Friday, April 10, 2026

Chapter 24 The Birth Story Of Bheeshma - అధ్యాయము 24 గాంగేయుని జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 24

గాంగేయుని జన్మవృత్తాంతము

సూతు డిట్లనియెను : ఆ ప్రకారముగ ప్రతీపరాజు దివికేగిన పిమ్మట సత్యవిక్రముడగు శంతనుడు మృగవ్యాఘ్రముల బరిమార్చుచు మృగయాశీలుడయ్యెను. ఒకనాడారాజడవిలో దిరుగుచు మృగశాబకలోచన - మనోహరాభరణ యగు జవ్వనిని గాంచెను. రాజా రెండవ లక్ష్మియోయన రూప¸యవనముల నలరారు జవరాలిని గాంచి యానాడు తన తండ్రి పేర్కొనిన పడతి యామెయే కాబోలునని తలంచెను. ఆ పద్మాక్షిలోని ముఖకాంతులెంత చూచినను రాజునకు తనివిదీరుటలేదు. రాజు మది యాకామిని యెడదలో జిక్కుకొనెను. అతనిహృది సమ్మదము కలిగించు కామనలతో వ్యాప్తమయ్యెను. ఆ గంగానదియు నానాటి మహాభిషుడీ రాజేయని తెలిసికొని యతని విషయమున ప్రేమానురాగతరంగితయై చిఱునగవుతో రాజు నెదుట నిలిచెను. రాజా యసితాపాంగిని చూచి మిగుల ప్రీతినొందిన చిత్తముతో లాలించి కమ్మని పలుకులతో నామె కిట్లు మధురవాక్యములు పలికెను : 

"నీవు దేవతవో! గంధర్వ యక్షనాగకన్యలలో నెవ్వతెవో! కాక - మానిసివో! నీవెవ్వరవైన నౌదుగాక! నాకు నీపై ననురాగము కల్గినది. నాకు ధర్మపత్నివి గమ్ము."

సూతు డిట్లనియెను : ఈమెయే యానాటి గంగయని రాజెఱుగడుగాని నాటి మహాభిషుడితడేయని గంగకు దెలియును. రాజు మాటలు విని వెనుకటి ప్రేమ సమాయోగము దలంచి చిరునగవుతో గంగాదేవి రాజున కిట్లనెను : 

"నరపతీ! నీవు ప్రతీపుని కుమారుడవని నేనెఱుంగుదును. నీవంటి నరపతిని తన పతిగ నే యందగత్తె గోరుకొనదు? రాజా! నా వాగ్బంధముననే నిన్ను పతిగ నొనర్చుకొనగలను. కాని నిన్ను వరించుటకు నాదొక ప్రతిన గలదు. వినుము. శుభాశుభములలో నేనేది చేసినను నీవు గాదనగూడదు. నాకప్రియముగ బలుకగూడదు. నా యీ ప్రతినను తిరస్కరించిననాడు నేను నిన్ను విడనాడి స్వేచ్ఛగ నెటకే నేగుదును." అని గంగాదేవి వసువుల రాబోవు జన్మలను మహాభిషుని ప్రేమప్రార్థనను తన యెడదలో దలచె. 

రాజామె మాట కామోదము వెలిపుచ్చెను. ఆమెయు రాజునటులే పతిగ భావించెను. ఇట్లు గంగాదేవి మనుష్య యువతి రూపమున ఆ శంతనునకు పత్ని అయ్యెను. ఆ వరవర్ణిని రాజువెంట రాజభవనము కేగెను. ఆ రాజుకూడ ఉద్యానవనములందామెతో కూడి విహరింపసాగెను. ఆ సుందరియు అతని భావమెరిగి అతని నానంద పెట్టుచుండగా ఎన్ని ఏండ్లు గడచినదియు ఎరుగక ఆ రాజేంద్రుడా హరిణాక్షినిగూడి యింద్రాణితోడి యింద్రుని పగిది కాలము గడుపుచుండెను. సర్వగుణసంపన్నయగు నామెతో కామతత్త్వ మెరిగిన ఆ రాజు లక్ష్మిని గూడిన నారాయణుని విధముగ దివ్య మందిరాలలో నానందమందెను.

ఆ విధముగ గొంతకాలము గడచినంతలో రాజువలన ఆ చారులోచనయగు గంగ గర్భము దాల్చి వసువును పుత్త్రునిగ బడసినది. ఆమె యతనిని పుట్టినతోడనే గంగలో పడవేసినది. అట్లే రెండవ కొడుకును జేసినది. అట్లు మూడవ, నాలుగవ, యైదవ, యాఱవ కొడుకులును గంగపాలైరి. తుద కేడవ కొడుకుగూడ మరణించెను. రాజుపుడిటుబోరున పలవరించెను. నేనిపు డేమి చేతును? ఇట నా వంశము స్థిరముగ నుండుటెట్లు? ఈ పాపాత్మురాలు చేజేతుల తన యేడుగురు కొడుకులను నీట గలిపినది. ఒకవేళ నన్నీమె వదలి వెళ్ళిన వెళ్ళుగాక. నాకు ప్రియమైన యీ యెనిమిదవ పుత్త్రునినైన చావునుండి వారించగలను. నేనిప్పుడడ్డుపెట్టనిచో నీమె యెనిమిదవ వానిని గూడ మరల నీటముంచును. నాకిక ముందు సంతు కలుగునో లేదోయను సందేహము గల్గుచున్నది. ఒకవేళ పుట్టినప్పటికి నీ దుష్టురా లతనిగూడ మననిచ్చునోలేదో? ఇట్టి సంశయములో నేనేమి చేయవలయునో నాకే తోచుటలేదు. కనుక వంశరక్షణ దొరకొనుట నా ప్రస్తుత కర్తవ్యవ్య'మని రాజనుకొనునంతలో నెనిమిదవ వసువష్టమ పుత్త్రుడుగ జన్మించెను. తొలుత నెవ్వడు తన భార్య మాట కాదనలేక నందినీ ధేను నపహరించెనో యతడే నే డష్టమపుత్త్రుడుగ నుద్భవించెను. అదిగని రాజు తన భార్య పాదాలు పట్టుకొని యిట్టుల పలవించెను : 

"నేను నీ దాసుడను. ఈ యొక్క కొడుకునైన వదలిపెట్టుము. ఈతని రక్షణ భారము నేను జూచుకొందును. నిన్నిదే ప్రార్థించుచున్నాను. నా కడుపు తఱుగుకొని పోవునట్లు పండ్లవంటి యేడుగురు ముద్దుబిడ్డలను నీ పొట్టను పెట్టుకొంటివి. ఈ యెనిమిదవవాని నొక్కనినైన బ్రతకనిమ్ము. నీ పాదాలు సాక్షిగ వేడుకొనుచున్నాను. నీవేదేని కోరుకొమ్ము. ఎంత దుర్లభమైనదైనను నా వంశ మికనైన నిలువబెట్టుము. అపుత్త్రకులకు స్వర్గగతులు లేవని వేదవిదులు వక్కాణించి పల్కుదురు. కాన నిపు డెనిమిదవ కొడుకును బ్రతుకనిమ్మని వేడుకొనుచున్నాను.

ఇది విన్నప్పటికిని గంగ బాలునిగొనిపోవ నుంకించుచుండెను. రాజపుడు గుండె చెఱువుగాగ పట్టరాని కోపమున నామెకిట్లు పలికెను. "ఓసీ! పాపిష్ఠురాలా! నీకు నరకమన్న జంకులేదు. నీవే పాపాత్ముని కడుపు చెట్టపుట్టితివో గదా! నేనిపుడేమి చేతును? నీవు వంశఘాతుకురాలవు. ఇంక నీవుండిన నుండుము, పోయిన నీ యిచ్చవచ్చు తావునకు పొమ్ము. కాని నా పుత్త్రుడు మాత్రమిక్కడనే యుండగలడు. నీతో నాకికనేమి పని?" అని గుండె ద్రవించునట్లు రాజు పలికెను. 

శిశువును గొంపోవుచు గంగ కోపమున నతకిట్లు పలికెను. పుత్రులన్న నా మనసు గూడ పడిచచ్చునదియే సుమా! నాకును గొంచెము మెత్తని గుండె కలదు. ఈ బాలునిగొని వనములందితనిని బోషింతును. నీ మాట నిలుపుకొనలేదు. నీ చేసిన శపథము భగ్నమైనది. కాన నిన్నిదే వదలి తరలుచున్నదానను. నన్ను గంగానదిగ నెఱుంగుము. దేవకార్యర్థ మరుగుదెంచితిని. 

పూర్వము వసువులు వసిష్ఠ మహామునిచే మనుజయోని బుట్టుడని శపింపబడిరి. వారు నన్నుగాంచి చింతాపరులై నీవు మాకు తల్లివి గమ్మని వేడుకొనిరి. నేను వారికటులే వరమిచ్చితిని. అందుచే నీకిల్లాలనైతిని. నా సంభవము దేవకార్యార్థ సిద్ధికని తెలిసికొనుము. ఆ యేడుగురు వసువులు ముని శాపమున మనకు పుత్త్రులై చనిపోయిరి. శాపవిముక్తి బడసిరి. ఈ బాలుడు మాత్రము కొంతకాలమిచటనే వసింపగలడు. గంగాదత్తుడగు నీ సుతుని గనుము. ఆ వసువు నీ సుతుడుగ జన్మించెనని తెలిసికొనుము. పుత్రోత్సాహ మనుభవింపుము. మహానుభావా! ఇతడు గాంగేయ నామమును విఖ్యాతి గడించ గలడు. మహాబలశాలి కాగలడు. నీవు తొల్లి నన్ను వరించిన చోటి కితనిని గొనిపోవుదును. ఇతడు యువకుడైన పిమ్మట నితనిని నీకప్పగింపగలను. తల్లిలేని బిడ్డ డెప్పుడైన సుఖముగ జీవింపజాలడు గదా!' అని గంగ యిత్తెఱుంగున బలికి యా బాలునిగొని యంతర్థానమందెను. 

శంతనుడు దుఃఖార్తుడై తన భవనమున కేగి వసించుచుండెను.

ఆ రాజు తన భార్యాపుత్రుల వియోగభరమున లోలోన కుములుచు రాజ్యపాలన సాగించుచుండెను. అట్లు కొంతకాలము గడచిన పిమ్మట శంతను రాజొకనాడు వేటకేగి మహిష సూకరములను మృగగణములను నురుమాడుచు గంగాతీరమేగెను. అట గంగ చిన్నచిన్న పాయలుగ పారుచుండెను. అదిగని రాజు విస్మయమందెను. అతడా నదీతీరమందు నారి సారించుచు బాణములు వదలుచున్న యొక సుకుమార కుమారుని గాంచెను. కాంచి రాజబ్బురపడి తన్ను తానే మఱచిపోయెను. ఆ బాలుడు తన-నాటి పుత్త్రుడగునో కాడో యెఱుగలేకుండెను. ఆ బాలుని బాణ ప్రయోగమందలి హస్తలాఘవము సాటిలేని విలువిద్య మానవాతీతశక్తి మదనుని బోలు రూపము ఇన్నియును గన్నారగని రాజు విస్తుపోయెను. రాజతనితో నీవెవరి పుత్త్రుడ'వని యడిగెను. అమ్ములు వదలుచు నాడుకొను బాలుడేమియును పలుకకయే వెంటనే యదృశ్యుడయ్యెను. ఆ బాలుని వాలకము చూచి యతడచ్ఛముగ నా పుత్త్రునివలెనే యున్నాడు. ఇపుడేమి సేతును? ఎటకేగుదును! అని చింతాతురుడయ్యెను?

అంత శంతనుడు గంగను స్తుతించి ప్రసన్నురాలిని జేసికొనెను. ఆ చారు స్వరూపిణి తొంటిరూపమున నతినికి దర్శన మొసంగెను. తన యంగకాంతు లెసగంగ వెలుంగుచున్న గంగను గని రాజామె కిట్లు పలికెను: 

'ఓ గంగా! ఈతడెవడు? నా బాలుడెక్కడ? నా బాలుని నాకు వేగమే చూపింపుము. 

గంగ యిట్లనియెను: 'ఓ రాజేంద్రా! ఇదిగో! ఇటడష్టమ వసువగు నీ పుత్త్రుడు. ఇత డింతకాలము నాచేత పోషింపబడెను. ఇపు డితనిని నీ చేతిలో పెట్టుచున్నాను. ఇతడే గాంగేయుడు, మహా తపస్వి. ఇతడే నీ కులమునకు వన్నెలు దెచ్చువాడగును. ఇతడెల్ల వేదములను ధనుర్వేదమును చక్కగ చదివెను. ఇతడింత కాలము వసిష్ఠునాశ్రమమున సకల విద్యాబుద్ధులు నేర్చెను. సర్వార్థములందు కుశలుడు. శుచి యయ్యెను. పరశురాము డెఱింగిన విద్యలెల్ల నితడెఱింగెను. ఇంక నీవితనిని గ్రహించి సుఖముగ నేగుము.' అని పలికి రాజునకు పుత్త్రు నొసంగి యంతర్హితయైనది. 

ఆ శంతనుడును ప్రమోదభరితుడై సుఖముగ నుండెను. ఆ శంతనుడు తన కొడుకు నాలింగనము చేసికొని శిరంబు మూచూచి యరదంబుపై నిడికొని తన పురమునకు బయలు దేరెను.

రాజు కరిపురికరిగి ఘనముగ పుత్రోత్సవ మొనరించెను. దైవజ్ఞులను రావించి శుభముహూర్తమడిగి రాజు ప్రకృతి జనుల నెల్లర బిలిపించి గాంగేయుని యువరాజు జేసెను. సకల సద్గుణోపేతుడగు పుత్త్రుని యువరాజు జేసి రాజు నిశ్చింతముగ నుండెను. గంగను గూడ మఱచిపోయెను. 

సూతుడిట్లనియెను : ఈ ప్రకారముగ వసువుల శాపకారణముగ గంగా సంభవము గాంగేయుని జన్మవృత్తాంతము పావన గంగావరతణము వసువుల సంభవము జరిగినవి. అన్నియును మీకు విశదపరచితిని. ఈ పుణ్యకథలు వినిన పుణ్యాత్ముడు నిస్సంశయముగ కలుషజాలము నుండి విముక్తి గాంచును. ఇంతవరకు మీకు వినిపించిన దానిని నేను మున్ను వ్యాసుని వలన వింటిని. ఇది బ్రహ్మ సమ్మితమగు శ్రీదేవీ పురాణమందలిది. ఆ పరమ పవిత్ర దేవీభాగవతము మహిమోజ్జ్వలములైన నానాఖ్యానక కథలతో పుణ్యమై పంచలక్షణ లక్షితమై వ్యాసుని ముఖకమలము నుండి వెడలి సుగుణామృత రసభరితమై యలరారుచున్నది. ఈ పుణ్యతహాసము పరమశ్రద్ధతో వినువారి దురితములు దూరమొనర్చును. కళ్యాణ సుఖము లొడగూర్చును అని యీ దేవీపురాణము లోకములందు ప్రఖ్యాతి జెందినది.

అధ్యాయము 25 శంతనుడు సత్యవతిని వరించుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 37 Shiva and Brahma worshipping Sridevi - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట బ్రహ్మ యిట్లనియె: అని యీ ప్రకారముగ దేవదేవుడగు విష్ణువు జ...