Friday, April 10, 2026

Chapter 22 The Birth Story of Sri Vyasa Maharshi - అధ్యాయము 22 శ్రీ వ్యాసమహర్షి జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 22

శ్రీ వ్యాసమహర్షి జన్మవృత్తాంతము

పూర్వ మొకప్పుడు మహాతేజుడగు పరాశర మహాముని సర్వతీర్థ యాత్రలు సంసేవించుచు యమునా తీరమున కేతెంచెను. అచటనొక నిషాదుడు భోజనము చేయుచుండెను. ముని తయనిని గని నన్ను నీ పడవలో నదియావలి గట్టునకు జేర్చుమనెను. నదీతీరమందు భుజించు నిషాదు డా ముని మాటలు విని తన కూతురగు మత్స్యగంధతో ఈ ముని తపోవీర్యుడు కడుంగడు ధర్మశీలి. ఇత డీ నది దాటగోరుచున్నాడు. వేగమే నీవితనినీ తెప్పపై నెక్కించుకొని యవ్వలి దరికి జేర్చుము అని పలికెను. వాసవి (ఉపరిచర వసు రాజపుత్రి) యగు మత్స్యగంధ తన తండ్రి మాట ననుసరించి ముని ప్రవరుని తన పడవలోని కెక్కించుకొని ముందునకు సాగుచుండెను. దైవయోగమున పరాశరముని ఆ చారులోచనను చూచి కామార్తుడై యామెను చేపట్టదలచి తన దక్షిణ హస్తముతో నా కోమలి కైదమ్మి పట్టుకొనెను. అప్పుడా ముదిత వలపుల నవ్వొలయ సిగ్గుల నిగ్గులు పెదవులపై చిందులాడు ఓ మునిప్రవరా! నన్ను చేపట్టుట నీకు నీ కొలమునకు నీ తపమునకు నీ శాస్త్రమునకు దగునే! నీవు పవిత్ర వశిష్ఠ వంశజుడవే! కులశీల సంపన్నుడవే! ధర్మజ్ఞుడవే! అట్టి నీవే కామావిష్టుడవగుట తగునా? ఈ లోకమందు మనుజ జన్మము కడు దుర్లభము. అందును బ్రాహ్మణుడై పుట్టుట మిక్కిలి దుర్లభమని తలంతును. ఓ బ్రాహ్మణా! కులము శీలము శాస్త్రము బట్టి చూడగ నీవు ఉత్తముడవు; ధర్మవిదుడవు. అట్టి నీవెక్కడ? ఈ చేపల కంపుదానను నేనెక్కడ? నన్ను తొలిసారిగ జూచినంతలోన నీకీయనార్య భావమెట్లు గలిగెను? ఈ నా మేనిలోనే శుభమును చవిచూడదలచి నన్నే మనసార చేపట్టదలచితివి? ఆహా! అంతేకాదు. నీవిపుడు కామాతురుడవై నా సమీపమునకే వచ్చుచున్నావు. నీ స్వధర్మము మఱచినావు. ఈ పవిత్రుడగు బ్రాహ్మణుడేమి! ఈతని యీ మందబుద్ధియేమి! ఈ నీటి నడుమనే ఇతడు నన్ను పట్టుచున్నాడు. కామాతురుడగు ఈతని మనస్సును వారించు వారెవ్వరును నిచట లేరు'' అని పలుకుచు ఆమె, అయ్యా! ఇంకను కొంచె మింద్రియములను కట్టివేయుము. నిన్నాదరికి జేర్చనిమ్ము అని మహా మునితో తీయగ పలికెను.

సూతుడిట్లనియెను: మదికింపైన ఆమె పలుకు లాలకించి మునిపుంగవు డా పట్టిన పట్టు కొంచెము సడలించెను. నది నెట్టులో దాటెను. వెంటనే ముని వరుడు మన్మథ భావనల కోపలేక మత్స్యగంధను మరల తన బాహు మూలములలో జిక్కించుకొనెను. ఆమె వణకుచు ముని కిట్టుల పలికెను. ఓ మునినాథా! నానుండి వెడలు దుర్గంధము నీకు రోత పుట్టించుట లేదా? జంటపడుచుల కూడిక సమమైన వయో రూపవంతులలో సరిగ జరిగిననే సంతృప్తికరముగ నుండును అని యా లేమ పల్కుటయే తడవుగా ముని యనుగ్రహమున నామె యోజనగంధగ ముద్దరాలుగ నందగత్తియగ మారి మరులూరించు ననురాగవతిగ మారెను. ఆమెను వెంటనే కస్తూరి పరిమళాలు విరజిమ్మెడి మేని క్రొత్తదనమున నిగ్గులు దేర్చి ముని తన దక్షిణ హస్తముతో నామె కడిచేయి పట్టుకొనెను. అపుడామె మునికిట్లు పలికెను. ముని వల్లభా! మన ఈ స్థితిని లోకము చూచును. తీరమందున్న నా తండ్రియు గాంచును. పశు ధర్మము దారుణమైనది. నాకది ప్రీతి గొల్పదు. కనుక మసక చీకటి పడుదనుక మదిని కొంచెము చిక్కబట్టుకొనుము. ఈ కలయిక నరులకు రేలగాని పగలు గూడదు గదా? దివా మైథున మతి దోషమని పెద్దలు దలంతురు. దీని వలన లోకము మనలను వ్రేలెత్తి చూపును' అను యుక్తియుక్తములైన యామె హిత వచనము లుదారుడగు మహాముని చెవులార వినెను.

అంత సమర్థుడగు మునీంద్రుడు తన పుణ్య ప్రభావమున వేగిరమే మంచుగల్పించెను. ఆ తటమంతయు పొగ మంచు నిండెను. ఆ మంచుపొగ పెంజీకటులో యన దట్టమయ్యెను. పిమ్మట నామె మృదువుగ నిట్లనియెను: 

"ఓ మునివర్యా! నేను కన్నియను. నీ యిచ్చ మెచ్చునట్లు నన్ననుభవించి నీవు వెళ్ళుదువు. నీవు అమోఘవీర్యవంతుడవు. నేను గర్భవతినైనచో నాకింకేది దిక్కు? నా తండ్రి కేమని చెప్పుకొందును? నా గతి యేమి గావలయును?"

పరాశరుడిట్లనియెను: ఓ కాంతా! నీవు నా మనసులోని కోర్కి తనివార తీర్చినను నీవు కన్నియగనే యుందువు. కనుక నేదేని కోరుకొనుము. వరమిత్తును. 

సత్యవతి యిట్లనియెను: లోకముగాని నా తల్లిదండ్రులుగాని యెఱుగని విధముగ నీ కార్యము చక్కబెట్టుము. కన్నెఱికము చెడకుండునట్లుగ ననుగ్రహించుము. నీవద్భుత వీర్యుడవు. నీవంటి పుత్రుడు నాకు గలుగు నట్లనుగ్రహించుము. నామేనెల్లవేళల సుగంధము విరజిమ్ముచుండవలయును. నేను నిత్య¸యవనమున నుండవలయును. 

పరాశరుడిట్లనియెను: ఓ సుందరీ! నీకు పరమపవిత్రుడు విష్ణ్వంశ సంభూతుడునగు సుపుత్రుడు జన్మించనున్నాడు. అతడు ముజ్జగములందును ప్రసిద్ధిగాంచును. ఏదో తెలియని దైవకారణమున నీయందు నా మనసు సంలగ్నమైనది. ఇంతకు మున్ను నేనెన్నడును మోహమున మునిగి యెఱుగను. అచ్చరల మెఱుగుమెచ్చులు గాంచియును వారిని నే నేనాడు కన్నెత్తియైనను జూడలేదు. ఇపుడు దైవయోగమున నిన్ను గన్నంతనే కామవశుడనైతిని. దీని కేదో తెలియని కారణమున్నదని నమ్ముము. దైవము మాత్రము దాటరానిది. అతి దుర్గంధవతివగు నిన్నుగని నేనేల వలచితి నందువేమో; వినుము. ఈ శుభముహూర్తమందే మహాపురాణకర్తయగు పుత్త్రుడు నీకు జన్మించగలడు, ఆ మహాత్ముడు వేదములు విభజించును. ముల్లోకములందు వన్నె వాసి గాంచును.' 

సూతుడిట్లనియె: ఈ విధముగ తనకు వశమైన యామెను యనుభవించి యమునాజలములందు అతి శీఘ్రముగ విడిచిపోయెను. ఆ సత్యవతి యదే మూర్తమున గర్భవతి యయ్యెను.

యమునా తీరమున రెండవ మన్మథునివలె వెలుగొందుచున్న సద్యోజాతుడగు పుత్రుని గనెను. ఆ పుట్టిన మహా తేజస్వి తన తల్లితో నిట్లు పలికెను. 

"నా మనస్సు తపము చేయుటకే నిశ్చితమై యున్నది. తల్లీ! నీ యిష్టమున్నచోటికి నీ వేగుము. నేను తపమాచరింప నరుగుదును. నావలన నీకేదేని పని యున్నచో నన్ను స్మరించుము. శీఘ్రమేవచ్చి నిన్ను సందర్శింతును. నీవు దిగులు మాని సుఖముండుము." అని వ్యాసుడు తపమున కేగెను. 

ఆమెయు తన తండ్రికడ కరిగెను. ఆమె తన పుత్త్రునొక దీవిపై నుంచినందున నతినికి ద్వైపాయనుడను పేరు వచ్చెను. అతడు విష్ణ్వంశ సంజాతుడగుట వలన పుట్టిననాటినుండి దినదిన ప్రవర్ధమానుడయ్యెను. అతడు ప్రతి తీర్థమందు గ్రుంకుచు తపమొనరించుచుండెను. ఈ విధముగ పరాశరమహర్షి వలన సత్యవతికి ద్వైపాయను డుద్భవిల్లెను. అతడు కలియుగము రాగానే వేద విభజన మొనరించి వేదవ్యాసుడని వాసికెక్కెను. శ్రీ మహాభారతేతిహాసమును పురాణ సంహితలును ప్రవచించెను. అతడా వేద విభాగములను తన ముఖ్యశిష్యులగు సుమంతుడు జైమిని పైలుడు వైశంపాయనుడు అసితుడు దేవలుడు శుకుడు మున్నగువారలచే అధ్యయనము చేయించెను. 

సూతుడిట్లనియెను : ఈ విధముగ మీకన్నియు సకారణముగ దెలిపితిని.
ఇది సత్యవతీ తనయుడగు శ్రీవ్యాసుని జన్మవృత్తాంతము. ఇటులు మహాత్ముల చరిత్రల కారణములు సుగుణములు గ్రహింపదగినవి. దైవకారణము వలన చేప కడుపునుండి సత్యవతి జన్మించినది. తొలుతనే సత్యవతికి పరాశరమునితో సంయోగము సంభవించెను. ఆ పిదపనే యామెను శంతనుడు పరిగ్రహించెను. కనుకనే పరాశరుని మది యామెయందు మొట్టమొదటనే లగ్నమైనది. ఆ ధర్మాత్ముడగు పరాశరు డార్యులకు దగని పని యేల యొనర్చును? కనుక నీయాఖ్యానక మాశ్చర్యకరము సకారణమునైనది. పుణ్యప్రదమైన యీ శుభాఖ్యానకము విన్న మతిమంతుడు పాపరహితుడగును. అతడు దుర్గతి జెందక నిత్యసౌఖ్యములందును.

అధ్యాయము 23 గంగాశంతను వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 21 Matsyagandha's birth story - అధ్యాయము 21 మత్స్యగంధ జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 21

మత్స్యగంధ జన్మవృత్తాంతము


ఋషులిట్లనిరి : సూతమహర్షీ! నీ పరమవచనములు రహస్యభరితములు. అవి తాపసులమగు మాకాశ్చర్య సందేహములు గొల్పుచున్నవి. తొల్లి శ్రీవ్యాసుని తల్లియగు సత్యవతిని శంతనుడు వివాహము చేసికొనెనంటివి. ఆ సత్యవతి తన పుట్టింటనుండగ నామెకు వ్యాసుడెట్లు జన్మించెను? వ్యాసుడు జన్మించినమీద నామెను శంతనుడెట్లు పెండ్లి చేసికొనెను? ఆ సత్యవతి కిరువురు కొమరు లెవరివలన గల్గిరి? మున్నగు విషయములు దెలుపు పరమపావన కథ యంతయును మాకు తేటతెల్ల మొనరింపము. నియతవ్రతులమగు మేము ఆ సత్యవతీ వ్యాసుల జన్మవృత్తాంతములు విన నుత్సమించుచున్నవారము. 

సూతుడిట్లనియె : ఆది పరాశక్తి అమృతయోని; ధర్మార్థ కామమోక్షప్రదాయిని; అట్టి పరమసత్యజ్యోతికి శిరమువంచి దోయిలించి యీ వరేణ్యమైన శ్రీదేవి పురాణగాథ ప్రవచింతును. ఆ శ్రీదేవీయొక్క వాగ్బీజము నుచ్చరించిన మాత్రమున శాశ్వత బ్రహ్మలోకసిద్ధి కరతలామలకమగును. ఆ యేకైక దేవియే కామితార్థప్రదాయిని. కాన నెల్లవాంఛితము లీడేరుటకా శ్రీదేవినే సర్వాత్మభావమున నెల్లరు నెల్లవేళల సంస్మరించుట యుక్తము.

తొల్లి ఉపరిచరుడను రాజు చేదిదేశ మేలుచుండెను. అతడు పరమధార్మికుడును సత్యనిత్యుడును ద్విజపూజకుడునై వన్నెకెక్కెను. ఇంద్రు డారాజు తపమునకు సంప్రీతిజెంది యతనికొక చక్కని స్ఫటిక విమానము ప్రదానము జెసెను. ఆ రాజా దివ్యవిమానమెక్కి భూమిపై దిగక అంతరిక్షమందే యెల్లెడల సంచరించుటవలన నతని కుపరిచవసువను నామమేర్పడెను. ఆ భూపతి ధర్మనిత్యుడని లోకములలో ప్రసిద్ధి వహించెను. అతని భార్య గిరిక. ఆ యము మిక్కిలి యందాల రాశి. వారి కమితవీర్యులు తేజోవంతులనగు నైదుగురు కొమరులు గలిగిరి. రాజు తన కొడుకుల నాయాదేశములకు పాలకులుగ నియమించెను. అంతనొకనాడు గిరిక ఋతుమతియై పుంసవనమున పవిత్రురాలై తన పతితో నెమ్మదిలోని తీరని కామవాంఛను దెలిపినది. అదేనా డా రాజు పితరు లతనిని శ్రాద్ధమునకై మృగములను కొనితెమ్మని కోరిరి అతడు యవశ్యకర్తవ్యమని నిశ్చయించుకొని లోలోన గిరికను తలపోయుచునే వేటకేగెను. అతడు వనమందుండియు తన భార్యను తలపోయుచునే యుండెను. ఆ రాజదేపనిగ తన ప్రియతమను తలచుచుండుటవలన నతని రేతస్సు స్ఖలితమయ్యెను. ఆతడు వెనువెంటనే దానినొక మఱ్ఱియాకున భద్రపఱచెను. 'ఈ నా వీర్య మమోఘమైనది. ఇది వ్యర్థము గారాదు. ఇపుడు నీ భార్య ఋతుస్నాతయై యున్నది. నా యీ యమోఘవీర్యమును నా ప్రియకంపవలయును' అని రాజు నిశ్చయించుకొనెను.

అతడు తన భార్యకు వీర్యము పంపదగిన సమయమెఱింగి దాని నభిమంత్రించి యొక మఱ్ఱియాకు దొన్నెలో నుంచెను. ఆ సమయమున తన సమీపమున నొక డేగ యుండెను. రాజు దానితో 'ఓ మహాభాగా! ఈ దొన్నెను తీసికొని త్వరితముగ మా యింటి కేగుము. అచట నా ప్రియ గిరిక గలదు. ఆమె యిపుడు ఋతుమతి. నీవు మా యింటికేగి దీని నామె కిమ్ము' అని పలికి డేగకు ఆ దొన్నె నిచ్చెను. ఆ డేగకు రాజమార్గము దెలియును. అది దొన్నెను తీసికొని వినువీధి కెగిరెను. అది తన ముకుపుటములతో దొన్నెను గట్టిగ పట్టుకొని యెగురుచుండగ నింకొక డేగ చూచి ఆ దొన్నె మాసమని తలచి దాని వెంటబడెను. అత్తఱి రెండు డేగలకు ఆకసమకుననే తుండ యుద్ధము జరిగెను. అటు లారెండును బోరాడు చుండగ వీర్యమున దొన్నె యమునానదిలో బడెను. వెంటనే యవి తమ తమ చోటులకు వెళ్ళినవి. అదే సమయమున అద్రికయను నొక దేవకన్యక యమునలో సంధ్యావందన మాచరించు నొక బ్రాహ్మణుని సమీపించినది. ఆ వరాంగన నీట మునుగుచు తిరుగుచు జలకేళి సలుపుచు వచ్చి వచ్చి యా బాపని పాదములు పట్టినది. అపుడా బ్రాహ్మణుడు ప్రాణాయమ మొనర్చుచుండెను. అతడా కామచారిణినిగని 'నా ధ్యానమున కాటంకము గలిగించితివి. కాన నీవు చేపవుగమ్ము' అని శపించెను. అపుడా యచ్చర విప్రశాపమున చేపయై యమునలో జరించుచుండెను.

డేగనుండి పడిన రాజవీర్యమును చేపరూపమందున్న యద్రిక గ్రహించెను. కొంతకాలమునకు దానికి పది నెలలు నిండెను. అంత మత్స్యజీవను లాచేపను వలలో బంధించిరి. వారా మీనము పొట్టచీల్చి చూడగ నందుండి మానవాకృతులు గల యిద్దఱు శిశువులు వెడలిరి. వారిలో నొకడు చక్కని బాలుడు. ఒకతే శుభాననయగు కన్య. ఆ జాలరివాడు వారిని వీక్షించి యాశ్చర్యమందెను. అతడు వారిరువురను రాజున కప్పగించెను. రాజా బాలుని తన పుత్త్రునిగ నంగీకరించెను. వసు సుతుడగు నా బాలుడు తన తండ్రివలెనే తేజో విక్రమసంపన్నుడై సత్యదర్మవంతుడై మత్స్యదేశమునకు రాజయ్యెను. రాజా కన్నియను మత్స్యజీవనున కొసంగెను. ఆమె యచట కాళి మత్స్యోదరి యను పేరుతో వన్నెకెక్కినది. ఆమెనుండి చేపల వాసన వెడలుటచే నామెకు మత్స్యగంధయను పేరు ఏర్పడెను. వాటి నుండి ఆమె మత్స్యరాజు నింటనే పెరుగుచుండెను. 

ఋషులిట్లనిరి: అద్రిక విప్రునివలన చేపగ శపింపబడినది గదా ! దాశరాజా చేపను పొట్టచీల్చి తినెను. ఆ యద్రిక తుదకేమైనది; ఆమె శాపమెట్లు తీరినది; ఆమె దివి కెట్లేగినది? అదంతయును మాకు వివరింపుము.

సూతుడిట్లనియె: ఆ విప్రుడు శపించిన నాడే యామె విస్యయముతో నతిదీరముగ నేడ్చుచు విప్రుని స్తుతించెను. ఆమె విలాపమునకు బ్రాహ్మణుని గుండె నీరైనది. అతడు దయతో నామె కిట్లనియెను: 

'ఓ కల్యాణీ! శోకింపకుము. శాపాంతము దెల్పుదును. వినుము. ఓ శుభాంగీ! నాశాపవవమున నీవు చేప వగుదువు. ఇద్దఱిని గందువు. ఆ పిదప నీశాపము తీరిపోవును.' ఇట్లామె శపింపబడి నదిలోని చేపయైనది. ఇద్దఱిని గన్నది. పిదప శాపముక్తి బడసినది. ఆమె శాపము దీరిన పిదప చేపరూపు వదలి దివ్యరూపమున దేవమార్గమున నరిగెను ఆ మత్స్యగంధయను కన్నియ దాశరాజు నింట నతని కూతురుగ బెరిగి పెద్దదగుచుండెను. శుభాంగియగు నామత్స్యగంధ చిఱుతప్రాయమున తన తండ్రి యింటినే యుండి పనులెల్ల చక్కబెట్టుచుండెను.

అధ్యాయము 22 శ్రీ వ్యాసమహర్షి జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

SRI DEVI BHAGAVATHAM PART 2 - శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

అధ్యాయము 21 మత్స్యగంధ జన్మవృత్తాంతము












అధ్యాయము 33 త్రిభువనేశ్వరి విషయమున జనమేజయ కృతప్రశ్నము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము


పంచాంగం

Chapter 20 Activity of Vyasa - అధ్యాయము 20 వ్యాసుని కార్యాచరణము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 20

వ్యాసుని కార్యాచరణము
ఋషులిట్లనిరి: దేవసత్తముడగు శుకుడా ప్రకారముగ పరమసిద్ధిని బొందిన మీదట వ్యాసుడేమి చేసెను? అదంతయును మాకు తేటతెల్ల మొనరింపుము. 

సూతుడిట్లనియె : వేదాభ్యాస పరాయణులగు శిష్యులందఱును అసితుడు దేవలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు మున్నగు తపోధనులెల్లరు వ్యాసు ననుమతిగైకొని ఆతని వీడి వెళ్ళిరి. శుకుడు పరమ గతి చెందెను. అంత మహాత్ముడు వ్యాసుడు తనకు సత్సాంగత్యము లేమిచే తాను వేరొకచో నేగదలచెను. ఆతడపుడు గంగాతీరమున పరాశరునిచేత విడువబడి శోకించుచుండిన తన తల్లియగు నిషాదకన్యను నెమ్మదిలో దలంచెను. అట్లు వ్యాసుడు సత్యవతిని దలంచి యాపర్వతము వీడి తన జన్మస్థానమున కేగెను. అచ్చో వ్యాసుడొక ద్వీపముజేరి సత్యవతిని గూర్చి యడుగగ నామె శంతనున కీయబడినదని నిషాదులనిరి. దాశరాజు వ్యాసునకు స్వాగతము బలికి ప్రీతితో బూజించి సత్కరించి దోసిలొగ్గి యిట్లు నుడివెను: 

"ఓ మునివరా! నేడు గదా నా జన్మము సార్థకమైనది. కులము పవిత్రమైనది. అమర దుర్లభమైన నీ దర్శనభాగ్యము నేటికి నాకు ప్రాప్తించినది. నీ రాకకు కారణమేమో తెలుపుము. ఈ నా భార్య బిడ్డలు - సంపద - అంతయును నీ యధీనమే. ఆ మాటలకు సంతసిల్లి వ్యాసుడచ్చోట సరస్వతీ నదీతీరమున చక్కని యాశ్రమ మేర్పరచుకొని తపమొనర్చుచు ధీరుడై యచ్చట కాలము గడుపుచుండెను. మహావిక్రముడగు శంతనునివలన సత్యవతి కిరువురు సుతులు గలిగిరని విని వ్యాసుడానందమంది యచటనే యుండెను.

ఆ యిరువురిలో పెద్దవాడు చిత్రాంగదుడు. అతడు సర్వలక్షణలక్షితుడు-శత్రుతాపనుడు. రెండవవాడు విచిత్ర వీర్యుడు. అతడు సద్గుణోపేతుడు. తండ్రికి సుఖము చేకూర్చువాడు. వీరిరువురికంటె పూర్వమే శంతనునకు మహావీరుడు పరాక్రమవంతుడగు గాంగేయుదుద్భవించెను. ఆ శంతనునివలననే సత్యవతియందీ యిరువురు జన్మించిరి. శంతనుండు సర్వలక్షణలక్షితులగు తనయులను బడసి దేవతలకు సైతము తా నజేయుడని తలంచెను. కొంతకాలము గడచినంతనే చినిగిన వస్త్రమును విడుచునట్లు కాలపరిపాకమున శంతనుడు తన తనువును విడిచెను. భీష్ముడు శంతనునకు యథావిధిగ సకల ప్రేతకార్యములను దానధర్మముల నాచరించెను. దేవవ్రతుడని ప్రసిద్ధుడైన భీష్ముడు తాను రాజ్యము చేయక చిత్రాంగదునకు పట్టముగట్టెను. ఆ సత్యవతీ సుతుడగు పరంతపుడు శుచి మహావీర్యుడు చిత్రాంగదుడును ఒకనాడు సేనల వెంటబెట్టుకొని వధ్యరురు మృగాదులను జూచుచు నడవిలో దిరుగుచుండెను. అపుడు దివ్యవిమానముపై చిత్రాంగదుడను గంధర్వుడు వనమందు సంచరించు చిత్రాంగదునిగని యతని చెంత దిగెను. ఆ సమబలశాలురకప్పుడు ఘోర రణము సంఘటిల్లెను. వారికి కురుక్షేత్రమున మూడేండ్లపా టేకధాటిగ రణము సాగెను. అందు చిత్రాంగదరాజు చిత్రాంగద గంధర్వుని చేతిలో మడిసి వీరస్వర్గమలంకరించెను. అది వినిన భీష్ముడు వెంటనే యతనికై యుత్తర క్రియలు జరిపెను. చిత్రాంగదుని మృతికై శోకించు భీష్ముని మంత్రులూరడించిరి. పిదప విచిత్రవీర్యుడు రాజయ్యెను. తనయునికై విలపించు సత్యవతిని మంత్రులు గురువులు నోదార్చి శోకముడిపిరి. సత్యవతి యూరడిల్లెను. వ్యాసుడును తన సోదరుడు విచిత్రవీర్యుడు రాజయ్యెను గదాయని సంతసించెను. యవనముననున్న విచిత్రవీర్యునకు వివాహము సేయ భీష్ముడు సంకల్పించెను.

సర్వలక్షణశోభితలగు కాశీరాజ పుత్రికలు మువ్వురు గలరు. వారి తండ్రి వారి వివాహమునకై స్వయంవరము చాటించెను. వేలాదిమంది రాజులు రాజకుమారులు స్వయంవరమునకు పిలువబడి సత్కరింపబడిరి. అపుడు మహావీరుడు మహారథుడగు భీష్ముడరదమెక్కిచని యక్కడి రాజుల యుక్కడగించి తన తేజస్విత భుజబలము నల్గురిలో ప్రదర్శించి భూపతులకు తలవంపులు గల్గించి యారాకుమార్తెలను బలిమితో గొనివచ్చెను. ధీరుడగు భీష్ముడా వామలోచనలను సొంతతల్లిగ-అక్కగ-కూతురుగ భావించికొని వచ్చి సత్యవతికి వారి నప్పగించి వేదవిదులు దైవజ్ఞులునగు ద్విజులనురావించి వివాహ శుభలగ్నము వారినడిగి తెలిసికొని తన సోదరుడు విచిత్రవీర్యునకు పెండ్లి చేయుటకు వివాహమంగళ ప్రయత్నములు జరుపుచుండెను. అంతలో నా కన్నెలలో బెద్దది గంగా తనయున కిట్లు పలికెను: 'ఓ కురుశ్రేష్ఠా ! నేనింతకు మునుపే సాల్వరాజును మనసార వరించితిని. ఆ భూపతియు నాపై నరురక్తుడైయుండెను. నేను ముందే యితరులచేత మనసార వరింపబడినదానను. నీవు బలశాలివి. కనుక నీవు నీ మదికి తోచినట్లు చేయుము.

సూతుడిట్లనియె: ఇట్లా కన్యపలుకగ భీష్ముడామె విషయమును తన తల్లి మంత్రి పురోహితుల ముందుంచి వారితో సంప్రతించి గాంగేయుడా కన్నియతో నీ యిష్టమున్నచోటికేగుమని చెప్పెను. అంత నా మగువ సాల్వుని సరసకు జని యతనితో నిట్లు పలుకసాగెను: 

"ఓ నరపతీ! నేను నీపై ననురక్తనని ఎరిగి భీష్ముడు నన్ను విడిచిపుచ్చెను. నిన్ను చేరిన నన్ను చేపట్టుము. ఓ నృపసత్తమా! నీకు నే నత్యంతము ధర్మపత్నిని. నీవును మునుపు నన్నట్లే తలచితివి. 

సాల్వుడిట్లు పలికెను: ఓ వరారోహా! ఆనాడు భీష్ముడు నా కన్నలుముందే నిన్ను పట్టుకొని రథముపై కూర్చుండ బెట్టుకొనెను. కాన నింక నేను నిన్ను చేపట్టుట కల్ల. పరోచ్ఛిష్టయగు కన్య నే మతిమతుండు చేరపట్టును? భీష్ముడు వదలిన నిన్ను తల్లిగదలంచి నేను నీ కేలు పట్టను.

అపుడా కన్నియ సాల్వునిచేత వదలబడి కన్నీరుమున్నీరుగ నేడ్చుచు మరల భీష్ముని జేరవచ్చి యతని కిట్లు పలికెను : 

'నేను నీచేత వదలబడితిని. కనుక సాల్వుడును మరల నన్ను చేపట్టుటలేదు. నీవు గొప్ప ధర్మవిదుడవు. నన్ను నీవే స్వీకరింపుము. లేనిచో నీముందు ప్రాణములు తీసికొందును.' 

భీష్ముడిట్లనియె : 'ఓ వరవర్ణినీ ! నీ మది వేరొకనియందు దగుల్కొనియున్నది. నిన్నెట్లు గ్రహింతును? నీవు నీ పుట్టింటి కేగుము.' భీష్ముడా మాట యనగనే యామె వనములకేగి పవిత్రతీర్థములం దొంటరిగ తపమొనర్ప దొడగెను. మిగిలిన కాశిరాజసుతలు రూపవతులు - అంబ అంబాలిక యనబడు వారలు ఇరువురు విచిత్రవీర్యుని భార్యలైరి. ఆ మహాబలుడగు విచిత్రవీర్యుడు వారిని గూడి సెజ్జలందు పూసెజ్జలందు తమకమున తొమ్మిదేండ్లు క్రీడించుచు విమరించుచుండి రాజయక్ష్మరోగముతో కాలధర్మ మందెను. తన కొడుకు మరణించగ సత్యవతి దుఃఖముతో ఆతనికి మంత్రులచే నంత్యక్రియలు జరిపించినది. ఆమె యొకనాడు విలపించుచు భీష్మునితో నొంటరిగ నిట్లనియెనుః 

'ఓ మహాభాగా! నీవును శంతనుని సుతుడవే గద! కనుక రాజ్యభారము వహించుము. నీ తమ్మునిభార్యలను చేపట్టి వంశము నిలువబెట్టుము. ఆ యయాతి వంశమడుగంటకుండునట్టు లొనరింపుము.' 

భీష్ముడిట్లనియె: 'తల్లీ! మా తండ్రితో నేను మునుపొనరించిన ప్రతిన నీవు విన్నదే గదా! నేను రాజ్యము చేయను. పెండ్లి చేసికొనను.' 

సూతుడిట్లనియె: ఆ మాటలకు సత్యవతి 'ఈ వంశమిక నిలబడుటెట్లొకో? ఆలసించిన దేశములో నరాజకము ప్రబలును. అపుడు నా మది కింక శాంతియే యుండదు.' అని యామె చింతాకులితయై వగచినది. అపుడు గాంగేయు డామెతో నిట్లు పలికెనుః 

' ఓయమ్మా, చింతిల్లకుము. విచిత్రవీర్యునకు క్షేత్రజపుత్త్రుడు గల్గు నట్లొనరింపుము. ఒక కులీనుడగు నుత్తమబ్రాహ్మణుని రావించి నీ కోడండ్ర నతనితో గలుపుము. ఇందు దోషము లేదు. ఇట్లు వంశము నిలువబెట్టుకొనవచ్చునని నిగమములు వాక్రుచ్చినవి. అపుడు నీ మనుమని రాజుగజేసి నేనతని శాసనమున రాజ్యము చక్కబెట్టుదును.'

భీష్ముని మాటలు విని యామె తన కానీననందనుడు కలుషరహితుడునగు వ్యాసుని నెమ్మదిలో దలంచినది. తన తల్లి తలచినంతలోనే వ్యాసతాపసు డేతెంచి యామెకు చేయెత్తి మ్రొక్కి యామె చెంత బ్రహ్మజ్యోతులు విరజిమ్మ నిలుచుండెను. వ్యాసుడపుడు భీష్మునిచేత బూజితుడై సత్యవతిచేత మర్యాదలందుకొని పొగలేని యగ్నిజ్వాల పగిది వెలుగుచుండెను. సత్యవతి వ్యాసునితో 

'నీ మహావీర్యమువలన విచిత్రవీర్యుని భార్యలందు చక్కని కుమారుల నుత్పన్నుల చేయు' మని చెప్పెను. వ్యాసుడు తన తల్లిమాట మేరమీర కామె మాట నాప్తవాక్యముగనెంచి యట్లయగుత మని పలికి ఋతుకాలమున కెదురు చూచుచుండెను. అంత నొకనా డంబిక ఋతుస్నాతయై మునివరుని పొందిక కేగినది. కాని కన్నులు మూసికొని మునివరునితో సంగమమందెను. ఫలితముగ గ్రుడ్డివాడు జన్మించెను. పుట్టుగ్రుడ్డియగు కుమారుడు పుట్టుటవలన సత్యవతి మిగులు దుఃఖించెను. అపుడామె తన రెండవ కోడలినిగూడ వ్యాసునివలన పుత్రుని బడయుమని ప్రేరించినది. అంతనొకనాడంబాలికయును ఋతుస్నానయై వ్యాసమునిని గూడెను. ఫలితముగ నామెయదే రేయి గర్భము దాల్చెను. ఆ యంబాలికకు పుట్టిన బాలుడు పాండువర్ణమున నుండెను. అతడేలుబడికి తగడు. కనుక సత్యవతి తన కోడలి నొకయేడాది తరువాత మరల నొక పుత్త్రుని గనుమని ప్రోత్సహించినది. సత్యవతి మరల వ్యాసముని నాహ్వానించినది. సత్యవతిచేత పంపబడిన వధువు వ్యాసుని మహోజ్జ్వలతేజముముందు నిలువద్రొక్కుకొని యుండలేక తన దాసిని గదిలో కంపినది. ఆమె వ్యాసుని పొందిన పొందికకు ఫలితముగ నొక కొడుకును గనెను. అతడే విదురుడు. ఈ ప్రకారముగ వ్యాసుని యనుగ్రహమున ధృతరాష్ట్రాదులు మువ్వురు కురువంశము నిలువబెట్ట జన్మించిరి. సోదరధర్మము దెలిసిన శ్రీ వ్యాసమహర్షి వలన నీ విధముగ కురువంశము నిలువబెట్టబడినది. ఓ యనుఘులారా! మీకీ ప్రకారముగ శ్రీవ్యాసుని వంశోత్పత్తి చరిత్ర సంపూర్ణముగ నభివర్ణింపబడినది.


శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 19 Sri Sukuni's married life - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 19

శ్రీ శుకుని వైవాహికజీవనము

శ్రీ శుకుడిట్లనియె: "ఓ మహాశయా! ఈ మాయామోహములో కొట్టుమిట్టాడు నరుడు నిష్కము డెట్లగును? అను సందేహమింకను నన్ను కలత పెట్టుచున్నది. శాస్త్రజ్ఞానము నిత్యానిత్యవివేకము గలిగియున్నప్పటికిని చిత్తము మోహభ్రాంతిని వదలజాలదు. ఇక నరుడు విముక్తుడగుటెట్లు? అట్టడుగున పేరుకొన్న తమమును శాస్త్రజ్ఞానము తొలగింపజాలదు. దీపమను మాట పల్కినంతనే యెక్కడైన పెంజీకట్లు పాయునా? రాజా! విబుధులెన్నడును సర్వభూతములకు ద్రోహము తలపెట్టరు. వాని పొట్టపై కొట్టరు. అట్టి చక్కని చల్లని నెచ్చెలిమి గృహస్థున కెట్లు గల్గును? మిమ్మింకను రాజ్యసుఖాసక్తి పదవ్యామోహము ధనదాహము విజయకాంక్ష వదలలేదు గద? మీకిక జీవన్ముక్తి యెట్లు చేకూరును? నీకు చోరులందు చోరత్వబుద్ధి తాపసులందు సాధుతాబుద్ధి గలదు గదా? ఇట్టి స్వపరబేదములు గూడు కట్టుకొని యున్నంతవఱకు విదేహుడ వెట్లగుదువు? తీపి పులుపు ఉప్పు కారము వేడిమి మున్నగు రుచులందలి మంచిచెడ్డలు నీవు గ్రహింపగవు గదా! వీనియందలి మంచి పదార్థమునకు నీ మది యుప్పొంగును. చెడ్డకు క్రుంగును. ఆయా కాలములందు నీకును మెలకువ-కల-నిద్దుర మున్నగు నవస్థలు గల్గుచుండును గదా! ఇంక నీకు తురీయావస్థ గల్గుటెట్లు? అన్ని రథగజతురగపదాతి బలములు నా వశమున గలవు. వానికి నే నధిపతిని అని నీవు తలంతువా? తలంపనా? నీవు రుచించు పదార్థములనే తిందువు; సంతసింతువు; వ్యాకుల పడుదువు. అట్టి నీకు పాము పూలమాల- ఈ రెంటిలో సమబుద్ధి యెట్లుండును. కేవలము మన్ను-శిల-బంగారము-వీనియందు సమబుద్ధి గలవాడే ముక్తుడు; సర్వసముడు; సర్వభూతహితుడు; భూతదయాళువు; సర్వాత్మభూతుడు; సర్వభూతహితకరుడు. నా చిత్తమిల్లు పెండ్లములందు తగుల్కొనుటలేదు. నేను స్థితప్రజ్ఞుడనై యేకాంతములో పరబ్రహ్మమున జరింపవలయునన్నదే నా దృఢనిశ్చయము. నిస్సంగుడను నిర్మముడను నిష్పరిగ్రహుడను నిర్ద్వంద్వుడనై మృగముమాడ్కి నాకులలములు ఫలమూలములే తినుచు దిరుగవలయుననియే నా చిర వాంఛితము.

ఓ పార్థివా! నేను గుణములకందనివాడను. నా హృది వైరాగ్యకాంతులతో నిర్మలముగ నున్నది. నాకిక ధనరాసులతో నిండ్లతో మమతలతో బంధించు పెండ్లముతో నేమి ప్రయోజనము? పెక్కు రాగసంకులములగు వివిధాకారముల నెదలో భావించుచునే నీవు ముక్తుడనైతినని తలంతువు. కాని యదంతమును వట్టి డంబాచారమేయని నాకు దోచుచున్నది. నీ కొకప్పుడు ధనచింత మరొక్కప్పుడు శత్రుచింత వేరొకప్పుడు సైన్యచింత గల్గుచుండును గద| ఇంక నీవు నిశ్చింతుడవై యెప్పుడుందువు? మితాహారులు-జితక్రోధులు-నియతవ్రతులునగు వైఖానసమునులు గూడ ఈ సంసారము మిథ్యయని తలంచియు నిందేదో యనుభవించవలసినది గలదని యిందే తగుల్కొందురు. నీ వంశజుల కెల్లరకు విదేహనామము గలదు. ఆ పేరు కుటిలమైనది. అది మీకు తగినది కాదు. మూఢునకు విద్యాధరుడని చీకునకు దివాకరుడని కటికదరిద్రునకు శ్రీనివాసుడని పేరులు పెట్టబడును. కాని యవన్నియు వారికి సార్థకములుగావు గదా! నీ పూర్వజులకు విదేహులను పేరున్నట్లు నేను మున్ను వింటిని. ఆ పేరు నామమాత్రమేగాని కర్మవలన గల్గినది మాత్రముగాదు. తొల్లి మీ కులమున నిమియను రాజుండెను. ఆతడు యాగము చేయదలచి తన కులగురువును బ్రహ్మర్షియునగు వసిష్ఠుని అందులకై ఆహ్వానించగా వసిస్ఠుడు 'నేను ఇంతకు పూర్వుమే యింద్రునిచే నొక యాగమున కాహ్వానింపబడితివి. అతని పని పూర్ణముగావించి తిరిగి నీ యాగమునకు వత్తును. అందులకు వలయు సాధనసామగ్రులు మెలమెల్లగ సమకూర్చుకొనుచుండును' అని పలికెను. వసిష్ఠుడు మహేంద్రుని యాగమునకు వెడలెను. ఇచట నిమియు వేరొక మునిని గురువుగనుంచి జన్నమునకు బూనుకొనెను. అది విని కోపించి వసిష్ఠుడు ఓరీ గురుద్రోహీ! నీ దేహము పతితమగుగాకని నిమిని శపించెను. నీ మేను పడిపోవుగాక! అని నిమిగూడ మునిని శపించెను. ఇట్లిర్వురు నొండొరుల శపించుకొని పతితులైరని నేను మునుపు వింటిని. ఆ రాజు విదేహుడే యైనచో గురువట్టులేల శపించుచు? ఇంతకిదంతయును నా మదికి వింతగ దోచుచున్నది.

జనకుడిట్లనియె: ఓ శుకమునీ! నీవు పల్కినదంతయును యథార్థమే. ఇందసత్యములేదు. ఐనను నా గురువు చెప్పినది వినుము. నీవు నీ తండ్రితోడి సంబంధము విడనాడి యెక్కడికో కాఱడవులకేగదలతువు. కాని యక్కడను నీకు మృగసంబంధముండును. ఇందు సందేహము లేదు. ఆ పంచమహాభూతములెల్లడల వ్యాపించియుండునే| నీకచటగూడ నాహారచింత తప్పదు. దండాజినముల చింతయుడును. అట్లే నాకిచట రాజ్యచింతయు నుండును. దూరదేశముల నుండి వచ్చుటచే నీ చిత్తము వికలమై యున్నది. నేనిచట నే వికల్పములకును సంశయములకును దూరమందుందును. నేను సుఖముగా భుజింతును. హాయిగా నిదురింతును. బద్ధుడనుగాను, స్వతంత్రుడనను తెలివి వెలుగుచేత సంతతము సుఖముందును. నేను బద్ధుడనను శంకచే నీవింత దురపిల్లుచున్నావు. కాన నికనైన నిట్టి యనుమానము మాని స్థిరమతివై సుఖముండుము నేను దేహమను-బద్ధుడను. అనుకొన్నంతకాలము నీకు ముక్తి హుళక్కి. నేనీ ధనరాసులు భవనాలు రాజ్యము నావికావను తలంపున సుఖముందును. 

సూతుడిట్లనియె: ఆ జనకుని హితవచనము లాలకించి శుకుడు సంప్రీతమనంబుతో రాజు ననుమతి బడసి తిరిగి తన తండ్రియాశ్రమ మేగెను. తిరిగి వచ్చిన నందనునిగాంచి వ్యాసుడమితానందమందెను. గుండెకు హత్తుకొని శిరము మూర్కొని సేమమడిగెను. ఆ పవిత్రాశ్రమమందు శుకుడు తన తండ్రితోడ వేదాధ్యయనముచేసి సర్వశాస్త్ర పారంగతుడయ్యెను. రాజ్యమేలుచున్నను నిరహంకృతితో నిర్మమత్వముతో సమదృష్టితో వెలుగొందు జనకునిగాంచి శుకుడు తన తండ్రి యింటనే యుండెను. అతడు యోగమార్గగామి. ఐనను పితరుల కన్నియను పీవరియను నామెను భార్యగ నంగీకరించెను. ఆమెయందు నల్వురు పుత్త్రులను బడసెను. వారు కృష్ణుడు గౌరప్రభుడు భూరి దేవశ్రుతుడన బరగిరి. మహావీర్యుడగు శుకుడు మరల కీర్తియను కూతును బడసి ఆమెను విభ్రాజసుతుడగు అణుహునకిచ్చి పెండ్లి చేసెను. అణుహుని తనయుడు శ్రీమంతుడగు బ్రహ్మదత్తుడు. అతడు మహాప్రతాపి. శుకకన్యకు గలిగిన అతడు బ్రహ్మజ్ఞానముగల రాజయ్యెను. అతడు కొన్నాళ్లకు నారదోపదేశమున యోగమార్గమవలంబించి తన కుమారునకు రాజ్య మప్పగించి బదిరికాశ్రమముజేరి అచట మాయా బీజోపదేశమంది పరిపూర్ణ బ్రహ్మజ్ఞానియయ్యెను.

శుకుడును నారదుని యనుగ్రహమున తన తండ్రి సంగతి వదలి ముక్తిప్రదమగు కైలాస శిఖరము చేరెను. ఆ చోట నతడు సర్వసంగపరిత్యాగియై నిర్వికల్ప సమాధిలో మునింగి సిద్ధాత్మస్వరూపుడై యాగిరిశిఖరమునుండి యూర్ధ్వమున కెగిరెను. వెంటనే గిరిశిఖరము రెండు వ్రయ్యలయ్యెను. అత డాకాశవీధిలో రెండవ భాస్కరుని బోలి దివ్యతేజమున ప్రకాశించెను. శుకుడు నింగికెగయగనే యిట పెక్కులుత్పాతములు సంభవించెను. అంతరిక్షమందలి వాయువును సురర్షులు ప్రశంసించునటులే శ్రీశుకుని మునులు సన్నుతించిరి. ఆ విధముగ సర్వభూతాత్మకుడు గగనసీమలో రెండవ భాస్కరునివలె బ్రహ్మజ్యోతులతో తేజరిల్లుచుండెను. ఇట వ్యాసుడు పుత్త్రవియోగము భరించలేక పుత్రా పుత్రాయని దెసలు మార్మ్రోగ బిట్టాక్రోశించెను. ఆ శుకుడు తపమాచరించిన గిరిశిఖరములందు అతిదీనుడై శోకించు వ్యాసునిగని సర్వభూతమయుడు సర్వసాక్షియగు పరమాత్మ వ్యాసునకు ప్రతిధ్వనితో మారు పలికెను. ఆ గిరిశిఖరములపై నేటికిని ఆ ప్రతిధ్వని స్పష్టముగ వినబడుచుండును. పుత్త్రవిరహమున పరిప్లుతుడై పుత్ర! పుత్త్ర! యని శోకమున మునిగిన వ్యాసుని చెంతకు పరమశివు డేతించి యతని నిట్లు ప్రబోధించెను: 

"ఓ వ్యాసమునీ! శోకింపకుము. నీ నందనుడు యోగవిత్తముడు. అతడకృతాత్ములకు దుర్లభమైన పరమగతిని జేరెను. బ్రహ్మజ్ఞానివగు నీవతనికై బెంగపెట్టుకొనకుము. నీ పుత్త్రునివలన నీకు చిరయశము గల్గినది. 

వ్యాసుడిట్లనియె: మహాదేవా! నేనేమి చేతును? ఎంతకు నా శోకమాగుట లేదు. నా కన్ను లింకను పుత్త్రదర్శనమునకే పరితపించుచు ఎదరు తెన్నులు చూచున్నవి. 

శివుడిట్లనియె: అటులైన నీప్రక్కనే నీకతని చక్కటి నీడ నిత్తెము పొడగట్టుచుండును. ఆ నీడను చూచుకొని శోకము విడుపుము. 

సూతుడిట్లనియె: అంత వ్యాసుడు తన తనయుని కాంతిమంతమైన నీడ గాంచెను. వామదేవుడా విధముగ వరమిచ్చి యచ్చోట నంతర్ధానమందెను. పిమ్మట వ్యాసుడు నిజాశ్రమమున కేగెను. ఐనను వ్యాసుడు తీరని పుత్త్రవియోగభారమున దుఃఖితుడై తపించెను.

అధ్యాయము 20 వ్యాసుని కార్యాచరణము

పంచాంగం

Chapter 18 Janaka instructs Shukun in the path of karma - అధ్యాయము 18 జనకుడు శుకునకు కర్మమార్గ ముపదేశించుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 18

జనకుడు శుకునకు కర్మమార్గ ముపదేశించుట

సూతుడిట్లనియెను : జనకుడు తన గురుపుత్రుడగు శ్రీ శుకుని రాకవిని శుచియై మంత్రిపురోహితులనుగూడి యతని సన్నిధికేగి అతనికి తగిన యాసనమొసంగి పూజించి పాడియావునొసంగి క్షేమసమాచారము లడిగెను. శుకుడును రాజపూలందుకొని తన కుశలము తెలిపి రాజు క్షేమముగూర్చి యడిగెను. కుశలప్రశ్నల పిదప తన యాసనమున స్మాత్మశాంతితో సుఖముగ గూరుచున్న శుకునికాంచి, మనిసత్తమా! నిష్కాముడగు నీవు మా యింటికేమి కోరి వచ్చితివో సెలవిమ్ము అని రాజు ప్రశ్నించెను. 

శ్రీ శుకుడిట్లనియెను : మహీశా! ఆశ్రమములలో గృహస్థాశ్రమ ముత్తమోత్తమమైనది. కనుక భార్యను పరిగ్రహింపుమని మా తండ్రి యనెను. ఇది బంధము గల్గించదని నా తండ్రి యెంతయో చెప్పెను. కాని యతడే సంసార బద్ధుడగుటవలన నేను నా తండ్రి మాట పెడచెవిని బెట్టితిని. ఈ విషయమున నా మనస్సు సందిగ్ధముగ నుండెను. "నీవు విచారింపకుము. మిథిలకు రాజగు జనకుడు విదేహుడు; జీవన్ముక్తుడు; యాజి; లోకవిదితుడు; నిష్కంటకముగ రాజ్యమేలువాడు. ఐనను మాయాపాశబద్ధుడుగాడు. శాంతిగ నేలుబడి సాగించుచున్నాడు. ఆ జనకుని సందర్శించినచో నీ మానసమందలి ప్రమోహము విడివడును. భార్యను జేపట్టుము. నా మాట నమ్ముము. కాదేని రాజునడిగి తెలిసికొనుము. ఆ రాజు నీలోని సందియమును సరిగ దీర్చగలడు. అతని మాటలు విని తిరిగి నన్ను జేరుము." అని పలికెను. నా తండ్రి యాజ్ఞచే నీ పురమునకు వచ్చితిని. నేను మోక్షార్థిని. కర్తవ్య ముపదేశింపుము. ముక్తికి కారణము తపమా? వ్రతమా? యాగమా? స్వాధ్యాయమా? తీర్థసంసేవనమా? ఇందు తగినదేవో తెలుపుము.

జనకుడిట్లనియె: విప్రవర్యా! వినుము. మోక్షకామి ముమ్మెదట నుపనీతుడై వేదాభ్యాసమునకు గురుకులమందు వసింపవలయును. అచట సాంగవేదములను వేదాంతములను చదివి గురుదక్షిణ లొసంగి సమావర్తన సంస్కారమంది కామియై భార్యనుగూడి ప్రజాతంతువును కొనసాగించవలయును. అపుడిత డితర వృత్తులొనర్పరాదు. అగ్ని కార్యములు జరుపవలయును. మితహిత సత్యభాషిగావలయును. నిరాశుడు సదాశుచి సత్యసంతోషి కావలయును. ఆరోగ్యవంతులైన పుత్త్రపౌత్రులతో నభివర్ధిల్లవలయును. కళకళలాడుచుండవలయును. ఆ పిదప తన సర్వస్వమును భార్యను పుత్త్రులకప్పగించి లోని శత్రువుల నరికట్టి తపమునకు వానప్రస్థము స్వీకరించవలయును. పిమ్మట నగ్నుల నాత్మారోహణము చేసికొని పరమవైరాగ్యజ్యోతితో నుద్దీపించుచు శాంతితో సంయమియై తురీయాశ్రమము స్వీకరించవలయును. విరక్తునకు మాత్రమే సంన్యాసాశ్రమమున కధికారము గలదు. ఇది నిజమైన వేదవాక్కు. దీనికిక తిరుగులేదని నా యభిప్రాయము. నరునకు జన్మ మొదలుకొని నలువదియెనిమిది సంస్కారములు గలవని పెద్దలందరు. అందు గృహస్థాశ్రమము నలువదవదని తెలిసినవారందరు. ముముక్షువునకు శమము మున్నగు నెనిమిది సంస్కారములు చెప్పబడినవి. ఒక యాశ్రమమునుండి క్రమముగ రెండవ యాశ్రమము జేరవలయునని శిష్టులందురు.

శుకుడిట్లనియె: జ్ఞానవిజ్ఞానకారణమైన నిర్మలవైరాగ్యతేజము హృదయపూర్వకముగ నిండివెల్గుచుండగ నరుడాశ్రమము లన్నియును క్రమముగ నడుపవలయునా? కాకొకేసారి వనములందుండవచ్చునా? 

జనకుడిట్లనియెను : "ఇంద్రియ వాసనలు మిక్కిలిగ బలవత్తరములైనవి. అవి దురంతములు. ఒక్క చందాన లొంగవు. అపక్వహృదయుని హృదయమున వికారములు రేకెత్తించుచుండును. ఒకవేళ సంన్యాసాశ్రమమున తుష్టికరభోజనము కమ్మనిసెజ్జ పుత్రోత్సాహము గావలయుననెడు కామము గల్గినచో నదెట్లు తీరును? పూర్వవాసనల జాలము లతి బలవత్తరములైనవి. అవి శాంతిగనుండనీయవు. ఆ వాసనలడగుటకు సక్రమముగ నభ్యాసము సాధన చేయవలయును. పైని నిద్రించువాడు క్రింద పడవచ్చునుగాని క్రిందివాడు పతితుడుగాడు! సంన్యాసియై పతితుడైనవానికి మఱి సద్గతులు లేవు. చీమ వేరునుండి కొమ్మల దనుక మెలమెల్లగ ప్రాకి సుఖముగ ఫలమనుభవించగలదు. పక్షి తన పోవుదారి కడ్డుండదని యెగిరియెగిరి తుదకు శ్రమజెందును. కాని, చీమ నడుమ విశ్రమించుచు సుఖముగ ముందునకు సాగును. మనస్సు బలవత్తరమైనది. విషయలంపటులగు మూర్ఖులకు అది వశము గాదు. వారు కామము నణపజాలరు. కావున ఆశ్రమముల క్రమముననే సంస్కృతిని గెలువవలయును. గృహస్థాశ్రమము నందున్నవాడు సైతమాత్మవంతుడు శాంతుడు సుమతి ధీరుడు హర్షశోకరహితుడు సర్వసముడునై యుండవచ్చును. అతడు దిగులొందక విహితకార్యము లాచరించుచు సర్వారంభములు వదలి కల్గినదానికి సంతసించుచు నిత్యతృప్తుడై యుండవచ్చును. అట్లున్నవాడు నిశ్చయముగ ముక్తుడుగాగలడు. నేను రాజ్యమేలుచున్నను జీవన్ముక్తుడనై యే చింతయు చీకును లేకుందును. నన్నేదియు నంటజాలదు. నేను నానా భోగము లనుభవించుచునే పలు కార్యము లొనర్చుచునేయుందును. నీవు నటులే దేనియందును భ్రాంతి పెట్టుకొనకుండుము. దృశ్యవస్తువులన్నియును మాయచే బంధింపబడును. కాన యదృశ్య వస్తువెన్నడును బంధింపబడదు. పంచభూతములును వాని గుణములును దృశ్యములే.

ఆత్మను జేరలేక మనోవాక్కులు వెనుదిరిగివచ్చును. ఆ యాత్మ ననుమానప్రమాణమున గ్రహించవలయును కాని, యది ప్రత్యక్షముగ గనబడదు. నిర్వికారము నిరంజనము బ్రహ్మమునగు ఆత్మ యెట్లు బాధింపబడగలదు? ఈ మనస్సే సుఖదుఃఖముల కన్నిటికి పాదు. ఇది నిర్మలముగనున్న నంతయు చల్లబడదు. ఎల్ల పుణ్యతీర్థములు దిరుగుచు వానిలో మునుగుచున్నను మానసము పవిత్రము గానంతవఱకన్నియు వ్యర్థములే. మనుజుని బందమోక్షములకు చిత్తమే మూలము. అంతేకాని, దేహము జీవాత్మ ఇంద్రియాలివేవియును గావు. ఆత్మ నిత్యము; శుద్ధము; బుద్ధము; ముక్తము. ఇది దేనిచేతను బంధింపడదు. చిత్తమునందలి బంధమోక్షములడగినచో సకలమును శాంతించును. వీడు మిత్రుడు వీడు శత్రుడు వీ డుదాసీనుడు అను భేదములన్నియు మనోగతములే. ఏకాత్మత్వమునందు భేదమన్నదే లేదు. ద్వైతమందే భేదములన్నియు దోచును. అద్వైతమున నంతయు నొకటే. ఈ జీవరూపుడనగు నేను బ్రహ్మమే. ఇందులకు తిరుగన్నది లేనేలేదు. ఈ మాయసంసారమందు తగుల్కొనుటవలననే క్షుద్రబుద్ధులు పుట్టుచుండును. మహాభాగా! ఇదంతయు నవిద్యయే సుమా! విద్యాజ్యోతిలో మాయలు వ్రీలిపోవును. విచక్షణమతులు విద్యావిద్యల భేదమును చక్కగ గుర్తించవలయును. వేడిమిలేనిచో నీడవలని సౌఖ్యమెట్లు దెలియును? అవిద్యయేలేనిచో విద్యాసౌఖ్యమెట్లు బోధపడును? గుణములు గుణములందు భూతములు భూతములందు ఇంద్రియము లింద్రియములందు ప్రవర్తిల్లుచుండగ నికనాత్మకు దోషమెక్కడిది? ఎల్ల వేదములందును దర్మ సంస్థాననార్థమై లోక కల్యాణమునకు నియమములు గలవు. అవియే లేనిచో బౌద్ధమతమునవలె ధర్మచ్యుతి గలిగి తీరని నష్టము వాటిల్లును. దానిచే వర్ణాచారములు చెడిపోవును. కావున వేదోక్తమార్గ మనుసరించుట శుభప్రదము. 

శుకుడిట్లనియె: ఓ మనుజేశ్వరా! మీరింతగ ప్రబోధించినను నాసందియమేలొకో తీరుటలేదు.
వేదధర్మములందు హింసయుండును. అది యధర్మము. అట్టి వేదధర్మమెట్లు ముక్తినీయగలదు? సోమపానము పశువధ మాంసభక్షణము ప్రత్యక్షముగ ననాచారములు. సౌత్రామణియజ్ఞమున సురాపానము జూదము నానావ్రతములు ఇవన్నియును చెప్పబడినవి. తొల్లి శశబిందువను రాజు గలడు. అతడు ధర్మిష్ఠుడు; వదాన్యుడు; సత్యవాది; యాజియని వింటిని. అతడు ధర్మసేతు సంరక్షకుడు పెడత్రోవలు బట్టువారిని గట్టిగ శాసించువాడు. భూరిదక్షిణ లొసంగి పెక్కు యాగము లొనరించినవాడు. అతని యాగపశువుల తోళ్లు వింధ్యాచలమట్లు గుట్టగ పెరిగినవి. వానిపై మొయిళ్ళు గురియుటచే నచటినుండి చర్మణ్వతీనది ప్రవహించినది. ఆ రాజు స్వర్గసీమకేగెను. అతని కీర్తి భూమిపై నిలిచినది. కాని యిటువంటి వేదధర్మములు నా మతి కెక్కవు. స్త్రీలతోడి కలయికవలన నరునకు క్షణిక సుఖము గల్గును. ఆ కొలది సుఖమునకే వాడు వెంపరలాడుచుండునతడు జీవన్ముక్తుడగు టెట్లు? 

జనకుడిట్లనియె: "యాగమందు జరుగు హింస హింసయనబడదు. కామ రాగములతో జేసినచో నదే హింసయగును. నిప్పులో పచ్చి తడి కట్టెలు వేసినచో నిలువరాని పొగ వెలువడును. ఎండుకట్టెలు వేసినచో నవి గనగన మండును. వేదోక్తమగు హింస నహింసగ నెఱుంగుము. రాగులకదే హింసయగును. కాని విరాగులకు గాదు. అహంకార మమకారములు విడనాడి చేసిన పనిని వేదవిదులగు మనీషులు ఆకృతమందురు. రాగముతో కర్తృత్వ బుద్ధి గృహస్థులు చేయు హింస హింసయే అగును. రాగ గర్వములు కర్మసంగము వదలి విజితాత్ములును ముముక్షులునగువారు చేసిన కర్మము హింసయగును. అకర్మయగును."

అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము

పంచాంగం

Chapter 17 The Shuku Went to Mithila - అధ్యాయము 17 శ్రీ శుకుడు మిథిలకు జనుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 17

శ్రీ శుకుడు మిథిలకు జనుట


సూతుడిట్లనియె : ఈ ప్రకారముగ మహామనస్వియగు శుకుడు పలికి చేతులు జోడించి తన తండ్రి పదకమలములకు నమస్కరించి మిథిలా ప్రయాణమునకు తరలి తండ్రి కిట్లనియెను : 

"ఓ మహాభాగా! తండ్రీ! నీ మాట నొప్పుకొంటివి. జనకుడేలు విదేహపురిని జూడనేగుటకు నా కనుమతిమ్ము. ఆ రాజు దండములేకయే రాజ్యమెట్లు చేయును? దండనీతిలేనిచో లోకము ధర్మమున వర్తించదు. ధర్మసంస్థాపనకు దండనీతియే మూలమని మన్వాదులు వాక్రుచ్చిరి. అయ్యో! ఆ రాజు దండములేకయే రాజ్యమెట్లు చేయునాయని నా సందేహము. జనకుని ప్రవర్తన నా తల్లి వంధ్యయనినట్లు నాకు భాసించుచున్నది. దాని నిజ మెఱుంగుటకు మీ యనుమతితో అట కేగుచున్నాను. 

సూతు డిట్లనియెను : ఆ శుకు డహంకారమడగిన యాత్మనిష్ఠుడు నిర్లిప్తుడు జ్యోతిఃసాగరమున దేలియాడువాడు. అట్టి శుకుని తన కౌగిట జేర్చుకొని వాసుడిట్లు పలికెను: 

"శుకా! నీకు కల్యాణమగుత. చిరంజీవివిగమ్ము. తిరిగి వత్తునని మాట యిచ్చి క్షేమముగ పోయి రమ్ము. నీ వచ్చటినుండి మరల ఇచ్చటికే రమ్ము. ఇంకొక చోటికి నీవెన్నడును పోరాదు. నీ ముఖకమలమును గాంచకున్నచో నాకు శాంతిగ మనుగడ సాగదు. నిన్నొక్కక్షణమేని చూడకున్నచో నా మనస్సు వ్యథజెందును. నాకు నీవు ప్రాణములోని ప్రాణము. జనకుని సందర్శించి నీ శంక బాపుకొని తిరిగి వచ్చి యిచ్చటనే వేదాధ్యయన పరుండవై సుఖముండును. 

సూతుడిట్లనియె : వ్యాసుని పలుకులు విని శుకుడు తన తండ్రికి ప్రదక్షిణ నమస్కారము లొనరించి వింటినుండి వెడలిన యమ్మువలె త్వరితముగ బయలుదేరెను. అతడు మార్గమధ్యమున పాడిపంటలు వెల్లివిరిసిన దేశములను దేశవాసులను ఫలపుష్పముల నలరు వనములను తపించు తాసనులను దీక్షితులగు యాజకులను యోగాభ్యాసపరులగు పరమయోగులను వననివాసులగు వానప్రస్థలును శైవ వైష్ణవ సౌర శాక్త పాశుపత మతస్థులను వేరువేర దర్శించుచు పయనము సాగించుచుండెను. ఆ మహాత్ముడు రెండేండ్లకు మేరుగిరిని నొక్క యేడాదిలో హిమగిరిని దాటి మిథిలవైపు సాగెను. అతడా నగరి ప్రవేశించి సకలకళా సమృద్ధులను సదాచార సంపన్నులను సందర్శించెను.

రాజద్వారము జేరగనే రాజభటు లతనిని నిలువబెట్టి "నీవెవరవు? ఎటనుండి వచ్చితివి? నీకిందేమి పని?" యని ప్రశ్నలు గురిపించిరి. ఐనను శుకుడు వారికి మారు పలుకలేదు. ఆ మునిబాలుడు వచ్చుపోవువారికి బాటవదలి తానొక ప్రక్కగ మిన్నువిఱిగిమీదపడినను కదలకమెదలక స్థాణువువలె నుండెను. నడుమనడుమ వింతనవ్వులు నవ్వుచుండెను. 

ద్వారపాలు డిట్లనియె : బ్రాహ్మణోత్తమా! నీవు మూగవా? ఇచ్చటి కేపనికై వచ్చితివి? ఎవ్వరేని ఏపనియులేకూరకే రారని నాకు తెలియును. రాజునానతిలేనిదే యెవ్వరును నగరము ప్రవేశింపరాదు. క్రొత్తగవచ్చినవాని కులశీలములెఱుగక లోనికి వెళ్ళనీయరు. నీవు వేదవిదుడవు. వైరాగ్యతేజమున వెలుగొందు బ్రాహ్మణుండవు. నీ కులమును వచ్చిన పనిని దెలిపి యథేచ్ఛగ నరుగుము. 

