Friday, February 20, 2026

Svayambhuva Manu Prajavriddhi (the proliferation of progeny or population) - స్వాయంభువమనువు ప్రజావృద్ధి సేయుట

స్వాయంభువమనువు ప్రజావృద్ధి సేయుట

మైత్రేయుడు ప్రజోత్పత్తిని గూర్చి వివరించగా విదురుడు విని సంతోషంతో పరవశించాడు. మనసులో విష్ణుపాదభక్తి అంకురించింది. మళ్ళీ మైత్రేయునితో ఇలా అన్నాడు.
('మిత్ర' అనే స్త్రీకి కొడుకు కనుక మైత్రేయుడు అనే పేరు కలిగింది. మిత్ర భర్త పేరు అంటే మైత్రేయుని తండ్రి పేరు కుషారవి.)

స్వాయంభువుడు స్వయంభువరాజన్యునికి ప్రియమైనకుమారుడు. సాటిలేనివాడు. విష్ణుసేవలో దిట్ట. లోకమంతా ఆయన్ని కొనియాడుతుంది. ఆయన పూర్వరాజుల్లో శ్రేష్ఠుడు కూడ.
(తల్లితండ్రుల సాంగత్యం లేకుండా తనంత తాను జన్మించిన వ్యక్తిని స్వయంభువు అంటారు. బ్రహ్మసృష్టిలో 'సృయంభువు' మొదటి రాజన్యుడు. “స్వయంభువః అపత్యం పుమాన్‌ స్వాయంభు
వః” అపత్యార్థక తద్దితం. స్వయంభువుని సంతానమే స్వాయంభువుడు. వీరిని మనుసంతతిలో ఆద్యులుగా గుర్తించారు. వీరివల్లనే ప్రపంచంలో మానవజాతి అభివృద్ధి చెందిందని ధర్మశాస్త్రాలంటాయి. స్వయంభువు అంటే విష్ణువు, బ్రహ్మ, శివుడు, మన్మథుడు అనే అర్థాలున్నాయి.

ప్రాజ్ఞులచే పూజింపబడుతున్న ఓ మునీంద్రా! ఆ స్వాయంభువుని చరిత్ర ఎల్లప్పుడు సుఖప్రదమైంది. శుభదాయకమైంది. ప్రియమైంది. అందువల్ల దాన్ని నాకు బాగా తెలిసేటట్లు చెప్పుమా. అని విదురుడు ప్రార్థించాడు.

శ్రీమన్నారాయణుని కథను గూర్చి తెలుసుకోవటమే కాదు- ఆ స్వామి పాదపద్మసేవామృతాన్ని గ్రోలి తరించినవారి చరిత్రను సైతం మంచిబుద్ధితో వింటే కూడ జన్మ తరిస్తుంది.

విష్ణుసేవామృతాన్ని ఆస్వాదించినవారి కథల్ని వింటే జన్మ ఫలిస్తుందని విదురుడన్నాడు. అప్పుడా మైత్రేయముని 'అయ్యా! వేదశాస్రాల విజ్ఞానంకల మానవుడు, శ్రీహరిపాదపద్మసేవ గల్గిన ఉత్తముడు ఏ ఫలితాన్ని పొందుతాడో అలాంటి ఫలితాన్ని శ్రీమద్భాగవతంలోని పవిత్రగాథల వినికిడి వల్ల కూడ కైవసం చెసుకొంటాడు' అని అన్నాడు.

భాగవతకథా శ్రవణంవల్ల కాల్జే ఫలితాన్ని చెప్పిన తర్వాత ఋషిపుంగవుడైన మైత్రేయుని మనస్సు- రక్కసుల్ని మట్టుపెట్టే శ్రీమహావిష్ణువుకు సంబంధించిన కథామృతంలో తడియగానే అతని మేను పులకించింది. కళ్ళు ఆనందబాష్పాలను వర్షించాయి.

వేదనిధియైన మైత్రేయుడు విదురునికి స్వాయంభువమనువును గూర్చి వివరిస్తున్నాడు. “స్వాయంభువమనువు తన భార్యామణి శతరూపాదేవితో కలిసి బ్రహ్మచెంతకు వెళ్లి వినయంగా తలవంచి, ఆయనకు నమస్కరించి "పద్మసంభవా! ఈ లోకంలోని ప్రాణికోటి పుట్టుకకు, రక్షణకు మరియు వినాశనానికి నీవే మూలకారకుడవు. మేము చేయవలసిన పని ఏదో నీవే చెప్పు. ఏ పని మేము చేస్తే నీకు ఎడతెగని పరమానందం కలుగుతుందో ఆనతిమ్ము. ఇహ పరాలలో కొడుకు తండ్రికి సేవచేసి కీర్తి గడిస్తాడని, స్తుతిపాత్రు డవుతాడు కదా.

ఓ మహాత్మా! మేము నీకు. ఏ పని చేస్తే సంతోషం కల్గుతుందో సెలవిమ్మని స్వాయంభువమనువు బ్రహ్మాదేవుని ప్రార్ధించాడు.

తాను చేయదగిన సత్కర్మ యేదో చెప్పమని కోరిన స్వాయంభువమనువుయొక్క సుతిమెత్తని పల్కులు విని ఆనందించిన బ్రహ్మ ప్రేమభావం ఉట్టిపడేవిధంగా ఇలా అన్నాడు.

ముందుకు వచ్చి తండ్రి ఆజ్ఞను తలదాల్చి తనకు మంచిదనిపించిన పనిని చెపితే, ఆ పనిని శక్తికొలది చేయటం, విష్ణుదేవుని పాదసేవనం చేయటం, ప్రజాపరిపాలనం చేయటం తండ్రికి కొడుకు సేవలు చేయుటంవంటివే సుమా!

కనుక (ఇక్కడ బ్రహ్మ స్వాయంభువనికి దిశానిర్దేశం చేయబోతున్నాడు.)

"యజ్ఞావతారుడునూ, సర్వోత్తముడునూ, ఇంద్రియాల్ని జయించిన వాడునూ, నిగనిగలాడే తలనీలాలు గలవాడునూ, తామరల బోలిన కన్నులు కలవాడునూ అయిన శ్రీమహావిష్ణువునకు తమ జీవితాల్ని నిరంతర భక్తిభావంతో సమర్పిస్తే, ఆ లక్ష్మీవల్లభుడు చాలా ఆనందిస్తాడు. అంతేకాదు. ఆయన రక్షణలో నున్న ఏడేడు భువనాలు సైతం సంతృప్తి చెందుతాయి. అందుచేత ఓ పాపరహితుడవైన కుమారా! యజ్ఞాలు చేయి" అని బ్రహ్మ స్వాయంభువుని కోరాడు.

విష్ణుమూర్తిపట్ల విముఖులై పనులు చేసేవాళ్ళు- వక్రతలేని స్వచ్చమైన భక్తితో శ్రీహరికి సమర్పించే మనస్సుతో యజ్ఞవిధులు చేయకుండా విపరీతమతులైతే- పొట్టును దంచి ఫలితం పొందలేక చెడిపోయినట్లే, ధనాన్ని వ్యర్థంగా ఖర్చు చేసుకోవటం తప్ప యజ్ఞఫలమైన మోక్షాన్ని పొందలేరు.

"సత్యమే వ్రతంగా భావించేవాడా!, పాపాలనే తీగెలను నరికే కొడవలివంటివాడా! ఓ కుమారా! ఎట్టివికారాలకు లోను గానట్టి ఆ శ్రీహరిని ఉద్దేశించి నీవు చేసే సత్కర్మలు తప్పక ఫలిస్తాయ. నీ బిడ్డలు, నీవు కలిసి ఈ భూమిని చక్కగా పాలించండి. ధర్మబద్ధంగా మంచివారిని కాపాడండి" అని బ్రహ్మ స్వాయంభువునికి హితం ఉపదేశించాడు.

అని బ్రహ్మదేవుడనగా స్వాయంభువమనువు "తండ్రీ! మీ ఆజ్ఞానుసారంగా యజ్ఞ కార్యాలు చేస్తాము. నాకూ నా కుమారులకూ నివాసయోగ్యమైన స్థలం ఎక్కడకూడా లేదు" అన్నాడు.

ఓ తండ్రీ! అన్ని జీవరాసులకు ఆధారమైన భూమి ఇప్పుడు నీట మునిగిపోయింది. అందువల్ల నాకూ, నా కుమారులకు నిలువనీడ లేదన్నాను.

"మహాత్మా! భూమి నీటిలోనికి కుంగింది. కావున దాన్ని ఉద్ధరించే ఉపాయమేదో ఆలోచించి నాకు చెప్పండి" అని స్వాయంభువుడు ప్రార్థింపగా బ్రహ్మ తన మనస్సులో ఇలా అనుకొన్నాడు.

నీటిలో మునిగిన ఈ భూమిని ఎలా ఉద్ధరించగలను? ముందు సృష్ట్యారంభంలో నేను అన్నింటికంటె కూడ మొదట నీటిని సృజించి, తర్వాత భూమిని సృజించాను. ఆ భూమాత నీటిలో మునిగి పాతాళగుహను చేరింది.

శ్రీ యజ్ఞ వరాహావతార వర్ణనము

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...