అత్య్రగస్య సంవాదము, పురంజయోపాఖ్యానము
జనకమహారాజు మరల ఇట్లడిగెను. మునీంద్రా! సర్వపాపములను నశింపజేయు
నదియు, సౌభాగ్యప్రదమగు కార్తిక మహాత్యమును మరియు వినవలెననుకోరిక కలదు
గాన చెప్పుము.
వశిష్ఠమునిపల్కెను. రాజా! వినము. కార్తిక మహాత్యమును గురించి
అగస్యమునికిని, అత్రిమహా మునితో జరిగిన సంవాదము ఉన్నది. అది చాలా ఆశ్చర్యకర
మయినది దానిని నీకు చెప్పెదను.
అత్రి మహాముని ఇట్లు పల్కెను. అగస్త్యమునీంద్రా! లోకత్రయోపకారము కొరకు
కార్తిక మాహాత్యబోధకరమైన హరికథను జెప్పెదను వినుము.
అగస్త్యుడడిగెను. విష్ణ్వాంశ
సంభూతుడవైన యో అత్రిమునీశ్వరా! సద్ధర్మశ్రవణమున కార్తిక మాసము కీర్తించబడినది.
కార్తీక మాస ధర్మమును వినగోరితిని గాన చెప్పుము.
అత్రిముని ఇట్లు చెప్పెను. ఓ అగస్త్య మునీంద్రా! బాగు బాగు. నీ ప్రశ్న పాపనాశకరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసితివి. చెప్పెదను వినుము.
కార్తిక
మాసముతో సమానమైన మాసములేదు. వేదముతో సమానమైన శాస్త్రములేదు. ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసములేదు. హరితో సమానమైన దేవుడులేడు.
కార్తిక మాసమందు
స్నానము, దీపదానము, హరిపూజయు చేయువాడు ఇష్టార్థమును బొందును.
విష్ణుభక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ఠ లక్ష్మి, విజ్ఞానము, సర్వత్రవిజయము పొందుదురు. ఈ విషయమును గురించి పూర్వచరిత్ర
ఒకటి కలదు.
త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు, సూర్యవంశసంభూతుడు
పురంజుయుడను ఒకరాజు గలడు.
ఆ పురంజయుడు కొద్దికాలము ధర్మమార్గమందు
ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధినశించి దుష్టపరాక్రమయుక్తుడై మహాశూరుడై
సత్యమును, శౌచమును విడిచి దేవ బ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో
ద్వేషించి లోభియును హింసకుడునునై బంగారమును దొంగిలించు వారితో స్నేహము
కలిగి ఇష్టుడై కూడియుండెడివాడు.
రాజు యీ ప్రకారముగా అధర్మపరాయణుడు కాగా అతని సామంత రాజులు,
కాంభోజ, కురురాజాదులు అనేకమంది సింహబలులతో గూడి గుఱ్ఱములు, ఏనుగులు,
రథములు, కాల్బంటులు అను నాలుగు రకముల సేనలతోవచ్చి అయోధ్యాపట్టణము
చుట్టును చెఱకు పానకమునకు తేనె టీగలవలె శిబిరాలతో చుట్టుకొనిరి.
పురంజయుడు
విని శీఘ్రముగా చతురంగబలములతో పట్టణము నుండి బయటకు వచ్చెను.
పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో, ధ్వజముతో, స్వయంప్రకాశమానమును, అనేక దిగ్విజయములను జేసినదియు, శస్రాస్త్ర పూరితమును, మహాచక్రయుతమును, మంచి గుఱ్ఱములతో గూడినదియునైన సూర్యదత్తరథమునెక్కి గజ, రథ,
తురగ, పదాతులనెడి, చతురంగబలముతో పురద్వారము నుండి శత్రుసైన్యములో
ప్రవేశించి భేరీతూర్య నినాదములను, శంఖగోముఖనాదములను ధనుష్టంకారధ్వనులను
ఒక్క మారుగా ఉఱుముల చప్పుడువలె ధ్వనిచేయించెను.
No comments:
Post a Comment