Tuesday, February 24, 2026

Impregnate The teachings of Lord Kapila to his mother Devahuti - కపిలుండు దేవహూతికి బిండోత్పత్తి క్రమంబు దెలువుట

కపిలుండు దేవహూతికి బిండోత్పత్తి క్రమంబు దెలువుట

తల్లీ! ఈ పిండోత్పత్తి క్రమాన్ని కూర్చేవాడు ఆ భగవంతుడే. ఆయన శాశ్వతంగా ప్రకాశిస్తుంటాడు. నరకంలో పాపం వ్యయంకాగానే జీవుడు పురుషుడుగా శారీరక బంధాన్ని కోరి తన యింద్రియాన్ని స్త్రీగర్భంలో నిక్షేపిస్తాడు. ఆ యింద్రియం ఒక్కరాత్రి గడవగానే శుక్రశోణిత మిశ్రమంగా ఏర్పడుతుంది. అయిదురోజులకు బుడగగాను, పదవరోజుకు గంగరేగుపండంతగాను, ఆ మీదట అండం అంత మాంసపిండంగాను ఎదుగుతుంది. ఒక్కనెలకు తల, రెండు నెలలకు కాళ్ళుచేతులు ఏర్పడుతాయి.

ఆ గర్భపిండంలో మూడునెలలకు వెంట్రుకలు, ఎముకలు, చర్మం, లింగమార్గం, ఏర్పడుతాయి. నాల్గవనెలలో రసం, నెత్తురు, కండలు, మెదడు, ఎముకలు, మూలగ, ఇంద్రియం అనే ఏడు పదార్థాలు ఉత్పన్నమవుతాయి. అయిదవనెలలో ఆకలిదప్పులు, ఆరవనెలలో మావి ఆవేశిస్తాయి. అప్పుడా పిండం తల్లి కడుపులో దక్షిణభాగాన తిరుగుతూ ఉంటుంది. పురుగులతో కూడిన పురీషనాళంలోనూ, మూత్రనాళంలోను సంచరిస్తుంది. మూర్చలో మునుగుతుంది. నాళాలలో సంచరించేటప్పుడు క్రిములు కొరుకుతుంటాయి. తల్లి తిన్న ఆహారం కారం, చేదు, వేడి, ఉప్పు, పులుపు మొదలైన రసాదులతో వేగిపోతూ వుంటుంది. మావి సర్వాంగాల్ని, ప్రేవుల్ని చుట్టుకొని వుంటుంది. ఆ పిండం కడుపులో తలదించుకొని, వంకరగా వున్న పృష్ఠభాగం, మెడకల్గి, అవయవాల్ని కదల్చలేక పంజరంలో బంధింపబడిన చిలుక మాదిరి కర్తవ్యం తోచక వుంటుంది. భగవద్దత్తమైన బుద్ధితో గతజన్మలో తాను చేసిన దుశాఖర్మల్ని స్మృతికి తెచ్చుకుంటూ నిట్టూర్పులు నిగిడిస్తుంటుంది.

తర్వాత ఏడవనెలలో జ్ఞానం వికసించి, నడయాడుతూ, మలద్వారంలోని క్రిమిసాంగత్యం కల్గి, ఒకేచోట స్థిరంగా వుండలేక, సంచారం చేస్తూ వుంటుంది. తర్వాత గర్భవాయువులచే కంపన గల్గి, దేహమందలి ఆత్మను స్మరిస్తూ, పునర్జన్మకు భయపడుతూ, సప్తధాతువులచే నిర్భంధింపబడి దైవప్రార్ధనలో నిమగ్నమవుతాడు జీవుడు. ఇక చిట్టచివర చేతులు జోడించి తన గర్భవాసానికి కారకుడైన పరమాత్మని ఇలా స్తుతిస్తాడు.

సప్తధాతువులు : చర్మము, మాంసము, రక్తము, మజ్జ, అస్థి, వస, శుక్షము.

గర్భస్తుం డగు జీవుండు భగవంతుని స్తుతించుట
స్వయంగా లోకరక్షణకై తన ఇచ్చమేరకు అవతరిస్తున్న ఆ శ్రీహరి భయరహిత పాదపద్మాల్ని నిరంతరం స్థిరమైన భక్తితో కోరి భజిస్తాను.

(భయవిరహితము - భక్తులకు అభయాన్ని ప్రసాదించే అనే అర్ధాన్ని గ్రహించాలి.)

అంతేగాదు. నేను పృథివ్యాది పంచభూతాలకు అతీతుడను. ఆయనా పంచభూతాలతో నిర్మింపబడినదియు, దశేంద్రియాలతో ఒప్పుచున్నదియునైన భౌతికశరీరంచే చుట్టబడి భాసిస్తున్నాను. అట్టినేను

పాంచభౌతికం, దశేంద్రియమయమైన కర్మలతో కూడినది శరీరం. అందులో మాయామయమైన కర్మవాసనలతో వేగిపోతున్నది మనస్సు. ఇలాంటి పాంచభౌతిక దేహిచిత్తంలో స్వచ్చంగా ఆత్మతేజస్సుతో వెలుగుతున్నవాడు, పరమాత్మ. ఆయన చరిత్ర కొనియాడదగింది. ఆయనకు తెలియని దేదీ లేదు. ఆయన పరాక్రమం తిరుగులేనిది. దయా శాంత గుణాలకు ఆయన నెలవు. ఆ స్వామి ప్రకృతి పురుషులకంటె భిన్నమైనవాడు. పరంజ్యోతి స్ప్వరూపుడు. నా యీ నరకతుల్యమైన గర్భబాధలనుండి విముక్తి పొందటానికి నేను ఆయనకు నమస్కరిస్తున్నాను - (జీవుని ఆవేదనతో నిండిన స్తోత్రమిది. )

దేవహూతి కపిలుని అడిగింది- 'మహాత్మా! ఆ సర్వేశ్వరుని మాయకు లోనై, గుణకర్మల జంజాటంతో కూడిన సంసారంలో పడి ధైర్యం కోల్పోయినవారికి, దిక్కు తోచనివారికి, విష్ణుపాదస్మరణ మరచినవారికి ఆ స్వామిఅనుగ్రహం లేకపోతే, ఆయన్ని స్మరించటంగాని, ఆయన సందర్శనంగాని ఎలా చేకూరుతాయి? నాకు వివరంగా తెల్పు" అని అందుకు కపిలుడు మళ్ళీ ఆమెతో ఇలా చెప్పాడు.

