భరతోపాఖ్యానము
(ఋషభుని వందమంది కుమారులలో భరతుడు జ్యేష్టుడు. మహాభాగవతుడు. భక్తజనపరాయణుడు. అందువల్ల ఋషభుడు అతనిని రాజుగా చేశాడు. భరతుడు పాలనాధికారి అయ్యాడు.)
అహంకారానికి శబ్ద స్పర్శ రూపరస గంధాలనే పంచతన్మాత్రలు పుట్టినట్లు మహారాజైన భరతునికి పంచజనివల్ల సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్రకేతువులనే అయిదుగురు కొడుకులు పుట్టారు. ఇంతకుముందు అజనాభమనే పేరుతో పిలువబడే ఈ భూభాగాన్ని భరతుడు పాలించడంవల్ల దీనికి భరతవర్షం అనే పేరు రూఢమయింది.
భరతుడు పరమాత్ముని కరుణతో, తన తాత తండ్రులు పరిపాలించిన రీతిలోనే సత్కర్మలు ఆచరిస్తూ, బ్రాహ్మణులు పొగడేవిధంగా ప్రజలను పరిపాలించాడు.
భరతుడు అండపిండ బ్రహ్మాండాది లోకాలను భరించే భగవంతుణ్ణి చిన్నవీ, పెద్దవీ అయిన యజ్ఞాలతో ఆరాధించాడు. అమావాస్య పూర్ణిమలతో చేసే సత్కార్యాలనూ, చాతుర్మాస్యల కాలంలో చేసే అగ్నిహోత్రాదులనూ ఆచరించాడు. ఇంకా పశు యాగాలు, సోమయాగాలు నిర్వర్తించాడు. వేదోక్తంగా నిర్వహించిన ఆ సత్కర్మ ఫలాన్ని పరమేశ్వరార్పణం చేశాడు. యాగాలలోను, మంత్రాలలోను పలికే దేవతలను వాసుదేవుని అవయవాలుగా భావించాడు. ఆ మహారాజు భగవంతుని గొప్పతనాన్ని తలచుకొంటూ భక్తిమయమైన హృదయంతో, శ్రద్ధతో సమస్తరాజ్యాన్ని పరిపాలించాడు.
(చాతుర్మాస్యము : “ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధం మొదలుకొని కార్తిక శుద్ధం వరకు నాలుగు నెలలు, చేసే వ్రతం చాతుర్మాస్యం. దీనికే వార్షిక చాతుర్మాస్యమని పేరు.)
ఇట్లు నిర్మల మనస్సుతో కర్మలను ఆచరించి సిద్ధులను పొంది మిక్కిలి ధర్మంతో భరతుడు రాజ్యపరిపాలన చేశాడు.
శ్రీవత్సం, కౌస్తుభం, వనమాల అనువానితో శోభిల్లువాడూ, సుదర్శనం మొదలైన పంచాయుధాలను ధరించినవాడూ, ఆత్మీయ భక్తుల హృదయాలలో నివసించేవాడూ, పరమపురుషుడూ అయిన వాసుదేవునిపట్ల భక్తిప్రపత్తులతో భరతుడు యాభై లక్షల వేల సంవత్సరాలు రాజ్యపరిపాలన గావించాడు. తాతతండ్రుల కాలంనుండి తరతరాలు సంక్రమించిన ధనరాశిని తగినట్లు తన తనయులకు పంచిపెట్టి భోగభాగ్యాలనూ, అపార సంపదనూ, రాజసౌధాలనూ వదలిపెట్టి తాను పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు.
(పులహాశమం సాలగ్రామాలు లభించే స్థలం.)
ఆ ఆశ్రమంలో శ్రీమన్నారాయణుడు ఆశ్రమవాసులను వాత్సల్యంతో ఆదరిస్తూ కనులముందు నిలిచి ఉంటాడు. సాలగ్రామాలకు ఆలవాలమైన గండకీనది ఆ ఆశ్రమసమీపంలో ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి రమణీయమైన ఆశ్రమంలో భరతుడు ఒంటరిగా ఉంటూ శ్రీహరిని నానావిధాలయిన పువ్వులతో, చిగుళ్ళతో, తులసీదళాలతో, జలాలతో, కమలాలతో, కందమూలఫలాలతో అర్పిస్తూ తనివితీరా సేవ చేస్తున్నాడు.
ఇటువంటి హరిసేవవల్ల భరతునికి విషయవాంఛలు నశించాయి. శమదమాది గుణసంపత్తి అలవడింది. పరమ పురుషుణ్ణి భక్తిభావంతో ఎడతెగకుండా భజిస్తుంటే అహంకారమనే ముడి విడిపోయి ఆనందానుభూతి కలిగింది. ఆయన మేను పులకించింది. ఆయన కన్నులలో ఆనందాశ్రువులు పొంగి పొరలాయి.
ఇష్టమయిన పరంధాముని పాదపద్మాలను ధ్యానించడం వల్ల ప్రాప్తమైన భక్తియోగం కారణంగా ఆయన హృదయం పరమానందంతో నిండిపోయింది. ఆ ఆనందానుభవం అమృతసరోవరంలో స్నానం చేసినట్టుగా అనిపించింది. భరతునికి తాను చేస్తున్న పూజకూడా తనకు తెలియనంత తన్మయత్వం కలిగించింది. ఈ విధంగా భగవంతుని సేవావ్రతంలో మునిగిపోయిన భరతుడు జింక చర్మం ధరించాడు. మంత్రపూర్వకంగా మూడువేళలా స్నానం ఆచరించాడు. నిత్యమూ స్నానం చేయడం మూలాన తల వెండ్రుకలు తడిసి వంపులు తిరిగి జడలుగట్టి రాగిరంగుతో మెరవసాగాయి.
మార్తాండమండల మధ్యవర్తి అయిన పరమేశ్వరుణ్ణి హిరణ్మయ పురుషునిగా భావిస్తూ భరతుడు ఇలా ప్రస్తుతించాడు.
('ధ్యేయ స్సదా సవితృమండల మధ్యవర్తీ' ఇత్యాది సూర్యనారాయణ ధ్యాన శ్లోకంచేతను, “ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్” అనే గాయత్రి మంత్రంచేతను అర్చింపబడు దేవత సూర్యమండలస్థుడయిన శ్రీమన్నారాయణుడు.)
పరమేశ్వరా! జీవులకు కర్మఫలాలను ప్రసాదించేవాడవు. కేవలం సంకల్పమాత్రంతో ఈ లోకాలను సృష్టించావు. నీవే ఈ లోకాలలో అంతర్యామివై ఉన్నావు. ఆనందస్వరూపమైన బ్రహ్మాన్ని అందుకోవాలనే జీవులను నీయందలి యోగశక్తితో కాపాడుతున్నావు. సూర్యమండల మధ్యభాగంలో ప్రకాశిస్తూ సమస్త లోకాలలో నిండి ప్రకృతికి అందకుండా ప్రకాశిస్తున్నావు అంటూ ఆనందమయుడూ, దివ్యమంగళ స్వరూపుడూ అయిన భగవానుణ్ణి భరతుడు శరణు వేడాడు.
ఒకనాడు భరతుడు గండకీ నదిలో స్నానంచేసి మూడు ముహూర్తాలకాలం నీటిలో నిలబడి ప్రణవం జపిస్తున్నాడు. అపుడు నిండుచూలాలయిన లేడి ఒకటి నీరు తాగాలని ఒంటరిగా నదీ తీరానికి వచ్చింది. అది నీరు త్రాగుతుండగా ఆ నదీసమీపంలో ఒక సింహం దిక్కులు దద్దరిల్లేటట్లు భయంకరంగా గర్జించింది. పుట్టుకతోనే భయస్వభావం కలిగిన ఆ లేడి ఆ ధ్వనిని విని అదరిపడింది. ఆ హరిణాంగన తత్తరపాటుతో దప్పిక తీర్చుకోకుండానే ఆకాశంవైపు అమాంతం ఎగిరి ఆవలికి ఒక్కదూకు దూకింది. అలా అకస్మాత్తుగా కలిగిన భయంతో నదిని లంఘించడంలో దాని గర్భంలోని పిల్ల జారి నదీజలాలలో పడింది. ఆందోళనతో ఒక్కసారిగా దూకటంలో తల్లి జింక ఆ నదీతీరంలోని కొండ రాతిమీద పడి ప్రాణాలు విడిచింది. అపుడు ఆ నదీజలాలలో విలవిలలాడుతూ మునిగి తేలుతున్న లేడిపిల్లను చూచిన భరతుని హృదయం తల్లడిల్లింది. దయార్దచిత్తుడైన భరతుడు ఆ తల్లిలేని పిల్లను తన ఆశ్రమానికి తీసుకువచ్చాడు. ఆ బాల కురంగాన్ని ఎంతో గారాబంతో సాకడం మొదలు పెట్టాడు. దానిని లాలించడం, పాలించడం ముద్దుగా పెంచి పెద్ద చేయడంలో ఆసక్తుడై క్రమంగా భరతుడు తన నిత్యకృత్యాలయిన అష్టాంగయోగాలనూ, భగవంతుని పూజాకైంకర్యాలను మరచిపోయాడు. క్రమక్రమంగా అతని నిత్య నైమిత్తిక క్రియాకలాపాలు ఒక్కొక్కటి మూలబడసాగాయి.
(యోగం యొక్క అష్టాంగాలు ; 1) యమం 2) నియమం 3) ఆసనం 4) ప్రాణాయామం 5)ప్రత్యాహారం 6) ధ్యానం 7) ధారణం 8) సమాధి.)
తాను తపస్సుకు దూరం కావడాన్ని అతడు గుర్తించడం లేదు. తన యోగానికి విఘ్నం వాటిల్లిందని అతడు గమనించ లేదు. రాత్రింబవళ్లు ఆ జింకపిల్లతో ఆడుతూ పాడుతూ దానిమీది గారాబంతో తన మనస్సులో ఇలా అనుకొన్నాడు.
పాపం ఈ జింకపిల్లకు తల్లి లేదు. ఆప్తులా అసలే లేరు. దిక్కెవ్వరూ లేని కారణంవల్ల ఈ జింకపిల్లను ఇక్కడికి తీసుకొని వచ్చాను. నేనంటే దీనికి ఎంతో ప్రేమ. నా దగ్దరే నన్నంటిపెట్టుకొని తిరుగుతోంది. అందుచేత నేను నాచేతనయినంత వరకూ ఈ తల్లిలేని పిల్లను తప్పక కాపాడుతాను.
నీవే దిక్కంటూ కాళ్లబడ్డ ఏ జంతువునయినా సరే కనికరంతో కన్నెత్తిచూచి కాపాడడంకంటె మహాపుణ్యం మరేదీ లేదని సన్మునీంద్రులు చెప్పారు.
ఇలా భావించినవాడై భరతు డెంతో ఆసక్తితో ఆనందంతో లేడిపిల్లను సాకడం మొదలుపెట్టాడు. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఎక్కడికయినా వెళ్ళినప్పుడు, స్నానం చేసేటప్పుడు, సమిధలు ఏరి తెచ్చుకొనేటప్పుడు, దర్భలు, పూలు, పళ్ళు, ఆకులు కోసేటప్పుడు, దుంపలు త్రవ్వి తెచ్చుకొనేటప్పుడు, నీళ్లు తెచ్చుకొనేటప్పుడు, దేవతార్చన చేసేటప్పుడు చివరకు జపం చేసేటప్పుడు కూడా అతడు ఆ బాలహరిణాన్ని తనపక్కనే అట్టిపెట్టుకొనేవాడు. తోడేళ్లు, నక్కలు మొదలైన మృగాలు జింకపిల్లను ఏం చేస్తాయో అని దానివెనువెంట అడవులకు వెళ్ళేవాడు. రాను రాను ఆ జింకపై మమకారం ఎక్కువవుతుంటే దాన్ని భుజాలపైకి ఎక్కించుకొనేవాడు. గుండెలపై పడుకోబెట్టుకొని ఒడిలో చేర్చుకొని బుజ్జగించేవాడు. నిత్యనైమత్తిక కర్మలు ఆచరించేటప్పుడు కూడా అప్పు డప్పుడు లేచి జింకపిల్ల ఏమయిందో అని చూచేవాడు. ఆ జింకపిల్ల కనబడగానే మనసు కుదుటపరచుకొనేవాడు. ఒక్కొక్కప్పుడు ఆ లేడిపిల్లను దీవించేవాడు. నానాటికి ముద్దుమురిపాలతో పెంచుకుంటూ దానిమీద మోహం పెంచుకున్నాడు భరతుడు.
(చదివే వారికి ఈ వచనం భరతునిపట్ల జాలి కలిగిస్తుంది. జింకపట్ల పెంచుకున్న ప్రేమ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.)
ఆ బాలకురంగం చెంగుచెంగున పరుగులు తీస్తూ దుముకుతూ ఉన్నట్టుండి ఆ రాజరిషిని రాచుకొనేది. కొమ్ములతో గోకేది. దగ్గరికివస్తూ కాళ్ళు రాస్తూ గిట్టలతో గీకుతూ మారాం చేసేది. ఒక్కోసారి భరతుని తొడలపై హాయిగా పడుకొని అంతలో చెంగుమంటూ లేచి భుజాలమీదికి ఎక్కి ఆడుకొనేది.
పరీక్షిన్నరేంద్రా! ఆ జింకపిల్ల ఈ విధంగా తనపైబడి ఆటలాడుతున్నా రాజర్షి భరతుడు సంతోషించేవాడేగాని ఏమాత్రం ఆగ్రహించేవాడు కాడు. పైగా ఎంతో మురిసిపోయేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ లేడిపిల్ల ఆశ్రమం విడిచి ఎటో పారిపోయింది.
ఆ లేడిపిల్ల కనిపించకపోయేసరికి భరతునికి మనసు చెదిరిపోయింది. ధనం పోగొట్టుకొన్న వానిలాగ అతడు దిగులుపడ్డాడు. బెంగతో బాధతో మనస్సులో తహతహలాడుతూ మాటిమాటికీ ఆ జింకను తలచుకొంటూ ఇలా వాపోయాడు.
ఓ జింకపిల్లా! అడవిలోని క్రూరమృగాల బాధ నీకేమాత్రం లేకుండా నేను జాగ్రత్తపడ్డాను. అయినా నీవు నా కనులు గప్పి వెళ్ళిపోయావా అంటూ భరతుడు ఎంతగానో ఆరాటపడసాగాడు.
అయ్యో! తల్లి చచ్చిన ఆ జింకపిల్ల దురదృష్టవంతుడనయిన నా పాలబడింది. ఇప్పుడు తప్పించుకొనిపోయింది. ఇంక నేనేమి చేయాలి? అసలు ఆ జింకపిల్లను ఈ జన్మలో మళ్ళీ చూస్తానా? దాన్ని ఇదివరకులాగా గారాబంగా కాపాడుకోగలనా?
అయ్యో! ఈ అశ్రమంలో మొలచిన పచ్చిగడ్డి పరకలు తిని నవనవలాడుతూ అటునిటు తిరుగుతున్న నా లేడిపిల్లను ఏ సింహం తన పొట్టనబెట్టుకుందో కదా!
ఇలా అనుకొంటూ లేడిపిల్ల క్షేమంగా ఉండాలని భరతుడు మనసులో కోరుకొంటూ మళ్ళీ ఈ విధంగా తహతహలాడాడు. ఆ జింకపిల్ల ఎపుడు నా దగ్గరికి వచ్చి నన్ను సంతోషపెడుతుందో! నానావిధాలయిన తన నడకల హొయలుతో నన్నెపుడు మురిపిస్తుందో! నేను ధ్యానం చేసుకొనేటప్పుడు నన్ను కొమ్ములతో గోకేది కదా! మరల అలాంటి మనోవినోదాలు నే నెపుడు అనుభవిస్తానో! దేవపూజకని తెచ్చిన వస్తువులను త్రోక్కి వాసన చూసినపుడు నేను కోపంగా చూస్తే చప్పున చిన్నబిడ్డలాగ దూరంగా పోయి, ఆ తరువాత నేను పిలువగానే మెల్లగా వచ్చి నావెనుక నిలుచుండేది. ఇంత తెలివితేటలతో మసలుకొనే స్వభావం దానికెలా అబ్బిందో! ఈ భూదేవి ఎంత పుణ్యం చేసుకుందో! ఇటువంటి జింకపిల్ల పాదస్పర్శవల్ల స్వర్గముక్తికాములైన మునుల యజ్ఞవాటిక కావటానికి యోగ్యత సంపాదించుకొంది.
ఇప్పుడా హరిణశాబకంకోసం నేనెక్కడని వెదకను? తల్లిని పోగొట్టుకుందనీ, ఆశ్రమంనుండి పారిపోయి వచ్చిందనీ, జాలిపడి సింహాల నోట్లో పడకుండా భగవంతుడయిన చంద్రుడు ఆ జింకపిల్లను ఎత్తుకొనిపోయి పెంచుకుంటున్నాడేమో?
పూర్వం నేను పుత్రవియోగ తాపాన్ని చంద్రకిరణాలతో శాంతింప జేసుకునేవాణ్ణి. తర్వాత ఆ జింకపిల్ల చంద్రకిరణాల కంటె చల్లనైన తన శరీరస్పర్శతో ఆ సంతాపాన్ని పోగొట్టింది అని హరిణశాబకాన్ని గురించి పరిపరి విధాలుగా భావించి పరితపిస్తున్న భరతుడు యోగభ్రష్టుడయ్యాడు. భగవంతుణ్ణి ఆరాధించడం మానుకున్నాడు. మృగజాతిలో పుట్టిన జింకపిల్లమీద మమకారం పెంచుకున్నాడు అని శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునికి భరతుని కథ చెబుతూ మళ్ళీ ఇలా అన్నాడు.
ఓ రాజా! పూర్వం భరతుడు ముక్తి మార్గానికి ఆటంకమనే భావనతో ఇల్లు, ఇల్లాలు, పిల్లలు మొదలైన సమస్తమూ వదలిపెట్టి తపస్వి అయ్యాడు. అయితే ఇంతలో ఒక జింకపిల్ల అతనికి తటస్థపడింది. దానిని లాలించి పాలించడం, బుజ్జగించడం, పెంచడంలో నిమగ్నమైనాడు. కోడెత్రాచు ఎలుక కన్నంలో ప్రవేశించినట్లు వారింపరాని తపోవిఘ్నం అతనిలో చోటు చేసుకుంది. బ్రష్టుణ్ణి చేసింది. ఎటువంటివారికయినా విధిని దాటడం ఏమాత్రం సాధ్యం కాదు. మహర్షులకయినా కర్మబంధాల నుండి తప్పుకోవడం శక్యం కాదు. అటువంటప్పుడు సామాన్యుల సంగతి చెప్పేదేముంది రాజా!
ఈ విధంగా భరతుడు బాధపడుతున్న సమయంలో ఆ జింకపిల్ల తిరిగి వచ్చింది. దానిని చూచి భరతుడెంతో సంబరపడ్దాడు. ఇలా కొంతకాలం గడచిపోయింది.
భరతునికి చివరిక్షణం రానేవచ్చింది. ఆ అంత్యకాలంలో కన్నకొడుకువైపు చూస్తున్నట్టు ఆ జింకవైపు ఆసక్తితో చూస్తూ మనసులో ఆ జింకనే భావించుకుంటూ భరతుడు ప్రాణాలు విడిచాడు. అట్టి స్మృతి కారణంచేత ఆతడు జింక కడుపున పుట్టి జింకయై ప్రకాశించాడు.
(గీతలో (8-6) మరణవేళా స్మృతిని గురించి 'యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యన్తే కలేబరమ్, తం తమేవైతి కౌన్తేయ సదా తద్భావభావితః' అని చెప్పబడింది. దేహం త్యజించేవేళ మానవుడు ఏ భావాన్ని స్మరిస్తాడో అదే భావం అతడు నిశ్చయంగా పొందగలడు అని భావం. భగవదర్చన మరచినవాడు, హరిణపోతంపై మమకారం పెంచుకున్నవాడు, హరిణాన్ని చూస్తూ మరణించినవాడు హరిణ జన్మ ఎత్తడం సహజం. కాని, భగవదారాధన ఫలితముంది కనుక గత జన్మ విషయాలను మరచిపోలేదు. ఉద్దేశపూర్వకంగా భక్తిని నిర్లక్ష్యం చేసినందున భక్తుడు కొంతకాలం శిక్షకు గురికావలసివచ్చింది. 'మృతమను న మృతజన్మానుస్మృతి రితరవన్మృగ శరీరమవాప' అని మూలం. మరణ సమయంలో జింకనే స్మరిస్తూండడంవల్ల మరుజన్మలో జింకదేహాన్ని పొందాడని భావం.)
ఈ విధంగా భరతుడు లేడి కడుపున పుట్టినా, పూర్వజన్మంలో భగవంతుణ్ణి ఆరాధించిన పుణ్యపరిపాకంచేత తానెందుకు జింకగా పుట్టవలసి వచ్చిందో తెలుసుకొని బాధపడుతూ ఈ లాగున అనుకున్నాడు.
రాజులందరూ నన్ను తెగ పొగిడారు. నేను దేవేంద్రవైభవాలను తనివితీరా అనుభవించాను. నా కుమారులను రాజులుగా చేసి రాజ్యభారం వారికి అప్పగించి అడవికి వచ్చి తపస్వినైనాను. తాపసులందరూ నన్ను గొప్ప రాజర్షి అని గౌరవించారు. చివరకు ఒక జింకపిల్ల మీద మోహం పెంచుకుని నా గత వైభవమంతా పోగొట్టుకొని సాటియోగులలో ఎందుకూ కొరగాని వాడనయిపోయాను.
(ఇక్కడ భరతుని పశ్చాత్తాపం ప్రకటితం. పశ్చాత్తాపం సగం పాపహారకం. భక్తియోగసాధనలో ఏర్పడే మమకారవాంఛలను తొలగించుకోవడం అవసరమని బోధ. కనుకనే గీతలో 'దృఢవ్రతాః' అని 'సతతం కీర్తయన్తో మాం యతంతశ్చ దృఢవ్రతాః' అని చెప్పారు.
శ్రీమన్నారాయణుని గూర్చి వినడం, హరిని తలచుకోవడం, హరినామ సంకీర్తన చేయడం, హరిపూజ గావించడం, హరిభక్తులను అనుసరించడం మొదలయిన సత్కర్మలతో క్షణకాలం కూడా వ్యర్థం చేయని నాకు ఈ లేడిపిల్లవల్ల తపో విఘ్నం కలిగింది. మోక్షానికి దూరమయ్యానంటూ లోలోపల కుమిలిపోయాడు. ఆ తర్వాత తన జన్మకు కారణమయిన తల్లిజింకను వదలి కాలాంజనపర్వతాన్ని విడిచిపెట్టి దట్టమైన సాలవృక్షాలచే నిండిన సాలగ్రామ సమీపంలో ఉన్న పులస్త్యపులహాశ్రమం చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో శాంతస్వభావులైన మునీశ్వరులున్నారు. అది ఒక భగవత్ క్షేత్రం. అక్కడికి వచ్చి తనకు ప్రాప్తించిన హరిణదేహాన్ని వదలిపెట్టడానికి తగిన సమయంకోసం ఎదురుచూడ సాగాడు. ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా ఉండి ఎండిన ఆకులూ, గడ్డిపరకలూ, తీగదుబ్బలూ తింటూ తన జింకజన్మకు కారణమయిన ఆ నదీతీర్ధంలోనే బతుకు ముగించాలని కోరుతూ కాలం గడిపాడు. చివరకు ఆ పుణ్యనదిలో స్నానం చేస్తూనే తన హరిణశరీరం వదలిపెట్టాడు అని శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకు చెప్పి ఆ తరువాతి వృత్తాంతం ఇలా వినిపించాడు.
మహారాజా! భరతుడు లేడి దేహాన్ని వదలిపెట్టి తరువాతి జన్మలో ఆంగిరసగోత్రుడైన ఒక బ్రాహ్మణునికి కుమారుడుగా పుట్టాడు. ఆ బ్రాహ్మణుడు పవిత్రుడు. సద్వంశసంభవుడు. శమదమాదిగుణసంపన్నుడు. తపోనిరతుడు. వేదాధ్యయనం చేసేవాడు. సుగుణ గరిష్ఠుడు. నీతికోవిదుడు. అటువంటి బ్రాహ్మణునికి భరతుడు పుత్రుడుగా జన్మించాడు. పుట్టింది మొదలు సంసారబంధాలకు దూరంగా ఉన్నాడు. కర్మబంధాలను తెంపివేసేవాడూ, సర్వేశ్వరుడూ, అచ్యుతుడూ, జననం లేనివాడూ అయిన విష్ణుమూర్తి పాదాలను నిరంతరం ధ్యానిస్తూ ఆయన కథలను ఆలకిస్తూ మళ్ళీ ఎటువంటి ఆటంకం రాకుండా ఆయనను సంస్తుతిస్తూ యశోభరితుడైన భరతుడు కాలం గడపసాగాడు.
(భరతుడు క్షత్రియకులంలో జన్మించాడు. అయితే ఆధ్యాత్మిక కర్మలను నిర్లక్ష్యం చేశాడు. అందువల్ల జింక జన్మ ఎత్తాడు. అయినా గత జన్మస్మృతి అతనిని రక్షించింది. 'శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోஉభిజాయతే' (6.4.1) యోగభ్రష్ఠుడు పవిత్రులైన శ్రీమంతుల గృహంలో పుడతాడు అన్నట్లుగా ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టాడు.)
ఆ బ్రాహ్మణునికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు తొమ్మిదిమంది పుత్రులు. చిన్న భార్యకు ఒక కొమార్తె ఒక కుమారుడు. ఆ చిన్న భార్య కుమారుడే భరతుడు. పరమ భాగవతుడూ, రాజర్షి పుంగవుడూ అయిన భరతుడు తన హరిణ శరీరాన్ని పరిత్యజించి ఈ జన్మలో బ్రాహ్మణుని ఇంట జన్మించాడు. ఇతరులతోడి సాంగత్యం జన్మపరంపరలకు కారణమౌతుందని భయపడిన భరతునికి శ్రీహరి అనుగ్రహంవల్ల పూర్వజన్మ స్మృతి కలిగింది. అందువల్ల అతడు కర్మబంధవిముక్తికోసం ఉన్మత్తుడుగా, జడుడుగా, అంధుడుగా, చెవిటివాడుగా లోకులకు కనిపిస్తూ జీవితం గడుపుతున్నాడు.
(భరతుడు జడుడుగా, అంధుడుగా, చెవిటివాడుగా లోకులకు కనిపించడానికి కారణం తన్ను దుష్టసాంగత్యం నుండి రక్షించుకోవడానికే. అభక్తుల దాడినుండి తన్ను తాను రక్షించుకోవడానికే.)
భరతుని తండ్రి తన చిన్న కుమారుణ్ణి ఎంతో గారాబంగా పెంచాడు. పుట్టు వెండ్రుకలు తీయించడం మొదలైన సంస్కారాలు చేయించాడు. కుమారునిమీద ఉన్న అనురాగాతిశయంతో నిత్యమూ శౌచ సదాచారములు నేర్పాడు. అవి ఏమాత్రం తనకు ఇష్టం లేకున్నా భరతుడు విధేయతతో వాటిని అవలంబించాడు.
బ్రాహ్మణ కుమారుడయిన భరతునికి కర్మలంటే ఏమాత్రం ఆసక్తి లేకపోయినా బోధించేవాడు తండ్రి కావడం వల్ల వాటిని పాటించడం తప్పనిసరి అయింది. తండ్రిదగ్గర ప్రణవం, వ్యాహృతులతో కూడిన గాయత్రీ మంత్రోపదేశం పొందాడు. ప్రతి సంవత్సరం, తప్పకుండా చైత్ర, వైశాఖ, జ్యేష్ఠాషాఢ మాసాలలో ఇతరులతో కలిసి వేదాధ్యయనం చేశాడు. తండ్రి కుమారునకు శిష్టాచారం నేర్పాలనే లోకాచారం మేరకు తన కుమారుడైన భరతునికి అతని తండ్రి శౌచవిధి, ఆచమనవిధి, అధ్యయన విధి, వ్రతవిధి మొదలైన నియమాలను అగ్ని ఆరాధనం గురు శుశ్రూషవంటి సత్కార్యాలను నేర్పాడు. అయినా కుమారునికి వాటిపట్ల అభినివేశం లేకుండడం గుర్తించి తన ప్రయత్నం యావత్తూ వ్యర్థమయిందనీ, తన కోరిక నెరవేరలేదనీ నిరాశ పడాడు.
(ఈ జన్మలో భరతుడు కర్మకాండలకు అతీతుడు. ఇప్పుడతడు గుణాతీతస్థితిని కొరుకుంటున్నాడు.)
ఈ విధంగా తన తనయునికి సదాచారాలు నేర్పే ప్రయత్నంచేసి కొంతకాలం సంసారజీవితం సాగించి ఆంగిరస గోత్రజుడైన ఆ విప్రుడు ఆకస్మికంగా పరలోకగతుడైనాడు.
తండ్రి చనిపోగానే తల్లి భర్తతో సహగమనం చేసింది. సవతితల్లి కొడుకులు అవినీతిపరులు. అందుచేత వారు భరతుని గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయారు. వారు భరతుని శాస్త్రాదులుకూడా చదువనీయలేదు.
(ఇక్కడ మూడు అంశాలున్నాయి. మొదటిది 'సహగమనం' ఆనాటి ఆచారం. రెండవది తండ్రికి భరతుని గురించి తెలిసినంత సోదరులకు తెలియకపోవడం. మూడవది వారు అవినీతిపరులు కావడం.)
ఈ విధంగా తండ్రి మరణానంతరం సవతితల్లి కొడుకులు భరతుణ్ణి వేదవిద్యలు చదువనీయకుండా ఇంటిపనులు చేయుమని శాసించారు.
(తల్లి తండ్రి లేనివారి జీవితం ఎంత దుర్భరమో భరతుని కథలో ఈ సన్నివేశం స్పష్టం చేస్తుంది.)
అయినా భరతుడు వారు చెప్పిన పనులను ఏ మాత్రం కాదనకుండా పనులలో ఏమాత్రం ఏమరుపాటు లేకుండా చేస్తున్నాడు. అయితే ఆ పనులపట్ల అతనికి ఆసక్తి మాత్రం లేకపోయింది.
