Saturday, February 7, 2026

Bhishma Pitamaha Praying For Sri Krishna Bhishma Sthuthi stuti - భీష్ముండు శ్రీకృష్ణుని స్తుతించుట స్తుతి

భీష్ముండు శ్రీకృష్ణుని స్తుతించుట

కృష్ణా! మూడులోకాలను మోహింపజేసే నీలవర్ణ దేహకాంతి నీది. అటుపై బాలసూర్యుని కాంతులతో విరాజిల్లే పట్టువస్త్రం ధరిస్తావు. అంతేకాక నీ ముఖారవిందంపై నల్లని ముంగురులు ఎగురుతూ ఒయ్యారం ఒలకబోస్తాయి. అటువంటి మనోహరరూపంతో అర్జునునితో కలసియుండే అట్టి మంగళస్వరూపం నా అంతరంగంలో నిలిచియుండుగాక!

అందమైన ముఖం, గుఱ్ఱాల కాలిగిట్టలనుండి పైకి లేచిన దుమ్ము పైన వ్యాపించగా రంగు చెడిపోయింది. వింతకాంతులతో మెరసే ముంగురులు కూడా కళావిహీనాలయ్యాయి. రథాన్ని వేగంగా నడపడంవల్ల ముఖమంతా చెమట బిందువులు వ్యాపించాయి. ముఖంపై చెమటతో తడిసి, దానిపై బూడిదరంగు, అటుపై శోభను మరుగుపరచే ముంగురులు. ఎంత శ్రమపడ్డావయ్యా! ఇక అర్జునుడు నా బాణప్రహారాలకు తట్టుకోలేక మిక్కిలి వేదనను అనుభవించాడు. కవచం చీలిపోయి తీవ్రబాధకు గురి అయ్యాడు. అయినా అర్జునునికి యుద్ధంలో విజయం కలిగించాలని ప్రోత్సహించి పోరించావు. అట్టి విజయమోహనరూపం నా మనస్సులో ఎల్లప్పుడూ సుస్థిరమైయుండుగాక!

కృష్ణా! ఆనాడు అర్జునుడు రథంపై అధివసించి పోరు కోరివచ్చిన వీరులను చూచే ఉద్దేశంతో రథాన్ని నిలుపుమని కోరాడు కదా! అప్పుడు నీవు ఆ మాటలు విని చిరునవ్వు చిందించి ఉభయసేనల మధ్యలో రథం నిలిపావు. శత్రురాజులందరూ ఆ చోద్యం వీక్షించారు. నీవు వారిని పేరుపేరునా విజయునకు పరిచయం చేస్తూ వారి ఆయువులను నీ చూపులతోనే ఆకర్షించి లోబరచుకొన్నావు. అట్టి సర్వలోకనియంతవైన నీవు నా హృదయపద్మంలో సదా విరాజిల్లుచుందువు గాక!

కృష్ణా! అర్జునుడు యుద్ధంలో పాల్గొన్న వేలకొలది వీరులందరూ తన వారేనని, అట్టి గురువులను, వృద్ధులను, హితులను చంపుటకు ఇష్టపడక వెనుకకు మరలిపోవడానికి నిశ్చయించాడు కదా! ఆ అర్జునునికి ఏర్పడిన కర్తవ్య సందేహాన్ని నీ అత్యద్భుతమైన భగవద్‌జ్ఞానోపదేశంచే పోగొట్టి కిరీటిని కర్తవ్యపరాయణుని గావించావు. నీవు సమస్తయోగిజన సంస్తుత్యుడవు. నీ పాదకమలాలపై నాకు భక్తి సదా ప్రాప్తించుగాక!

ఆనాడు యుద్ధరంగంలో నా శరవర్షానికి తట్టుకోలేక, నన్ను చంపి అర్జునుని సంరక్షించాలనే ఉద్దేశంతో నాపైకి చక్రాన్ని చేబట్టి, దుముకుచున్న నీ వీరగంభీరస్వరూపం నాకు ఇప్పటికీ కన్నుల గట్టినట్లుగానే ఉంది. రథంపై నుండి ఎగిరి దూకుతున్నప్పుడు నీ కుండలాల కాంతి ఆకాశమండలమంతా వ్యాపించింది. ముందుకు లంఘిస్తున్నప్పుడు కుక్షిలోనున్న పిండాండం కదలిపోగా, దాని బరువుకు వెలుపలనున్న బ్రహ్మాండమంతా కంపించింది. చక్రాన్ని చేత ధరించి ముందుకు దూకుతున్నప్పుడు పైనున్న బంగారు ఉత్తరీయం క్రిందకుజారిపోయినా, భక్తరక్షణార్థం నడుము కట్టిన స్వామి, వేషాన్ని చక్కదిద్దుకోవడంలో ముచ్చట చూపలేదు. నా పరాక్రమంపై నాకు విశ్వాసం ఉందని, నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవద్దని, క్రీడి వెనుకకులాగుతున్నా ఆ ఆర్తత్రాణ పరాయణుడు పట్టించుకోలేదు. ఏనుగుపై లంఘించే సింహం పిల్లలా ముందుకు దుమికి వేశాడు. ఈ రోజు భీష్ముని చంపి, అర్జునుని రక్షిస్తానని అరిచాడు. నన్ను విడిచిపెట్టు. ఈ గాంగేయుని సంగతి నేటితో సరి అని పైనబడిన భక్తరక్షణ పరాయణుడు నాకు సదా రక్షగానుండుగాక!

అర్జునుడు ప్రస్తుతం తనకు కింకరుడు. సేవకుని రక్షించడం స్వామికి ధర్మం. అంతకన్న పరమధర్శం మరొక్కటి లేదు. అందువల్ల అర్జునరక్షణార్థమై తనమాట ప్రక్కకు బెట్టి, భీష్ముని చంపడానికై రథం నుంచి దుముకడం జరిగింది. స్వామి రథంపై నొగల నడుమ కూర్చున్న తీరు నయనానందకరం. ఒక చేతితో పగ్గాలు, మరొక చేతితో సెలకోల ధరించి ఒయ్యారంగా గుఱ్ఱాలను అదలించిన తీరు ఆశ్చర్యదాయకం. ఆ రూపం చూచే జనులకు మోహం కలుగకమానదు. అట్టి ఉత్సాహమూర్తిని ప్రశంసిస్తున్నాను.

కృష్ణుడు అర్జునుని గుఱ్ఱాలను దోసిళ్ళతో నీళ్లుపోసి కడిగి శుభ్రపరచేవాడు. గోళ్లతో గీరి వాటి నవను (దురదను) పోగొట్టి లాలించేవాడు. వాటికి ఎంతో ప్రియం చేకూర్చేవాడు. ఆ సమయంలో పగ్గాలను నోటితో పట్టుకొన్నాడట. సెలకోలను నెత్తిపై పెట్టుకొన్నాడట. అట్టి ఆశ్చర్యకర్తమూర్తి మమ్ములను రక్షించుగాక! అంటాడు కవి.

మధుర వచనాలతో, మందహాసాలతో, వింత ప్రవర్తనలతో, ప్రణయ కోపాలతో, వాలుచూపులతో గోపభామినుల వలపులు దోచుకొన్న బాలకృష్ణుని మనస్సులో సేవిస్తాను.

మహర్షులు, రాజశ్రేష్ఠులు ఎందరో చూస్తూ ఉండగా, ధర్మపుత్రుని పేరోలగంలో రాజసూయయాగ మహామండపంలో, విభ్రాంతి గొలిపే మూర్తిమత్వంతో విలసిల్లి, యాగపూజలందుకొన్న యజ్ఞేశ్వరుడైన పరమేశ్వరుడు నా చూపులలో నిలుచుగాక!

ఒకే ఒక సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. సృష్టిలోని సమస్త జీవరాశులకు ఒక్కొక్మరికి ఒక్కొక్కడుగా కానవస్తున్నాడు. అదేవిధంగా ఒకే పరమాత్మ నిరంతరం తన లీలావిలాసంతో తాను సృష్టించిన సమస్తప్రాణికోటి హృదయపద్మాలలో నానావిధ రూపాలతో విలసిల్లుతున్నాడు. అట్టి భగవంతుని నా నిర్మల హృదయంలో ప్రార్థిస్తున్నాను.

భీష్ముడు ఇట్లు త్రికరణశుద్ధిగా పరమాత్మను స్తుతించి తన హృదయపద్మంలో సుప్రతిష్ఠితం చేసుకొన్నాడు. శ్వాసను నిరోధించాడు. ఉపాధి విహీనమైన పరబ్రహ్మలో తన ఆత్మను లీనం చేశాడు. అది చూచి సమస్త జనులు పగలు గడచినపిమ్మట సంధ్యాసమయంలో పక్షులు మౌనం వహించినట్లు అయిపోయారు. దేవలోకంలోను, మానవ లోకంలోను దుందుభులు మోగాయి. భీష్మునికి పరలోకక్రియలు కావించి ధర్మపుత్రుడు ముహూర్తకాలం చింతించాడు. అక్కడికి వచ్చిన మునీశ్వరులు అందరూ కృష్ణునిరూపం మనస్సులో నిలుపుకొని ఆయన దివ్యావతారాలను, పవిత్ర నామాలను స్మరించుకొంటూ తమ తమ ఆశ్రమాలకు వెళ్లిపోయారు. అటుపిమ్మట ధర్మనందనుడు సోదరసమేతుడై దేవకీనందనునితో కలసి హస్తిపురికి పయనమై వెళ్లాడు. గాంధారీ ధృతరాష్ట్రులను ఒప్పించాడు. వారి అంగీకారంతో, వాసుదేవుని ఆమోదంతో తన పూర్వులు ఏలిన సామ్రాజ్యాన్ని స్వీకరించి ధర్మపరిపాలన గావించాడు. ఈ విధంగా చెప్పగా శౌనకుడు సూతమహర్షితో ఇలా అన్నాడు.

దుర్యోధనాదులు తన సిరిసంపదలన్నీ అపహరించారు. అటుపై తనతో యుద్దానికి సిద్ధమయ్యారు. అట్టి శస్త్రధారులైన దాయాదులనందరినీ యుద్ధంలో ధర్మజుడు మట్టు పెట్టాడు. కాని అమాయకులు ఎందరో ఆ యుద్ధంలో బలైపోయారు. సహజంగా అహింసావాది ధర్మరాజు. హింస అతనికి ఏ కోశాన రుచింపదు. అట్టివాడు బంధుమరణశోకం దిగమ్రింగి రాజ్యలక్ష్మిని స్వీకరించడం ఆశ్చర్యమే. అది ఏ విధంగా సానుకూలపడింది?

అని ప్రశ్నించిన శౌనకునకు సూతమునీంద్రుడు ఇలా వివరించాడు.

ఆనాడు ఉత్తర ప్రార్థింపగా, తన చక్రాన్ని అడ్డువేసి పరీక్షిత్తును కాపాడి పాండవ వంశాంకురాన్ని నిలిపినవాడు శ్రీకృష్ణుడు. కాబట్టి ఆయన మాట తనకు జవదాటరానిది. ఆయన ఆదేశానుసారంగా రాజ్యస్వీకరణకు అంగీకరించాడు ధర్మతనయుడు. దుఃఖాన్ని దిగమ్రింగుకొన్నాడు. ధర్మపరిపాలన కావించి ప్రజారక్షణ చేయడం తన కర్తవ్యమని భావించాడు. శ్రీకృష్ణపరమాత్మయే సమస్త సామ్రాజ్యానికి ధర్మజుని అబిషిక్తుణ్ణి కావించాడు. ఒక ధర్మమూర్తి భూమికి నాయకుడు కావడమనేది ఆయనకు పరమానందదాయకమయింది. పరమాత్మ ఆనందించడమే భక్తుని లక్షణంకదా! కాబట్టి ధర్మరాజు రాజ్యస్వీకారం చేయవలసి వచ్చింది.

ఈ సమస్తప్రపంచం ఈశ్వరాధీనమై ప్రవర్తించేదేతప్ప, తన అధీనంలో నడిచేది కాదని ధర్మజుడు గ్రహించాడు. భీష్మాచార్యుని ఉపదేశాలవల్ల, ఆతనిలోని మానవకర్తవ్య విజ్ఞానం పెంపొందింది. శ్రీకృష్ణపరమాత్మ ప్రబోధాలవల్ల ఆతని సందేహాలన్నీ నివృత్తి పొందాయి. ఉపేంద్రుడు రక్షకుడుగా మహేంద్రుడు స్వర్గరాజ్యాన్ని పరిపాలిస్తున్నట్లే, శ్రీకృష్ణమూర్తి అండదండలతో చతుస్సముద్ర వేలావలయితంబైన భూమండలాన్ని సోదరసహకారంతో పాలించసాగాడు.

ధర్మరాజు కౌరవవంశంలో గొప్పవాడు. కుంతీపుత్రులలో అగ్రజుడు యాచకులకు దానమీయడంలో ఘనుడు. ఇతరులను గౌరవించడంలో సాటిలేనివాడు. సత్యమార్గ గమనం, సత్యవచన పాలనం అతనికి మూలధనాలు. అతడు రాజ్యపాలన చేసే సమయంలో భూమండలమంతా సుఖశాంతులతో విరాజిల్లింది. మేఘుడు సకాలంలో కుంభవృష్టి కురియించాడు. భూమి బంగారుపంటలను పండించి అన్ని కోరికలను తీర్చింది. గోశాలాప్రదేశాలలో నిండు పొదుగులతో ఆవులు పాలను కుండలకొద్దీ ఇచ్చాయి. లతలు చక్కగా పుష్పించాయి. వృక్షాలు సంపూర్ణంగా ఫలించాయి. ఋతుధర్మం తప్పకుండా పంటలు పండాయి. ధర్మం సర్వప్రదేశాల్లోను సర్వవిధాల వెల్లివిరిసింది. ఆధిదైవికాలు, ఆధిభౌతికాలు, ఆధ్యాత్మికాలు అయిన ఆధివ్యాధులు అడుగంటాయి. ప్రజలు ఎక్కడా ఈతిబాధలు లేక శాంతిసౌఖ్యాలతో తులతూగారు.

శ్రీకృష్ణుండు ద్వారకా నగరంబున కేగుట

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...