ఆ సర్వేశ్వరుడు మూడు కాలాలలో మానవులు, పశుపక్ష్యాదులతోకూడిన ప్రాణికోటియందు, ప్రాణంలేని పర్వతాది స్థావరాలలోను ఉన్నాడు. కర్మమార్గంలో ఉన్న ప్రాణులు ఆధిభౌతికం, ఆధ్యాత్మికం, ఆధిదైవికం అనే తాపత్రయాలనుండి విముక్తి కోరి ఆ భగవంతుని సేవిస్తారు.

(తాపత్రయం : మూడు తాపాలు.

1. అధిభౌతిక తాపం : పాములు, తేళ్ళు మొదలగు ఇతర ప్రాణులచే గల్గు బాధలు.

2. ఆధ్యాత్మిక తాపం : తన దేహేంద్రియాలకు కలిగే వ్యాధులచే కల్గుతాపం.

3. ఆధిదైవిక తాపం : లోకానికి దైవికంగా సంభవించే అతివృష్టి, అనావృష్టివల్ల భూకంపం ఇత్యాదులచే గల్గు తాపం.)

తల్లీ! ఆ ప్రాణి పురుగులు, మలమూత్రాలు, నెత్తురుతో కూడిన గర్భపుసంచిలో మునిగి తేలుతుంటాడు. అంతేగాక జఠరాగ్నితో తపిస్తుంటాడు.

గర్భస్థజీవుడు దీనుడై గర్భగుహ నుండి బయలు పడాలని, నెలలు లెక్కపెట్టుకొంటాడు. తల్లి కడుపునుండి బయటికి తన్ను త్రోసేవారెవరైనా ఉన్నారా? అని చింతిస్తాడు.

భగవంతుడు దీనజనులను రక్షించేవాడు. నరకతుల్యమైన గర్భంనుండి నన్ను వెలికితీస్తే, అందుకు ప్రతిఫలంగా నేను ఆయనకు చేయగల మేలేమీ లేదు. చేతులు జోడించి ఆయనకు నమస్కరిస్తున్నాను. అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం(శమం, దమం) గల ఈ దేహమందు వెల్గుతున్న విజ్ఞానదీప ప్రకాశంతో ఆ స్వామికై ఎదురుచూస్తుంటాను అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.

తల్లి గర్భవాసం నరక తుల్యమైంది. దీనినుండి నేను బయటపడ జాలకున్నాను. ఒకవేళ బయపడినా, భగవన్మాయకు లోనై మనస్సు కుదుటలేక సంసారచక్రంలో పడి త్రిప్పులుపడుట తప్పదు. ఇకపై, ఈ గర్భశోకంనుండి బయటపడి, విజ్ఞానంతో సంసారబంధాలనుండి విముక్తుణ్ణై, ప్రత్యగాత్మను గ్రహించి నన్ను నేను నిరీక్షిస్తూ కాపాడుకొంటాను.

గర్భవాసం చెడ్డవ్యసనాలకు స్థావరమైంది. సంకటాన్ని కల్గిస్తుంది. దానికి అన్నీ రంధ్రాలే. క్రిముల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటి గర్భవాసాల్లో మళ్ళీ మళ్ళీ పడకుండా(పునర్జన్మలేకుండ) ఉండాలని, సంసారసముద్రాన్ని తరించడానికి అనువైన కమలనాధుని పాదపద్మాల్ని కొలుస్తూ ఉంటాను.

అమ్మా! పైన చెప్పినట్లు జీవునికి కొన్ని దృఢమైన నిర్ణయాలు ఉంటాయి. తాను తల్లిగర్భంనుండి బయటపడటానికి తటపటాయిస్తుండగానే అలా తొమ్మిదినెలలు దాటిపోతాయి.

ఆ జీవుడు పదవనెల రాగానే గర్భంనుండి వెలికి వస్తాడు. ఊర్పులు ఉడిగి, పెను దుఃఖంతో కూడి, జ్ఞానశూన్యుడై నెత్తురు ముద్దగా నేలపై పడతాడు. పరివారం అతణ్ణి పోషిస్తుంది. తనకేది కావాలో చెప్పలేని అశక్తుడై మంచంపై ఆయాసంతో ఇటునటు దొర్లుతూ వుంటాడు. దోమలు, నల్లులు, ఈగలు అతని దేహంపై మూగి కుడుతుంటాయి. పురుగులవల్ల బాధపడే పెద్ద పురుగులా వుంటాడు. అవి కుడుతూ ఉంటే దిక్కుదోచక ఏడుస్తూ, వుంటాడు. బాల్యావస్థ గడచి యౌవనంలో ప్రవేశిస్తాడు. అనుచితమైన సాహసకార్యాలకు పూనుకొంటాడు. అనవసరమైన ఆవేశాలకు లోనవుతాడు. సంసారంలో తగుల్కొని, చెడ్డవారితో చెలిమి చేస్తూ రత్యాసక్తి ఉదరపోషణ ఈ రెండే తనకు ఇంపైనట్లు నడుచుకొంటాడు. తెలివిలేమివల్ల అజ్ఞానియై కోపంతో మసలుకొంటాడు. ఫలితంగా దుఃఖభాజనుడవుతాడు.

“అమ్మా! నిజాన్ని పల్కటం, శుద్ధత, కనికరం, ధైర్యం, మునివృత్తి, తెలివి, సిగ్గు, ఓర్పు, కీర్తి, శమం, దమం, సంపద మొదలైన సద్గుణాలు చెడ్డవారితో చెలిమి చేస్తే నశిస్తాయి! అని చెప్పి, కపిలుడు మళ్ళీ, "అజ్ఞానులు, అశాంతులు, శరీరమే ఆత్మ అనుకునేవారు, స్త్రీ వ్యామోహం గలవారు. ఇలాంటి వారిని గూర్చి ఆలోచించకూడదు. ఎందుకంటే స్త్రీ వ్యామోహం అనుచితమని ప్రాజ్ఞులంటారు" అని చెప్పాడు.

స్త్రీ సాంగత్యం తగదనటానికి ఒక పూర్వకథ వుంది. పూర్వం బ్రహ్మ తన కూతురు శారదను కన్నాడు. ఆమె ఆడుజింక రూపమెత్తింది. ఆ రూపాన్ని చూచి బ్రహ్మ వ్యామోహియై, మగజింక రూపమెత్తి, అనాలోచితంగా దాని వెంటబడి రమించాడు. దీనిని బట్టి స్త్రీసాంగత్యం అనుచితమని తెలుస్తుంది. బ్రహ్మ మరీచ్యాదుల్ని కశ్యపాదుల్ని సృష్టించాడు. వారు దేవతల్ని మానవుల్ని పశుపక్ష్యాదుల్ని కన్నారు. ఇంత ప్రాణికోటి నడుమ స్త్రీ వ్యామోహానికి గురికాని మహాత్ముడు ఒక్కనారాయణ మహర్షి మాత్రమే. ఆ జితేంద్రియత ఆయన కొక్కనికే చెల్లింది. ఇతరు లెవ్వరికి సాధ్యపడలేదు” అని కపిలుడన్నాడు.

(నారాయణఋషి : నరుడు, నారాయణుడు అనేవారు సనాతన మహర్షులు. ఈ ఇర్వురు జంటఋషులు. పరమాత్మయే ఈ జంటకు మూలపురుషుడు. వీరికి లెక్కలేనన్ని జన్మలు గడిచాయి.

భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునునితో "బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున! తాన్యహం వేద సర్వాణి, నత్వం వేత్ధ పరంతప!" అంటాడు. అంటే అర్థం. "అర్జునా! నీకు, నాకు ఎన్నో జన్మలు గడిచాయి. అవన్నీ నాకు తెలుసు. నీకు తెలీదు" అని.

ఈ ఇర్వురు ద్వాపరయుగంలో 'నరుడు నారాయణుడుగా' జన్మించారు.)

విష్ణమాయ స్త్రీరూపమెత్తి, పురుషుణ్ణి మోహపరవశుణ్ణి చేస్తుంది. అందువల్ల మగవారు స్త్రీల సాంగత్యంలో చిక్కుకోకుండ యోగవృత్తి నవలంబించాలి.

నా పాదపద్మాల్ని నిరంతరం చిత్తశుద్ధితో కొలిచే భక్తులు స్త్రీలపొత్తును నరకద్వారమని భావిస్తారు.

దట్టమైన గడ్డిచే కప్పబడిన బావిలాగా విష్ణమాయచే కామం స్త్రీరూపం దాల్చి మిత్తిగా పరిణమిస్తుంది.

సంపదలు, పశువులు, దార పుత్రాదులు, చెలికాండ్రు, నివాసాలతో తానెంత గొప్పవాడైనా జీవుడు (లేక) ఏ జంతురూపమెత్తినా, కాక ఆకాశాని కెగబ్రాకినా, భూమిలో దాగినా, దిక్కులవెంట పరుగెత్తినా గతజన్మ కర్మఫలితాన్ని అనుభవింపక తప్పదు.

జీవుడు ఏ రూపమెత్తినా గతజన్మలో తానుచేసిన కర్మలకు ఫలితం అనుభవించితీరాలి. ఇహలోకంలో పురుషాకృతి తాల్చిన జీవుడు స్త్రీసాంగత్యంవల్ల ధనం, ఇల్లు, వాకిలి అనే భౌతికసంపదల రూపంలో ఉన్న స్త్రీత్వాన్ని పొందుతాడు. స్త్రీ రూపధారియై జన్మించిన జీవుడు, పురుషాకృతి తాల్చి ధనాదిరూపంగానున్న భర్తను మృత్యువని భావించాలి. ఈ మగరూపంలో మృత్యువు మనస్సుకు గుదిబండ వంటిది. లింగదేహధారియైన ఈ జీవుడు స్త్రీయైనా, పురుషుడైనా, జీవనోపాధికై ఏవోకర్మలు చేస్తూ, తత్కారణంగా కర్మఫలాల్ని అనుభవిస్తూ, వేటగాని చేతికి చిక్కిన జింకవలె అనేక కష్టాలకు గురియై మిత్తికి ఎర అవుతూనే వుంటాడు. మనోమయమైన శరీరాన్ని మరల మరల ధరిస్తూనే వుంటాడు. ఈ దేహత్యాగమే మరణం. ఈ దేహధారణయే జననం. ఇది చావుపుట్టుకల క్రమం. పదార్థ పరిజ్ఞానంకొఅకు; జీవునికి సాధనమైంది కన్ను. జీవుడు ద్రష్ట్రలక్షణంగల్గి, వస్తువును దర్శించగల యోగ్యత గల్గి వుంటే, తనకు చావుపుట్టుకలు లేవు. ఈ దశకు జీవుడు చేరుకోవాలంటే, ఆయనకు భీతిగాని, దైన్యంగాని వుండరాదు. తొట్రుపాటు తగదు. జీవలక్షణం తెలిసినవాడై, ధైర్యశాలియై, బంధముక్తుడు కావాలి. ఇందుకు ప్రధానమైన సాధనాలు ధ్యానం మరియు వైరాగ్యం. వీటి ఆసరాతో, మాయావృతమైన ఉపాధియందు తగుల్కొనకుండా నడుచుకోవాలి అని కపిలుడన్నాడు.

(వేటగాడు అడవిలో 'సంగీతం' వినిపించి జింకకు సుఖం కల్గించేవాడైనా చివరికి మరణకారణమవుతాడు. ద్రష్ట అనగా చూచువాడు, సాక్షిభూతుడైన పరమాత్మ దర్శనీయమైనది మాయావిరచిత జగత్తు. ఈ రెండింటి భేదం తెలిస్తే జీవుడు జననమరణాలు లేనివాడవుతాడు.

గృహస్థులు పురుషార్థాలైన ధర్మం, అర్థం, కామం అనే మూడింటితో సంతృప్తి చెంది వాటిసాధనలో నిమగ్నులవుతారు.వేదం నిర్దేశించిన ఉత్తమ ధర్మాలపట్ల, భక్తిపట్ల వ్యతిరేకులై, అన్యదేవతల్ని కొలుస్తారు. శ్రద్ధగా పితృక్రియలు చేస్తూ, శిష్టాచారులైయుంటారు. వీరందఱు కామ్యకర్మల యందాసక్తి గలవారు. పొగచూరిన దారుల్లో సాగుతూ చంద్రలోకం చేరి, అక్కడ కొంతకాలానికి తమపూర్వపుణ్యం నశిస్తూనే భూలోకంలో మళ్ళీ జన్మిస్తారు.

శ్రీహరి అనంతుడనే పాముని పడకగా చేసికొని యోగనిద్రలో ఉంటాడు. అప్పుడు ప్రళయం జరుగుతుంది. మహాత్ములు విష్ణుమూర్తిని గూర్చి -

అలఘుమతులైన యోగులు భక్తిపరులై తమ వర్ణాశ్రమాచారాల్ని పాటిస్తూ, వైష్ణవధర్మాల్ని సైతం శాంతంగా అనుసరిస్తూ బంధముక్తులవుతారు. అంతేగాక పరిశుద్ధభావులై, వైష్ణవేతరమైన ధర్మాలపట్ల వైముఖ్యం కల్గి ఎప్పుడూ విష్ణుమూర్తినే ధ్యానిస్తుంటారు.

ఆ మహాత్ములకు అహంకారంగాని మమకారం కాని ఉండవు. వారు శుక్లమార్గంలో చరించేవాడు, అద్వితీయమైన చరిత్రగలవాడు, విశ్వమూర్తి, విమలకీర్తి సృష్టి స్థితి లయకారకుడు, అవినాశి, అజుడు, ఇహపరాలుతానే అయినవాడు, పురుషోత్తముడు, క్రొందామరలవంటి కన్నులవాడైన ఆ సర్వేశ్వరునిలో తాదాత్మ్యం చెందుతారు. పునర్జన్మరహితులై, అమందానందాన్ని పొందుతూ వైకుంఠంలోనే నివసిస్తారు. సాయుజ్యం పొందిన ఆ యోగులకు 'పునరావృత్తి' ఉండదు.

తల్లీ! భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాలు, మనస్సు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనే భూతాలతో కూడిన క్షేత్రాల్ని సర్వేశ్వరుడు ప్రకృతిలో విలీనం చేసే పళయసమయం ఆసన్నమైనప్పుడు బ్రహ్మలోకంలో నివసిస్తున్న ఆత్మలు బ్రహ్మతోసహా శరీరంపై ఆస ఉడిగి పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తారు. కావున ఓ అమ్మా! నీవుకూడ సర్వభూతాంతర్వర్తియు, ప్రభావశాలియు, నిర్దోషియు, ఏకాకృతియునైన ఆ పరమపురుషుని శరణుకోరుము' అని కపిలుడు బోధించి మళ్ళీ ఇట్టన్నాడు.

కదిలేది, కదలని అయిన సమస్త భూతప్రకృతికి ప్రభువు. ఆ సర్వేశ్వరుడే. వేదవాఙ్మయమంతా ఆయన అధీనమైవుంది. భక్తులు, యోగులు, సనత్కుమారాది సిద్ధయోగులు, సిద్ధసాధ్యులు, మునులు, సకలదేవతలు ఎల్లరు యోగదృష్టితో ఆయన్న కొలుస్తారు. ఆ స్వామి భూతాలకొఱకై ప్రతిమాది సగుణరూపాన్ని ధరించి వైష్టతేజాన్ని ప్రదర్శిస్తాడు.

ఆ సర్వేశ్వరుడు కాలానుగుణంగా మూలస్వరూపంనుండి విడివడి గుణాల కలయికతో పెక్కు అవతారాలు(సగుణరూపాలు) ఎత్తుతూ ఉంటాడు. ఋషులు దేవతలు వారి కర్మగతి ననుసరించి, స్వర్గాది లోకాలలో పురుషరూపం ధరించి, కొంత పెత్తనం కావించి పురుషులుగా తిరిగివస్తారు. ఇతరులు కర్మానుసారులై ప్రాపంచిక ధర్మాలయెడ శ్రద్ధగల్గి, నిత్యనైమిత్తికకార్యాలలో తగుల్కొని, పితృదేవతలనే ఆరాధిస్తూ, తమయింటినే అంటిపెట్టుకొని జీవిస్తారు. (వీరికి విష్ణుభావన ఉండదని తాత్పర్యం).

