Friday, February 6, 2026

Sri Krishna Saves Uttara Unborn Son - శ్రీకృష్ణుం డుత్తరాగర్భస్థుండగు నర్భుకుని తన చక్రంబుచే రక్షించుట

శ్రీకృష్ణుం డుత్తరాగర్భస్థుండగు నర్భుకుని తన చక్రంబుచే రక్షించుట

అనంతరం శ్రీకృష్ణపరమాత్మను వ్యాసాదిమహర్షులు అర్చించారు. ఉద్ధవుడు, కృష్ణుడు సాత్యకి వెంటరాగా ద్వారకానగర ప్రయాణానికి ఉద్యుక్తుడయ్యాడు. పాండవులవద్ద సెలవు తీసుకొన్నాడు. రథం ఎక్కబోతున్న సమయంలో ఉత్తర గుండె బాదుకొంటూ పరుగెత్తుకొని వచ్చి, ఉత్తమ గుణాభీరాముడైన శ్రీకృష్ణుని ఈ విధంగా ప్రార్థించింది.

దేవదేవా! ఇదేదో ప్రళయాగ్నితో సమానమైన బాణం ఒకటి ఎక్కడనుండో వచ్చింది. నా కడుపులోనున్న పసిగుడ్డును భస్మం చేయాలని భయంకరమైన మంటలతో వస్తూ ఉంది. మిరుమిట్లు గొల్పే కాంతితో తేరిపార చూడడానికి సాధ్యం కాకుండా ఉంది. నీవు తప్ప నన్ను రక్షించే వారెవ్వరూ లేరు. నేను నీ పాదపద్మాలనే నమ్మి ఉన్నాను. వెంటనే ఈ బాణాగ్ని జ్వాలలను నివారించు.

శ్లాఘనీయ చరిత్రా! భరింపరాని బాణాగ్నితో నా కడుపులోనున్న పసిబిడ్డ తాపం మొదలుకాగా కసుగందిపోతున్నాడు. కారుణ్యదృష్టితో నన్ను రక్షించు.

ఓ విచ్చిన తామరపూలవంటి కన్నులు గల కృష్ణా! నేను నీ ముద్దుచెల్లెలైన సుభద్రయొక్క కోడలిని. నీ మేనల్లుడైన అభీమన్యుడు యుద్ధంలో శత్రువులచే అన్యాయంగా సంహరించబడ్డాడు. ఈ బాణాగ్నికీలలను పటాపంచలుచేసి నా పసిబిడ్డను బ్రదికించు.

పరమేశా! ఉదరంలో వందలకొలది బ్రహ్మాండాలను భరించే నీకు ఒక ఆడదాని గర్భాన్ని రక్షించడం ఏమంత బరువైన పని? దయతో నా గర్భసంరక్షణ భారమునకు పూనుకో.

ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీకృష్ణుడు తన చెల్లెలయిన సుభద్రకోడలి దీనాలాపాలు ఆలకించాడు. అది అశ్వత్థామ "ఈ లోకంలో పాండవ వంశాకురం లేకుండుగాక!" అని ప్రయోగించిన దివ్యాస్తప్రభావమని గుర్తించాడు. ద్రోణపుత్రుని బ్రహ్మాస్రంనుంచి బయల్వెడలిన వాడిబాణాలు పాండవులకు ఎదురుగా వచ్చాయి. వారు కూడా భయపడకుండా తమపై వచ్చు అస్త్రాలను పనికిరాకుండా చేసే ప్రత్యస్త్రాలు చేపట్టి పోరాడే సమయంలో

పాండవులకు కృష్ణపరమాత్మను సేవించాలనే ఆసక్తి, ఆలోచనతప్ప అన్యచింతాసక్తి రవంతకూడ లేదు. వారు కృష్ణభక్తితో సత్పురుషులుగా కీర్తింపబడ్దారు. అందువల్ల వారిని రక్షించడం నిజకర్తవ్యంగా భావించి వాసుదేవుడు వారిపై ప్రీతి చూపించాడు. ద్రోణపుత్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని నిరోధించడంకోసమై, శత్రువులను వధించడంలో చెక్కుచెదరనిది, సమస్త దేవతాగణాలను రక్షించేది అయిన తన సుదర్శనచక్రాన్ని ప్రయోగించాడు.

పరమాత్మ చరాచర జంతుజగత్తులో అంతర్యామి రూపంలో హృదంతరాళంలో సూక్ష్మరూపుడై జ్యోతిర్మయుడై వెలుగొందుతూ ఉంటాడు. ఆ పరాత్పరుడు కురువంశాంకురం నాశనం కాకుండా ఉత్తరాగర్భాన్ని వైష్ణవ తేజస్సుచే కప్పివేశాడు. తన సుదర్శనచక్రాన్ని అశ్వత్థామచే ప్రయోగింపబడ్డ 
బ్రహ్మాస్త్రానికి అడ్డంగా పెట్టి స్వీయశక్తితో దానిని అణచివేశాడు.

నివారణోపాయం ఏదీలేని బ్రహ్మాస్త్రాన్ని అశ్వ
త్థామ ప్రయోగించినా, అది విష్ణుతేజస్సుముందు వ్యర్థమైపోయింది. తన మాయాశక్తిచే సకలలోకాలను సృష్టించి, పోషించి, లయింపజేసే వాసుదేవుడు ఒక విప్రుని అస్త్రాన్ని అడ్దుకోవటంలో ఆశ్చర్యం ఏముంది? పాండవ వంశాకురం నిలిచినందులకు కుంతి మిక్కిలి సంతోషించింది. పాండవులూ, ద్రౌపదీ వెంటరాగా శ్రీకృష్ణుని సమీపించింది. ద్వారకానగర ప్రయాణానికి సిద్ధపడిన ఆ పరాత్పరుని ఈ విధంగా స్తుతించింది.


శ్రీ మహా భాగవతము

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...