అజామిళ పూర్వజన్మ వృత్తాంతము
జనకుడు తిరిగి ఇట్లు అడిగెను. ఓ మునీశ్వరా! ఈ అజామిళుడు పూర్వజన్మ
మందెవ్వడు? ఏమి పాపమునుజేసెను? విష్ణుదూతలు చెప్పిన మాటలనువిని యమభటులు
ఎందుకు యూరకుడిరి? యముని వద్దకు పోయి యమునితో ఏమనిచెప్పిరి?
వసిష్ఠుడు ఇట్లు చెప్పెను. యమదూతలు విష్ణుదూతలమాటలు విని శీఘ్రముగా
యమునివద్దకు బోయి సర్వవృత్తాంతమును యమునితో జెప్పిరి.
అయ్యా! పాపత్ముడును,
దురాచారుడును, నిందితకర్మలను ఆచరించువాడును నగు అజామిళుడు తోడితెచ్చుటకు
పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్ములను ధిక్కరించి అతనిని విడిపించిరి.
మేము
వారిని ధిక్కరించుటకు అశక్తులమైవచ్చితిమి అని చెప్పిరి.
ఆ మాటను వినికోపించి యముడు జ్ఞానదృష్టితో చూచి యిట్లనియె.
ఈ అజామిళుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామస్మరణ చేయుట చేత పాపములు
నశించి వైకుంఠ ప్రియుడాయెను.
అందువలననే అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి.
దుష్టాత్ములై మహిమను తెలిసికొనక హరినామస్మరణ చేసినను పాపములు
నశించును.
తెలియక తాకినను అగ్నికాల్చునుగదా! భక్తితో నారాయణ స్మరణను
జేయువాడు జీవన్ముక్తుడై అంతమందు మోక్షము నొందును.
యముడిట్లు విచారించి
యూరకుండెను.
అజామిళుడు పూర్వజన్మమున సౌరాష్ట్రదేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా
ఉండి శివ ద్రవ్యమును హరించుచు స్నానసంధ్యలను విడిచి అన్యమానసుడై శివుని
పూజించుచు శివునకభిముఖముగా కాళ్ళుచాపుకుని శయనించుచు ఆయుధపాణియై
స్నేహితులతోగూడి నానాలంకారశోభితుడై స్వేచ్భావిహారముల తిరుగుచు బహుభాషియై
మంచి యౌవనముతో నుండెను.
ఆయూరిలో నొక బ్రాహ్మణుడుండెను. అతనికొక రూపవతియు యౌవనవతియు నగు భార్యగలదు. ఆ బ్రాహ్మణుడు దరిద్రపీడితుడై అన్నము కొఱకై పట్టణములు,
గామములు పల్లెలు తిఱుగుచు యాచించుచుండెడివాడు.
ఒకానొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యాదికమును శిరస్సున నుంచుకొని
ఆకలితో యింటి కివచ్చి భార్యతో
ఓసీ! నాకు ఆకలి కలుగుచున్నది. త్వరగా వంట
జేయుము. ముందు మంచినీళ్ళిమ్ము త్రాగి శాంతించెదను.
భర్తయిట్లెన్ని మాటులడిగినను
భార్య అతని మాటను లెక్కచేయకపనులు చేయుచు జారుని మనస్సులో ధ్యానించుచు
యూర కుండెను. అంతభర్తకోపించి దండముతో భార్యను గొట్టెను.
భార్య భర్తను పిడికిలితో
గుద్దెను. తరువాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరముబోయి అచ్చట భిక్షమెత్తుకొని
జీవించుచు భార్యాసంగతిని గూర్చి చింతించు చుండెను.
భార్యయు సుఖముగానుండి
రాత్రి భుజించి మంచి చీరెధరించి తాంబూలము స్వీకరించి యొక చాకలివాని ఇంటికి
పోయెను.
సుందరుడయిన చాకలివానిని జూచి రాత్రి నాతో సంభోగించుమనెను. ఆ
మాటవిని వాడు నీవు బ్రాహ్మణస్త్రీవి అర్థరాత్రివేళ మాయింటికి రావచ్చునా? మీరు
గొప్పకులమునందు బుట్టినవారు మేము నిందితులము కాబట్టి యిట్టి సంపర్కము మీకు
తగునా?
ఈ ప్రకారముగా వారిరువురును వివాదపడుచు చాకలివాడు రోకలితో దానిని
కొట్టెను. అదియు వానినికొట్టి వానిని విడిచి రాజమార్గమున బోవుచుండగా పైన జెప్పిన
శివార్చకుని జూచెను.
అంతలో ఆ స్త్రీ వానిని పట్టుకుని రతికేళి రమ్మనమని పిలుచుకొని
పోయి వానితో భోగించి రాత్రియంతయు వానితో కాలక్షేపముచేసి తెల్లవారగానే పశ్చాత్తాపమును బొంది భర్త వద్దకు బోయి ఆయనను బ్రతిమాలి ఆయనతో గూడా గృహ మందు
సౌఖ్యముగా నుండెను.
తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతినొంది యమలోక మందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములననుభవించి తిరిగి భూమి యందు సత్వనిష్ఠుని కొడుకు
అజామిళుడై జన్మించెను.
ఇతనికి కార్తికపూర్ణిమనాడు శివదర్శనములభించినది. అంత్య
కాలమందు హరినామ స్మరణ గలిగినది. ఆ హేతువలచేత సప్తజన్మార్థిత పాపములు
నశించి మోక్షమును బొందెను.
ఆ బ్రాహ్మణియు కొంతకాలమునకు మృతినొంది నరకములందనేక యాతనల
నొంది తిరిగి భూమియందు కన్యాకుబ్జమందు చండాలునకు పుత్రికగా జన్మించెను.
చండాలుడు ఇది పుట్టిన సమయము మంచిదా యని యొక బ్రాహ్మణుని యడిగెను.
అతడు యిది తండ్రిగండాన పుట్టినదని చెప్పెను. ఆమాట విని చండాలుడు ఆ శిశువును
దీసికొనిపోయి అరణ్యమందుంచెను.
అంతలో ఒకబ్రాహ్మణుడు జూచి రోదనము చేయుచున్న ఆ శిశువును దీసికొనిపోయి తనయింటిలో దాసీగానున్న యొక స్త్రీకి నప్పగించెను.
ఆ దాసీది దీనిని పెంచినది. తరువాత దీనిని అజామిళుడు దగ్గరకు తీసెను. తరువాత
కథపూర్వోక్తమే -
రాజోత్తమా! ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానము అజామిళుని పూర్వ వృత్తాంతము.
పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము, హరినామకీర్తనము చేసిన
ప్రాయశ్చిత్తములతో పనిలేదు.
అదిగాని యెడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలెనని భావము.
ఎవ్వనియొక్క నాలుక హరినామ కీర్తినముచేయదో, మనస్సు హరిపాదపద్మమును స్మరించదో, చెవులు హరిచరిత్రములను వినదో వానిపాపములు యెట్లు నశించును?
ఇతర చింతనుమాని హరినిస్మరించువారు ముక్తినొందెదరు. ఇందుకు సందియము
లేదు.
కాబట్టి కార్తికమాసమందాచరించిన ధర్మము సూక్ష్మమైనదైనను గొప్ప దైనను
పాపము అంతటిని నశింపజేయును.
కార్తికధర్మమునకు పాపములను నశింపజేయు
సామర్ధ్యమున్నది కాబట్టి కార్తిక మాసమందు ధర్మ మాచరించనివాడు నరకము నొందును.
ఇది నిశ్చయము.
పాపములను నశింపజేయు ఈ కథను విన్నవారు సమస్త పాపములను
నశింపజేసి మోక్షమొందుదురు.
ఈ కథను వినిపించువాడు పాపవిముక్తుడై వైకుంఠమందు విష్ణువుతో గూడి
సుఖించును.
No comments:
Post a Comment