తిన్నుం వెత్తిలైయుం అంటే అనుభవించే భోగ పదార్థములు,

ఎల్లాం అన్నీ కూడా కణ్ణన్ కృష్ణుడే.

తినే అన్నం, తాగే నీళ్లు, అనుభవించే భోగ భాగ్యాలు, అన్నీ కూడా కృష్ణుడే అనే భావంతో భగవన్నామాన్ని అవలంబించిన ఈ మహానుభావుడ్ని, ఈ మహాత్ముని చూడడానికి దివ్య దేశాలనుంచి అర్చామూర్తులందరూ కూడా ఆ చింత చెట్టు దగ్గరికి వచ్చి పర భక్తి, పరజ్ఞానాన్ని, పరమ భక్తిని ఆయనకు అంద చేశారు. మనం నిరంతరం చేసే ధ్యానమే భక్తి. హృదయంలో పరమాత్మని దర్శించుకుని చేసే ధ్యానం పరభక్తి.

ఆయన కళ్యాణ గుణం అనుభవిస్తూ, ఆయనకు ప్రపత్తి చేయడమే పరజ్ఞానం. ప్రపత్తి అంటే శరణాగతి. భగవంతునితో తమకు ఎడబాటు కలుగుతుందేమో అనే వ్యామోహం చెందడమే పరమ భక్తి. ఇవి వారికి కలిగాయి. అప్పుడు ఆయన వారందరినీ అంటే అర్చా మూర్తులందరిని స్తోత్రం చేసారు. అప్పటికి ఆయనకి నామకరణం జరగలేదు. ఆయన స్తోత్రానికి భక్తికి మెచ్చి ఈయన్ని నమ్మాళ్వార్ అంటే మా ఆళ్వార్ అని పిలిచి ఆదరించారు. ఈయన భగవంతున్ని హృదయంలో, తన మనసులో ప్రత్యక్షంగా అనుభవించారు. ఆ దివ్యమైన అనుభవంతో ఆయన దివ్యమైన ప్రబంధాలని రాశారు. అవేమిటంటే తిరువిరుత్తం, తిరువా శిరియుం, పెరియ తిరువందాది తిరువాయ్ మొళి. ఈ నాలుగూ నాలుగు వేదాలుగా లోకంలో ప్రసిద్ధి చెందాయి. వీరిని శఠకోపులు, కారి మారులు, పరాంకుశులు, కురు కేశులు, తిరుక్కురుకూర్ నంబి, వకుళాభరణులు అని ఇన్ని పేర్లతో ఆయన పిలవబడుతున్నారు. ఇప్పుడు మనం ఆలయాల్లో నిత్యం తీర్థం తీసుకొని, తలవంచి, తలపై ధరిస్తున్న శఠారి (శఠకూపం) శ్రీ నమ్మాళ్వార్ శిరస్సుపై ఉంచిన శ్రీపాదములే శరణ్యము అనే పవిత్ర భావనను కలుగ చేస్తుంది.ఇలా ఈరోజు శ్రీ గోదాగోపికలు ఒక గోపికను శ్రీ నమ్మాళ్వారుని మేల్కొలిపి, లేపి ముందుకు సాగుతున్నారు.


ఆండాల్ తిరువడిగళే శరణం


Monday, December 23, 2024

తిరుప్పావై తొమ్మిదవ వ పాశురం

తిరుప్పావై తొమ్మిదవ వ పాశురం

జై శ్రీ కృష్ణ

ప్రియ భగవత్ బంధువులారా!


నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః


మనం ఇప్పటి వరకు 6.వ.పాశురంలో మొదటి గోపికను, 7 వ.పాశురం లో రెండవ గోపికను, 8వ పాశురంలో మూడవ గోపికను నిద్ర లేపడం జరిగింది. వీళ్లందరూ కలిసి ఈ రోజు 9 వ పాశురంలో నాలుగో గోపికను మేల్కొల్పడానికి బయలుదేరారు.
ఈ నాలుగవ గోపిక ఎలాంటిదట!

గొప్ప భక్తురాలు. వీళ్లందరూ కలిసి ఆ శ్రీకృష్ణుడి దర్శనానికి బయలుదేరితే, శ్రీకృష్ణుడేమో ఈ నాలుగవ గోపిక చుట్టూ తిరుగుతున్నాడు. చూడండి ఈ గోపిక.. శ్రీకృష్ణ ప్రేమని ఎంత పొందిందో. "ఆత్మన్యే వాత్మనా తుష్టఃఆ పరమాత్మ యందే వారి మనస్సు ఎప్పుడూ తలుస్తుతూ ఉంటుంది. ఈ అవస్థను 'వశీకారావస్థ' అంటారు. ఇది చాలా గొప్ప స్థితి. దీనిలో.. అంటే ఈ స్థితిలో ఉన్న యోగి.. సర్వ భోగాలు అనుభవిస్తు ఉంటాడు. ఈరోజు గోపిక ఆ స్థితిలోనే ఉంది. మొదటి రెండు పాశురాలలో శ్రవణము గురించి చెప్పబడింది. తర్వాత పాశురాలలో మననం గురించి చెప్పబడింది. ఈ 9 వ పాశురం నుంచి 12వ పాశురం వరకు ధ్యాన దశ వివరించబడుతుంది.
అలాంటి ధ్యానంలో.. పరాకాష్ట లో ఉన్న గోపిక ఈనాడు మేల్కొల్పబడుతుంది. పరాకాష్ట అంటే ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిపోయింది.