ఈ త్రైవర్గికులకు ఇల్లే సర్వస్వం. వీరికి కోర్కెలు మెండు. కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలలో వీరికి అదుపు ఉండదు. వీరు నిరంతరం పితృదేవతల్ని మాత్రమే ఆరాధిస్తారు. శ్రీహరిని కొల్వరు. వీరిని త్రైవర్గిక పురుషులంటారు.

ఈ విష్ణుపరా
ఙ్ముఖులు అవివేకులు. మహాగుణశాలి, పరాక్రమధనుడై న శ్రీహరి కథామృతాన్ని చవిచూడ నిచ్చగించరు. అన్యదేవతా కథలంటే వీరికి చాలయిష్టం. వీరు నేతి పిండివంటలు మాని పీత్రికై పరుగులెత్తే ఊరబందు ల్లాంటివారు.

వివేక భ్రష్టులు చీకటిదారిలో ఊర్ధ్వలోకాలకు వెళ్ళి పితృలోకం పొందినవారు. అక్కడ తాము కూడబెట్టిన కర్మఫలం అంతరించగానే, తిరిగి తమ పుత్రులకే జన్మించగలరు. తల్లిగర్భగోళవాసం మొదలు శ్మశానవాటికా గమనంవరకు శ్మశానవాటి. పెక్కు దుర్భరక్రియల్ని అనుభవిస్తారు. అమ్మా! నీవు మాత్రం ఈ ఊబిలో పడవద్దు. అని చెప్పి కపిలుడు ఆమెకు పునర్జన్మ రాహిత్యాన్ని బోధిస్తున్నాడు.

(చీకటి, రాత్రి, ఆరు నెలల దక్షిణాయన మార్గాన్ని 'వేదాంతులు' ధూమయానమన్నారు. మందభాగ్యులు ఆ దారిలో పితృలోకం చేరి పుణ్యం ఖర్చయిపోగా, అదే దారిలో తిరిగి భూలోకం చేరి, తమ సంతానానికే బీడ్డలవుతారు. నరకతుల్యమైన గర్భవాసం మొదలు స్మశానప్రాప్తి పర్యంతం ఈ లోకంలో కర్మానుభావం కల్గి ఉంటారు.

"అమ్మా! నీవు త్రికరణశుద్ధిగా, పరంధాముడు, పాపరహితుడు, ఆదిమధ్యాంతములు లేనివాడు, జగత్కర్తయైన శ్రీమన్నారాయణుని నిరంతరం సేవిస్తూ ఉండు. అంతటితో నీకు పునర్జన్మ రహితమైన మోక్షం (సాయుజ్యప్రాప్తి) లభిస్తుంది.

భగవంతు నుద్దేశించే భక్తియోగం పరమాత్మసాక్షాత్కారానికి అనువైన వైరాగ్యానికి, జ్ఞానానికి సాధనమైంది. భగవద్భక్తితో కూడిన బుద్ధి ఇష్టానిష్టాలయందును, ఇంద్రియార్థములందును, ఉచితానుచితములందును సమదృష్టి గల్గి ఆత్మాన్వేషణ చేస్తుంది. పరమాత్మ ఎల్లప్పుడు ఒకే స్వరూపం గల్గి, దృశ్యం, ద్రష్ట దృక్కు అనే త్రిపుటి కారణంగా వేఱైనట్లు తోస్తాడు. యోగి తనయోగరూపంతో బిన్నరూపుడైన భగవంతునియందు అఖండరూపాన్నే దర్శిస్తాడు. అదే అనగా ఆ దర్శనమే ఆయనకు ఫలం. సామాన్యులకు మనోభ్రాంతివల్ల ఆ అఖండరూపం ఖండ ఖండంగా గోచరిస్తుంది. ఈ ఖండస్వరూపం ఎలాంటిదంటావా? అమ్మా! వినండి. అహంకారమనేది గుణస్వభావాన్ని బట్టి మూడురకాలు(సత్త్వం - రజస్సు - తమస్సు)గా; భూతస్వరూపాన్నిబట్టి పృథివి, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాత్మకంగా, ఇంద్రియరూపాన్నిబట్టి మనస్సు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలనే పదకొండు ఇంద్రియాలుగా ఖండరూపముంది. విరాట్పురుషుడు అండాకారంగా వున్న జగత్తునందు జీవరూపం తాల్చివున్నాడు. ఈ జగత్సత్యాన్ని నిస్సంగుడైనయోగి భక్తియోగంద్వారా మాత్రమే తెలుసుకోగల్గుతాడు. భగవంతుడు సకల యోగాలకూ వశుడవుతాడు. ఆయన త్రిగుణాతీతుడు. ఆయన్ను పొందడానికి జ్ఞానభక్తి యోగాలు రెండూ సాధనాలే. వీటికి తేడా లేదు. ఇంద్రియాలు వేఱు వేఱు. కాబట్టి ఒకేభావన పలురకాలుగా తోస్తున్నట్లే, బ్రహ్మస్వరూపంకూడ ఒకటే అయినప్పటికి భిన్నంగా తోస్తున్నది.

అమ్మా! కేవలం శాస్త్రాలు వల్లె వేసేవారికి, యజ్ఞాలు, చేస్తూ పుణ్యతీర్జాలు, తిరుగుతూ, జపం, తపం, వేదాధ్యయనం, యోగాలు, దానధర్మాలు చేసేవారికి శ్రీమన్నారాయణుని దర్శనం కానే కాదు. మనస్సును, దశేంద్రియాల్ని జయించి, కర్మలన్నింటిని త్యజించి, త్యాగియై, ఆత్మజ్ఞానసంపన్నుడై, విరాగిగా నున్నట్టి, ఫలాసక్తిలేని పురుషునికి కల్యాణగుణాకరుడైన ఆ పరమాత్ముని దర్శనం లభిస్తుంది.

