Saturday, February 14, 2026

Srimannarayana Leela Avatara Varnanam - శ్రీ మన్నారాయణుని లీలావతారంబుల యభివర్ణనము

శ్రీ మన్నారాయణుని లీలావతారంబుల యభివర్ణనము

సూరిజనానికి వినుతింప దగినవాడవగు పండితవర్యుడా! రేయింబవళ్ళూ ఇతరకథా ప్రసంగాలు వింటూ ఏ మాత్రం పుణ్యం పొంత పోని వీనులకు విష్ణుకథలు విందు చేస్తాయి. సకల లోకాలకీ పూజనీయమై వెలుగొందే ఆ దేవుని దివ్యమంగళ కథాసుధారసాన్ని నేను నీకందిస్తాను. ఆసక్తితో ఆస్వాదించయ్యా!

ఈ విధంగా పలికి నారదుణ్ణి చూస్తూ బ్రహ్మదేవుడు మళ్ళీ అతనితో ఇలా అన్నాడు.

పూర్వం హిరణ్యాక్షుడనే రక్కసుడుండేవాడు. వాడు భుజబలాటోపంతో భూచక్రాన్ని చాప చుట్టినట్టు చుట్టి సముద్రగర్భంలో దాచాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహరూపం ధరించి ఆ దానవుణ్ణి మార్కొన్నాడు. సముద్ర మధ్యంలో కోరలతో క్రుమ్మి ఆ రాక్షసుణ్ణి హతమార్చాడు. వాడు వజ్రాయుధం వేటుకు నేలకూలే మహాపర్వతంవలె అతిభీకరంగా క్రిందపడ్డాడు. ఇది యజ్ఞవరాహావతార చరిత్ర.

ఇక సుయజ్ఞావతారం ఎలా సంభవించిందో చెబుతాను విను. అంటూ నారదునితో బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్పాడు.

పూర్వం రుచి అనే ప్రజాపతికీ, స్వాయంభువమనువు పుత్రికయగు ఆకూతి అనే గుణవతికీ సుయజ్ఞుడు పుట్టాడు, అతడు దక్షిణ అనే వనితను ధర్మపత్నిగా స్వీకరించాడు. ఆమె గర్భాన 'సుయములు' అన్న పేరుగల దేవతలను జనింపజేశాడు. ఇంద్రుడై దేవతలకు నాయకుడయ్యాడు. విష్ణువులాగా అఖిలలోకాల దుఃఖాన్ని తొలగింపజేశాడు. తాత అయిన స్వాయంభువమనువు తన మనుమని చరిత్రకు ఎంతో సంతసించి 'ఈ పుణ్యాత్ముడు శ్రీహరియే' అని అన్నాడు. మునీంద్రా! ఆ కారణాన ఉత్తమజ్ఞాననిధియైన సుయజ్ఞుడు శ్రీహరి అవతారంగా ప్రసిద్ధి పొందాడు.

బ్రహ్మ సుయజ్ఞుని గూర్చి చెప్పి ఆపై షడ్దర్శనాలలో ఒకటియగు సాంఖ్యయోగాన్ని ప్రవర్తింపజేసిన ఆచార్య శ్రేష్టుడు కపిలుని అవతారగాథను ఆలకించుమంటూ ఇలా అన్నాడు.

దేవహూతి అను ఆమె నిశ్చలమతియైన సతి. దివ్యతేజోవంతుడైన కర్దమప్రజాపతి ఆమె పతి. ఆ దంపతులకు సంతోషం అతిశయింపగా తొమ్మిదిమంది కూతుళ్ళతో పాటు శ్రీహరి కపిలుడన్న పేరుతో జన్మించాడు. ఏ యోగంతో శ్రీహరిని చేరడానికి సాధ్యమవుతుందో, ఆ మనోజ్ఞమైన సాంఖ్యయోగాన్ని ఆయన తల్లియగు దేవహూతికి బోధించాడు. అలా ఆమె పాపాలు రూపుమాపి మునులు అనుభవించే మోక్షాన్ని ఆమెకు ప్రసాదించాడు.

(ష
డ్దర్శనాలు-(1) న్యాయదర్శనం, (2) వైశేషికదర్శనం, (3) సాంఖ్యదర్శనం, (4) యోగదర్శనం (5)పూర్వమీమాంసా దర్శనం మరియు (6) ఉత్తరమీమాంసాదర్శనం. ఇందులో మూడవదైన సాంఖ్యయోగానికి ప్రవర్తకుడు కపిలమహర్షి)

ఇక దత్తాత్రేయుని అవతారం ఎలా వచ్చిందో, వివరిస్తాను. ఆలకించు.

మునులలో మేటియైన అత్రిమహర్షి తనకు పుత్రుణ్ణి అనుగ్రహించుమని విష్ణుని ప్రార్ధించాడు. అందుకు శ్రీహరి "మునీంద్రా! నేను నీకు దత్తుడ నయ్యాను" అని అన్నాడు. అందుచేత హరియే దత్తాత్రేయుడై అత్రికుమారుడుగా జన్మించాడు. ఆ మహాత్ముని పాదపద్మధూళి సోకి హైహయ వంశానికీ, యదువంశానికీ చెందినవారంతా పవిత్ర దేహులయ్యారు. ఆయన అనుగ్రహంవల్లనే ఇహ పరలోకాలలో యోగబలం ఆర్జించుకొన్నారు. జ్ఞానఫలాన్నీ, సుఖాన్నీ, ఐశ్వర్యాన్నీ, శక్తినీ, శౌర్యాన్నీ పొందారు. తమ కీర్తి మింట ప్రకాశిస్తుండగా ఉభయలోకాలలో ప్రసిద్ధి వహించారు. అట్టి దివ్యమూర్తి యగు హరిని నుతింపదరమా?

ఇక సనకుడు ,మున్నగు బ్రహ్మ మానస పుత్రుల అవతారాన్ని గూర్చి వివరిస్తాను, ఆలకించు.

పుణ్యాత్మా! నారదా! నేను కల్పారంభంలో విశ్వాన్ని సృష్టించాలనుకొన్నాను. అందుకై తపస్సు చేస్తూ 'సన' అని పలికాను. ఆ కారణంచేత 'సన' అన్న పేరుతో సనందనుడు, సనకుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే నలుగురు కుమారులు పుట్టారు. వారు బ్రహ్మ మానసపుత్రులుగా ప్రసిద్ధి పొందారు. గత కల్పాంతంలో అంతరించిపోయిన ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు లోకంలో సంప్రదాయబద్ధంగా ప్రవర్తింపజేశారు. నయ శీలుడవగు నారదా! ఆ విష్ణుని కళలతో జన్మించిన వాళ్ళు నలుగురైనా నిజానికి వారి అవతారం ఒక్కటిగానే పరిగణింపబడవలసియున్నది.

ఇంకా నరనారాయణులెలా అవతరించారో, విను.

వినుతి కెక్కిన గుణాలు గలవారూ, మిక్కిలి పావనమూర్తులూ అయిన నరుడూ, నారాయణుడు అన్నవారు ధర్మానికి అధిష్టానమైన ధర్మునికీ, దక్షుని సుతయగు మూర్తికీ జన్మించారు.

పరమ పవిత్రులైన ఆ నరనారాయణులు బదరీవనంలో తపోనిష్టులయ్యారు. అది చూచి ఇంద్రుడు వారి తపస్సుచే తన పదవికి గండం ఏర్పడవచ్చునన్న చింతకు లోనై దేవతా స్త్రీలలో మేలైన దేవతావనితలను పిలిపించి ఇంద్రుడు 'నరనారాయణుల తపస్సుకు అంతరాయం కలిగించండి' అని చెప్పి పంపాడు. ఆ కాంతలు ఎంతో సంతసంతో మన్మథునిసేనలా అన్నట్లు బయలుదేరి బదరీవనానికి పోయారు.

నరనారాయణులు ఉన్న వనంలో

అక్కడ నరుడూ, నారాయణుడూ తపస్సు చేస్తున్న చోటికి దేవకాంతలు సవిలాసంగా వెళ్ళారు. అందచందాలతీరూ, కళానైపుణ్యాల సౌరూ ఉట్టిపడునట్లుగా పరిహాసవచనాలు పలుకుతూ, ఆటలాడుతూ, పాటలుపాడుతూ, విహరించారు. అలా తపోవనంలో విహరిస్తున్న అమరకాంతలను ఆ నరనారాయణులు చూచారు. వారు ఏ మాత్రం చలించలేదు. కామునికి లొంగలేదు. నిశ్చింతులై, నిర్మోహులై వాళ్ళు అలాగే నిరతిశయ నిశ్చల ధ్యానంలో, తపస్సులో నిమగ్నులైవుండి పోయారు.

ఆ మేధావులైన నరనారాయణులు కోపం తమ తపస్సులను బాధిస్తుందని గ్రహించారు. సత్వగుణసంపన్నులు కావడంవల్ల వారు ఆ దేవవనితల మీద కించిన్మాత్రంకూడా కోపం చూపలేదు.

అప్పుడు నారాయణుడు వెంటనే తన ఊరుభాగాన్ని గోటితో చీల్చాడు. అందుండి అమరకాంతలు మెచ్చగా ఊర్వశి మున్నగు అచ్చరలు పుట్టారు.

నారాయణుని ఊరువులందు పుట్టినందువల్ల ఆమె ఊర్వశి అని ప్రసిద్ధి వహించింది. ఇంద్రుడు పంపిన దివిజకాంతలు ఊర్వశి మున్నగువారి సౌందర్యం, విలాసం, విహారం చూచి వారిముందు తమ ఆటలు సాగవని సిగ్గుజెంది ఓడిపోయారు.

మనసులో సంకల్పించినంత మాత్రాన ఆ నరనారాయణులు సృష్టిస్టితిలయాలు చేయ శక్తిగలవారు. అట్టి మహాత్ముల తపోనిష్ఠకు భంగం కల్గించాలని సురవనితలు చేసిన శృంగారచేష్టలు కృతఘ్నుడికి చేసిన ఉపకారక్రియలవలె వ్యర్థాలయ్యాయి. అందుచేత వాళ్ళు సిగ్గుతో కుంచించుకుపోయారు. ఆ ఊర్వశినే తమకు నాయకురాలినిగా చేసికొని వచ్చిన దారినే తిరిగి వెళ్ళారు.

పూర్వం రుద్రుడు మహాకోపంతో కాముణ్ణి కాల్చివేశాడు. కోపం అంత దారుణమయింది. అట్టి కోపాన్ని సైతం ఆ బుద్ధిమంతులైన నరనారాయణులు అనాయాసంగా జయించారు. ఇక వారు కామాన్ని జయించడం గురించి చెప్పనేల?

అలాంటి నరనారాయణుల అవతారం లోకాన్ని పవిత్రం చేస్తూ వెలుగొందింది. ఇక ధ్రువుని అవతారాన్ని వివరిస్తాను, వినుము. 

ఉత్తమచరిత్రుడైన ఉత్తానపాదుడనే నృపునకు ధ్రువుడు సత్పుత్రుడై సంభవించాడు, ప్రభావసంపన్నుడై పేరుగాంచాడు. చిన్న తనంలో ఒకనాడు తండ్రిచెంత ఉండగా సవతితల్లి 'సురుచి' ఆ బాలుణ్ణి నిందావచనాలనే అస్త్రాలతో నొప్పించింది. అందుకు దుఃఖించిన ధ్రువుడు గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలించింది. భగవానుడు సాక్షాత్కరించి ధ్రువుణ్ణి అనుగ్రహించాడు. అతడు సశరీరంగా వెళ్ళి ఆకసంలో మహోన్నతస్థానమైన ధ్రువస్థానంలో స్థిరపడినాడు. ఆచోటికి పైన ఉండే భృగువు మున్నగు మహర్షులూ, క్రింద ఉండే సప్తర్షులూ ఆ మహనీయుణ్ణి గొప్పగా ప్రశంసించారు. అతడు 'ధ్రువుడు' అనే పేరుతో విలసిల్లి విష్ణుతుల్యుడైనాడు. ఇప్పుడు కూడా ఆ పుణ్యాత్ముడు ఆ ధ్రువస్థానంలోనే వెలుగొందుతున్నాడు.

ఇంక పృథుచక్రవర్తి అవతరించిన తీరు వివరిస్తాను, శ్రద్ధగా విను.

వేనుడను రాజు భూసురుల శాపవచనాలనే వజ్రాయుధపు దెబ్బలకు గురియై సిరినీ మగటిమినీ కోల్పోయాడు. తుదకు నరకం పాలయ్యాడు. అతనికి పృథుడనే కుమారుడు శ్రీహరి కళాంశంతో జనించాడు. అతడు తండ్రిని పున్నామనరకం నుండి కాపాడాడు. భూమిని ధేనువుగా జేసి అమూల్యమైన అనేక వస్తువులను పిదికాడు.

ఇలా చెప్పి బ్రహ్మ మరల ఇలా అన్నాడు. నారదా! ఇప్పుడు వృషభుని అవతారం తెలియజేస్తాను, విను, 'అగ్నీధ్రు' డనే వానికి 'నాభి' అనే కుమారుడు కలిగాడు. నాభి భార్య సుదేవి. ఆమెకు మరొకపేరు 'మేరుదేవి'. ఆమెయందు శ్రీహరి వృషభావతారంగా జన్మించాడు. అతడు జడశీలమైన యోగం పూనాడు. ప్రశాంత చిత్తంతో ఇతరమైనవాటితో సంగం వదలి చరించాడు. 'ఇది పరమహంసల స్థితి' అని తన్ను గురించి మునులు ప్రశంసిస్తూ ఉండగా ఆ యోగంలో ప్రవర్తించాడు.

ఇక హయగ్రీవావతారం వర్ణిస్తాను, విను.

సచ్చరిత్రా! మేలిమి బంగరుకాంతిగలవాడూ, వేదస్వరూపుడూ, సర్వాంతర్యామీ, సాటిలేని యజ్ఞపురుషుడూ అయిన భగవానుడు 'హయగ్రీవుడు' అన్న పేరుతో నేను నిర్వహించిన యజ్ఞం నుండి ఆవిర్భవించాడు. సర్వాన్ని పావనంచేసే ఆ హయగ్రీవుని ముకుపుటాలలోని శ్వాసవాయువులనుండి వేదాలు ప్రాదుర్భవించాయి.

ఇంక మత్స్యావతారం వివరిస్తాను, విను.

కుమారా! ప్రళయసమయంలో సమస్తం జలమయమై పోయింది. ఆ పరిస్థితిని వైవస్వతమనువు ముందే గ్రహించి ఒక పడవపై కూర్చున్నాడు. అప్పుడు భగవంతుడు విచిత్రమైన మత్స్యావతారం దాల్చాడు. భూతలంలోని సకల జీవులకూ ఆధారమైన ఆ దేవుడప్పుడు నా ముఖంనుండి జారిపోయిన వేదశాఖలు సంకీర్ణమైపోకుండా విభజించాడు. దేవతల కోరికననుసరించి నాకు మళ్ళీ ఆ వేదశాఖల నందించాడు. వైవస్వతుణ్ణి నావపై ఎక్కించి ఆ నావ సముద్రంలో మునిగిపోకుండా కాపాడినాడు. మహామహనీయమైన ఆ మత్స్యావతారాన్ని వినుతించడానికి ఎవరికి శక్యమవుతుంది? ఇంక కూర్మావతారాన్ని గూర్చి విను.

నారదా! పూర్వం దేవతలూ, రాక్షసులూ అమృతం సాధించాలనే యత్నంతో మందరాద్రిని కవ్వంగా జేసుకుని క్షీరసముద్రాన్ని మథించారు. అప్పుడా కవ్వపు గొండ కడలి నడుమ మునిగిపోయింది. అప్పుడు శ్రీహరి తన వీపు దురద శమింపజేయటానికా అన్నట్లు గిరగిర తిరిగే గిరిని కూర్మరూపం దాల్చి ధరించాడు.

ఇక నరసింహావతారాన్ని వివరిస్తాను, వినుము.

హిరణ్యకశిపుడనే రాక్షసుడు దేవలోకంపై దాడి వెడలి దేవతలను బాధించాడు. ప్రచండ గదా దండం పైకెత్తుకొని వచ్చే ఆ దానవుణ్ణి శ్రీహరి చూచాడు. వాణ్ణి హతమార్చి ముల్లోకాలకూ క్షేమం చేకూర్చాలనుకున్నాడు. వెంటనే నిడుదకోరలతో భీతి గొలిపే నోరూ, కోపంతో ముడివడ్డ కనుబొమ్మలుగల నరసింహావతారం ధరించాడు. కరకు గోళ్ళతో ఆ రాక్షసేశ్వరుని వక్షం చీల్చి పరిమార్చాడు.

ఇక ఆదిమూలావతారాన్ని గురించి వివరిస్తాను వినుము.

నారదమునీ! పూర్వం గజేంద్రుడు మొసలిచే పట్టువడి దుఃఖించాడు. వేయి సంవత్సరాలు దానితో పోరాడి రక్షణకై మొరపెట్టుకొన్నాడు. హరి తప్ప తక్కిన దేవతలు విశ్వమయులు కారు. కాన అతని ఆపద మాన్పలేకపోయారు. అప్పుడా గజరాజు “శ్రీహరీ! నీవే నాకు శరణం” అంటూ శ్రీహరికి శరణాగతుడయ్యాడు. అతని ఆక్రందనం విని శ్రీహరి వెనువెంటనే ఆదిమూల (వైకుంఠ) రూపంలో వచ్చి పరమోత్సాహంతో మకరిని హతమార్చి కరిని కాపాడాడు.

ఇక వామనావతారం వివరిస్తాను, విను.

యజ్ఞాల కధిపతియెన విష్ణుదేవుడు అదితి సంతానంలో చిన్నవాడు. ఐనా ఉత్తమ గుణాలలో అందరికంటే జ్యేష్టుడై వెలుగొందాడు. ఆయన వామనాకారంతో బలిచక్రవర్తి చెంతకు వచ్చి అతని నేలలో మూడడుగులనేల యాచించి పుచ్చుకొన్నాడు. ఆ మూడడుగులతో ముల్లోకాలనూ ఆక్రమించాడు. వంచనతో అతని రాజమపహరించాడు. తాను సర్వేశ్వరుడైయుండి కూడా ఇంద్రుడికి రాజ్యం అప్పగించడానికై వంచనతో బలిని యాచించవలసివచ్చింది. వత్సా! బలిచక్రవర్తివంటి ధర్మాత్ముల సొమ్మును వినయంగా వెళ్ళి ఉచితపద్ధతిలో గ్రహించాలి. అంతేకాని అవివేకంతో పోట్లాడి ఆక్రమించరాదు- ఇది నిశ్చయం.

గొప్ప దాత అయిన బలిచక్రవర్తి ఆ బ్రహ్మచారి వామనుని పాదపద్మాలు కడిగిన పవిత్ర తీర్ధాన్ని ఔత్సుక్యంతో తలపై చల్లుకొన్నాడు. తనతో కూడ మూడు లోకాలనూ నారాయణునికి, ధారాదత్తం కావించాడు. విశ్వమంతటా శాశ్వతమైన కీర్తిని నిలుపుకొన్నాడు. ఆ దానం వల్ల దేవలోకాధిపత్యం పోతుందని జంకలేదు. తనకు హాని జరుగుతుందని శుక్రాచార్యుడు చెప్పినా వినలేదు.

నారదా! అంతేకాదు. ఆ పరమాత్ముడు హంసావతారం దాల్చాడు. అతిశయమైన నీభక్తియోగానికి మెచ్చాడు. నీకు ఆత్మతత్త్వం తెలిపే భాగవతమనే మహాపురాణం ఉపదేశించాడు. మనువుగా అవతరించి తన తేజోమహిమతో ఆమోఘమైన చక్రం చే బూని దుష్టులగు రాజులను దండించాడు. శిష్టులను రక్షించాడు. తనకీర్తి చంద్రికలు సత్యలోకంలో వెలిగేటట్లు చేశాడు.

ఆపై ధన్వంతరి రూపం ధరించాడు. తన నామస్మరణతోనే భూలోకంలోని ప్రజలకు రోగాలన్నీ తొలగిస్తూ ఆయుర్వేదం కల్పించాడు. ఇక పరశురామావతారం ఎలా వచ్చిందో చెబుతాను, విను.

మునీంద్రులలో అగ్రగణ్యుడవైన నారదా! పూర్వం హైహయవంశజులైన నృపులు లోకవిరోధులై దురుసుగా ప్రవర్తించారు. వారిని శిక్షించడానికి శ్రీమన్నారాయణుడు పరశురాముడుగా అవతరించాడు. రణరంగంలో ఇరవైయొక్క పర్యాయాలు ఆ రాజబృందాన్ని దారుణమైన తన గండ్ర గొడ్డలితో చెండాడినాడు. బ్రాహ్మణులు ప్రార్థించేసరికి భూమండలమంతా వారికి దానం చేశాడు. జమదగ్ని సుతుడైన ఆ పరశురాముడు అలా శాశ్వతకీర్తి పొందాడు.

ఇక శ్రీరాముని అవతారాన్ని చెబుతాను, విను.

చక్రధారియైన శ్రీమహావిష్ణువు లోకోపకారం చేయడానికి జగదభిరాముడైన శ్రీరాముడుగా అవతరించాడు. ఆయన సూర్యవంశమనే క్షీరసాగరానికి పున్నమనాటి చంద్రుడు. కౌసల్యాదేవి గర్భమనే ముత్తెపు చిప్పలో జన్మించిన మంచిముత్యం. తన భక్తుల శోకమనే చిమ్మచీకట్లను పోకార్చే సూర్యుడు. దశరథుని పుత్రకామేష్టి యాగశాల ముంగిట మొలకెత్తిన కల్పతరువు. కర్కశులైన దానవులనే కారడవులను దహించే కార్చిర్చు. రావణుని గర్వమనే పర్వతాన్ని బ్రద్దలు చేసే ఇంద్రుడు.

ఆ శ్రీరాముడు భరత లక్ష్మణ శత్రుఘ్నులనే సోదరులకు అగ్రజుడై జన్మించాడు, ఆ పవిత్రచరిత్రుడు పాపాలనే తీగలను తెగనరికే కొడవలిగా లోకంలో విలసిల్లాడు. ఆపై శ్రీరాముడు శివునిధనుర్భంగం ఓలి కాగా జనకుని కూతురు సీతాదేవిని చేపట్టాడు. ఆ దేవిపాదాలు చివుళ్లవంటివి, ఫాలం అర్ధచంద్రుని వంటిది, భుజాలు తామరతూండ్ల వంటివి, దంతాలు మొల్లల వంటివి, చేతులు పద్మాల వంటివి, కనులు కలువల వంటివి, పిక్కలు కాహళాల వంటివి, తొడలు కరభాల వంటివి, కుచాలు చక్రవాకాల వంటివి, నడుము ఆకసం వంటిది, పిరుదులు ఇసుకతిన్నెల వంటివి, కంఠం శంఖంవంటిది, చెక్కిళ్లు అద్దాలవంటివి, శరీరగంధం చందనంవంటిది, పెదవి దొండపండు వంటిది, పలుకు చిలుకపలుకువంటిది, గమనం గజగమనం వంటిది, చెవులు శ్రీకారాల వంటివి, ముక్కుసంపెంగ వంటిది, ముఖం చంద్రునివంటిది, శరీరం బంగారు వంటిది, నేత్రాలు చేపలవంటివి, కనుబొమలు ధనుస్సు వంటివి. తలవెండ్రుకలు నీలాల వంటివి, ముంగురులు తుమ్మెదల వంటివి, నవ్వు అమృతం వంటిది, బొడ్డు సుడి వంటిది.

ఆ తర్వాత, నీలిమబ్బువలె నల్లనైనవాడూ, సద్గుణాకరుడూ, ఐశ్వర్యంలో ఇంద్రతుల్యుడూ, దుష్టరాక్షసులను దునుమాడేవాడూ అయిన రామచంద్రుణ్ణి తండ్రి దశరథుడు అడవులకు పొమ్మన్నాడు.

ఈ విధంగా దశరథుడు శ్రీరాముణ్లి అడవులకు పంపగా, అడవులకు వెళ్తున్న రాముణ్ణి లక్ష్మణుడు, సీత అనుగమించారు. రఘువంశ శ్రేష్టుడైన రాముడు సివంగులూ, సింహాలూ, అడవిపందులూ, ఏనుగులూ, పులులూ, కోతులూ, ఖడ్గమృగాలూ, జింకలూ, తోడేళ్ళూ, పాములూ, ఎలుగుబంట్లూ, అడవిదున్నలూ మున్నగు అడవి మృగాలతో మిక్కిలి భయంకరమైన దండకారణ్యంలో సంతోషంతో ప్రవేశించాడు.

నరులను పావనులను గావించే నీతిలో నిపుణుడూ (నృప+అవననయశాలి= రాజరక్షణ నీతిశాలీ), దయాసాగరుడూ అయిన శ్రీరాముడు ఆ మహారణ్యంలో నివసించాడు. అక్కడ ఉన్న లోకపావనులైన మునిగణాలకు అభయప్రదానం చేశాడు.

సూర్యవంశమనే సముద్రానికి చంద్రునివంటివాడగు శ్రీరాముడు జనులందరూ ఆశ్చర్యపడగా కోపంతో మిక్కిలి భీకరమగు బాణాలు ప్రయోగించి ఖరుడనే రాక్షసుణ్ణి వధించాడు.

సింహంవంటి విక్రమంగల శ్రీరాముడు సూర్యునిపుత్రుడైన సుగ్రీవుణ్ణి అనుచరుడుగా గ్రహించాడు. ఇంద్రుని పుత్రుడగు వాలిని నేలగూల్చి యమపురికంపాడు. వానరరాజగు సుగ్రీవునికి సింహమధ్యఅగు రుమనూ, కిష్మింధారాజ్యాన్ని అప్పగించాడు.

పిమ్మట శ్రీరాముడు సీతకొరకై మూడులోకాలకూ విరోధియైన రావణుణ్ణి సంహరింపదలంచాడు. వానరసేనను వెంటబెట్టుకొని లంకవైపు పయనించి దక్షిణ సాగరతీరం చేరాడు. దాటవీలుగాని ఆ సాగరం బాట చూపనందున ఆగ్రహించాడు.

అంత ఆ మహావీరుడైన రాముడు నొసట కనుబొమలు ముడివడగా కోపంతో ఎర్రబడిన కనులతో ఆ సముద్రం వైపు చూచాడు. అలా చూడగానే సముద్రం-కాగిననీరూ, మొసళ్ళూ, తిమింగిలాలూ, నీటి కాకులూ, (ఆడు) తాబేళ్లూ, పాములూ, పవడపుతీగలూ, అలలూ, కొంగలూ, నీటికోళ్ళూ, చక్రవాక పక్షులూ, మున్నగు జలజంతువులతో సైతం తుకతుక ఉడికేసరికి ఇంకిపోయింది.

అప్పుడు సముద్రుడు దయాసాగరుడైన శ్రీరామచంద్రునికి శరణాగతుడయ్యాడు. రాము డతనిపై కరుణించాడు. యథాప్రకారం ఉండవలసినదిగా సముద్రుణ్జి అనుగ్రహించాడు. నలుడనే వానరప్రముఖునిచే వంతెన కట్టించాడు. ఆ మార్గంలో పయనించాదడు.

పూర్వం శంకరుడు ఒకే బాణంతో త్రిపురాలను దగ్ధం చేశాడు, అదే రీతిలో రాముడు పెద్దపెద్ద గోపురాలూ, మందిర ప్రాంగణాలూ, ప్రాసాదాలూ, రాజగృహాలూ, వీథులూ, తలుపులూ, రథాలూ, గుర్రాలూ, ఏనుగులూ, ఆయుధాగారాలూ, రాక్షసులతో సహా లంకానగరాన్ని చిటికలో భస్మం కావించాడు.

ఐరావతంవలె తెల్లనైన యశస్సుతో ప్రకాశించిన శ్రీరాముడు సమస్తలోకాలనూ బాధిస్తున్న రావణుని హతమార్చినాడు. అతని తమ్ముడైన విభీషణుణ్ణి ప్రీతితో లంకానగరానికి రాజుగా ప్రతిష్టించాడు.

ఆ రాముడు ధర్మరక్షకుడన్న మహిమగలిగి యుండికూడా ధర్మవిధ్వంసకుడై ప్రకాశించాడు, అనగా శివధనుర్భంగం చేశాడని భావం, ఖరదండనలో ఆభిముఖ్యంలేనివాడైనా ఖరదండనలో అభీముఖుడయ్యాడు. అంటే కఠిన శిక్షలు విధించడానికి విముఖుడైన రాముడు ఖరుడనే రాక్షసుణ్ణి దండించడానికి సుముఖుడయ్యాడు. పుణ్యజనరక్షకుడై కూడా పుణ్యజనులను వధించాడు, అనగా పుణ్యాత్ములను రక్షించి రక్కసులను శిక్షించినాడని భావం. (పుణ్యజన శబ్దానికి రాక్షసుడనే అర్ధం కలదు) ఆశ్రిత విభీషణుడు కాకున్నా ఆశ్రిత విభీషణుడయ్యాడు, అనగా ఆశ్రయించినవారిపట్ల భయంకరుడు కాడు, విభీషణునికి ఆశ్రయమిచ్చినవాడని తాత్పర్యం. మరియు రాముడు తన విస్తృత యశస్సును దశదిశలా వ్యాప్తం కావించి ప్రసిద్ధి వహించాడు. మహాసుందరుడూ, మహారాజులలో మేటీ, సుగుణాభిరాముడూ అయిన ఆ దశరథరాముణ్ణి కీర్తించడానికి లోకంలో ఎవరికీ సాధ్యం కాదు.

అటువంటి శ్రీరామచంద్రుని అవతారం లోకపావనమై మనబోటివారి ననుగ్రహించింది. ఇక కృష్ణావతారాన్ని వర్ణిస్తాను, విను.

మునివర్యుడవగు నారదా! రాక్షసాంశలతో పుట్టిన పెక్కుమంది రాజులు తమ అపార సేనాబలంతో అధర్మమార్గంలో ప్రవర్తించారు. భూదేవికి నానాబాధలు కల్గించారు. ఆమె దుఃఖిస్తూ హరితో మొరపెట్టుకొన్నది. పరాత్పరుడైన శ్రీమన్నారాయణుడు అపుడు మదోన్మత్తులైన దానవులను సంహరించి భూభారం తొలగించాలనుకొన్నాడు. యదువంశంలో వాసికెక్కిన వసుదేవునకు రోహిణి, దేవకి అనే భార్యలయందు తన తెల్లని కేశంతో బలరాముడుగానూ, నల్లని కేశంతో శ్రీకృష్ణుడుగానూ ఆ దేవుడు అవతరించాడు.

ఈ విధంగా పద్మాక్షుడైన శ్రీమన్నారాయణుడు భూభారమంతా నివారించడానికి తన రెండు వెండ్రుకలే చాలనుకున్నాడు. తన ప్రభావం తెలపడానికి తన అంశంలో పుట్టిన రామకృష్ణుల శరీరకాంతులు తెలుపునలుపులుగా చేశాడు. ధవళమూ, నీలమూ అయిన రెండు వెండ్రుకల నెపంతో రాముడు, కృష్ణుడు అను పేర్లతో అవతరించాడు. వారిలో షడ్గుణైశ్వర్య సంపన్నుడూ, సాక్షాద్విష్టుస్వరూపుడూ అయిన కృష్ణుడు ఇతర జనులు నడిచిన మార్గంలో నడిచినా మానవాతీతమైన కార్యాలెన్నో చేశాడు. అందువల్ల పరమేశ్వరుడుగానే ప్రసిద్ధి చెందాడు. ఆ మహనీయుడొనర్చిన కార్యాలు గణించడం ఎవరికీ సాధ్యం కాదు. అయినా నాకు తెలిసినంతవరకూ తెలుపుతాను, విను.

శ్రీకృష్ణుడు పురిటింట్లో పొత్తుల బిడ్డగావున్న సమయంలో పూతన అను రాకాసి చన్నులలో విషం నింపుకొని పాలివ్వడానికి వచ్చింది. దానిని గ్రహించి కృష్ణుడు పాలతోపాటు దాని ప్రాణాలు కూడా తాగి దాన్ని యమలోకాని కంపాడు.

భక్తలోకపాలకుడైన కృష్ణుడు మూడు నెలల ప్రాయంలో ఉన్నపుడే శకట రూపంలో ఒక దనుజుడు తన్ను పరిమార్చటానికి రాగా, అతణ్ణి తన కాలితన్నుతో యముని సమీపానికి పంపాడు.

కృష్ణుడు అల్లరి పనులు చేస్తున్నాడని గోపికలు యశోద వద్ద గోలపెట్టారు. యశోద అతని అల్లరిపనులు మాన్పించాలని తాడుతో రోటికి బంధించింది. వెంటనే ఆ బాలుడు పంతానికి రోలీడ్చుకుంటూ పోయి ఆకసమంటే జంట మద్దులను నేలగూల్చాడు. అప్పుడక్కడి జనులందరూ కృష్ణుణ్ణి కీర్తించారు.

నలకూబర మణిగ్రీవులు అనే ఇద్దరు గంధర్వులు శాపంవల్ల మద్దిచెట్లుగా రూపొందారు. బాలకృష్ణుడు ఆ చెట్లను నేలగూల్చి వారిని శాపవిముక్తులను గావించాడు.

యోగివర్వా! ఎన్నో అద్భుతకార్యాలు బాల్యంలోనే చేసిన కృష్ణుడు యశోద కొడుకని నేను నమ్మలేను. ఒకనాడతడు ఆ తల్లికి సమస్త చరాచర ప్రాణులూ, అడవులూ, నదినదాలూ, కొండలూ, సాగరాలూ వీటితో కూడిన వివిధ జగజ్జాలాన్ని అపూర్వప్రక్రియతో తన నోట చూపినాడు. అది చూచి తల్లి ఆశ్చర్యపడింది.

నదులు - పశ్చిమానపుట్టి తూర్పు సముద్రంలో కలిసేవి. నదములు - తూర్పునపుట్టి పశ్చిమ సముద్రంలో కలిసేవి.

యమునానదిలోని మడుగులో కాళియుడనే సర్పరాజు నివసించేవాడు. అతని నాల్కలు రెండూ భయంకరమైన విషంతో నిండియుండేవి. అతడు క్రక్కిన విషం కలిసిన నీరు త్రాగిన ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారు. ఇలా ఉండగా యదుకులతిలకుడగు కృష్ణుడు కాళియుణ్జి ఆ హ్రదంనుండి వెడలగొట్టి గోపాలురనూ, గోవులనూ రక్షించాడు.

కుమారా! అది ఒకనాటిరాత్రి సమయం. గోపాలురందరూ నీద్రిస్తున్నారు. ఇంతలో అమాంతంగా కార్చిచ్చు వారిని చుట్టుముట్టింది "కృష్ణా! మంటల్లో చిక్కుకొన్నాం. మమ్మల్ని కాపాడు" అంటూ వాళ్లు తనను వేడుకొన్నారు. అప్పుడు పద్మాక్షుడు "మీరంతా కళ్ళు మూసుకోండి. ఇదిగో క్షణంలో నే నా కార్చిచ్చు నార్పుతాను" అని చెప్పాడు. వారట్లె చేశారు. కృష్ణుడు అలవోకగా ఆ దావాగ్నిని కబళించివేశాడు.

ఒకనాటి అర్ధరాత్రివేళ నందుడు ముందు వెనుకల చూడకుండా యమునానదిలో స్నానం చేస్తూ మునిగిపోయాడు. అక్కడ వరుణుని పాశాలలో చిక్కుకొన్నాడు. అప్పుడు దయామయుడైన కృష్ణుడు అతణ్ణి ఆ పాశబంధంనుండి విడిపించాడు.

మునీంద్రా! మయాసురుని పుత్రుడైన వ్యోమాసురుడనేవాడు ఒకసారి తన మాయా ప్రభావంతో కృష్ణుని అనుచరులైన గోపకులనందరినీ ఒక గుహలో ప్రవేశించునట్లు చేశాడు. గుహలోనికి రాకపోకలు సాగించే దారిని మూసివేశాడు. వెంటనే మహావేగంతో శ్రీకృష్ణుడు ఆ కుటిల రాక్షసుణ్ణి పోరాటంలో హతమార్చి గోపాలకుల నందరినీ దయతో కాపాడాడు. అట్టి కృష్ణుని మహామహిమ ఇంతింతని చెప్ప వీలగునా? కాదని భావం.