ఇప్పుడు ఈ తొమ్మిదవ పాశురం చూద్దాం.

తూమణి మాడత్తు శుట్రుం విళక్కెరియ
తూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే! మణిక్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్, అవళై ఎళుప్పీరో? ఉన్ మగళ్ తాన్
ఊమయ్యో? అన్రిచ్చెవిడో? అనన్దలో?
ఏమప్పెరున్దుయిల్ మందిరప్పట్టాళో
మామాయన్ మాదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవున్ నవిన్రేలో రెమ్బావాయ్  || 9 || 

ఇప్పుడు ఈ పాశురం యొక్క భావాన్ని చూద్దాం.

తూమణి మాడత్తు శుట్రుం విళక్కెరియ

ఈ గోపిక అద్దాల భవనంలో ఉంటుందట. ఆ భవనం ఎలాంటిదట! చుట్టూ నవరత్నాలతో, మణులతో కట్టబడిందట ఆ భవనం. ఈ గోపిక చూడండి ఎలాంటి భవనంలో ఉంటుందో.
పరమాత్మట.. భక్తులకు.. అంటే ఈరోజు గోపిక ఉన్న స్థితిలో ఉన్నటువంటి భక్తులకు మాత్రమే, అంటే మోక్షాన్ని పొందడానికి అర్హత వున్న భక్తులకు (జీవులకు), నవరత్నాలతో, మణులతో అందమైన భవనాలని కట్టిస్తాడట. కానీ ఆయన మాత్రం రాళ్లతో కట్టిన ఇంటిలో (భవనంలో కూడా కాదు) ఉంటాడట. భక్తుల సుఖాన్నే కోరుకుంటాడు భగవంతుడు.అర్జునుడుకీ రథసారధిగా అవలేదా! యశోద కి కొడుకు గా ఉండి యశోద ముద్దులు తీర్చలేదా!


శుట్రుం విళక్కెరియ
ఆ భవనం చుట్టూ దీపాలు ప్రకాశిస్తూ ఉన్నాయట. ఆ భవనం అద్దాలతో నిర్మించడం వలన.. ఆ దీపాల యొక్క కాంతి.. బయట ఉన్న గోపికలకు కూడా కనిపిస్తుందట. ఈ గోపిక జ్ఞానవంతురాలు కాబట్టి.. ఈ గోపికతో స్నేహం చేస్తే వారికి కూడా కొంత జ్ఞానము అంటుంతుంది. ఇక్కడ దీపం అంటే జ్ఞానం.

తూపం కమళ
మంచి అగరవత్తులు వాసన వస్తుందట. మంచి సువాసనలు వస్తున్నాయట. అయినా ఆ సువాసనలు ఆమెకు తెలియట్లేదట. ఎందుకంటే ఆమె పూర్తిగా భగవంతునితో ఉన్నను అన్నా భ్రమలో నిద్రిస్తుంది. ప్రజాహాతి యదా కామాన్ అని భగవద్గీతలో చెప్పినట్లు పరమాత్మ మీదే మనసు నిలిపినట్లయితే వేరే కోరికల మీద ధ్యాస ఉండదు. అలాంటి స్థితిలోనే ఉన్నది ఈ గోపిక.

త్తుయిల్ అణైమేల్ కణ్ వళరుమ్
ఆమె హంసతూలికా తల్పం మీద పడుకొంటుందిట. ఇలాంటివి గుత్తి దీపంతో పాటు.. క్రింద పెట్టుకునే కుందు దీపాలు కూడా ఆమె చుట్టూ ఉన్నాయట. లోపల మంచి అగర్బత్తిలు వెలుగుతున్నాయి. ఆ భవనం అంతా పరిమళం వస్తుంది. మంచి వాసన వస్తుంది. బాగా మత్తుగా నిద్ర పోయిందట. మత్తుగా అంటే ఆ భగవంతుని కోసం ఆ శ్రీకృష్ణుడు కోసం కలలు కంటూ నిద్రపోతుంది. అటువంటి హంసతూలికా తల్పం పై అంటే ఇలా నడుం వాల్చగానే నిద్ర పట్టెంస్తుందట. నీ దగ్గర కృష్ణుడు లేదంటావా! ఖచ్చితంగా ఉండే ఉంటాడు. అని బయట గోపికలు అంటున్నారట.

మామాన్ మగళే!
మా మామయ్య కూతురా! చూడండి నిజానికి గోదాదేవికి - తన స్నేహితులకి ఎలాంటి చుట్టరికం లేదు. అయినా సరే తనకు తాను గోపికగా భావిస్తుంది కాబట్టి.. ఆధ్యాత్మిక సంబంధం కాకుండా భౌతిక సంబంధం పెట్టుకుంటుంది వారి స్నేహితులతో. మనకు ఎవరి మీదైనా ఇష్టం ఉందనుకోండి వాళ్లని ఏదో ఒక వరుస పెట్టి పిలుస్తాం అన్నా అనో, తమ్ముడనో, అక్కఅనో, వదిననో పిలుస్తాం కదా! అలా అన్న మాట.

మణిక్కదవం తాళ్ తిఱవాయ్
మణులతో పొదగబడిన తలుపుల గడియను తీయమ్మా! లోపల గోపికకు బయట గోపికలు కనిపిస్తున్నారు. బయట గోపికలకు లోపల గోపిక కనిపిస్తుంది. లోపల వున్న గోపిక తల్లి తన కూతురుతో అంటుందట. ఇకనైనా నీ పరిహాసాలు ఆపి చూడు. బయట నీ స్నేహితులందరూ మంచులో వణికిపోతూ నీ గురించి ఎలా చేస్తున్నారో! వెళ్లి తలుపు తియ్యి! ఆ తల్లి కూతురు తో మాట్లాడటం గోపికలకు వినబడక పోయినా కనిపిస్తున్నది కాబట్టి ఈ విధంగా ఊహించుకున్నారు. కూతుర్ని తలుపు తెరవమన్నట్లుగా! 

మామీర్! ఓ అత్తా! చూసారా! వరస కలిపేశారు. అవళై ఎళుప్పీరో? నువ్వైనా లేపవమ్మా నీ కూతురిని. చూసారా కోపంతో వరుస మర్చిపోయారు నీ కూతుర్ని అన్నారు. మనం కూడా కోపంలో వరసలు మర్చిపోతుంటాం. ఇలాంటి వరుసలు కోపంలో ఉన్నపుడు మన కుటుంబాలలో కూడా జరుగుతూ ఉంటాయి.తల్లికి కూతురి మీద కోపం వచ్చిందనుకోండి అప్పుడు భర్తను చూసి.. చూడండి! మీ కూతురి ఎలా తయారైందో అంటుంది భర్తతో.. భర్తకే కూతురు అయిన్నట్టు… తనకు కూతురు కానట్లు.


ఉన్ మగళ్ తాన్ ఊమయ్యో? అన్రిచ్చెవిడో?
నీ కూతురు ఏమైనా మూగదా! లేక చెవిటిదా! అవునులే భగవంతునితో సంబంధం పెట్టుకుంది కదా! ఇక మా మాటలేం వినబడతాయి.అనందలో ఇంతసేపూ కృష్ణుడితో ఉంది కదా! అలిసిపోయి పడుకుందా!


ఏమప్ పెరున్దుయిల్
ఈమెను ఎవరూ లేపకుండా కాపలా ఉంచారా! మనుషుల్ని. మందిరప్పట్టాళో లేకపోతే ఎవరైనా మంత్రం వేశారా! లేవకుండా! అంత మొద్దుగా నిద్రపోతుందేమిటి! పిలిచినా లేవట్లేదు. మామాయన్ మహా మాయావిని, మాయదారి కృష్ణుడిని మాదవన్ మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్తని వైకుందన్ ఆ వైకుంఠవాసుని 

ఎన్ఱెన్ఱు నామం పవన్ నవిన్రు
ఎన్నో నామాలు చదువుతూ వస్తున్నాం కదా! నామ సంకీర్తన చేస్తూ వస్తున్నాం కదా! అయినా వినబడ లేదా! లేపవమ్మా!అప్పుడు ఆ గోపిక లేచి వీరితో పాటు పాటలు పాడుకుంటూ బయలుదేరింది.

ఏలోరెమ్బావాయ్
ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఈ గోపిక కృష్ణుడు భక్తురాలు అనుకున్నాం కదా! ఈమె స్థితప్రజ్ఞురాలు కూడా! స్థితప్రజ్ఞురాలు అంటే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. రెండో అధ్యాయం 55 వ శ్లోకంలోశ్రీ భగవాన్ ఉవాచ:

ప్రజహాతి యదా కామాన్
సర్వాన్ పార్ధ మనోగతాన్
ఆత్మన్యే వాత్మనా తుష్టః
స్థితప్రజ్ఞస్త దోచ్యతే

అర్జునా! ఎవరైతే మనసులో ఉన్న సమస్తమైన కోరికలను పూర్తిగా వదిలేసి, ఆ మనసును ఆత్మ, పరమాత్మల యందే నిలిపి సంతృప్తి చెందుతారోవారిని స్థితప్రజ్ఞులు అంటారు. ఈ గోపిక ఆ కోవకు చెందింది. ఆమె నిద్రలో కూడా భగవంతున్నే ధ్యానం చేస్తుంది. అందుచేత వినబడలేదు. వినబడలేకపోతే ఇంక సమాధానం ఏం చెబుతుంది. ఏం మాట్లాడుతుంది.లోపల దీపాలు వెలుగుతున్నాయి అనుకున్నాం. అంటే దీపము జ్ఞానం లాంటిది. ఇక ఊదొత్తుల వాసన అనుష్టానం లాంటిది. ఈ రెండు ఉన్నవారికి భగవదనుగ్రహం లభిస్తుంది.

ఈ గోపికని భక్తిసారులు అనే ఆళ్వార్ తో పోల్చారట. భక్తిసారుడు మహాజ్ఞాని, సిద్ధపురుషుడు, స్థితప్రజ్ఞుడు కూడా. వారికి అష్టసిద్ధులు తెలుసట. అయినా సరే ఆయన అవి ప్రదర్శించడానికి ఏమాత్రం ఇష్టపడరు. అలాంటి వాళ్లకి గర్వం ఎందుకుంటుంది. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఆయన భక్తిని పరీక్షిద్దామని వచ్చారట. భక్తిసారున్ని ఏదైనా వరం కోరుకోమన్నారట. అప్పుడు ఆయన అన్నారట నాకు శ్రీమన్నారాయణుడి కైంకర్యం కావాలి ఆన్నారట. అంతకంటే ఇంకేం అక్కరలేదు అన్నారట.అప్పుడు పరమేశ్వరుడు ఇంకేదైనా వరం కోరుకోమని అడిగారట. ఆ సమయంలో భక్తిసారుడు తన ఇంట్లో ఉన్న చిరిగిపోయిన పాత బొంతని కుడదామని కూర్చున్నారట. ఆయన పరమ శివుడు తో నేను చిరిగిపోయిన ఈ బొంతని కుట్టుకోవాలి. ఈ సూదిలోకి దారం ఎక్కించి ఇవ్వు అని అన్నారట. చూడండి భగవంతుడు ప్రత్యక్షమైతే ఆయన ఎలాంటి కోరిక కోరుకున్నాడో. గొప్ప వాళ్ళు అలాగే ఉంటారు. ఒకసారి ఈ భక్తిసారుడు అనే ఈ ఆళ్వార్ దగ్గరికి ఒక సిద్ధుడు వచ్చి ఒక చిన్న గుళిక లాంటిది ఇచ్చి ఇది బంగారంగా మారుతుంది నువ్వు తీసుకో అన్నాడట. అప్పుడు ఆల్వార్ అన్నారట. నా శరీరాన్ని ఇలా పామితే వచ్చే మట్టి కూడా బంగారం అవుతుంది. ఇదిగో మీరు తీసుకోండి అన్నారట. అప్పుడు ఆ సిద్ధుడు ఆ మట్టిని పరీక్షిస్తే ఆ మట్టిముద్ద బంగారం అయిందట. 

ఒక వృద్ధురాలు ఆ ఆళ్వారు కి సేవ చేస్తుంటే కొన్నాళ్ళకి ఆమెకు వృద్ధాప్యం పోయి యవ్వనం వచ్చిందట. 18 ఏళ్ల అమ్మాయిగా తయారైందట. ఆమెను చూసి ఆ ఊరి రాజు వివాహం చేసుకున్నాడు. అప్పుడు తనకి కూడా యవ్వనాన్ని తెప్పించమని ఆ ఆళ్వారును కోరారు ఆ రాజు గారు. భక్తిసారుడు దానికి తిరస్కరించారట. అప్పుడు ఆ రాజు ఆయన్ని రాజ్య బహిష్కారం చేశారు. భక్తి సారులు ఆ ఊరు విడిచి వెళ్తుంటే.. ఆయన నిత్యం సేవించే ఆ ఆలయంలో మూర్తి కూడా ఆయనతో పాటు కదలి వెళ్లిపోవడం ప్రారంభించిందట. దాంతో ఆ ఊరి వాళ్ళు అందరూ కూడా ఆ ఆళ్వార్ వెనుక నడుస్తున్నారట. అప్పుడు రాజు కి జ్ఞానోదయం కలిగి ఆళ్వారుల వారిని ప్రార్థించగా.. ఆయనతోపాటు ఆ దేవతా మూర్తి కూడా (కంచి) ఆలయంలో ప్రవేశించారట. ఆళ్వార్లు చెప్పినట్టు చేసిన పెరుమాళ్ళు కనుక ఆయనకు యథోక్తకారి అనే పేరు వచ్చిందట. ఇప్పటికీ ఆ ఆలయం కంచిలో ఉంది. అలాగే ఒకసారి భక్తిసారుడు కుంభకోణం వెళ్లి ఆ వీధిలో నడుస్తుంటే ఆ ఆలయంలోని అర్చామూర్తి సారంగపాణి తన భక్తుడైన భక్తిసారుని చూసి పడుకున్న అయన పైకి లేస్తూ ఉన్నాడట. అప్పుడు ఆ అద్భుతాన్ని చూసిన భక్తులు అందరూ కూడా ఆ భక్తిసారుడ్నీ, సారంగపాణిని ఇద్దరినీ ప్రార్థించారట. ఇలాంటి మహిమలు ఎన్నో వున్న భక్తిసారుడు ఏమీ తెలియని వాడిలాగా మౌనంగా ఆ భగవంతున్ని కొలుస్తూ ఉంటారట.


ఆండాల్ తిరువడిగళే శరణం


తిరుప్పావై ఎనిమిదవ పాశురము

తిరుప్పావై ఎనిమిదవ పాశురము


ప్రియ భగవత్ బంధువులారా!
జై శ్రీమన్నారాయణ
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ఎనిమిదో పాశురం

కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిఱు వీడు
మేయ్ వాన్ పరందన కాణ్! - మిక్కుళ్ళ పిళ్లై గళుమ్
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు - ఉన్నై
కూవువాన్ వందు నిన్ఱోం, కోదుగలం ఉడైయ
పావాయ్! ఎళుందిరాయ్! పాడిప్పఱైక్కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా వెన్రారాయన్ అరుళేలోరెంబావాయ్ || 8 || 

ఆకాశము తెల్లవారింది. గేదెలు మంచులో మేత మేయటానికై బయలుదేరాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగనే అతని వద్దకు చేరాలాని అలా చేసినట్లయితే అతడు చాల సంతోషిస్తాడని తలుస్తున్నారు. అందరూ కలిసి గోష్ఠిగ పోవుటే మంచిదని ఆలోచించి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకు కూడా అతనిని చేరుటకు కుతూహలముగనే వున్నదికదా! మరింక ఆలస్యమెందుకు? లెమ్ము! ఆశ్వాసురరూపుడైన కేశిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి, మన నోమునకు కావలసిన 'పఱై' అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయిన అతడు 'అయ్యో! మీరు నాకంటే ముందుగనే వచ్చితిరే!' యని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును.

క్రిందటి పాశురంలో భారద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది. ఈమె సాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాషగా కనబడినా అందులోని అంతరార్ధం బహు విస్తృతమైనది. వేదోపనిషత్సారమైన యీ గ్రంథ ఆంతర్యాన్ని ప్రతివారు యెరిగి తీరవలసినదే అన్నదే ఆండాళ్ తల్లి చెప్పినది. ఈ ఎనిమిదవ పాశురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయిననూ ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది ఎనిమిదవ పాశురము.

ఆండాల్ తిరువడిగళే శరణం


Saturday, December 21, 2024

తిరుప్పావై - ఏడవ పాశురము

తిరుప్పావై - ఏడవ పాశురము



ప్రియ భగవత్ బంధువులారా!

జై శ్రీమన్నారాయణ

ధ్యానం

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

నిన్న ఒక గోపికను నిద్ర లేపడంతో ఈ శ్రీ వ్రతం ప్రారంభమైంది. వేద పఠనం మొదలుపెట్టినప్పుడు శ్రీ గురుభ్యోన్నమః, హరిః ఓం తో ప్రారంభిస్తారు. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు శుభం పలుకుతాం కదా! నిన్న మొదట పక్షుల శబ్దములు, పక్షుల కిలకిలారావాలు, శంఖనాదం, హరి హరీ అనే ధ్వనులు వినలేదా, వినిపించలేదా అని అడిగారు. పక్షులను శ్రీ గురు మూర్తులు అని అంటారు. అందుచేత పక్షుల శబ్దాలను శ్రీ గురుభ్యోన్నమః అన్నట్లుగా మనం ఇక్కడ భావించాలి. తర్వాత శంఖనాదం, హరి హరీ అన్న శబ్దం. హరిః ఓం అని శుభంతో ప్రారంభమైందని భావించాలి. భగవంతుని యొక్క నామాన్ని వినడం ఎంత అదృష్టమో!

రెండో గోపికను నిద్ర లేపడంతో ఈరోజు పాశురం ప్రారంభమవుతుంది.

కీశు కీశెన్రు ఎంగుం ఆనై చ్చాత్తన్ కలన్దు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో ప్పేయ్ పెణ్ణే!
కాశుం పిఱప్పుం కలగలప్పక్కై పేర్ త్తు
వాశ నఱుంగుళలాయ్ చ్చియర్, మత్తినాల్
ఓశై పడుత్త తయిరరవం కేట్టిలైయో?
నాయగ ప్పెణ్ పిళ్లాయ్ నారాయణన్ మూర్తి
కేశవనైప్పాడవుం నీకేట్టే కిడత్తియో
తేశ ముడైయాయ్ తిఱవేలో రెంబావాయ్ || 7 ||

నిన్నటి పాశురంలో ఆ గోపికని పిళ్లాయ్ అని పిలిచారు. ఈరోజు గోపిక నితేశ ముడైయాయ్ అంటే.. తేజోవతీ, తేజ స్వరూపిణీ అని పిలుస్తున్నారు.

భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్ని వైపులా ఉన్న తోటి పక్షులను కలుసుకొని కీచుకీచు మంటూ మాట్లాడుకుంటున్నాయట. ఇక్కడ జంట పక్షులు గురించి చెప్తున్నారు. భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయట.

ఆ పక్షులు మామూలు పక్షులు కాదు. ఆ మాటలు మామూలు మాటలు కాదు. భరద్వాజ పక్షులకి సూర్యోదయం అయితే కళ్ళు కనిపించవు. తన ఎదురుగుండా ఉన్న పక్షులను కూడా సరిగ్గా గుర్తించలేవు. అందుచేత అవి రాత్రంతా ఆ జంట పక్షులు ఒకదాన్నొకటి విడవకుండా సరస సల్లాపాలు ఆడుకుంటూ ఏవో మాట్లాడుకుంటూ సూర్యోదయం అయితే మనం కలుసుకోవడం, మాట్లాడుకోవడం జరగదు. తిరిగి సూర్యాస్తమయం అయ్యాక కలిసుంటాం అని ఆ ఎడబాటును సహించలేక ఇప్పుడే ఒక దాని మీద ఒకటి అభిమానాన్ని కురిపించుకుంటూ ఉంటాయట. ఈ పాశురంలో మనకు భరద్వాజ మహర్షిని గుర్తు చేస్తుంది ఆండాళ్ తల్లి. భరద్వాజుడు మూడు వేదాలు అధ్యయనం చేయాలని సంకల్పించాడు. అయినా అధ్యయనం చేయలేకపోయాడు. బ్రహ్మదేవుని కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వేదాధ్యయనానికి తగిన జ్ఞానాన్ని ప్రసాదించమని కోరాడు. సరే అని వరం ఇచ్చాడు. 20 వేల సంవత్సరాలు అధ్యయనం చేశాడు. అయినా పూర్తి చేయలేకపోయాడు. మరొకసారి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు తిరిగి అదే వరాన్ని కోరాడు. మరో 20 వేల సంవత్సరాలు మరల అధ్యయనం చేశాడు. అయినా పూర్తి చేయలేకపోయాడు.

ఇక్కడ మనం తెలుసుకోవసింది ఇంకొకటి ఉంది.

చాలామంది త్రి ఆయుషం అంటే 300 సంవత్సరాలు అని అంటారు. ఆయుఃప్రమాణం అంటే వంద సంవత్సరాలు అంటారు. కానీ.. స్కాందపురాణంలో "ఆయుః ద్వింశతి సహస్రం" అంటే ఆయుః అంటే 20,000 సంవత్సరాలు. భరద్వాజ మహర్షి మరల తపస్సు చేసి వరాన్ని పొందాడు. మరొక 20 వేల సంవత్సరాలు అధ్యయనం చేశాడు. అయినా పూర్తి చేయలేకపోయాడు. మొత్తం 60 వేల సంవత్సరాలు జీవించి కూడా వేదాధ్యయనం పూర్తి చేద్దాం అనుకుని పూర్తి చేయలేకపోయాడు. మరలా తపస్సు చేసాక బ్రహ్మ ప్రత్యక్షమై ఏమయ్యా! భరద్వాజా! ఇప్పటికైనా తెలిసిందా! వేదం అనంత రాశి. దానిని పూర్తి చేయడం నాకే సాధ్యం కాలేదు. ఒక గుప్పెడు ఇసుక తీసుకొని ఆ ఇసుక రేణువులు లెక్కపెట్ట గలవా? సాధ్యం కాదు కదా! అలాగే వేదాలన్నీ చదవడం, పూర్తి చేయడం అసాధ్యం అని బ్రహ్మదేవుడు చెప్పగా... అప్పుడు భరద్వాజుడు.. తండ్రీ! పోనీ నాకు మరికొంత ఆయుష్షు ఇవ్వండి. ఇప్పటివరకు నేను తెలుసుకున్నది ప్రజా జీవనం లోకి వెళ్లి దానిని వ్యాపింప చేస్తాను. అందరికీ వేదం గురించి తెలియజేస్తాను. నేను చదువుకున్నది పదిమందికి తెలియజేస్తాను. ఎందుకంటే మనకు వచ్చిన విద్య, మనకు తెలిసిన విద్య మనలోనే ఉంచుకోకూడదు. పది మందికి బోధించాలి. మనకున్న జ్ఞానం పదిమందికి పంచాలి. అప్పుడే మన చదువుకి సార్ధకత. నాకు అవకాశం ఇవ్వండి అని ప్రార్థించగా బ్రహ్మ సరే అంటాడు. అలా వేదాధ్యయనానికి తమ జీవితమంతటినీ ధారపోసిన అధ్యయన, అనుష్టాన, సంపన్నులే ఈ భరద్వాజ పక్షులు.

అలాంటి భరద్వాజ పక్షులు మాట్లాడుకున్న మాటలు వినబడలేదా నీకు, ప్పేయ్ పెణ్ణే!పిచ్చిదానా! పిచ్చిపిల్లా! అని ఈరోజు గోపిక తో అంటున్నారు.

కాశుం (కాసుల పేరు) పిఱప్పుం (మెడలో ఆభరణాలు) కలగలప్ప (ఒక దానికొకటి రాసుకుంటున్న శబ్ధం)క్కైపేర్ త్తు చేతులు కదుపుతూ వాశ నఱుంగుళలాయ్ చ్చియర్ (గోపికలందరూ అలంకరించుకున్నటువంటి మంచి పరిమళం కేశాలకి అలంకరణలు), మత్తినాల్ ఓశై పడుత్త (కవ్వంతో పెరుగు చిలుకుతుంటే) తయిరరవం (చిలికే ధ్వని) కేట్టిలైయో? వినలేదా? లేక వినబడలేదా?

నందవ్రజములో గోపికలు బ్రహ్మీ ముహూర్తంలో పెద్ద పెద్ద కుండలతో పెరుగు దగ్గర పెట్టుకుని కవ్వంతో చిలకడం మొదలెడతారు. ఇది వాళ్ళ నిత్యకృత్యం. రాత్రి పాలన్నీ కుండలలో వేసి తోడు పెడతారు. అది ఉదయానికి గడ్డ పెరుగులా గట్టిగా తయారవుతుంది. పెరుగు చిలకడానికి కవ్వాన్ని ఆ కుండలో గట్టిగా పెట్టాలి. అంటే పెరుగు అంత గట్టిగా తోడుకుంటుంది. కవ్వం లోపలికి వెళ్ళాక కవ్వానికి వున్న తాడు పట్టుకొని ఇలా ఇలా ఇలా అని తిప్పుతున్నప్పుడు సర్ సర్ అన్న శబ్దం వస్తుంది. అది కూడా నీకు వినబడలేదా! ఇలా చిలుకుతున్నప్పుడు తల అటు ఇటు ఊపవలసి ఉంటుంది. అప్పుడు కొప్పు ముడి విడిపోతుంటుంది. ఆ తలలో ఉన్న పువ్వులు రాలి కింద పడుతుంటాయట. ఆ పువ్వుల వాసన ఆ చుట్టుపక్కల అంతా వ్యాపిస్తుందిట. ఆ వాసన కూడా నీకు తెలియలేదా! లేవమ్మా! లేచి రా!

నాయగ ప్పెణ్ పిళ్లాయ్ నారాయణన్ మూర్తి
కేశవనైప్పాడవుం నీకేట్టే కిడత్తియో

నాయగ ప్పెణ్ పిళ్లాయ్ అంటేఓ నాయకమణీ, ఓ నాయకురాలా!

మా అందరికీ నువ్వు నాయకురాలు లాంటి దానివి కదా!! మా అందరికీ నాయకురాలు లాగ ఉంటావు కదా! కృష్ణ పరమాత్మ గా అవతరించిన నారాయణమూర్తిని, కేశవుని (కేశి అనే రాక్షసుడిని సంహరించిన వాడిని) కీర్తిస్తుండగా కేశవ నామాలు చదువుతుండగా వారి గుణగణాలు పాడుతుండగా నువ్వు వినలేదా! లేకపోతే వినబడనట్లు నటిస్తున్నావా? నీ కేట్టే కిడత్తియో నీవు విని కూడా పడుకొని ఉన్నావా?తేశ ముడైయాయ్ ఓ తేజశ్శాలీ! మంచి మెరుపు కలిగిన ముఖము కల దానా! భగవంతుని అనుగ్రహం ఉన్నవాళ్ళు అందరూ గొప్ప తేజస్సు కలిగి ఉంటారు. నీ తేజస్సు మాకు కనిపిస్తుంది. తిఱవు ఇకనైనా తలుపు తెరువు ఏలో రెంబావాయ్ ఈ వ్రతం లోకానికే శుభాన్ని చేకూరుస్తుంది.

ఈ పాశురములో ఆండాళ్ తల్లి మనకు కులశేఖరాళ్వార్ గురించి చెప్తుంది. వీరి గురించి చెప్పుకోవాలంటే మనకి ఒక రోజు చాలదు. వారం రోజులు చాలవు. కానీ సందర్భం వచ్చినప్పుడు తెలుసుకుందాం.


ఆండాల్ తిరువడిగళే శరణం


Friday, December 20, 2024

తిరుప్పావై ఆరవ పాశురం

తిరుప్పావై ఆరవ పాశురం


పుళ్ళుం శిలుంబినగాణ్ పుళ్ళరైయిన్ కోయిలిల్
వెళ్లై విళిశంగిన్ పేరరవం కేట్టిలైయో?
పిళ్ళాయ్ ఎళుందిరాయ్ పేయ్ ములైనంజుండు
కళ్ళచ్చగడం కలక్కళియాక్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిలమరంద విత్తినై
ఉళ్ళత్తుక్కొండు మునివర్ గళుం యోగిగళుమ్
మెళ్ళ వెళుందు అరియెన్ర పేరరవమ్
ఉళ్ళం పుగున్దు కుళిరెన్దేలో రెంబావాయ్

ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం..

ఈ పాశురం నుండి 10 పాశురముల వరకు అంటే 6 వ పాశురం నుండి 15 పాశురం వరకు కూడా పదిమంది గోపికలను ఆండాళ్ తల్లి మేలుకొలపడం చూస్తాం.