నిర్మలమైన మనస్సు, ఇంద్రియవిజయం, ఫలనిరపేక్ష వైరాగ్యం అనేవి భక్తియోగంలోని నాలుగు ముఖ్యాంశాలు. వీటిని తనతల్లికి కపిలుడు చక్కగా బోధించి ఇంకా ఇలా అన్నాడు. "అమ్మా! నేను కాలస్వరూపుణ్ణి. నా గతి ప్రాణికోట్లలో 'పుట్టుట, గిట్టుట' అనే రీతిగా వుంటుంది. అజ్ఞానకర్మలవల్ల జీవుని గమనం రకరకాలుగా ఉంటుంది. ఆ జీవుల్లో జీవాత్మ గుప్తంగా దాగివుంటుంది. దాన్ని తెలిసికోవటం తేలిక కాదు. ఈ సాంఖ్యవిజ్ఞానాన్ని(ఆత్మానాత్మవిచారాన్ని) నీతిమాలినవారికి, జ్ఞానహీనునికి, నడవడిక సరిలేనివానికి, దురహంకారికి, ఇంద్రియగ్లాని కలవానికి, భార్య, పిల్లలు, నివాసం వగైరాలందు ఆసక్తిగలవానికి, దైవభక్తి లేనివానికి, హరి భక్తుల్ని ద్వేషించేవానికి, బోధించరాదు. మరి ఎవరికి బోధించవచ్చో చెపుతున్నాడు స్వామి:

“అమ్మా! శ్రద్ధగలవాడు, ధ్యానించేవాడు. వినయశీలుడు, ఈర్ష్యలేనివాడు, ఎల్లరియందు మైత్రిగలవాడు, గురుసేవాసక్తుడు, ప్రాపంచిక విషయాలపట్ల విరక్తిగలవాడు, నెమ్మదియైనవాడు, ద్వేషం లేనివాడు, పరిశుద్ధమైన అంతరాత్మగలవాడు, నా భక్తులపట్ల ప్రేమగలవాడు, పరస్త్రీ సాంగత్యం కోరనివాడు, కోర్కెలేవియు లేనివాడు ఇలాంటి గుణగణాలు గలవానికి మాత్రమే సాంఖ్యయోగ రహస్యాలు బోధించాలి. ఈ ఉపాఖ్యానాన్ని ఏ స్త్రీపురుషులు శ్రద్దాభక్తులు కల్గి నా యందే బుద్ధినిల్పి వింటారో లేక చదువుతారో అలాంటి పుణ్యాత్ములకు నేను సాక్షాత్కరిస్తాను" అని కపిలుడు తల్లికి జ్ఞానబోధ చేశాడు” అని మైత్రేయుడు విదురునికి నివేదించాడు.

తర్వాత మైత్రేయుడు విదురునితో "అయ్యా! కర్థముని భార్యయైన దేవహూతి ప్రసంగమంతా విని, మోహభ్రాంతి తొలగినదై తన కుమారుడైన కపిలునికి సాగిలపడి నమస్కరించి, సాంఖ్యయోగ విజ్ఞానం ధ్వనించే స్తోత్రమిలా చేసింది. మళ్ళీ యిలా అంది-

తల్లి దేవహూతి కపిలునితో అంటున్నది. "కుమారా! నీది ప్రపంచంలో దేదీప్యమానమైన స్వరూపం. దాన్ని 'నారాయణుడని' అంటారు. ఆ రూపం శబ్దాది విషయమయం మనోమయం. పృథివ్యాది పంచభూతాలమయం, త్రిగుణాల ఉనికికి హేతువు, అయి దిక్కులన్నింట దేదీప్యమానంగా వెల్గుతున్నది. నీ గర్భకుహరంనుండి బ్రహ్మ పుట్టాడు. అతడు నీ రూపాన్ని సాక్షాత్తుగా దర్శింపలేక కేవలం మనస్సుతో భావించాడు. దానికనేక శక్తులున్నాయి. ఈ విశ్వమంతట నీ సుగుణాలు ప్రవాహరూపంగా వ్యాపించివున్నాయి. సర్వశక్తిమంతమైన నీ రూపం సర్వజగత్కార్యాలను నిర్వహిస్తున్నది.

ప్రళయకాలాంతంలో నీవు సమస్తలోకాల్ని కడుపులో దాచుకొని, కపట శిశువుగా పెద్ద కడలినడుమ 'వటపత్రశాయివి'గా కన్పిస్తావు.

మహాత్మా! నీ కాలిబొటనవ్రేల బుట్టిన అమృతము సేవించిన మహానుభావుడవు. నా పూర్వజన్మపుణ్యంవల్ల నేటికి నా కడుపున పుట్టావు” అన్నది దేవహూతి.

(ఇక్కడొక పౌరాణికగాథవుంది. పూర్వజన్మంలో కర్థముని పుత్రికయైన కళకు మరీచివల్ల ఒక బిడ్డ కల్గింది. ఆమెపేరు పూర్ణిమ. ఈమె వేరొక జన్మలో హరిపాదాల్ని కడిగిన నీటిలో గంగ అనే పేరుతో పుట్టింది. ఈమెకు దేవకుల్య అనేకూతురు, విరజుడు అనే కొడుకు పుట్టారు. కళ ఎవరోకాదు. దేవహూతికి బిడ్డే.

