Wednesday, January 7, 2026

Padamudu Puvvula Nomu Katha - పదమూడు పువ్వుల నోము కథ

పదమూడు పువ్వుల నోము కథ

“శివా, మహాదేవా, సింహద్వారము గడచి వచ్చితిని దేవా, 
మూకలో ముసుకు వేయకుండా నోచితిని దేవా, 
అధమ స్థానము అల్లుడింటికి వెళ్లకుండా నోచితిని దేవా,

ఒక పూవు పూజచేసితిని దేవా, యుత్తమమయిన బ్రాహ్మణ కడుపున బుట్టనోచితిని దేవా, 
రెండు పూవుల పూజచేసితినిదేవా, సుపుత్రికలుగ నోచితిని దేవా, 
మూడు పూవులపూజ చేసితినిదేవా, ముత్యాలగొడుగు నీడనడచి నోచితినిదేవా, 
నాలుగు పూవుల పూజ చేసితినిదేవా, నవధాన్యాలు నాయింటికి రా నోచితినిదేవా, 
అయిదు పువ్వుల పూజచేసితినిదేవా, ధరణవేణివంటి తల్లి దండ్రులు రానోచితనిదేవా,
ఆరుపువ్వుల పూజచేసితినిదేవా, ఆదిత్య భగవానులవంటి అత్తమామలు రానోచితిని దేవా, 
యేడు పువ్వుల పూజచేసితినిదేవా ఏకచక్రముగ లేలనోచితినిదేవా! 
ఎనిమిది పూవులు పూజచేసితిని దేవా! యెనమండ్రు కంసాలురు చేసిన సొమ్ములు యెడతెగకుండా పెట్టదలచితినిదేవా! 
తొమ్మిది పూవుల పూజచేసితిని దేవా! తోయగంధేలు తొడుగ నోచితినిదేవా! 
పదిపూవులు పూజచేసితినిదేవా! పట్టపు రాజున కిష్టమైన దేవినిగా నోచితిని దేవా! 
పదకొండు పూవుల పూజచేసితినిదేవా సాయక పురుషుడు పరస్త్రీని జూడకుండా నోచితినిదేవా! పండ్రెండు పూవుల పూజచేసితినిదేవా! ఎకు & కవ ఆముదవనము మిక్కిలి సంపదా కలుగనోచితిని దేవా! 
పదమూడు పూవుల పూజ చేసితిని దేవా! పార్వతీసాన్నిధ్యము బయగోరితిని దేవా!

మెచ్చితినిఅక్కా! యిచ్చితిని వరము మరియొక కోరవే మహేశలింగము. 

శివభక్తులారా! కోరనేమున్న దయా, మాననేమున్నదయ్యా! 
ఇష్టసంపదలను ఇద్దరు కుమార్తెలను గోరితిని పార్వతీదేవి వంటిది గూతురు, 
లక్ష్మిదేవివంటి గూతురు 
మెచ్చితిని అక్కా యిచ్చితిని వరము మరియొకటి కోరవే మహేశలింగము. 

శివభక్తులారా? కోరనేమున్నదయ్యా, మానేమున్నదయ్యా! 
పదముగ్గురు కొడుకులను కోరితిని. మువ్వలాడు కొడుకు, గజ్జెలాడు కొడుకు, 
అందెలాడుకొడుకు, అమ్మా! అన్నము పెట్టుమనేవాడు కొడుకు, 
వుగ్గుపోయమనేవాడు కొడుకు, పడమట భారతము చదువువాడు కొడుకు, 
ఉత్తరాది యూళ్ళేలు వాడు కొడుకు, దక్షిణాద్వార మెత్తినవాడు కొడుకు 
గోవును తెచ్చి దొడ్డి పెట్టి గోదానము చేయమనేవాడు కొడుకు, 
అన్నము వండించి రాశిజేసి అన్నదానము చేయమనేవాడు కొడుకు, 
కన్నెలమగనిదగ్గర పెట్టి కన్యాదానము చేయుమను కొడుకు, 
సువర్ణముతెచ్చి పళ్లెములనుంచి సువర్ణదానము చేయుమను కొడుకు, 
వస్త్రములదెచ్చి దండెములవేసి వస్త్రదానము చేయుమను కొడుకు, 
అటువంటి కొడుకులను పదముగ్గురు కొడుకులను కోరితినిదేవా!

మెచ్చితిని అక్కా! యిచ్చితిని వరము మరియొకటిగోరవే మహేశ లింగము. 

