Sunday, February 8, 2026

Sri Krishna Visiting His Queens Place - శ్రీకృష్ణుండంతఃపురకాంతలం జూడంబోవుట

శ్రీకృష్ణుండంతఃపురకాంతలం జూడంబోవుట

అటుతర్వాత పదునారువేల నూట ఎనిమిది బంగారురంగు మేడలతో కూడుకొన్న ప్రాసాదాంతఃపురం ప్రవేశించి కృష్ణుడు ఇలా అనుకొన్నాడు.

(శ్రీకృష్ణునకు 16108 భార్యలు. అందు ఎనమండుగురు పట్టపురాణులు. మిగిలిన 16100 మంది రాజకన్యలు. కృష్ణుడు నరకాసురుని సంహరించి వారిని వివాహమాడాడు. వారందరివీ వేరువేరు ప్రాసాదాలు. అవి సువర్ణమయాలు.)

శౌనకమునీంద్రా! ముందుగా ఒక దేవీమందిరంలో ప్రవేశిస్తే, మరొక్క సతీమణి కుందుతుందేమో! మరల నేను ఆ సుందరి అంతఃపురంలోకి వెళ్లే సమయంలో నాతో సరసాలాపాలు పల్కునో, పల్కదో! తాను విరసురాలై వ్యథ చెందుతుందేమో! నన్ను ప్రేమతో వీక్షిస్తుందో, వీక్షించదో! కళావిహీనురాలై అందం కానరాకుండగా ఉండిపోతుందేమో! అని భావిస్తూ ఆ సమయంలో తన యోగశక్తితో పెక్కురూపములుగా కన్పడుతున్నవాడై కృష్ణుడు అందరి మందిరాలలో ఒకేసారి ప్రవేశించాడు.

(భగవద్గీతలో పదో అధ్యాయంలో విభూతియోగంలో పరమాత్మ వివిధ విభూతులు భీన్న భిన్నరూపాలలో చెప్పబడ్డాయి. కాని ఒకేవ్యక్తి అదేరూపంలో పెక్కుమందిగా భాసిల్లడమనేది ఆశ్చర్య విభూతి. అది ఇందు వివరించబడింది. బ్రహ్మసూత్రాలలో దేవతాధికరణంలో ఒక వ్యక్తి యోగశక్తితో నానారూపాలుగా మారవచ్చని తెలియజేయబడింది.)

కృష్ణు డావిధంగా అందరి అంతఃపురాలలో ప్రవేశించే సమయంలో.

తామరపూలవంటి నేత్రాలు విప్పారజేసి వీక్షిస్తూ కృష్ణుడు అంతఃపుర గృహాల్లో అడుగుపెట్టాడు. ఆయన ద్వారంవద్ద కనబడ్డాడో, లేదో వారందరూ చంటిబిడ్డలను చంకలకెత్తుకొని ఎదురువెళ్లారు. కృష్ణవిరహంతో వారి శరీరాలు శుష్కించి ఉన్నాయి. సిగ్గుతో దిగ్గనలేచి తమ మొలనూళ్ళు జారిపోతూ ఉండగా ఎదురువెళ్లారు.

కృష్ణుడు యోగశక్తిచే అందరి ఇండ్లకు ఒకేసారి ప్రవేశించగా “నా భర్త నా ఇంటికే ముందుగా వచ్చాడు. నా ప్రాణేశ్వరుడు ఇదిగో నా ప్రాంగణంలోనే అడుగుపెట్టాడు. నా ప్రియుడు నా మందిరానికే తొలుతగా చేరాడు. నేనే ఇతర కాంతలు పొందలేని భర్తృసుఖం పొందగలిగాను అని భావిస్తూ ఆ పదహారు వేల నూట ఎనిమిదిమంది అంగనలు తమ ప్రాణనాథుని సముచితరీతిని అర్చించారు.

కృష్ణుడు అంతఃపుర కాంతలను విలోకించి ఇలా అన్నాడు.

మీ కొడుకులు వినయం, విధేయత మీపట్ల చూపుతున్నారా? కోడండ్రు మీ మాటలు జవదాటక ప్రవర్తిస్తున్నారా? ఇంటికివచ్చిన పండిత ప్రవరులను మీరు సత్కరిస్తున్నారా? నగలు, చీరలు, ఇతర వస్తువులు, ఆహార పదార్ధాలు, మధురరసాలు సమృద్ధిగా లభిస్తున్నాయా? ఎక్కడా ఏ లోటుపాటులు లేవు కదా! మీ మందిరాలు మంగళనిలయాలే కదా?

కాంతాతిలకమా! నుదుట తిలకం దిద్దుకోలేదేమి? పువ్వుంబోణీ! కొప్పున పువ్వులు తురుముకోలేదేమి? కస్తూరిగంధీ! మేనిపై కస్తూరి పూసుకోలేదేమి? భూషణ విభూషణాంగీ! భూషణాలు ధరించలేదేమి? హంసగామినీ! హంసలను పెంచుతున్నావా, లేదా? చిలుకలకొలికీ! చిలుకలకు పలుకులు నేర్చుతున్నావా, లేదా! లతాంగీ! లతలను మ్రాకులకు కూరుస్తున్నావా, లేదా? సరోజాక్షీ! సరస్సులలో జలకాలు ఆడుతున్నావా, లేదా? హరిణలోచనా! హరిణాలకు మేత వేయుచున్నావా, లేదా? ముద్దుగుమ్మా! పెద్దలను గౌరవిస్తున్నావా, లేదా! బంధుచింతామణీ! బంధువులను ఆదరిస్తున్నావా, లేదా? అని శ్రీకృష్ణుడు భార్యలతో సరసాలాపాలు కావించాడు.

కృష్ణుడు దూరంగా ఉన్న సమయాలలో ఆయన సతీమణులు మాంగల్యప్రదములైన ఆభరణాలు తప్ప బుద్ధిపూర్వకంగా మేనికి అలంకార సంస్కారాలు అంగీకరించరు. క్రీడావిహారాలకు వెళ్లుటకు ఇచ్చగింపరు. మందహాసాలు చిందింపరు. ఉద్యానవనవిహారాలు పాటింపరు. సుందరభవన సందర్శనాభిలాష ప్రదర్శింపరు. పర్వోత్సవ సందర్శనాలు కావింపరు. పతివ్రతానియమాలకు అంకితమైన ఇల్లాండ్రువారు.

లక్ష్మీదేవి చంచల స్వభావురాలు. ఆమె ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండేదికాదు. అయినా ఆమె తనకు విష్ణువు ప్రాణేశ్వరుడని భావించి ఆయన వక్షస్థలంలో శాశ్వతంగా ఉండిపోయింది. అట్టి సర్వోత్తముడైన కృష్ణుని సతీమణులందరూ వీక్షించారు. వెంటనే వారికి ఆనందంతో కన్నీళ్లు నిండాయి. అవే వారికి ఆభరణాలయ్యాయి. క్షణక్షణం కృష్ణుని తేరిపార చూస్తూ ఉండగా వారిలో కొంగ్రొత్త అనురాగం ఉదయించింది. వారు మనస్సుతో, చూపులతో, బాహుద్వయంతో ఆలింగనం కావించుకొన్నారు. పరమాత్మలో ఐక్యమయ్యే రీతిగా వారి త్రికరణ శుద్ధితోకూడిన స్థితి కానవచ్చింది.

పండితవర్యా! శ్రీకృష్ణుని సాధ్వీమణులు జగన్మోహన లావణ్యం కలవారు. వారి చిరునవ్వులు, వాల్చూపులు, సుందరరూపాలు అసామాన్యములైనవి. మన్మథుని బూడిద చేసిన పరమశివునైనా పరవశమయ్యేటట్లు, చేతిలోని ధనుస్సు అయిన పినాకాన్ని అవ్వలపారవైచేటట్లు చేయగల్లినవారు వారు. అయినా వారు తమ శృంగార చేష్టలతో మాధవుని మనస్సును మాత్రం కొంచెంకూడా కదల్చలేకపోయారు.