భరతుడు ఇంటి పనులన్నీ చెప్పినట్లు చేస్తున్నాడు. నీచస్వభావులూ, మూర్ఖులూ, పశుప్రాయులూ అయిన జనులు భరతుని చిత్తవృత్తిని తెలుసుకోలేక 'ఓరీ పిచ్చివాడా! మొద్దూ! చెవిటివాడా! అని గద్దించేవారు. ఈసడించుకొనేవారు. భరతుడు కూడా అందుకు తగినట్టు వారితో సంభాషించుతూ తలవంచుకొని వారి ఆజ్ఞమేరకు నడుచుకునేవాడు. వెట్టిచాకిరీ చేసేవాడు. కూలిపని చేసేవాడు. బిచ్చమెత్తేవాడు. ఇలాగా భరతుడు కాలం గడపసాగాడు.'
షడ్రసోపేతమైన అన్నం పెట్టినా, పాసిపోయిన కూడుపెట్టినా కాదనకుండా ఒకేవిధంగా స్వీకరించేవాడు. అదీ ఇదీ కావాలని రుచులకోసం అర్రులు సాచేవాడు కాడు.
భరతుడెప్పుడూ ఆత్మానుభూతి పొంది ఆనందంగా ఉండేవాడు. అతనికి సుఖదుఃఖాలు తెలియవు. దేహంపై ఏమాత్రం శ్రద్ధలేదు. చలి, వేడి, గాలి, వానలకు భయపడేవాడు కాదు. ఒంటిమీద బట్ట కప్పుకునేవాడు కాదు. ఆబోతులాగా బలిసిగట్టి పడిన దేహంతో వట్టి కటికనేలపై పడుకొనేవాడు. మట్టి గొట్టుకాన్న మాణిక్యంలాగా ప్రకాశింపని బ్రహ్మవర్చస్సుతో కనిపించేవాడు. ఒక్కొక్కసారి మాసిన బట్టలతో, మలినమైన యజ్ఞోపవీతంతో తిరిగేవాడు. ఒక్కొక్కసారి అతనినిచూచి అజ్ఞానులైనవారు వీడు జనానికి బ్రాహ్మణుడుగాని వట్టి పనికిమాలిన మొద్దని అనుకొనేవారు. ఏదయినా పనిచేసి భరతుడు ఇతరులనుండి ఆహారం స్వీకరించేవాడు. అంతేగాని, అయాచితంగా ఏదీ తీసుకునేవాడు కాడు.
ఇదంతా చూచి సవతితల్లి కొడుకులు కొంతకాలం అతనికి పొలం పనులు అప్పజెప్పారు. అయినా ఆ పనులేవీ అతనికి తెలియవు. మంచివా, చెడ్డవా, చిన్నవా, పెద్దవా అనే ఆలోచన లేకుండా చెప్పిన పనులు చేసేవాడు. అతని సోదరులు నూకలు, తవుడు, తెలికపిండి, ఊక, పొట్టు, మాడుచెక్కలు ఏవి పెట్టినా వద్దనకుండా తినేవాడు. వాటిని అమృతంలాగా భావిస్తూ ఆప్యాయంగా భక్షిస్తూ పొలానికి కాపలా కాస్తుండేవాడు.
(భరతుడు అమృతత్వానికి అర్హుడయ్యాడని చెప్పవచ్చు. “సమదుఃఖసుఖం ధీరం సోஉ మృతత్వాయ కల్పతే”. సుఖదుఃఖాలలో నిర్వికారుడయినప్పుడు మనుజుడు అమృతత్వానికి అర్హుడవుతాడని గీత (2-15). మంచిచెడులు, సుఖదుఃఖములు విస్మరించుటయే అమృతత్వసిద్ధికి మార్గం!)
శ్లో॥ తుల్యనిందా స్తుతిర్మౌనీ సంతుష్టోయేన కేనచిత్ ।
అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియోనరః ॥ - భగవద్గీత - భక్తియోగం
“ఎవరైనా తిట్టినా, పొగడినా దానిని సమానంగా భావించేవాడూ, మౌనంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవాడు, ఇల్లూవాకిలీ లేకుండా పరివ్రాజకుడుగా సంచరించేవాడు, స్థిరనివాసం లేకపోయినా బుద్ధి భగవద్భావనలో స్థిరీకరించినవాడూ, భక్తిపరుడూ అయిన మానవుడే నాకు ఇష్టమైనవాడు. జడభరతుడు అట్టివాడు.
No comments:
Post a Comment