Thursday, February 19, 2026

Vidura inquired Uddhava about the well-being of Krishna, Balarama - విదురుం డుద్ధవుంగని కృష్ణాదుల వృత్తాంతం బడుగుట

విదురుం డుద్ధవుంగని కృష్ణాదుల వృత్తాంతం బడుగుట 

అలా ముందుకు సాగి, మత్స్య కురు జాంగల భూములను దాటి, యమునానదిని చేరుకున్నాడు. ఆ సమీపంలో ఉన్న గొప్ప భాగవతుడు, విశేషించి విష్ణుభక్తుడు, మంచి గుణాలు కలవాడు, శాంతస్వభావుడు, రాజనీతిలో బృహస్పతి శిష్యునివంటివాడు, లోకమంతా తెలిసినవాడు, దోషాలు లేనివాడు, చైతన్యస్వరూపుడు అయిన ఉద్ధవుని దర్శించాడు.

ఆ ఉద్ధవుని చూడగానే విదురుని మనసు ఆనందంతో పరవశించింది. గట్టిగా కౌగిలించుకొన్నాడు. కుశల ప్రశ్నలు వేశాడు. ఆనందంగా మాట్లాడసాగాడు.

విదురుడు అడుగుతున్నాడు. ఉద్ధవా! కృష్ణభక్తులు, పవిత్ర చరిత్రులు, పాపరహితులు, శత్రువులకు అసాధ్యులు, కురుకులాలంకారులు అయిన కుంతీకుమారులు భక్తిప్రపత్తులతో క్షేమంగా ఉన్నారా?

పూర్వం తన నాభికమలంలో పుట్టిన బ్రహ్మ వేడుకొనడంచేత బలరాముడుగా, కృష్ణుడుగా యదువంశంలో అవతరించి, భూభారాన్ని తగ్గించారు. వారు తాతగారైన శూరసేనుని ఇంట క్షేమంగా ఉన్నారా?

కురువంశీయులందరూ ఎంతో ఆదరిస్తూందడగా అందరికీ స్నేహితుడుగా, వియ్యంకుడుగా, చెల్లెళ్ళను, వారి భర్తలను ఎంతో ఆదరంగా, ఆప్యాయంగా అందరినీ కన్నబిడ్డలకంటె ఎక్కువ ప్రేమగా చూసుకొనే వసుదేవుడు కుశలంగా ఉన్నాడా?

తనకు మన్మథుని అంశతో కొడుకు పుట్టాలని రుక్కిణి ఎందరో బ్రాహ్మణులను సేవించి, వారి సూచనలమేరకు నోములు, వ్రతాలు ఆచరించి, చివరకు వారి దీవనలమేరకు ప్రద్యుమ్నుడికి జన్మనిచ్చింది. అతడు వీరుడై సేనాసమూహాలు సేవిస్తుండగా వైభవంతో వెలుగొందుతున్నాడు కదా!

శ్రీకృష్ణుని దయతో పొందిన సమస్తభూమిని పాలిస్తూ, మిక్కిలి ఆనందంతో, శాశ్వత వైభవంతో ఉగ్రసేనుడు సుఖంగా ఉన్నాడు కదా!

(ఉగ్రసేనుడు కంసుని తండ్రి. ద్రమిళుడనే రాక్షసుడు ఉగ్రసేనుని రూపం ధరించి ఉగ్రసేనుని భార్యను వంచనతో కలిశాడు. అందువలన జన్మించినవాడు కంసుడు. కనుకనే అతనికి రాక్షసప్రవృత్తి ఏర్పడింది. అతడు తండ్రియైన ఉగ్రసేనుని బంధించి బలవంతంగా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొన్నాడు. తరువాత కృష్ణుడు కంసుని సంహరించి, వాని తండ్రియైన ఉగ్రసేనుని చెర విడిపించి, రాజ్యాభిషిక్తుని చేశాడు.)

ఉద్ధవా! పతివ్రతాశిరోమణి, సౌందర్యవతి, సద్గుణవతి అయిన జాంబవతి, పార్వతి కుమారస్వామిని కన్నట్లుగా సాంబుని కన్నది. సుకుమారుడయ్యును శత్రువులను చీల్చి చెండాడే ఆ సాంబుడు కుశలంగా ఉన్నాడు కదా!

కృష్ణపాదసేవకుడు, శత్రుభయంకరుడు, అర్జునునివద్ద క్షుణ్ణంగా విలువిద్య నభ్యసించినవాడు అయిన సాత్యకి సుఖాలతో, వైభవాలతో సుఖంగా ఉన్నాడు కదా!

శ్రీకృష్ణుని పాదాలు పద్మం, అంకుశం, చక్రం, ధనుస్సు, వజ్రం, ఛత్రం వంటి శుభరేఖలతో ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి పాదాలతో నడిచిన త్రోవలో ఏర్పడిన అడుగుజాడలు గమనించి ఆ దుమ్మును శరీరంపై అలదుకొని ఆనందించేవాడు, మనసులో కపటం లేనివాడు, ఏ కోరికలూ లేకుండా కేవల ధర్మాచరణం చేసేవాడు, సద్వంశసంజాతుడు అయిన అక్రూరుడు క్షేమంగా ఉన్నాడు కదా!

వేదాలను, యజ్ఞయాగాలను తనలో ఇముడ్చుకొన్న వేదమాతలాగా సాక్షాత్తు లక్ష్మీపతినే తన గర్భంలో ధరించి కాపాడిన గొప్ప ఇల్లాలైన దేవకీదేవి సుఖంగానే ఉంది కదా!

మహాత్మా! తనను భక్తితో సేవించేవారి కోర్కెలు తీర్చగల భగవంతుడు, శబ్దశాస్త్రానికి కారకుడని దేవతలంతా కొనియాడే మనోమయుడు, జీవులందరికీ చిత్త, అహంకార, బుద్ధి, మనస్సులనే నాలుగింటికీ అధిదేవతలైన వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్దులలో మనస్సునకు అధిపతియైన అనిరుద్ధుడు సంతోషంగానే ఉన్నాడు కదా! అని.

ఓ ఉద్ధవుడా! ఇతరులను ఎవరిని ఆరాధించకుండా అనన్యభక్తితో బ్రహ్మదేవుడు కూడా ఆరాధించే మాధవుడైన శ్రీకృష్ణునే భక్తితో సేవించేవారు, లోకులందరిచే స్తుతింపబడేవారు, పుణ్యాత్ములు, వేదాంతజ్ఞానులు, భుజబలసంపన్నులు, గౌరవార్హులు, ధర్మమార్గంలో సంచరించేవారు అయిన సత్యభామా కుమారులైన చారుధేష్ణుడు, గదుడు ఔన్నత్యంతో ఆనందంగా ఉన్నారు కదా!

పాపరహితమైన నడవడిక గల ఉద్ధవా! ఎవరి మయసభా విశేషాలను చూచి, దుర్యోధనుడుకూడా అసూయకు లోనయ్యాడో అటువంటి ధర్మరాజు కుశలంగానే ఉన్నాడు కదా!

గదాయుద్దాన్ని గొప్పగా అభ్యసించి, విచిత్రవిన్యాసాలను సాధించి, భయంకర రణరంగంలో కౌరవులనందరినీ మట్టు పెట్టిన వీరుడు వాయుపుత్రుడైన భీమసేనుడు కుశలంగానే ఉన్నాడు కదా!

శ్రీకృష్ణుని దయాతరంగాలతో కూడిన కడగంటి చూపులవలన పొందిన పరాక్రమ ప్రాభవంతో రణరంగంలో తనను కిరాతవేషంలో ఎదిరించిన పశుపతిని కూడా గెలిచి, పాశుపతాన్ని సంపాదించిన శత్రుభయంకరుడైన అర్జునుడు సుఖంగా ఆనందంగానే ఉన్నాడు కదా!

ఉద్ధవా! చిన్నతనంలోనే విధి విలాసంవల్ల తల్లిని కోల్పోయి, కుంతి ఇచ్చిన చనుబాలు త్రాగి, అన్నల అనురాగాన్ని పొంది, పెరిగి పెద్దవారై, దేవేంద్రుని అధీనంలో ఉన్న అమృతాన్ని గరుత్మంతుడు సంపాదించినట్లుగా, కౌరవులను నిర్జించి, వారి అధీనంలో ఉన్న రాజ్యాన్ని సంపాదించిన మాద్రికుమారులైన నకులసహదేవులు క్షేమంగా ఉన్నారు కదా!

మనుచరిత్ర కల ఉద్ధవా! ఆనాడు పాండురాజు అకాలమరణం చెందినా భర్తతోపాటు సహగమనం చేయకుండా పిల్లలను సాకేందుకు బ్రతికి ఉన్న కుంతీదేవి కుశలంగానే ఉంది కదా!

అని అడిగి ఇంకా ఇలా అంటున్నాడు విదురుడు.

ఉద్ధవా! తమ్ముడైన పాండురాజు మరణించినపుడు పాండురాజు కొడుకులు ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చారు. కాని అతడు మధ్యస్థుడుగా చేయవలసిన న్యాయమైన తీర్పును వదిలేసి నిజానికి వారికి కీడే చేశాడు. సరే! కానీ. ఇంతకూ అతడు క్షేమంగానే ఉన్నాడు కదా!

పుణ్యచరిత్రుడవైన ఉద్ధవా! నేను తమ్ముడననికూడా ఆలోచించకుండా, తన కొడుకులు నన్ను బయటకు పొమ్మన్నప్పుడు మౌనం వహించాడు ధృతరాష్షుడు. అందువల్ల నాకు కలిగిన మానసిక క్షోభ ఊరికే పోదు. తప్పక అతడు నరకవాసాన్ని అనుభవిస్తాడు.

మహార్షీ! మునివృత్తితో శాంతస్వభావుడవై ఉన్న నీకు ఈ దుఃఖం తగదంటావేమో.

మహర్షీ! ఇంత మునివృత్తిలో ఉండికూడా ఎవరో ఎప్పుడో చేసిన అన్యాయాన్ని గూర్చి బాధపడాలా అంటే, పరమాత్మ ఈ లోకంలో లీలామానుష విగ్రహుడై సంచరిస్తూ ఎటువంటివారినైనా మోహానికి గురి చేస్తుంటాడు. ఆ మాయను దాటడం అంత తేలిక కాదుగదా!

అందుచేత నిర్వికారుడైన మహాత్ముడు ఆ శ్రీహరిమాయలో పడినప్పుడు నేనుకూడా సామాన్య సంసారిలాగా శోకిస్తుంటాను. ఆ పరాత్పరుని దయ నాపై నిండినపుడు ఎంతో ఆనందంగా జీవిస్తుంటాను. నేనే కాదు బ్రహ్మ శివాది దేవతలుకూడా శ్రీహరి మాయనుండి బయటపడలేరు గదా!

అయినా మహార్షీ! ఆ మహనీయుని దయారసంతో కూడిన కటాక్షవీక్షణాలు నా పై ప్రసరించి విజ్ఞానమనే దీపపు కళికద్వారా సమస్తదోషాంధకారం పోయింది. నా మనస్సు శ్రీహరి పాదాలయందే లగ్నమైపోయింది. అందువల్ల ఆ పరతత్త్వం కోసమే ఎల్లపుడూ ఎదురుచూస్తుంటాను.

శ్రీహరి తనకు ఎంతో ఆత్మీయులైన పాండవులు అడవులలో ఎన్నో బాధలు పడ్డారు. తరువాత వారి రాజ్యభాగాన్ని వారికి ఇప్పించేందుకు తానే స్వయంగా రాయబారిగా వెళ్ళాడు. అక్కడ దుర్మార్గులైన కౌరవులు ఎన్నో దుర్భాషలాడి స్వామినే బంధించేందుకు ప్రయత్నించారు. అయినా హరి బలహీనుడులాగ వారిని ఏమాత్రమూ ఎదిరించలేదు. అందుకు కారణం అసమర్ధత కాదు. విద్యవల్ల, వంశంవల్ల, ధనంవల్ల మదించిపోయిన రాజులనందరినీ ససైన్యంగా రణరంగంలో సంహరింపజేయాలనే ఆలోచనవల్లనే ఆ సమయంలో ఆగ్రహానికి లోను కాలేదు.

జన్మరహితుడైన భగవంతుడు పుట్టెది దుర్మార్గులను అంతమొందించటానికే. కర్మలంటని దేవుడు కర్మలాచరించుట చరాచర జీవకోటికి కర్మపరత కలిగించుటకే తప్ప భగవంతునికి కర్మలుంటాయా!

శ్రీహరి నరులందరికీ పూజ్యుడు. లీలగా మానవరూపాన్ని ధరించినవాడు. గుణాలకు అతీతుడు. సంసారసంబంధమైన కర్మలు ఆయనను అంటవు. కనిపించే కర్మబంధాలు విలాసాలు మాత్రమే.

తన శాసనాన్ని తలదాల్చే భక్తులందరికీ అభ్యుదయాన్ని కలిగించేందుకై శ్రీహరి భూలోకంలో యాదవవంశంలో బలరాముని సోదరుడుగా అవతరించాడు.

నిశ్చలతత్త్వంతో సంసారసముద్రాన్ని తరింపజేయగలడనే కీర్తిని దశదిశల వ్యాపించునట్లు ప్రవర్తించే శ్రీకృష్ణుడు రాగద్వేషాలకు అతీతంగా ప్రశాంతచిత్తుడై ఉన్నాడు కదా! అని ఉద్ధవుని విదురుడు అడిగాడు. అలా అడుగగా

అప్పుడు ఆ ఉద్ధవుడు.

వాసుదేవుని పాదపద్మాలకు దూరమై ఆ వియోగతాపాన్ని భరించలేక, గుండె మండగా, నోరు తడియారిపోయి, ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు.

శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు ఈ కథాభాగం వివరిస్తూ, ఒక్క క్షణం ఆగి, రాజువైపు చూచి, ఆ ఉద్ధవునిగూర్చి చెపుతున్నాడు. రాజా! ఈ మహర్షి ఐదేండ్ల చిన్నవాడిగా ఉండినాడు.

ఒకనాడు ఉద్ధవుడు కృష్ణునితో కలిసి ఆడుకొంటూ ఉండగా అతని తల్లి భోజనానికి రమ్మని పిలిచినా పట్టించుకోకుండా ఆ సేవలోనే నిమగ్నమైపోయాడు. అటువంటి ఆ ఉద్ధవుడు ఈనాడు కృష్ణుడు లేడన్న దిగులుతో, ఆ విషయాన్ని విదురునికి చెప్పలేక మౌనంగా ఉండిపోవడంలో వింత ఏముంది? అని శుకుడు పరీక్షిన్మహారాజుతో ఇంకా ఇలా అన్నాడు. అపుడు శ్రీకృష్ణపాదారవిందంలోని మకరందమనే అమృతసాగరంలో మునిగిపోయిన మనస్సుతో కాసేపు ఉద్విగ్నతకు లోనైన ఉద్ధవునికి ఒక క్షణంలో కళ్లలో నీళ్లు తిరిగి, కంఠంలో గాద్గద్యం ఏర్పడింది.

కృష్ణవియోగంవల్ల ఏర్పడ్డ దుఃఖం అగ్నిలాగా తన గుండెలో మండుతుండగా, వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ, పాపపుపర్వతాల రెక్కలు నరికే వజ్రాయుధంవంటి విదురుని చూశాడు.

చూచి, ఇలా అన్నాడు.

యముడనే పెద్దకాలసర్పం ఒడిసి పట్టి కాటువేసిన యాదవోత్తముల విశేషాలను వారి క్షేమసమాచారాలను ఏమని చెప్పగలను. మనసు కలతపడుతుంది అని ఉద్ధవుడు విదురునితో అన్నాడు.

విదురా! ఏమి చెప్పమంటావు. మునుల ముఖపద్మాలు ముకుళించాయి. దుష్టుల కనుకలువలు వికసించాయి. జారులకు చోరులకు కోర్కెలు తీరాయి. దానవుల గర్వాంధకారాలు విజృంభించాయి. పరమఋషులనే చక్రవాకాలు అలమటించాయి. కల్మషచిత్తుల అనురాగాలు వ్యాపించాయి. పాపాగ్ని ప్రజ్వరిల్లింది. ధర్మవర్తనలు అడుగంటాయి. ఎందుకంటే మానవాకారంలో ఉన్న మహాతేజస్సు, లోకబాంధవుడు, కీర్తిమంతుడు అయిన శ్రీకృష్ణుడు తన తేజస్సుతోపాటుగా తనువు చాలించాడు.

అంతేగాక, శ్రీకృష్ణుని పాదాలలో నాగలి, వజ్రాయుధం, పద్మంవంటి శుభరేఖలు ఉంటాయి. ఆయన నడవటంచేత భూమిపై ఆ పాదముద్రలు పడి భూదేవి శుభలక్షణాన్వితగా ప్రకాశించేది. ఇప్పుడాయన లేకపోవడంతో ఈ ధరిత్రి అశుభలక్షణాలతో కూడి నిస్తేజంగా ఉంది.

దానవాంతకుడైన శ్రీకృష్ణుడు దేహత్యాగం చేసిన తరువాత యాదవులను విడిచి రాజ్యలక్ష్మి వెడలిపోయింది. ధర్మమార్గం పాడైపోయింది. అధర్మం పెచ్చు మీరింది. అందువలన చిన్న పెద్ద తారతమ్యాలు నశించిపోయాయి.