గోదా గోపిక ఇక వ్రతం ప్రారంభంచేద్దామని గోపికలందరితో చెప్పగా, ఇంకా పది మంది గోపికలు నిద్ర లేచి రాలేదని వారి ఇరుగుపొరుగు గోపికలు చెప్పారు. ఆ పదిమంది గోపికలను లేపటానికి గోదాదేవి తన సహ గోపికలు అందరితో కలిసి బయలుదేరింది. వారిలో మొదటి గోపికను ఈరోజు మేల్కొలుపుతున్నారు. ఆ గోపిక కొత్తగా వాళ్లోకి చేరింది. భగవదనుభవం ఆమెకు ఇంకా పూర్తిగా కలగలేదు. నిద్ర లోనే భగవంతున్ని అనుభవిస్తుంది. ఎక్కడ నిద్రలేస్తే భగవంతుడు దూరం అయిపోతాడేమో అన్న భయంతో నిద్ర లేవకుండా అలానే పడుకుంది. వీరు వెళ్లి లేపుతున్నారుఓ చిన్నదానా! ఓ గోపికా!!

పుళ్ళుం శిలుంబినగాణ్

పక్షులు అరుస్తున్నాయి కదా! తెల్లవారింది. వాటి ఆహారం కోసం అవి 'కావ్ కావ్' అంటూ బయలుదేరాయి. ఏం నీకు ఆ శబ్దాలు వినబడటం లేదా? కాకి అరుపులు వినలేదా నీవు?. అని ఆ గోపికను లేపుతున్నారు.

పుళ్ళరైయిన్ కోయిలిల్వెళ్లై విళిశంగిన్ పేరరవం కేట్టిలైయో?

పక్షిరాజు గరుత్మంతుని వాహనంగా కలిగినటువంటి శ్రీమన్నారాయణుడి గుడిలో సుప్రభాత సేవలో ఆ స్వామిని మేల్కొలపడానికి తెల్లని శంఖం పూరిస్తున్నారు కదా! నీకు వినబడలేదా?


పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ ములైనంజుండు

ఓ పిల్లా! లేవమ్మా! ఆ బాలకృష్ణుడు పూతన యొక్క పాలు తాగి ఆ రాక్షసిని సంహరించాడు కదా!


కళ్ళచ్చగడం కలక్కళియాక్కాలోచ్చి

బండి రూపంలో వచ్చిన శకటాసురుని కాలితో తన్ని ఏ కీలు కాకీలు పీకేసే చంపేశాడు. 


వెళ్ళత్తరవిల్ తుయిలమరంద విత్తినై

పాల సముద్రంలో శేషశయ్య మీద యోగ నిద్రలో ఉన్నాడు ఆ పరమాత్మ.


ఉళ్ళత్తుక్కొండు మునివర్ గళుం యోగిగళుమ్

అటువంటి పరమాత్మని మునులు, యోగులు వారి మనసులో ధ్యానం చేస్తూ మెల్లగా నిద్ర నుండి లేస్తున్నారు.


మెళ్ళ వెళుందు అరియెన్ర పేరరవమ్

హరినామస్మరణ చేస్తూ మెల్లగా మేల్కొంటున్నారు.


ఉళ్ళం పుగున్దు కుళిరెన్దేలో రెంబావాయ్

ఆ శంఖనాదం విని మేము లేచాం గానీ.. నీవు ఇంకా లేవలేదు. ఇప్పటికైనా లేచి రావమ్మా!విషాన్ని స్తన్యంగా ఇచ్చిన పూతన సంహారం, బండి రూపంలో ఆ బాలకృష్ణుని చంపడానికి వచ్చిన శకటాసురుణ్ణి తన చిన్ని కాళ్లతో తన్ని చంపడం, శ్రీమద్భాగవతంలో మొట్టమొదటిసారిగా వర్ణించిన కృష్ణ లీలలు. ఆ లీలల్ని తలచుకొని ఉప్పొంగిపోతూ మునులు హరీ హరీ అని గానం చేస్తున్నారు. ఆ శబ్దం విని మేము లేచాం, నువ్వు కూడా లేచిరామ్మా!

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ఈ 10 మంది గోపికలు నిద్ర పోవడం, వారిని మేల్కొల్పడం అనే దానిలో ఉన్న అంతరార్ధం తెలుసుకుందాం. వైష్ణవాలయాల్లో మూలవిరాట్ తోపాటు భగవత్ భక్తులైన పదిమంది ఆళ్వార్లను కూడా ప్రతిష్టిస్తారు. ఆళ్వార్లు లేని ఆలయం దివ్యదేశం కాదు. ఆలయానికి వెళ్ళినప్పుడు ముందు ప్రదక్షిణం చేసి, ఆళ్వార్లను సేవించి తిరిగి వచ్చి ధ్వజస్తంభం దగ్గర నమస్కరించి, అమ్మ వారిని సేవించి ఆ పైన గర్భగుడిలో మూలవిరాట్టుని సేవించటం ఒక ఆచారంగా ఉంది. భూతం సరశ్చ మహదాన్వయ భట్టనాథ అని పదిమంది ఆళ్వార్లను సేవిస్తాం కదా!.ఆ పది మందిని సేవించి వారి కటాక్షం, వారి అనుగ్రహం పొందడమే ఆ పదిమంది గోపికలను మేల్కొల్పడం.

ఈ పాశురం లో ఆండాళ్ తల్లి పెరియాళ్వార్ ని (విష్ణుచిత్తుడు) గుర్తు చేస్తుంది.


ఆండాల్ తిరువడిగళే శరణం


Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం గాయత్రీస్తోత్రం నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను....