Friday, April 10, 2026

Chapter 24 The Birth Story Of Bheeshma - అధ్యాయము 24 గాంగేయుని జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 24

గాంగేయుని జన్మవృత్తాంతము

సూతు డిట్లనియెను : ఆ ప్రకారముగ ప్రతీపరాజు దివికేగిన పిమ్మట సత్యవిక్రముడగు శంతనుడు మృగవ్యాఘ్రముల బరిమార్చుచు మృగయాశీలుడయ్యెను. ఒకనాడారాజడవిలో దిరుగుచు మృగశాబకలోచన - మనోహరాభరణ యగు జవ్వనిని గాంచెను. రాజా రెండవ లక్ష్మియోయన రూప¸యవనముల నలరారు జవరాలిని గాంచి యానాడు తన తండ్రి పేర్కొనిన పడతి యామెయే కాబోలునని తలంచెను. ఆ పద్మాక్షిలోని ముఖకాంతులెంత చూచినను రాజునకు తనివిదీరుటలేదు. రాజు మది యాకామిని యెడదలో జిక్కుకొనెను. అతనిహృది సమ్మదము కలిగించు కామనలతో వ్యాప్తమయ్యెను. ఆ గంగానదియు నానాటి మహాభిషుడీ రాజేయని తెలిసికొని యతని విషయమున ప్రేమానురాగతరంగితయై చిఱునగవుతో రాజు నెదుట నిలిచెను. రాజా యసితాపాంగిని చూచి మిగుల ప్రీతినొందిన చిత్తముతో లాలించి కమ్మని పలుకులతో నామె కిట్లు మధురవాక్యములు పలికెను : 

"నీవు దేవతవో! గంధర్వ యక్షనాగకన్యలలో నెవ్వతెవో! కాక - మానిసివో! నీవెవ్వరవైన నౌదుగాక! నాకు నీపై ననురాగము కల్గినది. నాకు ధర్మపత్నివి గమ్ము."

సూతు డిట్లనియెను : ఈమెయే యానాటి గంగయని రాజెఱుగడుగాని నాటి మహాభిషుడితడేయని గంగకు దెలియును. రాజు మాటలు విని వెనుకటి ప్రేమ సమాయోగము దలంచి చిరునగవుతో గంగాదేవి రాజున కిట్లనెను : 

"నరపతీ! నీవు ప్రతీపుని కుమారుడవని నేనెఱుంగుదును. నీవంటి నరపతిని తన పతిగ నే యందగత్తె గోరుకొనదు? రాజా! నా వాగ్బంధముననే నిన్ను పతిగ నొనర్చుకొనగలను. కాని నిన్ను వరించుటకు నాదొక ప్రతిన గలదు. వినుము. శుభాశుభములలో నేనేది చేసినను నీవు గాదనగూడదు. నాకప్రియముగ బలుకగూడదు. నా యీ ప్రతినను తిరస్కరించిననాడు నేను నిన్ను విడనాడి స్వేచ్ఛగ నెటకే నేగుదును." అని గంగాదేవి వసువుల రాబోవు జన్మలను మహాభిషుని ప్రేమప్రార్థనను తన యెడదలో దలచె. 

రాజామె మాట కామోదము వెలిపుచ్చెను. ఆమెయు రాజునటులే పతిగ భావించెను. ఇట్లు గంగాదేవి మనుష్య యువతి రూపమున ఆ శంతనునకు పత్ని అయ్యెను. ఆ వరవర్ణిని రాజువెంట రాజభవనము కేగెను. ఆ రాజుకూడ ఉద్యానవనములందామెతో కూడి విహరింపసాగెను. ఆ సుందరియు అతని భావమెరిగి అతని నానంద పెట్టుచుండగా ఎన్ని ఏండ్లు గడచినదియు ఎరుగక ఆ రాజేంద్రుడా హరిణాక్షినిగూడి యింద్రాణితోడి యింద్రుని పగిది కాలము గడుపుచుండెను. సర్వగుణసంపన్నయగు నామెతో కామతత్త్వ మెరిగిన ఆ రాజు లక్ష్మిని గూడిన నారాయణుని విధముగ దివ్య మందిరాలలో నానందమందెను.

ఆ విధముగ గొంతకాలము గడచినంతలో రాజువలన ఆ చారులోచనయగు గంగ గర్భము దాల్చి వసువును పుత్త్రునిగ బడసినది. ఆమె యతనిని పుట్టినతోడనే గంగలో పడవేసినది. అట్లే రెండవ కొడుకును జేసినది. అట్లు మూడవ, నాలుగవ, యైదవ, యాఱవ కొడుకులును గంగపాలైరి. తుద కేడవ కొడుకుగూడ మరణించెను. రాజుపుడిటుబోరున పలవరించెను. నేనిపు డేమి చేతును? ఇట నా వంశము స్థిరముగ నుండుటెట్లు? ఈ పాపాత్మురాలు చేజేతుల తన యేడుగురు కొడుకులను నీట గలిపినది. ఒకవేళ నన్నీమె వదలి వెళ్ళిన వెళ్ళుగాక. నాకు ప్రియమైన యీ యెనిమిదవ పుత్త్రునినైన చావునుండి వారించగలను. నేనిప్పుడడ్డుపెట్టనిచో నీమె యెనిమిదవ వానిని గూడ మరల నీటముంచును. నాకిక ముందు సంతు కలుగునో లేదోయను సందేహము గల్గుచున్నది. ఒకవేళ పుట్టినప్పటికి నీ దుష్టురా లతనిగూడ మననిచ్చునోలేదో? ఇట్టి సంశయములో నేనేమి చేయవలయునో నాకే తోచుటలేదు. కనుక వంశరక్షణ దొరకొనుట నా ప్రస్తుత కర్తవ్యవ్య'మని రాజనుకొనునంతలో నెనిమిదవ వసువష్టమ పుత్త్రుడుగ జన్మించెను. తొలుత నెవ్వడు తన భార్య మాట కాదనలేక నందినీ ధేను నపహరించెనో యతడే నే డష్టమపుత్త్రుడుగ నుద్భవించెను. అదిగని రాజు తన భార్య పాదాలు పట్టుకొని యిట్టుల పలవించెను : 

"నేను నీ దాసుడను. ఈ యొక్క కొడుకునైన వదలిపెట్టుము. ఈతని రక్షణ భారము నేను జూచుకొందును. నిన్నిదే ప్రార్థించుచున్నాను. నా కడుపు తఱుగుకొని పోవునట్లు పండ్లవంటి యేడుగురు ముద్దుబిడ్డలను నీ పొట్టను పెట్టుకొంటివి. ఈ యెనిమిదవవాని నొక్కనినైన బ్రతకనిమ్ము. నీ పాదాలు సాక్షిగ వేడుకొనుచున్నాను. నీవేదేని కోరుకొమ్ము. ఎంత దుర్లభమైనదైనను నా వంశ మికనైన నిలువబెట్టుము. అపుత్త్రకులకు స్వర్గగతులు లేవని వేదవిదులు వక్కాణించి పల్కుదురు. కాన నిపు డెనిమిదవ కొడుకును బ్రతుకనిమ్మని వేడుకొనుచున్నాను.

ఇది విన్నప్పటికిని గంగ బాలునిగొనిపోవ నుంకించుచుండెను. రాజపుడు గుండె చెఱువుగాగ పట్టరాని కోపమున నామెకిట్లు పలికెను. "ఓసీ! పాపిష్ఠురాలా! నీకు నరకమన్న జంకులేదు. నీవే పాపాత్ముని కడుపు చెట్టపుట్టితివో గదా! నేనిపుడేమి చేతును? నీవు వంశఘాతుకురాలవు. ఇంక నీవుండిన నుండుము, పోయిన నీ యిచ్చవచ్చు తావునకు పొమ్ము. కాని నా పుత్త్రుడు మాత్రమిక్కడనే యుండగలడు. నీతో నాకికనేమి పని?" అని గుండె ద్రవించునట్లు రాజు పలికెను. 

శిశువును గొంపోవుచు గంగ కోపమున నతకిట్లు పలికెను. పుత్రులన్న నా మనసు గూడ పడిచచ్చునదియే సుమా! నాకును గొంచెము మెత్తని గుండె కలదు. ఈ బాలునిగొని వనములందితనిని బోషింతును. నీ మాట నిలుపుకొనలేదు. నీ చేసిన శపథము భగ్నమైనది. కాన నిన్నిదే వదలి తరలుచున్నదానను. నన్ను గంగానదిగ నెఱుంగుము. దేవకార్యర్థ మరుగుదెంచితిని. 

పూర్వము వసువులు వసిష్ఠ మహామునిచే మనుజయోని బుట్టుడని శపింపబడిరి. వారు నన్నుగాంచి చింతాపరులై నీవు మాకు తల్లివి గమ్మని వేడుకొనిరి. నేను వారికటులే వరమిచ్చితిని. అందుచే నీకిల్లాలనైతిని. నా సంభవము దేవకార్యార్థ సిద్ధికని తెలిసికొనుము. ఆ యేడుగురు వసువులు ముని శాపమున మనకు పుత్త్రులై చనిపోయిరి. శాపవిముక్తి బడసిరి. ఈ బాలుడు మాత్రము కొంతకాలమిచటనే వసింపగలడు. గంగాదత్తుడగు నీ సుతుని గనుము. ఆ వసువు నీ సుతుడుగ జన్మించెనని తెలిసికొనుము. పుత్రోత్సాహ మనుభవింపుము. మహానుభావా! ఇతడు గాంగేయ నామమును విఖ్యాతి గడించ గలడు. మహాబలశాలి కాగలడు. నీవు తొల్లి నన్ను వరించిన చోటి కితనిని గొనిపోవుదును. ఇతడు యువకుడైన పిమ్మట నితనిని నీకప్పగింపగలను. తల్లిలేని బిడ్డ డెప్పుడైన సుఖముగ జీవింపజాలడు గదా!' అని గంగ యిత్తెఱుంగున బలికి యా బాలునిగొని యంతర్థానమందెను. 

శంతనుడు దుఃఖార్తుడై తన భవనమున కేగి వసించుచుండెను.

ఆ రాజు తన భార్యాపుత్రుల వియోగభరమున లోలోన కుములుచు రాజ్యపాలన సాగించుచుండెను. అట్లు కొంతకాలము గడచిన పిమ్మట శంతను రాజొకనాడు వేటకేగి మహిష సూకరములను మృగగణములను నురుమాడుచు గంగాతీరమేగెను. అట గంగ చిన్నచిన్న పాయలుగ పారుచుండెను. అదిగని రాజు విస్మయమందెను. అతడా నదీతీరమందు నారి సారించుచు బాణములు వదలుచున్న యొక సుకుమార కుమారుని గాంచెను. కాంచి రాజబ్బురపడి తన్ను తానే మఱచిపోయెను. ఆ బాలుడు తన-నాటి పుత్త్రుడగునో కాడో యెఱుగలేకుండెను. ఆ బాలుని బాణ ప్రయోగమందలి హస్తలాఘవము సాటిలేని విలువిద్య మానవాతీతశక్తి మదనుని బోలు రూపము ఇన్నియును గన్నారగని రాజు విస్తుపోయెను. రాజతనితో నీవెవరి పుత్త్రుడ'వని యడిగెను. అమ్ములు వదలుచు నాడుకొను బాలుడేమియును పలుకకయే వెంటనే యదృశ్యుడయ్యెను. ఆ బాలుని వాలకము చూచి యతడచ్ఛముగ నా పుత్త్రునివలెనే యున్నాడు. ఇపుడేమి సేతును? ఎటకేగుదును! అని చింతాతురుడయ్యెను?

అంత శంతనుడు గంగను స్తుతించి ప్రసన్నురాలిని జేసికొనెను. ఆ చారు స్వరూపిణి తొంటిరూపమున నతినికి దర్శన మొసంగెను. తన యంగకాంతు లెసగంగ వెలుంగుచున్న గంగను గని రాజామె కిట్లు పలికెను: 

'ఓ గంగా! ఈతడెవడు? నా బాలుడెక్కడ? నా బాలుని నాకు వేగమే చూపింపుము. 

గంగ యిట్లనియెను: 'ఓ రాజేంద్రా! ఇదిగో! ఇటడష్టమ వసువగు నీ పుత్త్రుడు. ఇత డింతకాలము నాచేత పోషింపబడెను. ఇపు డితనిని నీ చేతిలో పెట్టుచున్నాను. ఇతడే గాంగేయుడు, మహా తపస్వి. ఇతడే నీ కులమునకు వన్నెలు దెచ్చువాడగును. ఇతడెల్ల వేదములను ధనుర్వేదమును చక్కగ చదివెను. ఇతడింత కాలము వసిష్ఠునాశ్రమమున సకల విద్యాబుద్ధులు నేర్చెను. సర్వార్థములందు కుశలుడు. శుచి యయ్యెను. పరశురాము డెఱింగిన విద్యలెల్ల నితడెఱింగెను. ఇంక నీవితనిని గ్రహించి సుఖముగ నేగుము.' అని పలికి రాజునకు పుత్త్రు నొసంగి యంతర్హితయైనది. 

ఆ శంతనుడును ప్రమోదభరితుడై సుఖముగ నుండెను. ఆ శంతనుడు తన కొడుకు నాలింగనము చేసికొని శిరంబు మూచూచి యరదంబుపై నిడికొని తన పురమునకు బయలు దేరెను.

రాజు కరిపురికరిగి ఘనముగ పుత్రోత్సవ మొనరించెను. దైవజ్ఞులను రావించి శుభముహూర్తమడిగి రాజు ప్రకృతి జనుల నెల్లర బిలిపించి గాంగేయుని యువరాజు జేసెను. సకల సద్గుణోపేతుడగు పుత్త్రుని యువరాజు జేసి రాజు నిశ్చింతముగ నుండెను. గంగను గూడ మఱచిపోయెను. 

సూతుడిట్లనియెను : ఈ ప్రకారముగ వసువుల శాపకారణముగ గంగా సంభవము గాంగేయుని జన్మవృత్తాంతము పావన గంగావరతణము వసువుల సంభవము జరిగినవి. అన్నియును మీకు విశదపరచితిని. ఈ పుణ్యకథలు వినిన పుణ్యాత్ముడు నిస్సంశయముగ కలుషజాలము నుండి విముక్తి గాంచును. ఇంతవరకు మీకు వినిపించిన దానిని నేను మున్ను వ్యాసుని వలన వింటిని. ఇది బ్రహ్మ సమ్మితమగు శ్రీదేవీ పురాణమందలిది. ఆ పరమ పవిత్ర దేవీభాగవతము మహిమోజ్జ్వలములైన నానాఖ్యానక కథలతో పుణ్యమై పంచలక్షణ లక్షితమై వ్యాసుని ముఖకమలము నుండి వెడలి సుగుణామృత రసభరితమై యలరారుచున్నది. ఈ పుణ్యతహాసము పరమశ్రద్ధతో వినువారి దురితములు దూరమొనర్చును. కళ్యాణ సుఖము లొడగూర్చును అని యీ దేవీపురాణము లోకములందు ప్రఖ్యాతి జెందినది.

అధ్యాయము 25 శంతనుడు సత్యవతిని వరించుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 23 The story of Ganga and Shantanu - అధ్యాయము 23 గంగాశంతను వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 23

గంగాశంతను వృత్తాంతం

ఋషులిట్లనిరి : సూతమునీశా! సత్యవతి యొక్కయు మహాతేజశ్శాలియగు వ్యాసుని యొక్కయు జన్మములను గూర్చి చక్కగ వక్కాణించితివి. కాని మీరెంత చెప్పినను మా చిత్తములనుండి యొక సందియమెంతకును తొలగుటలేదు. వ్యాసుని తల్లి సత్యవతియని నుడివితివి. ఆమె మరల ధర్మవిదుడగు శంతను మహారాజు నెట్లు బొందినది? ఆ శంతను మహారాజు పురువంశ నరపతి; ధర్మిష్ఠుడు; అట్టివాడే మంచి కులము వృత్తిలేని యొక బోయవాని కూతురు నెట్లు వరించెను? ఆ శంతనుని మొదటి భార్య యెవరు? మేధావి యగు భీష్ముడు వసువంశమున నెట్లు జన్మించెను? మాకివన్నియును స్పష్టముగ నిపుడు తెలుపుము. భీష్ముడు సత్యవతీ సుతుడనియు మహావీరుడనియు చిత్రాంగదుని రాజుగ జేసినవాడనియును మున్ను నీవు దెల్పితివి. చిత్రాంగదుడు మరణింపగ నతని తమ్ముడు సత్యవతీ సుతుడగు విచిత్రవీర్యుడు రాజయ్యెను. కాని ధర్మిష్ఠుడు జ్యేష్ఠుడు బలిష్ఠుడునగు భీష్ముడుండగ విచిత్ర వీర్యుడెట్లు రాజుగ జేయబడెను? సత్యవతి తన సుతులు చనిపోగా బిట్టు పలవరించి తన కోడండ్రను గోళక పుత్త్రులను గనునట్టు లెట్టుల ప్రేరేపించెను? ఆ సత్యవతి భీష్మునకు రాజ్యమేల యొసగలేదు? ఆ మహాధీరుడేల పెండ్లి చేసుకొనలేదు? పెద్దవాడు మహాతేజస్వియగు వ్యాసుడు తన తమ్ముల భార్యలయందు సంతానమెట్లు గనెను? ఆ ధర్మమూర్తి యిట్టి యధర్మమున కెట్లు పూనుకొనెను? మహా పురాణకర్తయు ధర్మాత్ముడు నగు వ్యాసుడు పర భార్యలందు - నందులో తమ్ముల భార్యల నే విధముగ ననుభవించెను? ఆ మహాత్ము డిట్టి నింద్యమగు పనినెట్లు తలపెట్టెను? వేదసమ్మతునకిది శిష్టాచార మగునా? నీవు వ్యాసుని శిష్యుడవు. నీవే మా యీ శంక దీర్పజాలుదువు. మేమీ పుణ్యధర్మక్షేత్రమున సర్వముత్సాహముతో వినగోరుచున్నారము.

సూతుడిట్లనియెను: మును పిక్ష్వాకు వంశమున మహాభిషుడను చక్రవర్తి జన్మించెను. అతడు సత్యవంతుడు ధర్మశీలి. అతడు వేయి యశ్వమేధములు నూఱు వాజపేయములు వెలయంగ నొనరించి యింద్రుని ప్రసన్నునిజేసి స్వర్గసీమ నలంకరించెను. ఒకనా డా మహాభిషుడు బ్రహ్మసభ కేగెను. ఆత్తఱి నచట ప్రజాపతిని సేవించుకొనుటకు దేవతలెల్లరు విచ్చేసిరి. అచ్చటికి గంగాదేవియును బ్రహ్మ కొలువునకు వచ్చినది. అప్పుడొక పెనుగాలివాటున నామెమీది వస్త్రము తటాలున మీదికి లేచినది. దేవతలెల్ల రామె దిక్కు చూడక తలలు వంచుకొనిరి. కాని మహాభిషుడు మాత్ర మామెలోని రాగవిలసనముల నదేపనిగ కన్నెత్తి తేరిపార చూచుచుండెను. గంగయు నతడు తనయం దనురాగవంతుడయ్యెనని కనిపెట్టెను. వారు రాగ మత్తులగుట బ్రహ్మ గ్రహించి రోషావేశమున కోపించి రాజునిట్లు శపించెను: 

"నీవు మనుష్యలోకమున రాజుగ పుట్టుదువు గాక! నీవు మరల నీ పుణ్యబలమున నెల్లవిధముల నాకలోక మేతెంతువు." అని, 'ఈ రాజునం దనురాగవతివగుట వలన నేలపై పుట్టు'మని గంగను కూడ నతడు శపించెను.

అంత వారిరువురు నెడదలు కలగుండు పడగ బ్రహ్మను వీడ్కొని బయలుదేరిరి. అత డీ భువిపైని ధర్మతత్పురులగు రాజులున్నచో టరయుచుండెను. అంతలో నతనికి పురువంశజుండగు ప్రతీపుడు దోచెను. అత డతనికి తనయుడుగా దలచెను. 

అష్ఠవసువులదే సమయమున మక్కువ మీర తమ తమ భార్యలంగూడినవారై వారు వసిష్టాశ్రమమందు తమ భార్యలంజేరి విహార వినోదశ్రీల నోలలాడుచుండిరి. పృథువు మున్నగు వసువులలో నుత్తమ వసువొకడుగలడు. అతని పేరు 'ద్యో'. అతని భార్య నందినీ ధేనువును గాంచి తన పతితో నీ యుత్తమ ధేనువెవ్వరిదని యడిగెను. అతడామెతో నిట్లనియెను. 

"ఓ సుందరీ! వినుము, ఇది వసిష్ఠుని గోరత్నము. దీని పాలు పురుషుడుగాని స్త్రీగాని త్రాగినచో వారు పదివేలేండ్లు తరుగని చెఱగని నిండు జవ్వనమున నురకలు వేతురు." అనునతనితో నామె యిట్లు పలికెను. "ఈ నరలోకమందు నాకొక చెలిమి కత్తియ గలదు. ఆమె ఉశీనర రాజర్షిపుత్రి. మిక్కిలి శోభనగాత్రి. ఆమె కొఱకు పాలుగల్గిన నందిధేనువును దూడను గొనిరమ్ము. ఈ నందిని పవిత్రమైనది. కోర్కెలు దీర్చునది. నా చెలికత్తె యీ గోవుపాలు త్రాగును. ఆమె జరారోగములు లేక చిరము మనగలదు." ఆను నామె మాటలు విని 'ద్యో' పృథువు మున్నగు వసువులను వెంటబెట్టుకొని మునిని గణింపక నందిని నపహరించెను.

అంతలో మహాతాపసుడగు వసిష్ఠ మహాముని సత్వరమే ఫలాదులుగొని నిజాశ్రమ మేతెంచెను. అతనికి తన యాశ్రమమందు సవత్సయగు ధేనువు గనిపించలేదు. ఆ ముని దానికై వనములు గుహలు కలయ వెదకెను. కాని యది యెంతకు గనిపించలేదు. అందులకా ముని యెదలో కోపాగ్ని ప్రజ్వరిల్లెను. ఆ మహాముని ధ్యానయోగమున మునింగి తన గోవును వసువు లపహరించిరని యెఱింగెను. వారు నన్ను సరకు సేయక నా గోవును నాలేనితఱి నపహరించిరి. కాన వసువులందఱు మానవులుగ జన్మింతురుగాక. ఇందు ఏమియు సందియము లేదని వసిష్ఠుడు వసువులను శపించెను. వసిష్ఠ మహామునిచేత శప్తులమైతిమని వసువు లెఱిగి దుఃఖించి ముని సన్నిధి కేగిరి. వారు మునిని సంతసింపజేయుచు నతనికి శరణాగతులైరి. అట్లు మొగాన నెత్తుటిబొట్టులేక దీనాతిదీనముగ తన ముందు పడియున్న వసువులనుగని ముని ఇట్లు పలికెను: 

"మీరు ఒక్కొక్క సంవత్సరము వ్యవధానముతో నొకరి తరువాత నొకరుగ వెంటనే జన్మించి మరణింపగలరు. కాని నా సవత్స ధేనువును దొంగిలించిన వసువు నరలోకమున చాలకాలము వసించును. ఇట్లు వసువులు శపింపబడి వెళ్ళుచుండగ త్రోవలో వారికి నదీమతల్లి గంగాదేవి కనిపించెను. గంగయును శపింపబడి విలపించుచుండెను. వసువులామెకు ప్రణమిల్లి యిట్లనిరి : 

"ఓ దేవీ! మేమమృతాశనులముగదా! మానవగర్భమెందెట్లు జన్మింపనోదుము? నరుల కడుపున పుట్టుటకు మాకు విచారమున నున్నది. కావున నో గంగామాతా! నీవు స్త్రీ రూపము దాల్చి మాకు జన్మములు ప్రసాదించుము. శంతనుడను రాజు గలడు. నీవతనికి భార్యవుగమ్ము. మమ్ము పుట్టినవానిని పుట్టినట్టుల గంగ పొట్టన పెట్టుము. అట్లొనరించిన మాకు శాపముక్తి గల్గును. ఇది నిజము. ఆమె యట్ల యగుతమని మాట యీయగ వారు తమ లోకముల కేగిరి.

గంగయు మాటిమాటికి చింతించుచుడెను. ఆ మహాభిషుడు ప్రతీపునికి కుమారుడుగ జన్మించెను. అతడే శంతనుడనబడిన రాజర్షి - ధర్మాత్ముడు - సత్యసంగరుడు. 

పూర్వము ప్రతీపుడు సూర్యుని వరేణ్యమగు జ్యోతిని గూర్చి స్తోత్రము చేసెను. అప్పుడు గంగాజలమునుండి వరవర్ణిని శుభాననయగు స్త్రీ బయటి కేతెంచినవచ్చి ప్రతీపుని సాలతరువు వంటి కుడితొడపై గూరుచుండెను. 

రాజు నా యనుమతిలేకయే నా కుడితొడమీద గూరుచుంటివేమని తన యంకముపై నున్న యువిదతో ననియెను. ఓ కురుశ్రేష్ఠ! నా హృదయమున నీ పై ననురాగము కలదు. నీవమిత వీర్యుడవు. నీవు నన్ననుభవింపవేడెద. అందులకే నిన్ను జేరితిని. 

అపుడు రాజు రూప¸యవనసంపన్నయగు నా మదవతి కిట్లనియెను: నేను పరస్త్రీలను కన్నెత్తియైనను జూడనివాడను. నీవు నా కుడితొడను సమాశ్రయించి గూరుచుంటిని. అది కొడుకులకు కోడండ్రకు మాత్రమే తగినదని యెఱుంగుము. కావున నో కళ్యాణీ! నాకు పుత్త్రుడు గల్గిన మీదట నా కోడలవుగమ్ము. నీ పుణ్యముననైన నాకు పుత్త్రుడుదయించుననుటలో ననుమానము లేదు అన అటులే కానిమ్మని దివ్యదృష్టిగల యాకామిని యరిగెను. రాజుగూడ యా లలననే తలచుచు తన భవనమున కేగెను.

అంత కొంతకాలమున కారాజునకు పుత్త్రుడుగల్గి యుక్తవయస్కుడయ్యెను. అతడు వేట కడవికేగదలచెను. అపుడు రాజు తన కొమరున కానాటి స్త్రీ వృత్తాంతమంతయు దెలిపెను. అంతయు దెలిపి మరల నిట్లనియెను: 

"ఒకవేళ నా చారుహాసిని వరారోహయగు బాల నిన్ను దరిజేర రావచ్చును. అపుడు నీవు ఆ మనోరమయగు యువతిని భార్యగ స్వీకరింపుము, అంతేకాని యామెను నీవెవ్వతెవని మాత్ర మడుగకుము. ఇది నా యానతి. నీవామెనే ధర్మపత్నిగ జేకొని సుఖము బొందుము" అని తన పుత్త్రున కాదేశించి ప్రతీపుడు ప్రీతిజెందెను. పిమ్మట ప్రతీపుడు తన రాజ్యభారమెల్ల తన సుతునకప్పగించి తాను వనముల కరిగి శ్రీ పరాభట్టారికను నెదలో సమారాధించెను. ఆ రాజు తన తపోబలమున తనువును చాలించి స్వర్గసీమ నలంకరించెను. అతంట మహాతేజస్వియగు శంతనుడు సార్వభౌముడయ్యెను. ఆ శంతను మహారాజు వీడని ధర్మముతో దండనీతితో ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించెను.

అధ్యాయము 24 గాంగేయుని జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 22 The Birth Story of Sri Vyasa Maharshi - అధ్యాయము 22 శ్రీ వ్యాసమహర్షి జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 22

శ్రీ వ్యాసమహర్షి జన్మవృత్తాంతము

పూర్వ మొకప్పుడు మహాతేజుడగు పరాశర మహాముని సర్వతీర్థ యాత్రలు సంసేవించుచు యమునా తీరమున కేతెంచెను. అచటనొక నిషాదుడు భోజనము చేయుచుండెను. ముని తయనిని గని నన్ను నీ పడవలో నదియావలి గట్టునకు జేర్చుమనెను. నదీతీరమందు భుజించు నిషాదు డా ముని మాటలు విని తన కూతురగు మత్స్యగంధతో ఈ ముని తపోవీర్యుడు కడుంగడు ధర్మశీలి. ఇత డీ నది దాటగోరుచున్నాడు. వేగమే నీవితనినీ తెప్పపై నెక్కించుకొని యవ్వలి దరికి జేర్చుము అని పలికెను. వాసవి (ఉపరిచర వసు రాజపుత్రి) యగు మత్స్యగంధ తన తండ్రి మాట ననుసరించి ముని ప్రవరుని తన పడవలోని కెక్కించుకొని ముందునకు సాగుచుండెను. దైవయోగమున పరాశరముని ఆ చారులోచనను చూచి కామార్తుడై యామెను చేపట్టదలచి తన దక్షిణ హస్తముతో నా కోమలి కైదమ్మి పట్టుకొనెను. అప్పుడా ముదిత వలపుల నవ్వొలయ సిగ్గుల నిగ్గులు పెదవులపై చిందులాడు ఓ మునిప్రవరా! నన్ను చేపట్టుట నీకు నీ కొలమునకు నీ తపమునకు నీ శాస్త్రమునకు దగునే! నీవు పవిత్ర వశిష్ఠ వంశజుడవే! కులశీల సంపన్నుడవే! ధర్మజ్ఞుడవే! అట్టి నీవే కామావిష్టుడవగుట తగునా? ఈ లోకమందు మనుజ జన్మము కడు దుర్లభము. అందును బ్రాహ్మణుడై పుట్టుట మిక్కిలి దుర్లభమని తలంతును. ఓ బ్రాహ్మణా! కులము శీలము శాస్త్రము బట్టి చూడగ నీవు ఉత్తముడవు; ధర్మవిదుడవు. అట్టి నీవెక్కడ? ఈ చేపల కంపుదానను నేనెక్కడ? నన్ను తొలిసారిగ జూచినంతలోన నీకీయనార్య భావమెట్లు గలిగెను? ఈ నా మేనిలోనే శుభమును చవిచూడదలచి నన్నే మనసార చేపట్టదలచితివి? ఆహా! అంతేకాదు. నీవిపుడు కామాతురుడవై నా సమీపమునకే వచ్చుచున్నావు. నీ స్వధర్మము మఱచినావు. ఈ పవిత్రుడగు బ్రాహ్మణుడేమి! ఈతని యీ మందబుద్ధియేమి! ఈ నీటి నడుమనే ఇతడు నన్ను పట్టుచున్నాడు. కామాతురుడగు ఈతని మనస్సును వారించు వారెవ్వరును నిచట లేరు'' అని పలుకుచు ఆమె, అయ్యా! ఇంకను కొంచె మింద్రియములను కట్టివేయుము. నిన్నాదరికి జేర్చనిమ్ము అని మహా మునితో తీయగ పలికెను.

సూతుడిట్లనియెను: మదికింపైన ఆమె పలుకు లాలకించి మునిపుంగవు డా పట్టిన పట్టు కొంచెము సడలించెను. నది నెట్టులో దాటెను. వెంటనే ముని వరుడు మన్మథ భావనల కోపలేక మత్స్యగంధను మరల తన బాహు మూలములలో జిక్కించుకొనెను. ఆమె వణకుచు ముని కిట్టుల పలికెను. ఓ మునినాథా! నానుండి వెడలు దుర్గంధము నీకు రోత పుట్టించుట లేదా? జంటపడుచుల కూడిక సమమైన వయో రూపవంతులలో సరిగ జరిగిననే సంతృప్తికరముగ నుండును అని యా లేమ పల్కుటయే తడవుగా ముని యనుగ్రహమున నామె యోజనగంధగ ముద్దరాలుగ నందగత్తియగ మారి మరులూరించు ననురాగవతిగ మారెను. ఆమెను వెంటనే కస్తూరి పరిమళాలు విరజిమ్మెడి మేని క్రొత్తదనమున నిగ్గులు దేర్చి ముని తన దక్షిణ హస్తముతో నామె కడిచేయి పట్టుకొనెను. అపుడామె మునికిట్లు పలికెను. ముని వల్లభా! మన ఈ స్థితిని లోకము చూచును. తీరమందున్న నా తండ్రియు గాంచును. పశు ధర్మము దారుణమైనది. నాకది ప్రీతి గొల్పదు. కనుక మసక చీకటి పడుదనుక మదిని కొంచెము చిక్కబట్టుకొనుము. ఈ కలయిక నరులకు రేలగాని పగలు గూడదు గదా? దివా మైథున మతి దోషమని పెద్దలు దలంతురు. దీని వలన లోకము మనలను వ్రేలెత్తి చూపును' అను యుక్తియుక్తములైన యామె హిత వచనము లుదారుడగు మహాముని చెవులార వినెను.

అంత సమర్థుడగు మునీంద్రుడు తన పుణ్య ప్రభావమున వేగిరమే మంచుగల్పించెను. ఆ తటమంతయు పొగ మంచు నిండెను. ఆ మంచుపొగ పెంజీకటులో యన దట్టమయ్యెను. పిమ్మట నామె మృదువుగ నిట్లనియెను: 

"ఓ మునివర్యా! నేను కన్నియను. నీ యిచ్చ మెచ్చునట్లు నన్ననుభవించి నీవు వెళ్ళుదువు. నీవు అమోఘవీర్యవంతుడవు. నేను గర్భవతినైనచో నాకింకేది దిక్కు? నా తండ్రి కేమని చెప్పుకొందును? నా గతి యేమి గావలయును?"

పరాశరుడిట్లనియెను: ఓ కాంతా! నీవు నా మనసులోని కోర్కి తనివార తీర్చినను నీవు కన్నియగనే యుందువు. కనుక నేదేని కోరుకొనుము. వరమిత్తును. 

సత్యవతి యిట్లనియెను: లోకముగాని నా తల్లిదండ్రులుగాని యెఱుగని విధముగ నీ కార్యము చక్కబెట్టుము. కన్నెఱికము చెడకుండునట్లుగ ననుగ్రహించుము. నీవద్భుత వీర్యుడవు. నీవంటి పుత్రుడు నాకు గలుగు నట్లనుగ్రహించుము. నామేనెల్లవేళల సుగంధము విరజిమ్ముచుండవలయును. నేను నిత్య¸యవనమున నుండవలయును. 

పరాశరుడిట్లనియెను: ఓ సుందరీ! నీకు పరమపవిత్రుడు విష్ణ్వంశ సంభూతుడునగు సుపుత్రుడు జన్మించనున్నాడు. అతడు ముజ్జగములందును ప్రసిద్ధిగాంచును. ఏదో తెలియని దైవకారణమున నీయందు నా మనసు సంలగ్నమైనది. ఇంతకు మున్ను నేనెన్నడును మోహమున మునిగి యెఱుగను. అచ్చరల మెఱుగుమెచ్చులు గాంచియును వారిని నే నేనాడు కన్నెత్తియైనను జూడలేదు. ఇపుడు దైవయోగమున నిన్ను గన్నంతనే కామవశుడనైతిని. దీని కేదో తెలియని కారణమున్నదని నమ్ముము. దైవము మాత్రము దాటరానిది. అతి దుర్గంధవతివగు నిన్నుగని నేనేల వలచితి నందువేమో; వినుము. ఈ శుభముహూర్తమందే మహాపురాణకర్తయగు పుత్త్రుడు నీకు జన్మించగలడు, ఆ మహాత్ముడు వేదములు విభజించును. ముల్లోకములందు వన్నె వాసి గాంచును.' 

సూతుడిట్లనియె: ఈ విధముగ తనకు వశమైన యామెను యనుభవించి యమునాజలములందు అతి శీఘ్రముగ విడిచిపోయెను. ఆ సత్యవతి యదే మూర్తమున గర్భవతి యయ్యెను.

యమునా తీరమున రెండవ మన్మథునివలె వెలుగొందుచున్న సద్యోజాతుడగు పుత్రుని గనెను. ఆ పుట్టిన మహా తేజస్వి తన తల్లితో నిట్లు పలికెను. 

"నా మనస్సు తపము చేయుటకే నిశ్చితమై యున్నది. తల్లీ! నీ యిష్టమున్నచోటికి నీ వేగుము. నేను తపమాచరింప నరుగుదును. నావలన నీకేదేని పని యున్నచో నన్ను స్మరించుము. శీఘ్రమేవచ్చి నిన్ను సందర్శింతును. నీవు దిగులు మాని సుఖముండుము." అని వ్యాసుడు తపమున కేగెను. 

ఆమెయు తన తండ్రికడ కరిగెను. ఆమె తన పుత్త్రునొక దీవిపై నుంచినందున నతినికి ద్వైపాయనుడను పేరు వచ్చెను. అతడు విష్ణ్వంశ సంజాతుడగుట వలన పుట్టిననాటినుండి దినదిన ప్రవర్ధమానుడయ్యెను. అతడు ప్రతి తీర్థమందు గ్రుంకుచు తపమొనరించుచుండెను. ఈ విధముగ పరాశరమహర్షి వలన సత్యవతికి ద్వైపాయను డుద్భవిల్లెను. అతడు కలియుగము రాగానే వేద విభజన మొనరించి వేదవ్యాసుడని వాసికెక్కెను. శ్రీ మహాభారతేతిహాసమును పురాణ సంహితలును ప్రవచించెను. అతడా వేద విభాగములను తన ముఖ్యశిష్యులగు సుమంతుడు జైమిని పైలుడు వైశంపాయనుడు అసితుడు దేవలుడు శుకుడు మున్నగువారలచే అధ్యయనము చేయించెను. 

సూతుడిట్లనియెను : ఈ విధముగ మీకన్నియు సకారణముగ దెలిపితిని.
ఇది సత్యవతీ తనయుడగు శ్రీవ్యాసుని జన్మవృత్తాంతము. ఇటులు మహాత్ముల చరిత్రల కారణములు సుగుణములు గ్రహింపదగినవి. దైవకారణము వలన చేప కడుపునుండి సత్యవతి జన్మించినది. తొలుతనే సత్యవతికి పరాశరమునితో సంయోగము సంభవించెను. ఆ పిదపనే యామెను శంతనుడు పరిగ్రహించెను. కనుకనే పరాశరుని మది యామెయందు మొట్టమొదటనే లగ్నమైనది. ఆ ధర్మాత్ముడగు పరాశరు డార్యులకు దగని పని యేల యొనర్చును? కనుక నీయాఖ్యానక మాశ్చర్యకరము సకారణమునైనది. పుణ్యప్రదమైన యీ శుభాఖ్యానకము విన్న మతిమంతుడు పాపరహితుడగును. అతడు దుర్గతి జెందక నిత్యసౌఖ్యములందును.

అధ్యాయము 23 గంగాశంతను వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 21 Matsyagandha's birth story - అధ్యాయము 21 మత్స్యగంధ జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 21

మత్స్యగంధ జన్మవృత్తాంతము


ఋషులిట్లనిరి : సూతమహర్షీ! నీ పరమవచనములు రహస్యభరితములు. అవి తాపసులమగు మాకాశ్చర్య సందేహములు గొల్పుచున్నవి. తొల్లి శ్రీవ్యాసుని తల్లియగు సత్యవతిని శంతనుడు వివాహము చేసికొనెనంటివి. ఆ సత్యవతి తన పుట్టింటనుండగ నామెకు వ్యాసుడెట్లు జన్మించెను? వ్యాసుడు జన్మించినమీద నామెను శంతనుడెట్లు పెండ్లి చేసికొనెను? ఆ సత్యవతి కిరువురు కొమరు లెవరివలన గల్గిరి? మున్నగు విషయములు దెలుపు పరమపావన కథ యంతయును మాకు తేటతెల్ల మొనరింపము. నియతవ్రతులమగు మేము ఆ సత్యవతీ వ్యాసుల జన్మవృత్తాంతములు విన నుత్సమించుచున్నవారము. 

సూతుడిట్లనియె : ఆది పరాశక్తి అమృతయోని; ధర్మార్థ కామమోక్షప్రదాయిని; అట్టి పరమసత్యజ్యోతికి శిరమువంచి దోయిలించి యీ వరేణ్యమైన శ్రీదేవి పురాణగాథ ప్రవచింతును. ఆ శ్రీదేవీయొక్క వాగ్బీజము నుచ్చరించిన మాత్రమున శాశ్వత బ్రహ్మలోకసిద్ధి కరతలామలకమగును. ఆ యేకైక దేవియే కామితార్థప్రదాయిని. కాన నెల్లవాంఛితము లీడేరుటకా శ్రీదేవినే సర్వాత్మభావమున నెల్లరు నెల్లవేళల సంస్మరించుట యుక్తము.

తొల్లి ఉపరిచరుడను రాజు చేదిదేశ మేలుచుండెను. అతడు పరమధార్మికుడును సత్యనిత్యుడును ద్విజపూజకుడునై వన్నెకెక్కెను. ఇంద్రు డారాజు తపమునకు సంప్రీతిజెంది యతనికొక చక్కని స్ఫటిక విమానము ప్రదానము జెసెను. ఆ రాజా దివ్యవిమానమెక్కి భూమిపై దిగక అంతరిక్షమందే యెల్లెడల సంచరించుటవలన నతని కుపరిచవసువను నామమేర్పడెను. ఆ భూపతి ధర్మనిత్యుడని లోకములలో ప్రసిద్ధి వహించెను. అతని భార్య గిరిక. ఆ యము మిక్కిలి యందాల రాశి. వారి కమితవీర్యులు తేజోవంతులనగు నైదుగురు కొమరులు గలిగిరి. రాజు తన కొడుకుల నాయాదేశములకు పాలకులుగ నియమించెను. అంతనొకనాడు గిరిక ఋతుమతియై పుంసవనమున పవిత్రురాలై తన పతితో నెమ్మదిలోని తీరని కామవాంఛను దెలిపినది. అదేనా డా రాజు పితరు లతనిని శ్రాద్ధమునకై మృగములను కొనితెమ్మని కోరిరి అతడు యవశ్యకర్తవ్యమని నిశ్చయించుకొని లోలోన గిరికను తలపోయుచునే వేటకేగెను. అతడు వనమందుండియు తన భార్యను తలపోయుచునే యుండెను. ఆ రాజదేపనిగ తన ప్రియతమను తలచుచుండుటవలన నతని రేతస్సు స్ఖలితమయ్యెను. ఆతడు వెనువెంటనే దానినొక మఱ్ఱియాకున భద్రపఱచెను. 'ఈ నా వీర్య మమోఘమైనది. ఇది వ్యర్థము గారాదు. ఇపుడు నీ భార్య ఋతుస్నాతయై యున్నది. నా యీ యమోఘవీర్యమును నా ప్రియకంపవలయును' అని రాజు నిశ్చయించుకొనెను.

అతడు తన భార్యకు వీర్యము పంపదగిన సమయమెఱింగి దాని నభిమంత్రించి యొక మఱ్ఱియాకు దొన్నెలో నుంచెను. ఆ సమయమున తన సమీపమున నొక డేగ యుండెను. రాజు దానితో 'ఓ మహాభాగా! ఈ దొన్నెను తీసికొని త్వరితముగ మా యింటి కేగుము. అచట నా ప్రియ గిరిక గలదు. ఆమె యిపుడు ఋతుమతి. నీవు మా యింటికేగి దీని నామె కిమ్ము' అని పలికి డేగకు ఆ దొన్నె నిచ్చెను. ఆ డేగకు రాజమార్గము దెలియును. అది దొన్నెను తీసికొని వినువీధి కెగిరెను. అది తన ముకుపుటములతో దొన్నెను గట్టిగ పట్టుకొని యెగురుచుండగ నింకొక డేగ చూచి ఆ దొన్నె మాసమని తలచి దాని వెంటబడెను. అత్తఱి రెండు డేగలకు ఆకసమకుననే తుండ యుద్ధము జరిగెను. అటు లారెండును బోరాడు చుండగ వీర్యమున దొన్నె యమునానదిలో బడెను. వెంటనే యవి తమ తమ చోటులకు వెళ్ళినవి. అదే సమయమున అద్రికయను నొక దేవకన్యక యమునలో సంధ్యావందన మాచరించు నొక బ్రాహ్మణుని సమీపించినది. ఆ వరాంగన నీట మునుగుచు తిరుగుచు జలకేళి సలుపుచు వచ్చి వచ్చి యా బాపని పాదములు పట్టినది. అపుడా బ్రాహ్మణుడు ప్రాణాయమ మొనర్చుచుండెను. అతడా కామచారిణినిగని 'నా ధ్యానమున కాటంకము గలిగించితివి. కాన నీవు చేపవుగమ్ము' అని శపించెను. అపుడా యచ్చర విప్రశాపమున చేపయై యమునలో జరించుచుండెను.

డేగనుండి పడిన రాజవీర్యమును చేపరూపమందున్న యద్రిక గ్రహించెను. కొంతకాలమునకు దానికి పది నెలలు నిండెను. అంత మత్స్యజీవను లాచేపను వలలో బంధించిరి. వారా మీనము పొట్టచీల్చి చూడగ నందుండి మానవాకృతులు గల యిద్దఱు శిశువులు వెడలిరి. వారిలో నొకడు చక్కని బాలుడు. ఒకతే శుభాననయగు కన్య. ఆ జాలరివాడు వారిని వీక్షించి యాశ్చర్యమందెను. అతడు వారిరువురను రాజున కప్పగించెను. రాజా బాలుని తన పుత్త్రునిగ నంగీకరించెను. వసు సుతుడగు నా బాలుడు తన తండ్రివలెనే తేజో విక్రమసంపన్నుడై సత్యదర్మవంతుడై మత్స్యదేశమునకు రాజయ్యెను. రాజా కన్నియను మత్స్యజీవనున కొసంగెను. ఆమె యచట కాళి మత్స్యోదరి యను పేరుతో వన్నెకెక్కినది. ఆమెనుండి చేపల వాసన వెడలుటచే నామెకు మత్స్యగంధయను పేరు ఏర్పడెను. వాటి నుండి ఆమె మత్స్యరాజు నింటనే పెరుగుచుండెను. 

ఋషులిట్లనిరి: అద్రిక విప్రునివలన చేపగ శపింపబడినది గదా ! దాశరాజా చేపను పొట్టచీల్చి తినెను. ఆ యద్రిక తుదకేమైనది; ఆమె శాపమెట్లు తీరినది; ఆమె దివి కెట్లేగినది? అదంతయును మాకు వివరింపుము.

సూతుడిట్లనియె: ఆ విప్రుడు శపించిన నాడే యామె విస్యయముతో నతిదీరముగ నేడ్చుచు విప్రుని స్తుతించెను. ఆమె విలాపమునకు బ్రాహ్మణుని గుండె నీరైనది. అతడు దయతో నామె కిట్లనియెను: 

'ఓ కల్యాణీ! శోకింపకుము. శాపాంతము దెల్పుదును. వినుము. ఓ శుభాంగీ! నాశాపవవమున నీవు చేప వగుదువు. ఇద్దఱిని గందువు. ఆ పిదప నీశాపము తీరిపోవును.' ఇట్లామె శపింపబడి నదిలోని చేపయైనది. ఇద్దఱిని గన్నది. పిదప శాపముక్తి బడసినది. ఆమె శాపము దీరిన పిదప చేపరూపు వదలి దివ్యరూపమున దేవమార్గమున నరిగెను ఆ మత్స్యగంధయను కన్నియ దాశరాజు నింట నతని కూతురుగ బెరిగి పెద్దదగుచుండెను. శుభాంగియగు నామత్స్యగంధ చిఱుతప్రాయమున తన తండ్రి యింటినే యుండి పనులెల్ల చక్కబెట్టుచుండెను.

అధ్యాయము 22 శ్రీ వ్యాసమహర్షి జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

SRI DEVI BHAGAVATHAM PART 2 - శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

అధ్యాయము 21 మత్స్యగంధ జన్మవృత్తాంతము












అధ్యాయము 33 త్రిభువనేశ్వరి విషయమున జనమేజయ కృతప్రశ్నము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము


పంచాంగం

Chapter 20 Activity of Vyasa - అధ్యాయము 20 వ్యాసుని కార్యాచరణము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 20

వ్యాసుని కార్యాచరణము
ఋషులిట్లనిరి: దేవసత్తముడగు శుకుడా ప్రకారముగ పరమసిద్ధిని బొందిన మీదట వ్యాసుడేమి చేసెను? అదంతయును మాకు తేటతెల్ల మొనరింపుము. 

సూతుడిట్లనియె : వేదాభ్యాస పరాయణులగు శిష్యులందఱును అసితుడు దేవలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు మున్నగు తపోధనులెల్లరు వ్యాసు ననుమతిగైకొని ఆతని వీడి వెళ్ళిరి. శుకుడు పరమ గతి చెందెను. అంత మహాత్ముడు వ్యాసుడు తనకు సత్సాంగత్యము లేమిచే తాను వేరొకచో నేగదలచెను. ఆతడపుడు గంగాతీరమున పరాశరునిచేత విడువబడి శోకించుచుండిన తన తల్లియగు నిషాదకన్యను నెమ్మదిలో దలంచెను. అట్లు వ్యాసుడు సత్యవతిని దలంచి యాపర్వతము వీడి తన జన్మస్థానమున కేగెను. అచ్చో వ్యాసుడొక ద్వీపముజేరి సత్యవతిని గూర్చి యడుగగ నామె శంతనున కీయబడినదని నిషాదులనిరి. దాశరాజు వ్యాసునకు స్వాగతము బలికి ప్రీతితో బూజించి సత్కరించి దోసిలొగ్గి యిట్లు నుడివెను: 

"ఓ మునివరా! నేడు గదా నా జన్మము సార్థకమైనది. కులము పవిత్రమైనది. అమర దుర్లభమైన నీ దర్శనభాగ్యము నేటికి నాకు ప్రాప్తించినది. నీ రాకకు కారణమేమో తెలుపుము. ఈ నా భార్య బిడ్డలు - సంపద - అంతయును నీ యధీనమే. ఆ మాటలకు సంతసిల్లి వ్యాసుడచ్చోట సరస్వతీ నదీతీరమున చక్కని యాశ్రమ మేర్పరచుకొని తపమొనర్చుచు ధీరుడై యచ్చట కాలము గడుపుచుండెను. మహావిక్రముడగు శంతనునివలన సత్యవతి కిరువురు సుతులు గలిగిరని విని వ్యాసుడానందమంది యచటనే యుండెను.

ఆ యిరువురిలో పెద్దవాడు చిత్రాంగదుడు. అతడు సర్వలక్షణలక్షితుడు-శత్రుతాపనుడు. రెండవవాడు విచిత్ర వీర్యుడు. అతడు సద్గుణోపేతుడు. తండ్రికి సుఖము చేకూర్చువాడు. వీరిరువురికంటె పూర్వమే శంతనునకు మహావీరుడు పరాక్రమవంతుడగు గాంగేయుదుద్భవించెను. ఆ శంతనునివలననే సత్యవతియందీ యిరువురు జన్మించిరి. శంతనుండు సర్వలక్షణలక్షితులగు తనయులను బడసి దేవతలకు సైతము తా నజేయుడని తలంచెను. కొంతకాలము గడచినంతనే చినిగిన వస్త్రమును విడుచునట్లు కాలపరిపాకమున శంతనుడు తన తనువును విడిచెను. భీష్ముడు శంతనునకు యథావిధిగ సకల ప్రేతకార్యములను దానధర్మముల నాచరించెను. దేవవ్రతుడని ప్రసిద్ధుడైన భీష్ముడు తాను రాజ్యము చేయక చిత్రాంగదునకు పట్టముగట్టెను. ఆ సత్యవతీ సుతుడగు పరంతపుడు శుచి మహావీర్యుడు చిత్రాంగదుడును ఒకనాడు సేనల వెంటబెట్టుకొని వధ్యరురు మృగాదులను జూచుచు నడవిలో దిరుగుచుండెను. అపుడు దివ్యవిమానముపై చిత్రాంగదుడను గంధర్వుడు వనమందు సంచరించు చిత్రాంగదునిగని యతని చెంత దిగెను. ఆ సమబలశాలురకప్పుడు ఘోర రణము సంఘటిల్లెను. వారికి కురుక్షేత్రమున మూడేండ్లపా టేకధాటిగ రణము సాగెను. అందు చిత్రాంగదరాజు చిత్రాంగద గంధర్వుని చేతిలో మడిసి వీరస్వర్గమలంకరించెను. అది వినిన భీష్ముడు వెంటనే యతనికై యుత్తర క్రియలు జరిపెను. చిత్రాంగదుని మృతికై శోకించు భీష్ముని మంత్రులూరడించిరి. పిదప విచిత్రవీర్యుడు రాజయ్యెను. తనయునికై విలపించు సత్యవతిని మంత్రులు గురువులు నోదార్చి శోకముడిపిరి. సత్యవతి యూరడిల్లెను. వ్యాసుడును తన సోదరుడు విచిత్రవీర్యుడు రాజయ్యెను గదాయని సంతసించెను. యవనముననున్న విచిత్రవీర్యునకు వివాహము సేయ భీష్ముడు సంకల్పించెను.

సర్వలక్షణశోభితలగు కాశీరాజ పుత్రికలు మువ్వురు గలరు. వారి తండ్రి వారి వివాహమునకై స్వయంవరము చాటించెను. వేలాదిమంది రాజులు రాజకుమారులు స్వయంవరమునకు పిలువబడి సత్కరింపబడిరి. అపుడు మహావీరుడు మహారథుడగు భీష్ముడరదమెక్కిచని యక్కడి రాజుల యుక్కడగించి తన తేజస్విత భుజబలము నల్గురిలో ప్రదర్శించి భూపతులకు తలవంపులు గల్గించి యారాకుమార్తెలను బలిమితో గొనివచ్చెను. ధీరుడగు భీష్ముడా వామలోచనలను సొంతతల్లిగ-అక్కగ-కూతురుగ భావించికొని వచ్చి సత్యవతికి వారి నప్పగించి వేదవిదులు దైవజ్ఞులునగు ద్విజులనురావించి వివాహ శుభలగ్నము వారినడిగి తెలిసికొని తన సోదరుడు విచిత్రవీర్యునకు పెండ్లి చేయుటకు వివాహమంగళ ప్రయత్నములు జరుపుచుండెను. అంతలో నా కన్నెలలో బెద్దది గంగా తనయున కిట్లు పలికెను: 'ఓ కురుశ్రేష్ఠా ! నేనింతకు మునుపే సాల్వరాజును మనసార వరించితిని. ఆ భూపతియు నాపై నరురక్తుడైయుండెను. నేను ముందే యితరులచేత మనసార వరింపబడినదానను. నీవు బలశాలివి. కనుక నీవు నీ మదికి తోచినట్లు చేయుము.

సూతుడిట్లనియె: ఇట్లా కన్యపలుకగ భీష్ముడామె విషయమును తన తల్లి మంత్రి పురోహితుల ముందుంచి వారితో సంప్రతించి గాంగేయుడా కన్నియతో నీ యిష్టమున్నచోటికేగుమని చెప్పెను. అంత నా మగువ సాల్వుని సరసకు జని యతనితో నిట్లు పలుకసాగెను: 

"ఓ నరపతీ! నేను నీపై ననురక్తనని ఎరిగి భీష్ముడు నన్ను విడిచిపుచ్చెను. నిన్ను చేరిన నన్ను చేపట్టుము. ఓ నృపసత్తమా! నీకు నే నత్యంతము ధర్మపత్నిని. నీవును మునుపు నన్నట్లే తలచితివి. 

సాల్వుడిట్లు పలికెను: ఓ వరారోహా! ఆనాడు భీష్ముడు నా కన్నలుముందే నిన్ను పట్టుకొని రథముపై కూర్చుండ బెట్టుకొనెను. కాన నింక నేను నిన్ను చేపట్టుట కల్ల. పరోచ్ఛిష్టయగు కన్య నే మతిమతుండు చేరపట్టును? భీష్ముడు వదలిన నిన్ను తల్లిగదలంచి నేను నీ కేలు పట్టను.

అపుడా కన్నియ సాల్వునిచేత వదలబడి కన్నీరుమున్నీరుగ నేడ్చుచు మరల భీష్ముని జేరవచ్చి యతని కిట్లు పలికెను : 

'నేను నీచేత వదలబడితిని. కనుక సాల్వుడును మరల నన్ను చేపట్టుటలేదు. నీవు గొప్ప ధర్మవిదుడవు. నన్ను నీవే స్వీకరింపుము. లేనిచో నీముందు ప్రాణములు తీసికొందును.' 

భీష్ముడిట్లనియె : 'ఓ వరవర్ణినీ ! నీ మది వేరొకనియందు దగుల్కొనియున్నది. నిన్నెట్లు గ్రహింతును? నీవు నీ పుట్టింటి కేగుము.' భీష్ముడా మాట యనగనే యామె వనములకేగి పవిత్రతీర్థములం దొంటరిగ తపమొనర్ప దొడగెను. మిగిలిన కాశిరాజసుతలు రూపవతులు - అంబ అంబాలిక యనబడు వారలు ఇరువురు విచిత్రవీర్యుని భార్యలైరి. ఆ మహాబలుడగు విచిత్రవీర్యుడు వారిని గూడి సెజ్జలందు పూసెజ్జలందు తమకమున తొమ్మిదేండ్లు క్రీడించుచు విమరించుచుండి రాజయక్ష్మరోగముతో కాలధర్మ మందెను. తన కొడుకు మరణించగ సత్యవతి దుఃఖముతో ఆతనికి మంత్రులచే నంత్యక్రియలు జరిపించినది. ఆమె యొకనాడు విలపించుచు భీష్మునితో నొంటరిగ నిట్లనియెనుః 

'ఓ మహాభాగా! నీవును శంతనుని సుతుడవే గద! కనుక రాజ్యభారము వహించుము. నీ తమ్మునిభార్యలను చేపట్టి వంశము నిలువబెట్టుము. ఆ యయాతి వంశమడుగంటకుండునట్టు లొనరింపుము.' 

భీష్ముడిట్లనియె: 'తల్లీ! మా తండ్రితో నేను మునుపొనరించిన ప్రతిన నీవు విన్నదే గదా! నేను రాజ్యము చేయను. పెండ్లి చేసికొనను.' 

సూతుడిట్లనియె: ఆ మాటలకు సత్యవతి 'ఈ వంశమిక నిలబడుటెట్లొకో? ఆలసించిన దేశములో నరాజకము ప్రబలును. అపుడు నా మది కింక శాంతియే యుండదు.' అని యామె చింతాకులితయై వగచినది. అపుడు గాంగేయు డామెతో నిట్లు పలికెనుః 

' ఓయమ్మా, చింతిల్లకుము. విచిత్రవీర్యునకు క్షేత్రజపుత్త్రుడు గల్గు నట్లొనరింపుము. ఒక కులీనుడగు నుత్తమబ్రాహ్మణుని రావించి నీ కోడండ్ర నతనితో గలుపుము. ఇందు దోషము లేదు. ఇట్లు వంశము నిలువబెట్టుకొనవచ్చునని నిగమములు వాక్రుచ్చినవి. అపుడు నీ మనుమని రాజుగజేసి నేనతని శాసనమున రాజ్యము చక్కబెట్టుదును.'

భీష్ముని మాటలు విని యామె తన కానీననందనుడు కలుషరహితుడునగు వ్యాసుని నెమ్మదిలో దలంచినది. తన తల్లి తలచినంతలోనే వ్యాసతాపసు డేతెంచి యామెకు చేయెత్తి మ్రొక్కి యామె చెంత బ్రహ్మజ్యోతులు విరజిమ్మ నిలుచుండెను. వ్యాసుడపుడు భీష్మునిచేత బూజితుడై సత్యవతిచేత మర్యాదలందుకొని పొగలేని యగ్నిజ్వాల పగిది వెలుగుచుండెను. సత్యవతి వ్యాసునితో 

'నీ మహావీర్యమువలన విచిత్రవీర్యుని భార్యలందు చక్కని కుమారుల నుత్పన్నుల చేయు' మని చెప్పెను. వ్యాసుడు తన తల్లిమాట మేరమీర కామె మాట నాప్తవాక్యముగనెంచి యట్లయగుత మని పలికి ఋతుకాలమున కెదురు చూచుచుండెను. అంత నొకనా డంబిక ఋతుస్నాతయై మునివరుని పొందిక కేగినది. కాని కన్నులు మూసికొని మునివరునితో సంగమమందెను. ఫలితముగ గ్రుడ్డివాడు జన్మించెను. పుట్టుగ్రుడ్డియగు కుమారుడు పుట్టుటవలన సత్యవతి మిగులు దుఃఖించెను. అపుడామె తన రెండవ కోడలినిగూడ వ్యాసునివలన పుత్రుని బడయుమని ప్రేరించినది. అంతనొకనాడంబాలికయును ఋతుస్నానయై వ్యాసమునిని గూడెను. ఫలితముగ నామెయదే రేయి గర్భము దాల్చెను. ఆ యంబాలికకు పుట్టిన బాలుడు పాండువర్ణమున నుండెను. అతడేలుబడికి తగడు. కనుక సత్యవతి తన కోడలి నొకయేడాది తరువాత మరల నొక పుత్త్రుని గనుమని ప్రోత్సహించినది. సత్యవతి మరల వ్యాసముని నాహ్వానించినది. సత్యవతిచేత పంపబడిన వధువు వ్యాసుని మహోజ్జ్వలతేజముముందు నిలువద్రొక్కుకొని యుండలేక తన దాసిని గదిలో కంపినది. ఆమె వ్యాసుని పొందిన పొందికకు ఫలితముగ నొక కొడుకును గనెను. అతడే విదురుడు. ఈ ప్రకారముగ వ్యాసుని యనుగ్రహమున ధృతరాష్ట్రాదులు మువ్వురు కురువంశము నిలువబెట్ట జన్మించిరి. సోదరధర్మము దెలిసిన శ్రీ వ్యాసమహర్షి వలన నీ విధముగ కురువంశము నిలువబెట్టబడినది. ఓ యనుఘులారా! మీకీ ప్రకారముగ శ్రీవ్యాసుని వంశోత్పత్తి చరిత్ర సంపూర్ణముగ నభివర్ణింపబడినది.


శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 19 Sri Sukuni's married life - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 19

శ్రీ శుకుని వైవాహికజీవనము

శ్రీ శుకుడిట్లనియె: "ఓ మహాశయా! ఈ మాయామోహములో కొట్టుమిట్టాడు నరుడు నిష్కము డెట్లగును? అను సందేహమింకను నన్ను కలత పెట్టుచున్నది. శాస్త్రజ్ఞానము నిత్యానిత్యవివేకము గలిగియున్నప్పటికిని చిత్తము మోహభ్రాంతిని వదలజాలదు. ఇక నరుడు విముక్తుడగుటెట్లు? అట్టడుగున పేరుకొన్న తమమును శాస్త్రజ్ఞానము తొలగింపజాలదు. దీపమను మాట పల్కినంతనే యెక్కడైన పెంజీకట్లు పాయునా? రాజా! విబుధులెన్నడును సర్వభూతములకు ద్రోహము తలపెట్టరు. వాని పొట్టపై కొట్టరు. అట్టి చక్కని చల్లని నెచ్చెలిమి గృహస్థున కెట్లు గల్గును? మిమ్మింకను రాజ్యసుఖాసక్తి పదవ్యామోహము ధనదాహము విజయకాంక్ష వదలలేదు గద? మీకిక జీవన్ముక్తి యెట్లు చేకూరును? నీకు చోరులందు చోరత్వబుద్ధి తాపసులందు సాధుతాబుద్ధి గలదు గదా? ఇట్టి స్వపరబేదములు గూడు కట్టుకొని యున్నంతవఱకు విదేహుడ వెట్లగుదువు? తీపి పులుపు ఉప్పు కారము వేడిమి మున్నగు రుచులందలి మంచిచెడ్డలు నీవు గ్రహింపగవు గదా! వీనియందలి మంచి పదార్థమునకు నీ మది యుప్పొంగును. చెడ్డకు క్రుంగును. ఆయా కాలములందు నీకును మెలకువ-కల-నిద్దుర మున్నగు నవస్థలు గల్గుచుండును గదా! ఇంక నీకు తురీయావస్థ గల్గుటెట్లు? అన్ని రథగజతురగపదాతి బలములు నా వశమున గలవు. వానికి నే నధిపతిని అని నీవు తలంతువా? తలంపనా? నీవు రుచించు పదార్థములనే తిందువు; సంతసింతువు; వ్యాకుల పడుదువు. అట్టి నీకు పాము పూలమాల- ఈ రెంటిలో సమబుద్ధి యెట్లుండును. కేవలము మన్ను-శిల-బంగారము-వీనియందు సమబుద్ధి గలవాడే ముక్తుడు; సర్వసముడు; సర్వభూతహితుడు; భూతదయాళువు; సర్వాత్మభూతుడు; సర్వభూతహితకరుడు. నా చిత్తమిల్లు పెండ్లములందు తగుల్కొనుటలేదు. నేను స్థితప్రజ్ఞుడనై యేకాంతములో పరబ్రహ్మమున జరింపవలయునన్నదే నా దృఢనిశ్చయము. నిస్సంగుడను నిర్మముడను నిష్పరిగ్రహుడను నిర్ద్వంద్వుడనై మృగముమాడ్కి నాకులలములు ఫలమూలములే తినుచు దిరుగవలయుననియే నా చిర వాంఛితము.

ఓ పార్థివా! నేను గుణములకందనివాడను. నా హృది వైరాగ్యకాంతులతో నిర్మలముగ నున్నది. నాకిక ధనరాసులతో నిండ్లతో మమతలతో బంధించు పెండ్లముతో నేమి ప్రయోజనము? పెక్కు రాగసంకులములగు వివిధాకారముల నెదలో భావించుచునే నీవు ముక్తుడనైతినని తలంతువు. కాని యదంతమును వట్టి డంబాచారమేయని నాకు దోచుచున్నది. నీ కొకప్పుడు ధనచింత మరొక్కప్పుడు శత్రుచింత వేరొకప్పుడు సైన్యచింత గల్గుచుండును గద| ఇంక నీవు నిశ్చింతుడవై యెప్పుడుందువు? మితాహారులు-జితక్రోధులు-నియతవ్రతులునగు వైఖానసమునులు గూడ ఈ సంసారము మిథ్యయని తలంచియు నిందేదో యనుభవించవలసినది గలదని యిందే తగుల్కొందురు. నీ వంశజుల కెల్లరకు విదేహనామము గలదు. ఆ పేరు కుటిలమైనది. అది మీకు తగినది కాదు. మూఢునకు విద్యాధరుడని చీకునకు దివాకరుడని కటికదరిద్రునకు శ్రీనివాసుడని పేరులు పెట్టబడును. కాని యవన్నియు వారికి సార్థకములుగావు గదా! నీ పూర్వజులకు విదేహులను పేరున్నట్లు నేను మున్ను వింటిని. ఆ పేరు నామమాత్రమేగాని కర్మవలన గల్గినది మాత్రముగాదు. తొల్లి మీ కులమున నిమియను రాజుండెను. ఆతడు యాగము చేయదలచి తన కులగురువును బ్రహ్మర్షియునగు వసిష్ఠుని అందులకై ఆహ్వానించగా వసిస్ఠుడు 'నేను ఇంతకు పూర్వుమే యింద్రునిచే నొక యాగమున కాహ్వానింపబడితివి. అతని పని పూర్ణముగావించి తిరిగి నీ యాగమునకు వత్తును. అందులకు వలయు సాధనసామగ్రులు మెలమెల్లగ సమకూర్చుకొనుచుండును' అని పలికెను. వసిష్ఠుడు మహేంద్రుని యాగమునకు వెడలెను. ఇచట నిమియు వేరొక మునిని గురువుగనుంచి జన్నమునకు బూనుకొనెను. అది విని కోపించి వసిష్ఠుడు ఓరీ గురుద్రోహీ! నీ దేహము పతితమగుగాకని నిమిని శపించెను. నీ మేను పడిపోవుగాక! అని నిమిగూడ మునిని శపించెను. ఇట్లిర్వురు నొండొరుల శపించుకొని పతితులైరని నేను మునుపు వింటిని. ఆ రాజు విదేహుడే యైనచో గురువట్టులేల శపించుచు? ఇంతకిదంతయును నా మదికి వింతగ దోచుచున్నది.

జనకుడిట్లనియె: ఓ శుకమునీ! నీవు పల్కినదంతయును యథార్థమే. ఇందసత్యములేదు. ఐనను నా గురువు చెప్పినది వినుము. నీవు నీ తండ్రితోడి సంబంధము విడనాడి యెక్కడికో కాఱడవులకేగదలతువు. కాని యక్కడను నీకు మృగసంబంధముండును. ఇందు సందేహము లేదు. ఆ పంచమహాభూతములెల్లడల వ్యాపించియుండునే| నీకచటగూడ నాహారచింత తప్పదు. దండాజినముల చింతయుడును. అట్లే నాకిచట రాజ్యచింతయు నుండును. దూరదేశముల నుండి వచ్చుటచే నీ చిత్తము వికలమై యున్నది. నేనిచట నే వికల్పములకును సంశయములకును దూరమందుందును. నేను సుఖముగా భుజింతును. హాయిగా నిదురింతును. బద్ధుడనుగాను, స్వతంత్రుడనను తెలివి వెలుగుచేత సంతతము సుఖముందును. నేను బద్ధుడనను శంకచే నీవింత దురపిల్లుచున్నావు. కాన నికనైన నిట్టి యనుమానము మాని స్థిరమతివై సుఖముండుము నేను దేహమను-బద్ధుడను. అనుకొన్నంతకాలము నీకు ముక్తి హుళక్కి. నేనీ ధనరాసులు భవనాలు రాజ్యము నావికావను తలంపున సుఖముందును. 

సూతుడిట్లనియె: ఆ జనకుని హితవచనము లాలకించి శుకుడు సంప్రీతమనంబుతో రాజు ననుమతి బడసి తిరిగి తన తండ్రియాశ్రమ మేగెను. తిరిగి వచ్చిన నందనునిగాంచి వ్యాసుడమితానందమందెను. గుండెకు హత్తుకొని శిరము మూర్కొని సేమమడిగెను. ఆ పవిత్రాశ్రమమందు శుకుడు తన తండ్రితోడ వేదాధ్యయనముచేసి సర్వశాస్త్ర పారంగతుడయ్యెను. రాజ్యమేలుచున్నను నిరహంకృతితో నిర్మమత్వముతో సమదృష్టితో వెలుగొందు జనకునిగాంచి శుకుడు తన తండ్రి యింటనే యుండెను. అతడు యోగమార్గగామి. ఐనను పితరుల కన్నియను పీవరియను నామెను భార్యగ నంగీకరించెను. ఆమెయందు నల్వురు పుత్త్రులను బడసెను. వారు కృష్ణుడు గౌరప్రభుడు భూరి దేవశ్రుతుడన బరగిరి. మహావీర్యుడగు శుకుడు మరల కీర్తియను కూతును బడసి ఆమెను విభ్రాజసుతుడగు అణుహునకిచ్చి పెండ్లి చేసెను. అణుహుని తనయుడు శ్రీమంతుడగు బ్రహ్మదత్తుడు. అతడు మహాప్రతాపి. శుకకన్యకు గలిగిన అతడు బ్రహ్మజ్ఞానముగల రాజయ్యెను. అతడు కొన్నాళ్లకు నారదోపదేశమున యోగమార్గమవలంబించి తన కుమారునకు రాజ్య మప్పగించి బదిరికాశ్రమముజేరి అచట మాయా బీజోపదేశమంది పరిపూర్ణ బ్రహ్మజ్ఞానియయ్యెను.

శుకుడును నారదుని యనుగ్రహమున తన తండ్రి సంగతి వదలి ముక్తిప్రదమగు కైలాస శిఖరము చేరెను. ఆ చోట నతడు సర్వసంగపరిత్యాగియై నిర్వికల్ప సమాధిలో మునింగి సిద్ధాత్మస్వరూపుడై యాగిరిశిఖరమునుండి యూర్ధ్వమున కెగిరెను. వెంటనే గిరిశిఖరము రెండు వ్రయ్యలయ్యెను. అత డాకాశవీధిలో రెండవ భాస్కరుని బోలి దివ్యతేజమున ప్రకాశించెను. శుకుడు నింగికెగయగనే యిట పెక్కులుత్పాతములు సంభవించెను. అంతరిక్షమందలి వాయువును సురర్షులు ప్రశంసించునటులే శ్రీశుకుని మునులు సన్నుతించిరి. ఆ విధముగ సర్వభూతాత్మకుడు గగనసీమలో రెండవ భాస్కరునివలె బ్రహ్మజ్యోతులతో తేజరిల్లుచుండెను. ఇట వ్యాసుడు పుత్త్రవియోగము భరించలేక పుత్రా పుత్రాయని దెసలు మార్మ్రోగ బిట్టాక్రోశించెను. ఆ శుకుడు తపమాచరించిన గిరిశిఖరములందు అతిదీనుడై శోకించు వ్యాసునిగని సర్వభూతమయుడు సర్వసాక్షియగు పరమాత్మ వ్యాసునకు ప్రతిధ్వనితో మారు పలికెను. ఆ గిరిశిఖరములపై నేటికిని ఆ ప్రతిధ్వని స్పష్టముగ వినబడుచుండును. పుత్త్రవిరహమున పరిప్లుతుడై పుత్ర! పుత్త్ర! యని శోకమున మునిగిన వ్యాసుని చెంతకు పరమశివు డేతించి యతని నిట్లు ప్రబోధించెను: 

"ఓ వ్యాసమునీ! శోకింపకుము. నీ నందనుడు యోగవిత్తముడు. అతడకృతాత్ములకు దుర్లభమైన పరమగతిని జేరెను. బ్రహ్మజ్ఞానివగు నీవతనికై బెంగపెట్టుకొనకుము. నీ పుత్త్రునివలన నీకు చిరయశము గల్గినది. 

వ్యాసుడిట్లనియె: మహాదేవా! నేనేమి చేతును? ఎంతకు నా శోకమాగుట లేదు. నా కన్ను లింకను పుత్త్రదర్శనమునకే పరితపించుచు ఎదరు తెన్నులు చూచున్నవి. 

శివుడిట్లనియె: అటులైన నీప్రక్కనే నీకతని చక్కటి నీడ నిత్తెము పొడగట్టుచుండును. ఆ నీడను చూచుకొని శోకము విడుపుము. 

సూతుడిట్లనియె: అంత వ్యాసుడు తన తనయుని కాంతిమంతమైన నీడ గాంచెను. వామదేవుడా విధముగ వరమిచ్చి యచ్చోట నంతర్ధానమందెను. పిమ్మట వ్యాసుడు నిజాశ్రమమున కేగెను. ఐనను వ్యాసుడు తీరని పుత్త్రవియోగభారమున దుఃఖితుడై తపించెను.

అధ్యాయము 20 వ్యాసుని కార్యాచరణము

పంచాంగం

Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను ...