Thursday, November 26, 2026

vaastu prakaram pradhana dwaramula erpaatu - వాస్తు ప్రకారం ప్రధాన ద్వారముల ఏర్పాటు

వాస్తు ప్రకారం ప్రధాన ద్వారముల ఏర్పాటు

మనుష్య ద్వారము
ఇంట్లో నుండి మనం వీధిలోకి నడిచే నడక మన జీవితాన్నే మారుస్తుంది. ఉచ్ఛస్థానం నుండి మన నడక సాగితే బ్రతుకు ఉన్నతమవుతుంది. నీచస్థానం నుండి నడక సాగితే బ్రతుకూ నీచస్థితికి చేరుతుంది. అందుకని ప్రధాన ద్వారం విషయంలో తగిన జాగ్రత్త తీసుకుంటే దాని మంచి ఫలితాలు జీవితాంతం మనకు కనిపిస్తాయి అని వాస్తు నిపుణులు అంటున్నారు.

ఇంటికి ఉన్న నాలుగు భుజములను ఈశాన్య, నైరుతి, ఆగ్నేయ, వాయువ్యం మూలలు కాక తొమ్మిది సమభాగములుగా విభజింపబడినవి. ఆ తొమ్మిది సమభాగములుగా స్థానాలుగా సూచింపబడ్డవి. ప్రతి దిక్కులోనూ 'మనుష్య ద్వారం' సూచించబడినది. దాని ద్వారానే మనుష్యులు నడక సాగించాలి.

దేవతా ద్వారం నుండి కాని, పశుద్వారం నుండి గాని మనుషులు సంచారం చేయకూడదు. 'సింహద్వారం' నిర్మించటం జరిగితే ఆ భుజంలో లేదా ఆ దిక్కులో 'మనుష్యద్వారం' అని సూచించిన దగ్గరే సింహద్వారాన్ని నిర్మించాలి అని వాస్తు నిపుణులు అంటున్నారు.

పంచకాలు అంటే ధనిష్ట, శతభిషం, పూర్వా భద్రం, ఉత్తరాభాద్రం, రేవతి నక్షత్రాలలో ఇంటికి రంగులు వేయకూడదు. నీటికి సంబంధించిన పనులు చేయకూడదు. ద్వారాలు, తలుపులకు సంబంధించిన పనులు చేయటం అశుభాన్నిస్తాయి.

'గృహ ముఖ ద్వారములు సూచించు భాగచక్రము’ పై చక్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఉత్తర ముఖ ద్వారాన్ని చక్రంలో సూచించినట్టు కట్టుకుంటే, ఈశాన్యానికి దగ్గరలో వున్న శుక్రస్థానం నుండి మనుషుల నడక మంచిదే. శుభప్రదం.

దక్షిణ ముఖద్వారాన్ని ఈ చక్రం ప్రకారం అమర్చ వలసి వస్తే అక్కడున్న శుక్రస్థానంలో అమర్చాలి. అప్పుడు నడక ‘దక్షిణనైరుతి' వైపు సాగుతుంది. ఈ నడక మంచిది కాదు.

తూర్పు ముఖ ద్వారాన్ని ఈ చక్రం ప్రకారం అమర్చవలసి వస్తే అక్కడున్న శుక్రస్థానంలో అమర్చాలి. అలా నడక 'తూర్పు ఆగ్నేయం'కి దగ్గరలో సాగుతుంది. ఇది కూడా అంత మంచిది కాదు.

పడమరలో ముఖద్వారాన్ని 'కుజస్థానం'లో అమర్చినప్పుడు నడక ‘పడమర నైరుతి' వైపు సాగుతుంది. ఇది కూడా మంచిది కాదు. పై విధంగా వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ప్రధాన ద్వారముల ఏర్పాటు
తూర్పు ముఖద్వారము గృహం : గృహానికి తూర్పున ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేస్తే అది 'తూర్పు' ముఖద్వారం అవుతుంది. ఆ గృహానికి తూర్పున ఉన్న గదిలోపలి కొలతను సగం చేసి ఉత్తరము వైపు వచ్చే సగభాగంలో ప్రధాన ద్వారం ఏర్పరచుకుంటే అది ఉచ్ఛ స్థానంలో అమరి శుభ ఫలితాలనిస్తుంది.

ఉత్తర ముఖద్వారము గృహం : గృహానికి ఉత్తరాన ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేస్తే అది 'ఉత్తర ముఖ ద్వార గృహము' అవుతుంది. ఆ గృహానికి ఉత్తరాన ఉన్న గదిలోపలి కొలతను సగం చేసి తూర్పు వైపు వచ్చే సగభాగంలో ప్రధాన ద్వారాన్ని ఏర్పరచుకోవడం మంచిది.

పడమర ముఖద్వార గృహం : గృహానికి పడమర ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేస్తే అది ‘పడమర ముఖద్వార గృహము' అవుతుంది. ఆ గృహానికి పడమర ఉన్న గది లోపలి కొలతను సగం చేసి ఉత్తరము వైపు వచ్చే సగభాగంలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకోవడం మంచిది.

దక్షిణ ముఖద్వార గృహం : గృహానికి దక్షిణమున ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేస్తే అది 'దక్షిణ ముఖద్వార గృహము' అవుతుంది. ఆ గృహానికి దక్షిణాన ఉన్న గదిలోపలి కొలతను సగం చేసి తూర్పున వచ్చే సగభాగంలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకోవాలి. పైన చెప్పిన పద్ధతుల్లో ప్రధాన సింహద్వారం 'ఉచ్ఛం'లో సరిపోతుంది. తూర్పున సింహద్వార 'ఉచ్ఛ' స్థానంలో వుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.

vaastu prakaram mee perunu batti inti simha dwaramu - వాస్తు ప్రకారం మీ పేరును బట్టి ఇంటి సింహ ద్వారము

వాస్తు ప్రకారం మీ పేరును బట్టి ఇంటి సింహ ద్వారము

"సర్వాంగే నయనం ప్రధానం "అనగా అన్ని దేహ అంగములలో కళ్ళు ప్రధానమైనవి అదే విధంగా "గృహన్గే సింహ ద్వారం ప్రధానం" అంటే ఇంటికి సింహ ద్వారం చాలా ప్రధానం అని అర్ధం.

అతి ప్రాచీనమైన భారత దేశము శిల్ప కళలకు, వాస్తు వైభవంనకు ప్రఖ్యాతి వహించింది. భారత దేశ నాగరికత అద్భుతమైన వాస్తు వైభవమునకు అద్దం పడుతుంది.

భారత దేశంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, మహా నగరాలు మహా సౌధాలు శిల్పకళలతో నిండి వాస్తు శాస్త్ర విజ్ఞానాన్ని, మన పూర్వికుల శిల్పకళా మరియు నిర్మాణ సామర్ధ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ అందరిని అబ్బుర పరుస్తున్నాయి.

ఇలా పురములు, దివ్య సౌదములు మరియు సాధారణ గృహములు ఎన్నో కట్టడాలు వస్తువులుగా తనయందు కలిగి వున్నది కావునే భూమికి దేవనాగరి యందు "వాస్తు” అని కూడా పేరుగలదు. అలాంటి ఎన్నో విషయములను తెలియజేయు విజ్ఞానమే “వాస్తుశాస్త్రము అని పిలవబడినది.

"దిశ కుదిరి దశ కుదురు" నను సామెత తెలిసిందే ! దిశ అనగా "తాను నివసించు దిక్కు, స్థలము, గృహము" అని అర్ధము! దశ అనగా జాతకరీత్యా ప్రాప్తించు అభివృద్ధి, శుభ యోగములు ! కనుక గృహ నిర్మాణము తలపెట్టిన వారు శాస్త్ర సమ్మతముగా గృహం నిర్మించుకోవాలి.

నివసించే గ్రహము సొంతమైన కాకపోయిన అందు వసతులు నివసించువారు అనుభవించునట్లు, అందలి దోషములను కూడా యజమానితో పంచుకోనవలసిందే. అలాగే మంచిని కూడా నివాసము ఉండేవారు యజమాని అనుభవిస్తారు.

ఎవరు జన్మించిన గృహము వారికి అత్యంత శుభము, కాని కొన్ని సందర్భాలలో వేరొక ఇంటిలో నివసించవలసి రావటం లేక నూతన గృహమును నిర్మించటం జరుగుతుంటుంది.

సందర్భములలో నిర్మించబోయే లేక నివసించబోయే గృహము మనకు మంచిదా? కాదా? అని తెలుసుకొనటాన్ని “వాస్తుశాస్త్రం” లో అర్వణము అని అంటారు. అర్వణము రెండు రకములుగా లెక్కించవచ్చు.

1. జన్మ నక్షత్రము రీత్యా

2. నామ నక్షత్రము రీత్యా

నామ నక్షత్రమును బట్టి గృహము యొక్క సింహద్వారము ఏ దిక్కున ఉండాలో నిర్ణయించటం ఎక్కువగా వాడుకలో వున్నా శ్రేష్టమైన విధానంగా చెప్పవచ్చు.

తెలుగు తమిళ మలయాళ కన్నడ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల వారు నక్షత్రాన్ని బట్టి మరియు రాశిని బట్టి కూడా తెలుసుకుంటారు.

ఈ విధానాలు అంత ఎక్కువ వాడుకలో లేకపోవటం గమనించవచ్చు. ముందుగా పేరుకు గల మొదటి అక్షరం ప్రకారం “దిశావర్గ" నిర్ణయం చేసుకోవాలి.

సాధారణంగా దంపతులు అనగా భార్యాభర్తలు గృహ నిర్మాణం తలపెడితే సింహద్వార నిర్ణయం ఇంటి యజమాని అనగా భర్త యొక్క పేరును బట్టి మాత్రమే చూడాలి. భార్యాభర్తల ఇద్దరి పేరుతో చూడవలసిన అవసరం లేదు అని గమనించవచ్చు.

భూమి భార్య పేరున కొనుగోలు చేసినప్పటికీ భర్త యొక్క పేరును బట్టి మాత్రమే సింహ ద్వారం నిర్ణయించాలి.

"దిశావర్గ" నిర్ణయం
తెలుగు భాషలో మొత్తం అక్షరాలు 51 వున్నవి. వీటిని 8 భాగాలుగా విభజించినారు. వీటినే "అష్టవర్గులు" అని పిలుస్తారు.

మొదటది "అ" వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో "అ, ఆ, ఇ, ఈ ఉ, ఊ, ఋ, ౠ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ, అం, అః" అనే 16 అక్షరములు ఉన్నవి. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు "అ వర్గు" నకు చెందిన వారుగా పరిగణింపబడతారు. వీరికి "తూరు దిక్కు" స్వదిశ అవుతుంది.

రెండవది "క" వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో "క, ఖ, గ, ఘ, ఙ" అనే 5 అక్షరములు ఉన్నవి. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు "క వర్గు" నకు చెందినవారుగా పరిగణింపబడతారు. వీరికి "ఆగ్నేయ దిక్కు" స్వదిశ అవుతుంది.

మూడవది "చ" వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో "చ, ఛ, జ, ఝ, ఞ" అనే 5 అక్షరములు ఉన్నవి. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు "చ వర్గు" నకు చెందినవారుగా పరిగణింపబడతారు. వీరికి "దక్షిణ దిక్కు" స్వదిశ అవుతుంది.

నాల్గవది "ట" వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో "ట, ఠ, డ, ఢ, ణ" అనే 5 అక్షరములు ఉన్నవి. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు "ట వర్గు" నకు చెందినవారుగా పరిగణింపబడతారు. వీరికి " నైరుతి దిక్కు" స్వదిశ అవుతుంది.

ఐదవది "త" వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో "త, థ, ద, ధ, న" అనే 5 అక్షరములు ఉన్నవి. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు "త వర్గు" నకు చెందినవారుగా పరిగణింపబడతారు. వీరికి " పడమర దిక్కు" స్వదిశ అవుతుంది.

ఆరవది "ప" వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో "ప, ఫ, బ, భ, మ" అనే 5 అక్షరములు ఉన్నవి. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు "ప వర్గు" నకు చెందినవారుగా పరిగణింపబడతారు. వీరికి " వాయవ్య దిక్కు" స్వదిశ అవుతుంది.

ఏడవది "య" వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో "య, ర, ల, వ" అనే 4 అక్షరములు ఉన్నవి. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు "య వర్గు" నకు చెందినవారుగా పరిగణింపబడతారు. వీరికి "ఉత్తర దిక్కు" స్వదిశ అవుతుంది.

ఎనిమిదవది "శ" వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో "శ, ష, స, హ, ళ, క్ష" అనే 6 అక్షరములు ఉన్నవి. వీటిలో ఏ అక్షరము తమ పేరునకు మొదట ఉన్నా అట్టివారు "శ వర్గు" నకు చెందినవారుగా పరిగణింపబడతారు. వీరికి "ఈశాన్య దిక్కు" స్వదిశ అవుతుంది.ఈ ప్రకారముగా వారి వారి పేరును బట్టి వారు ఏ వర్గమునకు చెందినవారో తెలుసుకోవాలి. తద్వారా సింహద్వారము దిశను నిర్ణయించుకోవాలి.

దిశావర్గ ఫలితములు
ప్రతివారికి వారి జన్మ గృహము శుభము, తన జన్మ గృహము కాక మరియే ఇతర కారణముల వల్లనైన ఇంకో గృహమున నివసించ వలసివచ్చిన తప్పక "సింహద్వారం దిశను” శాస్త్రరిత్య నిర్ణయించుకొని నివసించుట అత్యంత శుభము.

తన స్వదిశలో సింహద్వారము ఉండుట అత్యంత శుభము. స్వదిశ మొదలుకొని 1,3,7 దిశలు కూడా అత్యంత శుభములే. 2,4,6 దిశలు మద్యమ లేక మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి. 5,8 దిశలు ఎంచుకొనిన బాధలు, ఇబ్బందులు, చింతలు, ధనవ్యయం, అనారోగ్యం అధికమగును! తద్వారా దరిద్రమును అనుభవించవలసి వచ్చును. ఫలితములు వరుసగా

స్వదిశ అనగా

1) పుష్టి

2) సమం

3) మిత్ర

4) సమం

5) శత్రు

6) సౌఖ్యం

7) భోగం

8) వ్యయం

వీలైనంత వరకు విదిక్కులైన "ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం" ల వైపు సింహద్వారము ఉండకుండా చూచుట శుభము. గృహమునకు “గేహము" అని పేరు ఉన్నది! వాస్తు పురుషుని స్వరూపము మానవ దేహము లాంటిది. అందుకు వాస్తుపురుషుని పూజ అంటే తనచే కట్టబడిన గృహమునకు పూజ అని అర్ధము.

గృహమునకు సింహద్వారము ఎంత ప్రధానమో, గృహము శల్య వాస్తు మరియు ఇంటి లోపల వున్న గదుల నిర్మాణము వాటి స్థితి కూడా అంతే ప్రధానము.

వీధి చివర లేదా రోడ్డుకు అడ్డంగా ఉన్న ఇల్లు (డెడ్ ఎండ్) అశుభాన్ని కలుగజేస్తుంది. వీధికి ఇరు వైపులా ప్రవేశం ఉండాలి. అలా లేకుండా ఉండే ఇల్లు గృహ యజమానికి నష్టం కలిగిస్తుంది.

vaastu prakaram simhadvaaram etuvaipu undaali ? - వాస్తు ప్రకారం సింహద్వారం ఎటువైపు ఉండాలి ?

వాస్తు ప్రకారం సింహద్వారం ఎటువైపు ఉండాలి ?

ఇంటికి ప్రధాన ద్వారం.. సింహద్వారం. ఇల్లు నిర్మాణం మొదలు పెట్టాలని నిర్ణయించిన తరువాత అన్నింటికంటే.. ముందుగా చర్చించేది సింహద్వారం గురించే. ఎందుకంటే.. వాస్తు ప్రకారం సింహద్వారానికి ఉన్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు.

సింహద్వారం సరైన దిశలో అమరితే.. సగం వాస్తు కుదిరనట్టే సింహ ద్వార గృహం ఏదైనప్పటికీ రహదారి ఉన్న వైపునకు ఉన్న దిశలో స్థలానికి ఉచ్ఛ స్థానంలో ప్రహరీ గేటును పెట్టుకోవాలి.

తూర్పు స్థలంలో నిర్మించిన గృహంలో తూర్పు ఈశాన్యం లేదా తూర్పు ఉచ్ఛంలో గేటు ఉండేలా చూసుకోవాలి. విశాలమైన స్థలం కలిగి రెండు గేట్లు పెట్టదలచినపుడు తూర్పు ఈశాన్యంలో పెద్దగేటు, తూర్పు ఉచ్ఛంలో సింగద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.

విశాలమైన స్థలం కలిగి రెండు గేట్లు పెట్టదలచినవారు.. దక్షిణ ఆగ్నేయంలో పెద్ద గేటు, దక్షిణ ఉచ్ఛంలో చిన్న గేటు పెట్టాలి. నైరుతి స్థలంలో గేటు నైరుతి స్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణ లేదా పశ్చిమ దిశలలో ఏదో ఒక దిశకు మాత్రమే సింహద్వారం, ఇతర వాస్తు విషయాలు దృష్టిలో పెట్టుకుని గేటు పెట్టాలి.

దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యంలో గేటు పెట్టాలి. దక్షిణంలో అయితే దక్షిణ ఆగ్నేయంలో పెద్ద గేటు, దక్షిణంలో చిన్న గేటు పెట్టాలి.

ఆగ్నేయ స్థలంలో తూర్పు సింహద్వార గృహం కట్టడం శ్రేయస్కరం. కాబట్టి ప్రహరీ గేట్లు కూడా తూర్పు ఈశాన్యం, తూర్పు ఉచ్ఛంలో పెట్టుకోవడం మంచిది. దక్షిణ స్థలంలో గేటు దక్షిణ స్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు ఉన్న స్థలంలో సింహద్వారం ఎదురుగా గేటు పెట్టాలి.

పశ్చిమంలో అయితే పశ్చిమ వాయువ్యంలో పెద్దగేటు, పశ్చిమ సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి. అలాగే పశ్చిమ స్థలంలో గేటు ఉన్నప్పుడు.. పశ్చిమ స్థలంలో నిర్మించిన గృహంలో పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యం వరకు ఉన్న స్థలంలో ఎక్కడైనా సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టాలి.

విశాలమైన ఆవరణ కలిగి రెండు గేట్లు పెట్టదలచినపుడు పశ్చిమ వాయువ్యంలో పెద్దగేటు, పశ్చిమ ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి. అలాగే.. వాయువ్య స్థలంలో గేటు వాయువ్య స్థలంలో నిర్మించిన గృహంలో అవసరాన్ని, సింహ ద్వారాన్ని బట్టి రెండు వైపులకు లేదా కేవలం ఒకవైపుకు పెట్టుకోవచ్చు.

ఉత్తర దిశను ఉత్తర ఉచ్ఛం ఈశాన్యం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యం వరకు ఎక్కడైనా సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టుకోవాలి. ఒకవేళ రెండేసి గేట్లు పెట్టదలచిన వాళ్లు ఉత్తర ఈశాన్యంలో పెద్దగేటు, ఉత్తర ఉచ్ఛంలో చిన్న గేటు, పశ్చిమ వాయువ్యంలో పెద్ద గేటు, పశ్చిమంలో చిన్న గేటు పెట్టాలి.

ఉత్తర స్థలంలో గేటు పెట్టదలుచుకుంటే.. ఉత్తర స్థలంలో నిర్మించిన గృహంలో ఉత్తర ఉచ్ఛం నుంచి ఉత్తర ఈశాన్యం వరకు ఎక్కడైనా, సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టాలి.

విశాలమైన ఆవరణ ఉంటే రెండు గేట్లు పెట్టదలిస్తే ఉత్తర ఈశాన్యంలో పెద్ద గేటు, ఉత్తర ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి. ఇకపోతే ఈశాన్య స్థలంలో గేటు పెట్టాలనుకుంటే.. తూర్పు, ఉత్తరం రహదారి ఉన్న స్థలంలో నిర్మించిన గృహంలో తూర్పు, ఉత్తర దిశలవైపు పెట్టాలి.

తూర్పు దిశన రెండు గేట్లు పెట్టాలనుకుంటే తూర్పు ఈశాన్యంలో పెద్దగేటు, తూర్పు ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు, ఉత్తరం ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.

వాస్తు శాస్త్రం

న్యూమరాలజీ

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

vaastu prakaram simhadwaralu rakalu - వాస్తు ప్రకారం సింహద్వారాలు రకాలు

వాస్తు ప్రకారం సింహద్వారాలు రకాలు

ఇంటి నిర్మాణం కోసం అనేక విధాలుగా పరిశీలించి స్థలాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత ద్వారాన్ని ఏ వైపు ఉంచి ఇల్లు కట్టాలనేది నిర్ణయించుకోవాలి. ఎందుకంటే గృహ నిర్మాణంలో ద్వారం ఎటువైపు ఉంచుతామనేది కూడా ముఖ్యమైన అంశం. ద్వారాన్ని 16 విధాలుగా ఉంచి ఇంటిని నిర్మించొచ్చు. వీటినే షోడశ గృహనిర్మాణం అంటారు.

1. ధృవగృహం : నాలుగు దిక్కులా గోడలు నిర్మించి.. పై వైపు ద్వారం నిర్మాణం చేయడాన్ని ధృవ గృహం అంటారు. ఇలాంటి వాటిని పూర్వకాలంలో నిర్మించేవారు. ఉదాహరణకు నేల మాళిగ.

2. ధాన్య గృహం : తూర్పు వైపు మాత్రమే సింహద్వారం కలిగిన గృహాన్ని ధాన్య గృహం అంటారు. ఇలాంటి ఇల్లు శత్రువులను నశింపజేసి. విజయాన్ని కలిగిస్తుంది.

3. జయగృహం : దక్షిణం వైపు మాత్రమే సింహద్వారం కలిగిన గృహం. శత్రువుల మీద పైచేయి సాధించి విజయం చేకూరుస్తుంది. ఇది వ్యాపారాలకు అనుకూలం.

4. నంద గృహం : తూర్పు, దక్షిణ దిశల్లో రెండువైపులా సింహద్వారాలు ఉన్న ఇంటిని నంద గృహం అని పిలుస్తారు. ఇలాంటి ఇంట్లో కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.

5. ఖరగృహం : పశ్చిమాన మాత్రమేద్వారం కలిగిన ఇంటిని ఖరగృహం అని పిలుస్తారు. ఇలాంటి ఇంట్లో సంపదలు నశించి, దుఃఖం అనుభవిస్తారు.

6. కాంత గృహం : తూర్పు, పశ్చిమానద్వారాలు ఉన్న ఇంటిని కాంత గృహం అంటారు. ఇలాంటి ఇంట్లో ధనలాభం, వంశాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఆరోగ్యం, సుఖజీవనం లాంటి ఫలితాలు కలుగుతాయి.

7. మనోరమ గృహం : దక్షిణం, పడమర దిశల్లో ద్వారాలు కలిగిన ఇంటిని మనోరమ గృహం అని పిలుస్తారు. ఇలాంటి గృహంలో మానసిక ఆనందం, సిరి సంపదలు, పౌత్రాబివృద్ధి. కలుగుతాయి.

8. సుముఖ గృహం : తూర్పు, పడమర, దక్షిణ దిశల్లో ద్వారాలు ఉండే ఇంటిని సుముఖ గృహం అంటారు. ఇలాంటి ఇంట్లో రాజకీయ నాయకులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సన్మానాలు అందుకుంటారు. రాజకీయ ఎదుగుదల బాగుంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.

9. దుర్ముఖ గృహం : ఉత్తర దిశలో మాత్రమే ద్వారం కలిగిన ఇంటిని దుర్మఖ గృహం అంటారు. దీన్నే కర్ణాటకలో నందిభాగీలు అని పిలుస్తారు. ఈ ద్వారం కొందరికి మాత్రమే కలసి వస్తుంది. ఇది కలహాలకు పుట్టినిల్లు. సిరిసంపదలు క్రమే అభివృద్ధి చెంది, తరుగుదల మొదలవుతుంది.

10. క్రూర గృహం : తూర్పు, ఉత్తర దిశల్లో ద్వారం ఉన్న ఇంటిని క్రూర గృహం అంటారు. ఇలాంటి ఇంట్లొ అభివృద్ధి చెందుతారు. కానీ కాలంతరంలో దీర్ఘవ్యాధుల భారినపడే అవకాశం ఉంది.

11. సూపక్ష శాల : ఉత్తరం, దక్షిణాల్లో ద్వారాలు ఉన్న ఇంటిని సూపక్ష శాల అని పిలుస్తారు. ఇలాంటి ఇంట్లో వంశాభివృద్ధి జరుగుతుంది. వంద సంవత్సరాల ఆయుష్షు కలిగిన గృహం. కానీ శత్రుభయం ఉంటుంది.

12. ధన గృహం : తూర్పు, ఉత్తర, దక్షిణ ద్వారాలు కలిగిన ఇంటిని ధన గృహం అని పిలుస్తారు. ఇలాంటి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు, పశు సంపద, కీర్తి, కుటుంబ వృద్ధి, రాజకీయాల్లో అభివృద్ధి ఉంటుంది.

13. క్షయ గృహం : పడమర, ఉత్తర దిశల్లో ద్వారాలు కలిగిన గృహంలో సిరిసంపదలు హరిస్తాయి. రాజకీయాలు చేసేవారికి అపకీర్తి కలుగుతుంది.

14. అక్రంద గృహం : తూర్పు, పడమర, ఉత్తర దిక్కుల్లో ద్వారం కలిగిన ఇంటిని అక్రంద గృహం అంటారు. ఇలాంటి ఇంట్లో శోకం, బంధు విరోధము కలుగుతాయి.

15. విపుల గృహం : ఉత్తరం, పడమర, దక్షిణ దిశల్లో ద్వారములు కలిగిన ఇంటిని విపుల గృహం అంటారు. ఇలాంటి ఇల్లు సంపద సృష్టించి సంఘంలో గౌరవాన్ని ఇస్తుంది. దీర్ఘకాలిక రోగాలు కలిగిన వారు ఇలాంటి గృహంలో ఉంటే ఉపశమనం పొందుతారు.

16. జయ గృహం : నాలుగు వైపులా ద్వారాలు ఉన్న ఇంటిని జయ గృహం అంటారు. ఇలాంటి ఇంట్లో వ్యవసాయ భూమితో.. ధన ధాన్య, పశు సంవృద్ధి కలుగుతుంది. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. రాజకీయ అభివృద్ధి, ప్రజాబలం సొంతం అవుతుంది.

vaastu prakaram simhadvaaram - వాస్తు ప్రకారం సింహద్వారం

వాస్తు ప్రకారం సింహద్వారం

వాస్తులో నాలుగు ప్రధాన దిశలు మరియు ఉప దిశలు ఉన్నాయి. నాలుగు ప్రధాన దిశలు ఉత్తర, దక్షిణ, తూర్పు మరియు పడమర మరియు ఉప-దిశలు ఈశాన్య, వాయువ్య, ఆగ్నేయ మరియు నైరుతి. ప్రతి దిశకు దాని స్వంత ప్రాముఖ్యత ఉన్నందున సింహద్వారానికి ప్రత్యేక దిశ లేదు.

సింహద్వార ప్రాముఖ్యత
కాంపౌండ్ వాలు నిర్మించుకున్న గేటు తర్వాత ఇంటికి ప్రధానమైన ద్వారమునే సింహద్వారం అంటారు. ఇంట్లోకి ప్రధాన రాకపోకలను ఈ ద్వారం ద్వారానే జరుగుతాయి.

సింహద్వారం నిర్మించుకునే సమయంలో వాస్తు నియమాలు విధిగా పాటించాలి.సింహద్వారం ఇంట్లోని అన్ని ద్వారాల కన్నా కొలతలలో పెద్దదిగా ఉండాలి. దీనికి అమర్చే తలుపు కూడా బలిష్ఠంగా, దృఢంగా ఉండాలి.

సింహద్వారం ఎట్టి పరిస్ధితిల్లో ఇంటికి ఉచ్ఛస్థానంలో ఉండాలి. ఒకవేళ నిర్మాణ రీత్యా వీలుచిక్కకపోతేనే కనీసం మధ్యమ స్థానంలో ఉండేలా జాగ్రత్త పడాలి.

సింహద్వారంలో నచ్చిన ఇష్టదైవ పటాలను చిన్న చిన్న తోరణాలతో అలంకరించుకుంటే ఇంటికి ఆకర్షణనిస్తుంది. సింహద్వారానికి అందమైన పెయింటింగ్ చేయడం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.

సింహద్వారంపై దుమ్ము దూళి చేరకుండా ఎప్పటికప్పుడు తడి బట్టతో శుభ్రం చేసుకోవాలి. సింహద్వారానికి వేసే పెయింటింగ్ లేత రంగును ఎంపిక చేసుకుంటే చూసేందుకు అందంగా కనిపిస్తుంది.

నార్త్ ఫేసింగ్ హౌసు సింహద్వారం నార్త్ ఈస్ట్లోనే ఉండాలి. ఎట్టి పరిస్థితిల్లో వాయువ్యంలో ఉండకూడదు. సింహద్వారం మూలకు అమర్చకూడదు. మూల నుండి అడుగు, అడుగున్నర దూరంలో అమర్చుకోవాలి. 

వెస్ట్ఫేసింగ్ హౌస్కు పశ్చిమ వాయువ్యంలో సింహద్వారం ఏర్పరచుకోవాలి. పశ్చిమ నైఋతిలో ఎట్టి పరిస్థితిలో సింహద్వారం ఏర్పాటు చేసుకోకూడదు.

సౌత్ ఫేసింగ్ ఇంటికి దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం అమర్చుకోవాలి. దక్షిణ నై
ఋతిలో ఎట్టి పరిస్థితిలో సింహద్వారం ఏర్పాటు చేసుకోకూడదు. 

ఈస్ట్ఫేసింగ్ ఇంటికి సింహద్వారం తూర్పు ఈశాన్యంలో ఉండాలి. తూర్పు ఆగ్నేయంలో ఉండకూడదు.

సింహద్వారం ముందు ఎలాంటి అడ్డంకులు ఉండరాదు. కనీసం పూలకుండీలు కానీ, క్రీపర్స్ కానీ... సింహద్వారం ఎదురుగా ఉండకూడదు అలానే చెట్టు నీడలు కూడా సింహద్వారంపై పడకూడదు.

సింహద్వారం ఎప్పుడూ రోడ్ లెవల్కు ఎత్తులో ఉండి తీరాలి. మెయిన్ డోర్ వద్దకు చేరుకునేందుకు మెట్లు ఉన్నట్లయితే ఈ మెట్లు బేసి సంఖ్యలో ఉండాలి.

మెయిన్ డోరు ఎదురుగా పాడుబడిన, వాడకుండా వదిలి వేయబడిన గృహాలు లేకుండా చూసుకోవాలి. సింహద్వారం కాంపౌండ్వాల్కు అమర్చిన గేటు ఒకే దిశలో ఉండడం వాస్తు రీత్యా మంచిది.

సింహద్వారం యొక్క ఎత్తులో సగం వరకు వెడల్పు ఉండేలా సింహ ద్వారాన్ని తయారు చేసుకోవాలి. సింహద్వారం చెక్కతప్ప... ఇనుమువంటి లోహాలు వాడకూడదు. 

మెయిన్ డోర్ పై భాగంలో బాత్రూమ్ లావేటరీ వచ్చేలా పై అంత స్తులో నిర్మాణాలు చేయకూడదు.

సింహద్వారం ఎదురుగా మెట్లు మొదలవ్వడమన్నది మంచిది కాదు. 

ఒకే సింహద్వారం పెట్టదలచుకుంటే తూర్పు దిశ, రెండు ద్వారాలైతే తూర్పు, పడమర, ఉత్తరం దిశలు అనుకూలం. నాలుగు వైపుల ద్వారాలు ఉండటం శ్రేష్ఠం.

సింహద్వారానికి గడప ఉండి తీరాలి. మిగతా ద్వారాలకు గడపలు లేకపోయినప్పటికీ సింహ ద్వారానికి ఉండి తీరాల్సిందేనని వాస్తు నిపుణులు అంటున్నారు. 

ఇంటికి సింహ ద్వారం కాక ఇంకొక ద్వారం ద్వారా రాకపోకలకు అవకాశం ఉన్నప్పటికీ, సింహద్వారాన్నే రాక పోకలకు వాడాలి.

ఇల్లంతా ఊడ్చి సింహద్వారం దగ్గర పోగుపెట్టడం... డస్ట్బిన్ సింహద్వారం దగ్గరలో ఉంచటం, చీపుర్లు, బూజుకర్రలు సింహద్వారం వెనుక ఉంచడం వాస్తు రీత్యా మంచిదికాదు.

మెయిన్ డోరు ఎదురుగా పాదరక్షలు విడువరాదు. 

సింహద్వారం... పగుళ్ళుచ్చినా... తీసివేసేటపుడు కిర్రు శబ్దాలు చేసినా అది ఆ గృహంలో నివసించేవారికి మంచిది కాదు.

ప్రధాన వీధికి అభిముఖంగా ఉన్న ద్వారాన్ని సింహద్వారం అంటారు. అది గృహ యజమాని శారీరక అమరికకు అనుగుణంగా గృహ సభ్యులకు ఉపయోగకరంగా ఉంటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం గృహానికి ద్వారాలు నిర్మించుట ద్వారా ధనప్రదమని, ద్వారానికి తొమ్మిది వంతుల పొడవు, ఐదు వంతుల వెడల్పు కలిగిఉండే విధంగా గృహ ద్వారాన్ని నిర్మించుకున్నట్లైతే శుభదాయకమని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది.

ధ్వజాయ గృహానికి ధ్వజాయ ద్వారమును, సింహయ ద్వారానికి సింహాయ ద్వారమును, వృషభాయ ఇల్లుకి వృషభాయ సింహ ద్వారములను నిర్మించుకున్నట్లైతే మంచిదని వాస్తు శాస్త్రం తెలుపుతోంది.

సింహద్వారంలో ఎంట్రెన్స్కు తగ్గట్లు బుద్ధ విగ్రహాలను లేదా పటాలను వాడటం ద్వారా మీ గృహంలోని ప్రతికూల శక్తులు వెలివేయ బడుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. సింహద్వారంలో ఉంచే బుద్ధుడి విగ్రహం లేదా బొమ్మ తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి.

ఇంటికి ప్రధానమైనది ప్రధాన ద్వారం. దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మనిషి శరీరానికి నోరు ఎంత ప్రాముఖ్యమో ఇదీ అంతే. ప్రధాన ద్వారం పెడుతున్నామంటే దానిని అనుసరిస్తూ ద్వారాల వరుస రావలసిన అవసరం ఉందని, 

కాబట్టి ఇంటి మొత్తానికి సింహద్వారం బిగించే ముందు మిగతా గదుల విభజన వాటి ద్వారాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

విరిగిపోయిన ఇటుకలను సింహద్వార నిర్మాణానికి వాడొద్దని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాగే నాణ్యమైన పాత ద్వారాల ద్వారా ఏరకమైన అశుభం జరగదు. అయితే పాత ఇంటికి సంబంధించి ఇటుకలు మాత్రం పనికిరావు.

సింహద్వారం పైన మెట్లుగానీ, టాయిలెట్గా గానీ స్టోర్ రూమ్ గానీ నిర్మించరాదు. 

తూర్పు సింహద్వారము ఉంచిన ఇంటికి తూర్పు గోడను ఎనిమిది సమభాగాలుగా చేసి అందు ఆగ్నేయం నుంచి మూడు, నాలుగు, ఐదు భాగంలలో సింహద్వారాన్ని నిర్మించుకున్నట్లైతే మంచి ఫలితాలు చేకురుతుందని వాస్తు శాస్త్రం తెలుపుతోంది.

తూర్పు సింహద్వారముగా నిర్మించుకున్నట్టైతే నీటివాటం తూర్పు, ఉత్తరములకే ఉంచుకొనుట ఉత్తమమని వాస్తు తెలుపుతోంది.

సింహద్వారానికి ఎడమపక్క వాహనశాల, పశుశాల, ఉత్తర వాయవ్యాలలో పూలతోట, ఆగ్నేయ దక్షిణాలలో సేవకుల గదులు, నైరుతిలో యంత్రాయుధాలను ఉంచే గదులను నిర్మించవచ్చు. సింహద్వారం ఎదురుగా పిల్లర్లు కానీ, స్తంభాలు కానీ ఉండకూడదు.

ద్వారం ఎదురుగా చెట్లు ఉండకూడదు. సింహద్వారాలపైన బీమ్లు ఉండకూడదు. సింహద్వారం ఎదురుగా గోతులు కానీ, బావి కానీ ఉండకూడదు. సింహద్వారం ఎదురుగా మెట్లు మొదలవ్వడమన్నది మంచిది కాదు.

ఇంటి సింహద్వారం దగ్గర లోపలివైపు, శ్రీ గణేశుడిని ఉంచండి. ఆయన ముఖం మీ ఇంటిని చూస్తున్నట్టు ఉండాలి. సింహద్వారంపై లక్ష్మీదేవి పటమును చిత్రించకూడదు. 

సింహద్వారంపైన పూర్ణకుంభం చిత్రమును ఏనుగు చిత్రములను చిత్రించుట శుభమును కలిగిస్తుంది.

సింహద్వారం వెడల్పు కన్నా ఎత్తు రెండింతలు అధికంగా ఉంటే మంచిది. అనగా 3 అడుగుల ఆరు అంగుళాలు వెడల్పైతే ఏడు అడుగుల ఎత్తు ఖచ్చితంగా ఉండాలి.

ఇంటి సింహద్వారానికి ఎదురుగా వెనకవైపు పెరట్లోకి వెళ్ళే ద్వారం నిర్మించినా మంచిది. రెండు ద్వారాలు ఒకే పారున ఉండాలి.

సింహద్వారం తలుపులపై దేవుళ్ళు రూపాలు చాలామంది కొత్తగా ఇప్పడు తలపుల పైన దేవుళ్ళ రూపాలను చెక్కిస్తున్నారు. సాధారణంగా లక్ష్మి, వినాయకుని రూపాలను నియమ నిష్ఠలతో పూజించాలి.

ఇంటికి వచ్చీ పోయేవారు తలుపు తట్టడంవలన, వారిలోని మంచీ చెడుల వలన ఆ నియమ నిష్ఠలకు విఘాతం కలిగి శుభఫలితాల కంటే విరుధ్ధ ఫలితాలే కలిగే అవకాశం అధికం. ద్వారంపై భాగమున దేవతా విగ్రహాలు ఉండట మంచిది.

soubhagya sundari vratam - సౌభాగ్య సుందరి వ్రతం (సౌభాగ్య సుందరి తీజ్)

సౌభాగ్య సుందరి వ్రతం (సౌభాగ్య సుందరి తీజ్)

సౌభాగ్య సుందరి వ్రతం మార్గశిర కృష్ణ పక్ష తదియ (తృతీయ తిథి) సందర్భంగా శివపార్వతులను ఆరాధించే ఈ వ్రతం వివాహిత మహిళలకు దీర్ఘ సుమంగళత్వాన్ని, అవివాహిత యువతులకు మంచి జీవిత భాగస్వామిని ప్రసాదిస్తుందని విశ్వాసం.

సౌభాగ్య సుందరి వ్రతమును హిందూ మహిళలు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. 

ఈ రోజును పార్వతీ దేవి మరియు పరమశివుల కలయికకు చిహ్నంగా భావిస్తారు; ఇది వైవాహిక ఆనందాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. 

పార్వతీ దేవి అఖండ సౌభాగ్యాన్ని, శివపార్వతుల దివ్య కల్యాణ మహిమను వివరిస్తుంది. 

వ్రత కథ: 
భవిష్య పురాణం మరియు సంప్రదాయ కథనాల ప్రకారం పూర్వం దక్ష యజ్ఞంలో తన తండ్రి దక్షుడు శివుడిని అవమానించడంతో సతీదేవి అగ్నిలో ఆహుతయ్యింది. ఆ సమయంలో తాను జన్మజన్మలకూ శివుడినే పతిగా పొందాలని ప్రతిజ్ఞ చేసింది. 

తదుపరి జన్మలో హిమవంతుని పుత్రిక పార్వతిగా జన్మించి, పరమశివుడిని భర్తగా పొందడానికి కఠోర తపస్సు మరియు ఈ సౌభాగ్య సుందరి వ్రతాన్ని ఆచరించింది. 

ఆమె భక్తికి మెచ్చిన శివుడు పార్వతిని వివాహం చేసుకుని అఖండ సౌభాగ్యవతిగా దీవించాడు.

జయ-విజయలు & ముని కన్యల సంవాదం:
ఒకసారి పార్వతీ దేవి ప్రియ సఖులైన జయ, విజయలు భూలోక సంచారం చేస్తూ ఒక ముని ఆశ్రమానికి వెళ్లారు. 

అక్కడి ముని కన్యలు వారిని చూసి, "మీరు ఎల్లప్పుడూ పార్వతీ దేవితోనే ఉంటారు కదా, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వ్రతం ఏమిటి? ఆమె ఎలా ప్రసన్నురాలవుతుంది?" అని అడిగారు. 

అందుకు జయ-విజయలు బదులిస్తూ, మార్గశిర కృష్ణ తృతీయ నాడు ఆచరించే సౌభాగ్య సుందరి వ్రతం అమ్మవారికి ఎంతో ఇష్టమైనదని తెలిపారు. 

వివాహిత మహిళలు తమ భర్త దీర్ఘాయుష్షు, సంతాన ప్రాప్తి మరియు కుటుంబ శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే అఖండ సౌభాగ్యం కలుగుతుందని చెప్పారు. 

అవివాహిత యువతులు ఈ వ్రతం చేస్తే వివాహ దోషాలు (కుజ దోషం వంటివి) తొలగి, మంచి గుణవంతుడైన భర్త లభిస్తాడని వివరించారు. 

ముని కన్యలు ఈ వ్రత విధానాన్ని తెలుసుకుని భక్తిశ్రద్ధలతో ఆచరించి, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో సకల శుభాలను పొందారు.

ఈ పండుగకు సంబంధించిన వ్రత కథను మహిళలు పఠిస్తారు. తమ భర్తల దీర్ఘాయువు కోసం, సుఖమయమైన వైవాహిక జీవితం కోసం వారు ఈ వ్రతం ద్వారా ఆశీస్సులను కోరుకుంటారు. 

ఈ కథ కేవలం ఒక గాథ మాత్రమే కాదు, నైతిక విలువలను పెంపొందించడానికి మరియు వివాహ బంధం యొక్క పవిత్రతను కాపాడటానికి ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుంది.

పూజా విధానం:
ఈ రోజున గణపతి, శివుడు, పార్వతీ దేవితో పాటు శివ పరివారాన్ని పూజిస్తారు.

మహిళలు స్నానం చేసి, కొత్త లేదా పవిత్ర వస్త్రాలు ధరించి, అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, నైవేద్యం, శివునికి బిల్వ పత్రాలు సమర్పిస్తారు.

శక్తి మేరకు ఉపవాసం లేదా ఫలహార వ్రతం ఆచరించి, పూజ అనంతరం వ్రత కథ విని, సుహాగిన్లకు లేదా బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తారు.

స్త్రీల వ్రత కథలు

21va adhyayamu - puranjayapajayamu - 21వ అధ్యాయము - పురంజయాపజయము

కార్తిక పురాణము (స్కాంద పురాణాం) - 21వ అధ్యాయము - పురంజయాపజయము 

ఇట్లు యుద్ధమునకు పురంజయుని జూచి యుద్ధ ప్రవీణులయిన ఆ రాజులు కోపరక్షాక్షులై శస్త్రములతోను, అస్త్రములతోను, బాణములతోను వాడియెన గుదియలతోను, ఇనుపకట్ల లాటీ కఱ్ఱలతోను, హస్తాయుధములయిన గుదియలతోను, కత్తులతోను, భల్లాతకములతోను, పట్టసములతోను, రోకళ్ళతోను, శూలములతోను, తోమరములతోను, కుంభాయుధములతోను, గొడ్డళ్లతోను, కఱ్ఱలతోను, ఆయుధముల విక్షేపములతోను యుద్ధము చేసిరి. 

గుఱ్ఱపు రౌతులతో గుఱ్ఱపు రౌతులు, ఏనుగులు ఏనుగుల తోడను, రధికులతో రథికులు, కాల్బంటులతో కాల్బంటులు, శూరులతో శూరులును, ఆయుధములతో యుద్ధమును భటులన్యోన్యము క్రూరవాక్యములను పలుకుచు చేసిరి. 

ఓ అగస్త్య మునీంద్రా! అంతలో కాంభోజ మహారాజు వస్త్రాదులను పదిలపరచి కట్టికొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహలధ్వనిజేయుచు వడిగా పురంజయుని వద్దకువచ్చి మూడువందల బాణముల వేసెను. 

ఆ బాణములుపోయి పురంజయుని ఛత్రమును, ధ్వజమును, రథమును నరికినవి. తరువాత కాంభోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి అయిదు బాణములతో పురంజయుని రథము యొక్క తురగములను జంపెను. 

తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడు వలె విక్రమించి భుజాస్ఫాలనము చేసి నారిబిగించి బ్రహ్మమంత్రములతో పదిబాణములను ప్రయోగించి కాంభోజుని హృదయమందు కొట్టెను. 

పురంజయుని బాహుబలముచేత వేయబడిన ఆ బాణములు సర్పములవలె పోయి కాంభోజ రాజు హృదయమును భేదించి నెత్తురును త్రాగి తృప్తులై భటులవద్దకు పోవుటకు ఇష్టపడలేదు. 

సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంభోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనుస్సు నందు గూర్చి పురంజయునితో ఇట్లనియె. 

క్షత్రియా! వినుము. నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చెదను. నేను పరుల సొమ్మునందాసక్తి గలవాడనుకాను. 

ఇట్లు పలికి కాంభోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారధని, ఛత్రమును, వాని ధనుస్సును త్రుంచినవి. 

పురంజయుడు మరియొక ధనుస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో గూడిన బాణములను పుచ్చుకుని ధనుస్సుకు చేర్చి నారిని చెవివరకు లాగి కోపముతో కాంభోజునితో ఇట్లనియెను. 

రాజా! శూరుడు వౌదువుగాని యుద్దమందు ధైర్యముతో నుండుము. నాచేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకిచ్చినావు. నీవంటి నీచులకు ప్రతిదాన విధి తెలియునా? నేనిప్పుడు నీకు వేరుబాణములను ఇరువదింటిని ఇచ్చుచున్నాను. 

ఇట్లుపలికి పురంజయుడు బాణములను విడిచెను. ఆ బాణములు గురిగా కాంభోజుని కవచమును ద్రుంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి. 

అప్పుడు భయంకరమయిన యుద్ధము జరిగెను. సైనికులు అన్యోన్యశరాఘాతములచేత భుజములు తెగి బాహువులూడి పాదములు మొండెములై మెడలు విరిగి భూమియందుపడిరి. 

అన్యోన్య శరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి. గుఱ్ఱముల తోకలు తెగినవి. కాల్బంటులు హతులైరి, రథములు చక్రములతో సహా చూర్ణములాయెను. 

కొందరు తొడలు తెగి నేలపడిరి. కొందరు కంఠములు తెగి కూలిరి. బాణములచేత శరీరమంతయు గాయములు పడిన యొకభటుడు ధనుస్సును ధరించి నారిబిగించి అన్య భటునితో యిట్లనియె. 

తిరుగు వెనుకకు తిరుగు, నాముందుండు ఉండుము. నీ వీపును నాకు చూపకుము. నీవు శూరుడవుగదా, ఇట్లు చేయవచ్చునా ? 

ఓ మునీ ఇట్టి నిష్ఠురములగు మాటలను విని ప్రతిభటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకారధ్వని జేయుచు సింహగర్జనములను జేయుచు బహునేర్పుగా బాణములను ప్రతిభటుని మీద ప్రయోగించెను. 

ఆకాశమందుండి చూచెడి దేవతలు బాణములు తూణీరముల నుండి తీయుటను, అనుసంధించి వేయుటను గుర్తించలేరైరి. బహునేర్చుతో బాణములను వేయుచుండిరి. 

ఆ యుద్ధ మందు సూది దూరు సందు లేకుండా బాణవర్షము కురిసెను. ఇట్లన్యోన్యము శూరులను, భటులను బంగారపుకట్లతో గూడినవియు, స్వయముగా వాడియెన వియు, సానపెట్టబడినవియు, స్వనామచిహ్నితములు అయిన అర్థచంద్ర బాణములతోను, ఇనుపనారాచములతోను, ఇనుప అలుగులుగల బాణములకోను, ఖడ్గములతోను, పట్టసములతోను, ఈటెలతోను కొట్టుకొనిరి. 

గుఱ్ఱపురౌతులు కొందరినిచంపిరి. గుఱ్ఱపు రౌతులను యేనుగుబంట్లు చంపిరి. రధికులు కాల్బంట్లను జంపిరి. కాల్బంట్లు రథికులను జంపిరి. 

ఇట్లు తొడలు, భుజములు, శిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి. అచ్చట నెత్తురుతో యొకనది ప్రవహించెను. 

ఆకాశమందు మేఘాచ్చాదిత లైన అపస్సర స్త్రీలు లావైనకుచములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు, వీడు నావాడని పలుకుచుండగా శూరహతులయిన శూరులు యుద్ధమందు మృతినొంది దివ్యాంబరధారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకుబోయి దేవస్త్రీ సంభోగాది సుఖములకై పాటుబడుచుండిరి. 

యుద్ధమందు హతులైనవారు సూర్యమండలమును భేదించుకుని దేవస్త్రీలతో గూడుకొని గంధర్వాప్సరసలచేత కొనియాడబడుచు స్వర్గమునకు బోవుదురు. 

కాంభోజుడు మొదలగు రణకోవిదులైన శూరులచేతను, ఇతర రాజులచేతను, సుభటులచేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికి ఒళ్ళు గగొర్పొడిచినది. 

ఇట్టి యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించెను. రాజులును యుద్ధభూమిని వదలి కొంచెము దూరములో డేరాలు వేయించి వాటియందుండిరి. 

యుద్ధభూమి భూతప్రేత పిశాచ భేతాళములతోడను, నక్కలతోడను, రాబందులతోను, గద్దలతోను, మాంసాశనులతో బ్రకాశించు చుండెను. 

కాంభోజరాజునకు పదమూడు ఆక్షౌహిణీలసేనయున్చది. మూడు ఆక్షౌహిణీలసేన హతమైనది. పురంజయుడు తాను యుద్ధమంతోడుటకును, తన రాజ్యము శత్రురాజులచేత ఆక్రమింపబడుటకును చింతించుచుండెను. 

ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతచే ఏమియు తోచకున్న పురంజయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడను పురోహితుడిట్లు పలికెను. 

ఓరాజా! శత్రుబృందముతో సహా వీరసేన మహారాజును జయించగోరితివేని విష్ణుమూర్తి సేవజేయుము. ఇప్పుడు కార్తికపూర్ణిమ, నిండుపూర్ణిమ, కృత్తికానక్షత్రముతో కూడినది. 

కాబట్టి యిది అలభ్యయోగము. ఈ కాలమందున్న పుష్పములచేత హరిని పూజించుము. విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము. హరి ముందు గోవిందా, నారాయణా మొదలయిన నామములను పాడుచు నాట్యమును జేయుము. 

సుశీలుడిట్లు చెప్పెను. కార్తిక వ్రతమాచరించితివేని హరి తన భక్తులను అపత్తులు లేక రక్షించుట కొరకు తనవేయి అరలుగలవిష్టుచక్రము పంపును. 

కార్తిక మాసమందు చేసిన పుణ్య మహిమను జెప్పుటకెవ్వని తరమౌను. నీ అధర్మవర్తనము వలన అపజయము గలిగినది. ఇక ముందు సద్ధర్మ పరుడవుగమ్ము. 

అట్లయిన కొనియాడదగినవాడవగుదువు. ఓ రాజా! కార్తిక వ్రతమాచరింపుము. హరిభక్తుడవు కమ్ము. కార్తిక వ్రతము వలన ఆయువు ఆరోగ్యము సంపదలు, పుత్రులు, ధనవృద్ధి, జయము గలుగును. నామాట నమ్ముము. త్వరగా చేయుము.

vaara raasiphalaalu (29-11-2026 to 05-12-2026) - వార రాశిఫలాలు (29-11-2026 to 05-12-2026)

వార రాశిఫలాలు (29-11-2026 to 05-12-2026) మేష  రాశిఫలాలు : ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చి ఊరట ...