ధ్రువుండు కుబేరానుచరులైన గుహ్యకులతో యుద్ధము సేయుట
మహాపరాక్రమశాలియైన ధ్రువుడు అన్ని దిక్కులలో ఆకాశంలో అతిశయించిన ఘనపరాక్రమంతో దిక్కులు పిక్కటిల్లున్నట్లు శంఖాన్ని పూరించగా, ఆ శబ్దాన్ని విని యక్షిణులు భయభ్రాంతలైరి. ఆ సమయంలో శక్తిమంతాలైన ఆయుధాలతో యక్షభటులు పురం వీడి బయలుదేరారు.
ఆ విధంగా బయలుదేరిన సేనలు ధ్రువునితో యుద్ధము చేయబూనగా
మహాపరాక్రమ సంపన్నుడైన ధనుర్ధారియగు ధ్రువుడు తన నెదిరించిన పదమూడువేల యక్షబలగాన్ని ఏ మాత్రమూ లక్ష్యపెట్టక ఎదిరించి ఒకేసారి వాడియైన మూడేసి బాణాలను వారిపై ప్రయోగించి నొప్పించారు.
(ధ్రువుడు మహారథుడుగా చెప్పబడినాడు. మహారథుడంటే - “తన మేను, రథము, రథ్యముల సారథిగాచి యని సేయువాడు మహారథుండు” అని ధనుర్విద్యావిలాసం (3-88).)
ధ్రువుని బాణప్రయోగంచే నొసళ్లు పగిలిన యక్షవీరులు మూర్చిల్లారు. కొంతసేపటికి తేరుకొని, ఆ మహాబలుని ధైర్యపరాక్రమాలు, హస్తలాఘవాన్ని పలుమార్లు మెచ్చుకొన్నారు. కాళ్లతో తొక్కబడ్డ కాలసర్పాలు పట్టరాని కోపంతో పైకెగసినట్లు భయంకరాకారాలతో వారు విజృంభించారు.
యక్షవీరులందరూ ఒక్కుమ్మడిగా మహాశూరుడైన ధ్రువుణ్ణి చుట్టుముట్టేశారు. ధ్రువుని అవయవాల నన్నిటినీ ఆరు ఆరు బాణాలతో నొప్పించారు. పెక్కురకాలైన గదలు, బాణాలు, చురకత్తులు, పట్టిసాలు, చిల్లకోలలు, శూలాలు, ఖడ్గాలు వంటి తీవ్రమైన ఆయుధాలను రథియైన ద్రువుడిపైనా, ఆయన రథసారథిపైనా వర్షధారల్లా కురిపించారు.
ఆ విధంగా బాణవర్షం కురిపించగా ఆ సమయంలో ధ్రువుడు నిరంతర వర్షధారలతో కప్పబడిన కొండవలె యక్షసమూహం కురిపించిన ఆయుధ వర్షంలో మునిగిపోయినట్లు కనిపించాడు. ఆ సన్నివేశాన్ని చూసి ఆకాశంలోని సిద్ధగణాలు భయకంపితులయ్యారు.
ఆ సమయంలో సిద్దులు మొదలైన దేవగణాలు ఆర్తనాదాలు చేశారు. ధ్రువమహారాజనే సూర్యుడు, రాక్షససైన్యమనే సముద్రంలో మునిగినాడా అయ్యో! అనే సందేహాన్ని పొందారు. (పద్మాలనే ప్రజలకు ఆప్తుడైన సూర్యునివంటి ధ్రువమహారాజు - సముద్రంలో సూర్యుడస్తమించేటట్టు, దైత్యసమూహమనే సాగరంలో మునిగిపోయాడా?)
అని బాధపడుతున్న సమయంలో ఆ యక్షులు తాము ఆ మనువంశంలో పుట్టిన ధ్రువుని నిజముగా కబళించామని భావించి సంతోషించారు. ఇంతలో మంచు పొరలను ఉదయకాలంలో మాయంచేసే సూర్యునివలె ధ్రువుడు రథంపై కనిపించాడు.
ధ్రువుడు శత్రువులకు దుఃఖభాజనంగా పరాక్రమాటోపంతో విల్లును మళ్లీ పట్టుకొన్నాడు. భయంకరంగా బాణాలను పరంపరగా ప్రయోగించాడు. తనను చుట్టు ముట్టిన శస్రాలను నుగ్గుజేసి, ఉప్పెనగాలికి మేఘాలు దూదిపింజలవలె విసిరివేయబడినట్లు గుహ్యకులను భుజాల విలాసంతో చిందరవందరబేశాడు
అసమాన పరాక్రమశాలియైన ధ్రువుడు బాణపరంపర ప్రయోగించగా, అవి తగిలి విరోధుల కవచాలు పగిలి తునాతునకలైనాయి. అవయవాలు తెగిపడ్డాయి. ఆయన అమ్ములకు గట్టిన ఈకలు తాకిన వేగానికి శత్రువుల బాణాలు వీగిపోయాయి. ఆ సన్నివేశం ఎలా కనిపించిందంటే, పూర్వం మహేంద్రుడు తన వజ్రాయుధంతో కొండల రెక్కలు తెగగొట్టినట్లుగా కనిపించింది.
(ఇంద్రుడు పర్వతాల రెక్కలు విరగగొట్టడంవెనుక కథ ;
పర్వతాలు తమయిష్టంవచ్చిన చోటికి ఎగిరిపోయి ఎక్కడంటే అక్కడ వాలుతుండేవి. అలాచేయడంవల్ల ప్రజలకు, భూమికి బాధలు కలిగేవి. ఆ కష్టాన్ని నివారించడానికి ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు తెగగొట్టాడు. ఆ రెక్కలే మేఘాలుగా మారాయి. ఇదీ ఐతిహ్యం. ఈ ఐతిహ్యాన్ని పోతన ఇక్కడ సందర్భోచితంగా వాడుకొన్నారు.)
