ఒక బ్రాహ్మణుని భార్య తన తోడబుట్టినవారికి పెండ్లి తల పెట్టినప్పుడెల్ల భర్తకు వ్యాధి సంభవించుచుండెను. ఈ యాటంకముచేత అనేక పర్యాయములు సిద్ధమైన పెండ్లికార్యము మానివేయుచువచ్చిరి. కొన్నాళ్ళకు బంధువులందరు ప్రాణము విసిగినవారై ఎన్నాళ్ళిలాగున పెండ్లికార్యము మానుదుమ”ని పెండ్లి ముహూర్తము నిశ్చయించిరి. అంత నా బ్రాహ్మణునికి ప్రాణముమీదికి వచ్చెను. అతని భార్య ఆ జబ్బు సరకు సేయక వానిని యింటిలో నుంచి తలుపుగొళ్లెము పెట్టి తోడబుట్టినవాని వివాహమునకు వెళ్లిపోయెను. ఆమె చెరుపుగట్టు వద్దకు వెళ్లుసరికి యచ్చట విష్ణుక్రాంత పువ్వులు విడిచియుండెను. ఆ పువ్వుల నామె కాలదన్నుకొని చక్కాపోవు చుండెను. అంత విష్ణుక్రాంత "నోచినదివిను కాంత నోచినది నోచినపువ్వులు
కాలదన్నుకొని పోవుచున్నది. చెరువులోనున్న చామంతులారా! చూచితిరా?" అని యొక ధ్వని వినపడెను. "ప్రేమగల ప్రాణేశ్వరునకు ప్రాణము మీదకురాగా చాపనిచుట్టి నట్టింటపెట్టి దయగల తమ్ముని పెళ్ళికి వెళ్లుచున్నది. ఊరకొందు విష్ణుక్రాంతా!" అని మరల ప్రత్యుత్తర మిచ్చెను. ఈ మాటలా బ్రాహ్మణుని భార్యవిని యేమి మాట్లాడకుండ వెళ్లిపోయెను. ఆమె తమ్ముని పెండ్లి అయిన తరువాత తిరిగి యా మార్గమున వచ్చుచుండెను. వెళ్లబోయే సమయమున తానా పువ్వులనెచ్చట చూచెనో యాచోటికి బోయి "విను విష్ణుక్రాంతా! మీరందరు ఏమి చెప్పుకున్నార" ని యడిగెను. "విన్నప్పుడు మానినావు .గనకనా? యిప్పుడు నీకెందుకు వెళ్లుమ" ని విష్ణుక్రాంత చెప్పగా నా
బ్రాహ్మణభార్య "ఆ మాటలు చెప్పినగాని వల్లగాదు నేను వెళ్లన" ని చెప్పెను. "ఓ బ్రాహ్మణ కాంతా! ప్రేమగల ప్రాణేశ్వరునకు ప్రాణముమీదికిరాగా నట్టింట దయగల తమ్మునిపెండ్లికి వెళ్లవద్దన్నాన" ని చెప్పెను. "నీవెందుచేత నీలాగు చెప్పినావ" ని యడుగగా నా బ్రాహ్మణ స్త్రీకి విష్ణుక్రాంత యిట్లని చెప్పెను- "నీవు ముందు జన్మమున విష్ణుక్రాంత నోముపట్టి ఉల్లంఘనము చేసినావు. అందుచేత నీ తమ్మునికి పెండ్లి తలపెట్టినప్పుడు నీ పెనిమిటికి ప్రాణముమీదకి వచ్చుచుండెను. ఇప్పుడు నీవా
నోముపట్టి ఉద్యాపనచేసుకొని అక్షింతలు వేసుకొన్నయెడల నీకు సిరిసంపద, అయిదవ తనము వృద్ధియగునాని చెప్పెను.
ఉద్యాపనము: విష్ణుక్రాంత కు పదమూడు జోడుల నేతిగారెలు వాయనము, పదమూడు జోడుల నైవేద్యము పెట్టి విష్ణుక్రాంత పువ్వులతో పూజలు చేసుకొని దక్షిణ తాంబూలము ముత్తయిదువుకు యియ్యవలయును.
ఆమె అట్లేయని నోము నోచుకొని ఏడాది ఐన తర్వాత ఉద్యాపనము చేసుకొని నిత్యకల్యాణము పచ్చతోరణముతో నుండెను.
No comments:
Post a Comment