Wednesday, November 11, 2026

4va adhyayamu deepadanamaahatyamu,kartikapurnima, somavaraphalam - 4వ అధ్యాయము దీపదానమాహాత్యము,కార్తికపూర్ణిమ, సోమవారఫలం

కార్తిక పురాణము (స్కాంద పురాణాం) - 4వ అధ్యాయము 
దీపదానమాహాత్యము,కార్తికపూర్ణిమ, సోమవారఫలం

జనకుడిట్లడిగెను. వసిష్ఠమునీంద్రా! నీయొక్క వాక్సుధారసమును పానము చేయుచున్న నాకు తృప్తితీరలేదు. కాన తిరిగి కార్తిక వ్రతపుణ్యమును దెలుపుము. ఆ కార్తికమందు ఏ దానమును జేయవలెనో దేనినిగోరి వ్రతము ఆచరించవలయునో చెప్పుము.

వసిష్ఠుడు ఇట్లు పలికెను. పాపములను నశింపజేయునదియు, పుణ్యమును వృద్ధి బొందించు నదియు అయిన కార్తికవ్రతమును ఇంకా చెప్పెదను వినుము. కార్తికమాస మందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంతఫలము కలుగును.

కార్తికమాసమందు శివాలయములో గోపురద్వారమందును, శిఖర మందును ఈశ్వర లింగ సన్నిధియందును దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించును.

ఎవ్వడు కార్తికమాసమందు శివాలయంలో ఆవునేతితోగాని నేతితో గాని నువ్వులనూనెతో గాని విప్పనూనెతో గాని నారింజనూనెతోగాని భక్తితో దీప సమర్పణముచేయునో వాడే ధన్యుడు. వాడు ధర్మజ్ఞుడు ధర్మాత్ముడును అగును. 

పూర్వోక్తములయిన నూనెలు సంభవించినచో ఆముదముతో నయినా దీపమును సమర్పించిన యెడల పుణ్యవంతుడగును.

కార్తికమాసమందు శివాలయములో మోహముచేతగాని, బడాయికిగాని భక్తితోగాని దీపమిచ్చువాడు శివప్రియుడగును. సందేహములేదు. 

పూర్వకాలమందు పాంచాలదేశమందు కుబేరునితో సమానమైన యొకరాజుగలడు. సంతానము లేక గోదావరి తీరమందు తపస్సుచేసెను. 

గోదావరీ స్నానార్థమై పైప్పలమహాముని అచ్చటికి వచ్చి చూచి రాజా, ఎందుకు తపస్సు చేయుచున్నావని యడిగెను. ఆ మాటవిని రాజు మునీశ్వరా, నాకు సంతానము లేదుగాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పెను.

బ్రాహ్మణుడు రాజుతో ఇట్లుపల్కెను. రాజా! భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము. అట్లయిన యెడల నీకు పుత్ర సంతానము కలుగును. ఇట్లు పైప్పలముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగరమగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళిస్నానము జేసి అలంకృతుడై శివప్రీతిగా దీప దానములను జేసెను. 

పిమ్మట ఆ పుణ్యముచేతనే రాజుభార్య గర్భవతియై పదియవమాసమున రెండవ సూర్యుడువలె ప్రకాశించెడి ఒక పుత్రుని గనెను.

ఆ రాజు విని అథికానందమును బొంది కార్తికమాహాత్యము సత్యమైనది ఈ కార్తికవ్రతము
ధర్మార్థకామమోక్షములనిచ్చును. సమస్తభూతములకు కార్తికమాసము శుభప్రదము అని
వచించెను.

తరువాత రాజు కుమారునకు “శత్రుజిత్‌” అను నామకరణము చేసి బ్రాహ్మణులను
గోభూదానాదులతో పూజించెను. తరువాత బాలుడు క్రముగా వృద్దినొంది యౌవనవంతుడై
శూరుడై సుందరుడై వేశ్యాసంగ లోలుడై అంతట తృప్తిలేక పరస్త్రీలయందు ఆసక్తిగలిగి
ధనాదికమునిచ్చి వారిని లోబరచుకుని సంభోగించెడివాడు. 

ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతినివిడిచి జాతిసంకరకారకుడై దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేతధరించి అడ్డమువచ్చిన వారిని హింసించుచు అన్యాయమార్గవర్తనుడై యుండెను.

ఇట్లుండగా ఆ గ్రామమందొక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది సింహము యొక్క నడుము వంటి నడుముగలది. పెద్దకన్నులు గలది. పెద్దవైన పిఱుదులును, కుచములును గలదియు, అరటిస్తంభముల వంటి తొడలు గలదియు, చిలుకకువలె సుస్వరమైన వాక్కు గలదియు, మన్మధో ద్రేకముగలదై యుండెను.

ఆ రాజకుమారుడు అట్టి విప్రభార్యనుజూచి దాని సౌందర్యమునకు సంతోషించి  దానియందాసక్తిగలవాడాయెను. బ్రాహ్మణుని భార్యయు రాజకుమారునందాసక్తిగలదాయెను. 

తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రియందు భర్తను విడిచి రాజకుమారుని యెద్దకుబోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి బూర్వమే తిరిగి ఇంటికివచ్చెను. ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి.

ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలిసికొని నిందితమైన నడతగల భార్యను దానిని మరిగిన రాజకుమారుని చంపుటకుగాను కత్తినిచేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలుదొరుకునా యని కాలమును ప్రతీక్షించుచుండెను.

ఇట్లు కొంతకాలము గడచిన తరువాత యొకప్పుడు సంభోగము కొరకు ఒక జీర్ణశివాలయాన కార్తికపూర్ణిమా సోమవారమునాడు బ్రాహ్మణి తన చీరె అంచును చింపి వత్తిని చేసెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆ వత్తితో ఆ చిన్నది దీపము వెలిగించి అరుగుమీద పెట్టెను.

అచ్చటే వారిద్దరు కామశాస్త్రప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి.

అంత ఆ బ్రాహ్మణుడు కత్తినిధరించి వెళ్ళి మాఱువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తరువాత భార్యను నరికెను. 

అంతలో రాజకుమారుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణునినరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతములచేత ఆ జీర్ణదేవాలయమందు ముగ్గురు మృతినొందిరి. ఆ దినము కార్తిక పూర్ణిమ సోమవారము, దైవవశముచేత అట్టి పర్వమందు ముగ్గుఱికి శివుని సన్నిధియందు మరణము గల్గినది.

అంతలో పాశహస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకరులును వచ్చిరి. తరువాత శివదూతలు రాజకుమారుని, బ్రాహ్మణ భార్యను విమానము మీద నెక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళుగట్టి తీసికొనపోవ ప్రయత్నించిరి.

ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాసగమనమును, తనకు యమలోకగమనము జూచి బ్రాహ్మణుడు శివదూతలారా ! ఈ నా భార్య జారిణి, ఈ రాజకుమారుడును జారుడుగదా, నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడును గదా, ఇట్లుండ నాకీగతియేమి, వారికాగతియేమి అని యడిగెను.

శివదూతలిట్లనిరి. బ్రాహ్మణోత్తమా! నీవన్నమాట సత్యమేగాని అందొక విశేషమున్నది చెప్పెదము వినుము. ఈ నీ భార్య పాపాత్మురాలును జారిణియు అయినప్పటికి కామమోహముచేత కార్తిక పూర్ణిమా సోమవారమునాడు శివాలయమందు దీపారాధనకుగాను తన చీరెను చించివత్తిని చేసి ఇచ్చినదిగాన దీని పాపములన్నియు భస్మములయినవి.

ఈ రాజకుమారుడును దీపార్థమై ఆముదమును దెచ్చి పాత్రలోనుంచి ఇచ్చినందున
క్షీణపాపుడాయెను. కాబట్టి కామమోహముచేతనయినా శివాలయమందు దీపదానము చేసినవాడు ధన్యుడు సర్వయోగులందు అధికుడగును. కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును, దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది. ఇదివరకు నీవెంత శుద్ధముగానున్నను వారితో సమానుడవుగాలేదు. ధర్మసూక్ష్మమిదియని చెప్పిరి.

శివదూతలు ఈ ప్రకారముగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై అయ్యో ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణునిచేత శివాలయమందు హతుడనైన నాకు కైలాసము. ఇతనికి నరకము గలుగుట చాలా దుఃఖకరముగా ఉన్నది.

కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునకు ఇచ్చెదను. ఏకకాలమందు మృతి నొందిన మాముగ్గుఱికి సమానగతియే ఉండవలెను. ఇట్లనిఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను. ఆ పుణ్యముచేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన యొక దీపదానముచే ముగ్గురు కైలాసమునకుబోయిరి.

కాబట్టి తప్పక కార్తికమాసమందు ధర్మమును జేయవలెను. అట్లు చేయని వాడు రౌరవ నరకమును బొందును. కార్తిక మాసమందు నిత్యము శివాలయమందుగాని, విష్ణ్వాలయమందుగాని దీపమాలను సమర్పించిన యెడల దీదానపుణ్యముతో జ్ఞానమును బొంది తద్వారా పునరావృత్తిరహిత మగు మోక్షమునొందును. సందేహములేదు.

కార్తికమాసమందు హరిసన్నిధిలో స్త్రీలుగాని, పురుషుడుగాని తన శక్తి కొలది దీపార్పణముచేసిన యెడల సర్వపాపనాశనము కలుగును. కాబట్టి నీవును శివాలయమందు కార్తికమాసమున దీపములపంక్తి సమర్పించుము.

5వ అధ్యాయము - పురాణపఠనమాహాత్మ్యము, శత్రుజిచ్చరిత్రము

No comments:

Post a Comment

6va adhyayamu vyadhavimukti vruttantamu,deepadanamaahatmyamu, dravidastri swargagamana vruthantham - 6వ అధ్యాయము వ్యాధవిముక్తి వృత్తాంతము,దీపదానమాహాత్మ్యము, ద్రావిడస్త్రీ స్వర్గగమన వృత్తాంతం

కార్తిక పురాణము (స్కాంద పురాణాం) -  6వ అధ్యాయము  వ్యాధవిముక్తి వృత్తాంతము,దీపదానమాహాత్మ్యము, ద్రావిడస్త్రీ స్వర్గగమన వృత్తాంతం వశిష్ఠుడు మర...