అత్యంత పరాక్రమశాలియైన ధ్రువునిచే, బాణోపహతులై వికలాంగులైన వీరుల తలలు కిరీటాలతో, కుండలాలతో సహా తెగి కుప్పలు కుప్పలుగా పడిపోయాయి. అలా తెగిపడిన చేతులు మణికంకణాలతో, భుజకీర్తులతో తళుక్కుమని ఎగిరి పడుతున్నాయి. వీరుల లక్షణాలను ధ్రువుడు ఒక్క చోటగా కుప్పబోసినట్టుగా యుద్ధభూమి అత్యంత మనోహరంగా కనిపించింది.
ఉత్తమ పరాక్రమాతిశయంగల మనువు మనుమడైన ధ్రువునిచే ఆ విధంగా వికలాంగులైన వీరులు యుద్ధరంగాన్ని వీడి పెడమొగమై సింహరాజాన్ని చూసి ఏనుగుల గుంపులు ఒకదాని నొకటి మడమలు తొక్కుకొంటూ పారిపోయినట్లు యుద్ధరంగాన్ని వీడి వెనుదిరిగారు.
ధ్రువుని అసమాన పరాక్రమం సహించలేక రాక్షసమాయలు ప్రసరింపజేశారు. ధ్రువునికి వారి మాయాజాలం అర్థంకాలేదు. వారి అడుగుజాడలు కనిపెట్టడం కష్టమైంది. ధ్రువుడు తన సారథిని చూసి ఇలా అన్నాడు.
మాయదారి పనులుచేసేవారి విధానాలను ఎంత ఊహించినా, తెలుసుకోవడం ఎవరికి సాధ్యం అని పలుకుతూ ఆ పట్టణాన్ని ప్రవేశించడానికి చాలా ప్రయత్నించి తిరిగాడు. కాని, అది అదృశ్యం కావడంవల్ల ప్రవేశించే ప్రయత్నాన్ని ధ్రువుడు పూర్తిగా మనుకొన్నాడు.
చిత్రమైన రథాన్ని ఎక్కి నగరంలో ప్రవేశించడం మానుకొని తిరుగుతున్న ధ్రువుడు ఎదుటి శత్రువుల ప్రయోగ పద్ధతులను గూర్చి సందేహిస్తూ నిలబడి చూస్తున్నాడు. ఇంతలో మహాసముద్రంనుండి వెలువడే రొదవలె పెద్దపెద్ద శబ్దాలు వినిపించాయి. దిక్కుల నలుమూలలా గాలులు వీస్తూ ధూళి ఎగిసి తెరలుగా కప్పివేసింది. ఇంతలో ఆకాశంలో మేఘాలు కన్పించాయి. అందులో మెరుపులు తళుక్కుమని కనిపించాయి. మేఘాలు భయంకరంగా గర్జించాయి. ఆ మేఘాలు గాలిలో తేలిపోక వర్షం కురిపించాయి.
ఆ విధంగా రాక్షసులచే కల్పింపబడిన మాయలు అలా వేగంగా ధ్రువునిపై నానావిధాలైన దుర్గంధ భూయిష్ట పదార్దాలను - పుర్రెలు, ఎముకలు, మెదడు, మలమూత్రాలు - ఎడతెరపిలేకుండా కురిపించాయి. వరుసవరుసగా విండ్లు, అమ్ములు, కత్తులు, బల్లెములు, గదలు, చక్రాలు, త్రిశూలాలు - మొదలైన ఆయుధాలను వర్షించాయి. పర్వతాలముక్కలను, పాములను, ధ్రువునిపై వర్షించాయి.
ఇంకా మదించిన ఏనుగులు, సింహాలు, పులులు గర్జిస్తూ మీదికి దుమికాయి. అంతలో నాలుగు ప్రక్కలనుండి సముద్రజలాలు పొంగిపొరలాయి. ప్రళయకాలంలోవలె మొత్తం భీకరమైన పెద్దమడుగు కన్పించింది. ఇలా అనేక విధాలైన భయంకరదృశ్యాలు ఎడతెరిపి లేకుండా వచ్చేలా రాక్షసమాయలు కల్పించి, యక్షులు ధ్రువునిపై ప్రయోగించారు.
ఆ యక్షులు మాటి మాటికి చేస్తున్న మహామాయలు గమనించి, మునిసముదాయము ధ్రువుని దగ్గరకువచ్చి చిరంజీవివి కమ్ము అని ఆశీర్వదించి ఆయన సమక్షానికి
మునులంతా వచ్చి ధ్రువుని ఈ విధంగా ప్రబోధించారు. "ఓ పుణ్యాత్మా! శ్రీహరి దివ్య నామాన్ని విన్నా, స్మరించినా తరింపరాని మృత్యువునుకూడా జనం దాటగలరు. భక్తుల బాధలను పోగొట్టే ఆశ్రీహరి, ఆ భగవానుడు, ఆ పరమాత్మ, ఆ జగన్నాయకుడు నీ శత్రువులను సంహరించుగాక!" - ఈ విధంగా మాట్లాడుతున్న ఋషుల వచనాలను విని ధ్రువుడు ఆచమనంచేసి శ్రీహరి పాదపద్మాలను స్మరించి శత్రుభయంకరమగు నారాయణాస్త్రాన్ని వింటినారికి సంధించాడు.
ఆ విధంగా ధ్రువుడు నారాయణాస్త్రాన్ని సంధించగానే వివేకం పొడమినవెంటనే రాగాదులు మాసిపోయినట్లు యక్షమాయలనే కారు చీకట్లు క్షణకాలంలో చెల్లాచెదరైనాయి.
