దేవుత్తాన ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి, హరిబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. హిందూ సంప్రదాయంలో 24 ఏకాదశులలో ఈ ఏకాదశికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రోజున శ్రీమహావిష్ణువు నాలుగు నెలల యోగనిద్ర నుంచి మేల్కొంటాడని భక్తుల నమ్మకం.
దేవుత్తాన ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు?
ఆషాఢ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడని, ఆ సమయం నుంచి కార్తీక మాసం వరకు నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు.
కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజున స్వామివారు యోగనిద్ర నుంచి మేల్కొంటాడని విశ్వసిస్తారు. అందుకే ఈ రోజును దేవుత్తాన ఏకాదశిగా జరుపుకుంటారు.
దేవుత్తాన ఏకాదశి ప్రాముఖ్యత :
ఈ రోజును శుభకార్యాల ప్రారంభానికి ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. విష్ణుమూర్తి మేల్కొనే రోజుగా భావించడం వల్ల వివాహాలు, నిశ్చితార్థాలు వంటి శుభకార్యాలకు తిరిగి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి.
విష్ణుమూర్తిని మేల్కొలిపే మంత్రం:
ఈ రోజున శ్రీమహావిష్ణువును మేల్కొలుపుతూ ఈ మంత్రాన్ని పఠిస్తారు.
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద! ఉత్తిష్ఠ గరుడధ్వజ!
ఉత్తిష్ఠ కమలాకాంత! త్రైలోక్యం మంగళం కురు!!
దేవుత్తాన ఏకాదశి వ్రత కథ:
పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతను శ్రీమహావిష్ణువుకు గొప్ప భక్తుడు. ప్రతి ఏకాదశి రోజున భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండేవాడు. అంతేకాకుండా తన రాజ్యంలో ప్రజలందరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించేలా నియమం పెట్టాడు. ఒకరోజు వేరే రాజ్యానికి చెందిన వ్యక్తి ఆ రాజు దగ్గరకు వచ్చి తనకు పని కల్పించమని కోరాడు. రాజు అతనికి పని ఇవ్వడానికి అంగీకరించాడు. అయితే ఏకాదశి రోజున మాత్రం ఎలాంటి ఆహారం తీసుకోకూడదని షరతు విధించాడు. ఆ వ్యక్తి కూడా అందుకు అంగీకరించాడు.
ఏకాదశి రోజు రాగానే ఆ వ్యక్తి ఆకలిని తట్టుకోలేక రాజును ఆహారం అడిగాడు. రాజు మొదట నిరాకరించినా, అతని పరిస్థితిని చూసి కొంత పిండి, ఇతర పదార్థాలను ఇచ్చాడు. ఆ వ్యక్తి నది ఒడ్డుకు వెళ్లి స్నానం చేసి ఆహారం సిద్ధం చేసుకున్నాడు. అనంతరం శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ తనతో కలిసి భోజనం చేయడానికి రావాలని కోరాడు. అతని నిజమైన భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై అతను సమర్పించిన ఆహారాన్ని స్వీకరించాడని కథ చెబుతుంది.
కొంతకాలం తర్వాత మళ్లీ ఏకాదశి రోజు రాగా, ఆ వ్యక్తి రాజు దగ్గరకు వెళ్లి ఈసారి మరింత ఎక్కువ ఆహారం కావాలని అడిగాడు. ఎందుకని రాజు ప్రశ్నించగా, గతంలో శ్రీమహావిష్ణువు తనతో కలిసి భోజనం చేశాడని, అందుకే ఇద్దరికీ సరిపడా ఆహారం కావాలని చెప్పాడు.అతని మాటలను రాజు నమ్మలేదు. దీంతో ఆ వ్యక్తి రాజును తనతో పాటు వచ్చి స్వయంగా చూడమని కోరాడు. ఇద్దరూ నది ఒడ్డుకు వెళ్లారు. ఆ వ్యక్తి మళ్లీ భక్తితో విష్ణుమూర్తిని ప్రార్థించాడు.
ఈసారి స్వామివారు ప్రత్యక్షం కాకపోవడంతో, తన ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధపడ్డాడు. అతని అచంచలమైన భక్తిని చూసి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై అతనికి దర్శనమిచ్చి, తనతో పాటు వైకుంఠానికి తీసుకెళ్లాడని పురాణ కథనం. ఈ సంఘటనను చూసిన రాజు నిజమైన భక్తికి ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. కేవలం ఆచారాలు పాటించడం మాత్రమే కాకుండా, మనస్ఫూర్తిగా భగవంతుడిని ఆరాధించడం ముఖ్యమని గ్రహించాడు. అప్పటి నుంచి మరింత భక్తిశ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు.
కార్తిక పురాణము
సంపూర్ణ కాశీ ఖండం
శివ
న్యూమరాలజీ
వాస్తు శాస్త్రం
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment