Friday, April 10, 2026

Chapter 21 Matsyagandha's birth story - అధ్యాయము 21 మత్స్యగంధ జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 21

మత్స్యగంధ జన్మవృత్తాంతము


ఋషులిట్లనిరి : సూతమహర్షీ! నీ పరమవచనములు రహస్యభరితములు. అవి తాపసులమగు మాకాశ్చర్య సందేహములు గొల్పుచున్నవి. తొల్లి శ్రీవ్యాసుని తల్లియగు సత్యవతిని శంతనుడు వివాహము చేసికొనెనంటివి. ఆ సత్యవతి తన పుట్టింటనుండగ నామెకు వ్యాసుడెట్లు జన్మించెను? వ్యాసుడు జన్మించినమీద నామెను శంతనుడెట్లు పెండ్లి చేసికొనెను? ఆ సత్యవతి కిరువురు కొమరు లెవరివలన గల్గిరి? మున్నగు విషయములు దెలుపు పరమపావన కథ యంతయును మాకు తేటతెల్ల మొనరింపము. నియతవ్రతులమగు మేము ఆ సత్యవతీ వ్యాసుల జన్మవృత్తాంతములు విన నుత్సమించుచున్నవారము. 

సూతుడిట్లనియె : ఆది పరాశక్తి అమృతయోని; ధర్మార్థ కామమోక్షప్రదాయిని; అట్టి పరమసత్యజ్యోతికి శిరమువంచి దోయిలించి యీ వరేణ్యమైన శ్రీదేవి పురాణగాథ ప్రవచింతును. ఆ శ్రీదేవీయొక్క వాగ్బీజము నుచ్చరించిన మాత్రమున శాశ్వత బ్రహ్మలోకసిద్ధి కరతలామలకమగును. ఆ యేకైక దేవియే కామితార్థప్రదాయిని. కాన నెల్లవాంఛితము లీడేరుటకా శ్రీదేవినే సర్వాత్మభావమున నెల్లరు నెల్లవేళల సంస్మరించుట యుక్తము.

తొల్లి ఉపరిచరుడను రాజు చేదిదేశ మేలుచుండెను. అతడు పరమధార్మికుడును సత్యనిత్యుడును ద్విజపూజకుడునై వన్నెకెక్కెను. ఇంద్రు డారాజు తపమునకు సంప్రీతిజెంది యతనికొక చక్కని స్ఫటిక విమానము ప్రదానము జెసెను. ఆ రాజా దివ్యవిమానమెక్కి భూమిపై దిగక అంతరిక్షమందే యెల్లెడల సంచరించుటవలన నతని కుపరిచవసువను నామమేర్పడెను. ఆ భూపతి ధర్మనిత్యుడని లోకములలో ప్రసిద్ధి వహించెను. అతని భార్య గిరిక. ఆ యము మిక్కిలి యందాల రాశి. వారి కమితవీర్యులు తేజోవంతులనగు నైదుగురు కొమరులు గలిగిరి. రాజు తన కొడుకుల నాయాదేశములకు పాలకులుగ నియమించెను. అంతనొకనాడు గిరిక ఋతుమతియై పుంసవనమున పవిత్రురాలై తన పతితో నెమ్మదిలోని తీరని కామవాంఛను దెలిపినది. అదేనా డా రాజు పితరు లతనిని శ్రాద్ధమునకై మృగములను కొనితెమ్మని కోరిరి అతడు యవశ్యకర్తవ్యమని నిశ్చయించుకొని లోలోన గిరికను తలపోయుచునే వేటకేగెను. అతడు వనమందుండియు తన భార్యను తలపోయుచునే యుండెను. ఆ రాజదేపనిగ తన ప్రియతమను తలచుచుండుటవలన నతని రేతస్సు స్ఖలితమయ్యెను. ఆతడు వెనువెంటనే దానినొక మఱ్ఱియాకున భద్రపఱచెను. 'ఈ నా వీర్య మమోఘమైనది. ఇది వ్యర్థము గారాదు. ఇపుడు నీ భార్య ఋతుస్నాతయై యున్నది. నా యీ యమోఘవీర్యమును నా ప్రియకంపవలయును' అని రాజు నిశ్చయించుకొనెను.

అతడు తన భార్యకు వీర్యము పంపదగిన సమయమెఱింగి దాని నభిమంత్రించి యొక మఱ్ఱియాకు దొన్నెలో నుంచెను. ఆ సమయమున తన సమీపమున నొక డేగ యుండెను. రాజు దానితో 'ఓ మహాభాగా! ఈ దొన్నెను తీసికొని త్వరితముగ మా యింటి కేగుము. అచట నా ప్రియ గిరిక గలదు. ఆమె యిపుడు ఋతుమతి. నీవు మా యింటికేగి దీని నామె కిమ్ము' అని పలికి డేగకు ఆ దొన్నె నిచ్చెను. ఆ డేగకు రాజమార్గము దెలియును. అది దొన్నెను తీసికొని వినువీధి కెగిరెను. అది తన ముకుపుటములతో దొన్నెను గట్టిగ పట్టుకొని యెగురుచుండగ నింకొక డేగ చూచి ఆ దొన్నె మాసమని తలచి దాని వెంటబడెను. అత్తఱి రెండు డేగలకు ఆకసమకుననే తుండ యుద్ధము జరిగెను. అటు లారెండును బోరాడు చుండగ వీర్యమున దొన్నె యమునానదిలో బడెను. వెంటనే యవి తమ తమ చోటులకు వెళ్ళినవి. అదే సమయమున అద్రికయను నొక దేవకన్యక యమునలో సంధ్యావందన మాచరించు నొక బ్రాహ్మణుని సమీపించినది. ఆ వరాంగన నీట మునుగుచు తిరుగుచు జలకేళి సలుపుచు వచ్చి వచ్చి యా బాపని పాదములు పట్టినది. అపుడా బ్రాహ్మణుడు ప్రాణాయమ మొనర్చుచుండెను. అతడా కామచారిణినిగని 'నా ధ్యానమున కాటంకము గలిగించితివి. కాన నీవు చేపవుగమ్ము' అని శపించెను. అపుడా యచ్చర విప్రశాపమున చేపయై యమునలో జరించుచుండెను.

డేగనుండి పడిన రాజవీర్యమును చేపరూపమందున్న యద్రిక గ్రహించెను. కొంతకాలమునకు దానికి పది నెలలు నిండెను. అంత మత్స్యజీవను లాచేపను వలలో బంధించిరి. వారా మీనము పొట్టచీల్చి చూడగ నందుండి మానవాకృతులు గల యిద్దఱు శిశువులు వెడలిరి. వారిలో నొకడు చక్కని బాలుడు. ఒకతే శుభాననయగు కన్య. ఆ జాలరివాడు వారిని వీక్షించి యాశ్చర్యమందెను. అతడు వారిరువురను రాజున కప్పగించెను. రాజా బాలుని తన పుత్త్రునిగ నంగీకరించెను. వసు సుతుడగు నా బాలుడు తన తండ్రివలెనే తేజో విక్రమసంపన్నుడై సత్యదర్మవంతుడై మత్స్యదేశమునకు రాజయ్యెను. రాజా కన్నియను మత్స్యజీవనున కొసంగెను. ఆమె యచట కాళి మత్స్యోదరి యను పేరుతో వన్నెకెక్కినది. ఆమెనుండి చేపల వాసన వెడలుటచే నామెకు మత్స్యగంధయను పేరు ఏర్పడెను. వాటి నుండి ఆమె మత్స్యరాజు నింటనే పెరుగుచుండెను. 

ఋషులిట్లనిరి: అద్రిక విప్రునివలన చేపగ శపింపబడినది గదా ! దాశరాజా చేపను పొట్టచీల్చి తినెను. ఆ యద్రిక తుదకేమైనది; ఆమె శాపమెట్లు తీరినది; ఆమె దివి కెట్లేగినది? అదంతయును మాకు వివరింపుము.

సూతుడిట్లనియె: ఆ విప్రుడు శపించిన నాడే యామె విస్యయముతో నతిదీరముగ నేడ్చుచు విప్రుని స్తుతించెను. ఆమె విలాపమునకు బ్రాహ్మణుని గుండె నీరైనది. అతడు దయతో నామె కిట్లనియెను: 

'ఓ కల్యాణీ! శోకింపకుము. శాపాంతము దెల్పుదును. వినుము. ఓ శుభాంగీ! నాశాపవవమున నీవు చేప వగుదువు. ఇద్దఱిని గందువు. ఆ పిదప నీశాపము తీరిపోవును.' ఇట్లామె శపింపబడి నదిలోని చేపయైనది. ఇద్దఱిని గన్నది. పిదప శాపముక్తి బడసినది. ఆమె శాపము దీరిన పిదప చేపరూపు వదలి దివ్యరూపమున దేవమార్గమున నరిగెను ఆ మత్స్యగంధయను కన్నియ దాశరాజు నింట నతని కూతురుగ బెరిగి పెద్దదగుచుండెను. శుభాంగియగు నామత్స్యగంధ చిఱుతప్రాయమున తన తండ్రి యింటినే యుండి పనులెల్ల చక్కబెట్టుచుండెను.

అధ్యాయము 22 శ్రీ వ్యాసమహర్షి జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 37 Shiva and Brahma worshipping Sridevi - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట బ్రహ్మ యిట్లనియె: అని యీ ప్రకారముగ దేవదేవుడగు విష్ణువు జ...