వారించడానికి శక్యంకాని ఆ నారాయణాస్త్రం నుండి బంగారు పిడులు, రాయంచ రెక్కలవంటి రెక్కలుగల వాడిబాణాలు వేలకొద్దీ పుట్టి అడవినిచుట్టిన అగ్నిజ్వాలలవలె భయంకరధ్వనితో శత్రుసేనలపై ఎడతెగకుండా వచ్చిపడ్డాయి.
ధ్రువుడు ప్రయోగించిన దృఢములైన, వాడి ఆయుధాల వర్షంతో యక్షులు వికలాంగులై మళ్లీ పట్టుదలతో పెద్ద ఆయుధాలను ధరించి, మళ్ళీ సైన్యాలను సమీకరించుకొని ధ్రువునితో యుద్ధం చేయడానికి పరుగులెత్తారు. ఆ దృశ్యాన్ని చూస్తే మహాసర్పాలు గుంపులై గరుత్మంతుణ్ణి ఎదిరించడానికి బయలుదేరినట్లున్నది. (హాస్యాస్పదమని భావన)
ఆ విధంగా మళ్లీ తన మీదకు దండెత్తి వచ్చిన గుహ్యకుల నందరినీ, తన బాణ ప్రయోగంచే పాదాలు, పిక్కలు, తొడలు, మెడలు, కళ్లు, చేతులు, చెవులు, కడుపులు ఎక్కడికక్కడ ముక్కలుగా నరికి పారవైచి యోగి సూర్యమండలాన్ని ఒక్కసారిగా భేదించుకోని ఏ ఉత్తమస్థానం చేరుకొనేటట్లుంటాడో, అట్టి స్థానాన్ని చేరేటట్లువారిని పంపాడు.
ఈ విధంగా చిత్రరథుడైన ధ్రువునిచే చంపబడ్డ నిరపరాధులైన గుహ్యకులను చూసి, ధ్రువుని తాత అయిన స్వాయంభవమనువు చాలా బాధపడ్డాడు. ఋషిగణాలను తీసుకొనివచ్చి ధ్రువునితో ఇలా అన్నాడు. "నాయనా! ఏ తప్పు చేయని ఈ గుహ్యకులను ఎలాంటి రోషంతో వధించావు! ఈ రోషమంతా నరకహేతువే! నీ సోదరునిపై నీకు ప్రేమవుండవచ్చు. నీ సోదరుడు చనిపోయాడని బాధావుండవచ్చు. కాని నీవు చేసింది తప్పు. ఇంక నీ ప్రయత్నంమాను!" అన్నాడు.
(గుహ్యకులు : కుబేరుని సేవకులు, అనుచరులను గుహ్వకులని పిలుస్తారు.)
ధ్రువకుమారా! మనుకులంలో పుట్టిన అనఘుడవునీవు. నీ కిది తగని పని. ఒకరికోసం అనేకుల్ని సంహరించావు. ఇట్టిపని నీవు చేయకూడదు. విరమించు.
(మానవులు మనువంశంలోనివారు. వారెలా నడచుకోవాలో వారవలంబించాల్సిన ధర్మస్వరూప మెలాంటిదో ఇక్కడ చెప్పబడింది.
దేహం మీది అభిమానంతో పశువులవలె ప్రాణిహింస చేయడం శ్రీహరిభక్తులైన సజ్జనులకు తగదు. నీవు సర్వప్రాణులను నీవలె భావించి సర్వప్రాణిస్వరూపుడైన శ్రీహరిని సేవించి, ఆయన స్థానాన్ని పొందావు. ఆయన మనస్సున కెక్కావు. హరిభక్తులందరినీ మెప్పించగలిగావు. నీ నడవడిక మంచిది. అలాంటి నీవు ఈ పాపకార్యం చేయడానికెలా ప్రయత్నించావు?
తనకంటె గొప్పవారియందు సహనభావం, తనతో సమానులయందు స్నేహభావం, తనకంటె తక్కువవారియందు దయ, మిగిలిన సమస్త ప్రాణులయందు సమభావం కలిగి వర్తించేవానిని సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్మ రక్షిస్తాడు. భగవంతుడు కరుణిస్తే ప్రకృతి సహజగుణాలనుండి విముక్తుడై లింగశరీరాన్ని విడిచి బ్రహ్మానందాన్ని పొందుతారు.
అయస్కాంతం దగ్గర ఇనుము భ్రమించినట్లు భగవత్సాన్నిధ్యంలో కార్యకారణ స్వరూపమైన ప్రపంచం భ్రమిస్తుంటుంది. సర్వేశ్వరుడు కేవలం నిమిత్తమాత్రంగా చూస్తుంటాడు. అట్టి భగవంతుని మాయాగుణ సంబంధంవల్ల పంచభూతాలవల్ల దేహాది ఆకారాలను పొందిన స్త్రీపురుషుల కలయికచే స్త్రీపురుష సంతతి ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా సృష్టిస్టితిలయాలు జరుగుతాయి. ఊహించడానికి అలవిగానంతగా కాలశక్తి ద్వారా జనాలనుండి జనాలను పుట్టించడంవల్ల ఆద్యుడు, నశింపజేయడంవల్ల అంతకుడు, అనాది కావడంవల్ల అవ్యయుడు అయి పరమాత్మ జగత్కారకు డవుతున్నాడు. అందుచే సృష్టిస్థితిలయాలను ఏమీ చేయనట్లే నటిస్తూంటాడు.