అంతేకాక విదురా! సుకుమారంగా ఒరపిడి పెట్టబడిన మణుల కిరణకాంతితో నీటిలో ప్రతిబింబించిన చంద్రమండలాన్ని చూచి, ఆ నీటిలో తిరిగే చేపలు తమకు చెందినదే అనుకొని ఆ తారాచంద్ర ప్రతిబింబాలతో చనవుగా తిరిగినట్లుగా కృష్ణుని అనుసరించి తిరిగిన యాదవులు, వృష్ణి వంశీయులు ఆయనను తమలో ఒక ప్రధానవ్యక్తిగా భావించారు. కాని, లీలగా మానవశరీరాన్ని ధరించిన పరమాత్మగా గ్రహించలేకపోయారు. విష్ణుమాయవల్ల ఏర్పడిన మోహంతో కృష్ణునితో కలిసి తినడం, పడుకోవడం, తిరగడంవంటివి చేసి, సోదరభావం వంటి భావాన్నే పొందారు. ఆ దేవుని మాయాసముద్రంలో మునిగిపోకుండటం బ్రహ్మాదులకే సాధ్యం కాదు. గొప్ప గుణవంతులు, సత్పురుషులలో శ్రేష్టులు అయిన పరమభాగవతులు తప్ప మిగిలినవారు ఆ మాయను దాటలేరు. అంతేగాక కులగర్వం, విద్యాగర్వం, ధనగర్వం, బలగర్వం వీటివల్ల ఏర్పడిన మదంతో గుడ్డిగా తయారైన మనసుగల శిశుపాలునివంటి రాజులు ఆ మహాత్ముని పరమదైవంగా గుర్తించలేక నిందిస్తూ ఆడిన దుర్భాషలు గుర్తుకు వచ్చినపుడెల్లా మనసెంతో పరితపిస్తూంటుంది అని చెప్పి ఉద్ధవుడు ఇంకా ఇలా అంటున్నాడు.

ఎవరైతే తనను తనివితీరా చూడాలనుకుంటారో, ఎవరు జ్ఞానులై తపస్సు చేస్తారో అటువంటి మహాభాగవతులకు లోకమంతటా నిండిన ఒకేఒక వెలుగైన తన రూపాన్ని సందర్శించే అవకాశం కల్పించి, వారివారి రకరకాలైన శోకాలన్నీ దహించి, శాంతస్వరూపుడైన మాధవుడు తన మానవశరీరాన్ని విడిచిపెట్టి అదృశ్యమైపోయాడు సుమా!

మానవుల ప్రగతికి కారణమై, తనకుకూడ ఆశ్చర్యాన్ని కలిగించి ప్రకాశిస్తున్నటువంటి తనదైన యోగమాయాబలాన్ని స్వీకరించి, ప్రదర్శించి, అందాలకే అందమై, అలంకారాలకే అలంకారమై, వివేకాలకు అతిశయరూపమై, సకల శుభాలకు ఆశ్రయమై, సత్యమై తేజరిల్లే దివ్యమూర్తి తన శక్తితో తానే ధరించిన ఆ శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహాన్ని వేడుకతో చూచి, ఆనాడు ధర్మరాజు నిర్వహించిన రాజసూయయాగంలో అందరూ ఎంతో ఆనందంగా ప్రస్తుతించారు.

ఆనాడు ఆ ధర్మజుని రాజసూయయాగంలో అగ్రపూజా సందర్భంలో జరిగిన సభలో ఈతడే కదా బ్రహ్మ సృష్టికి కూడా మూలమైనవాడు అనుకుంటూ ఎంతో కుతూహలంతో అందరూ కనురెప్ప ఆర్పకుండా శ్రీకృష్ణుని దర్శించారు కదా!

అంతేకాకుండా, అవసరాన్నిబట్టి శాంతరూపాన్ని ఉగ్రరూపాన్ని కూడా ధరించే శ్రీకృష్ణుడు సహజంగా శాంతస్వరూపుడు. అందువల్ల శత్రువులు చేసే అపరాధాలకు మనస్సులో నొచ్చుకున్నా దయాచిత్తుడై ప్రవర్తించే పరమాత్మ. ఆయన ప్రకృతికి మూలమైన మహత్త్వమే తన రూపంగా కలవాడు. పుట్టుక లేనివాడే అయినా కొయ్యనుండి అగ్ని పుట్టినట్లుగా తాను జన్మిస్తుంటాడు. అటువంటి పద్మనాభుని చిరునవ్వులు, రాసలీలలు, అనురాగదృష్టులు గోపకామినులను ఆకర్షిస్తే, ఆయన దివ్యమంగళవిగ్రహాన్ని దర్శించేందుకు వారు ఎంతో ఆసక్తిని ప్రదర్శించారు.

అట్టి మహనీయుడు దేవతల కోర్కె తీర్చడంకోసం వసుదేవుని కుమారుడుగా జన్మించడం, రాక్షసుడైన కంసునికి భయపడి నందుని ఇంట్లో పెరగటం, కాలయవన జరాసంధాదులను రణరంగంలో ఎదిరించలేక అందరూ ఎంతో ఇష్టపడే మథురానగరాన్ని విడిచి పెట్టి, ఎక్కడో తలదాచుకోవటం ఇవన్నీ గుర్తుకు వచ్చి ఎంతో బాధపడుతుంటాను.

పాపాలనే కొండలపాలిటి వజ్రాయుధంవంటి విదురా! శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీవసుదేవులకు నమస్కరిస్తూ, కంసుడు మిమ్మల్ని చెరసాలలో పెట్టి బాధిస్తుంటే నేనుండికూడా ఇంతకాలం ఉపేక్ష వహించాను. అతనిని ఏమీ చేయకుండా, మిమ్మల్ని కారాగార విముక్తుల్ని చేయకుండా ఉన్నందుకు నన్ను మన్నించండని వేడుకొన్నాడు. ఆ మధురవాక్యాలు గుర్తుకు వచ్చినపుడల్లా ఇంత సంస్కారవంతుడు ఇప్పుడు భౌతికంగా మన కళ్ళ ఎదుట లేడే అని మనసెంతో కలత చెందుతుంటుంది.

వాస్తవంగా ఆలోచిస్తే ఎవరు కోపంతో ఒక్కమారు కనుబొమలు ముడువగానే దుష్టశిక్షణ జరిగి భూదేవికి భారం తొలగిపోతుందో అటువంటి శ్రీహరి పాదపద్మాలలోని మకరందాన్ని ఆస్వాదించగలిగే అదృష్టవంతుడు ఎవడో కదా!

ఉద్ధవుడు పలుకుచున్నాడు. విదురా! గోపాలకుడు మురుడనే రాక్షసుని చంపినవాడు, అంతటను వ్యాపించియున్నవాడు, మహానందస్వరూపుడు, నందనందనుడు, అమృతోత్పాదన సమయంలో పాలకడలిని చిలుకుతున్నప్పుడు మందరపర్వతాన్ని మోసేందుకు తాబేటి రూపాన్ని ధరించినవాడు అయిన శ్రీకృష్ణుని ఎక్కడైనా బుద్ధి మందగించి మఱచిపోవడం జరుగుతుందా?

(మురుడు అనే రాక్షసుడు బ్రహ్మనుగూర్చి తపస్సుచేసి, తన అరచేతితో ఎవరిని తాకితే వారు భస్మమైపోవాలని వరం కోరుకొన్నాడు. బ్రహ్మ 'తథాస్తు' అన్నాడు. యముని తాకేందుకు ప్రయత్నించాడు. అతడు భయంతో పరుగున విష్ణువును ఆశ్రయించాడు. మురుడు విష్ణువును యుద్దానికి ఆహ్వానించాడు. నాతో యుద్ధం చేసే ధైర్యమే నీకుంటే నీ గుండె ఎందుకు అలా దడదడ కొట్టుకొంటోందని అడిగాడు శ్రీహరి. లేదే అని తన అరచేతిని గుండెకు ఆనించి చూసుకున్నాడు. వెంటనే భస్మమైపోయాడు. నాటినుండి విష్ణుమూర్తికి మురారి అనే ప్రసిద్ధి ఏర్పడింది.

అంతే కాక, ధర్మరాజు రాజసూయయాగం చేస్తున్న సమయంలోను, అసలు పుట్టి బుద్ధి ఎరిగిననాటినుండి శ్రీకృష్ణునికి కీడే చేశాడు శిశుపాలుడు. అయినా మీరు, మిగిలిన రాజులందరూ చూస్తూండగా అతడు మహర్షిగణంకూడా ఇట్టిది అట్టిది అని తెలుసుకోలేని పరమపదాన్ని పొందాడు కదా!

కౌరవపాండవులు ససైన్యంగా రణభూమికి వెళ్ళి ఎవరి ముఖపద్మాన్ని చూస్తూ, చూపులనే అమృతాన్ని త్రాగుతూ, అర్జునుని బాణాలచే ఏర్పడిన గాయాలవల్ల శరీరాలు పవిత్రం కాగా మోక్షపదానికి చేరుకొన్నారో అతడే శ్రీకృష్ణుడు.

అటువంటి పద్మనేత్రుడు, ఆద్యంతరహితుడు, మనోహరుడు, ముల్లోకాలలో అందగాడు, సాగరకన్య లక్ష్మీదేవి స్తనద్వయానికి పూసుకున్న కుంకుమయొక్క గుర్తులంటిన ఉరము కలవాడు, దేవతలందరూ తలలు ఆని పాదనమస్మారం చేయటంచేత వారి కిరీటాలలోని పద్మరాగాల కాంతిచే ఎర్రగా మారిన పాదపీఠం కలవాడు, పుట్టుక లేనివాడు, అంతం లేనివాడు, తనతో సమానులు కాని, అధికులు కాని లేనివాడు, త్రిమూర్తులకే అధీశ్వరుడు, అయిన శ్రీకృష్ణుడు కంసుని తండ్రియైన ఉగ్రసేనునికి రాజ్యాధికారం కల్పించి, తాను కేవలం సేవకునిగానే ఉండిపోవటం నా మనస్సుకు కలత కలిగిస్తుంటుంది.

ఇంకా అంటున్నాడు ఉద్ధవుడు, 'పాపరహితుడవైన విదురా! పరమాత్మ స్వరూపుడు, యోగీశ్వరేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు భగవద్భక్తుడూ, మహాభాగవతోత్తముడూ అయిన ఉగ్రసేనుని సేవించటం వింత కాదు. తనను చంపటంకోసం స్తనాలకు విషం పూసుకుని పాలిచ్చిన దుష్టురాలైన పూతనకు, ప్రేమతో పాలిచ్చి పెంచిన యశోదకు కూడా అందని గొప్ప పరమపదాన్ని అందించిన దయాశాలి శ్రీహరి. అటువంటివాడు తనను సేవించినవారిని సేవించటంలో ఆశ్చర్యమేముంది?' అని అనగానే విదురుడు ఉద్ధవునితో అంటున్నాడు, 'స్వామీ! భక్తవత్సలుడు, దయాసముద్రుడునై భాగవతులను అనుగ్రహించి, తనదాసులకు ఇచ్చే పరమపదాన్ని శ్రీహరి తీవ్రకర్ములైన రాక్షసులకు ఎందుకిచ్చాడు. ఆ విషయం చెప్పుమని అడిగిన విదురునికి ఉద్ధవుడు ఈ విధంగా సమాధానం చెపుతున్నాడు.

గరుడవాహనుడూ, చక్రాయుధుడూ అయిన శ్రీహరిని రాక్షసులు ఎందరో ఎన్నోమార్లు ఎదిరించి, ఓయీ హరీ! రాక్షసశత్రువా! పారిపోకు, ఆగు అంటూ పోరాడి అతని ముఖాన్నే చూస్తూ అతనిచేతిలో మరణించి, అత్యున్నతమైన పరమపదాన్ని పొందుతుంటారు.

విద్వద్వరేణ్యుడవైన విదురా! తెల్లదామరలవంటి కన్నులు గల శ్రీకృష్ణుని జన్మవృత్తాంతాన్నీ, ఇంకా అతని చరిత్రనూ ప్రేమగా నీకు వినిపిస్తాను. సావధానంగా విను.

పాపులవల్ల భూమికి పెరిగిన బరువును తగ్గించుమని బ్రహ్మ విష్ణువును వేడుకొన్నాడు. అతని కోరికమేరకు హరి కంసుని చెరసాలలో బంధితులై ఉన్న దేవకీవసుదేవుల కుమారునిగా కారాగారంలోనే జన్మించాడు. దుర్మార్గుడైన కంసుడు తన కుమారునికి ఏ అపకారం చేస్తాడో అని వసుదేవుడు అర్ధరాత్రివేళ తన కొడుకును తీసుకొన్నాడు.

వసుదేవుడు బిడ్డను తీసికొని వ్రేపల్లెకు వెళ్ళి, అక్కడ నందుని భార్యయైన యశోదపక్కలో రహస్యంగా పడుకోబెట్టి, ఎవరూ చూడకుండా తిరిగి తన ఊరు మథురానగరానికి వెళ్ళిపోయాడు.

శ్రీకృష్ణుడు పదకొండేళ్ళపాటు వ్రేపల్లెలో తాను శ్రీహరి యనే విషయం ఎవ్వరికీ తెలియకుండా తన అన్నగారైన బలరామునితో కలిసి ఆడుకుంటూ గడిపేశాడు.

ఇంద్రాది దేవతలకు కూడా పూర్తిగా తృప్తి కలిగేలా తన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించే అవకాశమొసంగని శ్రీహరి ఆనందంగా గొల్లవారితో కలిసి ఆవులను, దూడలను మేపుతూ గడిపాడు.

శ్రీహరి కృష్ణునిగా గోపకులంలో గడిపే కాలంలో తన లీలలను విశేషాలను గోపబాలురకు చూపించాలనుకొన్నాడు.

బాలకృష్ణుడు యమునానది నీటితో పెరిగి పెద్దవగుతున్న చెట్ల, తీగెల చక్కని సువాసనలనీనే పుష్పాలలో ఉండే తేనెను తాగి ఆనందిస్తున్న తుమ్మెదలతో కూడిన గురివెంద, ఎర్రగోరంట, మొల్ల, చందనవృక్షాలతో కూడిన పొదరిళ్ళలో దూరి, నెమళ్ళలాగ, గోరువంకలలాగ, కోయిలలలాగ, రాచిలుకలలాగ వింత వింత ధ్వనులు చేస్తూ గోపబాలురనందరినీ ఆనందపరుస్తున్నాడు.

శ్రీపతి బాలకృష్ణుడుగా అవతరించి, సింగపు పిల్లలాగా ఉన్నాడు. అతని కౌమారదశలో తన వేణునాదామృత సారంతో గోపాలురనందరినీ ఆనందపరుస్తూ స్వచ్చమైన లక్ష్మీనివాసంలా ఉన్న ఆలమందను మేపుతున్నాడు.

ఇంకా, చిన్నపిల్లలు సరదాగా ఆడుకోవడానికి గడ్డిపరకలతో సింహం, పులివంటి బొమ్మలను తయారుచేసుకొంటారు. ఆడుకోవడం అయిపోయాక చాలా సులువుగా వాటిని చించి అవతల పారవేస్తారు. అలాగే కంసుడు పంపించిన దయావిహీనులైన ఎందరో రాక్షసులను బాలకృష్ణుడు పిల్లాటలాగ ఆయా యుద్ధభూములలో చీల్చి చెండాడినాడు.

పవిత్రమైన ఆ యమునానదిలో కాళియుడనే ఒక భయంకర సర్పం ఉండేది. అది భయంకర విషాగ్ని జ్వాలలను కక్కుతుండడంతో గోపాలకులకు కాని, గోవులకు కాని ఆ నీరు తాగేందుకు పనికిరాకుండా పోయింది. అప్పుడు ఆ బాలకృష్ణుడు దానిని దూరంగా తరిమివేసి, గోప గోతతి ఆ నదీజలంద్వారా దప్పిక తీర్చుకొనే అవకాశం కల్పించాడు.

మేఘాలకు అధిపతి ఇంద్రుడు. కనుక వానలు బాగా కురిస్తే, పంటలు బాగా పండుతాయి. గోవులకు మేతకూడా బాగా లభిస్తుందనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం నందుని యాజమాన్యంలో గోపాలకులంతా మహావైభవంగా ఇంద్రయాగం చేసేవారు. నా దయవల్లనే ఈ భూలోకవాసులు బ్రతుకుతున్నారనుకొంటున్న ఇంద్రుని గర్వం అణచాలన్న ఉద్దేశంతో కృష్ణుడు ఆ యాగాన్ని మానిపించి, అటుపై నిరంతరంగా సాగేట్లు నిరాడంబరంగా గోయాగాన్ని జరిపించాడు. గోవర్దనగిరికి పూజ చేయించాడు. అందరికీ ఆనందాన్ని కలిగించాడు.

కృష్ణుడు పద్మనాభుడైన శ్రీమహావిష్ణువే అని గుర్తించలేక, వాని శక్తిని గ్రహించలేక యాగం మానివేశారన్న కోపంతో మనస్సు కలుషితమైపోయి, ఆగ్రహోదగ్రుడై వలాహకాది మేఘాలను శాసించి రాళ్ళ వర్షాన్ని కురిపించాడు ఇంద్రుడు. ఆ వానలకు, మేఘాలు చేసే భయంకరధ్వనులకు గోకులమంతా కకావికలమైపోయింది.

అలా భయంకరమైన రాళ్ళవాన పడుతుండడంతో గోవులు, గోపాలురు అందరూ కకావికలైపోయారు. అందరూ కృష్ణుణ్ణి శరణు వేడుతున్నారు. కృష్ణా! నీవే దిక్కు లేనివారికి దిక్కు ఎటువంటి దోషమూ లేని జీవనం నీది. భక్తులను రక్షించడమే నీకు అలంకారం. పాపాలను ఎండగట్టి భక్తులను నిష్పాపులుగా చేస్తావు. ఇదిగో ఇక్కడ ఈ రాళ్ళవానకు ఆవులు, ఆలకాపరులు అందరూ భయభ్రాంతులై తలా ఒక దిక్కుకు పారిపోతున్నారు. మమ్మల్నందరినీ నీవే రక్షించాలి.

అని గోపకులంతా దీనులై మొరపెట్టుకోగానే మంచివారికి మేలుచేసే శ్రీకృష్ణుడు గోవులను, గోపాలకులను కూడా రక్షించే సమర్థుడై, దేవతలంతా పొగడుతుండగా చరియలలో దేవతాస్త్రీలు విహరించే గోవర్ధనగిరిని పద్మంలాంటి తన చేతితో గొడుగును పైకెత్తినట్లు వేగంగా ఎత్తి పట్టుకొన్నాడు.

మఱియు, శరత్కాలం వచ్చింది. పూర్ణిమనాడు నిండుచంద్రుడు స్వచ్చంగా వెలుగుతున్నాడు. ఆ కాంతిలో సహజంగానే అందమైన బృందావనం మరింత శోభాయమానంగా కనువిందు చేస్తోంది. ఆ సమయంలో రాసకేళియందు ఆసక్తుడైన శ్రీకృష్ణుడు అసలే అందమైన శరీరం, ఆపై ముఖచంద్రుడు వెన్నెలలు కురుస్తూ గోపికల కనుకలువలకు ఆనందాన్ని ఇస్తున్నాడు. మూడు వంపులతో నిలబడి, మురళి ఊదుతుంటే ఆ పాట వింటున్న గోపికలు పరవశలగుచున్నారు.

గోపికలందరూ శ్రీకృష్ణుని పాదపద్మారాధనలో అనురక్తలయ్యారు. వారి వారి భర్తలూ, మరదులూ, పిల్లలూ, బావలూ, అత్తమామలూ ఎంతమంది వద్దని ఎంతగా వారించినా వినకుండా కృష్ణుని చూసేందుకు అదేపనిగా వెళ్ళిపోతున్నారు. వారి భక్తి, అనురాగాలకు ముగ్దుడైన హరి వారిపాలిటి నవమన్మథుడై, కరుణాసముద్రుడై వారందరినీ రాసకేళి నాట్యంతో ఆనందపరిచాడు.

శ్రీకృష్ణుడు తన అన్నగారైన బలరామునితో కలిసి, మథురానగరానికి వెళ్ళి, అక్కడ మహావైభవంగా సింహాసనారూఢుడై రాజ్యపాలనం చేస్తున్న దుర్మార్గుడు, దుష్టరాక్షసుడూ అయిన కంసుని చంపి, కారాగారంలో మగ్గిపోతున్న తన తల్లిదండ్రులైన దేవకీవసుదేవుల చెర విడిపించి, వారిని మహావైభవంతో తులతూగేలా చేశాడు.

శ్రీకృష్ణుడు బాల్యంలో సాందీపని అనే గురువు వద్ద చేరి, వేదం, దానికి సంబంధించిన ఆరు అంగాలు, వాటితోపాటుగా అరువది నాల్గు కళలు క్షుణ్ణంగా నేర్చుకొన్నాడు. ఏదైనా వినడమే తరువాయి వెంటనే ఆ విద్య స్వాధీనమవుతోంది. అయినా తనకు తానుగానే ప్రపంచాన్ని భావించగలవానికి వేరే గురువులు ఉంటారా? లోకాచారాన్ని తానుకూడా అనుసరించి, పదిమందికి ఆదర్శంగా నిలబడటానికే వాసుదేవుని విద్యాభ్యాసం.

విద్యాభ్యాసం పూర్తి అయ్యాక గురుదక్షిణ కోరుకొమ్మంటే అకాలమృత్యువును పొందిన తన బిడ్డను బతికించి తీసుకువచ్చి, తనకిమ్మన్నాడు సాందీపని. ఆ గురుపుత్రుడు చావు సమీపించి ప్రభాసమనే జలాశయంలో క్రీడిస్తూండగా పంచజనుడనే రాక్షసుడు అతనిని మింగేశాడు. అది గ్రహించి, ఆ రాక్షసుని చంపి, ఆ బిడ్డను బ్రతికించి గురుదక్షిణగా సమర్పించాడు శ్రీకృష్ణుడు.

విదర్భ మహారాజు చాల గొప్పవాడు. పేరు భీష్మకుడు. ఆతని ముద్దులకూతురు రుక్కిణి. ఆమె కన్నులు అప్పుడే వికసించిన పద్మాల్లాగా ఉంటాయి. రూపంలో సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంటుంది. చక్కగా అలంకరించుకొంటుంది. ఆమె కంఠం శంఖంవలె ఉంటుంది. ఆమెకు స్వయంవరాన్ని ప్రకటించాడు మహారాజు. దేశం నలుచెరగులనుండి ఎందరో రాజులు వచ్చారు ఆమెను పెండ్లాడాలని. వారిలో శిశుపాలుడు, సాల్వుడు, జరాసంధుడువంటి ప్రముఖులు కూడా ఎందరో ఉన్నారు. వారినందరినీ తన భుజబలంతో ఎదిరించి చెల్లాచెదరు చేసి, గరుత్మంతుడు దేవలోకంనుండి అమృతాన్ని ఎత్తుకుపోయినట్లుగా రుక్కిణిని తీసుకుపోయి పెండ్లాడాడు శ్రీకృష్ణుడు. ఆ వాసుదేవుని పొగడడం ఎవరితరం!

మదించిన ఏడు ఆబోతులు కృష్ణుని చంపబోయాయి. వాటిని పట్టి, ముక్కుత్రాళ్ళు బిగించి, లొంగదీసుకున్నాడు. ఆయన బలపరాక్రమాలకు అసూయపడి ఎదిరించిన ఎందరో రాజులను ఓడించాడు. అంతము లేనివాడైన వాసుదేవుడు అనంతమైన బలంతో స్వయంవరంలో వికసించిన తామరలవంటి కన్నులు గల నగ్నజిత్తు మహారాజుగారి కొమార్తె నాగ్నజితిని ఆనందంగా వివాహమాడాడు.

శత్రువులను చీల్చిచెండాడడంలో ప్రసిద్ది పొందిన కృష్ణుడు తన భార్య సత్యభామ కోరిక తీర్చేందుకు స్వర్గానికి వెళ్ళి, అక్కడ అసమాన పరాక్రమంతో దేవేంద్రుని ఎదిరించి, జయించి, నందనవనంలోని పారిజాతవృక్షాన్ని పెకలించి, సునాయాసంగా భూలోకానికి తెచ్చాడు. వాసుదేవుడంటే సామాన్యుడా?

జగమంతా తనరూపంగా కలిగిన భూదేవికి ప్రియసుతుడైన నరకాసురుని తలను కృష్ణుడు సునాభము అనే పేరుగల తన చక్రాయుధంతో ఖండించాడు. ధరణీదేవి కోరికమేరకు అతని కుమారుని రాజ్యపట్టాభిషిక్తుని చేశాడు. నరకునిచే ఎంతో కాలంగా బంధింపబడిన పదియారువేల వందమంది కన్నెలు వాసుదేవునిచే బంధవిముక్తలయ్యారు. వారందరికీ ఆయనయందు అనురాగం ఏర్పడింది.

ఆ పదియారువేల వందమంది కన్యలు తన సౌందర్యవిలాసాలను చూచి, అనురక్తలయ్యారని గమనించిన శ్రీకృష్ణుడు వారందరినీ ఒకే ముహూర్తంలో వివాహమాడాడు. అందరినీ వేరువేరు అంతపురమందిరాలలో ఉంచాడు. తానుకూడా అన్నిరూపాలు ధరించి, ఏకకాలంలో అందరితోనూ క్రీడించి, అందరికీ పరిపూర్ణమైన ఆనందాన్ని కలిగించాడు.

ఆ పదారువేల వందమందియందు ఒక్కొక్క స్త్రీద్వారా పదిమంది చొప్పున పుత్రసంతానాన్ని పొందాడు శ్రీకృష్ణుడు. వారందరూ భుజబలంలో తనకు ఏ మాత్రమూ తీసిపోనివారు. అందువల్ల ఆయన కీర్తి మరింతగా నలుదెసల వ్యాపించింది.

కొంతమంది రాజులు వారి సేనలతో మధురాపురాన్ని చుట్టుముట్టారు. వారిలో కాలయవనుడు, సాల్వుడు, జరాసంధుడు వంటి ప్రముఖులున్నారు. వారందరినీ ససైన్యంగా మట్టు పెట్టాడు శ్రీకృష్ణుడు. తన సాయం కోరిన భీమ, అర్జునులచేత శత్రుసంహారం చేయించి, వారికి విజయాన్ని చేకూర్చాడు. బలరామాదుల సాయంతో బాణ శంబర, ముర, పల్వలాది రాక్షస నాయకులను సేనలతో కూడ తుదముట్టించాడు. సంగ్రామరంగంలో తనను ఎదిరించిన దంతవక్త్రుడు మొదలగు రాక్షసులను హతమార్చాడు. ఆ విధంగా తన బాహుబలాన్ని లోకానికి చాటాడు.

అంతేకాదు, కౌరవులకు పాండవులకు మధ్య ఏర్పడిన యుద్ధంలో సాయపడి రాజులందరూ పరస్పరం మాత్సర్యంతో సేనల పాదఘట్టనలచేత భూచక్రం వణకిపోయేలా అసామాన్యములైన శంఖాలు, భేరీలు మొదలైన వాద్యాల ధ్వని ఆకాశాన్ని అంటుతుండగా, గుర్రాల డెక్కలనుండి ఏర్పడిన దుమ్ము సూర్యమండలాన్ని కప్పేసేలా వచ్చి, కురుక్షేత్రంలో యుద్దానికి సిద్ధపడిన రెండువైపులవారిని చంపి, రాజ్యగర్వంతో మదమెక్కిన ఉన్నాది దుర్యోధనుని రాజులందరూ చూస్తూండగా కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు మొదలైనవారి తప్పుడు మాటలు విని, నిరంతరం పాండవులకు కష్టాలను కలిగించిన పాపానికి పరిహారంగా సంగ్రామరంగంలో భీముని గదవేటుతో తొడలు విఱిగి, నేలమీద పడి, ఆయువు, సంపద, వైభవం అన్నీ పోగొట్టుకొని కదలలేక మెదలలేక పడి ఉండగా చూచినపుడుగాని తనకు సంతోషం కలుగదని భావించాడు శ్రీకృష్ణుడు. మహాబాహుబలసంపన్నులైన భీష్మ ద్రోణులను, భీమార్జునులను రెండుపక్షాలలోను నిలబెట్టి, వారిచేత పదునెన్మిది అక్షౌహిణుల సేనను చంపించాడు. తనతో సమానబలవంతులైన యదువీరులను జయించడం ఇతరులకు సాధ్యం కాదు కనుక తప్పత్రాగి వారిలో వారికే వైరం పుట్టి, ఒకరినొకరు కొట్టుకొని చచ్చి అంతా తనలో కలిసేలా చేస్తే తప్ప భూభారం తగ్గదని ఆలోచించాడు. ధర్మరాజుచే నిష్కంటకంగా పవిత్రంగా రాజ్యపాలన చేయించాడు. మానవులకు అవశ్యాచరణీయములైన ధర్మమార్గాలను చూపించాడు. బంధుమిత్రులకు ఆనందాన్ని కలిగించాడు. పరోక్షంగా వారి వంశాన్ని నిలబెట్టెందుకు అభిమన్యుని భార్యయైన ఉత్తర గర్భాన్ని అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల విచ్చిన్నం కాకుండా కాపాడాడు. తన పాదపద్మాలను సేవించుటయందే ఆసక్తుడైన ధర్మరాజుచేత అతని కీర్తిప్రతాపాలు ప్రకాశించేలా మూడు అశ్వమేధయాగాలు చేయించాడు.

శ్రీహరి లక్ష్మీనివాసమైన శరీరంతో ప్రకాశిస్తూ, భక్తరక్షాదక్షుడై, ద్వారకానగరంలో జాగ్రత్తగా లౌకిక వైదిక ధర్మాలను ఆచరిస్తూ, తన మాయ ఇతరులకు తెలియకుండా సామాన్య సంసారిలాగా నిస్సంగుడై కూడా కోరికలకు వశమైనవానివలె సుఖాలను అనుభవిస్తూ పాండుకుమారులు మరియు యాదవులందరినీ చక్కని స్నేహంతోను, ఆనందాన్ని కలిగించే మాటలతోను అలరిస్తూ దయావంతుడై రక్షిస్తున్నాడు.

శరత్కాలంలోని పున్నమరాత్రులలో, నిండుగా జాబిల్లి వెలుగుతూ కురిపించే వెన్నెలలో, బంగారపు స్తంభాలతో నిర్మించిన మేడల పైభాగంలో, చంద్రకాంతశిలలతో తయారైన తిన్నెలపై పదియారువేలమంది స్త్రీలతో పదియారువేల రూపాలను ధరించి క్రీడించాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఆయన ఆడు ఏనుగుల మధ్యనగల దిగజాలవలె, మెఱుపుతీగల నడుమగల మేఘాలవలె, ముత్యాలనడిమి ఇంద్రనీలమణులవలె కనిపించాడు. ఇలా ఎన్నో సంవత్సరాలు నిత్యనూతనమైన ఆనందంతో క్రీడించాడు వాసుదేవుడు.

అలా శ్రీకృష్ణుడు నిత్యనూతన క్రీడాపరాయణుడై ఉండగా ఒకనాడు

ఒకనాడు ద్వారకానగరానికి మునివరులు వచ్చారు. అక్కడ యాదవపౌరులు కొందరు వారి దగ్గరకు వెళ్లి ఎత్తిపొడుపు మాటలతో ఆటపట్టించారు. వారు కోపించి శపించారు. ఆ శాపప్రభావంతో కొన్ని నెలల తరువాత యాదవులందరూ విధిప్రేరణవల్ల పెద్ద జాతర చేయడానికి ప్రయత్నించారు. వినోదాలు మనసులలో అతిశయించగా తమ తమ వాహనాలెక్కి జాతరకోసం ప్రయాణమైనారు.

యాదవులంతా ప్రభాసతీర్థానికి వెళ్లారు. అక్కడ ఆ నదిలో స్నానం చేశారు. అరమరికలు లేని ఔదార్యంతో దేవతలకు, మునులకు తర్పణాలు విడిచిపెట్టారు. అపారమైన భక్తితో లేగదూడలతో కూడిన గోవులను విశేషమైన దక్షిణలతోపాటుగా ఎందరో బ్రాహ్మణులకు దానం చేశారు.

నదీస్నానం, దేవ ముని తర్పణాలు చేసి, గోదానం చేసి, ఇంకా జింకచర్మాలు, వస్త్రాలు, రత్నాలు పొదిగిన కంబళ్లు, వెండి, బంగారం, నువ్వులు, భూములు, కన్నెలు, ఏనుగులు, గుర్రాలు, రథాలవంటివాటిని తమ తమ శక్తికి ఏమాత్రం తగ్గకుండగా యాదవులు సద్బ్రాహ్మణులకు దానం చేశారు.

ఈ విధంబుగా పంటలతోకూడిన భూమి మొదలైనవాటిని చాల ఎక్కువగా భగవంతునకు సమర్పిస్తున్నామన్న భావంతో దానాలు చేశారు.

అలా దానధర్మాలు చేసిన తరువాత హాయిగా విందుభోజనం చేశారు. ఇష్టమైన మద్యాన్ని కుత్తుకబంటిగా సేవించి మత్తుగలవారైనారు. సరదాగా ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఛలోక్తులు విసరుకున్నారు. ఆయా మాటలచే కొందరు నొచ్చుకున్నారు.

ఈ విధంగా మధుపానంవల్ల ఎర్రబడ్డ కళ్లతో ఒళ్లు తెలియని స్థితిలో ఒకరినొకరు కొట్టుకొన్నారు. వెదురు పొదలలో పుట్టిన అగ్నివల్ల ఆ వెదురుపొద దగ్ధమైపోయినట్లు వారిలో వారికే కలహం ఏర్పడి వారంతా నశించిపోయారు. ఆ వ్యవహారమంతా శ్రీకృష్ణుడు గమనించాడు.

యాదవులందరూ అలా పరస్పర కలహంతో చనిపోవడం చాతుర్యంతోకూడిన తన మాయావిలాసంగా గమనించి, తరువాత అందమైన తరంగాలతో, స్వచ్చమైన పద్మాలతో ప్రకాశించే సరస్వతీనదీ జలాలతో చనిపోయినవారందరికీ విధివిధానాన్ని అనుసరించి తర్పణాలు విడిచిపెట్టాడు శ్రీకృష్ణుడు.

మచ్చలేని గుణాలతో అందరి మనసులను ఆకర్షించే శ్రీకృష్ణుడు ప్రశాంతమనస్కుడై ఒకచెట్టుమొదట కూర్చుని, నన్ను బదరీవనానికి వెళ్లిపొమ్మని చెప్పి, నాకు తెలియకుండా ఎక్కడికో వెళ్లిపోయాడని ఉద్ధవుడు విదురునితో పలికాడు.

ఉద్ధవుడు చెపుతున్నాడు. శ్రీకృష్ణుడు అలా నాకు తెలియకుండా ఎక్కడికో వెళ్లిపోయాడంటే నెమ్మదిగా తన వంశాన్ని సమాప్తం చేసే సంకల్పంలో ఉన్నాడని గ్రహించాను. ఆ స్వామి అందమైన పాదపద్మాలను విడిచి ఉండలేక నేనుకూడా ఆయన అడుగుజాడలను అనుసరించి బయలుదేరాను.

ఉద్ధవుడు చెపుతున్నాడు. నేను స్వామిని వెదకుతూ వెళ్లి వెళ్లి ఎక్కడో దూరంలో తన శరీరకాంతులతో చుట్టుప్రక్కల ప్రదేశాన్ని తేజోమయం చేస్తున్నవాడు, మహానుభావుడు, పరమాత్మస్వరూపుడు, ఆశ్రయించినవారి కష్టాలను రూపుమాపేవాడు, భక్తులకు వశవర్తిగా ఉండేవాడు అయిన శ్రీకృష్ణుడు ఒకానొక చెట్టుమొదట కూర్చుని ఉండగా చూచాను.

అంతే కాకుండా, ఉద్ధవుడు చెపుతున్నాడు. నాకు మిక్కిలి ఇష్టుడు, సత్యధర్మాలలో జారుపాటు లేనివాడు, పరమాత్మ స్వరూపుడు, సత్వగుణంతో ప్రశాంతంగా ఉండేవాడు, ఉద్రేకాన్నిచ్చే రజోగుణం లేనివాడు, అందమైన ద్వారకలో ఉండేవాడు, ఎవరైనా తనను ఆశ్రయించడమే తప్ప తానుగా ఎవరినీ ఆశ్రయించనివాడు, నీలమేఘచ్చాయగల దేహమువాడు, అప్పుడే వికసించిన తామర రేకులవలె అందమైన కన్నులు కలవాడు, తేజోవిరాజితుడు, పచ్చని పట్టువస్త్రం ధరించినవాడు, ఎడమతొడపై ఉంచిన కుడిపాదపద్మం గలవాడు, గంభీరుడు, వీరాసనంతో లేత రావిచెట్టును ఆనుకొని కూర్చున్నవాడు, ఆనందమే తప్ప విచారం తెలియనివాడు, రాక్షససంహారి అయిన నా కన్నతండ్రి (శ్రీకృష్ణుని చూచాను).

చూచాను, చూచాను. సంసారసాగరాన్ని తరించే స్థితిని పొందాను. ఆశ్రితరక్షకుని, యోగిజనుల గుండెలలో కొలువుండేవానిని, పరమేశ్వరుడుకూడా దర్శించలేని మహానుభావుని, కమలాక్షుని, ముక్తిప్రదాతను సందర్శించగలిగాను.

విదురా! నేను శ్రీకృష్ణుని దర్శించి ఆ ఆనందంలో ఉండగా అదే సమయంలో పరమ భాగవతోత్తముడు, మునిశ్రేష్ఠుడు, వ్యాసునికి మిత్రుడు, మహాయోగులలో ముఖ్యుడు, పాపరహితుడు, అందరిచేత గౌరవింపబడడేవాడు, పండితులకు విధేయుడుగా ఉండేవాడు అయిన మైత్రేయుడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చాడు

తీర్ధయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చిన తపోగరిష్ఠుడైన మైత్రేయుడు కీర్తిమంతుడు, కాంతిమంతుడు, నిత్యయౌవనుడు, యోగిజనమానస పద్మాలలో విహరించేవాడు, కౌస్తుభాది దివ్యాభరణాలు ధరించేవాడు, రాక్షసశిక్షకుడు, సర్వాంతర్యామి, అంతటా కాంతిని వెదజల్లినవాడు, తేజోమూర్తి అయిన శ్రీకృష్ణుని దర్శించాడు.

శ్రీకృష్ణుని దర్శించిన మైత్రేయుడు అటుపైని కన్నులు మూసికొని తన హృదయంలోనే స్వామిని దర్శించగలిగాడు. అలా దర్శించుటవల్ల ఎనలేని ఆనందాన్ని పొంది, తలవంచుకొని ఉన్నాడు.

ఆ విధంగా తనను చేరిన మైత్రేయ మహర్షి వింటూండగా చిరునవ్వుల వెన్నెలలు రువ్వే అందమైన మోము కలవాడు, ఆనందామృతంతో వికసించిన ముఖం కలవాడు, దయావీక్షణాలతో భక్తులను ఆదరించేవాడు అయిన పద్మనేత్రుడైన శ్రీకృష్ణుడు నా వైపు చూచి ఇలా అన్నాడు. “ఉద్ధవా! పూర్వజన్మలో వసుబ్రహ్మలు సత్రయాగం చేశారు. ఆ వసువులలో నీవొకడివి. నీవు వేరేమీ కోరుకోకుండా నా పాదాబ్జాలనే కోరుకొన్నావు. అందువల్ల నేను ఇకపై నీ హృదయంలోనే ఉండి అంతా చూస్తుంటాను. ఆత్మారాముడినైన నన్ను 'ఇది సత్తు, ఇది అసత్తు' అనే పాండిత్యపరమైన జ్ఞానంతో దర్శించలేరు. నీకిదే చివరి జన్మ. నీ పూర్వజన్మ పుణ్యంవల్ల నన్ను ఈ ప్రదేశంలో దర్శించగలిగావు. నా నాఖికమలంలో సంభవించిన బ్రహ్మకు ఉపదేశించిన దివ్యజ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తాను" అని చెప్పగా అమృతోపమానములైన స్వామి పల్కులు నాకు కర్ణాభరణాలయ్యాయి. నా మనస్తాపాన్ని తొలగించాయి. నా ఒడలు ఆనందంతో గగుర్పొడిచింది. ఆనందబాష్ట్పాలతో చెక్కిళ్లు తడిశాయి. అంతరంగం ఆనందతరంగితమయింది. నేను దోసిలి నుదుటిపై పెట్టుకొని ఇలా విన్నవించాను.

ఓ పురుషోత్తమా! నీ పాదపద్మ ధ్యానామృతంతో అభిషిక్తమవుతూ ఆనందించే నా మనస్సు వేరే విషయాలను ఎందుకు కోరుతుంది? (కోరదు)

దేవా! పద్మనేత్రా! పుట్టుకే లేని నీవు జన్మించడమేమిటో! కాలస్వరూపుడవై లోకాలను లయం చేసే నీవు శత్రుభయంతో ఎక్కడో సముద్రమధ్యంలో కోట కట్టుకొని అందులో తలదాచుకోవడమేమిటో అర్థం గాక దానినిగూర్చియే ఆలోచిస్తుంటాను.

అంతేగాకుండా, లక్ష్మీవల్లభా! భక్తవత్సలా! కృష్ణా! నీయందు నీవే ఆనందించగల ఆత్మారాముడవై కూడా ఎందరో స్త్రీలను చుట్టూ పెట్టుకొని వారితో క్రీడించి ఆనందించడమేమిటా అనికూడా నేను ఆలోచిస్తుంటాను.

శ్రీనాథా!, వేదాంతులుకూడా నిన్ను తెలుసుకోలేక తర్కించుకొని సామాన్య సంసారివనుకొంటున్నారు. కానీ నీవు మాత్రం ఏ పరతత్త్వజ్ఞానము లేని, పండితుడనుకాని నన్ను కటాక్షించావు. ఇది చాల వింతైన విషయం.

దేవా! నీ అంతరంగమే తిరుగులేని విజ్ఞానానికి మరోరూపు. అయినా ఏమీ తెలియనివాడిలా ప్రవర్తిస్తుంటావు. అది తలచుకొన్నప్పుడు నా మనసెంతో దిగులుపడుతుంది. దేవతలే నిన్ను కొనియాడుతారు. నీవు మోక్షప్రదాతవు. లక్షీవల్లభుడవు. బ్రహ్మదేవునకు అనుగ్రహించిన తత్త్వజ్ఞానాన్ని అర్థం చేసుకోగల శక్తి నాకు ఉందని నీవు భావిస్తే అలాగే ప్రసాదించు. నీ శాసనాన్ని పాటించి విస్తారమైన సంసారసముద్రాన్ని దాటుతానని అనేకవిధాలుగా స్వామిని ప్రస్తుతించగా భగవంతుడు, ఆశ్రయించినవారిపాలిట కల్పవృక్షము అయిన కృష్ణుడు నాకు తత్త్వజ్ఞానాన్ని అనుగ్రహించాడు

వారిజాక్షుడైన శ్రీకృష్ణుని కరుణవల్ల లభించిన వేదాంతజ్ఞానంతో నా మనసు నిండింది. ఎంతో భక్తితో ఆయన పాదపద్మాలకు నమస్కరించాను.

కృష్ణుని ఎడబాటు నాకు భరింపరాని వేదన కలిగించింది. ఆ శోకసముద్రాన్ని తరించే ఉపాయం కనబడటం లేదు. స్వామి కనబడేందుకు వెదకుతూ ప్రళయం వచ్చి బ్రహ్మాండం నశించిపోయేంతవరకు ఇలా తిరుగుతూ ఉండాల్సిందే.

ఈ విధంగా తిరుగుతూ. నరనారాయణులు అనే మహామునులు ఎక్కడ తపస్సు చేశారో ఆ బదరీవనానికి వెళ్లాలని బయలుదేరాను. ఆ వనం మందారవృక్షాలతో, తీయమామిడిచెట్లతో, మద్దిచెట్లతో, పొగడచెట్లతో, అశోకతరువులతో, చింతచెట్లతో, పున్నాగభూజములతో, సురపొన్న, పొన్న, నిమ్మ, కడిమి, వేప, కొండమల్లె, రావి, మల్లె, గన్నేరు చెట్లతో మనస్సును హరిస్తూంటుంది. ఆ వనాన్ని సేవించాలనే ఆసక్తి ఉంది అని చెప్పాడు ఉద్ధవుడు.

తాను బదరికాశ్రమానికి వెళ్లిపోతున్నానని ఉద్ధవుడు చెప్పిన మాట వినేసరికి విదురుడు కలతపడ్డాడు. కంపించిపోయాడు. శోకసాగరంలో మునిగిపోయాడు. అయినా యోగసాధకుడు కనుక ఆ బలంతో తిరిగి గుండెను నిబ్బరం చేసుకొని తిరిగి మామూలు స్థితికి వచ్చాడు.

ఆ విధంగా విదురుడు దుఃఖమనే అగ్నిని తన విజ్ఞానమనే జలంతో చల్లార్చి, ఉద్ధవునితో ఇలా అంటున్నాడు.

ఉద్ధవుడు బదరీవనానికి వెళ్లిపోతున్న విషయం విని శోకాక్రాంతుడైన విదురుడు అంతలోనే తేరుకొని ఇలా అడుగుతున్నాడు. పుణ్యాత్ముడవైన, ఉద్ధవా! రాక్షసులకు శత్రువైన కృష్ణుడు దయతో నీకు అనుగ్రహించిన వేదాంతవిద్యాతత్త్వరహస్యాన్ని నాకు కూడా ఉపదేశించి పుణ్యం కట్టుకో. లోకంలో జ్ఞానులెవరైనా వారికి తెలిసిన విద్యను శిష్యులకు బోధించి వారిని కృతార్థులను చేస్తారు కదా!

వృష్టివంశంలోనే గొప్పవాడవైన ఉద్ధవా! ఎక్కడైనా భగవద్భక్తులైన పుణ్యాత్ములు ధర్మాన్ని అనుసరించి పరోపకారపరాయణులై ప్రవర్తించి కీర్తిమంతులవుతారు గదా!

విదురుని మాటలు విన్న ఉద్ధవుడు ఇలా అంటున్నాడు. విదురా! మైత్రేయమహర్షి సాక్షాత్తు విష్ణుసమానుడు. ఆ మహానుభావుడు మానవదేహాన్ని విడిచిపెట్టాలని ఆలోచించాడు.

ఉద్ధవుడు చెపుతున్నాడు. విదురా! నేను కాదు. త్వరలోనే భౌతికదేహాన్ని విడిచి పరమాత్మలో ఐక్యం కావాలని నిశ్చయించుకొని దానికి తగినవిధంగా పరాత్పరుడు, మురారి అయిన శ్రీహరిని తదేకంగా ధ్యానం చేస్తూ కాలం గడుపుతున్నాడు మైత్రేయుడు. ఆ మహర్షి వద్దకు వెళితే నీవు కోరిన పరమార్థజ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తాడు.

అలా పలికిన ఉద్ధవుడు విదురుని తీసికొని బయలుదేరాడు. చాలదూరం ప్రయాణం చేశారు.

అలా విదురునితో ప్రయాణిస్తున్న ఉద్ధవుడు కొంతదూరం వెళ్లాక ఎదురుగా కలువలతో పద్మాలతో ప్రకాశిస్తున్న యమునానదిని దర్శించాడు. ఆ కలువలలోని, పద్మాలలోని మకరందాన్ని గ్రోలి మత్తెక్కి విహరిస్తున్న తుమ్మెదలు కనిపిస్తున్నాయి. అలలు కదులుతున్నాయి. ఒడ్డున మామిడి, లవంగ, మాదీఫల వృక్షాలు, లతలు కనువిందు చేస్తున్నాయి. అక్కడి పొదరిండ్లలో సురాంగనలు విహరిస్తున్నారు. సంసారవిచ్చేదం చేయగలది, శుభాకారం కలది, పుణ్యప్రదమైనది ఆ యమునానది.

అందమైన ఆ యమునానదిని చూచిన ఉద్ధవుడు అక్కడనుండి కదలలేక అక్కడగల ఇసుకతిన్నెలపై శ్రీహరి పాదపద్మాలనే ధ్యానిస్తూ ఆనాడంతా అక్కడే ఉండిపోయాడు.

పుణ్యాత్మకుడు, మహనీయుడు, శ్రీహరిపాదపద్మధ్యాన క్రీడాపరాయణుడు అయిన ఉద్ధవుడు మరునాడు ఉదయమే విదురునితో కలిసి కాలుష్యహారిణియైన యమునానదిని దాటాడు.

ఇలా ఉద్ధవుడు యమునా నదిని దాటి బదరికాశ్రమానికి వెళ్లాడని శుకమహర్షి చెప్పగానే పరీక్షిన్మహారాజు ఆ యోగీంద్రునితో ఇలా అంటున్నాడు.

యాదవకులంలో ముసలం పుట్టింది. వారిలో వారే కలహించుకొని మహామహావీరులందరూ ప్రాణాలు కోల్పోయారు. శ్రీకృష్ణుడు తనకు తానుగా అవతారం చాలించాడు. మరి ఈ ఉద్ధవుడు మాత్రం ఎలా బ్రతికి ఉన్నాడో స్పష్టంగా తెలియజేయుమని పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రుని అభ్యర్థించాడు.

(1. అతిరథుడు - పెక్కండ్రు విలుకాండ్రతో ఒక్కడై పోరాడేవాడు.
2. సమరథుడు - తనకు సాటియైన ఒక్కవీరునితో పోరాడేవాడు.
3. మహారథుడు - పదునొకండు వేల యోధులతో పోరాడేవాడు.)

ఈ విధంగా అడిగిన పరీక్షిన్మహారాజునకు శుకయోగీంద్రుడు ఇలా చెపుతున్నాడు. మహారాజా! పూర్వకాలంలో బ్రహ్మదేవుడు శ్రీహరిని ప్రార్ధించాడు. భూలోకంలో పాపం పెరిగి, భూభారం అధికమైపోయింది. అందువల్ల ధర్మాన్ని నిలబెట్టేందుకు ఆ హరి యదువంశంలో అవతరించాడు. ఇక ఆ వంశం అవసరం తీరిపోయిందని భావించి తానుగా ఆ వంశానికి భరతవాక్యం పలికాడు. పంచభూతాత్మకమైన దేహాన్ని విడిచిపెట్టి, పంచోపనిషద్రూపమైన తేజశ్శరీరాన్ని ధరించాలనుకొని, తన తర్వాత తత్త్వజ్ఞానాన్ని లోకానికి అందించగల సమర్థుడు, జితేంద్రియుడు, తనంతటివాడు ఉద్ధవుడే అని భావించాడు.

శ్రీకృష్ణుడు ఉద్ధవుని కావాలని భూమిపై నిలిపి ఉంచాడు కనుక ఆతనికి మృత్యువు లేదు. శ్రీహరి అభిమానాన్ని పొందిన మహాపుణ్యుడైన ఉద్ధవుడు బదరికాశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు.

ఆతడు చెప్పినప్రకారం గొప్ప జ్ఞాని సుజనహితుడు, తపస్వి అయిన మైత్రేయ మహర్షిని దర్శించేందుకు ముందుకు సాగాడు విదురుడు.

విదురుడు యమునానదిని దాటాడు. కొన్ని దినాలు ప్రయాణం చేశాడు. దారిలో తగిలిన పుణ్యనదులను, వైష్ణవ క్షేత్రాలను దర్శించాడు. వేగంగా ముందుకు సాగాడు.

విదురుడు చాలదూరం ప్రయాణం చేశాక పాపాలనే చీకట్లను పోగొట్టే సూర్యునివంటిది, దయార్ద్రమైన చూపులతో మనను చూస్తున్నట్లనిపించేది, ఎత్తెన తరంగాలతో కనువిందు చేసేది, మహాత్ముల ప్రశంసలు అందుకొనేది అయిన గంగానదిని దర్శించాడు.

గంగానదిలోని పద్మాల సువాసలను మోస్తూ గాలి దాని తరంగాలను కదుపుతుంటే అవి నాట్యం చేస్తూ, తుంపరలను అన్నివైపులకు చిమ్ముతున్నాయి. వినసొంపైన నాదంకూడా ఆ తరంగాలనుండి వస్తోంది. అందులో స్నానమాడాడు విదురుడు.

కర్పూరంలా మిలమిలా మెరిసిపోతున్న ఇసుక తిన్నెపై యమ నియమాది అష్టాంగయోగ నిష్ఠను పూని పద్మాసనం వేసికొని కూర్చుని ఉన్నవాడు; శ్రీహరిపాదపద్మాలయందే మనస్సును లగ్నంచేసి, బాహ్యవిషయాలపై ఇంద్రియాలు ప్రసరించకుండా నియమించినవాడు; విద్వాంసులు మెచ్చుకొనే విధంగా శిష్టాచారపరాయణుడై వ్రతాలతో, ఉపవాసాలతో కృశించినవాడు; పుణ్యాత్ముడు; శరీరంపై వార్ధక్య లక్షణాలు కనిపించనివాడు; మెప్పును పొందే నడవడిక కలవాడు; అడుగుమోపినచోటును పవిత్రం చేయగలవాడు; యోగులచే కీర్తింపబడువాడు; సాధుజనులకు భాగ్యమైనవాడు; ఆశ్రయించిన వారిని కటాక్షించేవాడు అయిన మైత్రేయమహర్షిని విదురుడు దర్శించాడు.
(యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి అను ఈ ఎనిమిది అ
ష్టాంగయోగములు.

యమము - సత్యము, దయ, క్షమ, ధృతి, మితాహారము, ఆర్జవము, బ్రహ్మచర్యము, అస్తేయము (చౌర్యము లేకుండుట), అహింస, శౌచము (పవిత్రముగా ఉండుట) అని పది విధములు. 

నియమము - తపము, సంతోషము, ఆస్తికత్వము, దానము, భగవదర్చన, వేదాంతశ్రవణము, లజ్జ, మతి, జపము, వ్రతము అని పది విధములు.

ప్రాణాయామము - మంత్రసహితముగా ఊపిరిని బిగపట్టుట

ప్రత్యాహారము - కోరికలనుండి ఇంద్రియాలను మరలించుట

ధ్యానము - భగవంతునియందు మనసును లగ్నము చేయుట

ధారణ - భగవంతుడు తప్ప మరియొకటి తెలియకుండుట

మననము - భగవంతునిగూర్చిన చింతన

సమాధి - పరమాత్మయందు మనస్సును లయము చేయుట

విదురమైత్రేయ సంవాదము

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...