ఇక్కడ దేవహూతి హరి అవతారుడైన(భాగవతకథ) కపిలుణ్ణి స్తుతిస్తూంది. ఆమె తన గర్భాన శ్రీహరి అవతారమెత్తి నందుకు ఆశ్చర్యచకితురాలైనట్లు పద్యభావం ఉంది. ఆశ్చర్యమెందుకు? అనేది ప్రశ్న. శ్రీహరి విశ్వమయుడు. పంచభూతాలు, ఏకాదశేంద్రియాలు, పదునాల్గుభువనాలు ఆయన గర్భంలో దాగివున్నాయి. ఇంత గొప్పభారాన్ని మోసే విశ్వమూర్తి తన గర్భంలో ఎలా ఇమిడాడా? అని ఆశ్చర్యపడింది. అయితే ఆమె స్వామిని మాయాశిశువుగా పోల్చుకొంది. తన బొటనవ్రేల పొడమిన గంగాజలాన్ని స్వామి ఆస్వాదిస్తున్నట్లు ఆమె భావించింది. ఇది బాల్యచేష్ట. చిన్నపిల్లలు కాలివేళ్ళు, చేతివేళ్ళు చీకటం సహజమే కదా!)

సాక్షాత్తు పరమాత్ముడవు అయిన ఓ కపిల మహాశయా! నీవు, అవతారాలనెత్తే ఆసక్తిగలవాడవు. శ్రీరాముడు, కృష్ణుడు, ఆదివరాహం, నారసింహుడు మొదలైన ఎన్నో అవతారా లెత్తావు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేశావు. ధర్మాత్ములకు ఆత్మవిజ్ఞానమార్గాన్ని నిర్ధేశించావు. నీ మహిమను ఆ బ్రహ్మకూడ వర్ణించలేడు. వేదబృందం సైతం వివరించలేదు. వేయిమాటలేల? మరి నిన్ను పొగడటానికి నేనెంతదాన్ని? (స్వామి వర్ణనాతీతుడని భావం)

మహాత్మా! నీ పవిత్ర నామాన్ని స్మరించేవారు, స్తుతించేవారు ఎంత అధములైననూ, వారు నిజంగా శ్రీమంతులే అవుతారు. అంతేగాదు అగ్నిష్టోమాది క్రతువులు చేసే యజ్ఞకర్తలకంటె కూడ పవిత్రులే.

నీ పేరుచ్చరించేవాడు చండాలుడైనను, అతడు బ్రాహ్మణునికంటె కూడ శ్రేష్టుడే. ఇది నిజంగా లోకంలో విచిత్రమైన సంగతి.

భగవన్నామస్మరణచేసే చండాలుడు సైతం బ్రాహ్మణునికంటె కూడ శ్రేష్ఠుడనే సత్యం తెలిసినవారు లోకపావనమైన నీ కథామృతపానంవల్ల, ఎల్లతీర్థాల్లో మునిగితే వచ్చే ఫలాన్ని పొందగల్గుతారు. ఈ వాస్తవాన్ని వేదవాఙ్మయం చాటుతోంది. ఆ అమృతాన్ని చవిచూచిన వారే ధన్యులు, వారే పూజ్యులు, వారే సజ్జనులు.

దేవహూతి కుమారుడైన కపిలునుద్దేశించి, "ఆర్యా! నీవు అక్షర పరబ్రహ్మస్వరూపుడవు, పురుషశ్రేష్ఠుడవు. ప్రత్యగాత్మకు మాత్రమే అందేవాదవు. ఎల్లపాపాల్ని తుదముట్టించగల ప్రకాశం నీ అధీనం. వేదవిజ్ఞానస్వరూపుడవైన సాక్షాత్‌ శ్రీమన్నారాయణుడవు. నీకివేనా నమస్మారాలు అని అనగా, మాతృవాత్సల్యం చూరగొన్న ఆయన హృదయం దయారసంతో ఉప్పొంగిపోయింది. తల్లితో అంటున్నాడు.

తల్లీ! పూజ్యురాలా! సుఖదాయకమూ, మోక్షప్రదమూ అయిన యీ యోగరహస్యాన్ని నీకు విస్తరించి చెప్పాను. ఏమరక భక్తితో నీవు అనుష్టించవలసింది.

'యోగానుష్ఠానంవల్ల' జీవన్ముక్తి లభిస్తుంది. దీన్ని గ్రహించి ఏమరుపాటు లేకుండా తలంచుము. దీన్ని మనసారా ఆచరించని వారికి మృత్యుభయం వెన్నంటే వుంటుంది. సుఖంకూడ హుళక్కి

ఇలాగా కపిలుడు తల్లియైన దేవహూతికి సాంఖ్యవిజ్ఞానాన్ని వివరించి చెప్పి అంతర్థానం చెందాడు అని మైత్రేయ మహాముని విదురునికి చెప్పాడు.

కపిలుడు వెళ్ళిపోయాక దేవహూతి కుమారుని యోగమార్గోపదేశంతో విజ్ఞానవతి అయింది. అనంతరం ఆమె తన భర్తయైన కర్దమ ప్రజాపతి, కుమారుడైన కపిలుడు తనని వదలిపోగా, దూడని కోల్పోయిన గోమాతలాగా తల్లడిల్లింది. ఎదలో కపిలుణ్ణి స్మరించుకొంటూ తనభర్త కర్దముని తపోభూమివైపు దృష్టిసారించింది.

కర్దముని తపోవనమందు ఏపైన గున్నమామిడిచెట్లున్నాయి. అవి పూచిన పూలతో, పండిన పళ్ళతో, ఎఱ్ఱని చివురుటాకులతో భూమికి వంగి ఉన్నాయి. ఆ చెట్ల కొసల్లో రాచిల్కలు, గూళ్లెక్కి కర్దమ మహర్షి కీర్తికి నీరాజనాలర్పిస్తున్నవా అన్నట్లు మనోజ్ఞంగా ఆలాపిస్తున్నాయి. ఆ తపోవనమందలి ఉద్యానవనంలో చక్కని సరోవరం. దాని తీరంవెంట పొదరిళ్ళు ఉన్నాయి.

కర్దముని తపోవనవాటికలో పటికపురాలచే నిర్మించిన స్తంభాలతో చూడముచ్చటైన పచ్చరాలచే నిర్మింపబడిన గోడలున్నాయి. వజ్రాలు పొదివిన చక్కని కిటికీలతో, విలసిల్లుతున్న నీలివన్నెల మేడమెట్టు, చలువరాతి తిన్నెలతో, పగడాలకాంతిగల గడపలతో వాటిక శోభాయమానంగావుంది. అక్కడి సౌధశాలలకు బంగారుతో తయారై, రతనాలు పొదివిన వాకిళ్ళు అమర్చారు. పాలనురుగువలె తెల్లనైన ఏనుగు దంతాలతో చెక్కబడిన మంచాలు, వాటిపై స్వచ్చమైన పట్టాల సెజ్జలు, పల్లకీలు, బంగరుపీటలు వీటితో ఆ వాటిక విలసిల్లుతున్నది.

ఇంకా ఆ కర్దమాశ్రమం వికసించిన తామరలు, నల్లకలువలు, చెంగల్వలు మున్నగువాటియొక్క సువాసనల్నిటి గ్రహించి వీస్తున్నగాలులు, తామరపూలనుండి స్రవించే తేనెను ఆస్వాదించి మత్తెక్కిన జుంటీగలు ముసరుతున్న బావులు, కల్గివుంది. ఇంకా చిత్రవిచిత్రమైన ఆభరణాలు, వాసనాద్రవ్యాలు ఎన్నోవున్నాయి. దేవహూతి వాటిన్నింటిని పరిత్యజించింది. సరస్వతి నదిలోను బిందుసరస్సులోను నిత్యం మూడువేళల స్నానంచేస్తూ, ధ్యానంలో మునిగి, తపస్సు చేసి కృశించిన శరీరం గలదయింది. నిర్మలచిత్తముతో భక్తియోగం, వైరాగ్యం ఆసరాగా, ప్రశాంత వదనుడును, తనకుమారుడును, అగు శ్రీమన్నారాయణమూర్తి అవతారం తాల్పిన కపిలుని స్మరిస్తూ బ్రహ్మజ్ఞానం పడసింది.

దేవహూతి ఆత్మజ్ఞాన సాధనతో జీవత్వభ్రాంతి ఆస వీడి, ప్రకృష్టమైన పరబ్రహ్మమందు లీనమైంది. ఆ పరబ్రహ్మాస్వరూపం ప్రత్యగాత్మకు మూలరూపం. విశ్వమంతట వ్యాపించినట్టిది. శ్రేష్టమైనది. పుట్టుక లేనిది. స్వకీయమైన జ్ఞానదీపంతో మాయాంధకారాన్ని పటాపంచలు చేయగల్గింది. అమేయమైంది. విశ్వమంతటిపై అధికారంగలది. అలాంటి అద్వితీయమైన అక్షరపరబ్రహ్మమందు దేవహూతి దృష్టిని నిలిపి, సమాధిద్వారమున భగవంతునిలో విలీనమై పునర్జన్మ విముక్తిని కోరుతూ ఉంది.

కలలో కన్పించిన వస్తువు మేల్కోగానే కన్పించదు. దేవహూతికూడ ఆత్మతత్త్వ సాక్షాత్కారంకాగా దేహవిస్మరణపొంది పొగచూరిన అగ్నిలా ఉండిపోయింది.

యోగశక్తితో ఆ దేవహూతి ఆకాశాని కెగసి, దయాసముద్రుడైన ఆ శ్రీమన్నారాయణుని అడుగుదామరలపై మనసు నిల్పింది.

దేవహూతి కపిలుడు బోధించిన యోగమార్గంలో పయనించి శ్రీహరి సాయుజ్యం పొందింది. ఆమె వైకుంఠానికేగుట కాస్మారమైన ఆ పుణ్యక్షేత్రం 'సిద్ధిపదం' అనేపేరుతో వాసికెక్కింది. ఇక అక్కడే కపిలుడు తల్లిని వదలి ఆకాశసంచారులైన సిద్ధసాధ్యగంధర్వులు, అప్సరసలు, మునులు ప్రస్తుతిస్తుండగా, సముద్రుడిచ్చిన పూజాదులను పొంది, లోకశాంతి నిమిత్తం ఉత్తరదిక్కుకు వెళ్ళిపోయాడు అని మైత్రేయుడు విదురునికి చెప్పి “తండ్రీ! ఈ ఉపకథ నాకు తెలిసినంతవఱకు నీకు చెప్పాను. ఇది కపిల దేవహూతి సంవాదం. మిక్కిలి పవిత్రమైంది. దీన్ని రచించినవాడు కపిలుడే. ఇదొక యోగం. దీన్ని యే మానవుడు భక్తితో వింటాడో లేక చదువుతాడో వాడు పుణ్యాత్ముడు. సర్వపాపాలనుండి విముక్తుడవుతాడు. భగవంతుడైన శ్రీహరి పాదపద్మాల్ని చూరగొంటాడు” అని చెప్పి ముగించాడు. 'ఈ కథ శ్రీశుకుడు పరీక్షిన్నరేంద్రునికి చెప్పాడని సూతుడనే కథకుడు శౌనకాది మహామునులకు వివరించాడు. అప్పుడా శౌనకాదులు మహానందం చెంది, మహాత్మా! మీ వాగమృతాన్ని రుచిచూస్తుంటే మాకు తనివి తీరదు. ఇంకా తర్వాతి కథలు విన్పించండని ప్రార్ధించారు.

॥ శ్రీకృష్ణార్పణమస్తు 

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...