ఆ సమయంలో భీమనకులసహదేవులు, కృష్ణార్జునులు బంగారు రథాలు అధిరోహించి ధర్మజునితో కలసి పయనమయ్యారు. అప్పుడు ధర్మరాజు యక్షులతో కొలువుదీరిన కుబేరునిలా ప్రకాశించాడు. పాండవులు ఈ విధంగా పరిజనములు తమ్ముసేవించగా కృష్ణునితో కలసి కురుక్షేత్రానికి వెళ్లారు. దివినుండి భువికి కూలిపడిపోయిన దేవతలా యుద్ధభూమిలో పడియున్న గంగానందనుడయిన భీష్ముణ్ణి దర్శించి నమస్కరించారు. ఆ సమయంలో బృహదశ్వుడు, కశ్యపుడు, ఆంగిరసుడు, కౌశికుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శుకుడు, వసిష్ఠుడు మున్నగు పెక్కుమంది రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు శిష్యసమేతులై కృష్ణునిరాక తెలిసికొన్నవారై అచ్చటికేతెంచారు. వారిరాక చూచి భీష్ముడు సంతసించి, ఆయా దేశకాలాలలో పాటించవలసిన మర్యాదలు తెలిసినవాడు కనుక, వచ్చిన వారికందరికి వేరువేరుగా అర్చనలు చేయించాడు.
తన ఎదుటనున్న కృష్ణపరమాత్మను వీక్షించాడు భీష్ముడు. సర్వేశ్వరుడు తన మాయతో మానవదేహం ధరించి వచ్చాడని ఆయన యథార్థ స్వరూపాన్ని గ్రహించాడు. తానుకూడ నిరంతరం స్వస్వరూపజ్ఞానం కలవాడు కావున జయశీలుడైన కృష్ణుని మనస్సులో అర్చించాడు.
తరువాత గాంగేయుడు వినయవినమిత గాత్రులు, పరమప్రేమపాత్రులు, సద్గుణ సుందరమూర్తులు అయిన పాండుపుత్రులను తన సమీపంలో కూర్చుండ నియోగించాడు. పాండవులను చూడడంతోనే ప్రేమ పొంగిపొర్లింది. ఆనందబాష్పాలు ఒక్కసారి కన్నులందు క్రమ్ముకొన్నాయి. వారితో అనురాగంతో ఇలా అన్నాడు.
నాయనలారా! విప్రులను, శ్రీకృష్ణుని, ధర్మాన్ని ఆశ్రయించి జీవించే మీరే ఎన్నో కష్టాలు అనుభవించారంటే, ఇంతకన్న దురదృష్ట విషయం ఏముంటుంది?
పాపం! మీ తల్లి కుంతీదేవి ఇసుమంతైనా సుఖమంటే ఎరుగదు. మృగరూపంలో ముని శపించగా, పాండుమహారాజు మరణించడం జరిగింది. అప్పటికి మీరు పసివారు. మిమ్మల్ని అరచేతులలో పెట్టుకొని పెంచింది. మీయందే ఆశలన్నీ ఉంచి పెద్ద చేసింది. మిమ్మల్ని ఇంత ప్రయోజకులు అయ్యెటట్లుగా తీర్చిదిద్దింది. అయినా ఒకనాడూ కుదురుగా సౌఖ్యం అనుభవించి యెరుగదు. నిరంతరం దుఃఖంతో కుంగిపోయింది. ఇది ఎంతటి ప్రారబ్ధ కర్మమోకదా!
గాలికి పైకి ఎగిరిన మేఘాలు ఆకాశంలో కలుసుకొంటూ, విడిపోతూ ఉంటాయి. అదేవిధంగా సమస్త ప్రపంచంలోని భూతసముదాయాలు కాలప్రభావంవల్ల కలుస్తూ, విడివడుతూ ఉంటాయి. ఎప్పుడూ కాలచక్రం ఒకే రీతిలో సాగదు. అన్నింటికి కాలమే మూలం. కాలం చాలా విచిత్రమైనది. తేలికగా అయిపోతాయనుకొన్న వానిని కష్టపడి సాధించవలసినవిగాను, కష్టసాధ్యాలైన వానిని సులభంగానూ కాలం మార్చివేస్తుంది. ఎంతటివారైనా కాలగమనానికి లోబడవలసినవారిే.
కన్నెరజేస్తే చాలు సాగరాలనన్నిటినీ ఏకీకృతం చేయగల్గిన ధర్మతనయుడు శాసించే రాజుగా ఉన్నాా దేవేంద్రుని అంశచేత ప్రభవించిన అర్జునుడు ధనుర్ధారిగా ఉన్నా ఖాండవవన దహనసమయంలో అగ్నిదేవుడు మెచ్చియిచ్చిన శత్రువుల గుండెలలో దడ పుట్టించే గాండీవం విల్లుగా ఉన్నా సర్వమంగళ విధాయకుడైన శ్రీహరి రథసారథిగా ఉన్నా భయంకర గదాయుధధారియైన పవనపుత్రుడు యుద్దానికి కొండంత అండగా ఉన్నా పాండవులైన మీరు ఇక్కట్టుల పాలగుట తప్పలేదు. ఎంత ఆశ్చర్యమో కదా!
జగదీశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఏ సమయంలో ఎవరికి ఏమి చేస్తాడో ఎవరు చెప్పగలరు? సాధారణ మానవులకు అది అవగతంకాని మాయ. ఆ మాయకు లోబడి మహానుభావులైన ఆత్మజ్ఞానం కలవారు సహితం దిక్కుకాననివారై అణగి మణగి ప్రవర్తిస్తూ ఉంటారు.
కాబట్టి దైవనియంత్రిత సంకల్పానికి విచారించవలసిన పనిలేదు. దిక్కులేని జనులను ఉద్ధరించడానికై నారాయణుడు శ్రీకృష్ణరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన తన దివ్యత్వాన్ని మరుగుపరచి, యాదవులలో గూఢంగా సంచరిస్తున్న పరమేశ్వరుడు. మాయను స్వాధీనపరచుకొన్నవాడై సమస్తలోకాలను మోహంలో ముంచి తేలుస్తూ ఉంటాడు. ఆయన రహస్యవర్తనం మహేశ్వరునికే (భగవంతునికే) ఎరుక. నారదుడు, కపిలుడు కూడ ఆ విషయం తెలిసినవారే. మీరు కృష్ణుని దేవకీపుత్రుడని, మేనమామ కుమారుడని భావించి దూతగా, మంత్రిగా, రథసారథిగా, బంధువుగా, స్నేహితుడుగా ఆయనను వినియోగించుకొన్నారు. అయినా ఆయనకు ఎటువంటి కొరత రాదు. రాగద్వేషాదులు లేనివాడు, అహంకార శూన్యుడు, అద్వయుడు, అందరియందు సమబుద్ధి కలవాడు, సర్వభూతాత్మ స్వరూపుడు అయిన జగదీశ్వరునకు తక్కువ ఎక్కువ అనే (భావాలతో కూడుకొన్న) బుద్ధిభేదాలు ఎక్కడుంటాయి కనుక? అవి ఏ కోశానా ఆయనయందు కానరావు. అయినప్పటికి భక్తులపై వాత్సల్యం కలవాడు కాబట్టి అనన్య భక్తితో సేవించేవారికి సులభంగా అందుబాటులో ఉంటాడు.
ఉత్తమయోగి అనన్యభక్తితో ఏ పరమాత్మయందు మనస్సు లగ్నం చేసి, ఏ దేవదేవుని పవిత్రనామం బుద్ధియందు ధారణచేసి ఉచ్చరిస్తూ, తనువు చాలించి, కోరికలచే ఏర్పడే కర్మలద్వారా కలిగే జననమరణాలనుండి విముక్తి పొంది మోక్షఫలాన్ని అనుభవిస్తాడో, అటువంటి సకలలోకేశ్వరుడు అఖిలదేవతా సార్వభౌముడు నేను ప్రాణాలు విడిచే సమయానికి నయనానందకరుడై, చూడ ముచ్చట అయిన ముఖపద్మంతో నాముందు ప్రత్యక్షమైనాడు. నేడు చతుర్భుజుడైై, విప్పారిన తామలవంటి కనులతో నా కన్నులకు గోచరమగుచున్నాడు. ధర్మరాజా! నా అదృష్టవిశేషం పండింది. ఈ మహాత్మునికోసం గతజన్మలో ఎంత సుకృతం ఆచరించానోకదా!
అర్జునుడు ఏర్పరచిన అంపశయ్యపై పరుండిన భీష్మపితామహుడు ఈ విధంగా కృష్ణుని పై పరాభక్తిని ప్రకటించాడు. ధర్మరాజు గాంగేయునివల్ల మునుల సమక్షంలో మానవజాతి ఆచరించే సామాన్య ధర్మాలు, నాలుగు వర్ణాల ధర్మాలు, నాలుగు ఆశ్రమాల ధర్మాలు, రాగవైరాగ్య కారణాలైన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు, దానభేదాధికార ధర్మాలు, రాజ్యపాలన చేసే నరేంద్రులు ఆచరించే ధర్మాలు, స్త్రీలకు యోగ్యాలయిన ధర్మాలు, శమదమాది షడ్గుణ లక్షణాలు, శ్రీహరికి ప్రీతిపాత్రములైన భాగవత ధర్మాలు, ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు, అనేకవిధాలైన ఉపాఖ్యానాలు, ఇతిహాసాలు కొన్ని సంక్షేపంగా, మరికొన్ని సవివరంగా ఆలకించాడు. మహారథులకు అధినాయకుడైన శాంతనవుడు సంయమీశ్వరులు స్వచ్చందమరణం కోరుకొనే ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించడం తెలుసుకొని, తానుకూడ ఇంక తనువు చాలించాలని నిశ్చయించుకొన్నాడు.
భీష్ముడు తన ఉపదేశ వాక్యాలకు స్వస్తి పలికాడు. పూర్తిగా మౌనం వహించాడు. తన చూపులను పరమాత్మపై కేంద్రీకరించాడు. అటువంటి మహాత్ములకు మరణ సమయంలో కర్మశేషాలన్నీ తొలగిపోతాయి. కృష్ణుని కరుణాకటాక్ష వీక్షణాలచే కాయం పై గాయాలబాధ పూర్తిగా ఉపశమించింది. పూర్ణ స్వస్థచిత్తుడయ్యాడు. శ్రీహరి పాపాలనే ఏనుగులకు సింహంవంటివాడు. జ్ఞానియై పరమభక్తుడైన ఆతడు ఆ పరాత్పరుని ఈ విధంగా స్తోత్రం చేయసాగాడు.
భీష్ముని నేత్రాలకు మహావిష్ణుస్వరూపం గోచరమయింది. పీతాంబరుడు, చతుర్భుజుడు, పురాణ పురుషుడు, పరమేశుడు అయిన హరిని చిత్తంలో ధ్యానించడానికి కోరికలను పూర్తిగా విసర్జించాడు. ఏకాగ్ర మనస్కుడయ్యాడు. బాహ్యప్రకృతిని నిరోధించాడు. సమస్త విఘ్నాలు తొలగిపోయాయి. సమాధిస్థితికి చేరాడు. బుద్ధిని ఆయనపై (కృష్ణునిపై) నిలిపాడు. కానవచ్చేది సగుణస్వరూపమయినా, బ్రహ్మానందానుభూతిని పొందాడు. ఇక ఇటువంటివి పునరావృత్తం కాకూడదనుకొన్నాడు. జన్మబంధాలు పూర్తిగా నశింపజేసుకోవాలనే సంకల్పంతో ఈ రీతిగా ప్రస్తుతించాడు.
భీష్ముండు శ్రీకృష్ణుని స్తుతించుట
No comments:
Post a Comment