సర్వసంగపరిత్యాగి అయిన యోగేశ్వరుడైన కృష్ణుడు లోకవిడంబనార్థం సంసారిలాగా విహరించడం చూచారు సామాన్యులు. అవిద్యతో కూడుకొన్నవారు కాబట్టీ లోకులందరూ ఆయనను సామాన్య మానవునిగానే భావించారు. వారు సామాన్యులు కావున తమతోడి వ్యక్తిగానే భ్రమించారు. బుద్ధివృత్తి ఎల్లప్పుడు ఆత్మతోకూడి ఉంటుంది. కాని ఆత్మగుణాలయిన సచ్చిదానంద లక్షణాలు బుద్ధికి అంటవు. అలా అంటి ఉంటే “నేను సుఖిని, నేను దుఃఖిని, నేను పురుషుడను, నేను స్త్రీని" అనే వ్యవహార జ్ఞానం ఏర్పడదు. అట్లే పరమేశ్వరుడు త్రిగుణాత్మికయైన ప్రకృతితో కలసియున్నాా ఆ ప్రకృతి గుణాలయిన సుఖదుఃఖాలను పొందకుండా ఉంటాడు. వాయుసంచలనంవల్ల వెదురు గడలకు పరస్పరం రాపిడి కలుగుతుంది దానినుండి అగ్ని పుడుతుంది. అది అరణ్యాలను కాల్చివేసే మహాప్రభంజనంగా మారిపోతుంది. అట్లే శ్రీకృష్ణుడు భూమికి భారం కలిగించే, పెక్కు అక్షౌహిణుల సైన్యం కలవారయిన రాజులమధ్య అన్యోన్యకలహం కలిగేటట్లుచేసి నిమిత్తమాత్రుడుగా ఉండిపోయాడు. తాను ఒక పరమశాంతునిగా, సాక్షిభూతునిగా మిగిలిపోయాడు. ఈనాడు అంతఃపుర మందిరాలలో నారీజన మధ్యంలో ప్రాకృత మానవునిలా విహరించసాగాడు.

బుద్ధిమంతుడా! జ్ఞానులు కూడ పరమేశ్వరుని నిర్గుణ తత్త్వంయొక్క విసృతమైన అవధిని తెలియలేరు. అట్లే ఏ ప్రమాణములకు అందని సగుణస్వరూపుడైన శ్రీకృష్ణుని వ్యక్తిత్వాన్ని కూడ కొందరు కానలేరు. ఆ కారణంచే కాంతలందరూ ఆయనను కాంతారతుడని భావించి విహారాలతో క్రీడించారు.

పుణ్యాత్ముడవైన శౌనక మునీంద్రా! ఆ కృష్ణుని సాధ్వీమణులందరూ, ఎవరికివారే నా ప్రియుడు నా మందిరంలోనే ఉన్నాడని, ఆ లక్ష్మీపతికి నేనే అనురాగవతినైన భార్యనని అనుకొంటూ, ఆ గోపీమనోహరుని వలపుల వలలో చిక్కుకొన్నారు.

అని ఈ రీతిగా సూతుడు వచింపగా శౌనక మహాముని విని మరల ఆ పౌరాణికునితో ఇలా అన్నాడు.

అశ్వత్థామ ఉత్తర గర్భంలో నున్న శిశువును నిర్మూలించుటకై ప్రయోగించిన బ్రహ్మశిరస్సు బాణాగ్ని నుండి బాలు డేవిధంగా రక్షింపబడినాడు? అతడు పెరిగి పెద్దయై, చివరకు తన శరీరత్యాగం చేసిన తీరు ఏ విధమో తెలుపవలసిందిగా శౌనకుడు సూతుని అడిగిన సందర్భం.

ఉత్తరకు పరీక్షిత్తుడు జన్మించుట

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...