ఇలా మృత్యుస్వరూపుడు, పరుడు, సమవర్తి అయిన భగవంతుడికి తనవారు, పరులు అనే భేదం లేదు. కర్మలకు లోబడిన జీవులు స్వతంత్రతలేనివారై ధూళికణాలు గాలి ననుసరించి వెళ్లినట్లుగా భగవంతుని అనుసరిస్తారు. ఆయుర్దాయాలు సమకూర్చడం, నాశనంజేయడం లేకుండా స్వస్థుడైన భగవానుడు ప్రాణుల ఆయుస్సులకు హానివృద్దులు సమకూరుస్తాడు. ఆ సర్వేశ్వరుడే కర్మసాక్షి
మహానుభావా! కర్మసాక్షియైన సర్వేశ్వరుని కొందరు 'స్వభావం' అంటారు. కొందరు 'కర్మ' అంటారు. కొందరు 'కాలం' అంటారు. కొందరు 'దైవం' అంటారు. మరికొందరు 'కామం' అంటారు.
నిర్గుణుడు, అప్రమేయుడు అనేకశక్తులకు హేతుభూతుడు అయిన భగవానుడు చేసే పనులను బ్రహ్మరుద్రాదులు సైతం తెలుసుకోలేరు. ఇక ఆ భగవంతుని తత్త్వాన్ని ఎవరు తెలుసుకోగలరు? కాబట్టి, కుమారా! పుట్టుకకు, చావుకు దైవమే కారణం. అందుచేత ఈ కుబేరుని భటులు నీ తమ్ముని చంపారని కోపించవద్దు. భూతాత్మకుడు, భూతేశుడు, భూతభావనుడు, సర్వేశ్వరుడు, పరాత్పరుడు అయిన భగవానుడు తన మాయచే సృష్టి స్థితి లయాలను చేస్తూవుంటాడు. అయినా అహంకార రాహిత్యంవల్ల గుణకర్మలకు అంటరానివాడై ఉంటాడు. ముక్కు తాళ్లతో కట్టివేసిన పశువుల్లాగా, ఈ ప్రజాపతులు భగవదాజ్ఞలు పాటిస్తారు కాబట్టి, దుష్టులకు మృత్యుస్వరూపుడూ, శిష్టులకు అమృతస్వరూపుడూ, సర్వాత్మకుడూ, జగత్పరాయణుడు అయిన భగవంతుణ్ణి అన్ని విధాలా శరణు పొందు
పుణ్యాత్మా! నీవు ఐదేండ్ల వయస్సులోనే పినతల్లి పలికిన మాటలకు మనస్సు విరిగి, తల్లిని వదలి అడవులకు వెళ్లి తపస్సుజేశావు. స్వచ్చమైన భక్తితో ఈశ్వరుణ్ణి పూజించావు. మహావైభవంతో ముల్లోకాల కతీతమైన పదవిని సాధించావు. అనేక రూపాల మార్పుతో ఈ ప్రపంచం ఎవనియందు కనిపిస్తున్నదో, అతణ్ణి గూర్చి ప్రతిదినం (ధ్యానంచేయాలి).
భగవంతుడు ప్రత్యగాత్మ స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు, ఆనందమయుడు, శాశ్వతుడు, సకలశక్తి సంపన్నుడు, గుణసహితుడు, పుట్టుకలేనివాడు అయిన పరమేశ్వరునియందు శ్రేష్ఠమైన భక్తి కలిగి ఉండాలి. సమభావంతో ఉంటూ అహంకార మమకార సహితమై వృద్ధిపొందిన అవిద్య అనే గ్రంథిని నీవు తెంచివేశావు. కాబట్టి బుద్ధిమంతుడా! మంగళాలను హరించే రోగం వద్దు!!.
మందులచే రోగాలు ఏ విధంగా నశిస్తాయో, అట్లే రోషహృదయునివల్ల లోకాలు నశిస్తాయి. కాబట్టి రోషాన్ని పోగొట్టుకో!
ఓ పుణ్యాత్మా! నీ తమ్ముని చంపినవారనే కోపంతో ఈయక్షులను నీవు వధించావు. శివుని సోదరుడైన కుబేరునిపట్ల అపచారం చేశావు కావున
(సదాశివభ్రాతయైన యర్ధవిభునకు: శివునితో కైలాసంతో ఉన్న పార్వతీదేవి సౌందర్యాన్ని అసూయాదృష్టితో చూచిన ఐలబిలుని(కుబేరుని అసలుపేరు) పార్వతి కురూపివి కమ్మని శపించింది. దానితో 'ఐలబిలుడు' కుత్సితమైన బేరం(శరీరం)గల కుబేరుడయ్యాడు. పశ్చాత్తాపంతో శివుని శరణాగతి పొందగా శివుడు కుబేరుని తన తమ్మునిగా స్వీకరించాడు. శివునికి తమ్ముడైతే కుబేరునికి పార్వతి వదిన అవుతుంది. మరిదికి వదిన తల్లితో సమానం అని మనుస్మృతి. ఆ విధంగా సదాశివభ్రాతయై యర్థవిభుడైన కుబేరుడు దుర్బుద్దిని మానుకొని సత్ప్రవర్తన గలవాడయ్యాడు.
నీవు ఆ కుబేరుణ్లి వెంటనే నమస్కారాలతో, సోత్రాలతో ప్రసన్నుణ్ణి చేసుకొమ్మని చెప్పి, మనువు దయామయుడై కర్తవ్యం ఉపదేశించి, ధ్రువునిచే ప్రశంసింపబడి ఋషులతో కలసి వెళ్లాడు.
ఆ తర్వాత
యక్షులు, సిద్ధచారణులు, విద్యాధరులు మొదలగువారిచే స్తుతింపబడుతూ కుబేరుడే ధ్రువుని వద్దకు బయలుదేరి వచ్చాడు. ధ్రువుడు గుహ్యకులను చంపడం మానివేశాడనీ, మహారోషాన్ని విడిచిపెట్టాడనీ సంతోషించి చూడటానికి వచ్చాడు.
నమస్కరించి నిలబడ్డ ధ్రువుణ్ణిచూసి, ముచ్చటపడి కుబేరుడిలా అన్నాడు. రాజకుమారా! ప్రబలవిరోధాన్ని విడిచిపెట్టడం చాలాకష్టం. అయినా మీ తాతగారి ఉపదేశంతో నీవు దానిని విడిచిపెట్టావు. నేను నీయెడ అనుగ్రహపరుణ్ణి అయినాను. జీవుల పుట్టుకకు, నాశనానికి కాలమే కర్తగాని, మరెవ్వరూ కారు. నీ తమ్ముణ్ణి చంపింది ఈ యక్షులు కారు. వారిని చంపింది నీవున్నూ కావు.
దేహాభిమానం కారణంగా స్వప్నంలోవలె నేను, నీవు అనే దేహబుద్ధి పురుషునికి అజ్ఞానంవల్ల కలుగుతుంది. దానివల్ల బంధం, దుఃఖం మొదలైనవి సంభవిస్తాయి. కాబట్టి, అధోక్షజుడు, సర్వభూతస్వరూపుడు, సంసారబంధ విమోచకుడు అయిన భగవంతుణ్ణి సేవించు. ఆయన పాదపద్మాలు భజింపదగ్గవి. ఆయన త్రిగుణాత్మక మాయకు అతీతుడు. నీకు మేలు కలుగుతుంది. నీ మనసులోని కోర్కెను కోరుకో! నీవు శ్రీహరి పాదసేవను స్థిరబుద్ధితో చేస్తావు. కాబట్టి, వరాలు పొందడానికి అర్హుడవు.
కుబేరుని ఆ ప్రోత్సాహవాక్యాలు విని బుద్ధిమంతుడు, భాగవతోత్తముడైన ధ్రువుడు ఏ హరి స్మరణంవల్ల దురంతం, దుస్తరమైన అజ్ఞానాన్ని అవలీలగా తరింపగలుగుతామో ఆ శ్రీహరి స్మరణం నా మనస్సులో స్థిరంగా ఉండేటట్లు వరం ఇమ్మని అర్ధించాడు. ధ్రువుడు కోరినట్లే కుబేరు డతనికి శ్రీహరి స్మరణను అనుగ్రహించి ప్రీతాత్ముడై అంతర్థానం చెందాడు. ఆ తరువాత ధ్రువుడు యక్షులు, కిన్నరులు, కింపురుషులు తన వైభవాన్ని కీర్తిస్తుండగా తన రాజధానికి తిరిగివచ్చాడు.
ప్రశస్తమైన నడవడిగల విదురా! విను. ఇలా తన నగరానికి మరలి వచ్చి ధ్రువుడు అపారమైన దక్షిణలతో యజ్ఞాలు చేశాడు. అనేక ద్రవ్యాలు, ఆచరింపబడే క్రియలు విష్ణుమూర్తి రూపాలుగా చూపబడ్డాయి. కాబట్టి అంతర్లీనమై నిర్వహించిన విష్ణువే అధిదేవతయై సత్కర్మఫలాలను పుష్కలంగా పంచిపెట్టాడు. ధ్రువుని బుద్ధి ఇన్నింటిపై నిలవలేదు. ఇవన్నీ ఉపాధులు. వాని కతీతుడైన నారాయణునిపై తనకు గల భక్తి అఖండమై, ప్రవాహరూపమై ప్రకాశించింది. ఈ విధంగా జడము, చేతనము సమ్మిశ్రంగా ఉన్న సృష్టిలో ఆనందమయుడైన లక్ష్మీపతిని ఒక్కడినే చూస్తూ ధ్రువుడు జీవితాన్ని నడిపాడు.
ఈ విధంగా సుశీలసంపన్నుడు, పరబ్రహ్మపై నిష్ఠగలవాడు, ధర్మమనే వంతెనను రక్షించేవాడు, దీనులను కాపాడేవాడైన ధ్రువుడు తనను ప్రజలు తండ్రిగా భావిస్తుండగా, అరువది ఆరువేల సంవత్సరాలు రాజ్యం చేసి ఆ రాజ్యకాలంలో తన ఐశ్వర్యానుభవాల వల్ల పుణ్యక్షయాన్ని యాగాదులతో అశుభక్షయాన్ని సాధించాడు. ఎంతోకాలం, ధర్మార్థకామాలను సాధనాలుగా చేసుకొని కుమారునికి రాజ్యపట్టం కట్టాడు. ఇంద్రియ లౌల్యం లేనివాడయ్యాడు. అజ్ఞానంతో నిర్మితమైన కలలో చూచిన గంధర్వుల పట్టణంతో పోల్చదగిన శరీరాదికమగు భౌతికలోకం భగవంతుని మాయచే సృష్టించబడిందని మనస్సులో భావించాడు.
సేవకులు, మంత్రి, పురోహితులు, బంధుమిత్రులు, పుత్రులు, పశువులు, ధనరత్నాలు, స్త్రీలు, ఇండ్లు, విహార ప్రదేశాలైన పర్వతాలు మొదలుగా ఈ సముద్రాల నడుమ ఉండే భూభాగం, దిగ్గజాలు మొదలైన సమస్త పదార్థాలు అనిత్యాలైన రూపాలే అని భావించి మనువుతో సమానుడైన ధ్రువుడు వైరాగ్యభావం పొందాడు.
అతడు తన నగరంనుండి వెలువడి పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలు చేశాడు. బదరికాశ్రమాన్ని దర్శించి, విశాలానదీ పుణ్యతీర్ధాలలో స్నానంచేసి, ఇంద్రియాలను శుద్దిచేసుకొని పద్మాసనాసీనుడయ్యాడు. ప్రాణాయామంతో వాయుగతులను నిలిపి పరిపూర్ణుడయ్యాడు. కళ్లుమూసుకొని హరియొక్క రూపవైభవాన్ని ధ్యానం చేశాడు. భక్తి నిశ్చలం కాగా ఆనందబాష్పాలు ప్రవహించాయి. శరీరం పులకించింది.
(పవనుని బంధించటం అంటే ప్రాణాయామం చేయటం.)
తన సాధనలో క్లేశాలు తొలగి, లింగశరీరం అంతరించియున్న ధ్రువుడు తన్నుతాను మరచిన స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఉదయిస్తున్న పూర్ణిమా చంద్రునివలె పదిదిక్కులను వెలిగిస్తూ ఆకాశంనుండి ఒక విమానం వచ్చింది. అందులో ఇద్దరు దేవతా శ్రేష్ఠులు చతుర్భుజులై, ఎర్రతామరరేకులవంటి కనులతో, నీలమేఘచ్చాయతో మెరసిపోతున్నారు. వారు పీతాంబరధారులై గదలు పట్టుకొని నిలబడిఉన్నారు. కిరీటాలు, హారాలు, కుండలాలు, భుజకీర్తులు ధరించి యుక్తవయస్సులో కనిపిస్తున్నారు.
వారిని చూచి విష్ణుకింకరులని గ్రహించి ధ్రువుడు తొట్రుపాటుతో లేచి నిలబడ్డాడు. భగవంతుని వివిధ నామాలను స్మరిస్తూ సాష్టాంగదండప్రణామాలుచేసి నమస్కరించి వినమితగాత్రుడై విష్ణుని పాదాలపై హృదయాన్ని న్యాసం చేసి నిలబడ్డాడు. అతనిని చూచి సునందుడు, నందుడు అనే విష్ణుకింకరు లిద్దరూ ప్రీతితో చిరునవ్వుతో ఇలా అన్నారు.
ఓ మహారాజా! నీకు శుభమగుగాక! మా మాటలు శ్రద్ధగా విను. ఐదేండ్ల వయస్సులోనే నీవు తెలివితేటలతో, బుద్ధిబలంతో ఘోరతపస్సుచేసి, తేజోమూర్తి, ధర్మాత్ముడు అయిన విష్ణుమూర్తిని సంతృప్తిపరచావు.
అట్టి సమస్తలోక నాథుడైన విష్ణుమూర్తి మా ఇద్దరినీ పంపాడు. నిన్ను విష్ణులోకానికి తీసుకపోవడానికి వచ్చాము. భగవవత్సాన్నిధ్యం నీకు లభించగలదు.
నిన్ను తీసుకొని వెళ్లడానికి వచ్చాము. ఏ స్థానాన్ని పండితులైనవారు అన్నిటికంటె శ్రేష్ఠమైనదిగా భావించి పొందుతారో, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్ర సముదాయం ఏ పదానికి ప్రదక్షిణం చేస్తుంటాయో, దేనిని మీ తండ్రితాతలు, ఇతరులు పొందలేకపోయారో, ఏది సర్వలోకపూజ్యమో, దేనిని భక్తులు కానివారు పొందజాలరో, ఆ విష్ణుపదాన్ని నీవు పొందబోతున్నావు. ఓ ధ్రువా! ఇదుగో! రమ్ము! శ్రేష్ఠమైన ఈ విమానాన్ని నీ కోసం పురుషోత్తముడైన శ్రీహరి పంపాడు. దీని నెక్కడానికి నీవు అర్హుడవని విష్ణుదూతలు తెలుపగా, ధ్రువుడు వారి తియ్యని మాటలకు ఆనందించి, స్నానమాచరించి వచ్చి అక్కడి ఋషులకు నమస్కరించాడు. వారి ఆశీర్వచనాలు పొందాడు. విమానరాజానికి ప్రదక్షిణ చేసి అర్పించాడు. విష్ణుసేవకులైన సునందనందులకు నమస్మారం చేశాడు. భగవత్ స్వరూపంలో తన దృష్టినీ, మనస్సునూ నిలిపి విమానాన్ని ఎక్కడానికి తేజోరూపం తాల్చాడు.
(పెద్దగా కనిపించేవి నక్షత్రాలు. చిన్నగా కనిపించేవి తారలు.)
దేవతలు మ్రోగించే దుందుభులు మొదలైన వాద్యాల శబ్దాలు వినిపించసాగాయి. పూలవాన కురిసింది. కిన్నరులు, గంధర్వులు మంగళగీతాలు పాడారు.
(దుందుభి/ పణవ/ ఆనక/ మురజ -
1) దుందుశబ్దేన భా తీతి దుందుభిః | భాదీప్తౌ - దుందుం అని శబ్దించేది.
2) స్తోత్రం చేసేటప్పుడు వాయించేది పణవం.
3) స్వరవిశేషం ఉజ్జీవింపచేసేది ఆనకం.
4) ముర్ముర ధ్వని చేసే చర్మవాద్యం మురజం.)
ఆ సమయంలో ధ్రువుడు ఇతరులకు ప్రవేశించడానికి అసాధ్యమైన దేవలోకానికి వెళుతూ, దీనురాలైన తన తల్లిని వదలి ఎలా వెళ్ళడం అని చింతిస్తూండగా అది గమనించిన విష్ణుభక్తులు ధ్రువునికంటె ముందు వెరే విమానంలో కూర్చొని ముందుగా పోతున్న ఆయన తల్లిని చూపించారు. అప్పుడు ధ్రువుడు పరమానందం చెందాడు.
తల్లియైన సునీతిని విమానంలో ముందుగా వెళ్లడం చూచి ధ్రువుడు విమానమెక్కాడు. దేవతలతనిపై నిరంతరంగా పూలవాన కురిపించారు. అప్పుడతడు సంతోషంతో,
అలా పోయిపోయి శీఘ్రంగా స్వల్పకాలంలో గ్రహమండలాన్ని దాటాడు. ముల్లోకాలు దాటాడు. సప్తర్షిమండలాన్ని దాటి దానికి పైవైపుగా ప్రయాణించి ఎంతో సంతోషంతో హరిపదం చేరుకొన్నాడు.
ఆ విష్ణులోకం ముల్లోకాలను ప్రకాశింపజేస్తోంది. ఆ లోకం దయాగుణం లేనివారికి చేరరానిది. శాంతమూర్తులు, జీవులయందు సమదృష్టిగలవారు, పరిశుద్ధ ప్రవర్తనగలవారు, సర్వజీవులను సంతోషపెట్టెవారు, విష్ణుభక్తులకు చుట్టాలుగా తిరిగేవారు, ఇతరులకు శుభం కలిగించే పనులు చేసేవారు అయిన జీవులకు రెప్పపాటుగాని, ఏమరుపాటుగాని ఉండవు. జ్యోతిశ్చక్రమంతా దాని చుట్టూ కట్టుగుంజకు కట్టిన గోవులగుంపువలె ఎక్కడ పరిభ్రమిస్తూ ఉంటుందో అలాంటి విష్ణుపదాన్ని పొంది ధ్రువుడు ప్రకాశించాడు. అతడు ముల్లోకాలకు చూడామణియైనాడు. అట్టి ధ్రువుని మహిమను చూచి నారదమహర్షి సంతోషంతో ప్రచేతసులనే దేవర్షుల యజ్ఞశాలలో వీణవాయిస్తూ
మహాపతివ్రతయైన సునీతి కుమారుడైన ధ్రువుడు తపస్సుచేసి సాధించిన మహాఫలాన్ని బ్రహ్మర్షులు కూడా పొందలేరంటే క్షత్రియవంశంలో జన్మించినవారి మాట చెప్పాల్సిన అవసరంలేదు. ఈ ధ్రువుడు ఐదేండ్ల చిరుప్రాయంలో సవతితల్లియెన సురుచి పలికిన చెడుమాటలచే మనసు నొచ్చుకొని నా ఉపదేశాన్ని పాటించి అరణ్యానికేగి భక్తిపారవశ్యంతో శ్రీహరిని మెప్పించాడు. తన అధీనంలో ఉండేలా చేసుకొన్నాడు. విష్ణుస్థానాన్ని పొందాడు. ఆ విధంగా హరిపదం సాధించడం ఎవరికీ సాధ్యంకాదు. సునీతి పతిభక్తి, ధ్రువుని విష్ణుభక్తి రెండూ పరమోత్కృష్టమైనవని అర్ధం.
గొప్పదైన ధ్రువుని చరిత్రను నారదు డీవిధంగా గానంచేశాడని చెప్పి, మైత్రేయ మహర్షి పుణ్యాత్ముడైన విదురునితో ఇలా అన్నాడు.
ధ్రువుని చరిత్ర సజ్జనులు సమ్మతించేది, ధన్యతనుగూర్చి స్వర్గాన్ని అందించేది. యశస్సును, ఆయుష్షును, పుణ్యాన్ని శుభాలను కలిగించి పాపాలను తొలగించి దేవతావిభూతిని, ప్రశంసాపాత్రతను, ధ్రువపదానుగ్రవాన్ని కలిగించేది. అట్టి ఉపాఖ్యానాన్ని నీకు చెప్పాను. ఆ విష్ణుని పాదపద్మాలను ఆశ్రయించి సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలోను, అమావాస్యా పూర్ణిమ కాలాలలోను మరియు ద్వాదశిరోజు, ఆదివారాలలో, శ్రవణానక్షత్రంలో, శూన్యతిథిలో, సంక్రమణదినాలలో, వ్యతీపాతయోగంలో భక్తితో వినే సజ్జనులకు
(ధ్రువుని కథ సత్ప్రవర్తనం, వినయ విధేయతలు, ధర్మస్వరూపం మొదలైన విషయాలను ఉపదేశించే సన్నివేశాలు కలది.)
పై చెప్పిన విధంగా చేస్తే దుఃఖం తొలగిపోతుంది. భగవద్భక్తి, శీలసంపద కలుగుతుంది. తేజస్సు కోరుకొనేవానికి తేజస్సు, మనస్సును కోరుకొనేవానికి మనస్సును కోరికలులేనివానికి తత్త్వజ్ఞానం లభిస్తుంది. దీనిని వినిపించే వారికి దైవానుగ్రహం లభిస్తుంది. అట్టి కథను నీకు చెప్పానని మైత్రేయుడు విదురునకు చెప్పిన విధంగా, శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు చెప్పిన విధంగా సూతుడు శౌనకాది మహర్షులకు వినిపించాడు. అలా చెప్పిన మైత్రేయునితో విదురుడిలా అన్నాడు.
ఓ పుణ్యాత్మా! నారదమహర్షి ఈ ధ్రువుని గాథను ప్రచేతసులు నిర్వహించిన సత్త్రయాగంలో అధికంగా కీర్తించాడని చెప్పారు. ఈ ప్రచేతసులు ఎవ్వరు? ఎవరి కుమారులు? ఏ వంశంలో జన్మించారు? యజ్ఞాన్ని ఎక్కడ నిర్వహించారు? యజ్ఞపురుషుణ్ణి యజ్ఞంలో ప్రచేతసులు ఎలా కొలిచారు? విష్ణుపదసేవా పరాయణుడు, భాగవతోత్తముడు, దైవదర్శనంగలవాడు అయిన ఆ దివ్యయోగి నారదుడు విష్ణుకథాగానం ఎలా చేశాడు?