శివభక్తులారా! కోరనేమున్నదయ్యా మాననే మున్నదయా! 
సోమయాజుల వారి సోమిదేవమ్మ పెద్దకూతురునై పుట్టి వేగివేసిన వేయిపుట్ల రాజనాలు, 
పదిపుట్ల అపరాలు, అయిదుపుట్ల జీలకర్ర, పందుము ఉప్పు, ముద్దిడింగువ, గిద్దెడు నెయ్యి,
పెరుగాకు, పెరుగుపోక, గుమ్మడికాయంత సున్నము, పదికడవల ఆవకాయ, 
యిరువై కడవలపెరుగు, చల్లికంచాల క్రింద చెల్లగోరితిని దేవా! 

మెచ్చితిని అక్కా! యిచ్చితిని వరము మరొయొకటి కోరవే మహేశలింగము 

శివభక్తులారా! కోరనేమున్నదయ్యా మాననేమున్నదయ్యా! 
సోమయాజులుగారి సోమిదేవమ్మ పెద్దకోడలునై వేగివేగిస వేయిపుట్ల రాజనాలు, 
పదిపుట్ల, అపరాలు, అయిదుపుట్ల జీలకర్ర, పందుము ఉప్పు, ముద్దిడింగువ, 
గిద్దెడు నెయ్యి, పెరుగు ఆకు, పెరుగుపోక, గుమ్మడికాయంత సున్నము, 
పదికడవలావకాయ, ఇరువది కడవల పెరుగు వేడిపళ్లెరాల క్రింద చెల్లెగోరితినయ్యా దేవా?

మెచ్చితిని అక్కా! ఇచ్చితిని వరంబు మరియొకటిగోరవే మహేశలింగము.

శివభక్తులారా! కోరనేమున్నదయ్యా మాననేమున్నదయ్యా! 
తల్లినికనిన తల్లి తనతల్లి తానుమూడుతోటల పూవులముడిచు కొని, 
ఆరుకోటలపసుపురాసుకొని మునిమనులను చంకపెట్టుకొని, 
పట్టిమంచము పరుపుమీద పరుండ గోరితినయ్యా దేవా!

మెచ్చితిని అక్కా! ఇచ్చితిని వరంబు మరియొకటిగోరవే మహేశలింగము. 

శివభక్తులారా! కోరనేమున్నదయ్యా, మాన నేమున్నదయ్యా! 
అత్తగాత్తగారు, అత్తగారు తాను మూడుతోటల పూవులు ముడిచికొని, 
ఆరుతోటల పసుపురాసుకొని మనుమలను చంక బెట్టుకొని, 
పువ్వులపాన్నయి పరుండగోరితినయ్యాదేవా! 

మెచ్చితిని అక్కా! ఇచ్చితిని వరంబు మరియొకటిగోరవే మహేశలింగము. 

శివభక్తులారా! కోరనేమున్నదయ్యా, మాన నేమున్నదయ్యా! 

వడు పువ్వుల నోముపట్టినపడతి వచ్చినది కడగంటి కాళ్లువేయండి 
గద్దెపూవులతోటి లోనికి తీసుకొనివెళ్లి పురాణపుస్తకములు విప్పి చూపించండి. 
యేలాగు వచ్చినదియో, యెటువచ్చినదియో నీలాంబరమున నిలిచి వచ్చినదియో కనకాంబరమున కదిలే వచ్చినదియో, తెల్లచీరలో వెలసికెలాగువచ్చి నదియో, అలాగేవచ్చినదియో, ఎటువచ్చినదియో, ఉద్దండ పురుగులు పడకుండా,
ఇనుపముక్కల కాకులు పొడవకుండా, పదమూడు పువ్వుల నోముపట్టి పడతికి
స్వర్గమునకు తలుపుతీసి పెట్టండి ఆమె నోచిన నోము భూలోకమంతయు నోచినారు.
శక్తి తప్పినా భక్తి తప్పరాదు. అక్షతలు తప్పినా లక్షవేలు అయిదవతనము.

నోముపట్టెడు విధానము: నోము ఇక పట్టెదరనగా నిత్యంమల్లెచెట్టునో మరి యేదయినా 
పువ్వుల చెట్టునో దొడ్డియందు వేసుకొని ప్రతి రోజును పదమూడు పువ్వులు గౌరీదేవికి పూజలు చేసుకొనవలెను. రోజుకొకమారు కథ చెప్పుకొనవలెను.

పదమూడు పద్మాలు, పదమూడు వత్తుల దీపము, పదమూడు ప్రదక్షిణాలు.

ఉద్యాపనము: పదమూడు దోసిళ్ల బియ్యము. పదమూడు బంగారు పువ్వులు, పదమూడు కానులు దక్షిణ శివాలయమునకు పట్టుకొనివెళ్లి శివలింగమునకు పూజచేయవలయును.


No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...