శుకుడిట్లనియె: "నా వచ్చినపని నీ మాటలవలననే తీరినది. విదేహనగరమున ప్రవేశము దుర్లభమని తెలియుచున్నది. నా మతిమాంద్యము వలన రాజును జూడవలయుననెడి ఆసక్తితో నేనింతదూరము శ్రమపడి యేతెంచితిని. నేను నా తండ్రి మాటచే మోసపోతిని. ఇపుడెవరిని దూషింతురు? నేజేసికొన్న కర్మము కొలది ఇట్లు పర్యటించుచున్నాను. ధనాశయే పురుషుని ముప్పుత్రిప్పలు పెట్టును. నాకా యాస లేకున్నను విభ్రాంతిచే మోసపోయి యింతదూరము వచ్చితిని. నరుడు మోహపాశమునందు జిక్కుకొనకున్నచో నతనికి నిత్యసుఖము చేకూరును. నేనే కోర్కులులేనివాడనే. ఐనను మోహజలధిలో మునుగుచున్నాను. ఎక్కడి మేరుగిరి! ఎక్కడి మిథిలాపురి!! ఇంత దూరమిట్లు కాలినడకతో వచ్చుటేమి? నా రాకకు ఫలితమేమి? నన్నావిధిలీల వంచించినదని తోచుచున్నది. మేలైనను కీడైనను ప్రారబ్ధ మనుభవించక తీరదు. ఆ ప్రారబ్ధమునకు ప్రయత్నముతోడై యెల్లపనులను చేయించును. ఇంత శ్రమపడివచ్చితినేకాని ఇట నొకవేదముగాని యొకతీర్థముగాని లేదు. ఇంతకును విదేహరాజు పురమున ప్రవేశము దుర్లభము" అని శుకుడు పలికి మౌనమూనెను. ప్రతీహారి శుకుని జ్ఞాన సంపన్నునిగ బ్రాహ్మణశ్రేష్ణునిగ దెఇసికొనెను. ద్వారపాలుడా మునితో సామవచనములనిట్లు పలికెను: 

"ద్విజసత్తమా! నీకు పనియున్న చోటికిక స్వేచ్ఛగ నరుగుము. నిన్ను నేనడ్డగించిన నా యపరాధము క్షమింపుము. ముక్తపురుషులకు క్షమయే బలము.

శుకుడినట్లనియె : 'ప్రతీహారీ ! ఇందు నీ దోషమావంతయును లేదు. నీవు పరతంత్రుడవు. సేవకుడు తన ప్రభు నానతి నిర్వహించి తీరవలయును. నన్ను నీవు వారించుటవలన రాజును సైతము నిందించుటకు వీలులేదు. వీడు దొంగ వీడు శత్రువని చక్కగ నెఱుంగుట పండితుల లక్షణముగదా! ఇంతకు నిచ్చట నాదే పొరబాటు. పొరుగింటకేగుట లఘుత్వమునకు కారణము.' 

ప్రతీహారి యిట్లు పలికెను : ద్విజవరా! అందఱి మేలుగోరువానికి సుఖమేది? దుఃఖమేది? ఏది కార్యము? ఎవడు కర్త? ఎవడు శత్రువు? నాకిది తేటపఱచుము. 

శుకుడిట్లు వచించెను: లోకములన్నిటియందు రెండు మార్గములు గలవు. మనుజులు రెండు తెగలు. ఒకడు రాగి, వేరొకడు విరాగి. విరాగులును ముత్తెఱంగులవారు. తీవ్రవిరాగి-మధ్యమవిరాగి-మందవిరాగి అని. ఇక రాగులు రెండు విధములు. మూర్ఖుడు చతురుడునని. చాతుర్యము రెండు తరగతులు: శాస్త్ర చాతురి-బుద్ధిచాతురియు. బుద్ధియు యుక్తము-అయుక్తము నని రెండువిధములు. 

ప్రతీహారి యిట్లనియె : బ్రాహ్మణవర్యా! నీవు చెప్పినదంతయు నాకు తికమకగనున్నది. నరిగ వివరించి నిజమేదో తెలుపుము. 

శుకుడిట్లు వచించెను: ఈ సారములేని సంసారమం దనురాగముగలవాడు రాగి. అట్టివాని కెన్నెన్నియో సుఖదుఃఖములు గల్గుచుండును. నరుడు తనకు ధనము పెండ్లము కొడుకులు ఘనవిజయము అభిమానము గలిగినచో సుఖముగాంచును. అవి తనకు వేరైనవాడు దుఃఖపడును. ఎవరికి దేనివలన సుఖముగలుగునో వారా సుఖోపాయము నాచరించవలయును. దానికి విఘ్నముగల్గించువారిని శత్రులుగ నెన్నవలయును. రాగవంతునకు మిత్రుడు సుఖము గలిగించును. ధీరుడై లోచూపుగలవాడెన్నడును మోహభ్రాంతిలో మునుగడు. మూర్ఖుడే యెల్లకాలము మోహమందును. విషయవిరక్తుడు జ్ఞాని స్వాత్మనక్తుడునగు. అధ్యాత్మజ్ఞాని స్వాత్మసక్తుడునగు అధ్యాత్మజ్ఞాని నిత్యుడై తత్త్వ జ్ఞానార్థచింతనమును చేయుచు నమృతత్వముగోరి యేకాంతసేవలో ప్రత్యగాత్మను సందర్శించవలయును. అదే యతనికి బ్రహ్మానందము చేకూర్చును. ఈ మాయా సంసారమందలి మాటలన్నియును వికారములు. దుఃఖప్రదములు. మేలుగోరు యథార్థవాదికి లోకమే విరుద్ధమగును. కామము క్రోధము మాంద్యము మున్నగునని నరు ననేకరీతుల వెన్నాడు వైరులు. ఈ లోకములన్నిటిలో తన యాత్మసుఖమునకు తానే బంధువు. ఆత్మానందమునకు సాటియగు సుఖము మరేదియును లేదు.

సూతుడిట్లనియె: శుకుని ప్రబోధము విని ప్రతీహారి యతనిని మహాజ్ఞానిగ నెఱిగి చక్కని రాజమార్గమున నతనిని లోనికి ప్రవేశపెట్టెను. అంత శుకుడా నగరమందు పెక్కు విధముల ద్రవ్యరాసులను పోసి యమ్ముకొనువారు రాగద్వేషకామలోభమోహాకులులు కీచులాడుకొనువారునను మూడువిదముల మనుజులను గాంచుచు ముందునకు సాగి రాజమందిరములోనికి ప్రవేశించెను. అతడు ప్రభవలె నడచు రెండవ సూర్యుడో యన పరమవైరాగ్యమున భాసిల్లుచుండెను. లోనగూడ ప్రతీహారులు శుకునడ్డగించగా నతడు ద్వారమందే స్థాణువువలె కదలక మెదలకుండి ఆత్మమోక్షముగూర్చి విచారించు చుండెను. నీడను వేడిమిని సమముగ చూచు నా మహాతపుడు స్థాణువు పగిదినుండి వృత్తులకు మూలమును వెదకుచు నిశ్చల సమాధిలో మునింగెను.

ఒక్క ముహూర్తమాత్రముననే జనకుని మంత్రివచ్చి చేతులు జోడించి శుకుని రాజమందిరములోని రెండవ ద్వారమున ప్రవేశింపజేసెను. మంత్రి శుకునకందు విరిసిన మనోహరములైన తరువులు వనములు జూపి యతిథిమర్యాదలు జరిపెను. రాజసేవా పరాయణులు గేయ గానకళాశ్రీలు కామశాస్త్ర విశారదలునగు వారస్త్రీలను శుకునకు చేయవలసిన సేవలన్నియుచేయ నియోగించి మంత్రి తానందుండి బయటకు వచ్చెను. శుకుడందే యుండెను. ఆ కాంతలు శుకునకు వీడని భక్తితో సేవలుచేసి ఆయాకాలములకు దగిన వివిధములగు వంటకములతో శుకుని తనిపిరి. ఆ శుకుని గాంచి వారు కామమోహితులైరి. ఆ యంతిపురము మించుబోడులా విరాగికి తమ యుద్యానవనమందలి రమ్య విషయములను కలయజూపిరి. ఆ శుకుడు యువకుడు మనోహరుడు; మృదుభాషి; అపరమన్మథుడు; అతనిని గాంచగనే యాలలనల మనస్సులు కామవశమైనవి. కాని ఆ మరునిముసమందే వారతనిని విజితేంద్రియునిగ నెఱింగి పరమభక్తితో పూజలు చేసిరి. పరిశుద్ధాత్ముడగు శుకుడును వారిని తల్లులుగ భావించెను. ఆ శుకుడు ఆత్మారాముడు విజితాత్ముడు; వంతగాని సంతసముగాని చెందకుండెను. ఆ యువతులలోని మదసరాగములు గనియు విరాగభావముతో నాత్మసంస్థితి జెందెను. అపుడా కాంతలతనికి మేలైన వస్త్రములతో చక్కగ నలంకరించిన పానుపమర్చిరి. దానిచెంత మధురరసపదార్థములునిచిరి. శుకుడు పాదములు కడుగుకొని దర్భలుచేతబట్టి శ్రద్ధతో పశ్చిమసంధ్య నుపాసించి నిర్మలనిశ్చలచిత్తమున స్వాత్మసమాధియందు మునింగెను. అతడొక జాము ధ్యానమునుండి నిద్రించెను. రెండు జాములు నిదురించిన పిమ్మట మేల్కొనెను. అతడు మరల నపరరాత్రమున నాత్మధ్యానమగ్నుడయ్యెను. కొంతసేపటికి లేచి స్నానమొనర్చెను. ప్రాతఃక్రియలు నిర్వర్తించెను. స్థితప్రజ్ఞుడై వైరాగ్యజ్యోతితో బ్రహ్మతేజమున వెలుగుచుండెను.

అధ్యాయము 18 జనకుడు శుకునకు కర్మమార్గ ముపదేశించుట

పంచాంగం

Avadhuta - Yadusamvadamu - అవధూత - యదుసంవాదము

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము -  అవధూత - యదుసంవాదము పద్మనాభుడైన శ్రీకృష్ణుడు ఉద్ధవుని మీద గల కూరిమితో ఇలా చెప్పాడు. ఒకరోజు యదురాజు దగ్గరకు ఎక్...