గోపాలకులు గోకులంలో ప్రతిసంవత్సరం ఇంద్రుడికి ప్రీతిగా యాగం చేసేవారు. ఆ యాగం, చేయవద్దని కృష్ణుడు వారికి బోధించాడు. గోపకులు కృష్ణుని మాట విని యాగం నిలిపివేశారు. ఇంద్రుడు కోపోద్దీపితుడయ్యాడు.

అప్పుడు వ్రేపల్లె కలతపడునట్లుగా "అతివృష్టి కురియించండి" అని ఇంద్రుడు మేఘాలను పురికొల్పాడు. అంతట ప్రచండమైన వేగానికి పైకెగిరి ప్రళయకాలంలోని సంవర్తకాలవంటి మేఘాలు భీకరంగా వ్యాపించాయి.

ఇంద్రుని ఆదేశంతో వాన ప్రారంభమయింది. అగ్ని జ్వాలల్లాగా మిరుమిట్లు గొలిపే మెరుపులతో, ఆ వర్షం అంతకంతకూ భయంకరమయింది. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. సూర్యచంద్రమండలాలతో సహా ఆకాశాన్ని కప్పివేసిన కారుమబ్బులు దిగంతరాలకు వ్యాపించాయి. ధారాళంగానూ, కుండపోతగానూ వర్షం కురియసాగింది.

సప్తస్కంధ - కాళి, కరాళి, విస్ఫులింగిని, ధూమ్రవర్ణ, విశ్వరుచి, లోహిత, మనోజవ - అనే పేర్లుగల అగ్నిదేవుని నాలుకలు.

విడుపు లేకుండా పెద్దవాన కురిసింది. ఆ తాకిడికి గోకులమంతా వ్యాకులమై పోయింది. జనులందరూ మతిభ్రమకు లోనై మూర్చిల్లారు. అలా కలతజెంది బాధతో "కృష్ణా! కృష్ణా! కాపాడు. రక్షించవయ్యా" అంటూ మొరపెట్టుకొన్నారు. ఆ మొర విని అనంత దయాసముద్రుడూ, భక్తజనుల పాలిటి కల్పవృక్షమూ అయిన ఆ పద్నాక్షుడు, ఏడేండ్ల బాలుడైన కృష్ణుడు తన భుజస్తంభం పై అవలీలగా ఏడుదినాలపాటు గోవర్ధనగిరిని గొడుగులాగా అద్భుతంగా ఎత్తి పట్టుకొని, గోవులకు, గోపాలకులకు అందరికీ ప్రాణరక్షణ చేశాడు. ఏడు సముద్రాలచే ఆవరింపబడిన భూమినే ధరించిన భగవంతుడు ఈ కొండను ఎత్తడం ఏమాశ్చర్యం?

అది ఒక శరత్కాలపు రాత్రి. పండువెన్నెలలో బృందావన వీథులన్నీ తెల్లగా కనిపిస్తున్నాయి. విరబూచిన తామరలవంటి నేత్రాలు గల కృష్ణుడు ఆ వనంలో రాసకేళికి ఉపక్రమించాడు. ఆ క్రీడోల్లాసంతో పిల్లనగ్రోవి చేతపట్టాడు. దాని రంధ్రాలపై వ్రేళ్ళూని ఇంపుగా వివిధరాగాలను ఆలపించాడు. వాటిలో మంద్రస్థాయినీ, మధ్యమ
స్థాయినీ, తారస్థాయినీ వినిపించాడు. దైవతం, ఋషభం, గాంధారం, నిషాదం, పంచమం, షడ్జం, మధ్యమం అనే ఏడు స్వరాలు, కళలూ, జాతులూ, ఆరోహణావరోహణక్రమమూ తేటపడే విధంగా అవ్యక్త మధురంగా గానం చేశాడు. ఆ గానానికి మ్రోళ్ళు చివురించాయి.

శ్రీకృష్ణుని వేణువునుండి వెలువడిన మధురధ్వని విని గోపికలు పరుగెత్తుకొని వచ్చారు. అప్పుడు కుబేరుని అను యాయి యగు శంఖచూడుడనే గంధర్వుడు వాళ్ళను ఎత్తుకు పోయాడు. వాళ్ళు కృష్ణా, కృష్ణా, అంటూ మొరపెట్టుకొన్నారు. అది విని మాధవుడు వెంటనే ఆ శంఖచూడుని భుజదర్పం పోకార్చి ఆ సుందరీమణులను రక్షించాడు. అట్టి శ్రీకృష్ణుని నుతించడం ఎవరికీ సాధ్యంకాని పని.

ఆ శ్రీకృష్ణుడు నరకాసుడు, మురాసుడు, ప్రలంబుడు, కాలయవనుడు, కువలయాపీడమను ఏనుగు, ముష్టికుడు (చాణూరుడు) మొదలైన మల్లురు, కంసుడు, శంబరుడు, శిశుపాలుడు, పంచజనుడు, పౌండ్రక వాసుదేవుడు, పల్వలుడు, దంతవక్త్రుడు, ద్వివిదుడనే వానరుడు, గర్దభాసురుడు, సాల్వుడు, వత్సాసురుడు, బకాసురుడు, విదూరథుడు, రుక్మి, కేశి, దర్దురుడు, వృషభాకారాలు గల ఏడుగురు దనుజులు, ధేనుకుడు మొదలైన దుష్టులైన పెక్కుమంది రక్కసులను చిటికలో రూపుమాపినాడు.

అంతేకాక బలరాముడు, భీముడు, అర్జునుడు, మున్నగు ధనుర్ధారుల రూపాల వ్యాజంతో అవతరించి క్రూరస్వభావులూ, నీచులూ, దుష్టులూ, అయిన రాజులను యుద్ధమనే భుజబలక్రీడలో రూపుమాపి ఆ భగవంతుడు సమస్త ధరణీభారాన్ని తొలగించాడు. సజ్జనులను కాపాడినాడు. అట్టి అనంతుడైన కృష్ణ పరమాత్మను నేను సదా ఆరాధిస్తాను.

లోకోత్తరుడైన శ్రీకృష్ణభగవానుని అవతార ప్రభావం వివరించాను. ఇంక వ్యాసుని అవతారాన్ని వివరిస్తాను. శ్రద్ధగా విను. 

ప్రతియుగంలోనూ అల్పబుద్ధులూ, అల్పాయుష్కులూ, దుర్గతి పొందేవారూ అయిన మానవులుంటారు. వారికి భగవంతుడు కల్పించినవీ, శాశ్వతమైనవీ అయిన వేదాలు గోచరించవు. అట్టివారిని అనుగ్రహించాలన్న బుద్ధితో శ్రీహరి సజ్జనస్తుతి పాత్రుడై పరాశర మహర్షికి ప్రియపుత్రుడైన వేదవ్యాసుడుగా అవతరించి వేదవృక్షాన్ని శాఖలుగా విభజించాడు.

ఇంకా బుద్దుని అవతారం వివరిస్తాను, వినుము. చపలస్వభావులూ, అసత్యప్రవర్తనులూ, భేదాచారపరులూ, అధార్మికులూ, పాషండమతానుయాయులూ అయిన దితిపుత్రులు లోకాన్ని చంపుకు తినేవారు. పద్మలోచనుడు బుద్ధుడుగా అవతరించి ఆ రక్కసులను వారి దురాచారాలతో కూడ నిర్మూలించాడు.

ఇక కల్కి అవతారాన్ని గూర్చి వివరిస్తాను, విను. కలికాలంలో విప్రులు భగవంతుణ్ణి ప్రార్ధించరు, వేదవిహితమైన యజ్ఞ యాగాది కర్మలు చేయరు. వారినోటినుండి 'వషట్‌, స్వాహా, స్వధా' అనే యజ్ఞయాగాదుల్లో ఉచ్చరించే మాటలు వినిపించవు. వాళ్ళు సత్యం పాటించరు. నాస్తికులై వేదవిరుద్ధంగా ప్రవర్తిస్తారు. శూద్రులు రాజులవుతారు. ఇట్టి స్థితి సంభవించినప్పుడు భగవానుడు కల్కి రూపంతో అవతరిస్తాడు. అధర్మం తొలగిస్తాడు, ఇలలో ధర్మం స్థాపిస్తాడు.

ఇలా చెప్పి బ్రహ్మ మళ్ళీ నారదునితో ఈ విధంగా అన్నాడు. మునిఃశ్రేష్ఠా! శ్రీమన్నారాయణుడు స్వీకరించిన లీలావతార కథావిశేషాలు నే నిప్పుడు నీకు చెప్పాను. ఇంతకుముందే శ్రీహరి ఆదివరాహం మొదలైన అవతారాలు స్వీకరించి చేయవలసిన పనులన్నీ చేశాడు. మన్వంతర సంబంధమైన అవతారాలు ఇంతవరకూ జరిగినవీ ఉన్నాయి. ఇక జరగబోయేవీ ఉన్నాయి. వర్తమానకాలంలో ఆయన ధన్వంతరి, పరశురామావతారాలను ధరించివున్నాడు. భవిష్యత్తులో శ్రీరాముడు మొదలైన అవతారాలు ధరిస్తాడు. ఆ మహాత్ముడు సృష్టి మొదలైన వివిధ కార్యాలు నెరవేర్చడానికి మాయాగుణంతో నిండిన అవతారాలు స్వీకరిస్తాడు.

అనేక శక్తులతో కూడిన ఆ భగవంతుడు సృష్ట్యాదిలో తపస్సుగా, నేనుగా, ఋషులుగా, తొమ్మిదిమంది ప్రజాపతులుగా అవతరించి లోకాన్ని సృష్టిస్తూ వుంటాడు. ధర్మం, విష్ణువు, యజ్ఞాలు, మనువులు, ఇంద్రుడు మొదలైన దేవతల రూపాలతో, రాజుల రూపాలతో అవతరించి లోకాలను రక్షిస్తూ వుంటాడు. అధర్మం, రుద్రుడు, భీకరసర్పాలు, రాకాసిమూకలుగా అవతరించి విశ్వాన్ని సంహరిస్తూ వుంటాడు.

పరమేశ్వరుడూ, సర్వస్వరూపుడూ అయిన శ్రీహరి ఈ విధంగా ఈ విశాల విశ్వసృష్టికీ, స్థితికీ, లయానికీ హేతువై ప్రకాశిస్తాడు. భూమిలోని ధూళికణాలనయినా లెక్కపెట్ట వచ్చుగాని భగవంతుని లీలావతారాలలోని అద్భుతకృత్యాలను లెక్కపెట్టడం ఎవ్వరికీ అలవి కాదు. నీకు సంగ్రహంగా చెప్పాను. సవిస్తరంగా చెప్పడం నాకే సాధ్యం కాదు. ఇక ఇతరుల మాట చెప్పడమెందుకు? ఇంకా విను.

ఆ పరమాత్ముడు త్రివిక్రమావతారం దాల్పాడు. ఆయన పాదాల విసురుకు మూడు లోకాలూ తల్లడిల్లాయి. అంతే కాదు. ఆ ముల్లోకాలకు ఆవల వెలుగొందే సత్యలోకం గూడా చలించింది. అప్పుడు ఆ దేవుడు దయతో ఆ లోకాన్ని ముప్పునుండి తప్పించి రక్షించాడు. అట్టి పరమేశ్వరుని పాదాగ్రాన ఉండే శక్తి ఇట్టిదని వర్ణించడం ఎవరికీ వీలుగాదు.

శ్రీహరి మాయాశక్తిని నేనే తెలుసుకోలేకున్నాను. ఇక సనందుడు, సనకుడూ, సనత్కుమారుడు, సనత్సుజాతుడు మొదలైన సజ్జనులకు మాత్రం తెలుసుకోవడానికి వీలు కాగలదా? ఇతరమైన ఆలోచనలన్నీ మాని సదా బుద్దిని భగవత్సేవయందే నిల్పినవాడు ఆదిశేషుడు వేయినోళ్ళతో ఆ పరమేశ్వరుని చరిత్రను అనురక్తుడై కీర్తిస్తూ ఉంటాడు. అట్టి శేషుడు సైతం ఆయన మాయామహిమ ఎట్టిదో తెలియజాలడు. ఇక ఇతరులను గూర్చి చెప్పడమెందుకు?

ఎవరు ఇతర చింతలుమాని సదా శ్రీహరినే దృఢంగా నమ్మి సేవిస్తారో వారిని, భక్తులు ఆశ్రయించే పాదపద్మాలు కలిగిన కమలనాభుడు మిక్కిలి దయతో కల్లాకపటం లేని చిత్తంతో అనుగ్రహిస్తాడు. అలా భగవంతుని కృపకు పాత్రులైనవారు మాత్రమే సాటిలేని, అంతంలేని, దాటరాని మాయనుండి సులభంగా తరించగలరు.

ఇంతేకాదు. ఇంక కొందరు పుణ్యాత్ములున్నారు. వారిని గురించి చెబుతాను, విను. వాళ్ళు సంసారంలో మునిగి తేలుతూ దినాలు గడపినా చివరలో కుక్కలూ, నక్కలూ పీక్కొనితినే ఈ శరీరాలపై మమకారం పెట్టుకోలేదు. తమ దేహాలను పూర్తిగా భగవంతునికే అర్పించారు. నేను బ్రహ్మను గదా అన్న గర్వంతో ఒక్కొక్కసారి రజోగుణం నన్ను పైకొంటుంది. ఆ సందర్భంలో నే నా మహాత్ముని తత్త్వం ఇట్టిదని గ్రహింపలేను. రజోగుణం వదలి భక్తి యుక్తుడనై ఆ దేవుని పాదపద్మాలను శరణాగతి భావంతో సేవించినప్పుడు మాత్రమే ఆ భగవానుని మహిమను తెలుసుకో గల్గుతున్నాను. అందుచేతనే శాస్త్రాలను పరిశీలిస్తూ వాటిపై ఆధారపడక భక్తిజ్ఞానయోగాలతో మాత్రమే నేనా పరమాత్మను సేవిస్తాను.

నేనే కాదు, సనకుడు, సనందనుడూ, సనత్కుమారుడూ, సనత్సుజాతుడు నీవు మొదలైన వాళ్ళూ భగవంతుడైన శివుడూ, దైత్యులను పాలించే ప్రహ్లాదుడూ, స్వాయంభువుడనే మనువూ, అతని భార్య శతరూప, వారి కుమారులైన ప్రియవ్రతుడూ, ఉత్తానపాదుడూ, ప్రాచీనబర్హి అనే రాజేంద్రుడు, ఋభువు అనే మహర్షీ వేనుని తండ్రియగు అంగుడు, ఉత్తానపాదుని కుమారుడైన ధ్రువుడూ-వీరంతా భగవంతుని మాయను దాటగల్గినవారే. మరియును.

గాధి, గయుడు మున్నగువారు, ఇక్ష్వాకువూ, దిలీపుడు, మాంధాత, భీష్ముడు, యయాతి, సగరుడు, రఘుమహారాజు, ముచుకుందుడు, ఐలుడు, రంతిదేవుడు, ఉద్ధవుడు, సారస్వతుడు, ఉదంకుడు, భూరిషేణుడు, శ్రుతదేవుడు, హనుమంతుడు, శతధన్వుడు, పిప్పలుడు, బలిచక్రవర్తి, తడు, శిబిచక్రవర్తి, అర్జునుడు, విదురుడు, అంబరీషుడు, పరాశరమహర్షి అలర్కమహారాజు, దేవలుడు, సాభరి, జనకుడు, అభిమన్యుడు, ఆర్ష్ణిషేణుడు మున్నగు నిర్మల చిత్తులైన మహనీయులందరూ అనురక్తులై భక్తితో ఆ భగవానుని తమ మనస్సుల్లో నిలిపారు. ఆయనే గతి అని సేవించారు. అందుచేతనే దాట శక్యంగాని విష్ణమాయను తరించ గలిగారు.

పాపరహితుడైన నారదా! సహజంగా పవిత్రాత్ములైన పై జెప్పినవారిని గూర్చి పేర్కొనబనిలేదు. పశువులైనా, పక్షులైనా, రాక్షసులైనా, అడవిలో బ్రదుకువారైనా, పాపజీవనులైనా, స్త్రీలైనా, శూద్రులైనా, హూణులు మున్నగువారైనా, ఎవరైనా సరే ఆ శ్రీమన్నారాయణుని మీది భక్తియోగంతో అఖండమైన ఆత్మానందం పొందినవారైతే చాలు, తప్పక ఆ దేవుని మాయావైభవమనే సాగరాన్ని సులభంగా దాటుతారు.

అందుచేత మునీంద్రా! ఎల్లవేళలా ప్రశాంతుడైనవాడు, భయరహితుడు, విశ్వమయుడు, కేవలజ్ఞానస్వరూపుడు, సర్వేశ్వరుడు, శుద్దాత్ముడు, శాశ్వతుడు, సముడు, సత్తు, అసత్తులకు అతీతుడు, అయిన పరమేశ్వరుణ్ణి సదా నీ చిత్తంలో ప్రతిష్టించుకో.

ఎవరు పరమాత్మను చిత్తంలో ప్రతిష్టించుకొంటారో, అట్టి సచ్చరిత్రులూ, పుణ్యాత్ములూ, అయిన మహనీయుల చెంతకు పోలేక అవిద్య సిగ్గుతో తలవంచుకొని పెడమొగమై దూరదూరాలకు తొలగిపోతుంది. ఇంతే కాదు.

పరమాత్ముడూ, చ్యుతిలేనివాడు, తుదిలేనివాడు, అయిన శ్రీహరిని మనస్సులో స్థిరంగా భావించినవాళ్ళు శోకంలేని సుఖస్థితిని పొందుతారు. అట్టి బుద్ధిమంతులు భగవంతుని స్మరణ తప్ప ఇతరకార్యాలు ఏమరుపాటున గూడా చేయరు. ఆలోచించి చూస్తే, అది అంతే. వర్షం కురిపించే ఇంద్రుడు దప్పిగొని నీళ్ళకై బావి త్రవ్వుతాడా?

ఆ దేవుడు అందరికీ అన్ని ఫలాలూ ప్రసాదించేవాడు. అందరికీ శరణు పొందదగినవాడు. అన్ని శక్తులూ కలవాడు. లోకాలన్నిటా ప్రసిద్దుడు. అంతటా వ్యాపించినవాడు, సుదర్శనమనే చక్రాయుధం ధరించిన పరబ్రహ్మస్వరూపుడగు ఆ దేవుడు తక్కిన ఈ సమస్త ప్రాణులూ చిక్కి స్రుక్కి శిథిలమై అంతరించిపోయిన కల్పాంతరంలో కూడా ఆకాశం లాగా తానొక్కడు మాత్రం చెక్కు చెదరకుండా నిర్వికారుడై నిలిచి ఉంటాడు.

తండ్రీ! అటు కారణాలకూ, ఇటు కార్యాలకూ అన్నింటికీ కారణభూతుడైనవాడు ఆ పద్మనేత్రుడే. ఆయనకంటే ఇతరు లెవరూ ఆశ్రయింప దగినవారు లేరు. షడ్గుణైశ్వర్య సంపన్నుడూ, అంతంలేనివాడూ, ప్రపంచ సృష్టికర్తా అయిన ఆ పరమేశ్వరుని సద్గుణ పుంజాలను ఉదాత్తమైన చిత్తంతో స్తుతించాలి. అలా చేయకుంటే ప్రకృతి కతీతమైన నిర్గుణ బ్రహ్మాన్ని మనస్సులు పొందజాలవు.

వత్సా! ఈ పురాణకథ వేదార్థాలను ప్రతిపాదించడం వల్ల ప్రశస్తమైనది. మోక్షప్రదంగా ఉండేటట్లు భగవంతుడు దీన్ని రచించాడు. ఇది భగవద్భక్తుల పాలిటి కల్పవృక్షం. శాస్త్రాలన్నింటిలోనూ శ్రేష్టమైనది. ఈ పురాణకథను నేను నీకు సంగ్రహంగా వివరించాను. నీవు దీన్ని లోకంలో విస్తృతంగా ప్రచారం కావించు.

జన్మలలో పురుషజన్మ చాలా అపురూపం. అందులోనూ విప్రకులంలో జన్మించడం మరీ అరుదు. అందుచేత మనుజులు అనిత్యమైన నిష్ప్రయోజన కార్యాలలో బడి దురవస్థలపాలు కాకుండా శ్రీహరిని సేవించి నిత్యమైన పరమపదం పొందడం ఉచితం కదా!

పద్మాక్షుడూ, అన్నిటినీ మించినవాడూ, లక్ష్మీకాంతుడూ, పాపనాశకుడూ, పరమేశ్వరుడూ, చ్యుతి లేనివాడూ అయిన శ్రీహరిని నిర్మలమైన భక్తితో ఆసక్తితో భజించాలి. అట్లు చేయకుండా ఉపవాసాలు, వ్రతాలు, శౌచాలు,శీలాలు, యాగాలు, సంధ్యోపాసనలూ, అగ్ని కార్యాలు, జపాలు, దానాలు, వేదాధ్యయనాలు- మున్నగు పనులెన్ని చేసినా మోక్షం లభించదు.

మునివర్యా! పద్మనేత్రుని మహిమను ఎల్లవేళలా స్తుతించాలి. ఇతరులు స్తుతిస్తూ ఉంటే వినాలి. మనస్సులో ఆ మహిమను మననం చేస్తూ సంతసించాలి. అలా చేసేవాళ్ళు ఆ దేవుని మాయకు లొంగరు.

ఇలా పూర్వం బ్రహ్మదేవుడు మునివర్యుడైన నారదునికి ముఖ్యకథను వివరించాడు. ఆ వృత్తాంతాన్ని యోగివర్యుడైన శుకుడు మిక్కిలి భక్తితో పరీక్షిన్మహారాజుకు నివేదించాడు.

పరీక్షితు౦డు శుకుని బ్రపంచోద్భవాదికంబు నడుగుట

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...