దయామయా! మైత్రేయ మహర్షీ! కీర్తించదగినవాడైన ధ్రువుని చరిత్ర అనే అమృతాన్ని చెవులనే దోసిళ్ళతో ఎంత త్రాగినా నా మనస్సు తృప్తి చెందకుండా ఉన్నది. ఆ చరిత్ర నా కిప్పుడు చెప్పండి.
అని అడిగిన విదురుని చూచి మైత్రేయుడు ఇలా అన్నాడు. ధ్రువుడు ప్రయత్నపూర్వకంగా అడవికి వెళ్లగా అతని కుమారుడైన ఉత్కళుడు పాపాలు తొలగి
ఉత్కళుడు నిష్కళంకుడు. పుట్టుకతోనే శాంతమూర్తి ఏమీ అంటనివాడు. అందరినీ సమభావంతో చూచేవాడు, తనలో లోకాలను, లోకాలలో తనను చూస్తూ యోగాభ్యాసం అనే అగ్నిలో కర్మవాసనలను దహింపజేశాడు. మందబుద్దివలె, గ్రుడ్డివానివలె, మూగవానివలె, చెవిటివానివలె ప్రవర్తించాడు. అతడు సర్వజ్ఞుడు కావడంవల్ల మంటలు చల్లారి నివురు గప్పిన నిప్పువలె ఉండేవాడు. శాంతము, జ్ఞానమయమూ అయిన బ్రహ్మస్వరూపాన్ని మనస్సులో భావిస్తూ ఉన్నాడు.
అతడు తనకంటె ఇతరం ఎరుగక జీవిస్తున్నాడు. సార్వభౌమపదవి మనస్సులో కోరుకోడు. అతని స్థితిని చూచి మంత్రులు, కులవృద్ధులు ఉత్కలుని పిచ్చివానిగా భావించి అతని తమ్ముడైన వత్సరునికి పట్టంగట్టారు. ఆ వత్సరునికి సర్వర్థి అనే భార్యవల్ల పుష్పార్ణుడు, చంద్రకేతుడు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అనే ఆరుగురు కొడుకులు కలిగారు. వారిలో పుష్పార్ణునకు ప్రభ, దోష అనేవారు ఇద్దరు భార్యలు. అందులో ప్రభకు ప్రాతర్మధ్యందినసాయములు అనే ముగ్గురు కొడుకులు జన్మించారు. దోషకు ప్రదోషుడు, నిశీథుడు, వ్యుష్టుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. అందులో, వ్యుష్టుడనే వానికి పుష్కరిణి అనే భార్యవల్ల సర్వతేజుడు అనేకొడుకు పుట్టాడు.
ఆ సర్వతేజునకు "ఆకూతి అనే భార్యద్వారా చక్షుస్సు అనేపేరుగల మనువు జన్మించాడు. చక్షుస్సునకు నడ్వల అనే భార్యయందు పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అనే పన్నెండుమంది పుత్రులు జన్మించారు. వారిలో ఉల్ముకునికి పుష్కరిణి అనే భార్యవల్ల అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అనే ఆరుగురు కొడుకులు కలిగారు. అందులో అంగునికి సునీథ అనే భార్యద్వారా వేనుడు అనే కొడుకు పుట్టాడు.
ఉత్తమ ప్రభువైన అంగరాజు తనకుమారుడైన వేనుని చెడునడవడికకు బాధపడి ఎవ్వరితో చెప్పకుండా రాజధాని నగరాన్ని వదలి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆపైన వేనుని అక్రమపరిపాలనాన్ని సహించని మునీశ్వరులు కోపించి వజ్రసమానమైన వాక్కులతో వేనుని “చావు”మని శపించగా అతడు మరణించాడు.
ఆ సమయంలో రాజ్యం రాజు లేనిదైంది. ప్రజలు దొంగలబాధచే తల్లడిల్లారు. అదిచూచి దుఃఖించిన మునులు పూనిక వహించి మరణించిన వేనుని కుడిభుజాన్ని మర్దించారు. అప్పుడు నారాయణాంశతో తొలిచక్రవర్తి అయిన పృథువు జన్మించాడు.
విదురు డామాటలు విని మైత్రేయునితో ఇలా అన్నాడు. ఓ పుణ్యాత్ముడా! సత్ప్రవర్తనగలవాడు, సజ్జనుడు, సుశీలుడు, వేదవిదుడు అయిన అంగరాజుకు చెడు సంతానం ఎలా కలిగింది? ఆ అంగరాజు ఏ కారణంతో మనస్సు వికలమై పురం వదలి వెళ్లిపోయాడు. ధర్మం తెలిసిన మునులు దండనను వ్రతంగాగల వేనుని చంపారన్నావు. అతనిపై ఎలాంటి నేరారోపణంచేసి బ్రహ్మదండంతో చంపారు? రాజులైనవారు, లోకపాలకుల తేజస్సునుకలిగి ప్రజాపాలనలో ఆసక్తిగలవారుగా ఉండాలి. అలాంటివారిలో పాపం వుంటే వారికి తప్పక ప్రజలనుండి అవమానం కలుగుతుంది. ఇహపరలోకాల రహస్యాలు కూలంకషంగా తెలిసిన నీవుమాత్రమే ఇందులో విశేషాలు చెప్పగలవు. కాబట్టి, వేనుని చరిత్రను ఆసక్తిని భక్తిని కలిగిన నాకు వివరంగా చెప్పుమని విదురుడు కోరగా మైత్రేయుడిలా అన్నాడు.
అంగపుత్రుండగు వేనుని చరిత్ర
Subscribe to:
Post Comments (Atom)
Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి
రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
No comments:
Post a Comment